అధ్యాయం 1: అర్జునవిషాద యోగం
- ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమకూడిన నా కుమారులు, పాండుపుత్రులు ఏం చేశారు? (1.1)
- సంజయుడు పలికెను: రాజా! వ్యూహరచనతో ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు, తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పాడు. (1.2)
- ఆచార్యా! మీ బుద్ధిమంతుడైన శిష్యుడు, ద్రుపద కుమారుడైన ధృష్టద్యుమ్నుడి చేత వ్యూహపరంగా నిలపబడిన పాండుపుత్రుల ఈ గొప్ప సైన్యాన్ని చూడండి. (1.3)
- ఈ సైన్యంలో గొప్ప విలుకాండ్రు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైన శూరులు ఉన్నారు. వారు – యుయుధానుడు, విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదుడు. అలాగే ధృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు నరశ్రేష్ఠుడైన శైబ్యుడు కూడా ఉన్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలశాలియైన ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు – వీరందరూ మహారథులే. (1.4-6)
- ద్విజోత్తమా! మన పక్షంలో ఉన్న విశిష్టులైన వారిని కూడా తెలుసుకోండి. మీ అవగాహన కోసం మన సైన్యంలోని నాయకుల పేర్లను మీకు చెబుతాను. (1.7)
- మీరు (ద్రోణులు), భీష్ముడు, కర్ణుడు, యుద్ధవిజేతయైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవసుడు. వీరే కాక నా కోసం ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడిన వారు, రకరకాల ఆయుధాలు ధరించిన వారు, యుద్ధవిద్యలో ఆరితేరిన శూరులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. (1.8-9)
- భీష్ముడి రక్షణలో ఉన్న మన సైన్యం అపారమైనది, కానీ భీముడి రక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది. (1.10)
- కాబట్టి మీరందరూ మీ మీ వ్యూహాత్మక స్థానాల్లో ఉండి, అన్ని వైపుల నుండి భీష్ముడినే కాపాడాలి. (1.11)
- అప్పుడు కౌరవ వృద్ధుడు, ప్రతాపవంతుడైన పితామహ భీష్ముడు దుర్యోధనుడికి సంతోషం కలిగించడానికి సింహనాదం చేస్తూ, బిగ్గరగా శంఖాన్ని పూరించాడు. (1.12)
- వెంటనే శంఖాలు, భేరీలు, తమ్మటలు, నగారాలు, కొమ్ములు ఒకేసారి మ్రోగాయి. ఆ శబ్దం చాలా భయంకరంగా మిన్నంటింది. (1.13)
- ఆ తర్వాత తెల్లని గుర్రాలు కట్టిన గొప్ప రథం మీద కూర్చున్న శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు. (1.14)
- శ్రీకృష్ణుడు ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని, అర్జునుడు ‘దేవదత్తం’ అనే శంఖాన్ని, భయంకరమైన పనులు చేసే భీమసేనుడు ‘పౌండ్రం’ అనే మహా శంఖాన్ని పూరించారు. కుంతీపుత్రుడైన ధర్మరాజు ‘అనంతవిజయం’ అనే శంఖాన్ని, నకులుడు ‘సుఘోషం’ అనే శంఖాన్ని, సహదేవుడు ‘మణిపుష్పకం’ అనే శంఖాన్ని పూరించారు. ఓ రాజా! గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు మరియు మహాబాహువు గల సుభద్రా పుత్రుడు అభిమన్యుడు – వీరందరూ అన్ని వైపుల నుండి తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు. (1.15-18)
- ఆ భయంకరమైన శంఖధ్వని ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనింపజేస్తూ, యుద్ధానికి సిద్ధమైన ధృతరాష్ట్రుని కుమారుల గుండెలను అదరగొట్టెను. (1.19)
- ఓ రాజా! ఆ సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుని కుమారులను చూసి, కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును పైకెత్తి, యుద్ధం ప్రారంభం కావడానికి ముందే శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. (1.20)
- అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా! యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ నిలబడి ఉన్న వీరిని నేను చూసే వరకు, ఈ రణరంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో తెలుసుకునే వరకు, నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపియుంచుము. (1.21-22)
- దుర్బుద్ధి గల దుర్యోధనుడికి ప్రియం చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన వారిని నేను చూడాలనుకుంటున్నాను. (1.23)
- సంజయుడు పలికెను: ఓ రాజా! అర్జునుడు చెప్పిన మాట విని, శ్రీకృష్ణుడు ఆ ఉత్తమమైన రథాన్ని రెండు సైన్యాల మధ్య, భీష్మ ద్రోణులు మరియు మిగిలిన రాజులందరి ముందు నిలిపి, ‘పార్థా! ఇక్కడ సమావేశమైన ఈ కురువంశీయులను చూడు’ అని అన్నాడు. (1.24-25)
- అప్పుడు అర్జునుడు అక్కడ నిలబడి ఉన్న తన తండ్రి సమానులను (పినతండ్రి, పెదతండ్రులను), తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను మరియు హితులను చూశాడు. (1.26)
- రెండు సైన్యాలలో ఉన్న తన బంధువులందరినీ చూసిన అర్జునుడు అత్యంత వ్యాకులతకు లోనయ్యాడు. మిక్కిలి జాలితో నిండినవాడై, దుఃఖిస్తూ అర్జునుడు ఇలా అన్నాడు. (1.27)
- అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ నిలబడి ఉన్న నా స్వజనాన్ని (బంధువులను) చూసి నా మనస్సు కలత చెందుతోంది. నా కాళ్లు చేతులు వణికిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, నా శరీరం గడగడలాడుతోంది మరియు ఒళ్ళు గగుర్పొడుస్తోంది. నా చేతిలో నుండి గాండీవం జారిపోతోంది, చర్మం అంతా మంట పుడుతోంది. నేను ఇక నిలబడలేకపోతున్నాను, నా మనస్సు భ్రమకు లోనవుతోంది. (1.28-30)
- ఓ కేశవా! నాకు అంతా అశుభ సూచకాలే కనిపిస్తున్నాయి. యుద్ధంలో నా స్వజనాన్ని చంపి నేను పొందే శ్రేయస్సు ఏముంటుందో నాకు అర్థం కావడం లేదు. (1.31)
- కృష్ణా! నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు కూడా వద్దు. ఓ గోవిందా! అసలు మాకు రాజ్యంతో ఏం పని? ఈ భోగాలతో గానీ, కడకు ఈ ప్రాణాలతో గానీ మాకు కలిగే ప్రయోజనం ఏమిటి? (1.32)
- ఎవరి కోసం మనం ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకుంటున్నామో, అట్టి మన గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు మరియు ఇతర బంధువులందరూ తమ ప్రాణాల మీద, ధనం మీద ఆశ వదులుకుని ఇక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు. (1.33-34)
- ఓ మధుసూదనా! వీరు నన్ను చంపినా సరే, నేను మాత్రం వీరిని చంపాలని కోరుకోవడం లేదు. మూడు లోకాల రాజ్యమే లభించినా సరే, ఈ భూమి కోసం నేను నా వారిని చంపుతానా? అది అసంభవం. (1.35)
- ఓ జనార్దనా! ధృతరాష్ట్రుని కుమారులను చంపడం వల్ల మనకు కలిగే ఆనందం ఏమిటి? వీరు దుర్మార్గులే అయినప్పటికీ, వీరిని చంపడం వల్ల మనకు పాపమే చుట్టుకుంటుంది. (1.36)
- కనుక ఓ మాధవా! మనబంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? (1.37)
- రాజ్య కాంక్షతో, లోభంతో వీరి మనస్సులు పాడైపోయి ఉండవచ్చు. కులనాశనం వల్ల కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వల్ల కలిగే పాపాన్ని వీరు చూడలేకపోవచ్చు. కానీ జనార్దనా! కులనాశనం వల్ల కలిగే దోషాలు స్పష్టంగా తెలిసిన మనం, ఈ పాపం నుండి ఎందుకు తప్పుకోకూడదు? (1.38-39)
- కులక్షయం సంభవించినప్పుడు సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు ఆ కులమంతా అధర్మం పాలవుతుంది. కృష్ణా! అధర్మం పెరిగిపోతే కులస్త్రీలు కలుషితమవుతారు. స్త్రీలు శీలహీనులైనప్పుడు వర్ణసంకరం జరుగుతుంది. ఆ వర్ణసంకరం వల్ల కులాన్ని నాశనం చేసినవారు, ఆ కులము కూడా నరకానికి వెళ్తారు. పితృదేవతలకు పిండప్రదానాలు, తర్పణాలు అందకపోవడం వల్ల వారు కూడా అధోగతి పాలవుతారు. (1.40-42)
- వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును. ఓ జనార్దనా! కులధర్మములు నశించినవారికి నిరవధికముగా (కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. (1.43-44)
- అయ్యో! రాజ్య సుఖాల మీద ఉన్న ఆశతో మన స్వజనులను చంపడానికి సిద్ధపడి, మనం ఎంతటి ఘోర పాపానికి ఒడిగడుతున్నామో కదా! (1.45)
- ఒకవేళ నేను ఎదురుతిరగకుండా, ఆయుధాలు ధరించకుండా ఊరకే ఉండిపోతే… చేతిలో ఆయుధాలు ఉన్న ధృతరాష్ట్రుని కుమారులు నన్ను ఈ యుద్ధంలో చంపేసినా సరే, అది నాకు ఇంతకన్నా మేలే అవుతుంది. (1.46)
- సంజయుడు పలికెను: యుద్ధరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి, శోకంతో నిండిన మనస్సుతో తన ధనస్సును, బాణాలను పక్కన పడేసి రథం వెనుక భాగంలో కూలబడిపోయాడు. (1.47)
అధ్యాయం 2: సాంఖ్య యోగం
- సంజయుడు పలికెను: ఆ విధంగా అత్యంత జాలితో నిండినవాడై, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తున్న కళ్ళతో విషాదంలో మునిగి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ మాటలు అన్నాడు. (2.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా ! క్లిష్టమైన ఈ సమయంలో నీకు ఈ మోహం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్య లక్షణం కాదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది. (2.2)
- ఓ అర్జునా! ఈ యొక్క పిరికితనమునకు లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము. (2.3)
- అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా! పూజింపదగిన భీష్ముడిని, ద్రోణాచార్యుడిని నేను రణరంగంలో బాణాలతో ఎలా ఎదిరించగలను? ఓ శత్రు సంహారకా! వారు నాకు అత్యంత గౌరవనీయులు కదా! (2.4)
- మహానుభావులైన గురువులను చంపి, రక్తం చిందిన ఈ లోక భోగాలను అనుభవించడం కంటే, ఈ లోకంలో భిక్షం ఎత్తుకుని జీవించడం మేలు అనిపిస్తోంది. (2.5)
- మనకు విజయం లభిస్తుందో లేక వారే మనల్ని జయిస్తారో… ఏది శ్రేయస్కరమో మనకు తెలియదు. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. (2.6)
- నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. (2.7)
- నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను. (2.8)
- సంజయుడు పలికెను: శత్రువులను పీడించే గుడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణుడితో ‘నేను యుద్ధం చేయను’ అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. (2.9)
- ఓ ధృతరాష్ట్రా! అప్పుడు రెండు సైన్యాల మధ్య విషాదంలో ఉన్న అర్జునుడిని చూసి, శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈ మాటలు అన్నాడు. (2.10)
- శ్రీకృష్ణభగవానుడు పలికెను: అర్జునా! శోకించకూడని వారి కోసం నువ్వు శోకిస్తున్నావు, పైగా పండితుడిలా మాటలు మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, ప్రాణాలు ఉన్న వారి గురించి కానీ దుఃఖించరు. (2.11)
- నేను గానీ, నువ్వు గానీ, ఇక్కడ ఉన్న రాజులు గానీ గతంలో లేని కాలం లేదు. అలాగే భవిష్యత్తులో మనం ఉండబోని కాలం కూడా ఉండదు. (2.12)
- దేహధారికి (జీవుడికి) ఈ దేహంలో బాల్యం, యౌవనం, ముసలితనం ఎలా వస్తాయో… మరణం తర్వాత మరో దేహాన్ని పొందడం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ధీరత్వం ఉన్నవారు దీనిని చూసి మోహానికి లోనవరు. (2.13)
- ఓ కుంతీ పుత్రా! శీతోష్ణాలు (చలి-వేడి), సుఖదుఃఖాలు అనేవి ఇంద్రియాలు విషయాలతో కలవడం వల్ల కలుగుతాయి. అవి వచ్చిపోయేవి, అనిత్యమైనవి. ఓ భారత! వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకో. (2.14)
- ఓ పురుష శ్రేష్ఠా! సుఖదుఃఖాలను సమానంగా భావించే ఏ ధీరుడైతే వీటివల్ల చలించడో, అట్టివాడే అమరత్వానికి (మోక్షానికి) అర్హుడు అవుతాడు. (2.15)
- అసత్తు (ఉనికి లేనిది/నశించేది) అయిన దానికి ఉనికి లేదు. సత్తు (శాశ్వతమైనది) అయిన దానికి వినాశనం లేదు. ఈ రెండింటి మధ్య గల భేదాన్ని తత్త్వదర్శులు (జ్ఞానులు) దర్శించారు. (2.16)
- ఈ జగమంతా దేని చేత వ్యాపించబడి ఉందో, అది వినాశనం లేనిదని తెలుసుకో. నాశనం లేని ఆ ఆత్మను ఎవరూ ధ్వంసం చేయలేరు. (2.17)
- ఈ భౌతిక దేహాలు నశించేవి. కానీ వీటిలో ఉండే ఆత్మ నిత్యమైనది, నాశనం లేనిది మరియు ప్రమాణాలకు అందనిది. కాబట్టి ఓ భారత! యుద్ధం చేయి. (2.18)
- ఆత్మ చంపుతుందని అనుకునేవాడు, ఆత్మ చంపబడుతుందని భావించేవాడు – వీరిద్దరికీ ఆత్మ గురించి తెలియదు. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేత చంపబడదు. (2.19)
- ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. అది ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం, లేదా భవిష్యత్తులో పుట్టడం అనేది ఉండదు. అది పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం చంపబడినప్పటికీ ఆత్మ చంపబడదు. (2.20)
- ఓ పార్థా! ఆత్మ వినాశనం లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు లేనిదని తెలుసుకున్న జ్ఞాని ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపమని ప్రేరేపిస్తాడు? (2.21)
- మనిషి పాతబడిన వస్త్రాలను వదిలివేసి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో, ఆత్మ కూడా పాతబడిన శరీరాలను వదిలివేసి కొత్త శరీరాలను ధరిస్తుంది. (2.22)
- ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. (2.23)
- ఈ ఆత్మ ఛేదించబడనిది, దహించబడనిది, తడుపబడనిది మరియు ఆరనిది. ఇది నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, స్థిరమైనది, చలించనిది మరియు సనాతనమైనది. (2.24)
- ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరం కానిది, మనస్సుకు అందనిది మరియు ఎటువంటి మార్పులకు లోనుకాదు. దీనిని ఈ విధంగా తెలుసుకున్న తర్వాత నువ్వు శోకించడం తగదు. (2.25)
- ఒకవేళ నువ్వు ఆత్మ నిరంతరం పుడుతూ ఉంటుందని, మరణిస్తూ ఉంటుందని భావించినా సరే, ఓ మహాబాహో! నువ్వు ఈ విధంగా దుఃఖించవలసిన అవసరం లేదు. (2.26)
- పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల పుట్టక తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ విషయం గురించి నువ్వు శోకించవద్దు. (2.27)
- ప్రాణులన్నీ పుట్టక ముందు కంటికి కనిపించవు, మరణించిన తర్వాత కూడా కనిపించవు. కేవలం మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. ఓ భారత! అటువంటప్పుడు దుఃఖం దేనికి? (2.28)
- ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు ఆశ్చర్యంగా దీని గురించి చెబుతాడు, వేరొకడు దీని గురించి ఆశ్చర్యంగా వింటాడు. విన్నప్పటికీ దీనిని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. (2.29)
- ఓ భారత! అందరి శరీరాలలో ఉన్న ఈ ఆత్మ ఎన్నటికీ చంపబడదు. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు. (2.30)
- నీ స్వధర్మాన్ని ఆలోచించినా సరే, నువ్వు భయపడటం లేదా చలించడం తగదు. ఎందుకంటే, ధర్మం కోసం చేసే యుద్ధం కంటే మించిన శ్రేయస్సు క్షత్రియుడికి మరొకటి లేదు. (2.31)
- ఓ పార్థా! అప్రయత్నంగా లభించినది, తెరచి ఉన్న స్వర్గద్వారం వంటిది అయిన ఇటువంటి యుద్ధం లభించడం అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే సాధ్యమవుతుంది. (2.32)
- ఒకవేళ నువ్వు ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని చేయకపోతే, నీ స్వధర్మాన్ని మరియు కీర్తిని కోల్పోవడమే కాకుండా పాపాన్ని కూడా మూటగట్టుకుంటావు. (2.33)
- లోకంలోని వారందరూ నీ అపకీర్తిని శాశ్వతంగా చెప్పుకుంటారు. గౌరవప్రదంగా బతికే మనిషికి అపకీర్తి అనేది మరణం కంటే భయంకరమైనది. (2.34)
- ఇప్పటివరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులు, నువ్వు భయపడి యుద్ధం నుండి తప్పుకున్నావని భావిస్తారు. దానివల్ల నీవు వారి దృష్టిలో అత్యంత అల్పుడవైపోతావు. (2.35)
- నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ, అనరాని మాటలు ఎన్నో అంటారు. అంతకంటే మించిన దుఃఖం మరొకటి ఏముంటుంది? (2.36)
- అర్జునా! యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే భూమండలాన్ని పరిపాలిస్తావు. కాబట్టి యుద్ధం చేయాలనే నిశ్చయంతో నిలబడు. (2.37)
- సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాజయాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధపడు. ఇలా చేయడం వల్ల నీకు ఎటువంటి పాపం అంటదు. (2.38)
- పార్థా! ఇప్పటివరకు నీకు ‘సాంఖ్య యోగం’ (ఆత్మ జ్ఞానం) గురించి వివరించాను. ఇప్పుడు ‘కర్మ యోగం’ గురించి విను. ఈ బుద్ధితో (జ్ఞానంతో) కర్మ చేస్తే నువ్వు కర్మ బంధనాల నుండి విముక్తుడవుతావు. (2.39)
- ఈ కర్మ యోగ మార్గంలో ప్రయత్నం వృథా కాదు (ప్రారంభించినది మధ్యలో ఆగినా నష్టం ఉండదు), దీనివల్ల ఎటువంటి దోషం కలగదు. ఈ ధర్మాన్ని కొంచెం పాటించినా అది మనిషిని గొప్ప భయం (జన్మ మృత్యు భయం) నుండి రక్షిస్తుంది. (2.40)
- ఓ కురునందనా! ఈ మార్గంలో నిశ్చయంతో కూడిన బుద్ధి ఒక్కటే ఉంటుంది. కానీ నిలకడలేని వారి బుద్ధులు అనేక శాఖలుగా విడిపోయి అనంతంగా ఉంటాయి. (2.41)
- వివేకం లేని వారు, వేదాలలోని కర్మకాండల మీద మాత్రమే ఆసక్తి చూపే వారు, స్వర్గమే పరమావధి అని నమ్మేవారు ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతుంటారు. వారు భోగైశ్వర్యాల కోసమే రకరకాల కర్మలను చేస్తూ, పునర్జన్మకు కారణమవుతుంటారు. భోగాల మీద, ఐశ్వర్యం మీద అమితమైన ఆసక్తి ఉండి, అట్టి ఆకర్షణీయమైన మాటలకు లోనైన వారి మనస్సులో నిశ్చయాత్మకమైన బుద్ధి (పరమాత్మ మీద ఏకాగ్రత) కలగదు. (2.42-44)
- వేదాలు మూడు గుణాల గురించి వివరిస్తాయి. అర్జునా! నువ్వు ఆ మూడు గుణాలకు అతీతుడవు కావాలి. సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు దూరంగా ఉండు. యోగక్షేమాల చింత వదిలి, ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడవై ఉండు. (2.45)
- అంతటా నీరు నిండి ఉన్నప్పుడు ఒక చిన్న బావి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి అన్ని వేదాల వల్ల కలిగే ప్రయోజనం కూడా అంతే ఉంటుంది (అంటే జ్ఞాని వేదాల పరిధిని మించిపోతాడు). (2.46)
- నీ అధికారం కేవలం కర్మ చేయడానికే పరిమితం, దాని ఫలితాల మీద ఎప్పుడూ నీకు అధికారం లేదు. నీవే కర్మ ఫలములకు కారణం అని ఎప్పుడూ అనుకోకు, అలాగని కర్మలు చేయకుండా ఉండటం మీద కూడా నీకు ఆసక్తి కలగకూడదు. (2.47)
- ఓ ధనంజయా! ఆసక్తిని వదిలిపెట్టి, జయాపజయాలను సమానంగా భావిస్తూ యోగ నిష్ఠతో కర్మలు చేయి. ఇటువంటి ‘సమత్వ భావన’నే యోగం అంటారు. (2.48)
- ఓ ధనంజయా! ఫలాపేక్షతో చేసే కర్మ కంటే, బుద్ధియోగం (నిష్కామ కర్మ) ఎంతో శ్రేష్ఠమైనది. కాబట్టి బుద్ధినే శరణు వేడు (నిష్కామ బుద్ధితో కర్మ చేయి). ఫలితాన్ని ఆశించి కర్మలు చేసేవారు దీనులు (అభాగ్యులు). (2.49)
- సమబుద్ధి కలిగినవాడు ఈ లోకంలోనే పుణ్యపాపాలు రెండింటినీ వదిలివేస్తాడు (వాటికి అతీతుడవుతాడు). కాబట్టి యోగాన్ని ఆశ్రయించు. కర్మలను నైపుణ్యంతో (బంధం అంటకుండా) చేయడమే యోగం. (2.50)
- నిష్కామ బుద్ధి కలిగిన జ్ఞానులు కర్మ వల్ల కలిగే ఫలితాన్ని వదిలివేసి, జన్మబంధాల నుండి విముక్తులై, ఎటువంటి దుఃఖం లేని పరమపదాన్ని (మోక్షాన్ని) పొందుతారు. (2.51)
- ఎప్పుడైతే నీ బుద్ధి మోహమనే మాలిన్యాన్ని దాటిపోతుందో, అప్పుడు నువ్వు ఇదివరకు విన్న వాటి గురించి, ఇకముందు వినబోయే (లౌకిక భోగాల) వాటి గురించి వైరాగ్యాన్ని పొందుతావు. (2.52)
- రకరకాల మాటల (వేదాల్లోని కర్మకాండల) వల్ల విచలితమైన నీ బుద్ధి, ఎప్పుడు పరమాత్మ యందు నిశ్చలంగా, స్థిరంగా నిలుస్తుందో, అప్పుడు నువ్వు యోగాన్ని (పరమాత్మతో అనుసంధానాన్ని) పొందుతావు. (2.53)
- అర్జునుడు పలికెను: ఓ కేశవా! సమాధి స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి? స్థిరమైన బుద్ధి కలవాడు ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? (2.54)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సులోని కోరికలన్నింటినీ వదిలివేసి, తనలో తాను (ఆత్మలోనే) తృప్తిని పొందేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. (2.55)
- దుఃఖం కలిగినప్పుడు కలత చెందని మనస్సు, సుఖం కలిగినప్పుడు స్పృహ (అమితమైన ఆశ) లేని మనస్సు కలిగి ఉండి.. రాగం (అనురాగం), భయం, క్రోధం (కోపం) వదిలేసిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. (2.56)
- దేని మీదైనా సరే మితిమీరిన మమకారం లేకుండా, శుభం కలిగినప్పుడు పొంగిపోకుండా, అశుభం కలిగినప్పుడు ద్వేషించకుండా ఉండేవాని బుద్ధి స్థిరమైనది. (2.57)
- తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా, ఎవడైతే తన ఇంద్రియాలను విషయాల (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల) నుండి పూర్తిగా మళ్ళించగలడో, అతని బుద్ధి స్థిరమైనది. (2.58)
- ఇంద్రియాలకు ఆహారాన్ని (విషయాలను) అందించని మనిషికి విషయ వాంఛలు తగ్గుతాయి కానీ, వాటిపై ఉన్న రుచి (ఆసక్తి) అలాగే ఉంటుంది. కానీ పరమాత్మను దర్శించిన జ్ఞానికి ఆ సూక్ష్మమైన ఆసక్తి కూడా నశిస్తుంది. (2.59)
- ఓ కౌంతేయా! ఇంద్రియాలు చాలా బలమైనవి. అవి వివేకవంతుడైన మనిషి మనస్సును కూడా బలాత్కారంగా విషయాల వైపుకు లాక్కెళ్తాయి. (2.60)
- ఆ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకుని, నన్నే పరమావధిగా నమ్మి (మత్పరః), యోగనిష్ఠతో ఉండాలి. ఎవని ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉంటాయో, అతని బుద్ధి స్థిరమైనది. (2.61)
- విషయ వాంఛల గురించి అతిగా ఆలోచించే మనిషికి వాటిపై ఆసక్తి (సంగము) పుడుతుంది. ఆ ఆసక్తి నుండి కోరిక (కామము) పుడుతుంది. ఆ కోరిక తీరనప్పుడు కోపం (క్రోధము) కలుగుతుంది. కోపం వల్ల అవివేకం (సమ్మోహం) కలుగుతుంది. ఆ అవివేకం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది (స్మృతి విభ్రమము). జ్ఞాపకశక్తి నశించడం వల్ల బుద్ధి (విచక్షణ) నశిస్తుంది. బుద్ధి నశించిన మనిషి పూర్తిగా పతనమైపోతాడు. (2.62-63)
- కానీ, తన మనస్సును అదుపులో ఉంచుకున్న సాధకుడు, రాగద్వేషాల నుండి విముక్తులైన ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తున్నప్పటికీ పరమ శాంతిని (ప్రసాదాన్ని) పొందుతాడు. (2.64)
- అట్టి నిర్మలమైన స్థితి లభించినప్పుడు మనిషికి గల సమస్త దుఃఖాలు నశిస్తాయి. ప్రశాంతమైన చిత్తం కలవాని బుద్ధి త్వరగా పరమాత్మ యందు స్థిరపడుతుంది. (2.65)
- యోగనిష్ఠ (ఏకాగ్రత) లేనివానికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. బుద్ధి లేనివానికి భావన (ధ్యానించే గుణం) ఉండదు. అటువంటి భావన లేనివానికి శాంతి ఉండదు. శాంతి లేనివానికి సుఖం ఎక్కడి నుండి వస్తుంది? (2.66)
- గాలి నీటిలో ఉన్న పడవను దారి మళ్ళించినట్లుగా, విషయాలలో తిరుగుతున్న ఇంద్రియాల వెంట మనస్సు పరిగెడితే, అది మనిషి యొక్క బుద్ధిని హరించివేస్తుంది. (2.67)
- కాబట్టి ఓ మహాబాహో! ఎవరి ఇంద్రియాలైతే విషయ వాంఛల నుండి అన్ని వైపులా మళ్ళించబడి నిగ్రహించబడతాయో, అతని బుద్ధి స్థిరమైనది. (2.68)
- ప్రాణులన్నింటికీ ఏది రాత్రియో (ఆత్మజ్ఞానం), దాని యందు సంయమి (యోగి) మేల్కొని ఉంటాడు. ఏ కాలంలో ప్రాణులన్నీ మేల్కొని ఉంటాయో (ప్రాపంచిక సుఖాలు), అది సత్యాన్ని చూసే మునికి రాత్రి వంటిది. (2.69)
- నదులన్నీ వచ్చి చేరుతున్నప్పటికీ సముద్రం ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో, అలాగే కోరికలన్నీ తనలోకి ప్రవేశించినప్పటికీ ఎవడైతే చలించకుండా నిశ్చలంగా ఉంటాడో, అతడే శాంతిని పొందుతాడు. కోరికల వెంట పడేవాడు శాంతిని పొందలేడు. (2.70)
- సమస్త కోరికలను వదిలివేసి, మమకారం, అహంకారం లేకుండా, ఏ ఆశా లేకుండా తిరిగే మనిషి పరమ శాంతిని పొందుతాడు. (2.71)
- ఓ పార్థా! దీనినే ‘బ్రాహ్మీ స్థితి’ (బ్రహ్మమును పొందిన స్థితి) అంటారు. దీనిని పొందినవాడు ఎన్నటికీ మోహంలో పడడు. జీవిత చరమకాలంలోనైనా ఈ స్థితిలో స్థిరపడితే, అతడు బ్రహ్మ నిర్వాణాన్ని (మోక్షాన్ని) పొందుతాడు. (2.72)
అధ్యాయం 3: కర్మ యోగం
- అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! కర్మ కంటే జ్ఞానమే శ్రేష్ఠమని నీ అభిప్రాయమైతే, మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధ కర్మలో ఎందుకు ప్రేరేపిస్తున్నావు కేశవా? (3.1)
- నీవు చెప్పే పరస్పర విరుద్ధమైన మాటల వల్ల (ఒకసారి జ్ఞానం, ఒకసారి కర్మ) నా బుద్ధి భ్రమకు లోనవుతోంది. కాబట్టి నేను శ్రేయస్సు పొందేందుకు నిశ్చయమైన ఒకే ఒక మార్గాన్ని నాకు చెప్పు. (3.2)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ నిష్పాపుడవైన అర్జునా! ఈ లోకంలో రెండు రకాల మార్గాలు ఉన్నాయని నేను ముందే చెప్పాను. ఒకటి సాంఖ్యులకు (జ్ఞానులకు) ‘జ్ఞాన యోగం’, రెండవది యోగులకు ‘కర్మ యోగం’. (3.3)
- కర్మలను ప్రారంభించకుండా ఉండటం వల్ల మాత్రమే ఎవరికీ నిష్కర్మ స్థితి (మోక్షం) లభించదు. అలాగే కేవలం కర్మలను వదిలివేసినంత మాత్రాన (సన్న్యాసం వల్ల) సిద్ధి లభించదు. (3.4)
- ఏ ఒక్కడూ కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన మూడు గుణాల చేత ప్రతి ఒక్కడూ ఏదో ఒక కర్మ చేసేలా ప్రేరేపించబడతాడు. (3.5)
- కర్మేంద్రియాలను (చేతులు, కాళ్ళు మొదలైనవి) అదుపులో ఉంచుకుని, మనస్సులో మాత్రం విషయ సుఖాలను స్మరించేవాడు మూఢాత్ముడు. వాడు ‘మిథ్యాచారుడు’ (కపట వేషధారి) అని పిలవబడతాడు. (3.6)
- ఓ అర్జునా! ఎవరైతే తన మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించి, ఫలాపేక్ష లేకుండా కర్మేంద్రియాల ద్వారా కర్మ యోగాన్ని ఆచరిస్తారో, వారే శ్రేష్ఠులు. (3.7)
- నీవు శాస్త్ర సమ్మతమైన కర్మలను చేయి. కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయడమే మేలు. కర్మ చేయకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాగదు. (3.8)
- యజ్ఞం (భగవత్ ప్రీతి) కోసం చేసే కర్మ తప్ప, మిగిలిన కర్మలన్నీ మనిషిని బంధిస్తాయి. కాబట్టి ఓ కౌంతేయా! ఆసక్తిని వదిలి భగవంతుని కోసమే కర్మలను ఆచరించు. (3.9)
- సృష్టి ఆదిలో ప్రజాపతి (బ్రహ్మ) యజ్ఞంతో పాటు ప్రజలను సృష్టించి ఇలా అన్నాడు: ‘ఈ యజ్ఞం ద్వారా మీరు అభివృద్ధి చెందండి. ఇది మీకు కోరిన కోర్కెలను తీర్చే కామధేనువు అవుతుంది’. (3.10)
- ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతలను తృప్తి పరచండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా ఒకరినొకరు ఆదరించుకోవడం వల్ల మీరు పరమ శ్రేయస్సును పొందుతారు. (3.11)
- యజ్ఞం చేత తృప్తి చెందిన దేవతలు మీకు కావలసిన భోగాలను ఇస్తారు. వారు ఇచ్చిన వాటిని వారికి (యజ్ఞ రూపంలో) తిరిగి ఇవ్వకుండా అనుభవించేవాడు దొంగతో సమానం. (3.12)
- యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన దానిని భుజించే సత్పురుషులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. కానీ ఎవరైతే కేవలం తమ కోసమే వండుకుని తింటారో, వారు పాపాన్నే భుజిస్తున్నారు. (3.13)
- ఆహారం వల్ల ప్రాణులు పుడుతున్నాయి, వర్షం వల్ల ఆహారం లభిస్తుంది, యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, అట్టి యజ్ఞం కర్మ వల్ల సాధ్యమవుతుంది. కర్మ వేదం నుండి పుట్టిందని, వేదం పరమాత్మ (అక్షర పురుషుని) నుండి పుట్టిందని తెలుసుకో. కాబట్టి సర్వగతమైన ఆ పరమాత్మ నిరంతరం యజ్ఞం నందే ప్రతిష్ఠితమై ఉన్నాడు. (3.14-15)
- ఓ పార్థా! ఈ విధంగా ప్రకృతిలో ప్రవర్తింపజేయబడిన ఈ కర్మ చక్రాన్ని (యజ్ఞ చక్రాన్ని) అనుసరించనివాడు, ఇంద్రియ సుఖాల యందే ఆసక్తి కలిగినవాడు, పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్నవాడు అవుతాడు. అటువంటి వాని జన్మ వ్యర్థం. (3.16)
- అయితే, ఎవడైతే కేవలం ఆత్మ యందే ప్రీతి కలిగి ఉంటాడో, ఆత్మ జ్ఞానంతోనే తృప్తి చెందుతాడో, తనలో తానే సంతృప్తిని పొందుతాడో… అటువంటి మనిషికి ఇక చేయవలసిన కర్తవ్యమేదీ ఉండదు (అతడు కర్మలకు అతీతుడు). (3.17)
- అటువంటి మహాత్ముడికి ఈ లోకంలో కర్మ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం గానీ, కర్మ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం గానీ ఏమీ ఉండదు. అతడు తన అవసరాల కోసం ఏ ప్రాణి మీద కూడా ఆధారపడడు. (3.18)
- కాబట్టి, నీవు ఆసక్తిని వదిలి నిరంతరం చేయవలసిన కర్మలను ఆచరించు. ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసే మనిషి పరమాత్మను పొందుతాడు. (3.19)
- జనక మహారాజు వంటి వారు కూడా నిష్కామ కర్మల ద్వారానే పరమ సిద్ధిని పొందారు. కనీసం లోక కల్యాణం (లోక సంగ్రహం) కోసమైనా సరే నీవు కర్మలు చేయాలి. (3.20)
- ఉత్తముడైన వాడు (పెద్దలు/నాయకులు) దేనిని ఆచరిస్తాడో, మిగిలిన సామాన్య జనం కూడా దాన్నే అనుసరిస్తారు. అతను దేనిని ప్రమాణంగా (ఆదర్శంగా) చూపిస్తాడో, లోకమంతా దాన్నే పాటిస్తుంది. (3.21)
- ఓ పార్థా! మూడు లోకాల్లో నేను చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. నాకు లభించనిది గానీ, నేను పొందవలసినది గానీ ఏదీ లేదు. అయినప్పటికీ నేను నిరంతరం కర్మలు చేస్తూనే ఉన్నాను. (3.22)
- ఒకవేళ నేను అలసత్వం లేకుండా కర్మలు చేయకపోతే, మనుష్యులందరూ అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తారు (అంటే వారు కూడా కర్మలు చేయడం మానేస్తారు). (3.23)
- నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. నేను వర్ణసంకరానికి కారకుడినవుతాను మరియు ఈ ప్రజలందరి నాశనానికి నేనే బాధ్యుడినవుతాను. (3.24)
- ఓ భారత! అజ్ఞానులు కర్మల యందు ఆసక్తితో (ఫలాపేక్షతో) ఎలా చేస్తారో, జ్ఞాని అయినవాడు ఆసక్తి లేకుండా లోకకల్యాణం కోసం అలాగే కర్మలు చేయాలి. (3.25)
- కర్మల యందు ఆసక్తి ఉన్న అజ్ఞానుల బుద్ధిని జ్ఞాని అయినవాడు గందరగోళ పరచకూడదు (కర్మలు మానేయమని చెప్పకూడదు). బదులుగా, తానూ యోగయుక్తుడై కర్మలు చేస్తూ, వారిని కూడా కర్మల యందు నిమగ్నం చేయాలి. (3.26)
- అన్ని కర్మలు ప్రకృతి సిద్ధమైన గుణాల చేతనే చేయబడుతున్నాయి. కానీ అహంకారంతో మునిగిపోయిన మూర్ఖుడు ‘నేనే చేస్తున్నాను’ అని భ్రమపడతాడు. (3.27)
- ఓ మహాబాహో! గుణాల విభజనను, కర్మల విభజనను తెలిసిన తత్త్వజ్ఞాని… ‘గుణాలు (ఇంద్రియాలు) గుణాల (విషయాల) యందే ప్రవర్తిస్తున్నాయి’ అని తెలుసుకుని, వాటి యందు ఆసక్తి పెంచుకోడు. (3.28)
- ప్రకృతి గుణాల వల్ల మోహానికి గురైన వారు ఆ గుణాలలో, కర్మలలో మునిగిపోతారు. అటువంటి అల్పజ్ఞానులను పూర్ణజ్ఞాని అయినవాడు విడనాడకూడదు లేదా కలత పెట్టకూడదు. (3.29)
- కాబట్టి నీవు ఆధ్యాత్మిక బుద్ధితో సమస్త కర్మలను నాకే అర్పించి, ఎటువంటి ఆశలు లేకుండా, మమకారం లేకుండా, మనోవ్యాధిని వదిలి యుద్ధం చేయి. (3.30)
- ఎవరైతే అసూయ లేకుండా, పూర్తి శ్రద్ధతో నా యొక్క ఈ సిద్ధాంతాన్ని (నిష్కామ కర్మను) అనుసరిస్తారో, వారు కూడా కర్మ బంధనాల నుండి విముక్తులవుతారు. (3.31)
- కానీ, నా సిద్ధాంతం పట్ల అసూయ కలిగి, దీనిని అనుసరించని వారు సమస్త జ్ఞానం లేని మూర్ఖులని, వినాశనానికి చేరువైన అజ్ఞానులని తెలుసుకో. (3.32)
- జ్ఞాని సైతం తన ప్రకృతికి (పూర్వ సంస్కారాలకు) అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ స్వభావాన్నే అనుసరిస్తాయి. అటువంటప్పుడు బలవంతంగా నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం? (3.33)
- ప్రతి ఇంద్రియానికి దాని విషయాల పట్ల (శబ్ద, స్పర్శాదులు) రాగద్వేషాలు (ఇష్టాఇష్టాలు) సహజంగానే ఉంటాయి. మనిషి ఆ రెండింటికీ వశుడు కాకూడదు. ఎందుకంటే అవి మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి శత్రువులు. (3.34)
- చక్కగా ఆచరించిన పరధర్మం కంటే, గుణము లేకపోయినా తన స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేయస్కరం. స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించినా మేలే కానీ, పరధర్మం భయంకరమైనది. (3.35)
- అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! మరి మనిషి తనకి ఇష్టం లేకపోయినా, ఎవరో బలవంతంగా ప్రేరేపించినట్లుగా ఎందుకు పాప కర్మలు చేస్తున్నాడు? (3.36)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా! రజోగుణం నుండి పుట్టిన ఈ ‘కామమే’ (కోరిక) దానికి కారణం. అది తీరనప్పుడు ‘క్రోధంగా’ (కోపం) మారుతుంది. ఇది ఎంత తిన్నా తృప్తి చెందనిది (మహాశనః), మహా పాపానికి ప్రేరేపించేది. దీనినే నీవు శత్రువుగా గుర్తించు. (3.37)
- పొగ చేత అగ్ని, మురికి చేత అద్దం, మావి (గర్భసంచి) చేత పిండం ఏ విధంగా కప్పబడి ఉంటాయో, అలాగే ఈ కోరిక చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. (3.38)
- ఓ కౌంతేయా! జ్ఞానులకు నిత్య శత్రువు, ఎన్నటికీ తృప్తి చెందని అగ్ని వంటి ఈ కామం (కోరిక) చేత మనిషి యొక్క వివేకం కప్పబడి ఉంది. (3.39)
- ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి – ఇవే ఈ కామానికి నివాస స్థానాలు. వీటి ద్వారానే అది జ్ఞానాన్ని కప్పివేసి జీవుడిని మోహింపజేస్తుంది. (3.40)
- కాబట్టి ఓ భరతశ్రేష్ఠా! నీవు మొదట ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే ఈ పాపాత్ముడైన ‘కామాన్ని’ సంహరించు. (3.41)
- శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటే గొప్పది ఆత్మ (పరమాత్మ). (3.42)
- ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ పరమైనదని తెలుసుకుని, నిశ్చలమైన మనస్సుతో నిన్ను నీవు నియంత్రించుకుంటూ… ఓ మహాబాహో! జయించడానికి కష్టమైన ఈ ‘కామము’ అనే శత్రువును చంపుము. (3.43)
అధ్యాయం 4: జ్ఞాన యోగం
- శ్రీకృష్ణభగవానుడు పలికెను: నాశనం లేని ఈ యోగాన్ని నేను మొదట సూర్యుడికి చెప్పాను. సూర్యుడు తన కుమారుడైన మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు. (4.1)
- ఓ అర్జునా! ఇలా పరంపరగా వచ్చిన ఈ యోగాన్ని పూర్వం రాజర్షులు తెలుసుకున్నారు. కానీ కాలక్రమేణా ఆ యోగం ఈ లోకంలో నశించిపోయింది. (4.2)
- నీవు నా భక్తుడవు మరియు ప్రియ మిత్రుడవు కాబట్టి, అత్యంత రహస్యమైన, ఉత్తమమైన ఆ పురాతన యోగాన్నే ఇప్పుడు నీకు తిరిగి ఉపదేశిస్తున్నాను. (4.3)
- అర్జునుడు పలికెను: కృష్ణా! సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నీవు ఇప్పుడే పుట్టావు. మరి ఈ యోగాన్ని నీవే మొదట సూర్యుడికి చెప్పావన్న మాటను నేను ఎలా నమ్మాలి? (4.4)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా! నాకు, నీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. వాటన్నింటినీ నేను గుర్తుంచుకోగలను, కానీ నీవు గుర్తుంచుకోలేవు. (4.5)
- నేను పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడిని మరియు సర్వ ప్రాణులకు ఈశ్వరుడిని అయినప్పటికీ.. నా ప్రకృతిని (మాయను) ఆధారం చేసుకుని, నా ఆత్మమాయతో నేనే స్వయంగా అవతరిస్తాను. (4.6)
- ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చుమీరుతుందో.. అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను (అవతరిస్తాను). (4.7)
- సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. (4.8)
- ఓ అర్జునా! నా దివ్యమైన జన్మను, కర్మను ఎవరైతే యదార్థంగా తెలుసుకుంటారో, వారు దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ జన్మించరు; నన్నే చేరుకుంటారు. (4.9)
- రాగం (ఆశ), భయం, క్రోధం వీడినవారై.. నన్నే ఆశ్రయించి, నా యందే మనస్సు నిలిపిన ఎందరో మహానుభావులు ‘జ్ఞానతపస్సు’ చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు. (4.10)
- ఓ అర్జునా! నన్ను ఎవరు ఏ విధంగా (ఏ భావంతో) ఆశ్రయిస్తారో, వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మనుషులందరూ అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. (4.11)
- ఈ లోకంలో కర్మ ఫలితాలను కోరుకునేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే మనుష్య లోకంలో కర్మల వల్ల కలిగే ఫలితాలు చాలా త్వరగా లభిస్తాయి. (4.12)
- గుణములను, కర్మలను బట్టి నాలుగు వర్ణములను నేనే సృష్టించాను. ఆ వ్యవస్థకు కర్తను నేనే అయినప్పటికీ, నన్ను ‘అకర్త’గా (పనుల ఫలితాలకు అంటనివానిగా) మరియు వినాశనం లేనివానిగా తెలుసుకో. (4.13)
- నాకు కర్మలు అంటవు, నాకు కర్మ ఫలితాల మీద కోరిక లేదు. నన్ను ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు కూడా తాము చేసే కర్మల బంధనాల్లో చిక్కుకోరు. (4.14)
- మోక్షాన్ని కోరిన పూర్వీకులు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకునే కర్మలు చేశారు. కాబట్టి నీవు కూడా నీ పూర్వీకులు అనుసరించిన ఆ నిష్కామ కర్మ మార్గాన్నే అనుసరించు. (4.15)
- ఏది కర్మ (చేయదగిన పని)? ఏది అకర్మ (చేయకూడనిది లేదా పని చేయని స్థితి)? అనే విషయంలో విద్వాంసులు, జ్ఞానులు కూడా మోహానికి (అయోమయానికి) లోనవుతుంటారు. కాబట్టి, ఏది తెలుసుకోవడం వల్ల నీవు సంసారమనే అశుభం నుండి (బంధనాల నుండి) విముక్తుడవుతావో, అటువంటి ‘కర్మ తత్త్వాన్ని’ నీకు వివరిస్తాను. (4.16)
- కర్మ (చేయదగిన పని), వికర్మ (చేయకూడని పని), అకర్మ (ఫలాపేక్ష లేని పని) – వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం చాలా కష్టం. కర్మ గతి ఎంతో లోతైనది. (4.17)
- కర్మలో అకర్మను (పని చేస్తున్నా ఫలితాన్ని ఆశించని స్థితి), అకర్మలో కర్మను (పని చేయకుండా ఉన్నా లోపల అశాంతిగా ఉండటం వంటి స్థితి) ఎవడైతే చూడగలడో, అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు. అతడే యోగి మరియు అన్ని పనులు సంపూర్ణంగా చేసినవాడు. (4.18)
- ఎవరి ప్రయత్నాలైనా కోరికలు, సంకల్పాలు లేకుండా ఉంటాయో.. అట్టివాని కర్మలు జ్ఞానమనే అగ్నిలో దహించబడతాయి. అట్టివానిని జ్ఞానులు ‘పండితుడు’ అని పిలుస్తారు. (4.19)
- కర్మ ఫలితంపై ఆసక్తిని వదిలేసి, దేనిపైనా ఆధారపడకుండా ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు.. కర్మలలో నిరంతరం నిమగ్నమై ఉన్నా, అతడు ఏమీ చేయనివానితో (అకర్తతో) సమానం. (4.20)
- ఎటువంటి ఆశలు లేనివాడు, జయించబడిన మనస్సు మరియు దేహము కలవాడు, మమకారాన్ని (నాది అనే భావాన్ని) పూర్తిగా వదిలేసినవాడు.. కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటే, అతడికి ఎటువంటి పాపము అంటదు. (4.21)
- ప్రయత్నం చేయగా దానంతట అది లభించిన దానితో తృప్తి చెందేవాడు, సుఖదుఃఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలకు అతీతుడైనవాడు, అసూయ లేనివాడు, విజయం లభించినా లభించకపోయినా సమానంగా ఉండగలిగేవాడు.. కర్మలు చేస్తున్నా వాటి బంధనాల్లో చిక్కుకోడు. (4.22)
- ఆసక్తి లేనివాడు, ముక్తుడైనవాడు, జ్ఞానమునందు స్థిరమైన మనస్సు కలవాడు.. భగవత్ ప్రీతి కోసం (యజ్ఞం కోసం) చేసే కర్మలు పూర్తిగా లీనమైపోతాయి (అంటే అవి పునర్జన్మను ఇచ్చే కర్మఫలాలుగా మారవు). (4.23)
- అర్పించే పాత్ర బ్రహ్మము, అర్పించే పదార్థము (హవిస్సు) బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసే కర్త బ్రహ్మము. ఇలా ప్రతి కర్మలోనూ బ్రహ్మమునే (పరమాత్మనే) చూస్తూ చేసేవాడు బ్రహ్మమునే పొందుతాడు. (4.24)
- కొందరు యోగులు దేవతలను ఆరాధించడం ద్వారా దైవ యజ్ఞాన్ని చేస్తారు. మరికొందరు పరబ్రహ్మ అనే అగ్నిలో తమ ఆత్మనే అర్పించి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. (4.25)
- మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. (4.26)
- ఇంకొందరు తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని, ప్రాణ క్రియలను జ్ఞానంతో వెలిగే ఆత్మ నిగ్రహమనే యోగాగ్నిలో సమర్పిస్తారు. (4.27)
- కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. (4.28)
- మరికొందరు సాధకులు అపాన వాయువులో ప్రాణ వాయువును, ప్రాణ వాయువులో అపాన వాయువును హోమం చేస్తారు. అంటే, శ్వాసను లోపలికి తీసుకోవడం (పూరకం), బయటకు వదలడం (రేచకం) ద్వారా ప్రాణాయామం చేస్తారు. ఇంకా కొందరు ప్రాణ-అపాన గతులను రెండింటినీ స్తంభింపజేసి (కుంభకం), ప్రాణాయామమే పరమావధిగా జీవిస్తారు. ఇది కూడా ఒక రకమైన యజ్ఞమే. (4.29)
- మరికొందరు ఆహారాన్ని నియంత్రించి (మితాహారులుగా ఉండి), తమ ఇంద్రియ శక్తులను (ప్రాణాలను) ప్రాణమునందే హోమం చేస్తారు. పైన చెప్పిన వివిధ రకాల యజ్ఞాలను చేసేవారందరూ ‘యజ్ఞవిదులు’ (యజ్ఞ తత్త్వాన్ని తెలిసినవారు). వీరందరూ యజ్ఞం ద్వారా తమ పాపాలను (కల్మషములను) కడిగివేసుకున్న పుణ్యాత్ములు. (4.30)
- యజ్ఞం చేయగా మిగిలిన అమృతాన్ని (పవిత్రమైన ప్రసాదాన్ని) స్వీకరించేవారు సనాతన బ్రహ్మమును పొందుతారు. ఓ కురుశ్రేష్ఠా! ఈ లోకంలో యజ్ఞం చేయనివాడికి (త్యాగ గుణం లేనివాడికి) ఇహలోక సుఖమే లేదు, ఇక పరలోక సుఖం ఎక్కడిది? (4.31)
- వేదములలో ఇలాంటి అనేక యజ్ఞాలు వివరించబడ్డాయి. ఇవన్నీ కర్మల ద్వారానే (శరీర, మనో, వాక్కుల ద్వారా) సాధ్యమని తెలుసుకో. ఇలా తెలుసుకోవడం వల్ల నీవు సంసార బంధం నుండి విముక్తుడవుతావు. (4.32)
- ఓ అర్జునా! ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే (వస్తువులను అర్పించడం కంటే) జ్ఞాన యజ్ఞమే చాలా గొప్పది. ఎందుకంటే సమస్త కర్మల యొక్క అంతిమ లక్ష్యం జ్ఞానాన్ని పొందడమే. జ్ఞానం లభించాక కర్మలన్నీ అందులోనే ముగుస్తాయి. (4.33)
- ఆ జ్ఞానాన్ని నీవు ఎలా పొందాలో తెలుసా? తత్త్వదర్శులైన జ్ఞానులను (గురువులను) ఆశ్రయించి, వారికి వినయంతో నమస్కరించి, నీ సందేహాలను ప్రశ్నించి మరియు వారిని సేవించడం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకో. అప్పుడు ఆ జ్ఞానులు నీకు పరమ సత్యాన్ని ఉపదేశిస్తారు. (4.34)
- ఓ పాండవా! ఈ తత్త్వ జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు మళ్ళీ ఇటువంటి మోహానికి (అజ్ఞానానికి) లోనుకావు. ఆ జ్ఞానం ద్వారా సమస్త ప్రాణులను నీ ఆత్మలోనూ, ఆపై నాలోనూ (పరమాత్మలో) చూడగలుగుతావు. (4.35)
- ఒకవేళ నీవు పాపులందరిలోకెల్లా మహాపాపివి అయినప్పటికీ, ఈ ‘జ్ఞానమనే నావ’ సహాయంతో పాపసముద్రాన్ని సులభంగా దాటగలవు. (4.36)
- ఓ అర్జునా! ప్రజ్వరిల్లుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో, అలాగే ‘జ్ఞానమనే అగ్ని’ సమస్త కర్మలను (వాటి ఫలితాలను) భస్మం చేస్తుంది. (4.37)
- ఈ లోకంలో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది మరియొకటి లేదు. నిష్కామ కర్మయోగం ద్వారా సిద్ధుడైనవాడు, కాలక్రమేణా ఆ జ్ఞానాన్ని తన హృదయంలోనే స్వయంగా పొందుతాడు. (4.38)
- శ్రద్ధ కలిగినవాడు, పరమాత్మ యందే నిమగ్నమైనవాడు, ఇంద్రియాలను జయించినవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అట్టి జ్ఞానాన్ని పొందిన వెంటనే అతడు పరమ శాంతిని పొందుతాడు. (4.39)
- జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, ఎప్పుడూ అనుమానించేవాడు నాశనమైపోతాడు. సంశయం ఉన్నవానికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలోనూ ఉండదు. (4.40)
- ఓ ధనంజయా! ఎవరైతే యోగం ద్వారా కర్మలను భగవంతుడికి అర్పించారో, జ్ఞానం ద్వారా సంశయాలను తొలగించుకున్నారో, అట్టి ఆత్మజ్ఞానిని కర్మలు బంధించవు. (4.41)
- కాబట్టి ఓ భారత! నీ హృదయంలో ఉన్న అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాన్ని ‘జ్ఞానమనే కత్తి’ తో ఛేదించి, యోగ ధర్మాన్ని ఆశ్రయించి.. యుద్ధానికి సిద్ధమవ్వు. (4.42)
అధ్యాయం 5: కర్మసన్యాస యోగం
- అర్జునుడు పలికెను: కృష్ణా! ఒకసారి కర్మలను వదిలిపెట్టమని (సంన్యాసం), మరోసారి కర్మలను చేయమని (యోగం) చెబుతున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు నిశ్చయంగా శ్రేయస్సో (మేలో) అది ఒక్కటి నాకు వివరించు. (5.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కర్మ సంన్యాసం (పనులను వదలడం), కర్మ యోగం (ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం) – ఈ రెండూ మోక్షాన్ని ఇచ్చేవే. కానీ, కర్మలను వదిలేయడం కంటే కర్మలను యోగబుద్ధితో చేయడం (కర్మయోగం) మిన్న. (5.2)
- ఎవరైతే దేనినీ ద్వేషించరో, దేనినీ కోరుకోరో, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు అతీతులో.. అట్టివారే నిజమైన నిత్య సంన్యాసులు. వారు సులభంగా బంధనాల నుండి విముక్తులవుతారు. (5.3)
- సాంఖ్య యోగం (జ్ఞాన మార్గం) మరియు కర్మ యోగం వేర్వేరు అని అజ్ఞానులు అంటారు కానీ పండితులు కాదు. ఏ ఒక్క దానిని సరిగ్గా అనుసరించినా రెండింటి ఫలితం లభిస్తుంది. (5.4)
- జ్ఞానులు పొందే స్థానాన్నే యోగులు కూడా పొందుతారు. జ్ఞానాన్ని, కర్మను ఒకటిగా చూసేవాడే సరైన జ్ఞాని. (5.5)
- కర్మయోగం లేకుండా సంన్యాసాన్ని సాధించడం దుఃఖకరం. కానీ నిష్కామ కర్మలో నిమగ్నమైన ముని అతి త్వరగా పరబ్రహ్మమును చేరుకుంటాడు. (5.6)
- నిష్కామ కర్మ చేసే యోగి, పరిశుద్ధమైన మనస్సు కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు మరియు సర్వ ప్రాణులలో తన ఆత్మనే చూసేవాడు.. పనులు చేస్తున్నా కర్మలతనిని అంటవు. (5.7)
- చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస తీసుకుంటున్నా, మాట్లాడుతున్నా.. ఇవన్నీ కేవలం ఇంద్రియాలు వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని భావిస్తూ.. ‘నేను ఏమీ చేయడం లేదు’ అని తత్త్వజ్ఞాని అనుకుంటాడు. (5.8-9)
- తాను చేసే పనులన్నింటినీ పరమాత్మకు అర్పించి, ఆసక్తిని వదిలేసి కర్మలు చేసేవాడికి పాపం అంటదు. అది ఎలా అంటే.. తామర ఆకు మీద నీటి చుక్క ఉన్నా దానికి అంటనట్లుగా, అతడు లోకంలో ఉన్నా బంధాలకు చిక్కడు. (5.10)
- యోగులు అహంకారాన్ని, ఆసక్తిని వదిలిపెట్టి.. కేవలం ఆత్మశుద్ధి కోసం తమ దేహం, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాలతో కర్మలు చేస్తారు. (5.11)
- ఫలాపేక్షను వదిలేసిన యోగి పరమ శాంతిని పొందుతాడు. కానీ, కోరికలతో ఫలితం మీద ఆసక్తి పెంచుకున్న అజ్ఞాని కర్మ బంధాలలో చిక్కుకుపోతాడు. (5.12)
- జితేంద్రియుడైన జ్ఞాని అన్ని కర్మలను మనస్సుతో వదిలేసి (కర్తృత్వ భావన వీడి), తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమనే పురంలో తనేమీ చేయకుండా, చేయించకుండా సుఖంగా ఉంటాడు. (5.13)
- లోకంలోని మనుషుల కర్తృత్వాన్ని (నేను చేస్తున్నాను అనే భావం), వారి కర్మలను, కర్మఫల సంబంధాన్ని భగవంతుడు సృష్టించడు. ఇదంతా వారి వారి స్వభావం (ప్రకృతి/వాసనలు) బట్టే జరుగుతుంది. (5.14)
- పరమాత్మ ఎవరి పాపాన్ని గానీ, పుణ్యాన్ని గానీ స్వీకరించడు. కానీ, జ్ఞానం అనేది అజ్ఞానముచేత కప్పబడి ఉండటం వల్ల ప్రాణులందరూ మోహానికి (భ్రమకు) లోనవుతున్నారు. (5.15)
- ఎవరి అజ్ఞానమైతే ఆత్మజ్ఞానం చేత నశిస్తుందో, వారిలోని ఆ జ్ఞానం సూర్యుడిలా ప్రకాశించి పరమాత్మ తత్త్వాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. (5.16)
- ఎవరి బుద్ధి పరమాత్మ యందే లగ్నమై ఉంటుందో, ఎవరి ఆత్మ ఆయనతోనే ఐక్యమై ఉంటుందో, ఎవరి నిష్ఠ ఆయనపైనే ఉంటుందో.. అట్టి జ్ఞానులు తమ పాపాలను జ్ఞానంతో కడిగివేసుకుని, తిరిగి జన్మించని ఉన్నత స్థితిని (ముక్తిని) పొందుతారు. (5.17)
- విద్యావినయాలు కలిగిన బ్రాహ్మణునియందు, ఆవునందు, ఏనుగునందు, కుక్కనందు, చండాలునియందు.. పండితులు (జ్ఞానులు) అందరిలోనూ ఉన్న పరమాత్మను ఒక్కటిగానే చూస్తారు. (5.18)
- ఎవరి మనస్సు సమత్వంలో స్థిరంగా ఉంటుందో, వారు ఈ జన్మలోనే జనన మరణ సంసారాన్ని జయించినట్లే. ఎందుకంటే బ్రహ్మము నిర్దోషమైనది, అందరిలోనూ సమానంగా ఉండేది; కాబట్టి వారు బ్రహ్మమునందే స్థితులై ఉంటారు. (5.19)
- ప్రియమైనది (సుఖం) కలిగినప్పుడు పొంగిపోకుండా, అప్రియమైనది (దుఃఖం) కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండాలి. ఇటువంటి స్థిర బుద్ధి కలవాడు, భ్రమలు లేనివాడు బ్రహ్మవేత్త అనిపించుకుంటాడు. (5.20)
- బాహ్య విషయాల మీద ఆసక్తి లేనివాడు తన ఆత్మలోనే సుఖాన్ని పొందుతాడు. పరమాత్మతో అనుసంధానమైన అతడు నాశనం లేని అక్షయ సుఖాన్ని అనుభవిస్తాడు. (5.21)
- ఓ అర్జునా! ఇంద్రియాల ద్వారా కలిగే భోగాలన్నీ దుఃఖానికే కారణమవుతాయి. అవి పుట్టుక, నాశనం ఉన్నవి (తాత్కాలికమైనవి). అందుకే జ్ఞాని వాటిలో రమించడు (సంతోషాన్ని వెతుక్కోడు). (5.22)
- ఈ శరీరాన్ని వదిలేలోపే (మరణానికి ముందే), కామ క్రోధాల వల్ల కలిగే వేగాన్ని ఎవడైతే అదుపు చేయగలడో.. అతడే నిజమైన యోగి మరియు ఆనందమయుడైన పురుషుడు. (5.23)
- ఎవడైతే తన లోపలే సుఖాన్ని, తన లోపలే ఆనందాన్ని మరియు తన లోపలే జ్ఞానకాంతిని పొందుతాడో.. అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు. (5.24)
- పాపాలు నశించినవారు, సందేహాలు తొలగినవారు, మనస్సును నిగ్రహించినవారు మరియు సమస్త ప్రాణుల హితము కోరేవారు అయిన ఋషులు బ్రహ్మనిర్వాణాన్ని పొందుతారు. (5.25)
- కామ క్రోధాలను వీడినవారు, చిత్తాన్ని వశపరచుకున్నవారు మరియు ఆత్మతత్త్వాన్ని ఎరిగిన మహాత్ములకు అన్నివేళలా, అన్నిచోట్లా బ్రహ్మనిర్వాణం (పరమ శాంతి) సిద్ధించి ఉంటుంది. (5.26)
- బాహ్య విషయాల (శబ్ద, స్పర్శాదుల) ఆలోచనలను బయటే నిలిపివేసి, చూపును రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి (భ్రువోః మధ్యే), ముక్కు రంధ్రాలలో సంచరించే ప్రాణ, అపాన వాయువులను సమానం చేసి, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకుని, భయ-క్రోధ-ఆశలను వీడి మోక్షమే లక్ష్యంగా ఉన్న ముని ఎల్లప్పుడూ ముక్తుడే (విముక్తుడే). (5.27-28)
- సమస్త యజ్ఞాలకు, తపస్సులకు ఫలాన్ని అనుభవించే ప్రభువును నేనే అని, సర్వ లోకములకు మహేశ్వరుడిని నేనే అని మరియు సమస్త ప్రాణులకు ప్రియ మిత్రుడిని నేనే అని తెలుసుకున్న మానవుడు పరమ శాంతిని పొందుతాడు. (5.29)
అధ్యాయం 6: ఆత్మసంయమ యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా (కోరకుండా), ఏది తన కర్తవ్యమో (చేయవలసిన పని) అట్టి కర్మను ఎవడైతే చేస్తాడో.. అతడే సంన్యాసి మరియు అతడే యోగి. కేవలం యజ్ఞాగ్నిని వదిలేసినవాడు (నిరగ్నిః) కానీ, పనులు మానేసినవాడు (అక్రియః) కానీ సంన్యాసి/యోగి కాలేడు. (6.1)
- దేనిని ‘సంన్యాసం’ అని పిలుస్తారో, దానినే ‘యోగం’ అని కూడా తెలుసుకో ఓ పాండవా! ఎందుకంటే, లౌకిక కోరికలను వదులుకోనివాడు ఎవడూ యోగి కాలేడు. (6.2)
- యోగ స్థితిని అధిరోహించాలనుకునే మునికి నిష్కామ కర్మ సాధనంగా చెప్పబడింది. అదే యోగ స్థితిని పొందిన వానికి ప్రశాంతత సాధనంగా చెప్పబడింది. (6.3)
- ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల యందు మరియు కర్మల యందు ఆసక్తిని కలిగి ఉండడో.. అట్టి అన్ని సంకల్పాలను వదిలేసినవాడిని ‘యోగారూఢుడు’ అని అంటారు. (6.4)
- తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మనమే మిత్రుడము మరియు మనకు మనమే శత్రువులము. (6.5)
- మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. (6.6)
- మనస్సుని జయించిన యోగులు – శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు – ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. (6.7)
- జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు. (6.8)
- మేలుకోరేవారు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యస్థులు, ద్వేషించదగినవారు, బంధువులు, సాధువులు మరియు పాపాత్ముల పట్ల సమానమైన బుద్ధిని కలిగి ఉండేవాడే అందరిలోనూ శ్రేష్ఠుడు. (6.9)
- యోగి ఎల్లప్పుడూ ఒంటరిగా, ఏకాంత ప్రదేశంలో ఉంటూ.. మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని, ఎటువంటి ఆశలు లేనివాడై, ఏ వస్తువుల మీద మమకారం లేకుండా తన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. (6.10)
- పరిశుభ్రమైన ప్రదేశంలో, తనకు అనుకూలమైన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరుచుకోవాలి. అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. దానిపై క్రమంగా కుశలు, జింక చర్మము, వస్త్రము ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ఆ ఆసనంపై కూర్చుని, మనస్సును ఏకాగ్రం చేసి, చిత్తమును మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని.. తన ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చేయాలి. (6.11-12)
- శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి. (6.13-14)
- ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నా యందు ఉన్నట్టి మోక్షమే అంతిమంగా గల పరమ శాంతిని పొందుతాడు. (6.15)
- ఓ అర్జునా! అతిగా తినేవాడికి, అస్సలు తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి మరియు అస్సలు నిద్రపోకుండా ఎప్పుడూ మేల్కొని ఉండేవారికి యోగము సిద్ధించదు. (6.16)
- కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. (6.17)
- నిగ్రహించబడిన మనస్సు ఆత్మయందే స్థిరంగా ఉంచి, సమస్త కోరికల యందు నిరాశక్తుడై ఉండే వారినే యోగస్థితిలో ఉన్నారని అంటారు. (6.18)
- గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు, ఆత్మ ధ్యానంలో స్థిరముగా ఉండును. (6.19)
- యోగ సాధన ద్వారా నిరోధించబడిన చిత్తము ఎక్కడైతే ప్రశాంతతను పొందుతుందో, ఎక్కడైతే తన శుద్ధమైన బుద్ధి చేత ఆత్మను దర్శిస్తూ తనలోనే తాను తృప్తిని పొందుతాడో…ఇంద్రియాలకు అందక కేవలం పరిశుద్ధమైన బుద్ధికే అందే అనంతమైన సుఖాన్ని ఎక్కడైతే పొందుతాడో, అట్టి స్థితిలో స్థిరంగా ఉన్న యోగి పరమ సత్యం నుండి ఎన్నటికీ చలించడు. ఏ స్థితిని పొందిన తర్వాత అంతకంటే గొప్ప లాభం మరొకటి లేదని భావిస్తాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు గొప్పదైన దుఃఖం కూడా అతడిని చలింపజేయదో…దుఃఖంతో కూడిన సంసార సంబంధం నుండి విడదీయబడిన దానినే ‘యోగం’ అని తెలుసుకో. అట్టి యోగాన్ని విసుగు చెందని మనస్సుతో, నిశ్చయమైన పట్టుదలతో సాధించాలి. (6.20-23)
- సంకల్పాల వల్ల పుట్టిన కోరికలన్నింటినీ పూర్తిగా వదిలివేసి, మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుండి నియంత్రించాలి. ధైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా ఉపశాంతిని పొందాలి. మనస్సును ఆత్మయందే నిలిపి, ఆ సమయంలో వేరే దేనినీ ఆలోచించకూడదు. (6.24-25)
- చంచలమైనది, అస్థిరమైనది అయిన మనస్సు ఎక్కడికెక్కడికి పారిపోతుందో , అక్కడి నుండి తిరిగి తెచ్చి నిరంతరం ఆత్మ మీదనే కేంద్రీకరించాలి. (6.26)
- ప్రశాంతమైన మనస్సు కలవాడు, రజోగుణం అణిగిపోయినవాడు, పాప రహితుడు మరియు బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఉత్తమమైన సుఖం లభిస్తుంది. (6.27)
- ఈ విధంగా ఎల్లప్పుడూ తనను తాను పరమాత్మతో అనుసంధానం చేసే పాపరహితుడైన యోగి, బ్రహ్మానుభూతి చేత కలిగే అనంతమైన సుఖాన్ని సులభంగా పొందుతాడు. (6.28)
- యోగముతో కూడిన మనస్సు కలవాడు, అంతటా సమదృష్టి కలవాడు… తనను అన్ని ప్రాణులలోనూ, అన్ని ప్రాణులను తనలోనూ చూస్తాడు. (6.29)
- ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. (6.30)
- అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అభేద భావంతో ఎవరు భజిస్తారో, అట్టి యోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా యందే ఉంటాడు. (6.31)
- సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, మరియు ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. (6.32)
- అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. (6.33)
- ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, ఇంద్రియాలను కలచివేసేది, బలమైనది, మరియు మొండిది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. (6.34)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ మహాబాహో! మనస్సును అదుపు చేయడం కష్టమే అన్నది నిస్సందేహం. కానీ, ఓ కౌంతేయా! అభ్యాసము మరియు వైరాగ్యము చేత అది నిగ్రహించబడుతుంది. (6.35)
- మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు అని నా అభిప్రాయము. (6.36)
- అర్జునుడు పలికెను: ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి? (6.37)
- ఓ మహాబాహో! యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటినీ కోల్పోయి, విడిపోయి చెదిరిన మేఘం వలె నశించిపోతాడా? (6.38)
- ఓ కృష్ణా! నా ఈ సందేహాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవాడు నీకంటే వేరొకడు ఎవరూ లేరు. (6.39)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవానికి ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వినాశనం లేదు. మంచిని చేసేవాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు. (6.40)
- యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొంది, అక్కడ చాలా ఏళ్ళ పాటు సుఖంగా ఉండి.. ఆ తర్వాత పవిత్రమైన ఆలోచనలు గల, ఐశ్వర్యవంతులైన వారి ఇంట్లో జన్మిస్తాడు. (6.41)
- లేదా బుద్ధిమంతులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. లోకంలో ఇటువంటి జన్మ లభించడం అత్యంత దుర్లభమైనది. (6.42)
- ఓ కురునందనా! ఇటువంటి జన్మ పొందిన తరువాత, వారు తమ పూర్వ జన్మకు సంబంధించిన బుద్ధి సంస్కారాలను తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు. (6.43)
- వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా, పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్శించబడుతారు. ఇటువంటి సాధకులు సహజంగానే, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. (6.44)
- ప్రయత్నంతో సాధన చేసే యోగి, పాపాలను కడిగివేసుకుని, అనేక జన్మల తర్వాత సిద్ధిని పొంది, చివరకు పరమ గతిని పొందుతాడు. (6.45)
- యోగ సాధకుడు తపస్సు చేసేవారికంటే, శాస్త్ర జ్ఞానం కలవారికంటే మరియు ఫలాపేక్షతో కర్మలు చేసేవారికంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జునా! నీవు యోగివి కావాలి. (6.46)
- అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. (6.47)
అధ్యాయం 7: విజ్ఞాన యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా! నా యందు ఆసక్తి కలిగిన మనస్సుతో, నన్నే ఆశ్రయించి, యోగ సాధన చేస్తూ.. నన్ను సంపూర్ణంగా ఎటువంటి సంశయం లేకుండా ఎలా తెలుసుకోవచ్చో, దానిని విను. (7.1)
- నేను నీకు అనుభవంతో కూడిన ఈ జ్ఞానాన్ని పూర్తిగా వివరిస్తాను. దీనిని తెలుసుకున్న తర్వాత, ఈ లోకంలో నీవు తెలుసుకోవలసింది ఇంక ఏదీ మిగిలి ఉండదు. (7.2)
- వేలకొద్దీ మనుష్యులలో ఎవరో ఒక్కడు మాత్రమే సిద్ధి (ఆత్మజ్ఞానం) కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా, ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థంగా తెలుసుకోగలుగుతారు. (7.3)
- భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము – ఈ ఎనిమిది విధాలుగా నా ప్రకృతి విభజించబడింది. (7.4)
- ఓ మహాబాహో! పైన చెప్పినది అపరా ప్రకృతి. దీనికంటే భిన్నమైనది మరియు శ్రేష్ఠమైనది అయిన నా ‘జీవ రూప’ ప్రకృతిని తెలుసుకో. దాని ద్వారానే ఈ జగత్తు అంతా ధరించబడి ఉంది. (7.5)
- సమస్త ప్రాణులన్నీ ఈ రెండు ప్రకృతుల నుండే పుడుతున్నాయని తెలుసుకో. ఈ మొత్తం జగత్తు సృష్టికి మరియు ప్రళయానికి నేనే మూలకారణం. (7.6)
- ఓ ధనంజయా! నాకంటే శ్రేష్ఠతరమైన కారణం ఈ విశ్వంలో ఏదీ లేదు. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి. (7.7)
- ఓ కౌంతేయా! నీటిలో రుచిని నేనే. చంద్రసూర్యులలోని కాంతిని నేనే. వేదాలలోని ఓంకారమును నేనే. ఆకాశంలోని శబ్దమును మరియు మనుష్యులలోని పౌరుషమును నేనే. (7.8)
- భూమియందు పవిత్రమైన సుగంధమును నేనే. అగ్నియందు తేజస్సును నేనే. సమస్త ప్రాణులయందు ప్రాణశక్తిని మరియు తపస్సు చేసేవారిలో తపస్సును నేనే. (7.9)
- ఓ పార్థా! సమస్త ప్రాణులకు నాశనం లేని సనాతనమైన బీజమును నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధిని మరియు పరాక్రమవంతులలోని తేజస్సును నేనే. (7.10)
- ఓ భరతశ్రేష్ఠా! బలవంతులలో కోరికలు మరియు అనురాగం లేని శుద్ధమైన బలమును నేనే. అలాగే ప్రాణులలో ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేనే. (7.11)
- సత్త్వ, రజో, తమో గుణాల వల్ల కలిగే భావాలన్నీ నా నుండే పుడుతున్నాయని తెలుసుకో. అయితే, అవి నా అధీనంలో ఉన్నాయే కానీ, నేను వాటికి లోబడి లేను. (7.12)
- ఈ మూడు గుణాల ప్రభావంతో ఈ జగత్తు అంతా మోహానికి లోనై ఉంది. అందుకే ఈ గుణాలకు అతీతుడైన, నాశనం లేని నన్ను అది గుర్తించలేకపోతోంది. (7.13)
- మూడు గుణాలతో కూడిన నా ఈ దైవీ మాయను దాటడం చాలా కష్టం. కానీ, ఎవరైతే నన్నే అనన్య భావంతో ఆశ్రయిస్తారో, వారు మాత్రమే ఈ మాయను సులభంగా దాటగలరు. (7.14)
- పాపకృత్యాలు చేసేవారు, వివేకం లేని మూఢులు, నరాధములు నన్ను ఆశ్రయించరు. ఎందుకంటే మాయ వల్ల వారి జ్ఞానం హరించబడింది. వారు అసుర స్వభావాన్ని ఆశ్రయించి ఉంటారు. (7.15)
- ఓ భరతశ్రేష్ఠా! నాలుగు రకములైన పుణ్యాత్ములు నన్ను భజిస్తారు — ఆపదలో ఉన్నవాడు, సత్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం కలవాడు, సంపదను కోరుకునేవాడు మరియు నన్ను యదార్థంగా తెలుసుకున్న జ్ఞాని. (7.16)
- ఆ నలుగురిలో ఎల్లప్పుడూ నా యందే మనస్సు నిలిపే, అనన్య భక్తి కలిగిన జ్ఞాని శ్రేష్ఠుడు. ఎందుకంటే జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను, ఆ జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు. (7.17)
- ఆ నలుగురు భక్తులూ గొప్పవారే. కానీ స్థిరమైన మనస్సుతో నన్నే పరమ గతిగా భావించే జ్ఞాని మాత్రం నా స్వరూపమే అని నా అభిప్రాయం. (7.18)
- అనేక జన్మల సాధన తర్వాత జ్ఞాని, అంతా నేనే అని తెలుసుకుని నన్ను ఆశ్రయిస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. (7.19)
- వివిధ రకాల కోరికల చేత జ్ఞానాన్ని కోల్పోయిన వారు, తమ స్వభావానికి లోబడి, ఆయా నియమాలను పాటిస్తూ అన్య దేవతలను ఆశ్రయిస్తారు. (7.20)
- ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతా రూపాన్ని శ్రద్ధతో పూజించాలని కోరుకుంటాడో, ఆయా దేవతల యందు అతడికి ఉండే శ్రద్ధను నేనే స్థిరపరుస్తాను. (7.21)
- అతడు ఆ స్థిరమైన శ్రద్ధతో ఆ దేవతను ఆరాధిస్తాడు. దాని ఫలితంగా తాను కోరుకున్న కోరికలను పొందుతాడు. అయితే, నిజానికి ఆ ఫలితాలను ఇచ్చేది నేనే. (7.22)
- అల్ప బుద్ధి కలవారు పొందే ఆ ఫలితాలు తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు ఆయా దేవతలను చేరుకుంటారు. నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. (7.23)
- బుద్ధి లేనివారు నా యొక్క నాశనం లేని, శ్రేష్ఠమైన పరమ తత్త్వాన్ని తెలియక, నిరాకార అవ్యక్తమైన నన్ను సామాన్య మానవుడిలా పుట్టినవానిగా భావిస్తారు. (7.24)
- నేను నా యోగమాయచేత కప్పబడి ఉండటం వల్ల అందరికీ కనిపించను. ఈ అజ్ఞాన లోకము పుట్టుక లేనివాడిని, మార్పు లేనివాడిని అయిన నన్ను గుర్తించలేకపోతోంది. (7.25)
- నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు లోని సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియను. (7.26)
- ఓ భారత! రాగద్వేషాల వల్ల పుట్టిన సుఖదుఃఖాల వంటి ద్వంద్వాల మోహంలో చిక్కుకుని, ప్రాణులన్నీ పుట్టినప్పుడే సమ్మోహాన్ని పొందుతున్నాయి. (7.27)
- పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వ మోహాల నుండి విముక్తులై నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. (7.28)
- ముసలితనం, మరణం నుండి ముక్తిని పొందడానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నించే వారు, ఆ పరబ్రహ్మమును, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమును మరియు సమస్త కర్మల రహస్యాలను తెలుసుకోగలుగుతారు. (7.29)
- అధిభూత, అధిదైవ మరియు అధియజ్ఞ స్వరూపుడనైన నన్ను ఎవరు తెలుసుకుంటారో, అట్టి స్థిరమైన మనస్సు గలవారు మరణ కాలంలో కూడా నన్ను స్మరిస్తూ నా యందే స్థితమై ఉంటారు. (7.30)
అధ్యాయం 8: అక్షరపరబ్రహ్మ యోగం
- అర్జునుడు పలికెను: ఓ పురుషోత్తమా! ఆ బ్రహ్మము అంటే ఏమిటి? అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము అని దేనిని అంటారు? మరియు అధిదైవము అని దేనిని పిలుస్తారు? ఓ మధుసూదనా! ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? మరియు మనస్సును నిగ్రహించిన వారు మరణ కాలంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు? (8.1-8.2)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: “నాశనం లేని పరమ తత్త్వమే బ్రహ్మము. జీవుడిలోని ఆత్మ తత్త్వమునే అధ్యాత్మము అంటారు. ప్రాణుల పుట్టుకకు, అభివృద్ధికి కారణమైన త్యాగపూర్వకమైన సృష్టి కార్యమే కర్మ.” (8.3)
- ఓ దేహధారులలో శ్రేష్ఠుడవైన అర్జునా! నశించే స్వభావం కల జడ పదార్థాలన్నీ అధిభూతము. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము. ఈ దేహంలో అంతర్యామిగా ఉండి యజ్ఞఫలాలను ఇచ్చే అధియజ్ఞుడు నేనే. (8.4)
- మరణ సమయంలో నన్నే స్మరిస్తూ తన శరీరాన్ని వదిలి వెళ్ళేవాడు, నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. (8.5)
- ఓ కౌంతేయా! మనిషి మరణ సమయంలో దేనినైతే స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో, జీవితాంతం దేనిని ధ్యానిస్తూ ఉంటాడో, చనిపోయాక ఆ భావాన్నే పొందుతాడు. (8.6)
- కాబట్టి, అన్ని వేళలా నన్నే స్మరించు మరియు నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చేయు. నీ మనస్సును, బుద్ధిని నా యందే అర్పించినట్లయితే, నిశ్చయంగా నన్నే చేరుకుంటావు. (8.7)
- ఓ పార్థా! అభ్యాసయోగంతో కూడి, వేరే ఆలోచనలు లేకుండా నిరంతరం ధ్యానించేవాడు, దివ్యుడైన పరమ పురుషుడిని చేరుకుంటాడు. (8.8)
- సర్వజ్ఞుడిని, పురాతనమైన వాడిని, ప్రపంచాన్ని శాసించేవాడిని, అణువుకంటే సూక్ష్మమైన వాడిని, అందరినీ పోషించేవాడిని, ఊహాతీతమైన రూపం కలవాడిని, సూర్యుని వలె ప్రకాశించేవాడిని మరియు చీకటికి అవతల ఉన్నవాడిని ఎవడైతే స్మరిస్తాడో, మరణ సమయంలో నిశ్చలమైన మనస్సుతో, భక్తితో మరియు యోగబలంతో, తన ప్రాణాన్ని రెండు కనుబొమ్మల మధ్యకు చక్కగా చేర్చి ధ్యానించేవాడు, ఆ దివ్యుడైన పరమ పురుషుడిని చేరుకుంటాడు. (8.9-8.10)
- వేద పండితులు దేనిని అక్షరము అని అంటారో, ఆసక్తి లేని మునులు దేనిలో ప్రవేశిస్తారో, దేనిని కోరుతూ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారో, అట్టి పరమ పదాన్ని నీకు క్లుప్తంగా వివరిస్తాను. (8.11)
- ఇంద్రియ ద్వారాలన్నింటినీ అదుపు చేసి, మనస్సును హృదయంలో నిలిపి, తన ప్రాణాన్ని శిరస్సు నందు (సహస్రారంలో) ఉంచి, యోగధారణలో స్థిరంగా ఉండాలి. ఓం అనే ఈ ఏకాక్షర బ్రహ్మమును ఉచ్చరిస్తూ, నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలి వెళ్ళేవాడు పరమ గతిని పొందుతాడు. (8.12-8.13)
- ఓ పార్థా! వేరే ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ నన్నే స్మరించే నిత్యయుక్తుడైన యోగికి, నేను చాలా సులభంగా లభిస్తాను. (8.14)
- నన్ను చేరుకొని అత్యున్నతమైన పరిపూర్ణతను పొందిన మహాత్ములకు, దుఃఖాలకు నిలయమైన, అశాశ్వతమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. (8.15)
- ఓ అర్జునా! బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు తిరిగి జన్మలు ఇచ్చేవే. కానీ ఓ కౌంతేయా! నన్ను చేరుకున్న వారికి మాత్రం మళ్ళీ పునర్జన్మ ఉండదు. (8.16)
- బ్రహ్మదేవుని ఒక పగలు వెయ్యి మహాయుగాల కాలపరిమితి కలదని, అలాగే ఆయన రాత్రి కూడా వెయ్యి మహాయుగాల కాలమని ఎవరు తెలుసుకుంటారో, అట్టివారే కాలతత్త్వాన్ని ఎరిగినవారు. (8.17)
- బ్రహ్మదేవుని పగలు ప్రారంభం కాగానే, అవ్యక్తం నుండి చరాచర ప్రాణులన్నీ పుడుతున్నాయి. రాత్రి కాగానే, మళ్ళీ ఆ అవ్యక్తమునందే లీనమవుతున్నాయి. (8.18)
- ఓ పార్థా! ఈ ప్రాణి సమూహమంతా ప్రకృతికి వశమై, పగలు రాగానే పుడుతూ, రాత్రి రాగానే లయమైపోతూ ఉంటుంది. (8.19)
- కానీ, ఆ అవ్యక్త ప్రకృతి కంటే భిన్నమైనది మరియు శ్రేష్ఠమైనది అయిన మరొక సనాతన అవ్యక్త తత్త్వము ఉంది. సమస్త భూతములు నశించినప్పటికీ, ఆ తత్త్వము నశించదు. (8.20)
- ఆ యొక్క అవ్యక్త అక్షరమే సర్వోన్నత లక్ష్యము. దేనిని పొందిన తర్వాత తిరిగి ఈ సంసారానికి రారో, అదే నా పరమ ధామము. (8.21)
- ఓ పార్థా! సమస్త ప్రాణులు ఎవరి యందు ఉన్నాయో, ఎవరి చేత ఈ జగత్తు అంతా వ్యాపించి ఉందో, అట్టి పరమ పురుషుడు అనన్యమైన భక్తి చేత మాత్రమే లభిస్తాడు. (8.22)
- ఓ భరతశ్రేష్ఠా! ఏ ఏ మార్గాలలో వెళ్ళిన యోగులు తిరిగి రారో మరియు తిరిగి వస్తారో, అట్టి కాలమార్గాల గురించి నీకు వివరిస్తాను. (8.23)
- అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము మరియు ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలము.. ఈ దేవతలే మార్గదర్శకులుగా వెళ్ళే బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మమును పొందుతారు. (8.24)
- ధూమము, రాత్రి, కృష్ణపక్షము మరియు ఆరు నెలల దక్షిణాయన కాలము.. ఈ మార్గంలో వెళ్ళే యోగి చంద్రలోక జ్యోతిని పొంది, తిరిగి సంసారానికి వస్తాడు. (8.25)
- లోకంలో శుక్ల గతి, కృష్ణ గతి అనే ఈ రెండు మార్గాలు శాశ్వతమైనవిగా భావించబడ్డాయి. మొదటి మార్గం ద్వారా వెళ్ళేవాడు తిరిగి రాడు, రెండవ మార్గం ద్వారా వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. (8.26)
- ఓ పార్థా! ఈ రెండు మార్గాల రహస్యాన్ని తెలిసిన యోగి ఎన్నడూ మోహానికి లోనుకాడు. కావున, అన్ని వేళలా నీవు యోగమునందే స్థిరంగా ఉండుము. (8.27)
- వేద పఠనం వల్ల, యజ్ఞాల వల్ల, తపస్సు వల్ల మరియు దానాల వల్ల ఏ ఏ పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడ్డాయో.. ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి వాటన్నింటినీ మించిపోయి, పురాతనమైన పరమ పదమును పొందుతాడు. (8.28)
అధ్యాయం 9: రాజవిద్యారాజగుహ్య యోగం
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మఱల విశిదముగ చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారమునుండి ముక్తుడవు కాగలవు. (9.1)
- ఈ విజ్ఞానసహితజ్ఞానము (నిర్గుణ సగుణ పరమాత్మతత్త్వజ్ఞానము) అన్ని విద్యలకును తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము, అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. (9.2)
- ఓ పరంతపా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించుచుందురు. (9.3)
- నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమైయున్నది. ప్రాణులన్నియును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములైయున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడనుకాను. (9.4)
- ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై యుండదు. (9.5)
- ఆకాశమునుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే స్థితమై యుండును అని ఎఱుంగుము. (9.6)
- ఓ కౌంతేయా! కల్పాంతమునందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మఱల వాటిని సృజించుచుందును. (9.7)
- తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూతసముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. (9.8)
- ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై, ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. (9.9)
- ఓ అర్జునా! అధిష్ఠాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టించుచున్నది. ఈ కారణమువలననే సంసారచక్రము పరిభ్రమించుచున్నది. (9.10)
- నా పరమభావమును ఎఱుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యమానవునిగా భావించి, తక్కువగా ఊహింతురు. (9.11)
- వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులుగల అజ్ఞానులు రాక్షసీ-ఆసురీ – మోహినీ స్వభావములను ఆశ్రయింతురు. (9.12)
- కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజింతురు. (9.13)
- ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. (9.14)
- మఱికొందరు జ్ఞానయోగులు నిర్గుణనిరాకారబ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞనముద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మఱికొందరు అనంతరూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. (9.15)
- నేనే క్రతువును. నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. (9.16)
- ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామయజుర్వేదములను నేనే. (9.17)
- పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందఱికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను, అందఱి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వతకారణమును నేనే. (9.18)
- ఓ అర్జునా! సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను. సముద్రములనుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మఱల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే. (9.19)
- ఋగ్యజుస్సామవెవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాప రహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చట దేవతల దివ్యభోగములను అనుభవింతురు. (9.20)
- ఆ విశాలస్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మఱల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. (9.21)
- పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (అప్రాప్త వస్తుప్రాప్తిని ‘యోగము’ అనియందురు. ప్రాప్తించిన వస్తురక్షణమును ‘క్షేమము’ అని యందురు.) (9.22)
- ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి. (9.23)
- ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు. (9.24)
- దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. (9.25)
- నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును. (9.26)
- ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. (9.27)
- ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై. అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు. (9.28)
- నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును. (9.29)
- మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. (9.30)
- కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. ‘నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు’ అను విషయమును నిశ్చయముగా ఎఱుంగుము. (9.31)
- ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్ను శరణుపొంది పరమగతినే పొందుదురు. (9.32)
- ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును, భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమునుచేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది – నిరంతరము నన్నే భజింపుము. (9.33)
- నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. (9.34)
అధ్యాయం 10: విభూతి యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ మహాబాహో! నాపై అమితమైన ప్రేమ గల నీ మేలు కోరి నేను చెప్పబోయే అత్యున్నతమైన మాటలను మళ్ళీ ఒకసారి వినుము. (10.1)
- నా పుట్టుకను దేవతలు కానీ, మహర్షులు కానీ ఎవరూ ఎరుగరు. ఎందుకంటే, దేవతలకు మరియు మహర్షులకు అన్ని విధాలా ఆది కారణం నేనే. (10.2)
- ఎవరైతే నన్ను పుట్టుక లేనివానిగా, ఆది లేనివానిగా మరియు సర్వలోకాలకు అధిపతిగా గుర్తిస్తారో, మనుష్యులలో అట్టి జ్ఞాని మోహము లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు. (10.3)
- బుద్ధి, జ్ఞానం, నిలకడ, క్షమ, సత్యం, ఇంద్రియ నిగ్రహం (దమః), మనో నిగ్రహం (శమః), సుఖదుఃఖాలు, పుట్టుక-గిట్టుకలు, భయం-అభయం, అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి-అపకీర్తి – ప్రాణులలో కలిగే ఇటువంటి రకరకాల భావాలన్నీ నా నుండే కలుగుతున్నాయి. (10.4-10.5)
- సప్తర్షులు, వారి కంటే ముందున్న నలుగురు బ్రహ్మమానస పుత్రులు (సనకసనందనాదులు) మరియు మనువులు.. వీరంతా నా సంకల్పం వల్లే నా నుండి పుట్టారు. లోకంలోని ప్రజలంతా వీరి సంతానమే. (10.6)
- నా యొక్క విభూతులను, యోగ శక్తిని ఎవరైతే యదార్థంగా తెలుసుకుంటారో.. వారు అచంచలమైన భక్తి యోగంతో నన్ను చేరుకుంటారు. ఇందులో సందేహం లేదు. (10.7)
- సమస్త సృష్టికి మూలం నేనే. అంతా నా వల్లే నడుస్తోంది. ఇలా తెలుసుకున్న జ్ఞానులు అత్యంత అనురాగంతో, శ్రద్ధతో నన్ను భజిస్తారు. (10.8)
- నా యందే మనస్సు నిలిపిన వారు, నాకే తమ ప్రాణాలను అర్పించిన వారు.. ఒకరికొకరు నా గురించి బోధించుకుంటూ, నిరంతరం నా లీలలను చెప్పుకుంటూ.. ఎల్లప్పుడూ సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. (10.9)
- మనస్సు ఎల్లప్పుడూ నా యందే లగ్నమై, అత్యంత ప్రేమతో నన్ను భజించే వారికి.. నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానమును నేనే ప్రసాదిస్తాను. (10.10)
- వారిపై గల కరుణతో, వారి అంతఃకరణలో ఉండి.. అజ్ఞానం వల్ల కలిగే చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞానదీపంతో నేను నశింపజేస్తాను. (10.11)
- అర్జునుడు పలికెను: నీవు పరబ్రహ్మవు, పరమ ధామమువు మరియు పరమ పవిత్రుడవు. నిన్ను శాశ్వతుడైన దివ్య పురుషుడిగా, ఆదిదేవుడిగా, పుట్టుక లేనివానిగా, సర్వవ్యాపిగా ఋషులందరూ కొనియాడారు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు నీవు స్వయంగా నాకు అదే చెబుతున్నావు. (10.12-10.13)
- ఓ కేశవా! నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను నమ్ముతున్నాను. ఓ భగవంతుడా! నీ ఆవిర్భావాన్ని దేవతలు కానీ, దానవులు కానీ ఎవరూ ఎరుగరు. (10.14)
- ఓ పురుషోత్తమా! ప్రాణులను సృష్టించేవాడా, ప్రాణులకు అధిపతివైనవాడా, దేవతలకు దేవుడవైనవాడా, విశ్వపాలకా! నిన్ను నీవు మాత్రమే నీ జ్ఞానంతో తెలుసుకోగలవు. (10.15)
- నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకాలన్నింటినీ వ్యాపించి ఉన్నావో.. అట్టి నీ విభూతుల గురించి నాకు పూర్తిగా వివరించవలసిందిగా కోరుతున్నాను. (10.16)
- ఓ యోగీశ్వరా! నిన్ను నిరంతరం ధ్యానిస్తూ నేను ఎలా తెలుసుకోగలను? ఓ భగవంతుడా! ఏ ఏ వస్తువులలో లేదా భావాలలో నిన్ను నేను స్మరించాలి? (10.17)
- ఓ జనార్దనా! నీ యోగ శక్తిని, విభూతులను గురించి నాకు మళ్ళీ వివరంగా తెలుపుము. నీ అమృతప్రాయమైన మాటలను వింటుంటే నాకు తృప్తి కలగడం లేదు (అంటే ఇంకా వినాలని ఉంది). (10.18)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ కురుశ్రేష్ఠా! నా దివ్యమైన విభూతులలో ముఖ్యమైన వాటిని నీకు వివరిస్తాను. ఎందుకంటే నా విభూతుల వివరణకి అంతమే లేదు. (10.19)
- ఓ గుడాకేశా! సమస్త ప్రాణుల హృదయాలలో నివసించే ఆత్మను నేనే. ప్రాణులందరికీ ఆది, మధ్యము మరియు అంతము నేనే. (10.20)
- ద్వాదశ ఆదిత్యులలో నేను విష్ణువును. కాంతినిచ్చే జ్యోతులలో కిరణాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో నేను మరీచిని. నక్షత్రాలలో నేను చంద్రుడిని. (10.21)
- వేదాలలో నేను సామవేదాన్ని. దేవతలలో నేను ఇంద్రుడిని. ఐదు ఇంద్రియాలలో నేను మనస్సును. ప్రాణులలో నేను చైతన్యమును. (10.22)
- ఏకాదశ రుద్రులలో నేను శంకరుడిని. యక్ష రాక్షసులలో నేను కుబేరుడిని. అష్ట వసువులలో నేను అగ్నిని. శిఖరాలు గల పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని. (10.23)
- ఓ పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. సేనాధిపతులలో నేను కుమారస్వామిని. జలాశయాలలో నేను సముద్రాన్ని. (10.24)
- మహర్షులలో నేను భృగు మహర్షిని. మాటలలో ఏకాక్షరమైన ఓంకారమును. యజ్ఞాలన్నింటిలో నేను జపయజ్ఞాన్ని. కదలని వస్తువులలో నేను హిమాలయ పర్వతాన్ని. (10.25)
- వృక్షాలన్నింటిలో నేను రావిచెట్టును. దేవర్షులలో నేను నారదుడిని. గంధర్వులలో నేను చిత్రరథుడిని. సిద్ధులలో నేను కపిలమునిని. (10.26)
- గుర్రాలలో అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు పుట్టిన ఉచ్చైఃశ్రవమును. ఏనుగులలో ఐరావతాన్ని. మనుష్యులలో రాజును నేనే అని తెలుసుకో. (10.27)
- ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని. ఆవులలో నేను కామధేనువును. సంతానాన్ని కలిగించే మన్మథుడిని నేనే. సర్పాలలో నేను వాసుకిని. (10.28)
- నాగులలో నేను శేషనాగును. జలచరాలకు అధిపతియైన వరుణుడిని. పితృదేవతలలో నేను అర్యముడిని. శిక్షించేవారిలో నేను యమధర్మరాజును. (10.29)
- దైత్యులలో నేను ప్రహ్లాదుడిని. లెక్కించేవాటిలో నేను కాలాన్ని. జంతువులలో నేను సింహాన్ని. పక్షులలో నేను గరుత్మంతుడిని. (10.30)
- పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జలచరాలలో మొసలిని, మరియు ప్రవహించే నదులలో గంగా నదిని. (10.31)
- ఓ అర్జునా! సృష్టికి ఆది, అంతము మరియు మధ్యము నేనే. విద్యలన్నింటిలో మోక్షాన్నిచ్చే అధ్యాత్మ విద్యను. తర్కించేవారిలో సత్యాన్ని నిర్ణయించే వాదాన్ని నేనే. (10.32)
- అక్షరాలలో మొదటిదైన ‘అ’ కారమును. సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని. నాశనం లేని కాలాన్ని నేనే. సర్వవ్యాపియైన పోషకుడిని నేనే. (10.33)
- అందరినీ హరించే మృత్యువును నేనే. ఇకముందు పుట్టబోయే వారికి కారణాన్ని నేనే. స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, మేధస్సు, ధైర్యం మరియు క్షమ అనే గుణాలు నేనే. (10.34)
- సామవేద మంత్రాలలో బృహత్సామను. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును. నెలలలో మార్గశీర్ష మాసాన్ని. ఋతువులలో పూలు వికసించే వసంత ఋతువును. (10.35)
- వంచించేవారిలో జూదాన్ని. తేజస్సు గలవారిలో తేజస్సును. విజేతలలో విజయాన్ని. ప్రయత్నించేవారిలో నిశ్చయాన్ని. సాత్విక గుణం గలవారిలో సత్త్వ గుణాన్ని నేనే. (10.36)
- వృష్ణి వంశీయులలో వాసుదేవుడిని. పాండవులలో అర్జునుడిని. మునులలో వేదవ్యాసుడిని. కవులలో శుక్రాచార్యుడిని. (10.37)
- శిక్షించేవారిలో దండనను. విజయాన్ని కోరేవారిలో నీతిని. రహస్యాలలో మౌనాన్ని. జ్ఞానులలో జ్ఞానాన్ని నేనే. (10.38)
- ఓ అర్జునా! సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర సృష్టిలో నా ప్రమేయం లేకుండా ఏ వస్తువు కూడా ఉండదు. (10.39)
- ఓ పరంతప! నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నీకు వివరించినది నా అనంతమైన విభూతులలో ఒక చిన్న భాగం మాత్రమే. (10.40)
- ఐశ్వర్యంతో కూడినవి, శోభాయమానమైనవి, శక్తివంతమైనవి ఏ ఏ వస్తువులు ఉన్నాయో.. అవన్నీ నా తేజస్సులోని ఒక చిన్న అంశం నుండి పుట్టినవేనని తెలుసుకో. (10.41)
- ఓ అర్జునా! ఈ వివరాలన్నీ నీకెందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ అనంతమైన జగత్తునంతటిని నేను నాలోని ఒక చిన్న అంశతో ధరించి, దీనికంతటికీ ఆధారమై ఉన్నాను. (10.42)
అధ్యాయం 11: విశ్వరూపసందర్శన యోగం
- అర్జునుడు పలికెను: నన్ను అనుగ్రహించడం కోసం అత్యంత రహస్యమైన, ఆధ్యాత్మికమైన విషయాలను నీవు నాకు వివరించావు. నీ అమృత వాక్కుల వల్ల నా అజ్ఞానం తొలగిపోయింది. (11.1)
- ఓ కమలాల వంటి కన్నులు గలవాడా! ప్రాణుల ఉత్పత్తి, లయాల గురించి నీ నుండి వివరంగా విన్నాను. అలాగే నీ నాశనం లేని గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాను. (11.2)
- ఓ పరమేశ్వరా! నిన్ను నీవు ఎలా వర్ణించుకున్నావో అది నిజమే. కానీ ఓ పురుషోత్తమా! నీ యొక్క దివ్యమైన విశ్వరూపమును నేను కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాను. (11.3)
- ఓ ప్రభో! నీ యొక్క ఆ రూపాన్ని చూడటం నాకు సాధ్యమే అని నీవు భావిస్తే.. ఓ యోగేశ్వరా! నీ అక్షరమైన దివ్య స్వరూపాన్ని నాకు చూపించుము. (11.4)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా! వందల కొద్దీ, వేల కొద్దీ ఉన్న నా దివ్య రూపాలను చూడు. అవి రకరకాలుగా, అనేక రంగులలో, అనేక ఆకృతులలో ఉన్నాయి. (11.5)
- ఓ భారత! నా యందు ద్వాదశ ఆదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడు. ఇంతకుముందు ఎవరూ చూడని అనేక అద్భుతాలను నాలో చూడుము. (11.6)
- ఓ గుడాకేశా! చరాచర ప్రాణులతో కూడిన ఈ సమస్త జగత్తును నా విశ్వ రూపము యందే దర్శించుము. ఇంకా నీవు ఏమి చూడాలని కోరుకుంటున్నావో అన్నీ ఇక్కడే చూడుము. (11.7)
- కానీ, నా యొక్క విశ్వ రూపమును సాధారణ కళ్లతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. (11.8)
- సంజయుడు పలికెను: ఓ రాజా! మహాయోగేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి, అర్జునుడికి తన అత్యున్నతమైన, దివ్యమైన ఐశ్వర రూపాన్ని చూపించాడు. (11.9)
- ఆ రూపం అనేక ముఖాలతో, అనేక నేత్రాలతో, చూడముచ్చటైన అనేక అద్భుత దృశ్యాలతో ఉంది. అది అనేక దివ్య ఆభరణాలను ధరించి, ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక దివ్య ఆయుధాలను కలిగి ఉంది. ఆ రూపం దివ్యమైన మాలలను, వస్త్రాలను ధరించి ఉంది. దివ్యమైన గంధం పూసుకోబడి ఉంది. సర్వ ఆశ్చర్యాలతో నిండి, అంతం లేనిదై, అన్ని వైపులా ముఖాలు కలిగి వెలిగిపోతోంది. (11.10-11.11)
- ఆకాశంలో ఒకేసారి వెయ్యి సూర్యులు ఉదయిస్తే ఎంతటి వెలుగు కలుగుతుందో.. ఆ మహాత్ముని విశ్వరూప ప్రకాశం అంతటి తేజస్సుతో ఉంది. (11.12)
- అప్పుడు అర్జునుడు ఆ దేవదేవుని శరీరంలో.. అనేక భాగాలుగా విడిపోయి ఉన్న ఈ సమస్త జగత్తును ఒక్కచోటే చూశాడు. (11.13)
- అప్పుడు అర్జునుడు అత్యంత ఆశ్చర్యంతో, పులకించిపోయి విశ్వరూపధారియైన భగవంతునికి తలవంచి నమస్కరించి, చేతులు జోడించి ఇలా పలికాడు. (11.14)
- అర్జునుడు పలికెను: ఓ దేవా! నీ దేహంలో దేవతలందరినీ, రకరకాల ప్రాణుల సమూహాలను చూస్తున్నాను. కమలంలో కూర్చున్న బ్రహ్మదేవుని, పరమేశ్వరుని, సమస్త ఋషులను మరియు దివ్యమైన సర్పాలను నీ యందు చూస్తున్నాను. (11.15)
- ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! అనేక చేతులు, ఉదరములు, ముఖాలు, కన్నులతో అనంతమైన రూపంతో ఉన్న నిన్ను అన్ని వైపులా చూస్తున్నాను. నీకు అంతము, మధ్యము లేదా ఆది ఏదీ నాకు కనిపించడం లేదు. (11.16)
- కిరీటము, గద, చక్రము ధరించి.. అంతటా వెలుగులు జిమ్ముతున్న తేజోరాశిని చూస్తున్నాను. మండుతున్న అగ్ని వలె, సూర్యుని వలె ప్రకాశిస్తున్న నిన్ను కళ్లతో చూడటం చాలా కష్టంగా ఉంది. (11.17)
- నీవు తెలుసుకోదగిన పరమ అక్షర పరబ్రహ్మవు. ఈ విశ్వానికి నీవే పరమ ఆధారానివి. మార్పు లేనివాడివి, శాశ్వత ధర్మాన్ని రక్షించేవాడివి. నీవు సనాతన పురుషుడవని నా నిశ్చితాభిప్రాయం. (11.18)
- ఆది, మధ్య, అంతము లేనివాడవు, అనంతమైన శక్తి గలవాడవు, అనంతమైన బాహువులు మరియు చంద్రసూర్యులే కన్నులుగా కలిగిన నిన్ను చూస్తున్నాను. నీ ముఖం ప్రజ్వరిల్లే అగ్ని వలె ఉంది. నీ తేజస్సుతో ఈ విశ్వాన్ని తపింపజేస్తున్నావు. (11.19)
- ఆకాశానికి, భూమికి మధ్య ఉన్న ఖాళీ అంతా, దిక్కులన్నీ నీ ఒక్కడి చేతనే వ్యాపించి ఉన్నాయి. ఓ మహాత్మా! నీ ఈ అద్భుతమైన భయంకర రూపాన్ని చూసి మూడు లోకాలు భయంతో వణికిపోతున్నాయి. (11.20)
- ఆ దేవతల సమూహాలన్నీ నీ లోపలికే ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు ‘శుభం కలుగుగాక’ అని పలుకుతూ అనేక స్తోత్రాలతో నిన్ను స్తుతిస్తున్నారు. (11.21)
- రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్విని దేవతలు, మరుత్తులు, పితృదేవతలు .. గంధర్వ, యక్ష, అసుర, సిద్ధ సమూహాలన్నీ ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నాయి. (11.22)
- ఓ మహాబాహో! అనేక ముఖాలు, కళ్లు, బాహువులు, తొడలు, పాదాలు, ఉదరములు కలిగి.. భయంకరమైన కోరలతో ఉన్న నీ ఈ మహా రూపాన్ని చూసి లోకాలన్నీ గజగజ వణికిపోతున్నాయి, నేను కూడా అలాగే భయపడుతున్నాను. (11.23)
- ఓ విష్ణో! ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న, ప్రజ్వరిల్లుతున్న అనేక రంగులు గల, తెరిచిన నోళ్లు, భయంకరమైన పెద్ద కళ్లు గల నిన్ను చూసి నా అంతరాత్మ వణికిపోతోంది. నాకు ధైర్యము కానీ, మనశ్శాంతి కానీ కలగడం లేదు. (11.24)
- ప్రళయకాల అగ్ని వలె భయంకరమైన కోరలు గల నీ ముఖాలను చూస్తుంటే నాకు దిక్కులు తెలియడం లేదు, సుఖము కలగడం లేదు. ఓ దేవేశా! జగన్నివాసా! నాపై ప్రసన్నుడవు కమ్ము. (11.25)
- ధృతరాష్ట్రుని కుమారులు, ఇతర రాజుల సమూహాలు, భీష్ముడు, ద్రోణుడు, ఆ కర్ణుడు (సూతపుత్రః) మరియు మన పక్షాన ఉన్న యోధ ముఖ్యులు కూడా వేగంగా నీ భయంకరమైన నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. కొందరు నీ పళ్ల సందుల్లో చిక్కుకుని, తలలు చూర్ణమై కనిపిస్తున్నారు. (11.26-27)
- నదుల యొక్క అనేక జలప్రవాహాలు సముద్రం వైపు ఎలా పరుగెత్తుతాయో, అలాగే ఈ మనుష్య లోక వీరులందరూ నీ ప్రజ్వరిల్లుతున్న నోళ్లలోకి దూకుతున్నారు. (11.28)
- మిడతలు తమ నాశనం కోసం మండుతున్న అగ్నిలోకి ఎలా వేగంగా దూకుతాయో, అలాగే ఈ జనులందరూ తమ వినాశనం కోసం నీ నోళ్లలోకి అతివేగంగా ప్రవేశిస్తున్నారు. (11.29)
- ఓ విష్ణో! నీవు మండుతున్న నోళ్లతో లోకాలన్నింటినీ మింగుతూ, అన్ని వైపులా నాలుకతో ఆస్వాదిస్తున్నావు. నీ భయంకరమైన తేజస్సు ఈ జగత్తంతటా వ్యాపించి తపింపజేస్తోంది. (11.30)
- ఓ దేవదేవా! ఉగ్రరూపంలో ఉన్న నీవు అసలు ఎవరివో నాకు చెప్పు. నీకు నమస్కరిస్తున్నాను, నాపై ప్రసన్నుడవు కమ్ము. ఆదిపురుషుడవైన నిన్ను నేను విజ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నీ ఈ భీకర ప్రవృత్తి నాకు అర్థం కావడం లేదు. (11.31)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: నేను లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని. ఇప్పుడు ఈ లోకాలను అంతం చేయడానికి సిద్ధమయ్యాను. నీవు యుద్ధం చేయకపోయినా, ఇక్కడ ఇరుపక్షాలలో ఉన్న యోధులెవరూ బ్రతకరు. (11.32)
- కాబట్టి, ఓ అర్జునా! లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ ఇప్పటికే నా చేత చంపబడ్డారు నీవు కేవలం ఒక నిమిత్తమాత్రుడవుగా ఉండు. (11.33)
- ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మరియు ఇతర యోధులందరినీ ఇప్పటికే నేను సంహరించాను. కాబట్టి నీవు భయపడకుండా వారిని ఎదురించు. యుద్ధం చేయు, రణరంగంలో శత్రువులను నీవు తప్పక జయిస్తావు. (11.34)
- సంజయుడు పలికెను: శ్రీకృష్ణుని మాటలు విన్న అర్జునుడు వణుకుతూ, చేతులు జోడించి నమస్కరించాడు. భయంతో కూడిన భక్తితో, గద్గద స్వరంతో కృష్ణునికి మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తూ ఇలా పలికాడు. (11.35)
- అర్జునుడు పలికెను: ఓ హృషీకేశా! నీ నామ సంకీర్తనతో లోకమంతా ఆనందిస్తోంది, నీపై ప్రేమను పెంచుకుంటోంది. రాక్షసులు భయంతో దిక్కులు పట్టి పారిపోతున్నారు. సిద్ధ పురుషులందరూ నీకు నమస్కరిస్తున్నారు. ఇదంతా సముచితమే. (11.36)
- ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటే గొప్పవాడవు, సృష్టికి మూలకారకుడవైన నీకు వారు ఎందుకు నమస్కరించరు? ఓ అనంతా! దేవేశా! జగన్నివాసా! నీవు అక్షర పరబ్రహ్మవు. సత్ (ఉన్నది), అసత్ (లేనిది) మరియు వాటికి అతీతమైన తత్త్వము కూడా నీవే. (11.37)
- నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు. ఈ విశ్వానికి పరమ ఆధారానివి. సర్వము తెలిసినవాడివి, తెలుసుకోదగిన వస్తువువు మరియు పరమ పదానివి నీవే. ఓ అనంతరూపా! ఈ విశ్వమంతా నీ చేతనే వ్యాపించబడి ఉంది. (11.38)
- ఓ కృష్ణా! వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి మరియు బ్రహ్మకు తండ్రివైన ప్రపితామహుడివి కూడా నీవే. నీకు వేలసార్లు నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ నీకు ప్రణామం చేస్తున్నాను. (11.39)
- ఓ సర్వస్వరూపా! నీకు ముందు వైపు నుండి, వెనుక వైపు నుండి మరియు అన్ని వైపుల నుండి నమస్కారాలు. అనంతమైన పరాక్రమం, అమితమైన సామర్థ్యము గల నీవు అంతటా వ్యాపించి ఉన్నావు, అందుకే నీవు ‘సర్వము’ అయ్యావు. (11.40)
- నీ ఈ దివ్య మహిమను తెలియక, కేవలం నా స్నేహితుడవని భావించి, చనువుతో కానీ, పొరపాటున కానీ ‘ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ మిత్రమా’ అని పిలిచి ఉంటాను. ఆ తప్పులను క్షమించు. ఓ అచ్యుతా! ఆటపాటలలో, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు లేదా భోజన సమయంలో, నిన్ను పరిహాసం కోసం అవమానించి ఉంటే, అందరి ముందైనా లేదా ఏకాంతంలోనైనా నేను చేసిన అపరాధాలను, అప్రమేయుడవైన నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను. (11.41-11.42)
- ఈ చరాచర జగత్తుకు నీవే తండ్రివి, పూజ్యుడవు, గొప్ప గురువువు. సాటిలేని ప్రభావం గలవాడా! మూడు లోకాలలో నీకు సమానుడైన వాడు లేనప్పుడు, నీకంటే అధికుడైన వాడు ఇంకెక్కడ ఉంటాడు? (11.43)
- అందుకే, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాను. తండ్రి కొడుకు తప్పులను, స్నేహితుడు స్నేహితుని తప్పులను, ప్రియుడు ప్రియురాలి తప్పులను సహించినట్లుగా.. నా అపరాధాలను కూడా నీవు క్షమించాలి. (11.44)
- ఓ దేవా! ఇంతకుముందెన్నడూ చూడని నీ ఈ రూపాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను, కానీ నా మనస్సు భయంతో వణికిపోతోంది. ఓ దేవేశా! జగన్నివాసా! నాపై అనుగ్రహం చూపి, నీ ఆ దివ్యమైన శాంత రూపాన్నే నాకు మళ్ళీ చూపించుము. (11.45)
- ఓ సహస్ర బాహో! విశ్వమూర్తే! నిన్ను కిరీటము, గద, చక్రము ధరించిన నీ పూర్వపు చతుర్భుజ రూపంలోనే చూడాలని కోరుకుంటున్నాను. నీవు మరల ఆ రూపమునే ధరించుము. (11.46)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా! నీపై గల ప్రసన్నతతో నా యోగశక్తి ద్వారా తేజోమయమైనది, అనంతమైనది, సనాతనమైన నా ఈ పరమ విశ్వరూపాన్ని నీకు చూపించాను. నీవు తప్ప మరెవ్వరూ ఇంతకుముందు ఈ రూపాన్ని చూడలేదు. (11.47)
- ఓ కురుశ్రేష్ఠా! ఈ మనుష్య లోకంలో వేద పఠనాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ, దానాల వల్ల కానీ, కర్మకాండల వల్ల కానీ లేదా ఉగ్రమైన తపస్సుల వల్ల కానీ.. ఏ ఒక్కరి చేత కూడా నా ఈ విశ్వరూపం చూడటం సాధ్యం కాదు. ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైంది. (11.48)
- నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయాన్ని వీడి, ప్రసన్నమైన మనస్సుతో నా ఈ పూర్వ రూపాన్నే మళ్ళీ చూడుము. (11.49)
- సంజయుడు పలికెను: వాసుదేవుడు అర్జునునితో ఇలా చెప్పి, తన తన యొక్క చతుర్భుజ సాకార రూపాన్ని మళ్ళీ చూపించాడు. తదుపరి, సౌమ్యమైన మానవ రూపమును స్వీకరించి, భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను. (11.50)
- అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! నీ ఈ అతి సుందరమైన, సౌమ్యమైన మనుష్య రూపాన్ని చూసి ఇప్పుడు నేను తేరుకున్నాను. నా మనస్సు ప్రశాంతత పొంది, నేను మళ్ళీ నా సహజ స్థితికి చేరుకున్నాను. (11.51)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: నీవు చూసిన నా ఈ రూపం చూడటం చాలా కష్టం. దేవతలు కూడా నా ఈ రూపాన్ని చూడాలని ఎల్లప్పుడూ ఆరాటపడుతుంటారు. (11.52)
- నీవు ఇప్పుడు నన్ను ఏ విధంగా చూశావో.. అట్టి రూపాన్ని కేవలం వేద పఠనం వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, దానాల వల్ల కానీ లేదా యజ్ఞాల వల్ల కానీ చూడటం సాధ్యం కాదు. (11.53)
- ఓ పరంతప! కేవలం అనన్యమైన భక్తితో మాత్రమే నన్ను యదార్థంగా తెలుసుకోవడం, నన్ను దర్శించడం మరియు నాలో ప్రవేశించడం సాధ్యమవుతుంది. (11.54)
- ఓ పాండవా! ఎవరు నా కోసమే పనులు చేస్తారో, నన్నే పరమ గతిగా భావిస్తారో, నా యందే భక్తి కలిగి ఉంటారో, లౌకిక విషయాల పట్ల ఆసక్తి లేనివారై, సమస్త ప్రాణుల యెడల ద్వేషం లేకుండా ఉంటారో.. అట్టి వారు నిశ్చయంగా నన్ను చేరుకుంటారు. (11.55)
అధ్యాయం 12: భక్తి యోగం
- అర్జునుడు పలికెను: ఈ విధంగా నిరంతరం నీపైనే మనసు లగ్నం చేసి, రూపం ఉన్న నిన్ను సేవించే భక్తులు కొందరు; అలా కాకుండా కంటికి కనపడని, నాశనం లేని పరబ్రహ్మాన్ని ఉపాసించే వారు మరికొందరు. వీరిలో ఎవరు శ్రేష్ఠులు? (12.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఎవరైతే తమ మనస్సును నా యందే లీనం చేసి, నిత్యం నాపై ఏకాగ్రతతో ఉండి, గొప్ప శ్రద్ధతో నన్ను ఆరాధిస్తారో… వారే అత్యుత్తమ యోగులని నా అభిప్రాయం. (12.2)
- అయితే, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని, అన్నివేళలా సమబుద్ధితో ఉంటూ, సర్వ ప్రాణుల మేలును కోరేవారు … వర్ణించడానికి వీలుకాని, సర్వవ్యాప్తమైన, మార్పు లేని ఆ నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించినా కూడా, వారు చివరికి నన్నే చేరుకుంటారు. (12.3-4)
- మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి కష్టం ఎక్కువ. ఎందుకంటే, దేహమే తాననే భావన ఉన్న మనుషులకు, కంటికి కనిపించని లక్ష్యాన్ని చేరుకోవడం చాలా దుఃఖంతో కూడుకున్న పని. (12.5)
- కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను. వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది. (12.6-7)
- కాబట్టి అర్జునా! నీ మనస్సును నా యందే నిలుపు. నీ బుద్ధిని నా యందే లగ్నం చేయి. అప్పుడు నీవు కచ్చితంగా నాలోనే నివసిస్తావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. (12.8)
- ఓ ధనంజయా! ఒకవేళ నీవు నీ మనస్సును నాపై స్థిరంగా నిలపలేకపోతే, అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు. (12.9)
- నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా నీవు చేసే ప్రతి పనిని భగవత్కార్యంగా భావించి చేస్తూ కూడా పరమ గతిని పొందవచ్చు. (12.10)
- అర్జునా! ఒకవేళ నీవు నా కొరకు కర్మలు చేయడం కూడా చేయలేకపోతే… అప్పుడు నీ మనస్సును అదుపులో ఉంచుకుని, నీవు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని త్యాగం చేయుము. (12.11)
- అవగాహన లేని అభ్యాసం కంటే జ్ఞానం మేలు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్ఠం. ధ్యానం కంటే కర్మఫల త్యాగం మిన్న. ఎందుకంటే ఫలితం మీద ఆశ వదిలేసిన వెంటనే మనిషికి అనంతమైన శాంతి లభిస్తుంది. (12.12)
- ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరి పట్ల స్నేహంగా, దయతో ఉండేవారు, ‘నాది’ అనే మమకారం, ‘నేను’ అనే అహంకారం లేనివారు, సుఖదుఃఖాలను సమానంగా చూసేవారు, ఓర్పు గలవారు… ఎప్పుడూ సంతుష్టిగా ఉంటూ, నిశ్చలమైన మనస్సుతో తన బుద్ధిని నాకే అర్పించిన భక్తుడు నాకు చాలా ఇష్టం. (12.13-14)
- లోకమున ఎవ్వరినీ బాధ పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, భయము మరియు ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. (12.15)
- దేనిపైనా ఆశ లేనివాడు, బాహ్యంగానూ అంతరంగంలోనూ శుచిగా ఉండేవారు, కార్యదక్షత కలవారు, పక్షపాతం లేనివారు, మనస్తాపం లేనివారు, ఫలితాన్ని కోరి పనులు మొదలుపెట్టని వారు నాకు ఇష్టులైన భక్తులు. (12.16)
- ఇష్టమైనది జరిగినప్పుడు అతిగా పొంగిపోనివాడు, అనిష్టమైనది జరిగినప్పుడు ద్వేషించనివాడు, దేనికోసం శోకించనివాడు, దేనినీ ఆశించనివాడు, మంచిని చెడును రెండింటినీ సమానంగా చూసే భక్తి గలవాడు నాకు ప్రియుడు. (12.17)
- శత్రువు పట్ల, మిత్రుని పట్ల సమబుద్ధి కలిగి ఉండటం; గౌరవ అవమానాలను, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను సమానంగా చూడటం; దేనికీ అంటుకోకుండా ఉండటం; నిందాస్తుతులను సమానంగా భావించే మౌని; ఏది లభిస్తే దానితో తృప్తి పడేవాడు; ఇల్లు అనే మమకారం లేనివాడు; స్థిరమైన బుద్ధి కలవాడు నాకు ప్రియమైన భక్తుడు. (12.18-19)
- చెప్పిన విధంగా, అమృతం వంటి ఈ ధర్మాన్ని శ్రద్ధతో అనుసరిస్తూ, నన్నే పరమగతిగా భావించే భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు. (12.20)
అధ్యాయం 13: క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం
- అర్జునుడు పలికెను: కేశవా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము మరియు జ్ఞేయము… వీటి గురించి నేను వివరంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. (13.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ కౌంతేయా! ఈ శరీరమే ‘క్షేత్రము’ అని పిలవబడుతుంది. ఈ శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వారిని జ్ఞానులు ‘క్షేత్రజ్ఞుడు’ అని పిలుస్తారు. (13.2)
- ఓ భారతా! సమస్త క్షేత్రములలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే నిజమైన ‘జ్ఞానము’ అని నా అభిప్రాయం. (13.3)
- ఆ క్షేత్రము అంటే ఏమిటి? దాని స్వభావం ఎలాంటిది? అందులో కలిగే మార్పులేమిటి? అది దేని నుండి పుట్టింది? అలాగే ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆయన ప్రభావం ఏమిటి? వీటన్నింటినీ సంక్షిప్తంగా నా ద్వారా విను. (13.4)
- ఈ విషయాలను ఎందరో ఋషులు పలు విధాలుగా గానం చేశారు. వివిధ వేద మంత్రాలలో, అలాగే హేతుబద్ధమైన బ్రహ్మసూత్ర పదాలలో కూడా ఇవి నిరూపించబడ్డాయి. (13.5)
- మహాపంచభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఐదు ఇంద్రియ విషయాలు మరియు ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము – వీటన్నింటి కలయికనే వికారాలతో కూడిన ‘క్షేత్రము’ అంటారు. (13.6-7)
- గర్వం లేకపోవటం, డాంబికం లేకపోవటం, అహింస, ఓర్పు, నిష్కపటమైన ప్రవర్తన, గురువును సేవించటం, బాహ్య అంతరంగ శుద్ధి, స్థిరత్వం, మనోనిగ్రహం, ఇంద్రియ విషయాల పట్ల వైరాగ్యం, అహంకారం లేకపోవటం, జన్మ-మృత్యు-జర-వ్యాధి-దుఃఖములలోని దోషాలను గుర్తించటం, పుత్రులు, భార్య, ఇల్లు మొదలైన వాటిపై అతిగా ఆసక్తి లేకపోవటం, అనుకూల పరిస్థితులు వచ్చినా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ సమచిత్తంతో ఉండటం – ఇవే జ్ఞానానికి లక్షణాలు. నా యందు అనన్యమైన, ఏకాగ్రతతో కూడిన భక్తిని కలిగి ఉండటం; ఏకాంత ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడటం; ప్రాపంచిక విషయాల గురించి చర్చించే జనసమూహాల పట్ల ఆసక్తి లేకపోవటం, నిరంతరం ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉండటం, పరమార్థ తత్త్వాన్ని తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం – వీటన్నింటిని కలిపి ‘జ్ఞానము’ అంటారు. దీనికి భిన్నమైనదంతా ‘అజ్ఞానము’. (13.8-12)
- దేనిని తెలుసుకుంటే మనిషి అమృతత్వాన్ని పొందుతాడో, ఆ ‘జ్ఞేయము’ గురించి చెబుతాను విను. అది ఆది లేనిది, శ్రేష్ఠమైనది అయిన పరబ్రహ్మము. అది భౌతికమైన ‘సత్తు’ కాదు, అలాగని శూన్యమైన ‘అసత్తు’ కూడా కాదు (అది రెండింటికీ అతీతమైనది). (13.13)
- ఆ పరమాత్మకు అన్ని వైపులా చేతులు, కాళ్లు ఉన్నాయి. అన్ని వైపులా కళ్లు, తలలు, ముఖాలు ఉన్నాయి. ఆ తత్త్వము లోకమంతా చెవులు కలిగి ఉంది. అది అంతటా వ్యాపించి నిలిచి ఉంది. (13.14)
- ఆ పరమాత్మ సమస్త ఇంద్రియాల గుణాలను ప్రకాశింపజేస్తాడు, కానీ ఆయనకు ఇంద్రియాలు లేవు. ఆయన దేనికీ అంటుకోడు, కానీ సమస్తాన్ని భరిస్తాడు. ఆయన నిర్గుణుడు, కానీ ప్రకృతి గుణాలను అనుభవించేవాడు. ఆయన సమస్త భూతాలకు బయటా ఉన్నాడు, లోపలా ఉన్నాడు. కదిలే ప్రాణులలోనూ, కదలని చరాచర జగత్తులోనూ ఆయనే ఉన్నాడు. అత్యంత సూక్ష్మమైనది కావటం వల్ల ఆయన సామాన్యులకు తెలియడు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు, కానీ వాస్తవానికి మనకు అత్యంత దగ్గరలో ఉన్నాడు. ఆ పరమాత్మ విడిపోకుండా అంతటా ఉన్నా, ప్రాణులలో విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఆ తెలుసుకోదగిన తత్త్వమే ప్రాణులను పోషించేది, ప్రళయకాలంలో మింగివేసేది, సృష్టికాలంలో మళ్లీ పుట్టించేది. ఆయన వెలుగునిచ్చే సూర్యచంద్రాదులకు కూడా వెలుగునిచ్చే పరమ జ్యోతి. చీకటి (అజ్ఞానం) కంటే అతీతమైనవాడు. ఆయనే జ్ఞానము, ఆయనే జ్ఞానము ద్వారా తెలుసుకోదగినవాడు, ఆయనే జ్ఞానము ద్వారా పొందదగినవాడు. ఆయన అందరి హృదయాలలో అంతర్యామిగా నివసించి ఉన్నాడు. (13.15-18)
- ఈ విధంగా క్షేత్రము, జ్ఞానము మరియు జ్ఞేయము గురించి సంక్షిప్తంగా వివరించాను. నా భక్తుడు దీనిని గ్రహించి, నా స్వరూపాన్ని పొందడానికి అర్హుడవుతాడు. (13.19)
- ప్రకృతిని, పురుషుడిని కూడా ఆది లేని వారిగా తెలుసుకో. శరీరంలోని వికారాలు, త్రిగుణాలు అన్నీ ప్రకృతి నుండి పుట్టినవని గ్రహించు. (13.20)
- శరీరం మరియు ఇంద్రియాల ద్వారా పనులు జరగడానికి ‘ప్రకృతి’ కారణమని చెప్పబడుతుంది. కానీ ఆ పనుల వల్ల కలిగే సుఖదుఃఖాలను అనుభవించడంలో ‘పురుషుడు’ కారణమని చెప్పబడుతుంది. (13.21)
- ప్రకృతిలో ఉన్న పురుషుడు, ప్రకృతి నుండి పుట్టిన త్రిగుణాలను అనుభవిస్తాడు. వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు ప్రధాన కారణం. (13.22)
- ఈ దేహంలో ఉన్నప్పటికీ పరమాత్మ విలక్షణమైనవాడు. ఆయన సాక్షిగా చూసేవాడు, పనులకు సమ్మతించేవాడు, సర్వానికి ఆధారం, అనుభవించేవాడు, మహేశ్వరుడు. ఆయనే ఈ దేహంలో ఉన్న ‘పరమ పురుషుడు’ లేదా ‘పరమాత్మ’. (13.23)
- ఎవరైతే ఈ విధంగా పురుషుడిని, గుణాలతో కూడిన ప్రకృతిని సరిగ్గా తెలుసుకుంటారో… వారు ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మళ్ళీ పునర్జన్మను పొందరు. (13.24)
- కొందరు ధ్యానం ద్వారా తమలో తాము ఆత్మను దర్శిస్తారు. మరికొందరు జ్ఞాన మార్గం ద్వారా, ఇంకొందరు నిష్కామ కర్మ యోగం ద్వారా ఆత్మను తెలుసుకుంటారు. (13.25)
- ఇవేవీ తెలియని మరికొందరు, జ్ఞానుల ద్వారా విని ఆరాధిస్తారు. కేవలం ఇతరుల ద్వారా విన్నదానిపై నమ్మకం ఉంచి ఉపాసించే వారు కూడా మృత్యురూప సంసారాన్ని తప్పక దాటుతారు. (13.26)
- ఓ భరతశ్రేష్ఠా! లోకంలో సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు కలవడం వల్లే పుడుతున్నాయని తెలుసుకొనుము. (13.27)
- నశించే సమస్త ప్రాణులలో నశించకుండా ఉన్న పరమేశ్వరుడిని ఎవరైతే చూడగలుగుతారో, వారే నిజంగా సత్యాన్ని చూస్తున్నట్లు లెక్క. (13.28)
- అంతటా సమానంగా ఉన్న పరమేశ్వరుడిని దర్శించేవాడు, తన మనస్సుతో తన ఆత్మను అధోగతి పాలు చేసుకోడు. అటువంటి సమదృష్టి కలవాడు పరమ గతిని పొందుతాడు. (13.29)
- సమస్త కర్మలు కేవలం ప్రకృతి చేతనే చేయబడుతున్నాయని, ఆత్మ ఏ పనీ చేయని ‘అకర్త’ అని ఎవరైతే గ్రహిస్తారో, వారే యథార్థాన్ని చూస్తున్న జ్ఞానులు. (13.30)
- ప్రాణులన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ, అవన్నీ ఒకే పరమాత్మ యందు ఉన్నాయని, ఆ పరమాత్మ నుండే ఇవన్నీ విస్తరించాయని ఎప్పుడైతే మనిషి గుర్తిస్తాడో, అప్పుడే అతడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. (13.31)
- ఓ కౌంతేయా! ఈ పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. అందుకే శరీరంలో ఉన్నప్పటికీ, ఏ పనీ చేయదు మరియు ఆ కర్మ ఫలితాలకు అంటుకోదు. (13.32)
- ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, అది అత్యంత సూక్ష్మమైనది కావటం వల్ల దేనితోనూ కలవదు. అలాగే, ఆత్మ శరీరమంతటా ఉన్నప్పటికీ, అది దేహ గుణాలకు లేదా వికారాలకు అంటుకోదు. (13.33)
- ఓ భారతా! ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును ప్రకాశింపచేయును. (13.34)
- ఈ విధంగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు మధ్య గల తేడాను ఎవరైతే ‘జ్ఞాన నేత్రం’తో చూస్తారో, అలాగే ప్రాణులు ప్రకృతి బంధం నుండి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుంటారో, వారు పరమ గతిని పొందుతారు. (13.35)
అధ్యాయం 14: గుణత్రయ విభాగ యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: జ్ఞానములన్నింటిలోనూ అత్యుత్తమమైనది, పరమార్థ విషయమూ అయిన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను. దీనిని తెలుసుకోవడం వల్లే మునులందరూ ఈ సంసార బంధం నుండి విముక్తులై పరమ సిద్ధిని పొందారు. (14.1)
- ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వభావాన్నే పొందిన వారు, సృష్టి కాలంలో మళ్ళీ జన్మించరు, ప్రళయ కాలంలో ఎటువంటి వ్యధను చెందరు. (14.2)
- ఓ భారతా! నాదైన మూల ప్రకృతి ఒక గర్భస్థానం వంటిది. అందులో నేను చేతన అనే బీజాన్ని ఉంచుతాను. దానివల్లే సమస్త భూతముల ఉత్పత్తి జరుగుతోంది. (14.3)
- ఓ అర్జునా! పుట్టిన సమస్త జీవ రాశులకు మూల ప్రకృతియే తల్లీ, నేను బీజాన్ని ప్రసాదించే తండ్రిని. (14.4)
- ఓ మహాబాహో! ప్రకృతి నుండి పుట్టిన సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు, నాశనం లేని ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి. (14.5)
- ఓ పాపరహితుడా! ఆ మూడింటిలో ‘సత్వ గుణం’ నిర్మలమైనది. అది వెలుగునిచ్చేది మరియు వికారాలు లేనిది. అయితే, ఇది మనిషిని “నేను సుఖిని” అనే భావనతో మరియు “నేను జ్ఞానిని” అనే అహంకారంతో బంధిస్తుంది. (14.6)
- ఓ కౌంతేయా! రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. ఇది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల పుడుతుంది. ఇది జీవుడిని “నేను ఈ పనులు చేయాలి” అనే కర్మల పట్ల ఉన్న మమకారంతో బంధిస్తుంది. (14.7)
- ఓ భారతా! ‘తమో గుణం’ అజ్ఞానం నుండి పుడుతు, ప్రాణులందరినీ మోహింపజేస్తుంది. ఇది మనిషిని అజాగ్రత్త, సోమరితనం మరియు అతిగా నిద్రపోవడం అనే లక్షణాలతో బంధిస్తుంది. (14.8)
- సత్వ గుణం మనిషిని సుఖం వైపు ప్రేరేపిస్తుంది. రజో గుణం కర్మల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. కానీ ఓ భారతా! తమో గుణం మాత్రం ఉన్న జ్ఞానాన్ని కూడా కప్పివేసి, మనిషిని పొరపాట్లు లేదా అజాగ్రత్త వైపు మళ్ళిస్తుంది. (14.9)
- ఓ భారతా! మనస్సులో ఈ మూడు గుణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రజస్సును, తమస్సును అణచివేసి సత్వ గుణం పైకి వస్తుంది. అలాగే ఒక్కోసారి సత్వాన్ని, తమస్సును అణచివేసి రజో గుణం; సత్వాన్ని, రజస్సును అణచివేసి తమో గుణం ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. (14.10)
- ఈ దేహంలోని సర్వ ద్వారములందు ఎప్పుడైతే వివేకమనే వెలుగు, జ్ఞానం ఉదయిస్తాయో… అప్పుడు ఆ మనిషిలో సత్వ గుణం వృద్ధి చెందిందని గ్రహించాలి. (14.11)
- ఓ భరతశ్రేష్ఠా! మనిషిలో అత్యాశ, నిరంతరం ఏదో ఒక పని చేయాలనే ధోరణి, స్వప్రయోజనం కోసం పనులు మొదలుపెట్టడం, మనశ్శాంతి లేకపోవడం మరియు కోరికలు… ఇవన్నీ రజో గుణం పెరిగినప్పుడు కనిపిస్తాయి. (14.12)
- ఓ కురునందనా! వివేకం లేకపోవటం, కర్తవ్యం పట్ల విముఖత, అజాగ్రత్త మరియు తెలివితక్కువతనం… ఇవన్నీ తమో గుణం వృద్ధి చెందినప్పుడు కలుగుతాయి. (14.13)
- సత్వ గుణం అధికంగా ఉన్నప్పుడు మరణించిన వాడు జ్ఞానులు పొందే నిర్మలమైన ఉత్తమ లోకాలను పొందుతాడు. (14.14)
- రజో గుణం పెరిగినప్పుడు మరణించిన వాడు కర్మల పట్ల ఆసక్తి గల మనుష్యులలో జన్మిస్తాడు. అలాగే తమో గుణంలో మరణించిన వాడు పశుపక్ష్యాదుల వంటి మూఢ యోనులలో జన్మిస్తాడు. (14.15)
- సాత్విక పనులకు ఫలితం నిర్మలమైన సుఖం. రజో గుణంతో చేసే పనుల ఫలితం దుఃఖం. తమో గుణంతో కూడిన పనుల ఫలితం అజ్ఞానం. (14.16)
- సత్వ గుణం నుండి జ్ఞానం పుడుతుంది. రజో గుణం నుండి లోభం పుడుతుంది. తమో గుణం నుండి అజాగ్రత్త, మోహం మరియు అజ్ఞానం పుడతాయి. (14.17)
- సత్వ గుణంలో ఉండేవారు ఉన్నత లోకాలకు వెళ్తారు. రజో గుణంలో ఉండేవారు మనుష్య లోకంలో ఉంటారు. తక్కువ స్థాయి కలిగిన తమో గుణంలో ఉండేవారు అధోగతిని పొందుతారు. (14.18)
- ఎప్పుడైతే వివేకవంతులు పనులన్నీ కేవలం మూడు గుణాల వల్లే జరుగుతున్నాయని, ఈ గుణాల కంటే వేరైన కర్త ఎవరూ లేరని గ్రహించి, గుణాలకు అతీతమైన నన్ను తెలుసుకుంటారో, వారు నా స్వరూపాన్నే పొందుతారు. (14.19)
- దేహంలో నివసించే జీవుడు, దేహానికి కారణమైన ఈ మూడు గుణాలను దాటినప్పుడు… జన్మ, మృత్యువు, ముసలితనం మరియు దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని అనుభవిస్తాడు. (14.20)
- అర్జునుడు పలికెను: ఓ ప్రభూ! ఈ మూడు గుణాలను దాటిన వాని లక్షణాలు ఏమిటి? అతని ఆచరణ ఎలా ఉంటుంది? అసలు మనిషి ఈ మూడు గుణాలను ఎలా దాటగలడు? (14.21)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పాండవా! సత్వగుణ కార్యమైన ‘ప్రకాశం’, రజోగుణ కార్యమైన ‘ప్రవృత్తి’, తమోగుణ కార్యమైన ‘మోహం’ కలిగినప్పుడు వాటిని ద్వేషించనివాడు… అవి తొలగిపోయినప్పుడు వాటి కోసం ఆశించనివాడు, ఎవడైతే పక్షపాతం లేని వానివలె ఉంటూ, గుణాల ప్రభావానికి లోనుకాడో… “గుణాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి” అని గ్రహించి స్థిరంగా ఉంటాడో, చలించడో, సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు, తన ఆత్మయందే నిలిచినవాడు, మట్టిగడ్డను, రాయిని, బంగారాన్ని సమానంగా భావించేవాడు, ప్రియమైనది జరిగినప్పుడు లేదా అప్రియమైనది ఎదురైనప్పుడు చలించని ధీరుడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు, మాన అవమానాలను సమానంగా చూసేవాడు, శత్రు మిత్రుల పట్ల సమబుద్ధి కలవాడు, కర్తృత్వ భావనతో పనులు మొదలుపెట్టనివాడు… ఇటువంటి లక్షణాలు ఉన్నవానినే ‘గుణాతీతుడు’ అంటారు. (14.22-25)
- ఎవరైతే అచంచలమైన భక్తి యోగంతో నన్ను సేవిస్తారో, వారు ఈ మూడు గుణాలను సులభంగా దాటి, బ్రహ్మ భావాన్ని పొందడానికి అర్హులవుతారు. (14.26)
- ఎందుకంటే – నాశనం లేని నిరాకార బ్రహ్మమునకు, సనాతన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారమును. (14.27)
అధ్యాయం 15: పురుషోత్తమ ప్రాప్తి యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: పైన వేళ్లు (పరమాత్మ), క్రింద కొమ్మలు కలిగి ఉండి, నాశనం లేనిదిగా చెప్పబడే ఒక ‘అశ్వత్థ వృక్షం’ (సంసార వృక్షం) ఉంది. వేద మంత్రాలే ఆ చెట్టుకు ఆకులు. అటువంటి ఈ వృక్ష రహస్యాన్ని తెలిసినవాడే నిజమైన వేదవేత్త. (15.1)
- ఆ వృక్షం యొక్క కొమ్మలు (ప్రాణులు) సత్వ, రజ, తమో గుణాల ద్వారా వృద్ధి చెందుతూ పైన (దేవలోకాలు), క్రింద (మానవ, పశు లోకాలు) విస్తరించి ఉన్నాయి. ఇంద్రియ విషయాలే దానికి చిగుళ్లు. మనుష్య లోకంలో కర్మలను కలిగించే వేళ్లు క్రిందకు కూడా వ్యాపించి ఉన్నాయి. (15.2)
- ఈ సంసార వృక్షం యొక్క అసలు రూపం గానీ, దాని ఆది, అంతం గానీ ఇక్కడ ఎవరికీ అర్థం కాదు. లోతుగా పాతుకుపోయిన వేళ్లు గల ఈ అశ్వత్థ వృక్షాన్ని ‘దృఢమైన వైరాగ్యమనే కత్తి’ తో నరికివేయాలి. ఆ తర్వాత, ఏ స్థితిని పొందితే మనిషి మళ్ళీ తిరిగి రాడో, అటువంటి పరమపదాన్ని వెతకాలి. “దేని నుండి ఈ సనాతన సృష్టి ప్రవృత్తి మొదలైందో, అటువంటి ఆది పురుషుని నేను శరణు వేడుతున్నాను” అని నిశ్చయించుకోవాలి. (15.3-4)
- అహంకారం, మోహం లేనివారు, చెడు సావాసాలను జయించినవారు, నిరంతర ఆత్మజ్ఞానంలో ఉండేవారు, కోరికలు లేనివారు, సుఖదుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన జ్ఞానులు మాత్రమే ఆ శాశ్వతమైన పదవిని పొందుతారు. (15.5)
- ఆ పరమ ధామాన్ని సూర్యుడు గానీ, చంద్రుడు గానీ, అగ్ని గానీ ప్రకాశింపజేయలేవు. ఏ స్థితిని పొందితే భక్తులు మళ్ళీ ఈ సంసారానికి తిరిగి రారో, అదే నా పరమ ధామము. (15.6)
- ఈ లోకంలోని జీవులందరూ నా యొక్క శాశ్వతమైన అంశలే. కానీ ప్రకృతిలో ఉన్న మనస్సు, ఐదు ఇంద్రియాలచే కట్టివేయబడి ఈ జీవుడు సంసారంలో చిక్కుకుంటున్నాడు. (15.7)
- గాలి తనతో పాటు పువ్వుల సువాసనను ఎలాగైతే తీసుకువెళ్తుందో, అలాగే ఈ దేహానికి ప్రభువైన జీవుడు, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళ్ళేటప్పుడు ఈ మనస్సును, ఇంద్రియ సంస్కారాలను తనతో పాటు తీసుకువెళ్తాడు. (15.8)
- ఆ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు మరియు మనస్సును ఆశ్రయించి ఇంద్రియ విషయాలను (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను) అనుభవిస్తాడు. (15.9)
- శరీరాన్ని వదిలి వెళ్తున్నా, శరీరంలో ఉన్నా, లేదా గుణాలతో కూడి విషయాలను అనుభవిస్తున్నా… అజ్ఞానులు ఆ జీవుని చూడలేరు. కేవలం ‘జ్ఞాన నేత్రం’ కలవారు మాత్రమే ఆ తత్త్వాన్ని చూడగలరు. (15.10) (See BG 9.11, BG 4.9)
- ప్రయత్నం చేసే యోగులు తమ హృదయంలోనే వెలిగే ఆ పరమాత్మను చూడగలుగుతారు. కానీ మనశ్శుద్ధి లేనివారు, వివేకం లేనివారు ఎంత ప్రయత్నించినా ఆ తత్త్వాన్ని గ్రహించలేరు. (15.11)
- సూర్యునిలో ఉండి లోకాన్నంతటినీ ప్రకాశింపజేసే తేజస్సు, చంద్రునిలో ఉండే వెలుగు, అగ్నిలో ఉండే దహన శక్తి… ఇవన్నీ నావే అని తెలుసుకో. (15.12)
- నేనే భూమిలో ప్రవేశించి నా శక్తితో సమస్త ప్రాణులను ధరిస్తున్నాను. అలాగే రసస్వరూపుడైన చంద్రుడనై భూమిపై ఉన్న సమస్త ఓషధులను పోషిస్తున్నాను. (15.13)
- నేనే ప్రాణుల దేహాలలో ‘వైశ్వానరుడు’ అనే అగ్నిగా మారి, ప్రాణ-అపాన వాయువులతో కలిసి వారు తీసుకునే నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను. (15.14)
- నేను అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నాను. నా వల్లే మనిషికి స్మృతి, జ్ఞానము మరియు మరపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతాన్ని రచించినవాడిని, వేదాల పరమార్థం తెలిసినవాడిని నేనే. (15.15)
- ఈ లోకంలో రెండు రకాల పురుషులు ఉన్నారు. ఒకటి క్షర (నశించే శరీరాలు/ప్రకృతి), రెండు అక్షర (మార్పు లేని జీవాత్మ). (15.16)
- కానీ వీరిద్దరికంటే భిన్నమైనవాడు, ఉత్తమమైనవాడు ఒకడున్నాడు, ఆయనే పరమాత్మ. ఆయన మూడు లోకాలలో ప్రవేశించి అందరినీ పోషిస్తున్న అవ్యయమైన ఈశ్వరుడు. (15.17)
- నేను నశించే ప్రకృతి (క్షర) కంటే అతీతుడను, నాశనం లేని జీవుని (అక్షర) కంటే ఉత్తముడను కాబట్టి… లోకంలోనూ, వేదాలలోనూ నన్ను ‘పురుషోత్తముడు’ అని పిలుస్తారు. (15.18)
- ఓ భారతా! ఏ మనిషి అయితే మోహానికి లోనుకాకుండా నన్ను ఈ విధంగా ‘పురుషోత్తమునిగా’ గుర్తిస్తాడో… అతడే సర్వజ్ఞుడు. అతడు నన్ను సర్వ భావాలతో భజిస్తాడు. (15.19)
- ఓ పాపరహితుడా! అత్యంత రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు వివరించాను. ఓ భారతా! దీనిని గ్రహించిన మనిషి నిజమైన బుద్ధిమంతుడు అవుతాడు మరియు తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నవాడు అవుతాడు. (15.20)
అధ్యాయం 16: దైవాసుర సంపద విభాగ యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ భారతా! దైవీ గుణాలతో పుట్టిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి: భయం లేకపోవటం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండటం, దానగుణం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదాధ్యయనం, తపస్సు, నిష్కపటమైన ప్రవర్తన, అహింస, సత్యం, కోపం లేకపోవటం, త్యాగబుద్ధి, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, ప్రాణుల పట్ల దయ, లోభం లేకపోవటం, మృదు స్వభావం, తప్పు చేయడానికి భయపడటం, చంచలత్వం లేకపోవటం, తేజస్సు, క్షమ, మనఃస్థైర్యము, బాహ్య-అంతర శుద్ధి, ఎవరికీ ద్రోహం చేయకపోవటం మరియు అతిగా గర్వించకపోవటం. (16.1-3)
- ఓ పార్థా! ఆసురీ గుణాలతో పుట్టిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి: గొప్పలు చెప్పుకోవటం, గర్వం, అహంకారం, కోపం, కఠినంగా మాట్లాడటం మరియు అజ్ఞానము. (16.4)
- దైవీ సంపద మోక్షానికి దారితీస్తుంది. ఆసురీ సంపద బంధనానికి కారణమవుతుంది. ఓ పాండవా! నీవు బాధపడకు, ఎందుకంటే నీవు దైవీ సంపదతోనే జన్మించావు. (16.5)
- ఈ లోకంలో ప్రాణుల సృష్టి రెండు రకాలుగా ఉంటుంది – ఒకటి దైవము, రెండు ఆసురము. దైవీ స్వభావం గురించి వివరంగా చెప్పాను. ఇప్పుడు ఆసుర స్వభావం గురించి నా నుండి విను. (16.6)
- ఆసురీ స్వభావం గలవారికి ఏ పని చేయాలో (ప్రవృత్తి), ఏ పని మానుకోవాలో (నివృత్తి) తెలియదు. వారిలో శుచి ఉండదు, మంచి ఆచరణ ఉండదు, సత్యం అసలే ఉండదు. (16.7)
- ఆసుర స్వభావం కలవారు – “ఈ జగత్తు సత్యం కాదు, దీనికి ఎటువంటి ఆధారం లేదు, దీనిని నడిపించే దేవుడు లేడు. ఇది కేవలం స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టింది, కామమే దీనికి మూలం” అని అంటారు. (16.8)
- ఇటువంటి తప్పుడు దృష్టిని కలిగి ఉండటం వల్ల, ఆ అల్పబుద్ధి గలవారు తమ ఆత్మను తామే నశింపజేసుకుంటారు. వారు క్రూరమైన పనులు చేస్తూ, లోకానికి హాని కలిగిస్తూ, జగత్తు వినాశనం కోసం పుడతారు. (16.9)
- వారు ఎన్నటికీ తీరని కోరికలను ఆశ్రయించి, డంబం, గర్వం, మదంతో నిండి ఉంటారు. మోహం వల్ల తప్పుడు సిద్ధాంతాలను తలకెక్కించుకుని, అపవిత్రమైన పనులు చేస్తూ లోకంలో తిరుగుతుంటారు. (16.10)
- ఆసుర స్వభావం గలవారు మరణం వరకు ముగియని, అపరిమితమైన చింతలను ఆశ్రయించి ఉంటారు. ఇంద్రియ సుఖాలను అనుభవించడమే జీవిత పరమావధి అని వారు గట్టిగా నమ్ముతారు. వందలాది ఆశలనే పాశాల చేత బంధించబడి, కామక్రోధాలకు బానిసలై, తమ ఇంద్రియ తృప్తి కోసం అన్యాయ మార్గాల ద్వారా ధన సంపాదనకు ప్రయత్నిస్తారు. (16.11-12)
- వారి మనసులో నిరంతరం ఇలాంటి ఆలోచనలే ఉంటాయి: “ఈరోజు ఈ లాభం పొందుతాను, రేపు ఆ కోరికను తీర్చుకుంటాను.”, “నా దగ్గర ఇంత ధనం ఉంది, భవిష్యత్తులో ఇంకా వస్తుంది.” “ఈ శత్రువును చంపేశాను, మిగిలిన వారిని కూడా అంతం చేస్తాను.”, “నేనే ఈశ్వరుడిని, నేనే భోగిని, నేనే సర్వ సిద్ధులు కలవాడిని, నేనే బలవంతుడిని మరియు సుఖవంతుడిని.” “నేను గొప్ప ధనవంతుడిని, ఉన్నత వంశీయుడిని; నాకంటే గొప్పవాడు ఎవడు? నేను యజ్ఞాలు చేస్తాను (పేరు కోసం), దానాలిస్తాను, ఆనందిస్తాను.” ఇలా వారు అజ్ఞానంతో భ్రమించి ఉంటారు. అనేక రకాల ఆలోచనలతో కలవరపడి, మోహమనే వలలో చిక్కుకొని, ఇంద్రియ భోగాల యందే మునిగిపోయి… అటువంటి వారు చివరకు అత్యంత అపవిత్రమైన నరకంలో పడతారు. (16.13-16)
- వారు తమను తామే పొగుడుకుంటూ, గర్వంతో, ధన మదంతో నిండిపోయి, శాస్త్ర విధిని పక్కన పెట్టి, కేవలం సమాజంలో పేరు కోసం నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. అహంకారం, బలం, గర్వం, కామ క్రోధాలను ఆశ్రయించి, తమ శరీరంలోనూ మరియు ఇతరుల శరీరాలలోనూ అంతర్యామిగా ఉన్న నన్ను (పరమాత్మను) ద్వేషిస్తూ, అసూయతో ప్రవర్తిస్తారు. (16.17-18)
- అటువంటి ద్వేషించే క్రూరులను, పాపాత్ములను, నరాధములను నేను సంసార చక్రంలో ఎల్లప్పుడూ అశుభకరమైన ఆసుర యోనులలోనే పడేస్తాను. (16.19)
- ఓ కౌంతేయా! అటువంటి ఆసుర జన్మలను పొందిన మూఢులు జన్మజన్మలకూ నన్ను చేరుకోలేక, అంతకంతకూ మరింత అధమ గతిని పొందుతారు. (16.20)
- ఆత్మను అధోగతి పాలు చేసే నరక ద్వారాలు మూడు: 1. కామము (కోరిక), 2. క్రోధము (కోపం), 3. లోభము (అత్యాశ/పిసినారితనం). ఇవి మనిషిని నిలువునా ముంచేస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ మూడింటిని ఖచ్చితంగా వదిలిపెట్టాలి. (16.21)
- ఓ కౌంతేయా! ఈ మూడు తమో ద్వారాల నుండి విముక్తుడైన మనిషి, తన ఆత్మ శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తాడు. తద్వారా అతడు పరమ గతిని పొందుతాడు. (16.22)
- ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు. (16.23)
- కాబట్టి అర్జునా! ఏ పని చేయదగినది, ఏ పని చేయకూడనిది అని నిర్ణయించుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రోక్తంగా చెప్పబడిన విధివిధానాలను తెలుసుకుని, ఈ లోకంలో నీ కర్తవ్య కర్మలను ఆచరించడం నీకు తగిన పని. (16.24)
అధ్యాయం 17: శ్రద్ధాత్రయ విభాగ యోగం
- అర్జునుడు పలికెను: కృష్ణా! శాస్త్ర విధులను వదిలిపెట్టి, కేవలం తమకున్న శ్రద్ధతో పూజలు చేసే వారి స్థితి ఏది? అది సత్త్వమా, రజస్సా లేక తమస్సా? (17.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: మనుషుల స్వభావాన్ని బట్టి వారి శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది – సాత్త్విక, రాజస మరియు తామస. (17.2)
- ఓ భారతా! ప్రతి వ్యక్తి తన మనస్సులోని సంస్కారాన్ని బట్టి ఒక శ్రద్ధను కలిగి ఉంటాడు. “మనిషి ఏ విధమైన శ్రద్ధ కలిగి ఉంటాడో, అతడు అటువంటి వాడే అవుతాడు” (17.3)
- సాత్త్విక గుణం కలవారు దేవతలను పూజిస్తారు. రాజస గుణం కలవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తామస గుణం కలవారు ప్రేతాలను, భూతగణాలను ఆరాధిస్తారు. (17.4)
- శాస్త్రాలలో చెప్పబడని విధంగా, లోకాన్ని భయపెట్టే లేదా ఆశ్చర్యపరిచే భయంకరమైన తపస్సులను ఎవరైతే చేస్తారో, అలాగే దంభము, అహంకారము, కామము, రాగము మరియు బలగర్వంతో కూడి ఉంటారో…అటువంటి వివేకశూన్యులు, తమ శరీరంలోని పంచభూతాలను కృశింపజేస్తూ, తద్వారా అదే దేహంలో అంతర్యామిగా ఉన్న నన్ను కూడా కష్టపెడుతున్నారు. అటువంటి వారు రాక్షస స్వభావం కలవారని తెలుసుకో. (17.5-6)
- ప్రతి మనిషికి ఇష్టమైన ఆహారము మూడు రకాలుగా ఉంటుంది. అలాగే యజ్ఞము, తపస్సు, దానము కూడా మూడు రకాలుగా ఉంటాయి. వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పుడు నా నుండి విను. (17.7)
- ఆయువును, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంచే ఆహారం సాత్త్వికమైనది. ఇవి రుచిగా, మృదువుగా, శరీరంలో ఎక్కువ కాలం శక్తిని ఇచ్చేవిగా, మనస్సుకు హాయినిచ్చేవిగా ఉంటాయి. (17.8)
- చేదు, పులుపు, ఉప్పు, మిక్కిలి వేడి, కారం, ఎండిపోయినవి, మంట పుట్టించేవి… ఇటువంటి ఆహారాలు రాజస గుణం కలవారికి ఇష్టం. ఇవి దుఃఖాన్ని, శోకాన్ని, రోగాలను కలిగిస్తాయి. (17.9)
- వండిన తర్వాత ఒక జాము నిలువ ఉండి చల్లారినది, రుచి లేనిది, కుళ్ళిన వాసన వచ్చేది, నిల్వ ఉన్నది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం తామస గుణం కలవారికి ఇష్టం. (17.10)
- ఫలాపేక్ష లేకుండా, శాస్త్ర విధిని అనుసరించి, “యజ్ఞం చేయడం నా కర్తవ్యం” అనే నిశ్చయంతో చేసే యజ్ఞం సాత్త్వికమైనది. (17.11)
- ఓ భరతశ్రేష్ఠా! ఫలాన్ని ఆశించి గానీ, లేదా ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోవడానికి చేసే యజ్ఞం రాజసమైనది. (17.12)
- శాస్త్ర విధి లేనిది, అన్నదానం చేయనిది, మంత్రం మరియు దక్షిణ లేనిది, శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం తామసమైనది. (17.13)
- దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, జ్ఞానులను పూజించడం; బాహ్య-అంతర శుచిని పాటించడం; సరళత, బ్రహ్మచర్యం మరియు అహింసను ఆచరించడం శరీరంతో చేసే తపస్సు. (17.14)
- ఇతరులను ఉద్వేగానికి గురిచేయని మాటలు మాట్లాడటం; సత్యం, ప్రియమైనది, హితమైనది పలకడం; వేదాలను, శాస్త్రాలను నిరంతరం పారాయణం చేయడం మాటతో చేసే తపస్సు. (17.15)
- మనస్సు ప్రశాంతంగా ఉండటం, అందరి పట్ల సౌమ్యభావం కలిగి ఉండటం, మౌనం వహించడం, మనోనిగ్రహం మరియు అంతఃకరణ శుద్ధిని కలిగి ఉండటం మనస్సుతో చేసే తపస్సు. (17.16)
- ఫలాపేక్ష లేని మనుషులు, పరమ శ్రద్ధతో ఏకాగ్రతతో చేసే పైన చెప్పిన మూడు రకాల తపస్సు సాత్త్వికమైనది. (17.17)
- సత్కారం, గౌరవం, పూజల కోసం ఆడంబరంతో చేసే తపస్సు రాజసమైనది. ఇది అస్థిరమైనది మరియు తాత్కాలికమైనది. (17.18)
- మూర్ఖత్వంతో తనను తాను పీడించుకుంటూ గానీ, లేదా ఇతరులను నాశనం చేయడం కోసం చేసే తపస్సు తామసమైనది. (17.19)
- “దానం ఇవ్వడం నా బాధ్యత” అని భావించి, ప్రతిఫలం కోరకుండా, సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, అర్హులైన వ్యక్తికి ఇచ్చే దానం సాత్త్వికమైనది. (17.20)
- ఏదైనా ప్రత్యుపకారం ఆశించి గానీ, లేదా స్వర్గాది ఫలితాలను కోరి గానీ, మనసులో ఇష్టం లేకపోయినా కష్టపడుతూ ఇచ్చే దానాన్ని రాజస దానము అంటారు. (17.21)
- సరైన ప్రదేశం కాని చోట, సరైన సమయం కాని వేళలో, అర్హత లేని వారికి, ఇచ్చేవాడిని అవమానిస్తూ లేదా తృణీకరిస్తూ ఇచ్చే దానాన్ని తామస దానము అంటారు. (17.22)
- ‘ఓం’, ‘తత్’, ‘సత్’ అనేవి పరబ్రహ్మను సూచించే మూడు శబ్దాలు. సృష్టి ఆరంభంలో బ్రాహ్మణులు, వేదాలు మరియు యజ్ఞాలు వీటి ద్వారానే నిర్మించబడ్డాయి. (17.23)
- అందువల్లనే, వేదవిదులు శాస్త్రోక్తమైన యజ్ఞ, దాన, తపః క్రియలను ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ ‘ఓం’ అనే శబ్దాన్ని ఉచ్చరించి మొదలుపెడతారు. ఇది పరమాత్మను స్మరించుటకు సంకేతం. (17.24)
- మోక్షాన్ని కోరుకునేవారు ఫలాపేక్ష లేకుండా వివిధ యజ్ఞాలను, తపస్సులను, దానాలను ‘తత్’ (అది – అంటే అంతా ఆయనదే) అనే భావంతో నిర్వహిస్తారు. ఇది కర్మ ఫలాన్ని త్యాగం చేయడానికి సంకేతం. (17.25)
- ‘సత్’ అనే పదం ఉనికిని (ఉన్నది), మంచితనాన్ని (సాధు భావం) సూచించడానికి ఉపయోగిస్తారు. అలాగే ఏదైనా మంగళకరమైన కర్మలో కూడా ‘సత్’ శబ్దాన్ని ఉపయోగిస్తారు. (17.26)
- యజ్ఞం, తపస్సు, దానాలలో స్థిరంగా ఉండటాన్ని కూడా ‘సత్’ అంటారు. భగవంతుని కోసం చేసే ఏ పనైనా ‘సత్’ కిందకే వస్తుంది. (17.27)
- ఓ పార్థా! శ్రద్ధ లేకుండా చేసే హోమం, ఇచ్చే దానం, ఆచరించే తపస్సు లేదా మరే ఇతర కర్మ అయినా సరే ‘అసత్’ అని పిలువబడుతుంది. అటువంటి పనుల వల్ల ఇటు ఈ లోకంలో గానీ, అటు పరలోకంలో గానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. (17.28)
అధ్యాయం 18: మోక్ష సన్యాస యోగం
- అర్జునుడు పలికెను: ఓ మహాబాహో! హృషీకేశా! కేశినిషూదనా! ‘సంన్యాసం’ యొక్క తత్త్వాన్ని మరియు ‘త్యాగం’ యొక్క తత్త్వాన్ని వేర్వేరుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. (18.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కోరికలతో చేసే కర్మలను వదిలివేయడాన్ని ‘సంన్యాసం’ అని పండితులు అంటారు. చేసే అన్ని పనుల యొక్క ఫలితాన్ని వదిలివేయడాన్ని ‘త్యాగం’ అని విజ్ఞులు చెబుతారు. (18.2)
- కొందరు పండితులు “కర్మలన్నీ దోషపూరితమైనవి కాబట్టి వాటిని వదిలేయాలి” అంటారు. మరికొందరు “యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను ఎన్నటికీ వదలకూడదు” అని అంటారు. (18.3)
- ఓ భరతశ్రేష్ఠా! త్యాగం విషయంలో నా నిశ్చయాన్ని విను. ఓ పురుషవ్యాఘ్ర! త్యాగం అనేది సత్త్వ, రజ, తమో గుణాల భేదం చేత మూడు రకాలుగా చెప్పబడింది. (18.4)
- యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను ఎన్నటికీ వదలకూడదు. అవి తప్పక ఆచరించవలసినవి. ఎందుకంటే యజ్ఞ దాన తపస్సులు జ్ఞానులను సైతం పవిత్రులను చేస్తాయి. (18.5)
- అయితే, ఈ పనులను కూడా కర్తృత్వ భావన (నేను చేస్తున్నాను అనే అహంకారం) లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేయాలన్నదే నా ఖచ్చితమైన మరియు ఉత్తమమైన అభిప్రాయం. (18.6)
- శాస్త్రరీత్యా నిర్దేశించబడిన కర్తవ్య కర్మలను వదిలివేయడం తగదు. అజ్ఞానం లేదా మోహం వల్ల అటువంటి పనులను మానేస్తే, దానిని ‘తామస త్యాగం’ అంటారు. ఇది మనిషిని అధోగతికి తీసుకెళ్తుంది. (18.7)
- ఏదైనా పని చేయడం కష్టమని, శరీరం శ్రమ పడుతుందని భయపడి కర్తవ్యాన్ని వదిలివేస్తే, అది ‘రాజస త్యాగం’ అవుతుంది. అటువంటి వాడు త్యాగం వల్ల కలిగే ఫలితాన్ని పొందలేడు. (18.8)
- ఓ అర్జునా! “ఈ పని చేయడం నా బాధ్యత” అని భావించి, మమకారాన్ని మరియు కర్మ ఫలితాన్ని వదిలిపెట్టి చేసే త్యాగమే ‘సాత్త్విక త్యాగం’. ఇది శ్రేష్ఠమైనది. (18.9)
- సాత్త్విక గుణంతో నిండినవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, సందేహాలు లేనివాడు అయిన త్యాగి… తనకు నచ్చని పని ఎదురైనప్పుడు ద్వేషించడు, నచ్చిన పని ఎదురైనప్పుడు ఆసక్తి పెంచుకోడు. అతడు రెండింటినీ సమానంగా చూస్తాడు. (18.10)
- దేహాన్ని ధరించిన ఏ మానవుడూ కర్మలను సంపూర్ణంగా వదిలివేయడం సాధ్యం కాదు. కాబట్టి, ఎవరైతే కర్మల యొక్క ఫలితాన్ని వదులుతారో, అతడే నిజమైన త్యాగి అని పిలవబడతాడు. (18.11)
- కర్మ ఫలాలను త్యాగం చేయని వారికి మరణానంతరం మూడు రకాల ఫలితాలు ఉంటాయి: నరకాది దుఃఖాలు, స్వర్గాది సుఖాలు, సుఖదుఃఖాలు కలగలిసిన మానవ జన్మ. కానీ కర్మ ఫలాలను త్యాగం చేసిన సన్న్యాసులకు ఎప్పుడూ ఇటువంటి బంధనాలు ఉండవు. (18.12)
- ఓ మహాబాహో! సాంఖ్య శాస్త్రం ప్రకారం ఏ కర్మ సిద్ధించడానికైనా ఐదు కారణాలు అవసరమని చెప్పబడింది. (18.13)
- శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము – అనే ఈ ఐదూ సమస్త కర్మలకూ కారణాలు. (18.14)
- మనిషి తన శరీరం, మాట లేదా మనస్సుతో చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ పనికైనా ఈ ఐదే కారణాలు. (18.15)
- పనులు జరగడానికి ఐదు కారణాలు ఉండగా, కేవలం తనను తాను మాత్రమే కర్తగా భావించేవాడు మందబుద్ధి. అటువంటి వాడు సత్యాన్ని చూడలేడు. (18.16)
- ఎవడైతే “నేను కర్తను” అనే అహంకారం లేకుండా ఉంటాడో, ఎవడి బుద్ధి కర్మ ఫలాలకు అంటదో.. అటువంటి వాడు లోక రీత్యా యుద్ధం చేసి శత్రువులను చంపినా, అతడు చంపినవాడు కాడు, ఆ కర్మ బంధాల్లో చిక్కుకోడు. (18.17)
- జ్ఞానము (తెలివి), జ్ఞేయము (తెలుసుకోవలసిన విషయం), పరిజ్ఞాత (తెలుసుకునేవాడు) – ఈ మూడూ కర్మకు ప్రేరణనిస్తాయి. అలాగే కరణము (పనిముట్టు), కర్మ (పని), కర్త (చేసేవాడు) – ఈ మూడూ కర్మ యొక్క స్వరూపాన్ని ఏర్పరుస్తాయి. (18.18)
- సాంఖ్య శాస్త్రం ప్రకారం… జ్ఞానము, కర్మ మరియు కర్త – ఈ మూడూ కూడా మూడు గుణాల ప్రభావం వల్ల మూడు రకాలుగా విభజించబడ్డాయి. వాటి గురించి కూడా నేను చెప్పినట్లుగా విను. (18.19)
- వేరువేరుగా కనిపిస్తున్న సమస్త ప్రాణులలో… నాశనం లేని, ఒక్కటే అయిన పరమాత్మ తత్త్వాన్ని ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి చూడగలుగుతాడో, దానిని ‘సాత్త్విక జ్ఞానం’ అని తెలుసుకో. (18.20)
- ఏ జ్ఞానం వల్ల మనిషి ప్రాణులన్నీ ఒకదానికొకటి వేరని, ప్రతి శరీరంలోనూ వేర్వేరు ఆత్మలు ఉన్నాయని చూస్తాడో.. అది ‘రాజస జ్ఞానం’. (18.21)
- కేవలం ఏదో ఒక చిన్న పనికే అతుక్కుపోయి, కారణం లేకుండా, సత్యం తెలియకుండా, అది మాత్రమే సర్వస్వమని భావించే అల్పమైన జ్ఞానం ‘తామస జ్ఞానం’. (18.22)
- శాస్త్రబద్ధమైనది, అహంకారం లేకుండా చేసేది, ఇష్టాఇష్టాలకు అతీతంగా చేసేది మరియు ఫలాపేక్ష లేకుండా చేసే పనిని ‘సాత్త్విక కర్మ’ అంటారు. (18.23)
- కోరికలతో, అహంకారంతో మరియు మిక్కిలి శ్రమతో చేసే పనిని ‘రాజస కర్మ’ అంటారు. (18.24)
- భవిష్యత్తులో కలిగే పర్యవసానాలను, అయ్యే నష్టాన్ని, ఎదుటివారికి కలిగే హింసను మరియు తన సామర్థ్యాన్ని ఆలోచించకుండా, కేవలం మోహంతో మొదలుపెట్టే పనిని ‘తామస కర్మ’ అంటారు. (18.25)
- ఆసక్తి లేనివాడు, అహంకారం లేనివాడు, ధైర్యసాహసాలతో కూడినవాడు, పని సిద్ధించినా సిద్ధించకపోయినా వికారాలకు లోనుకాకుండా ఉండేవాడు ‘సాత్త్విక కర్త’. (18.26)
- అనురాగం కలవాడు, కర్మ ఫలితాలను ఆశించేవాడు, లోభి, హింసా స్వభావం కలవాడు, అపవిత్రుడు, సుఖదుఃఖాలకు త్వరగా చలించేవాడు ‘రాజస కర్త’. (18.27)
- అస్థిరమైన మనస్సు కలవాడు, వివేకం లేనివాడు, మొండివాడు, మోసగాడు, ఇతరులను అవమానించేవాడు, సోమరి, ఎప్పుడూ విచారించేవాడు మరియు పనులను వాయిదా వేసేవాడు ‘తామస కర్త’. (18.28)
- ఓ ధనంజయా! బుద్ధి మరియు ధృతి లో ఉన్న మూడు రకాల భేదాలను విను. (18.29)
- ఏ బుద్ధి అయితే …ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఏది బంధనం, ఏది మోక్షం అని స్పష్టంగా తెలుసుకుంటుందో.. అది ‘సాత్త్విక బుద్ధి’. (18.30)
- ఓ పార్థా! ఏ బుద్ధి అయితే ధర్మానికి-అధర్మానికి మధ్య, చేయవలసిన పనికి-చేయకూడని పనికి మధ్య ఉన్న తేడాను సరిగా గుర్తించలేదో, అది ‘రాజస బుద్ధి’. ఇది గందరగోళంతో కూడి ఉంటుంది. (18.31)
- ఓ పార్థా! అజ్ఞానమనే చీకటితో నిండిన ఏ బుద్ధి అయితే.. అధర్మాన్ని ధర్మమని భావిస్తుందో, అలాగే అన్ని విషయాలను వ్యతిరేకంగా అర్థం చేసుకుంటుందో, అది ‘తామస బుద్ధి’. (18.32)
- ఏకాగ్రతతో కూడిన యోగ సాధన ద్వారా… మనస్సు, ప్రాణము, ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచి, సరైన మార్గంలో నడిపించే నిశ్చయ శక్తిని ‘సాత్త్విక ధృతి’ అంటారు. (18.33)
- ఓ అర్జునా! ఫలాన్ని ఆశించి, ఆసక్తితో ధర్మ, అర్థ, కామాలను (లౌకిక ప్రయోజనాలను) మాత్రమే పట్టుకుని ఉండటానికి ఉపయోగపడే నిశ్చయ శక్తి ‘రాజస ధృతి’. (18.34)
- దుర్బుద్ధి గలవాడు దేనినైతే ఆశ్రయించి.. నిద్ర, భయం, శోకం, విషాదం మరియు గర్వాన్ని వదలడో, అటువంటి మొండితనాన్ని ‘తామస ధృతి’ అంటారు. (18.35)
- ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. (18.36)
- మొదట విషం వలె కష్టంగా అనిపించినా, ఫలితంలో అమృతం వలె ఉండే సుఖమే సాత్త్వికమైనది. ఆత్మజ్ఞానం వల్ల కలిగే ప్రశాంతతే ఈ సుఖానికి మూలం. (18.37)
- ఇంద్రియాలు విషయాలతో కలవడం వల్ల కలిగే సుఖం రాజసమైనది. ఇది మొదట అమృతం వలె తీయగా అనిపించినా, చివరకు విషం వలె దుఃఖాన్ని మిగులుస్తుంది. (18.38)
- మొదటి నుండి చివరి వరకు ఆత్మను మోహానికి గురిచేసేది, నిద్ర, బద్ధకం, అజాగ్రత్త నుండి పుట్టే సుఖం ‘తామస సుఖం’. (18.39)
- ఈ భూమి మీద గానీ, స్వర్గంలో దేవతలలో గానీ… ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాల (సత్వ, రజ, తమస్సు) ప్రభావం లేని ప్రాణి ఏదీ లేదు. (18.40)
- ఓ పరంతప! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రుల యొక్క కర్మలు వారి వారి అంతర్గత గుణాల నుండి పుట్టిన స్వభావాల ప్రకారమే విభజించబడ్డాయి. (18.41)
- మనస్సును నిగ్రహించడం, ఇంద్రియాలను అదుపు చేయడం, తపస్సు, బాహ్య-అంతర శుచి, ఓర్పు, నిష్కపటమైన ప్రవర్తన, శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం, దైవ చింతన – ఇవి బ్రాహ్మణుని సహజ గుణాలు. (18.42)
- శౌర్యము, తేజస్సు, ధైర్యము, సామర్థ్యము, యుద్ధంలో వెన్నుచూపకపోవడం, దానగుణం మరియు నాయకత్వ లక్షణం – ఇవి క్షత్రియుని సహజ గుణాలు. (18.43)
- వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం – ఇవి వైశ్యుని సహజ కర్మలు. ఇతరులకు సేవ చేయడం లేదా పరిచర్య చేయడం అనేది శూద్రుని సహజ కర్మ. (18.44)
- స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము. (18.45)
- సర్వ ప్రాణులకూ మూలమైనవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు అయిన ఆ పరమాత్మను, మనిషి తాను చేసే పనుల ద్వారానే అర్చించి మోక్షాన్ని పొందవచ్చు. అంటే మనం చేసే వృత్తిని దైవ కార్యంగా భావించాలి. (18.46)
- చక్కగా ఆచరించిన పరధర్మం కంటే, లోపాలు ఉన్నప్పటికీ తన స్వధర్మాన్ని (తన స్వభావానికి తగిన పనిని) ఆచరించడమే మేలు. తన స్వభావానికి తగిన పనిని చేయడం వల్ల మనిషికి ఎటువంటి పాపము అంటదు. (18.47)
- ఓ కౌంతేయా! సహజమైన కర్మలో లోపాలు ఉన్నప్పటికీ దానిని వదలకూడదు. అగ్నిని పొగ కప్పి ఉంచినట్లే, మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. (18.48)
- ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు. (18.49)
- ఓ కౌంతేయా! ఇటువంటి సిద్ధిని పొందిన వాడు, జ్ఞానానికి అత్యున్నతమైన పరమ నిష్ఠ అయిన ‘బ్రహ్మము’ను ఎలా పొందుతాడో ఇప్పుడు క్లుప్తంగా నా నుండి విను. (18.50)
- సత్వగుణంతో కూడిన నిర్మలమైన బుద్ధిని కలిగి, ధైర్యంతో మనస్సును నిగ్రహించుకుని, శబ్ద స్పర్శాది ఇంద్రియ విషయాలను వదిలిపెట్టి, వేటిపైనా రాగద్వేషాలు లేకుండా ఉన్నవాడు, ఏకాంత ప్రదేశంలో నివసిస్తూ, మితాహారం తీసుకుంటూ, తన వాక్కును, శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకుని, నిరంతరం ధ్యానయోగంలో నిమగ్నమై, దృఢమైన వైరాగ్యాన్ని ఆశ్రయించినవాడు, అహంకారం, గర్వం, కామక్రోధాలు, అవసరం లేని వస్తువులను సేకరించడం వంటివి పూర్తిగా వదిలేసి, “నాది” అనే మమకారం లేకుండా, శాంతంగా ఉన్న సాధకుడు బ్రహ్మ భావాన్ని పొందడానికి అర్హుడవుతాడు. (18.51-18.53)
- ఆ విధంగా బ్రహ్మ స్థితిని పొందినవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అతడు దేనికోసం బాధపడడు, దేనినీ కోరడు. అన్ని ప్రాణులను సమానంగా చూస్తూ, నా యందు పరమ భక్తిని కలిగి ఉంటాడు. (18.54)
- అటువంటి అనన్య భక్తి ద్వారా మాత్రమే నేను ఎవరు, నా వాస్తవ రూపం ఏమిటి అనేది అతడు నిజంగా తెలుసుకోగలడు. నన్ను అలా తెలుసుకున్న మరుక్షణమే అతడు నాయందు ప్రవేశిస్తాడు. (18.55)
- ఎల్లప్పుడూ అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ, నన్నే నమ్ముకుని, నాకే శరణు కోరినవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతమైన, నాశనం లేని పరమ పదాన్ని పొందుతాడు. (18.56)
- నీ మనస్సుతో అన్ని పనులను నాకు అర్పించి, నన్నే నీ పరమ గమ్యంగా భావించు. బుద్ధియోగాన్ని ఆశ్రయించి, నీ మనస్సును నిరంతరం నాయందే నిలుపు. (18.57)
- నీ మనస్సు నాయందు లగ్నం చేస్తే, నా కృప వల్ల నీవు జీవితంలోని అన్ని కష్టాలను సులభంగా దాటుతావు. అలా కాకుండా అహంకారంతో నా మాట వినకపోతే నీవు పతనం చెందుతావు. (18.58)
- నీవు అహంకారంతో “నేను యుద్ధం చేయను” అని నిర్ణయించుకున్నా, అది ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే నీలోని క్షత్రియ స్వభావమే నిన్ను బలవంతంగా యుద్ధంలోకి దింపుతుంది. (18.59)
- ఓ కౌంతేయా! మోహం వల్ల నీవు ఏ పనినైతే చేయనని అంటున్నావో, నీ స్వభావం నుండి పుట్టిన కర్మకు కట్టుబడి ఉన్న నీవు.. నీ ప్రమేయం లేకుండానే ఆ పనిని చేసి తీరుతావు. (18.60)
- ఓ అర్జునా! పరమాత్మ సమస్త ప్రాణుల హృదయాలలో నివసించి ఉంటాడు. ఒక యంత్రం మీద ఎక్కిన బొమ్మలను సూత్రధారి ఆడించినట్లుగా, ఆయన తన మాయాశక్తితో ప్రాణులందరినీ వారి కర్మలను బట్టి భ్రమింపజేస్తుంటాడు. (18.61)
- ఓ భారతా! నీవు అన్ని విధాలా ఆ పరమాత్మనే శరణు వేడుకో. ఆయన అనుగ్రహం వల్ల నీవు పరమ శాంతిని మరియు శాశ్వతమైన పరమ పదమును పొందుతావు. (18.62)
- రహస్యాలన్నిటిలోకీ అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని నేను నీకు వివరించాను. దీనిని సంపూర్ణంగా విచారించి, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేయి. (18.63)
- అన్నిటికంటే రహస్యమైన నా పరమ సందేశాన్ని మరొక్కసారి విను. నీవు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడవు కాబట్టి, నీ హితము కోరి దీనిని చెబుతున్నాను. (18.64)
- నీ మనస్సును నాయందే నిలుపు, నా భక్తుడవు కా, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా చేస్తే నీవు తప్పక నన్నే చేరుకుంటావు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి. (18.65)
- సమస్త ధర్మాలను వదిలిపెట్టి, కేవలం నన్ను మాత్రమే శరణు వేడుకో. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఏమాత్రం భయపడకు, శోకించకు. (18.66)
- ఈ పరమ రహస్యమైన జ్ఞానాన్ని తపస్సు లేనివానికి, భక్తి లేనివానికి, వినాలని ఆసక్తి లేనివానికి మరియు నన్ను ద్వేషించేవానికి ఎప్పుడూ చెప్పవద్దు. (18.67)
- ఎవరైతే ఈ పరమ రహస్యమైన గీతా జ్ఞానాన్ని నా భక్తులకు బోధిస్తారో, వారు నా యందు పరమ భక్తిని కలిగి ఉండి నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు. (18.68)
- ఈ లోకంలో మనుష్యులందరిలోనూ అటువంటి వానికంటే నాకు అత్యంత ప్రియమైన వాడు మరొకడు లేడు, భవిష్యత్తులో ఉండబోడు. (18.69)
- మన ఇద్దరి మధ్య జరిగిన ఈ ధర్మబద్ధమైన సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, వారు నన్ను ‘జ్ఞానయజ్ఞం’ ద్వారా పూజించినట్లు నేను భావిస్తాను. ఇది నా నిశ్చితాభిప్రాయం. (18.70)
- ఏ మనిషైతే అసూయ లేకుండా, కేవలం శ్రద్ధతో ఈ గీతా సంవాదాన్ని వింటాడో… అటువంటి వాడు కూడా పాప విముక్తుడై, పుణ్యాత్ములు పొందే శుభప్రదమైన లోకాలను చేరుకుంటాడు. (18.71)
- ఓ పార్థా! నీవు ఏకాగ్రతతో ఈ జ్ఞానాన్ని విన్నావా? ఓ ధనంజయా! అజ్ఞానం వల్ల కలిగిన నీ మోహం ఇప్పుడు నశించిందా? (18.72)
- అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా! నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది. నేను కోల్పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందాను. నా సందేహాలన్నీ తొలగిపోయి స్థిరంగా ఉన్నాను. నీవు చెప్పినట్లే చేస్తాను. (18.73)
- సంజయుడు పలికెను: ఈ విధంగా మహాత్ముడైన అర్జునుడికి, వాసుదేవునికి మధ్య జరిగిన అత్యంత అద్భుతమైన, రోమాంచితమైన సంవాదాన్ని నేను విన్నాను. (18.74)
- వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతుండగా ఈ పరమ రహస్యమైన యోగతత్త్వమైన గీతాశాస్త్రాన్ని నేను వినగలిగాను. (18.75)
- ఓ రాజా! కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ పుణ్యప్రదమైన, అద్భుతమైన సంవాదాన్ని గుర్తుకు తెచ్చుకున్న కొద్దీ నేను మళ్ళీ మళ్ళీ పులకించిపోతున్నాను. (18.76)
- అలాగే, శ్రీహరి చూపిన ఆ అత్యంత అద్భుతమైన విశ్వరూపాన్ని తలచుకుంటే నాకు గొప్ప ఆశ్చర్యం కలుగుతోంది, నేను మాటిమాటికీ ఆనందిస్తున్నాను. (18.77)
- ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో… అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యం మరియు స్థిరమైన నీతి ఉంటాయని నా నిశ్చితాభిప్రాయం. (18.78)