పాంచజన్యం హృషీకేశో
దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం
భీమకర్మా వృకోదరః ॥ 15
అనంతవిజయం రాజా
కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ
సుఘోషమణిపుష్పకౌ ॥ 16
కాశ్యశ్చ పరమేష్వాసః
శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకిశ్చాపరాజితః ॥ 17
ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః
శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥ 18
పాంచజన్యమ్, హృషీకేశః, దేవదత్తమ్, ధనంజయః,
పౌండ్రమ్, దధ్మౌ, మహాశంఖమ్, భీమకర్మా, వృకోదరః.
అనంతవిజయమ్, రాజా, కుంతీపుత్రః, యుధిష్ఠిరః,
నకులః, సహదేవః, చ, సుఘోష మణిపుష్పకౌ.
కాశ్యః, చ, పరమేష్వాసః, శిఖండీ, చ, మహారథః,
ధృష్టద్యుమ్నః, విరాటః, చ, సాత్యకిః, చ, అపరాజితః.
ద్రుపదః, ద్రౌపదేయాః, చ, సర్వశః, పృథివీపతే,
సౌభద్రః, చ, మహాబాహుః, శంఖాన్, దధ్ముః, పృథక్, పృథక్.
హృషీకేశః = శ్రీకృష్ణుడు; పాంచజన్యమ్ = పాంచజన్యం అనే శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు; ధనంజయః = అర్జునుడు; దేవదత్తమ్ = దేవదత్తం అనే శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు; భీమకర్మా = భయాన్ని కలిగించే పనులు చేసే; వృకోదరః = భీముడు; మహాశంఖం పౌండ్రం = పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు. కుంతీపుత్రః = కుంతీపుత్రుడైన; రాజా యుధిష్ఠిరః = ధర్మరాజు; అనంత విజయమ్ = అనంత విజయమనే శంఖమును; నకులః = నకులుడు; సహదేవః చ = సహదేవుడు; సుఘోషమణిపుష్పకౌ = సుఘోష, మణి పుష్పకములనే శంఖాలను, (పూరించారు). పృథివీ పతే = ధృతరాష్ట్ర భూపతీ; పరమ ఇష్వాసః = మహా ధనుర్ధరుడగు; కాశ్యః చ = కాశీరాజూ; మహారథః = మహారథుడైన శిఖండీ చ = శిఖండీ ధృష్టద్యుమ్నః చ = ధృష్టద్యుమ్నుడూ; విరాటః చ = విరాటరాజూ; అపరాజితః = అజేయుడైన; సాత్యకిః చ = సాత్యకీ; ద్రుపదః = ద్రుపదుడు, ద్రౌపదేయాః = ద్రౌపదీ పుత్రులు; మహాబాహుః = మహాభుజుడైన; సౌభద్రః చ = అభిమన్యుడూ; సర్వశః = నలువైపుల నుండి; పృథక్ పృథక్ = వేఱు వేఱుగా; శంఖాన్ = శంఖాలను; దధ్ముః = పూరించారు.
తా ॥ శ్రీకృష్ణుడు ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని, అర్జునుడు ‘దేవదత్తం’ అనే శంఖాన్ని, భయంకరమైన పనులు చేసే భీమసేనుడు ‘పౌండ్రం’ అనే మహా శంఖాన్ని పూరించారు. కుంతీపుత్రుడైన ధర్మరాజు ‘అనంతవిజయం’ అనే శంఖాన్ని, నకులుడు ‘సుఘోషం’ అనే శంఖాన్ని, సహదేవుడు ‘మణిపుష్పకం’ అనే శంఖాన్ని పూరించారు. ఓ రాజా! గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు మరియు మహాబాహువు గల సుభద్రా పుత్రుడు అభిమన్యుడు – వీరందరూ అన్ని వైపుల నుండి తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు.
వ్యాఖ్య:-
దివ్య శంఖాలు: కృష్ణుడు, అర్జునుడు మొదలైన వారు పూరించిన పాంచజన్యం వంటి శంఖాలు మామూలువి కావు, అవి ఎంతో శక్తివంతమైన దివ్య శంఖాలు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం.
“పాంచజన్యం” (కృష్ణుడి శంఖం): పంచజనుడు అనే రాక్షసుడి ఎముకలతో తయారైంది కాబట్టి, శ్రీకృష్ణుడి శంఖానికి ‘పాంచజన్యం’ అని పేరు వచ్చింది.
“హృషీకేశుడు” (కృష్ణుడు): ‘హృషీకాలు’ అంటే ఇంద్రియాలు. ‘ఈశుడు’ అంటే అధిపతి (యజమాని). అంటే ఇంద్రియాలన్నింటికీ అధిపతి ఆయనే, అన్నింటినీ గమనించే సాక్షి ఆయనే అని అర్థం. ఆనందానికి నిలయమైన వాడు అని కూడా దీనికి మరో అర్థం ఉంది .
“ధనంజయుడు” (అర్జునుడు): రాజసూయ యాగం కోసం ఎందరో రాజులను గెలిచి ధనాన్ని సంపాదించి తెచ్చాడు కాబట్టి, లేదా, ధనం మీద ఆశను జయించినవాడు కాబట్టి…అర్జునుడికి ‘ధనంజయుడు’ అని పేరు వచ్చింది .
“వృకోదరుడు” (భీముడు): ‘వృకం’ అంటే తోడేలు. తోడేలు పొట్ట లాంటి పొట్ట (ఎంత తిన్నా అరిగించుకునే శక్తి) ఉన్నవాడు కాబట్టి, లేదా, తిన్నదంతా భస్మం చేసే ‘వృకం’ అనే అగ్ని (జాఠరాగ్ని) కడుపులో ఉన్నవాడు కాబట్టి…భీముడికి ‘వృకోదరుడు’ అనే పేరు వచ్చింది .