అక్షరాణామకారోఽస్మి ద్వంద్వస్సామాసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ॥ 33
అక్షరాణామ్, అకారః, అస్మి, ద్వంద్వః, సామాసికస్య, చ,
అహమ్, ఏవ, అక్షయః, కాలః, ధాతా, అహమ్, విశ్వతో ముఖః.
అక్షరాణామ్ = అక్షరాలలో; అకారః = అకారాన్ని; అస్మి = అయి ఉన్నాను; సామాసికస్య చ = సమాసాలలో; ద్వంద్వః = ఉభయపద ప్రధానమైన ద్వంద్వ సమాసాన్ని; అహం ఏవ = నేనే; అక్షయః = ప్రవాహరూపమైన; కాలః = కాలాన్ని (కాలకాలుడైన పరమేశ్వరుణ్ణి); అహమ్ = నేను; విశ్వతోముఖః = సర్వతోముఖుడైన; ధాతా = కర్మ ఫలదాతను.
తా ॥ అక్షరాలలో నేను అకారాన్ని , సమాసాలలో ఉభయపద ప్రధానమైన ద్వంద్వాన్ని; ప్రవాహరూపమైన కాలాన్ని , సర్వతోముఖుడైన కర్మఫలదాతను కూడా నేనే.
వ్యాఖ్య:-
‘విశ్వతోముఖః’ – భగవంతుడిని ‘సర్వతోముఖుడు’ (అన్ని వైపులా ముఖాలు ఉన్నవాడు) అని వర్ణించారు. దీని అర్థం ఏమిటంటే… ఆయన లేని చోటు లేదు, ఆయన చూపు (దృష్టి) పడని ప్రదేశం లేదు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నింటినీ చూస్తున్నాడు. ఈ రహస్యం గనుక తెలిస్తే… ఇక ఎవరూ పాపపు పనులు చేయలేరు. బయట చేయడమే కాదు, కనీసం మనసులో కూడా పాపం చేయాలంటే భయపడతారు.
కాలం నా చేతుల్లో!
స్వామి వివేకానంద ఏదీ తొందరపడి చేయరు. ఎప్పుడూ ఆయన పనులలో నిదానం కనిపిస్తుంది. రైలు, బండి అందుకోవడానికి ఎవరైనా పరు గెత్తడం చూస్తే ఆయనకు విచిత్రంగా కనిపిస్తుంది; “ఎందుకు, దీని తరువాత బండి అందదా?” అని ఆయన అడగడం కద్దు. ప్రసంగాలనో, తరగతులనో సకాలంలో ప్రారంభించడాన్ని గురించి ఆయన కలత చెందరు. అదే విధంగా ఎప్పుడు పూర్తిచేస్తారో కూడా చెప్పలేం. తీసుకొన్న విషయాంశం పూర్తిచేసేదాకా ఆయన ప్రసంగిస్తూనే ఉంటారు; అనుకొన్న సమయం కన్నా రెండింతల సమయం పట్టినా ఆయన లెక్కచేయరు. తరగతులకు వెళ్లడానికి ఇంకా కొన్ని నిమిషాలుందన్నంత వరకూ గదిలోనే తీరికగా కూర్చుని ఉంటారు. మామూలు దుస్తుల్లో, కుర్చీలో బాసికపట్టు (పద్మాసనం) వేసుకొని మాట్లాడుతుంటారు, ప్రశ్నలకు జవాబులిస్తారు, హాస్యాలాడతారు, పొగత్రాగుతారు. బయలుదేరడానికి ఒకటి రెండు నిమిషాలు ఉందనగా లేచి తమ గదిలోకి వెళతారు. కాషాయాంబరాలు ధరిస్తారు, గంభీర వైఖరిలో తరగతిలోకి వెళతారు. ఆ గాంభీర్యం ఎన్నడూ ఆయన నుండి వైదొలగింది లేదు.
ప్రసంగాలకు సామాన్యంగా స్వామీజీ కాస్త ఆలస్యంగానే వెళ్లేవారు. ఒక రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామీజీ శ్రీకృష్ణుని గురించి ప్రసంగించవలసి ఉంది. ఆయన వెళ్లలేదు. స్వామీజీ ప్రసంగాలకు సమావేశకర్తయైన ఆలెన్ పలుమార్లు వీథి మూలకు వెళ్లి స్వామీజీ రాక కోసం చూశాడు. ఐదవసారి వెళ్లి చూసినప్పుడు వీథి చివరన స్వామీజీ నడిచిరావడం కనిపించింది. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడున్నర అయింది. అలవాటు ప్రకారం నెమ్మదిగా, గంభీరంగా ఆయన వస్తున్నారు. ఆపైన ఆలెన్ ఉండబట్టలేకపోయాడు. తిన్నగా స్వామీజీ వద్దకు వెళ్లి ఆయనతో కలిసి నడవసాగాడు. స్వామీజీ నడక వేగం పెరగలేదు. చివరికి ఆలెన్, “స్వామీజీ! అందరూ వేచివున్నారు. ఇప్పటికే ఆలస్యమై పోయింది” అని చెప్పాడు. అందుకు స్వామీజీ, “ఆలెన్! నే నెప్పుడూ ఆలస్యం చేయను. లోకంలోని సమయమంతా నాకు ఉంది. కాలమే నా చేతిలో ఉంది” అన్నారు. “శ్రోతలు దీనిని అవగతం చేసుకోలేరే!” అన్నాడు ఆలెన్. కాని స్వామీజీ ఏ మార్పూ లేకుండా అట్లే నెమ్మదిగా నడుస్తున్నారు. విషయం అక్కడితో ఆగిపో లేదు.
దారిలో చెప్పులు పాలిష్ చేసే దుకాణం ఒకటి ఉంది. పాలిష్ చేసే వ్యక్తి పనిలేకుండా ఉండడం చూసి స్వామీజీ తిన్నగా దుకాణంలోకి వెళ్లారు. తమ చెప్పులను పాలిష్ చేయమన్నారు. తొందరను తెలుపడానికి ఏవేవో సైగలు చేశాడు ఆలెన్. కాని స్వామీజీ వేటినీ పట్టించుకోలేదు. చివరికి ఏదో రకంగా వేదిక వద్దకు వచ్చారు. ‘కాలం నా చేతిలో’ అనే స్వామీజీ వచనాన్ని గ్రహించే ఆస్కారం ఆలెన్కు అప్పుడే లభించింది. స్వామీజీ వేదిక మీద నిలబడ్డారు, ఆలెన్ ప్రక్కకు వెళ్లి నిలబడే స్వామీజీని పరిచయం చేయనారంభించాడు. పిదప జరిగింది ఇలా చెబుతున్నాడు:
“స్వామీజీని పరిచయం చేస్తూ ఆయన వైపు చూశాను. క్షణంలో ఒక అద్భుత అనుభూతిని చవిచూశాను. హఠాత్తుగా స్వామీజీ అనంత స్వరూపుని గానూ, నేను పిగ్మీ (ఆఫ్రికన్ మరుగుజ్జు) గానూ అనిపించింది. ఈయనను నేను పరిచయం చేయడమా? ఆ తరువాత నేను ఎన్నడూ ఆయన ప్రక్కన నిలబడి పరిచయం చేస్తే ఒట్టు! వేదిక దిగువ నిలబడే పరిచయం చేశాను.” (మూలం: స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవితగాథ – 2)