ఆయుఃసత్త్వబలారోగ్య
సుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా
ఆహారాః సాత్వికప్రియాః ॥
ఆయుః, సత్త్వ బల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధనాః,
రస్యాః, స్నిగ్ధాః, స్థిరాః, హృద్యాః, ఆహారాః, సాత్త్విక ప్రియాః.
ఆయుః–సత్త్వ–బల–ఆరోగ్య –సుఖ–ప్రీతి–వివర్ధనాః =ఆయువును, ఉత్సాహాన్నీ, శక్తిని, ఆరోగ్యాన్నీ, చిత్తప్రసాదాన్నీ, సంతోషాన్నీ వృద్ధి చేసేవీ; రస్యాః = రసవంతాలూ; స్నిగ్ధాః = స్నిగ్ధములైనవి; స్థిరాః = చెడిపోనివీ; హృద్యాః = మనోహరమైనవీ అయిన; ఆహారాః = ఆహారాలు; సాత్త్వికప్రియాః = సాత్త్వికులకు ఇష్టం.
తా ॥ ఆయువును, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంచే ఆహారం సాత్త్వికమైనది. ఇవి రుచిగా, మృదువుగా, శరీరంలో ఎక్కువ కాలం శక్తిని ఇచ్చేవిగా, మనస్సుకు హాయినిచ్చేవిగా ఉంటాయి.
వ్యాఖ్య:–
మనుషులలో సత్త్వగుణం పెరిగినప్పుడు వారికి ఇలాంటి (శుభ్రమైన, సాత్త్వికమైన) ఆహారం రుచిస్తుంది. అంటే కారం, పులుపు ఎక్కువగా ఉన్న రాజసికం లేదా తామసికమైన ఆహారం వారికి అసలు ఇష్టం ఉండదు. పూర్వం చెప్పిన సాత్త్విక ఆహారమే వారి మనసుకు నచ్చుతుంది.
ధ్యాన సాధన చేసే వారికి ఆహారం చాలా ప్రాధాన్యమైనది — ఎందుకంటే అది మనసు స్థిరంగా ఉండటానికి ఎంతో సహాయం చేస్తుంది. అందువల్ల శ్రీకృష్ణుడు గీతలో అనేకసార్లు ఆహారం గురించి చెప్పాడు.
కాబట్టి మోక్షం కోరే సాధకులు “ఆహార నియమం ఒక చిన్న విషయం మాత్రమే” అని నిర్లక్ష్యంగా చూడకూడదు. అది బ్రహ్మ మార్గంలో ఒక ముఖ్యమైన స్థలం కలిగిన సాధన అని భావించి ఎల్లప్పుడూ సాత్త్విక ఆహారాన్నే తీసుకోవాలి.