సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ ।
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ॥
సమమ్, పశ్యన్, హి, సర్వత్ర, సమవస్థితమ్, ఈశ్వరమ్,
న, హినస్తి, ఆత్మనా, ఆత్మానమ్, తతః, యాతి, పరామ్, గతిమ్.
హి = ఏలయన; సర్వత్ర = అంతటా; సమమ్ =సమానంగా; సమవస్థితమ్ = వెలయుచున్న; ఈశ్వరమ్ = పరమాత్మను; పశ్యన్ = చూస్తున్న (వాడు); ఆత్మానమ్ = తన్ను; ఆత్మా నా = తన చేత; న హినస్తి = హింసించుకోడు; తతః = కనుక; పరాంగతిమ్ = మోక్షాన్ని; యాతి = పొందుతాడు.
తా ॥ (దీనిని సమ్యక్– దర్శనం అనడం ఎందుకు? అంటే-) సర్వత్ర సమానంగా ప్రకాశించే పరమాత్మను దర్శించే వ్యక్తి తనను తాను హింసించుకోడు. (అంటే, అవిద్య చేత సచ్చిదానందరూపమైన ఆత్మను వినాశమొనర్చడం లేదు.) కనుక అతడు మోక్షాన్ని పొందుతాడు. (ఇలా చూడనివాడు దేహాత్మదర్శి, అతడు శరీరంతో ఆత్మను హింసిస్తున్నాడు.* ) (ఈశావాస్యోపనిషత్తు 3 చూ:)
వ్యాఖ్య:-
భగవంతుడిని వర్ణించడానికి ఇక్కడ మూడు ముఖ్యమైన పదాలు వాడారు:
- సమం: ఆయన అందరిలోనూ సమానంగా ఉంటాడు (పక్షపాతం లేదు).
- సర్వత్ర: ఆయన అన్ని చోట్ల ఉంటాడు (లేని చోటు లేదు).
- సమవస్థితమ్: ఆయన పరిపూర్ణంగా, చక్కగా నిలిచి ఉంటాడు.
ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. సాధారణంగా ఆత్మహత్య అంటే శరీరాన్ని చంపుకోవడం అనుకుంటాం. కానీ గీత ప్రకారం:
- ఆత్మహత్య: ఎవరైతే తమలో ఉన్న ఆత్మను (దేవుణ్ణి) తెలుసుకోరో, వారిని ‘ఆత్మహత్య చేసుకున్నవారిగా’ (ఆత్మను చంపుకున్నవారిగా) పరిగణిస్తారు.
- ఆత్మను తెలుసుకోకపోవడమే ఆత్మను హింసించడం. అదే నిజమైన ఆత్మహత్య.
ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకోరో, వారు చావు-పుట్టుకల చక్రంలో (సంసారంలో) పడి కొట్టుకుపోతూ నానా రకాల బాధలు పడుతుంటారు. అంటే, ఆత్మను తెలుసుకోకుండా తమను తాము హింసించుకుంటున్నారు కాబట్టి, ఎవరి కష్టాలకు వారే బాధ్యులు. ఎవరైతే అందరిలోనూ సమానంగా ఉన్న దేవుణ్ణి గుర్తిస్తారో, వారు తమను తాము కాపాడుకున్నవారవుతారు. వారికి ఈ బాధలు ఉండవు.
మోక్షాన్ని ‘పరాం గతి’ (అన్నింటికంటే ఉత్తమమైన గమ్యం/స్థితి) అని పిలిచారు. దీని అర్థం ప్రపంచంలో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వంటి ఎన్ని పెద్ద పదవులు ఉన్నా… ‘ఆత్మసాక్షాత్కారం’ (దేవుణ్ణి తెలుసుకోవడం) అనే స్థితే వాటన్నింటికంటే గొప్పది, అత్యున్నతమైనది. కాబట్టి తెలివైనవారు ఆత్మహత్య (అజ్ఞానం) చేసుకోకుండా, మోక్షం కోసం ప్రయత్నించాలి.
“ఒక మఠం సాధువుని దుష్టుడు ఒకడు కొట్టాడు. సాధువు స్పృహతప్పి పడిపోయాడు. స్పృహ తెప్పించాక, ‘స్వామీ, ఇప్పుడు మీతో పాలు త్రాగిస్తున్న దెవరు?’ అని అడిగినప్పుడు ఆ సాధువు, ‘ఎవరు కొట్టాడో ఆతడే ఇప్పుడు పాలు త్రాగిస్తున్నాడు’ అన్నాడు. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—–
శ్రీరామకృష్ణులు: “అమ్మే సర్వం అయివుండటం ఈ స్థితిలో నేను గాంచుతున్నాను! సర్వత్రా ఆమెనే దర్శిస్తూ ఉన్నాను. అమ్మే సర్వమూ అయివున్నది – దుష్టులుగానూ – భాగవత పండితుని సోదరునిగాను కూడా ఆమే అయివుండటం కాళికాలయంలో దర్శించాను.
“ఒకసారి రామ్‌లాల్ తల్లిని కసురుకోబోయాను, కాని సాధ్యం కాలేదు. ఆమె అమ్మ యొక్క ఒక రూపంగానే కానవచ్చింది. కన్యలలో అమ్మను కాంచటం చేతనే నేను ‘కుమారి పూజ’ ను చేస్తాను. భార్య నా కాళ్లు ఒత్తుతుంది, ఆ పిదప నే నామెకు నమస్కారం చేస్తాను. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—–
“అహంకారం ఉంటే భగవద్దర్శనం కలుగదు. అహంకారం ఎటువంటిదో తెలుసా? అది ఒక గుట్ట వంటిది, అక్కడ వర్షపు నీరు నిలువదు. క్రిందికి దిగి పోతుంది. పల్లంలోనే నీరు నిలుస్తుంది. అక్కడే మొక్కలు పెరుగుతాయి, చెట్లుగా ఎదుగుతాయి, పళ్లను ఇస్తాయి.
“అందుకే నేను హాజ్రాతో, ‘నేను సర్వజ్ఞుడను, తక్కిన వారంతా మూర్ఖులు అని అనుకోవద్దు. అందరినీ ప్రేమించాలి. ఎవరూ పరాయివారు కారు, సకల భూతకోటిలో ఆ హరియే ఉన్నాడు, ఆయన తప్ప మరేదీ లేదు’ అని చెప్పాను. ప్రహ్లాదునితో శ్రీహరి, ‘ఏదైనా వరం కోరుకో’ అని చెప్పాడు. అందుకు ప్రహ్లాదుడు, ‘ప్రభో! మీ దర్శనభాగ్యం అబ్బింది. నాకు మరేదీ అక్కర్లేదు’ అని జవాబిచ్చాడు. కాని భగవంతుడు వదలిపెట్టలేదు. అందుకే ప్రహ్లాదుడు, ‘ప్రభూ! వరం ఇచ్చే తీరాలనుకుంటే, నన్ను బాధలు పెట్టినవారు ఏ శిక్షకూ గురి కారాదు’ అన్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా?హరియే వారి రూపాలలో తనకు కష్టం కలిగించారు.కనుక వారిని శిక్షిస్తే హరికే దుఃఖం కలుగుతుంది అని. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ, ఒక సమయంలో వింటిని, బాణాన్ని నేలలో గుచ్చి, దప్పిక తీర్చుకోవడానికి ‘పంప’ అనే సరోవరంలోకి దిగాడు. దప్పిక తీర్చుకొని వచ్చాక చూస్తే, అక్కడ తన వింటి తాకునకు శరీరమంతా రక్తమయమై ఉన్న కప్ప ఒకటి కనిపించగా, అతడు ఎంతో బాధపడి, ఆ కప్పతో ఇలా అన్నాడు: “కాస్త శబ్దం చేయకపోయావా? నువ్వు ఇక్కడున్నట్లు నాకెలా తెలుస్తుంది? శబ్దం చేసివుంటే నీకీ ప్రమాదం జరిగేది కాదు కదా!” అందుకు ఆ కప్ప ఇలా విన్నవించుకొంది: “నాకు ఆపద వాటిల్లినప్పుడు ‘రామా! నన్ను కాపాడు’ అంటూ నిన్ను స్మరిస్తాను. ఇప్పుడు నువ్వే నన్ను చంపుతూంటే నేనెవరిని ప్రార్థించను?” (మూలం: గురూపదేశములు by స్వామి బ్రహ్మానంద)
—-
ప్రహ్లాదుడి ప్రార్థనలకూ, స్తోత్రాలకూ శ్రీహరి సంతుష్టుడై “నీకేం వరం కావాలి” అని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు: “ప్రభూ! నన్ను హింసించిన వారిని క్షమించు. వారిని దండించడం నిన్ను నువ్వు దండించుకోవడమే కదా! ఎందుకంటే, నిశ్చయంగా నువ్వు ప్రతిప్రాణిలోను నెలకొని ఉన్నావు”. (మూలం: గురూపదేశములు by స్వామి బ్రహ్మానంద)
సర్వత్రా నేనే
పూర్ణజ్ఞానంలో నెలకొన్న మాతృదేవి జ్ఞానపరమైన అనుభవాలు కోకొల్లలు. మనుష్యులకు మాత్రమే కాకుండా, మృగాలు, పక్షులకు కూడా ఆమె ఆశ్రయంగావున్నారు. అనేక ఇళ్ల నుండి కొట్టి తరమబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి. కానీ బ్రహ్మచారి జ్ఞాన్కు పిల్లులంటే గిట్టదు. ఆతడితో మాతృదేవి, “ఇదిగో చూడు, దొంగలించడం పిల్లుల నైజం. వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు?” అనేవారు. ఒకసారి మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకు వెళ్లేటప్పుడు జ్ఞాన్‌ను పిలిచి ప్రతి రోజూ ఆ పిల్లులకు ఆహార మిచ్చి చూసుకోమన్నారు. ఎదురుచూచినట్లే జ్ఞాన్ జంకుతూ నిలబడ్డాడు. వెంటనే మాతృదేవి, “నాయనా! పిల్లులను కొట్టకు! ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నాను” అన్నారు. అంతే! ఇక వాటి మీద చేయి చేయించుకోగలడా ఆతడు! ఆ రోజు నుండి వాటిని ప్రేమతో పోషించాడు. (మూలం: శ్రీ శారదాదేవి చరితామృతం)
—
బాలగణపతి ఒకనాడు ఆడుకొంటున్నప్పుడు ఒక పిల్లిని చూసి దాన్ని దొరకపుచ్చుకొని పిల్లచేష్టగా చక్కగా బడితపూజ చేసి దాన్ని గాయపరిచాడు. పిల్లి ఎలాగో తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతడు శాంతుడై తల్లి పార్వతీదేవిని చూడడానికి వెళ్ళాడు. తల్లి దేహమంతా గాయాలతో రక్తసిక్తమై ఉండడం చూసి బాలగణపతి ఆశ్చర్యపోయాడు. తల్లిని అలాంటి స్థితిలో చూసి ఎంతో బాధపడి, “కారణం ఏమిటి?” అని తల్లిని అడిగాడు. “నాయనా! దీని కంతటికీ కారణం నువ్వే” అని విచారంతో పలికింది దేవి. తల్లిపట్ల అపార భక్తి ప్రేమలున్న గణపతికి తల్లి మాటలు ఆశ్చర్యాన్ని, అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించాయి. కంట నీరుపెట్టుకొని “అమ్మా! నేను నిన్నెప్పుడు కొట్టాను? లేదా తెలియక నేను చేసిన ఏదైనా దుశ్చర్య ఫలితంగా ఇతరులు నిన్నిలా అవమానించారేమో అంటే అలాంటసంఘటన ఏదీ నాకు జ్ఞాపకం రావడం లేదే?” అన్నాడు.
కుమారుడి పలుకులు విని జగన్మాత ఇలా అన్నది: “నాయనా! ఈ రోజు నువ్వు ఏ ప్రాణినైనా హింసించావేమో కాస్త జ్ఞాపకం తెచ్చుకో.” “అవునమ్మా, ఇంతకు మునుపే ఒక పిల్లిని చావబాది వచ్చాను” అన్నాడు గణపతి. పిల్లి సొంతదారుడు తన తల్లిని అలా గాయపరిచాడేమో అని తలచుకొని బాలగణపతి ఖీన్నుడయ్యాడు. బాలుడలా పశ్చాత్తప్తుడవడం చూసి, ప్రేమపూర్వకంగా అతణ్ణి హృదయానికి హత్తుకొని, అతణ్ణి ఊరడిస్తూ దేవి ఇలా అన్నది: “అలా జరగలేదు, నా ఈ దేహాన్ని ఎవరూ గాయపరచలేదు. కాని పిల్లి ఆదిగాగల ఈ విశ్వంలోని సమస్త ప్రాణికోటిలో నెలకొన్నది నేను కదా! కాబట్టే నువ్వు పిల్లిని గాయపరచిన చిహ్నాలు నా శరీరం మీద కానవస్తున్నాయి. తెలియక నువ్వలా చేశావు కనుక విచారించవద్దు. కాని నేటి నుంచి ఈ సంగతిని ఎప్పుడూ మరిచిపోవద్దు. లోకంలోని స్త్రీలందరూ నా అంశలే, జీవులలోని పురుషులందరూ నీ పితృదేవుల అంశలే. శివశక్తులు తప్ప ఈ జగత్తులో వేరొకటి ఏదీ లేదు.” తల్లి మాటలు బాలగణపతి హృదయంలో ప్రగాఢంగా నాటుకున్నాయి. …..
ఒకానొక సమయంలో పార్వతీ దేవి తను ధరించిన అమూల్యమైన రత్నహారాన్ని చూపిస్తూ కుమారులైన గణేశ కార్తికేయులతో “పధ్నాలుగు లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండం చుట్టూ తిరిగి మీరిద్దరిలో ఎవరు ప్రథములుగా వస్తారో వారికి ఈ రత్నహారాన్ని బహూకరిస్తాను” అన్నది. ఇంకేం, అన్నగారి బానపొట్టను, నెమ్మదిగా కదిలే ఎలుక వాహనాన్ని తలచుకొని ఒకింత పరిహాసపూర్వకంగా నవ్వుకుంటూ ‘రత్నహారం నాకే దక్కుతుంది’ అని నిశ్చయించుకొని, తన నెమలి వాహనం అధిరోహించి తక్షణమే కార్తికేయుడు బయలుదేరాడు. అతడు వెళ్ళిపోయిన చాలాసేపటికి నెమ్మదిగా లేచాడు గణేశుడు. లేచి తన జ్ఞాననేత్రంతో శివశక్త్యాత్మకమైన ఈ జగత్తు యావత్తూ తల్లితండ్రులైన శివపార్వతుల శరీరాలలో దర్శిస్తూ, వారికి ప్రణామాలు చేస్తూ వినమ్ర గమన భంగిమలో వారికి ప్రదక్షిణం చేసి, నిశ్చితమనస్కుడై తన ఆసనంలో కూర్చున్నాడు. ఇది జరిగిన చాలాసేపటికి కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు, రత్నహారం గణేశుడికే చెందుతుందని నిర్దేశించి, వాత్సల్యపూరితురాలై ముద్దు బిడ్డడి మెడలో అలంకరించింది తల్లి పార్వతీదేవి. (మూలం: శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర, సప్రామాణిక జీవిత గాథ)
Related Articles:
- అన్ని జీవులూ తన ఆత్మకంటే భిన్నాలు కావనీ, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మ అనీ దర్శించే ప్రాజ్ఞుడు ఆ దర్శనబలంచే దేనినీ ద్వేషింపడు. – ఈశావాస్యోపనిషత్తు, 6.