ఏషా తేఽభిహితా సాంఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శృణు ।
బుద్ధ్యా యుక్తో యయా పార్థ
కర్మబంధం ప్రహాస్యసి ॥
ఏషా, తే, అభిహితా, సాంఖ్యే, బుద్ధిః, యోగే, తు, ఇమామ్, శృణు,
బుద్ధ్యా, యుక్తః, యయా, పార్థ, కర్మబంధమ్, ప్రహాస్యసి.
పార్థ = అర్జునా; సాంఖ్యే = ఆత్మతత్త్వ విషయంలో; ఏషా = ఈ; బుద్ధిః = జ్ఞానం; తే = నీకు; అభిహితా = చెప్పబడినది; తు = కాని; యయా = ఏ; బుద్ధ్యా = జ్ఞానంతో; యుక్తః = కూడుకొన్నవాడవై; కర్మబంధమ్ = కర్మ బంధాన్ని; ప్రహాస్యసి = త్యజిస్తావో; (అట్టి) యోగే = కర్మ యోగవిషయంలో; ఇమామ్ = ఈ చెప్పబోవు దానిని; శృణు = విను.
తా ॥ పార్థా! ఇప్పటివరకు నీకు ‘సాంఖ్య యోగం’ (ఆత్మ జ్ఞానం) గురించి వివరించాను. ఇప్పుడు ‘కర్మ యోగం’ గురించి విను. ఈ బుద్ధితో (జ్ఞానంతో) కర్మ చేస్తే నువ్వు కర్మ బంధనాల నుండి విముక్తుడవుతావు.
వ్యాఖ్య: –
పని (కర్మ) చేసినా బంధాలలో చిక్కుకోకుండా ఉండాలంటే, ఆ పనిని ఎలా చేయాలో తెలిపే విచక్షణ (వివేకం) అవసరం. ఆ విచక్షణనే ఇక్కడ ‘బుద్ధి’ అని పిలిచారు.
అలాంటి బుద్ధితో (సరైన అవగాహనతో) కర్మను ఆచరిస్తే, జీవుడు కర్మ బంధాలలో ఇరుక్కోడు. మామూలుగా అయితే బంధాన్ని కలిగించే ఆ పనే… అప్పుడు మోక్షానికి దారి చూపిస్తుంది.
కాబట్టి భగవంతుడు చెప్పబోయే ఆ ‘బుద్ధి’ని (జ్ఞానాన్ని), ఆ కర్మయోగ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుని బంధాల నుండి విముక్తి పొందాలి.