పుణ్యో గంధః పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు ॥
పుణ్యః, గంధః, పృథివ్యామ్, చ, తేజః, అస్మి, విభావసౌ,
జీవనమ్, సర్వభూతేషు, తపః, చ, అస్మి, తపస్విషు.
పృథివ్యామ్ = భూమిలో; పుణ్యః = పవిత్రమైన; గంధః = గంధతన్మాత్రను; విభావసౌ చ = అగ్నిలో కూడా; తేజః = దీప్తిని; (నేనే)అస్మి = అయి ఉన్నాను; సర్వభూతేషు = సర్వభూతాలలో; జీవనమ్ = ప్రాణం(ఆయువును); తపస్విషు చ = తాపసులలో; తపః = తపస్సు (శీతోష్ణాది ద్వంద్వసహన సామర్థ్యాన్ని); అస్మి = అయి ఉన్నాను.
తా ॥ భూమియందు పవిత్రమైన సుగంధమును నేనే. అగ్నియందు తేజస్సును నేనే. సమస్త ప్రాణులయందు ప్రాణశక్తిని మరియు తపస్సు చేసేవారిలో తపస్సును నేనే.
వ్యాఖ్య:-
మనం వాసన లేని భూమిని గానీ, కాంతి లేని నిప్పుని గానీ, ప్రాణం లేని జీవిని గానీ, తపస్సు లేని ఋషిని గానీ అసలు ఊహించలేం కదా! అందుకే, ఆయా వస్తువుల్లో ఉండే ఆ ‘ముఖ్యమైన సారమే’ (శక్తి) భగవంతుడు. దీన్ని బట్టి, ఆ పరమాత్మ ప్రతి వస్తువులోనూ, పదార్థంలోనూ నిండుగా ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతోంది.