సత్త్వాత్ సంజాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో
భవతోఽజ్ఞానమేవ చ ॥
సత్త్వాత్, సంజాయతే, జ్ఞానమ్, రజసః, లోభః, ఏవ, చ,
ప్రమాదమోహౌ, తమసః, భవతః, అజ్ఞానమ్, ఏవ, చ.
సత్త్వాత్ = సత్త్వగుణం నుండి; జ్ఞానమ్ = జ్ఞానం; సంజాయతే = కలుగుతోంది; రజసః = రజోగుణం నుండి; లోభః ఏవ = లోభమే (కలుగును); తమసః చ = మరి, తమస్సు నుండి; అజ్ఞానమ్ = అవివేకం; ప్రమాద మోహౌ ఏవ చ = విస్మృతి, విమూఢత్వమూ; భవతః = కలుగుతున్నాయి.
తా ॥ సత్వ గుణం నుండి జ్ఞానం పుడుతుంది. రజో గుణం నుండి లోభం పుడుతుంది. తమో గుణం నుండి అజాగ్రత్త, మోహం మరియు అజ్ఞానం పుడతాయి.
వ్యాఖ్య:–
ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి పాఠం బాగా అర్థం కావడం కోసం ఒకే విషయాన్ని అనేక రకాలుగా ఎలా చెబుతారో, అలాగే భగవంతుడు కూడా అర్జునుడికి ఈ ఆత్మ తత్త్వం బాగా మనసులో నాటుకోవడం కోసం చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ వేరు వేరు రకాలుగా చెబుతున్నారు.
లోభం (పిసినారితనం/దురాశ), అజ్ఞానం వంటివి మనకు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి అవి మనకు వద్దు. మరి అవి ఎక్కడి నుండి పుడుతున్నాయి? రజోగుణం, తమోగుణం నుండి. అందుకే తెలివైనవాడు ఆ రజో, తమో గుణాలను దూరం చేసుకుని, జ్ఞానాన్ని ఇచ్చే సత్త్వగుణాన్ని మాత్రమే ఆశ్రయించాలి.