బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ 19
బహూనామ్, జన్మనామ్, అంతే, జ్ఞానవాన్, మామ్, ప్రపద్యతే,
వాసుదేవః, సర్వమ్, ఇతి, సః, మహాత్మా, సుదుర్లభః.
బహూనామ్ = పెక్కు; జన్మనామ్ = జన్మల; అంతే = చివర (సాధనఫలంగా); జ్ఞానవాన్ = ఈ తత్త్వజ్ఞాని; మామ్ = నన్ను; సర్వమ్ = చరాచర జగత్తంతా; వాసుదేవః = వాసుదేవుడే; ఇతి = అని; ప్రపద్యతే = భజిస్తాడు; (కనుక) సః = ఇటువంటి; మహాత్మా = మహాత్ముడు; సుదుర్లభః = మిక్కిలి అరుదు.
తా ॥ బహుజన్మల సాధనా ఫలంగా (పెక్కుజన్మలలో కొంచెం కొంచెంగా ఒనర్చబడిన పుణ్యఫలంగా) చివరి జన్మలో తత్త్వజ్ఞాని ‘ఈ జగత్తు వాసుదేవుడే’ (బ్రహ్మమే) అని గ్రహించి (సర్వాత్మ దృష్టియై) నన్ను భజిస్తాడు. కనుక, (అపరిచ్ఛిన్న దృష్టి గల) ఇలాంటి మహాపురుషుడు అత్యంత దుర్లభుడు. (గీత: 7–3 చూ.)
వ్యాఖ్య:-
జీవుడు ఈ సంసార చక్రంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. పురుగులు, కీటకాలు, జంతువులుగా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత.. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ ఈ “మనిషి జన్మ” రాదు. పోనీ మనిషిగా పుట్టాం కదా అని అందరూ మోక్షం కోసం ప్రయత్నిస్తారా? అంటే లేదు.
- కోటి మందిలో కొందరు మాత్రమే అసలు ఆ ప్రయత్నమే మొదలుపెడతారు.
- ఆ ప్రయత్నించే కొద్దిమందిలో కూడా.. చివరిదాకా నిలబడి, ఆత్మజ్ఞానం పొందే ‘ధీరుడు’ ఎవరో ఒక్కడే ఉంటాడు.
ఇది ఒక్క జన్మలో వచ్చే జ్ఞానం కాదు. ఎన్నో జన్మలుగా కొంచెం కొంచెం పుణ్యం పోగుపడి, దానికి తోడు తీవ్రమైన సాధన, దేవుడి దయ కలిస్తేనే ఆ జ్ఞానం పుడుతుంది. అప్పుడు ఆ జ్ఞానికి ఈ ప్రపంచమంతా వేరుగా కనిపించదు. “అంతా వాసుదేవుడే (దేవుడే)” నిండి ఉన్నాడని అర్థమవుతుంది. ప్రతి అణువులోనూ దేవుడినే చూస్తాడు. ఇలాంటి దృష్టి (సర్వాత్మ భావం) కలిగిన మహాత్ములు దొరకడం చాలా కష్టం. అందుకే భగవంతుడు వారిని “సుదుర్లభులు” (అత్యంత అరుదైనవారు) అని పిలిచారు. నూటికి, కోటికి ఎవరో ఒక్కరే ఇలాంటి మహాత్ములు ఉంటారు.
“జ్ఞానం రావాలంటే చాలా జన్మలు ఎత్తాలి కదా.. నాకింకా చాలా టైం ఉందిలే” అని ఎప్పుడూ సోమరితనంతో ఉండకూడదు. ఇప్పటిదాకా గడిచిపోయిన జన్మలే ఆ ‘అనేక జన్మలు’ అని అనుకోవాలి. ఈ జన్మలోనే ఆ దేవుడిని చేరుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని, ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నించాలి. మనకు అసలు జ్ఞానం వచ్చిందా? లేదా? అని తెలుసుకోవడానికి భగవంతుడు ఒక సింపుల్ టెస్ట్ పెట్టారు. సాధకులు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి: “నాకు ఈ ప్రపంచమంతా వాసుదేవుడిలా (దేవుడిలా) కనిపిస్తుందా? లేదా?” ఒకవేళ మీకు ఇంకా మనుషులు, వస్తువులు, పేర్లు, రూపాలే (Name and Forms) వేరువేరుగా కనిపిస్తుంటే.. మీ సాధన ఇంకా పండలేదని అర్థం. మీరు ఇంకా ధ్యానం, విచారణ పెంచాలి. ఎప్పుడైతే మీకు “అంతా బ్రహ్మమే (సర్వం ఖల్విదం బ్రహ్మ)” అనే అనుభవం కలుగుతుందో, అప్పుడే మీరు ఈ పరీక్ష పాస్ అయినట్టు. మొదట్లో దేవుడిని కేవలం గుడిలోనో, విగ్రహంలోనో, తీర్థాలలోనో చూస్తాం. చివరికి జ్ఞానం వచ్చాక.. “జగమంతా రామమయం” అన్నట్లు, ప్రతి అణువులోనూ, అంతటా ఆ దేవుడినే చూస్తాం. గుడిలో దేవుడిని చూడటం మొదటి మెట్టు అయితే, అంతటా దేవుడిని చూడటమే చివరి మెట్టు. అక్కడికి చేరడమే మన లక్ష్యం.
“అనేక జన్మల తర్వాత జ్ఞాని అవుతాడు” అంటే.. జ్ఞానం వచ్చాక కూడా మోక్షం కోసం మళ్లీ కొన్ని జన్మలు వెయిట్ చేయాలని అర్థం కాదు. మనిషికి జ్ఞానం కలగడానికే అనేక జన్మలు పడుతుంది. కానీ, ఒక్కసారి ఆ జ్ఞానం కలిగిన మరుక్షణం అతనికి మోక్షం వచ్చేస్తుంది. ఇక ఆలస్యం ఉండదు.
ఎవరైతే ఈ ప్రపంచమంతా దేవుడే నిండి ఉన్నాడని చూస్తారో (వాసుదేవ సర్వమితి), అటువంటి జ్ఞానికి గీతాచార్యుడు స్వయంగా “మహాత్మా” అనే గొప్ప బిరుదును ఇచ్చారు. మనం ఎలా బతుకుతున్నాం అనేది మన చేతుల్లోనే ఉంది.
- సామాన్యాత్ముడు: “నేను, నా కుటుంబం, నా ఇల్లు” అనే చిన్న చూపు (పరిచ్ఛిన్న దృష్టి/Narrow mind) ఉన్నవాడు కేవలం సామాన్యుడిగానే మిగిలిపోతాడు.
- మహాత్ముడు: “అందరూ నా వాళ్లే, అంతా దేవుడే” అనే విశాలమైన చూపు (Broad mind) ఉన్నవాడు ‘మహాత్ముడు’ అవుతాడు.
అందుకే ప్రతి ఒక్కరూ ఆ చిన్న పరిధిలో నుంచి బయటపడి, విశాలంగా ఆలోచించి ‘మహాత్ముడు’ అనే స్థాయికి ఎదగాలి. అప్పుడే మనం పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది.
“ఒక మఠం సాధువుని దుష్టుడు ఒకడు కొట్టాడు. సాధువు స్పృహతప్పి పడిపోయాడు. స్పృహ తెప్పించాక, ‘స్వామీ, ఇప్పుడు మీతో పాలు త్రాగిస్తున్న దెవరు?’ అని అడిగినప్పుడు ఆ సాధువు, ‘ఎవరు కొట్టాడో ఆతడే ఇప్పుడు పాలు త్రాగిస్తున్నాడు’ అన్నాడు. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—–
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుని, తక్కిన భక్తులను చూస్తూ): సేవించబడే వాడు హరియే, సేవకుడూ హరియే – ఈ భావం పూర్ణజ్ఞానానికి లక్షణం. తొలుత ‘నేతి, నేతి’ అంటూ విచారణ చేస్తూ హరియే సత్యం, తక్కినదంతా మిథ్య అని తెలుసుకుంటాడు. పిదప హరియే అన్నీ అయివున్నట్లు దర్శిస్తాడు. ఆ భగవంతుడు మాయ, జీవజగత్తులు అన్నీ అయివుండటం దర్శిస్తాడు. మొదట అనులోమం, ఆ తరువాత విలోమం. ఇది పురాణాల దృక్పథం.
“బిల్వఫలాన్ని ఉదాహరణగా తీసుకో. దాన్లో కండ, విత్తనాలు, పెంకు ఉన్నాయి. పెంకును, విత్తనాలను తీసివేస్తే కండ మాత్రం లభిస్తుంది. కాని బిల్వఫలం బరువు తెలుసుకోవాలంటే, పెంకును, విత్తనాలను తీసివేస్తే కుదరదు. అదే విధంగా మొదట జీవజగత్తులను త్రోసిరాజని సచ్చిదానందాన్ని పొందాలి. సచ్చిదానందాన్ని పొందాక, ఆయనే సమస్త జీవజగత్తులుగా అయివుండటం దర్శించవచ్చు. కండ ఏ వస్తువుకు చెందినదో ఆ వస్తువు నుండే విత్తనాలు, పెంకు ఉద్భవించాయి. మజ్జిగకు చెందినదే వెన్న, వెన్నకు చెందినదే మజ్జిగ అన్నట్లుగా.
“కాని సచ్చిదానంద పరబ్రహ్మం ఎలా ఇంత కాఠిన్యం వహించాడు అని ప్రశ్నించవచ్చు. ఉదాహరణకు భూమిని తాకుతున్నాం; అది ఎంత కఠినంగా ఉంది! దీనికి జవాబు ఏమిటంటే, రక్తం, వీర్యం ద్రవాలే! కాని వాటినుంచే కదా ఇంత పెద్ద జీవుడైన మనిషి ఉద్భవిస్తూ ఉన్నాడు. భగవంతుడికి అన్నీ సుసాధ్యాలే. మొదట అఖండ సచ్చిదానందాన్ని చేరుకో, పిదప క్రిందికి దిగి వచ్చి ఇదంతా చూడు.
“భగవంతుడే సర్వమూ అయివున్నాడు. ఆయనను మినహాయించి ప్రపంచం అంటూ ఏదీ లేదు. గురువు వద్ద వేదాలు అధ్యయనం చేయగానే రాముడికి వైరాగ్యం జనించింది. సంసారం స్వప్నతుల్యమైతే దాన్ని త్యజిస్తేనే మంచిది అనసాగాడతడు. దశరథుడు భీతిల్లాడు. రాముడికి నచ్చ చెప్పటానికి గురువైన వసిష్ఠుని పంపించాడు. వసిష్ఠుడు, రాముడితో ఇలా అన్నాడు: ‘రామా! నువ్వు సంసారాన్ని త్యజించాలని ఎందుకు అంటున్నావు? ఈ ప్రపంచం భగవంతుని నుండి వేరై ఉన్నదని నాకు నిరూపించు. ఈ ప్రపంచం భగవంతుని నుండే ఆవిర్భవించలేదని నువ్వు నిరూపిస్తే నువ్వు సంసారాన్ని త్యజించవచ్చు.’ రాముడు మౌనంగా ఉండిపోయాడు, అతడు ఏ జవాబు ఇవ్వలేకపోయాడు.
“తత్త్వాలు అన్నీ చివరకు ఆకాశతత్త్వంలో లీనం అవుతున్నాయి. మళ్లీ సృష్టి సమయంలో ఆకాశతత్త్వం నుంచి మహత్ తత్త్వం, మహత్ తత్త్వం నుంచి అహంకారం – ఈ క్రమంలోనే సృష్టి జరిగింది. ఇదే అనులోమ విలోమం. భక్తుడు అన్నిటినీ అంగీకరిస్తాడు. భక్తుడు అఖండ సచ్చిదానందాన్ని అంగీకరిస్తాడు, జీవజగత్తులనూ అంగీకరిస్తాడు.
“కాని యోగి మార్గం వేరు. అతడు పరమాత్మను చేరుకుంటాడు; తిరిగి రాడు. పరమాత్మతో ఐక్యమైపోతాడు.
“ఒక్క దాన్లోనే భగవంతుని దర్శించేవాడు పరిమితుడైన జ్ఞాని; దానికి అతీతంగా భగవంతుడు లేడనుకొంటాడతడు.
“భక్తులు మూడు తరగతులకు చెంది ఉన్నారు. అధమ తరగతి భక్తుడు, ‘భగవంతుడు అదుగో అక్కడున్నా’ డంటాడు ఆకాశాన్ని చూపుతూ. మధ్య తరగతి భక్తుడు, ‘భగవంతుడు హృదయ మధ్యంలో అంతర్యామి రూపంలో నెలకొని ఉన్నాడు’ అంటాడు. ఉత్తమ భక్తుడు, ‘భగవంతుడే సర్వమూ అయివున్నాడు; మనకు కానవస్తున్నదంతా భగవంతుని విభిన్న స్వరూపాలే’ అంటాడు. నరేంద్రుడు మునుపు వేళాకోళం చేసేవాడు: ‘అవును! సమస్తమూ భగవంతుడే. ఇదుగో ఈ కుండా భగవంతుడే, ఈ గ్లాసూ భగవంతుడే!’ అనేవాడు. (అందరూ నవ్వారు)
“భగవద్దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. వినటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. వినటం వలన పదహారు అణాల విశ్వాసం (అంటే, నూటికి నూరుపాళ్ళ విశ్వాసం) కలుగదు; ప్రత్యక్షంగా చూసినప్పుడు విశ్వసించకపోవటమంటూ ఉండదు. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—
శ్రీరామకృష్ణులు(డాక్టరుతో): “భక్తులు ఉత్తమ, మధ్యమ, అధమ భక్తులు అని మూడు రకాలుగా ఉంటారు. ‘భగవంతుడు అక్కడ ఉన్నాడు’ అని అంటాడు అధమ భక్తుడు. భగవంతుడు, సృష్టి వేర్వేరు అన్నది అతడి తలంపు. మధ్యమ భక్తుడు ‘భగవంతుడు అంతర్యామి’ అంటాడు. అతడు భగవంతుణ్ణి హృదయంలో దర్శిస్తాడు. ‘భగవంతుడే ఈ సమస్తం అయి ఉన్నాడు, ఆయనే ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడు’ అని గాంచేవాడు ఉత్తమ భక్తుడు. పైనా, క్రిందా, సర్వమూ భగవంతుడిగానే ఆతడు దర్శిస్తాడు.
“నువ్వు గీత, భాగవతం, వేదాంతం – వీటి నన్నిటినీ చదువు. అప్పుడు ఈ విషయాలన్నిటినీ అవగతం చేసుకోగలవు. భగవంతుడు సృష్టిలో లేడా ఏమిటి?”
డాక్టరు: ఆయన అన్నిచోట్లా ఉన్నాడు. అందుకే ఆయన్ను వెదుకలేము. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—
ఈశాన్ (డాక్టరుతో): అహంకారం కారణంగానే మనకు విశ్వాసం తక్కువగా ఉంటుంది. భూశుండి అనే కాకి మొదట్లో శ్రీరాముణ్ణి అవతార పురుషుడిగా అంగీకరించేది కాదని రామాయణంలో చెప్పబడింది. ఒకసారి అది రాముడి ఆగ్రహానికి గురయింది. ఆ ఆగ్రహంనుండి తప్పించుకోవడానికి ఇది చంద్రలోకం, దేవలోకం, కైలాసం మొదలైన లోకాలన్నీ పరిభ్రమించింది. కాని అది రాముడి చేతినుండి తప్పించుకోజాలనని గ్రహించింది. అప్పుడు వచ్చి రాముడి పాదాల వద్ద శరణు వేడింది. రాముడు దాన్ని చేతిలోకి తీసుకొని మ్రింగివేశాడు. తరువాత చూసేసరికి భూశుండి చెట్టుమీద తన గూటిలోనే కూర్చుని ఉంది. ఆ విధంగా దాని అహంకారం అణగిపోయాకనే, అది ‘రాముడు చూడడానికి సామాన్య వ్యక్తిలాగానే కనిపిస్తాడు కాని అతడి ఉదరంలోనే ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు. సముద్రాలు, పర్వతాలు, జీవ జంతువులు, చెట్లు – సమస్త బ్రహ్మాండమూ ఉన్నట్లు’ గ్రహించింది.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): భగవంతుడు స్వరాట్, మళ్ళీ ఆయనే విరాట్ అని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నిత్యం, లీలలు రెండూ ఆయనకు చెందినవే. భగవంతుడు మానవరూపం ధరించలేదని మన అల్పబుద్ధితో ఎలా నొక్కి చెప్పగలం? మన అల్పబుద్ధితో ఈ విషయాలనన్నిటినీ అవగతం చేసుకోగలమా ఏమిటి? ఒక సేరు పాత్రలో నాలుగు సేర్లు పాలు పడతాయా ఏమిటి?
“అందుకే భగవత్సాక్షాత్కారం పొందిన సాధువుల, మహాత్ముల పలుకులలో విశ్వాసం ఉంచాలి. వకీలు వ్యాజ్యాలలో నిమగ్నమై ఉన్నట్లు సాధువు భగవచ్చింతనలోనే నిమగ్నమై ఉంటాడు. భూశుండి కాకి కథ మీద నీకు విశ్వాసం కలుగుతోందా? (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—
గాయకురాలు చైతన్యుల సన్న్యాసం గురించిన పాట పాడుతోంది. పాటలో కొన్ని చరణాల భావం ఇలా ఉంది: ‘సన్న్యాసి, స్త్రీ వంక కన్నెత్తి కూడా చూడడు – ఇదే సన్న్యాసి ధర్మం. జీవుల దుఃఖాలను దూరం చేసే నిమిత్తం సన్న్యాసి, స్త్రీ వంక చూడడు!’ చైతన్యుల సన్న్యాసం గురించి వినగానే శ్రీరామకృష్ణులు లేని నిలబడి సమాధిస్థితి నొందారు. భక్తులు ఆయన మెడలో పువ్వుల మాలలు వేశారు. ఎక్కడ పడిపోతారో అనుకుని భవనాథ్, రాఖాల్ ఆయనను పట్టుకుని నిలబడ్డారు. ఆయన ఉత్తరాభిముఖంగా నిలబడి ఉన్నారు. విజయ్, కేదార్, రామ్, ‘మ’, మనోమోహన్, లాటు మొదలైన భక్తులు ఆయన చుట్టూ నిలబడ్డారు. సాక్షాత్తూ చైతన్యులే అక్కడకు వచ్చి భక్తులతో హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నట్లుగా ఉంది ఆ దృశ్యం.
శ్రీరామకృష్ణులకు మెల్లమెల్లగా బాహ్యస్మృతి రాసాగింది. ఆయన సచ్చిదానంద కృష్ణునితో మాట్లాడసాగారు. మధ్యమధ్యలో, “కృష్ణా, కృష్ణా!” అంటున్నారు. కొన్ని సమయాల్లో స్పష్టంగా ఉచ్చరించలేకున్నారు. పిమ్మట ఇలా అన్నారు: “కృష్ణా, కృష్ణా, కృష్ణా, కృష్ణా, సచ్చిదానందా, ఇప్పుడల్లా నీ రూపాన్ని దర్శించలేకున్నానే! ఇదుగో, ఇప్పుడు నిన్ను అంతరంలోనూ బాహ్యంలోనూ దర్శిస్తూ ఉన్నాను. జీవజగత్తులు, ఇరవై నాలుగు తత్త్వాలు అన్నీ నువ్వే. మనస్సు, బుద్ధీ అంతానువ్వే.
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః
అని గురుస్తోత్రంలో చెప్పబడి ఉంది కదా!
నువ్వే అఖండుడవు. నువ్వే చరాచర వ్యాప్తుడవు! నువ్వే ఆధారం, నువ్వే ఆధేయం, ప్రాణకృష్ణ! మనఃకృష్ణ! బుద్ధికృష్ణ! ఆత్మకృష్ణ! హే ప్రాణవల్లభా గోవింద మమ జీవన!” (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
సరళమయిన ఒక భక్తురాలిగా జీవించడంతోనే మాతృదేవి ఆత్మతృప్తి పొందారు. సాధన పద్ధతులలో భక్తిభావాన్ని ఎంతో మెచ్చుకునేవారు. “జ్ఞాన యోగం అత్యంత కఠినమైనది. ప్రాథమిక స్థితిలోని సాధ కులకు ధ్యానమార్గం సులభం కాదు. అందువల్ల జపం చేయండి. అయినా దేనిని ఆచరించినా భక్తిభావంతో చేయాలి” అనేవారు మాతృదేవి. దక్షిణేశ్వరం రోజులలో ఆమెలో అభివ్యక్తమైన ఉన్నత భక్తిని గురించి ఇప్పటికే చూశాం. అలాంటి ఉన్నత భక్తి పర్యవసానంగా సర్వత్రా భగవంతుని గాంచే భాగ్యం పొందారు. మాతృదేవి తమ అనుభవాన్ని ఇలా చెప్పారు: “అప్పు డప్పుడు నేను ఏం చూసేదాన్నో తెలుసా? భగవంతుడే సమస్తమూ అయి వున్నాడు. ఏ దిశలో చూసినా నేను ఆయననే చూస్తున్నాను. కుంటివాడూ ఆయనే గుడ్డివాడూ ఆయనే. ఆయన తప్ప మరొకటి లేదు. సృష్టి యావత్తు ఆయనే అని గ్రహింపగలుగుతున్నాను. ఆయనే సర్వస్వంగా ఉంటున్నారు. దుఃఖాలను అనుభ వించేది నిజానికి ప్రాణులు కారు, ఆయనే అనుభవిస్తున్నాడు.” …..
మాతృదేవికి గురుదేవులే సర్వస్వం. గురుదేవుల చేతిలోని ఒక పరికరంగా తనను భావించుకున్నారు ఆమె. గురుదేవులలోనే తమను పూర్తిగా ఐక్యం చేసు కున్నారు. తమకు ఇతరులకంటే ఆయన పట్ల ఎక్కువ హక్కు ఉందని ఎన్నడూ ఆమె అనుకోలేదు. “గురు దేవులు అందరికీ సొంతం. ఆయనను పొందడానికి భక్తి ఒక్కటే ఆవశ్యక మయింది” అనేవారు మాతృదేవి. అనేకులతో, “అంతా గురుదేవులే. ఆయనే గురుమా, ఇష్టదైవమూ. సర్వస్వమూ ఆయనే” అనేవారు. గురుదేవులు తమతో పాటు సదా ఉంటున్నారని తమను ఆశ్రయించేవారికి చెప్పేవారు. గురుదేవుల ఆశీస్సులు, రక్షణ వారందరికీ ఉందని రూఢి పరచేవారు. వ్యక్తిగతంగా తమకు ఎలాంటి శక్తి ఉందనీ వ్యక్తం చేసుకోరు.
సురేంద్రనాథ్ అనే వ్యక్తికి గురుదేవులను పురుషునిగా ఆరాధించడం సబబుగా తోచలేదు. అందువల్ల పూజ ముగించి, పూజాఫలాన్ని గురుదేవుల పాద పద్మాలకు సమర్పించేటప్పుడు ‘ఓ మహేశ్వరీ’ అంటూ సంబోధించేవాడు. ఈ విషయం విన్న మాతృదేవి, “నిజమే. ఆయనే మహేశ్వరుడు, ఆయనే మహేశ్వరి. సకల దేవీదేవతలలోనూ, సకల జీవరాసులలోనూ ఆయనే వెలసివున్నారు. ఆయ నను ఈశ్వరునిగానో, ఈశ్వరిగానో నీ ఇచ్ఛానుసారం పేర్కోవచ్చు” అన్నారు.
మరొక భక్తురాలితో చెబుతున్నప్పుడు, “ఆయనే సర్వస్వం. ఆయనే పురు షుడు, ఆయనే ప్రకృతి. సమస్తం ఆయన నుండే ఉద్భవించింది” అన్నారు. ఆయనలో సమస్త దేవతలూ వాసం చేస్తున్నారనీ, ఆయన దివ్యనామాన్ని జపించడం ద్వారా, ఆరాధించడం ద్వారా సకల దైవాలనూ పూజింపవచ్చు అనడం కూడా మాతృదేవి ముఖ్య సందేశమై ఒప్పారింది.
ఒకసారి శిష్యు డొకడు, “అమ్మా! మీ ఆశీస్సులవల్లనే నేను బాగుంటు న్నాను” అన్నాడు. అందుకు మాతృదేవి కాస్త కటువుగా, “దీన్లోకి నన్నెందుకు లాగుతున్నావు? గురుదేవుల దివ్య నామాన్ని నువ్వు ఉచ్చరింపలేవా? ఇక్కడ నువ్వు చూస్తున్నవన్నీ ఆయన వల్లనే జరుగుతున్నాయి” అన్నారు.
ఉపదేశమివ్వమని ఎవరైనా మాతృదేవిని ఆశ్రయిస్తే కొన్ని సమయాల్లో “నేనా! ఉపదేశమివ్వడమా? గురుదేవుల ఉపదేశాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. వాటి నుండి ఏదైనా ఒక దానిని అర్థం చేసుకుని దాని నీ జీవితంలో ఆచరించావంటే సకలమూ సిద్ధిస్తుంది” అనేవారు.
ఎవరైనా మాతృదేవిని ప్రశంసిస్తూ, మీరే దైవం అంటే వెంటనే వారిని వారిస్తూ, “సకలమూ ఆయనే. ప్రస్తుతం నేను ఉంటున్న స్థితికి కారణం ఆయన తమ పాదపద్మాల మ్రోల నాకు చోటు ఇచ్చినందువల్లే” అనేవారు. ఇలాంటి వినమ్రత గల భక్తురాలిగా జీవించడాన్నే ఆమె ఆశించారు. (మూలం: శ్రీ శారదాదేవి చరితామృతం)