జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున ॥ 9
జన్మ, కర్మ, చ, మే, దివ్యమ్, ఏవమ్, యః, వేత్తి, తత్త్వతః,
త్యక్త్వా, దేహమ్, పునర్జన్మ, న, ఏతి, మామ్, ఏతి, సః, అర్జున.
అర్జున = అర్జునా; యః = ఎవడు; మే = నా; దివ్యమ్ = అప్రాకృతమైన; అలౌకికమైన; జన్మ = శరీరధారణ; కర్మ చ = సాధురక్షణాది లీలలను; ఏవమ్ = ఇట్లు; తత్త్వతః = యథార్థంగా; వేత్తి = తెలుసుకుంటాడో; సః = అతడు; దేహమ్ = శరీరాన్ని; త్యక్త్వా = విడిచి; పునర్జన్మ = మళ్ళీ జన్మను; న ఏతి = పొందడు; మామ్ = నన్ను; ఏతి = పొందుతాడు.
తా ॥ అర్జునా! ఎవడు ఈ తీరుగా అలౌకికమైన నా జన్మనూ, సాధు పరిత్రాణమూ మొదలైన అప్రాకృత కర్మల తత్త్వాన్ని (ఇవి పరోపకారార్థమే ఒనర్చబడినవని) గ్రహిస్తాడో అతడు పునర్జన్మను పొందడు, నన్నే పొందుతాడు.
వ్యాఖ్య:-
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” – “బ్రహ్మమును (దేవుడిని) తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు” అని ఉపనిషత్తులలో ఒక గొప్ప మాట ఉంది. ఈ శ్లోకంలో చెప్పింది కూడా అదే. ఎవరైతే భగవంతుడి దివ్యమైన జన్మను, ఆయన చేసే పనులను (లీలలను) నిజంగా అర్థం చేసుకుంటారో… వారు భక్తితో పూర్తిగా దేవుడి మీదే మనసు లగ్నం చేస్తారు. ఎప్పుడూ ఆ దేవుడి ధ్యానంలోనే ఉంటూ, చివరికి ఆ దేవుడిని చేరుకుంటారు.
ఈ శ్లోకంలో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు:
- సాధన (ప్రయత్నం): దేవుడి అసలు రూపం ఎలాంటిదో సరిగ్గా తెలుసుకోవడం.
- సాధ్యం (గమ్యం/ఫలితం): దేవుడిలో ఐక్యం అయిపోవడం.
ఇక్కడ ‘తత్త్వతః’ (యథార్థంగా) అని ఒక మాట వాడారు. దీని అర్థం ఏంటంటే—దేవుడి గురించి కేవలం నోటి మాటలతో గొప్పగా చెబితేనో, పైపై జ్ఞానం సంపాదిస్తేనో సరిపోదు. దేవుడిని ‘స్వయంగా అనుభవం’ (Experience) ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన తృప్తి, ఫలితం దక్కుతాయి.
శ్లోకంలో ‘దివ్యం’ అని చెప్పారు. అంటే దేవుడి పుట్టుక, ఆయన చేసే పనులు (లీలలు) మామూలు మనుషులవి లాంటివి కావు. అవి ప్రకృతికి (ఈ లోకానికి) అతీతమైనవి, అద్భుతమైనవి. భగవంతుడు ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. అందుకే ఆయన చర్యలు సామాన్య ప్రాణులు చేసే పనుల్లా ఉండవు. దేవుడి తత్త్వాన్ని తెలుసుకున్నవాడు “మళ్ళీ పుట్టడు (పునర్జన్మ ఉండదు)” అని చెప్పిన వెంటనే, “నన్నే పొందుతాడు” అని కూడా కృష్ణుడు చెప్పారు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే—జన్మరాహిత్యం (మోక్షం) అంటే ఏమీ లేని శూన్య స్థితి కాదు. అది సచ్చిదానంద స్వరూపుడైన భగవంతునిలో ఐక్యం అయ్యే గొప్ప ఆనంద స్థితి.
శ్లోకంలో “శరీరాన్ని వదిలి నన్నే పొందుతాడు” అని ఉంది కదా, దాని అర్థం “మనిషి చనిపోయాక మాత్రమే మోక్షం వస్తుంది” అని కాదు. వాస్తవానికి, ఏ క్షణంలోనైతే మనిషి భగవంతుడి తత్త్వాన్ని (నిజాన్ని) పూర్తిగా తెలుసుకుంటాడో.. ఆ క్షణమే (ఈ శరీరంతో ఉండగానే) అతనికి మోక్షం లభిస్తుంది. దీన్నే ‘జీవన్ముక్తి’ అంటారు. ఈ శరీరం పోయాక, ఇక మళ్ళీ ఇంకో కొత్త శరీరం ధరించాల్సిన అవసరం రాదు (అంటే పునర్జన్మ ఉండదు) అని చెప్పడానికే అక్కడ ఆ మాట వాడారు. అంతే తప్ప, మోక్షం కోసం చనిపోయేదాకా ఆగాలని దాని అర్థం కాదు.
శ్రీ రామకృష్ణ వాణి —
‘మ’ శ్రీరామకృష్ణుల పాదాలను సుతిమెత్తగా ఒత్తుతున్నాడు. బ్రాహ్మణి, ఆమె బంధువర్గాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు “ఆహా! వాళ్ళు ఎంతగా సంతోషపడ్డారు!” అన్నారు.
‘మ’ : ఏం వింత! ఏసు ప్రభువు కాలంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మార్థా, మేరీ అనే ఇద్దరు సోదరీమణులు ఏసు ప్రభువు భక్తురాళ్ళుగా ఉండేవారు.
శ్రీరామకృష్ణులు (ఆతురతతో): ఏమిటి, ఏమిటా కథ?
‘మ’ : ఏసుక్రీస్తు భక్తులను వెంటబెట్టుకుని ఇదే విధంగా భక్తురాలి ఇంటికి వెళ్ళారు. వారిలో ఒక సోదరి ఆయన్ను చూడగానే భావోల్లాసంతో నిండిపోయింది. ఆ సన్నివేశం గౌరాంగుని గురించిన ఈ పాటను జ్ఞప్తికి తెస్తుంది.
నా గోరా దివ్యరూప
సాగరమున నా కనుగవ
దిగి మునిగి మరల నాకు
అగపడవు తిరిగి వచ్చి
దిగి దిగి లోతుకు నా మది
దిగిపోయెను తామరం
ఏ గతి యీదుకు బయటకు
రాగలనను సంగతి మరచి
“ఇంకొక సోదరి ఒంటరిగా ఏసుప్రభువుకోసం తినుబండారాలు తయారు చేస్తోంది. ఆమె ఏసు ప్రభువు వద్దకు వచ్చి ఇలా ఫిర్యాదు చేసింది: ‘ప్రభూ! ఇది ఎంత అన్యాయమో చూడండి! నేనిక్కడ ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటూ ఉన్నాను. అక్క ఏమో ఇక్కడ మీతో కూర్చుని ఉంది.’ అప్పుడు ఏసు ప్రభువు ఇలా అన్నాడు: ‘మీ అక్క నిజంగానే ధన్యురాలమ్మా. మానవ జీవిత ఉద్దేశమైన భగవత్ప్రేమను ఆమె సంపాదించింది.’”
శ్రీరామకృష్ణులు: అది సరే, ఇదంతా చూస్తే, నీకు ఏమనిపిస్తోంది?
‘మ’ : ఏసుక్రీస్తు, చైతన్యులు, తమరు ఒక్కటేనని తోస్తోంది.
శ్రీరామకృష్ణులు: అవునవును. ఒక్కటే, నిజంగా ఒక్కటే. ఆయన (భగవంతుడు) – చూస్తున్నావు కదా – ఇందులో ఏ విధంగా విరాజిల్లుతున్నాడో.
ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు తమ శరీరాన్ని వేలితో చూపించారు, భగవంతుడే ఈ రూపంలో అవతరించాడు అన్నట్లుగా.
‘మ’ : మీరు ఆ రోజు అవతార తత్వాన్ని విపులంగా వర్ణించారు.
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పాను?
‘మ’ : దిగంతాల వరకు వ్యాపించివున్న విశాల మైదానాన్ని ఊహించు కోమన్నారు. కాని ఎదురుగా ఒక గోడ ఉన్నందున మైదానాన్ని చూడలేకపోతున్నాం. గోడలో గుండ్రని రంథ్రం ఒకటి ఉంది. ఆ రంధ్రం గుండా అనంత మైదానాన్ని కొంత చూడవచ్చు.
శ్రీరామకృష్ణులు: ఆ రంధ్రమేమిటో చెప్పు.
‘మ’ : మీరే ఆ రంధ్రం. మీ ద్వారా సర్వమూ దర్శించవచ్చు. దిగ్దిగంతాలకు వ్యాపించిన ఆ మైదానాన్ని చూడవచ్చు.
ఈ మాటతో శ్రీరామకృష్ణులు అమితంగా సంతుష్టులయ్యారు. ‘మ’ వీపు తడుతూ “నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకున్నావు. మంచిది, చాలా మంచిది” అన్నారు.
‘మ’ : దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పూర్ణబ్రహ్మం ఒక మానవదేహంలో ఎలా ఇముడుతుంది? దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
శ్రీరామకృష్ణులు ఈ విషయంగా ఒక పాట పాడారు:
పిచ్చివాని వలెను తాను
గడప గడప తిరుగును
బిచ్చగానివలె తాను
గడప గడప తిరుగును
అసలెవరొ అతడెవరొ
అంతెవరికి అగుపడడు.
‘మ’ : మీరు ఏసుక్రీస్తు విషయంకూడా చెప్పారు.
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పాను?
‘మ’ : యదుమల్లిక్ తోటలో ఏసు ప్రభువు పటాన్ని చూసి మీరు భావసమాధి మగ్నులయ్యారు. అప్పుడు ఏసు ప్రభువు పటంనుండి దిగివచ్చి మీలో లీనమైపోవడం మీరు చూశారు. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)