యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ॥ 59
యత్, అహంకారమ్, ఆశ్రిత్య, న, యోత్స్యే, ఇతి, మన్యసే,
మిథ్యా, ఏషః, వ్యవసాయః, తే, ప్రకృతిః, త్వామ్, నియోక్ష్యతి.
అహంకారమ్ = అహంకారాన్ని; ఆశ్రిత్య = ఆశ్రయించి; న యోత్స్యే = యుద్ధం చేయను; ఇతి = అని; యత్ = దేనిని; మన్యసే = తలుస్తున్నావో; తే = నీ; ఏషః = ఈ; వ్యవసాయః = నిశ్చయం; మిథ్యా = భ్రమమూలకం (వ్యర్థం); ప్రకృతిః =క్షత్రియస్వభావం; త్వామ్ = నిన్ను; నియోక్ష్యతి = నియోగింపగలదు.
తా ॥ (మంచిది, వినష్టుణ్ణే అవుతాను, బంధువులతో యుద్ధం చేయనని అంటావా 🙂 అహంకారాన్ని ఆశ్రయించి ‘యుద్ధం చేయను’ అని నీవు తలుస్తున్నది భ్రమమూలకమే; నీ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. (రజఃప్రధానమైన) క్షత్రియ స్వభావం నిన్ను యుద్ధంలో నియోగింపగలదు.
వ్యాఖ్య: –
కర్తృత్వాన్ని (నేనే చేస్తున్నాననే భావనని) వదిలిపెట్టి, క్షత్రియుడికి తగిన ధర్మయుద్ధం చేయమని కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా హెచ్చరిస్తున్నాడు: “ఓ అర్జునా! ఒకవేళ అహంకారంతో నా మాటను కాదని యుద్ధం చేయను అనుకుంటే, ఆ ప్రయత్నం వృథానే అవుతుంది. ఎందుకంటే, నీకున్న క్షత్రియ స్వభావమే (నీ ప్రకృతి) నిన్ను బలవంతంగానైనా యుద్ధంలోకి దింపుతుంది.” భవిష్యత్తు తెలిసిన పరమాత్మ ఈ నిజాన్ని ముందుగానే స్పష్టం చేశారు.
పేద యువకుడొకడు మంత్రదీక్ష కోసం రెండు మూడుసార్లు జయరాం బాటికి వచ్చాడు. మాతృదేవి ఆరోగ్యం బాగాలేనందువల్ల మంత్రదీక్ష తీసుకోవడం కుదరలేదు. అందువల్ల ఆతడు మాతృదేవికి ఒక జాబు వ్రాశాడు. అందులో, “అమ్మా! దయచేసి ఇకపై వీలుకాదని చెప్పకండి. ప్రతిసారీ నేను ఎంతో శ్రమ పడి అక్కడికి వస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడయినా నాకు మంత్రదీక్ష ప్రసా దిస్తారా అని తెలుసుకోగోరుతున్నాను” అంటూ వ్రాశాడు. జాబును చదవగా విన్న మాతృదేవి తన శిష్యునితో, “వారెవరయినా నా ఆరోగ్యం బాగాలేని సమయంలో వస్తే తప్పకుండా తిరిగి వెళ్లాల్సిందే, బహుశా ఆరోగ్యంగా ఉన్నాకూడా. వచ్చేవారి కందరికీ మంత్రదీక్ష యిస్తాను అంటూ ఆహ్వానించడమూ జరగదు. దీనికి అను కూల సందర్భాలు వారివారి ప్రారబ్ధానికి తగినట్లు ఉంటాయి. ఒక వ్యక్తి పలు మార్లు రావడం జరిగినా నన్ను దర్శించుకోలేడు; నా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, లేదా ఇంకేదో ఆటంకం రావచ్చు. అది ఆతడి దురదృష్టం. నేనేం చేయగలను? వారందరూ ఇక్కడికి రావడానికి బాగా డబ్బు ఖర్చవుతుందే, అందరూ డబ్బున్న వాళ్లు కాదుకదా అంటూ మీరు అనవచ్చు. కానీ శిష్యుడు కావాలని అభిలషించే వ్యక్తిని గురువు పలుమార్లు ఇలా త్రిప్పి పంపవచ్చు. గురువు కృపాకటాక్షం గోరేవాడు బిచ్చమెత్తి అయినా ఇక్కడికి వస్తాడు. అసలు విషయం ఇదే! ఈ సంసార సాగరాన్ని దాటాలని పట్టుదల ఉన్నవాడు ఎలాగయినా సంసార బంధా లను తెంచుకొంటాడు. ఎవరూ ఆతణ్ణి ఆపలేదు. డబ్బు లేకపోవడం, జవాబుకు నిరీక్షణలు, మంత్రదీక్ష లభించకుండా తిరిగి వెళ్లలేమోననే భయం – ఇవన్నీ కేవలం సాకులు” అన్నారు.
మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవాలని అభిలషించినా అలా తీసుకో లేకపోయిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలియవస్తున్నది. నవదీప్ చంద్రరాయ్ అనే వ్యక్తి మాతృదేవి అనుమతితో ఇద్దరు యువకులను మంత్రదీక్ష కోసం తోడ్కొని వచ్చాడు. మొదటి యువకునికి మంత్రదీక్ష ఇస్తున్నప్పుడు రెండవ యువకుడు హఠాత్తుగా లేచి ఒక్క పరుగుతో పారిపోయాడు. ఆతడు ఈ సంఘటనను గురించి చెప్పినప్పుడు “చెప్పనలవికాని ఏదో భయం అప్పుడు నన్ను ఆవహించింది. అందువల్ల పరుగుతీశాను” అన్నాడు.
మరొక వ్యక్తి ఉద్బోధన్ కార్యాలయంలో పనిచేసిన చంద్రమోహన్. దుకా ణానికి వెళ్లిరావడం లాంటి చిన్న చిన్న పనులు చేసిపెట్టడం వల్ల మాతృదేవితో సహజంగా మెలిగేవాడు. ఒక రోజు వృద్ధ సాధువులలో ఒకరు ఆతనితో, “నువ్వు అనుకున్నప్పుడల్లా మాతృదేవి వద్దకు వెళ్లగలుగుతున్నావు, ప్రసాదం తీసుకుని తింటున్నావు. నువ్వెందుకు ముక్తి కావాలని ఆమెను ప్రార్థించకూడదు?” అని అడిగారు. అందుకు చంద్రమోహన్. “అదేం గొప్ప విషయం! ఇదుగో ఇప్పుడే వెళ్లి అడిగి వస్తాను” అంటూ గొప్పలు చెప్పుకుంటూ మాతృదేవిని వెదుక్కుంటూ వెళ్లాడు. అప్పుడు మాతృదేవి పూజలో ఉన్నారు. చంద్రమోహన్ ఆమె దృష్టిని ఆక ర్షించడానికి గది తలుపు వద్ద నిలబడ్డాడు. కానీ కొంతసేపటికి ఆతడి శరీరం కంపించసాగింది. మాతృదేవి ఆతణ్ణి చూసి ‘ఏం కావాలి?’ అంటూ సైగ చేశారు. ఆతడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. తడబడుతూ నిలబడ్డాడు. తర్వాత ఇన్ని రోజులుగా అడుగుతున్న అలవాటు ప్రకారం, “నాకు ప్రసాదం కావాలి” అన్నాడు. మాతృదేవి ఏమీ మాట్లాడకుండా ప్రసాదం ఉన్న చోటు చూపారు. ఆతను కూడా ఎప్పటిలా ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చాడు. ఆ వణకు పోవ డానికి ఆతడికి గంటసేపు పట్టింది.
మరొక సంఘటన: అప్పుడు మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. మాతృదేవి అనుమతితో సన్న్యాసం పుచ్చుకోవడానికి గిరీశ్ అక్కడికి వచ్చాడు. కానీ మాతృదేవి అందుకు సమ్మతించలేదు. గిరీశ్ అరగంటకు పైగా మాతృదేవితో వాదన చేశాడు. కానీ మాతృదేవి ఒప్పుకోలేదు. గిరీశ్ ముక్కోపి. హఠాత్తుగా ఆతనికి కోపమూ, ఆవేశమూ వచ్చేస్తాయి. ఎవరూ సాహసించని మాటలను గురు దేవులతోనే మాట్లాడి పోట్లాడినవాడు. అలాంటి మనిషి మొండిపట్టుదల కూడా మాతృదేవి పట్టుదలను సడలింప చేయలేకపోయింది. గిరీశ్ సన్న్యాసం పుచ్చు కోవడానికి చివరి దాకా ఆమె అనుమతించనే లేదు. (మూలం; శ్రీ శారదాదేవి చరితామృతం)