అర్జున ఉవాచ :
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే ।
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః ॥
ఏవమ్, సతతయుక్తాః, యే, భక్తాః, త్వామ్, పర్యుపాసతే,
యే, చ, అపి, అక్షరమ్, అవ్యక్తమ్, తేషామ్, కే, యోగవిత్తమాః.
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; ఏవమ్ = ఈ విధంగా (సర్వకర్మార్పణం చేస్తూ); సతత యుక్తాః = నిరంతర నిష్ఠులవుతూ; యే భక్తాః = ఏ భక్తులు; త్వామ్ = నిన్ను(విశ్వరూపుని); పర్యుపాసతే = ధ్యానిస్తున్నారో; యే చ అపి = మరియు (ఎవరు); అవ్యక్తమ్ = నిర్గుణము (నిర్విశేషమైన); అక్షరమ్ = బ్రహ్మాన్ని (ధ్యానిస్తున్నారో); తేషామ్ = వీరిలో; యోగవిత్తమాః = యోగజ్ఞశ్రేష్ఠులు; కే = ఎవరు?;
తా ॥ అర్జునుడు పలికెను: ఈ విధంగా నిరంతరం నీపైనే మనసు లగ్నం చేసి, రూపం ఉన్న నిన్ను సేవించే భక్తులు కొందరు; అలా కాకుండా కంటికి కనపడని, నాశనం లేని పరబ్రహ్మాన్ని ఉపాసించే వారు మరికొందరు. వీరిలో ఎవరు శ్రేష్ఠులు?
వ్యాఖ్య:-
ఈ శ్లోకం మొదట్లో ‘ఏవమ్’ (ఈ విధంగా) అనే పదాన్ని వాడారు. ఇది కిందటి అధ్యాయం చివరి శ్లోకంలో (11వ అధ్యాయం, 55వ శ్లోకం) కృష్ణుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తోంది.
అర్జునుడికి ఒక పెద్ద సందేహం వచ్చింది. అదేంటంటే—ఈ రెండు రకాల భక్తులలో ఎవరు గొప్పవారు?
- సగుణోపాసకులు: భగవంతుడి విశ్వరూపాన్ని గానీ, లేదా కృష్ణుడు, రాముడు వంటి ఇతర రూపాలను (విగ్రహాలను) గానీ… ఎప్పుడూ భక్తితో పూజించేవారా?
- నిర్గుణోపాసకులు: లేదా… దేవుడికి రూపం లేదు, ఆయన కంటికి కనిపించడు, గుణాలు లేనివాడు, నాశనం లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు అని నమ్మి ఆ నిరాకార దేవుడిని ధ్యానించేవారా?
వీరిద్దరిలో యోగంలో ఎవరు బెస్ట్? అని అర్జునుడు అడుగుతున్నాడు. కృష్ణుడు ఇంతకుముందు (2వ, 8వ అధ్యాయాల్లో) రూపం లేని దేవుడి (నిరాకార/నిర్గుణ) ధ్యానం గురించి చాలా గొప్పగా చెప్పాడు. కానీ ఇప్పుడు (11వ అధ్యాయంలో) తన అద్భుతమైన విశ్వరూపాన్ని చూపించి, రూపంతో ఉన్న దేవుడిని (సగుణ) పూజించమని చెప్పాడు. ఇలా రెండు రకాలుగా చెప్పేసరికి… ‘అసలు ఈ రెండింటిలో ఏది శ్రేష్ఠమైన మార్గం?’ అని అర్జునుడికి సందేహం రావడం సహజమే కదా!