సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ 29
సర్వభూతస్థమ్, ఆత్మానమ్, సర్వభూతాని, చ, ఆత్మని,
ఈక్షతే, యోగయుక్తాత్మా, సర్వత్ర, సమదర్శనః.
సర్వత్ర = సర్వభూతాలలో; సమదర్శనః = బ్రహ్మను దర్శించేవాడూ; యోగయుక్తాత్మా = సమాహితచిత్తుడూ అయిన పురుషుడు; ఆత్మానమ్ = ఆత్మను; సర్వభూతస్థమ్ = ఆబ్రహ్మస్తంబ పర్యంతం అంతటా ఉన్నట్లుగా; సర్వభూతాని = బ్రహ్మాది స్థావరాంతాలైన భూతాలనన్నిటిని; ఆత్మని చ = ఆత్మలో; ఈక్షతే = దర్శిస్తాడు.
తా ॥ (బ్రహ్మసాక్షాత్కార స్థితి వర్ణించబడుతోంది:) సమాహితచిత్తుడైన పురుషుడు సర్వభూతాలలో బ్రహ్మాన్ని దర్శిస్తూ, తన ఆత్మను బ్రహ్మాదిస్థావరాంతంగా గల సర్వభూతాలలోను; సర్వభూతాలను తన ఆత్మలోనూ దర్శిస్తూ ఉంటాడు.
వ్యాఖ్య: –
ఇక్కడ ‘యోగం’ అంటే జీవుడు, బ్రహ్మం ఒక్కటవ్వడమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మనసు ఆత్మలో పూర్తిగా కలిసిపోవడమే (లీనమైపోవడమే) నిజమైన యోగం. అలాంటి యోగస్థితిని సాధించిన మహనీయుడి లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నారు. ఆ యోగి సమస్త ప్రాణులలో తనను చూసుకుంటాడు, అలాగే తనలో సమస్త ప్రాణులను చూసుకుంటాడు. అంటే అతనికి అంతటా ‘సమదృష్టి’ (అందరినీ, అన్నిటినీ సమానంగా చూసే చూపు) ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రపంచం మొత్తం దానికి ఆధారమైన (అధిష్టానమైన) ‘ఆత్మ’ మీదే కల్పించబడింది. ఉదాహరణకు, తాడులో పామును ఊహించుకున్నట్లుగా, లేదా మనకు వచ్చే కలలు మనలోనే పుట్టినట్లుగా… ఈ సమస్త ప్రపంచం, సకల జీవరాశులు, మొత్తం బ్రహ్మాండం అంతా ఆత్మ మీదే ఆధారపడి ఉంది. కల్పితమైన వస్తువు (పాము) దానికి ఆధారమైన వస్తువు (తాడు) మీద తప్ప వేరే చోట ఉండలేదు కదా? అలాగే, ‘నేను ఆత్మను’ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న యోగి, తనలోనే ఈ ప్రపంచం అంతా ఉన్నట్లు చూస్తాడు. అలాగే, ఈ ప్రపంచం అంతటా ఆత్మే నిండి ఉంది కాబట్టి, ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ తనను (ఆత్మను) చూసుకుంటాడు.
ధ్యానం ద్వారా మనసును ఆత్మలో కలిపేసి, ఆత్మజ్ఞానం పొందిన యోగికి మాత్రమే ఈ స్థితి సాధ్యమవుతుంది; మిగతావారికి కాదు. ఎందుకంటే, “నేను శరీరాన్ని కాదు, ఆత్మను” అని గట్టిగా నమ్మినప్పుడే ఈ ‘సర్వాత్మ భావన’ (అంతటా నేనే ఉన్నాననే భావన) కలుగుతుంది. “నేను శరీరమే” అనుకునేవాడు ఇంకా ఆత్మ స్థాయికి ఎదగలేదు. కాబట్టి వాడు అందరిలో తనను చూడలేడు. దేహభావన చాలా ఇరుకైనది. అది ఉన్నవాడు విశాలంగా ఆలోచించలేడు. వాడు మనుషుల మధ్య తేడాలనే చూస్తాడు. ఆ తేడాలే పోటీకి, అశాంతికి కారణం. కానీ ఆత్మభావన ఉన్నవాడు పైపై రూపాలను పట్టించుకోడు, అంతటా ఆత్మనే చూస్తాడు. అలాంటి వాడికి ఇక ఎవరి మీదా ద్వేషం ఉండదు. “అందరూ నా ఆత్మే, అన్నీ నా శరీరమే” అనుకునేవాడికి మాత్రమే నిజమైన దయ, కరుణ, ప్రేమ కలుగుతాయి. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతోందంటే… నీతిగా బతకాలి అనే ధర్మానికి (Ethics) మూలాధారం ఆధ్యాత్మికతే (Spirituality). “అంతా ఆత్మే, ఆత్మలోనే అంతా ఉంది” అనే ఆధ్యాత్మిక సిద్ధాంతమే ప్రపంచంలోని అన్ని మంచి గుణాలకు పునాది.
సాధకుడు తన యోగసాధనలో పరిపూర్ణత (Perfection) సాధించాలంటే… అందరినీ సమానంగా చూసే గుణాన్ని, విశాలమైన దృష్టిని అలవాటు చేసుకోవాలి. నిజానికి, ఇలాంటి సమదృష్టి ఉన్నవాడే ‘నిజమైన యోగి’ అని మనం గుర్తించాలి. ఒక వ్యక్తి అసలైన యోగి అవునా, కాదా అని తెలుసుకోవడానికి… అతనికి సమస్త ప్రాణులపై ఉండే దయ, ఆ సమానత్వమే (సమభావనే) గీటురాయిగా ఉపయోగపడతాయి.
అంతా ఆత్మగా తోచటమే ఆత్మసాక్షాత్కారం.
సర్వకాల సర్వావస్థలయందూ సమానస్థితియే సమాధి.
“నేను నేనైన నేను,
నేను అంటే అనసూయను అని కాదు.
అన్ని నేనులూ నేనైన నేను.”
— జిల్లెళ్ళమూడి అమ్మ
—
భక్తురాలు: ‘మీ దృష్టిలో మనుషులూ ఇతర జంతువులూ ఒకటిగానే ఉన్నాయి.’
జిల్లెళ్ళమూడి అమ్మ: “అవి యితరమని అనిపించటంలేదు. అన్నీ నేననే అనిపిస్తుంది.”
సర్వత్రా నేనే
పూర్ణజ్ఞానంలో నెలకొన్న మాతృదేవి జ్ఞానపరమైన అనుభవాలు కోకొల్లలు. మనుష్యులకు మాత్రమే కాకుండా, మృగాలు, పక్షులకు కూడా ఆమె ఆశ్రయంగావున్నారు. అనేక ఇళ్ల నుండి కొట్టి తరమబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి. కానీ బ్రహ్మచారి జ్ఞాన్కు పిల్లులంటే గిట్టదు. ఆతడితో మాతృదేవి, “ఇదిగో చూడు, దొంగలించడం పిల్లుల నైజం. వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు?” అనేవారు. ఒకసారి మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకు వెళ్లేటప్పుడు జ్ఞాన్ను పిలిచి ప్రతి రోజూ ఆ పిల్లులకు ఆహార మిచ్చి చూసుకోమన్నారు. ఎదురుచూచినట్లే జ్ఞాన్ జంకుతూ నిలబడ్డాడు. వెంటనే మాతృదేవి, “నాయనా! పిల్లులను కొట్టకు! ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నాను” అన్నారు. అంతే! ఇక వాటి మీద చేయి చేయించుకోగలడా ఆతడు! ఆ రోజు నుండి వాటిని ప్రేమతో పోషించాడు. (మూలం: శ్రీ శారదాదేవి చరితామృతం)
—
బాలగణపతి ఒకనాడు ఆడుకొంటున్నప్పుడు ఒక పిల్లిని చూసి దాన్ని దొరకపుచ్చుకొని పిల్లచేష్టగా చక్కగా బడితపూజ చేసి దాన్ని గాయపరిచాడు. పిల్లి ఎలాగో తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతడు శాంతుడై తల్లి పార్వతీదేవిని చూడడానికి వెళ్ళాడు. తల్లి దేహమంతా గాయాలతో రక్తసిక్తమై ఉండడం చూసి బాలగణపతి ఆశ్చర్యపోయాడు. తల్లిని అలాంటి స్థితిలో చూసి ఎంతో బాధపడి, “కారణం ఏమిటి?” అని తల్లిని అడిగాడు. “నాయనా! దీని కంతటికీ కారణం నువ్వే” అని విచారంతో పలికింది దేవి. తల్లిపట్ల అపార భక్తి ప్రేమలున్న గణపతికి తల్లి మాటలు ఆశ్చర్యాన్ని, అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించాయి. కంట నీరుపెట్టుకొని “అమ్మా! నేను నిన్నెప్పుడు కొట్టాను? లేదా తెలియక నేను చేసిన ఏదైనా దుశ్చర్య ఫలితంగా ఇతరులు నిన్నిలా అవమానించారేమో అంటే అలాంటసంఘటన ఏదీ నాకు జ్ఞాపకం రావడం లేదే?” అన్నాడు.
కుమారుడి పలుకులు విని జగన్మాత ఇలా అన్నది: “నాయనా! ఈ రోజు నువ్వు ఏ ప్రాణినైనా హింసించావేమో కాస్త జ్ఞాపకం తెచ్చుకో.” “అవునమ్మా, ఇంతకు మునుపే ఒక పిల్లిని చావబాది వచ్చాను” అన్నాడు గణపతి. పిల్లి సొంతదారుడు తన తల్లిని అలా గాయపరిచాడేమో అని తలచుకొని బాలగణపతి ఖీన్నుడయ్యాడు. బాలుడలా పశ్చాత్తప్తుడవడం చూసి, ప్రేమపూర్వకంగా అతణ్ణి హృదయానికి హత్తుకొని, అతణ్ణి ఊరడిస్తూ దేవి ఇలా అన్నది: “అలా జరగలేదు, నా ఈ దేహాన్ని ఎవరూ గాయపరచలేదు. కాని పిల్లి ఆదిగాగల ఈ విశ్వంలోని సమస్త ప్రాణికోటిలో నెలకొన్నది నేను కదా! కాబట్టే నువ్వు పిల్లిని గాయపరచిన చిహ్నాలు నా శరీరం మీద కానవస్తున్నాయి. తెలియక నువ్వలా చేశావు కనుక విచారించవద్దు. కాని నేటి నుంచి ఈ సంగతిని ఎప్పుడూ మరిచిపోవద్దు. లోకంలోని స్త్రీలందరూ నా అంశలే, జీవులలోని పురుషులందరూ నీ పితృదేవుల అంశలే. శివశక్తులు తప్ప ఈ జగత్తులో వేరొకటి ఏదీ లేదు.” తల్లి మాటలు బాలగణపతి హృదయంలో ప్రగాఢంగా నాటుకున్నాయి. …..
ఒకానొక సమయంలో పార్వతీ దేవి తను ధరించిన అమూల్యమైన రత్నహారాన్ని చూపిస్తూ కుమారులైన గణేశ కార్తికేయులతో “పధ్నాలుగు లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండం చుట్టూ తిరిగి మీరిద్దరిలో ఎవరు ప్రథములుగా వస్తారో వారికి ఈ రత్నహారాన్ని బహూకరిస్తాను” అన్నది. ఇంకేం, అన్నగారి బానపొట్టను, నెమ్మదిగా కదిలే ఎలుక వాహనాన్ని తలచుకొని ఒకింత పరిహాసపూర్వకంగా నవ్వుకుంటూ ‘రత్నహారం నాకే దక్కుతుంది’ అని నిశ్చయించుకొని, తన నెమలి వాహనం అధిరోహించి తక్షణమే కార్తికేయుడు బయలుదేరాడు. అతడు వెళ్ళిపోయిన చాలాసేపటికి నెమ్మదిగా లేచాడు గణేశుడు. లేచి తన జ్ఞాననేత్రంతో శివశక్త్యాత్మకమైన ఈ జగత్తు యావత్తూ తల్లితండ్రులైన శివపార్వతుల శరీరాలలో దర్శిస్తూ, వారికి ప్రణామాలు చేస్తూ వినమ్ర గమన భంగిమలో వారికి ప్రదక్షిణం చేసి, నిశ్చితమనస్కుడై తన ఆసనంలో కూర్చున్నాడు. ఇది జరిగిన చాలాసేపటికి కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు, రత్నహారం గణేశుడికే చెందుతుందని నిర్దేశించి, వాత్సల్యపూరితురాలై ముద్దు బిడ్డడి మెడలో అలంకరించింది తల్లి పార్వతీదేవి. (మూలం: శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర, సప్రామాణిక జీవిత గాథ)