విస్తరేణాత్మనో యోగం
విభూతిం చ జనార్దన ।
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తిమేఽమృతమ్ ॥
విస్తరేణ, ఆత్మనః, యోగమ్, విభూతిమ్, చ, జనార్దన,
భూయః, కథయ, తృప్తిః, హి, శృణ్వతః, న, అస్తి, మే, అమృతమ్.
జనార్దన = కృష్ణా; ఆత్మనః = నీ; యోగమ్ = సర్వజ్ఞత్వాదికమైన ఐశ్వర్యాన్ని; విభూతిమ్ చ = వేరు వేరైన ధ్యేయ వస్తువులను; విస్తరేణ = వివరంగా; భూయః = మళ్ళీ; కథయ = చెప్పు; హి = ఏమన (నీ); అమృతమ్ = వాక్యామృతాన్ని; శృణ్వతః = వింటున్న; మే = నాకు; తృప్తిః = పరితృప్తి (చాలనే భావం); న అస్తి = లేదు (కలుగుట లేదు).
తా ॥ ఓ జనార్దనా! నీ యోగ శక్తిని, విభూతులను గురించి నాకు మళ్ళీ వివరంగా తెలుపుము. నీ అమృతప్రాయమైన మాటలను వింటుంటే నాకు తృప్తి కలగడం లేదు (అంటే ఇంకా వినాలని ఉంది).
వ్యాఖ్య:-
గురువుగారి మాటలు వినేటప్పుడు శిష్యుడికి ఇలాంటి ఆసక్తి (ఉత్కంఠ) కలగాలి. (అంటే గురువుగారు ఎంత చెబుతున్నా ఇంకా వినాలి అనే తపన శిష్యుడిలో ఉండాలి).