యది మామప్రతీకారం
అశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్ ॥
యది, మామ్, అప్రతీకారమ్, అశస్త్రమ్, శస్త్రపాణయః,
ధార్తరాష్ట్రాః, రణే, హన్యుః, తత్, మే, క్షేమతరమ్, భవేత్.
అప్రతీకారమ్ = ప్రతిఘటింపనట్టి; అశస్త్రం = నిరాయుధుడనైన; మాం = నన్ను; శస్త్రపాణయః = శస్త్రధారులైన; ధార్తరాష్ట్రాః = ధార్తరాష్ట్రులు; రణే = యుద్ధంలో; యది హన్యుః = చంపినా కూడా; తత్ = అది; మే = నాకు; క్షేమతరం = ఇంతకన్నా మేలే; భవేత్ = అవుతుంది.
తా ॥ ఒకవేళ నేను ఎదురుతిరగకుండా, ఆయుధాలు ధరించకుండా ఊరకే ఉండిపోతే… చేతిలో ఆయుధాలు ఉన్న ధృతరాష్ట్రుని కుమారులు నన్ను ఈ యుద్ధంలో చంపేసినా సరే, అది నాకు ఇంతకన్నా మేలే అవుతుంది.
వ్యాఖ్య: –
“క్షేమతరం” (ఇది మేలు): నిరాయుధుడైన తాను శత్రువులచేత చంపబడితే అది చాలా మంచిదని అర్జునుడు ఈ కారణాల వల్ల చెప్పి ఉండవచ్చు:
- కులనాశం ఆపడం: కులాన్ని నాశనం చేసి కొత్త పాపాలు సంపాదించడం ఆగిపోతుంది, అంతకు ముందు సంపాదించిన పుణ్యాన్ని కాపాడుకోగలుగుతాడు.
- బంధువధ పాపం తప్పడం: బంధువులను చంపడం వల్ల కలిగే పాపం జరగదు.
- ప్రాణాలు రక్షించడం: బంధు-మిత్రుల ప్రాణాలు కాపాడబడతాయి.
- పుణ్యం సంపాదన: బంధు-మిత్రుల ప్రాణాలను కాపాడినందుకు పుణ్యం కలుగుతుంది, అది తన మోక్ష సాధనకు సహాయపడుతుంది.