యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయాఽర్చితుమిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ॥ 21
యః, యః, యామ్, యామ్, తనుమ్, భక్తః, శ్రద్ధయా, అర్చితుమ్, ఇచ్ఛతి,
తస్య, తస్య, అచలామ్, శ్రద్ధామ్, తామ్, ఏవ, విదధామి, అహమ్.
యః యః = ఏయే; భక్తః = భక్తుడు; యాం యామ్ = ఏయే; తనుమ్ = దేవతామూర్తిని; శ్రద్ధయా = శ్రద్ధతో; అర్చితుమ్ = ఆరాధింప; ఇచ్ఛతి = కోరునో; తస్యతస్య = ఆయాభక్తునికి; తాం ఏవ = ఆయా మూర్తులందే; అచలామ్ = చలనం లేని (ఏకనిష్ఠయైన); శ్రద్ధామ్ = భక్తిని; అహమ్ = నేను; విదధామి = కలుగజేస్తున్నాను.
తా ॥ (దేవతా విశేషాలను భజించే వారిలో) ఏయే భక్తులు ఏయే దేవతామూర్తులను (అంటే దేవతానురూపమైన మదీయమూర్తిని) శ్రద్ధతో అర్చింప పూనుతారో, (అంతర్యామినైన) నేను ఆయా భక్తులకు ఆయా దేవతా రూపాల యందు దృఢమైన భక్తిని కలుగజేస్తున్నాను. (గీత : 9–23 చూ 🙂
వ్యాఖ్య:-
సాధారణంగా మనం “నేను ఆ దేవుడిని కాకుండా ఈ దేవుడిని మొక్కుతున్నాను కదా, మరి ఆ దేవుడికి కోపం వస్తుందేమో?” అని భయపడుతుంటాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అద్భుతమైన భరోసా ఇస్తున్నాడు. మనుషులు పరమాత్మను (కృష్ణుడిని) కాకుండా, ఇతర దేవతలను పూజించినంత మాత్రాన ఆయనకు వారిపై ఏమాత్రం కోపం (కినుక) రాదు. పైగా, ఆ భక్తుడు ఏ దేవుడిని ఇష్టపడుతున్నాడో, ఆ దేవుడిపై అతనికున్న భక్తిని, నమ్మకాన్ని ఆయనే మరింత బలపరుస్తాడు (దృఢపరుస్తాడు). దీన్నే ‘అచలాం శ్రద్ధాం విదధామి’ అంటారు. నిజానికి తాను కాకుండా వేరే వారిని పూజిస్తున్నా సరే, వారి నమ్మకాన్ని చెడగొట్టకుండా, దాన్ని ఇంకా పెంచడం అనేది పరమేశ్వరుడి అద్భుతమైన దయకు నిదర్శనం. అయితే, దేవుడు అందరికీ ఈ సాయం చేయడు. ఎవరైతే ‘శ్రద్ధ’ (నమ్మకం/Devotion) తో పూజిస్తారో, వారికి మాత్రమే ఆయన సాయం చేస్తారు. నమ్మకం లేకుండా మొక్కుబడికి చేసేవారికి ఈ సాయం అందదు. అందుకే శ్లోకంలో ‘శ్రద్ధయా’ (శ్రద్ధతో కూడిన) అనే పదాన్ని ప్రత్యేకంగా వాడారు. నువ్వు ఏ దేవుడిని నమ్మినా పర్వాలేదు, కానీ ఆ నమ్మకంలో ‘నిజాయితీ, శ్రద్ధ’ ఉంటే చాలు.. ఆ శ్రద్ధను నేనే కాపాడతాను అని భగవంతుడు మాటిస్తున్నారు.
హిందూ మతంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. ఇక్కడ “నువ్వు ఈ దేవుడినే మొక్కాలి, ఈ మార్గంలోనే వెళ్లాలి” అనే బలవంతం లేదు. ఎవరి సంస్కారం (Mental makeup/Nature) బట్టి వారు తమకు నచ్చిన దేవుడిని (ఇష్ట దైవం), నచ్చిన మార్గాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. మనం ఏ దేవుడిని పూజించినా, ఏ పద్ధతిలో వెళ్లినా.. చివరికి అందరూ చేరేది ఆ ఒక్కడినే (పరమాత్మనే). నదులన్నీ వేరు వేరు దిక్కుల నుంచి ప్రవహించినా చివరికి సముద్రంలోనే కలిసినట్లు, అన్ని పూజలు ఆ పరమాత్మకే చెందుతాయి.
ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం గమ్యాన్ని చేరాలంటే రెండు నియమాలు పాటించాలి:
- నడక ఆపకూడదు: నువ్వు వేగంగా వెళ్తావా, మెల్లగా వెళ్తావా అనేది నీ ఇష్టం. కానీ ఎక్కడా ఆగిపోకూడదు. సాధన చేస్తూనే ఉండాలి.
- వెనక్కి వెళ్లకూడదు: మన చూపు ఎప్పుడూ లక్ష్యం (ముందు) వైపే ఉండాలి తప్ప, వదిలేసిన పాత అలవాట్ల వైపు (వెనక్కి) వెళ్లకూడదు.
మనం వేరే దేవుడిని పూజిస్తున్నా, పరమాత్మ మన భక్తిని ఎందుకు బలపరుస్తాడు అంటే.. ఆ భక్తి ద్వారానే మనం మెల్లగా ఎదిగి, చివరికి తన దగ్గరికే వస్తామని ఆయనకు తెలుసు. అందుకే మనకు ఆ స్వేచ్ఛను ఇచ్చారు. చివరగా చెప్పిన విషయం చాలా ముఖ్యమైనది.“కృషి ఉంటేనే దైవానుగ్రహం ఉంటుంది.” మనం అసలు ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆయన పది అడుగులు సాయం చేస్తాడు. కాబట్టి, మోక్షం కావాలనుకునేవారు (ముముక్షువులు) సోమరితనం వదిలి తీవ్రంగా ప్రయత్నించాలి. అప్పుడే గమ్యాన్ని త్వరగా చేరుకుంటారు.
శ్రీ రామకృష్ణ వాణి —
శ్రీరామకృష్ణులు : రోగాన్ని నయం చెయ్యి. దీని కారణంగా భగవంతుడి నామగుణకీర్తనలు చేయలేకపోతున్నాను.
డాక్టరు: ధ్యానం చేస్తే చాలుకదా!
శ్రీరామకృష్ణులు: అదేం మాట? మొహం మొత్తిపోయేలా ఒకేదాన్ని ఆశ్రయించుకొని నేను ఎలా ఉండగలను? నేను చేపను పలు రకాలుగా వండి తింటాను. పులుసు, వేపుడు, ఊరగాయ ఇలా అన్ని రకాలుగా తింటాను. నేను ఒక్కోసారి పూజ, ఒక్కోసారి జపం, ఒక్కోసారి ధ్యానం, లేకుంటే ఆయన నామ గుణ కీర్తనలు చేస్తుంటాను. ఒక్కోసారి ఆయన నామం ఉచ్చరిస్తూ నాట్యం చేస్తాను.
డాక్టరు: నా స్వభావం కూడా అలాంటిదే.
శ్రీరామకృష్ణులు: నీ కుమారుడు అమృత్ భగవదవతారాన్ని విశ్వసించడు. అయితే అందులో తప్పేం ఉందిలే? భగవంతుణ్ణి నిరాకారుడిగా విశ్వసించినా కూడా ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. సాకారుడిగా విశ్వసించినా కూడా ఆయనను ప్రాప్తించుకోవచ్చు. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడం, ఆయనకు శరణాగతి గావడం – ఇవి రెండే కావలసినవి. మనిషి అజ్ఞాని; అతడి ద్వారా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఒక సేరు పాత్రలో నాలుగు సేర్ల పాలు పెట్టగలమా? అందుకే నువ్వు ఏ మార్గం అనుసరించినా సరే, వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆయన అంతర్యామి. ఆయన నీ హృదయపూర్వక ప్రార్థనలను తప్పక వింటాడు. నువ్వు సాకారవాదుల మార్గాన్ని అనుసరించు. లేకుంటే నిరాకారవాదుల మార్గాన్నయినా అనుసరించు. వ్యాకులత పొందినట్లయితే భగవంతుణ్ణి పొందగలవు. కలకండ ముక్కను నువ్వు నిలువుగా తిన్నా సరే, అడ్డంగా తిన్నా సరే, అది తియ్యగానే ఉంటుంది. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
సురేంద్రనాథ్ అనే వ్యక్తికి గురుదేవులను పురుషునిగా ఆరాధించడం సబబుగా తోచలేదు. అందువల్ల పూజ ముగించి, పూజాఫలాన్ని గురుదేవుల పాద పద్మాలకు సమర్పించేటప్పుడు ‘ఓ మహేశ్వరీ’ అంటూ సంబోధించేవాడు. ఈ విషయం విన్న మాతృదేవి, “నిజమే. ఆయనే మహేశ్వరుడు, ఆయనే మహేశ్వరి. సకల దేవీదేవతలలోనూ, సకల జీవరాసులలోనూ ఆయనే వెలసివున్నారు. ఆయనను ఈశ్వరునిగానో, ఈశ్వరిగానో నీ ఇచ్ఛానుసారం పేర్కోవచ్చు” అన్నారు. (మూలం: శ్రీ శారదాదేవి చరితామృతం)