దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా ।
యది భా సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ॥ 12
దివి, సూర్య సహస్రస్య, భవేత్, యుగపత్, ఉత్థితా,
యది, భాః, సదృశీ, సా, స్యాత్, భాసః, తస్య, మహాత్మనః.
దివి = ఆకాశంలో; సూర్య సహస్రస్య = వేయిమంది సూర్యుల; భాః = ప్రభ; యుగపత్ = ఏక కాలంలో; ఉత్థితా = సముదితం; భవేత్యది = అయిన యెడల; సా = ఆ కాంతి; తస్య = ఆ; మహాత్మనః = విశ్వరూపుని; భాసః = ప్రభకు; సదృశీ = సాటి; స్యాత్ = కావచ్చును.
తా ॥ ఆకాశంలో ఒకే సమయంలో సహస్రసూర్యుల ప్రభోదయమైతే, ఆ జ్యోతి విశ్వరూపుని కాంతికి ఒకింత సరిపోతే సరిపోవచ్చు.
శ్రీ రామకృష్ణ వాణి —
శ్రీరామకృష్ణులు: “దీపపు పురుగు ఒకసారి ప్రకాశాన్ని కనుక చూసినట్లయితే అటుపైన అది అంధకారంలో ఉండగలదా?”
డాక్టరు (నవ్వుతూ): కాలిపోయినా సరే, అది వెలుగును మాత్రం వదలదు.
శ్రీరామకృష్ణులు: ఆ, అది కాదు. అయితే భక్తుడు దీపపు పురుగులాగా కాలి చనిపోడు. భక్తుడు ఏ ప్రకాశం వెంటయితే పడతాడో, అది వజ్ర ప్రకాశం. వజ్రప్రకాశం ఉజ్వలంగా ఉంటుంది కాని అది సమశీతలంగా, ఉపశమనంగా ఉంటుంది. ఆ ప్రకాశంతో దేహం దగ్ధం కాదు. దానితో శాంతి లభిస్తుంది, ఆనందం కలుగుతుంది. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)