తతః శంఖాశ్చ భేర్యశ్చ
పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత
స శబ్దస్తుములోఽభవత్ ॥
తతః, శంఖాః, చ, భేర్యః, చ, పణవానక గోముఖాః,
సహసా, ఏవ, అభ్యహన్యంత, సః, శబ్దః, తుములః, అభవత్.
తతః = పిమ్మట; శంఖాః చ = శంఖాలు; భేర్యః చ = భేరులు; పణవ ఆనక గోముఖాః = డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు; సహసా ఏవ = ఒకేసారిగా; అభ్యహన్యంత = వాయింపబడ్డాయి; సః శబ్దః = ఆ ధ్వని; తుములః = సంకులము; అభవత్ = అయ్యెను.
తా ॥ వెంటనే శంఖాలు, భేరీలు, తమ్మటలు, నగారాలు, కొమ్ములు ఒకేసారి మ్రోగాయి. ఆ శబ్దం చాలా భయంకరంగా మిన్నంటింది.
వ్యాఖ్య:-
కౌరవ సైన్యం ఉత్సాహం: సేనాధిపతి భీష్ముడు చేసిన శంఖనాదం, సింహనాదం మిగిలిన సైనికులలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఆ ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రకరకాల యుద్ధ వాయిద్యాలను మోగించి, భీకరమైన శబ్దాలు చేశారు.
పాండవుల వంతు: “నా వాళ్ళు, పాండవులు యుద్ధంలో ఏం చేశారు?” అని ధృతరాష్ట్రుడు మొదట్లో అడిగాడు కదా! ఆ ప్రశ్నకు సమాధానంగా, సంజయుడు ఇప్పటిదాకా కౌరవుల వైపు జరిగిన విషయాలను వివరించాడు. ఇక ఇక్కడి నుంచి రాబోయే 5 శ్లోకాల్లో పాండవుల వైపు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళు ఎలా స్పందించారో వివరిస్తున్నాడు.