వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥
వాయుః, యమః, అగ్నిః, వరుణః, శశాంకః, ప్రజాపతిః, త్వమ్, ప్రపితామహః, చ,
నమః, నమః, తే, అస్తు, సహస్రకృత్వః, పునః, చ, భూయః, అపి, నమః, నమః, తే.
త్వమ్ = నీవు; వాయుః = వాయుదేవుడవు; యమః = యముడవు; అగ్నిః = అగ్ని దేవుడవు; వరుణః = వరుణుడవు; శశాంకః = చంద్రుడవు; ప్రజాపతిః = కశ్యపాది ప్రజాపతి రూపంలో లోకపితవు; ప్రపితామహః చ = బ్రహ్మకు కూడా జనకుడవు; తే = నీకు; సహస్ర కృత్వః = వేల సార్లు; నమః అస్తు = నమస్కరిస్తాను; పునశ్చ = మళ్ళీ; నమః = నమస్కారం; భూయః అపి = తిరిగి మళ్ళీ; తే = నీకు; నమః నమః = నమస్కారాలు.
తా ॥ ఓ కృష్ణా! వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి మరియు బ్రహ్మకు తండ్రివైన ప్రపితామహుడివి కూడా నీవే. నీకు వేలసార్లు నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ నీకు ప్రణామం చేస్తున్నాను.
వ్యాఖ్య:-
విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడికి భగవంతునిపై కలిగిన ఆ అపరిమితమైన భక్తి (అంతులేని ప్రేమ మరియు శరణాగతి)… మోక్షం కోసం ప్రయత్నించే ప్రతి సాధకుడికి చాలా అవసరం. ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే, కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు; అర్జునుడికి కలిగినంతటి గాఢమైన భక్తి కూడా ఉండాలి. అప్పుడే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.