శ్రీభగవానువాచ :
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాంక్షిణః ॥
సుదుర్దర్శమ్, ఇదమ్, రూపమ్, దృష్టవాన్, అసి, యత్, మమ,
దేవాః, అపి, అస్య, రూపస్య, నిత్యమ్, దర్శన కాంక్షిణః.
మమ = నా; ఇదమ్ = ఈ; సుదుర్దర్శమ్ = అత్యంత దుర్దర్శమైన; యత్ = ఏ; రూపమ్ = విశ్వరూపాన్ని; దృష్టవాన్ అసి = చూసావో; దేవాః అపి = దేవతలు కూడా; అస్య = ఈ; రూపస్య = విశ్వరూపాన్ని; నిత్యమ్ = సర్వదా; దర్శన-కాంక్షిణః = చూడగోరతారు.
తా ॥ శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: నీవు చూసిన నా ఈ రూపం చూడటం చాలా కష్టం. దేవతలు కూడా నా ఈ రూపాన్ని చూడాలని ఎల్లప్పుడూ ఆరాటపడుతుంటారు.
వ్యాఖ్య:-
భగవంతుడి నిజరూపాన్ని సామాన్యులెవరూ చూడలేరు. ఎంతో స్వచ్ఛమైన మనసు (చిత్తశుద్ధి), అనన్యమైన భక్తి ఉన్నవారు మాత్రమే ఆయన్ని దర్శించగలరు. అందుకే దీనిని కేవలం ‘చూడటం కష్టం’ (దుర్దర్శం) అని అనకుండా, ‘చూడటం చాలా చాలా కష్టం’ (సుదుర్దర్శం) అని చెప్పారు. అంటే, భగవంతుడి దర్శనం దొరకడం ఎంతో అరుదైన విషయం అని అర్థం.