అథ వ్యవస్థితాన్ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య పాండవః ॥ 20
హృషీకేశం తదా వాక్యం
ఇదమాహ మహీపతే ।
అథ, వ్యవస్థితాన్, దృష్ట్వా, ధార్తరాష్ట్రాన్, కపిధ్వజః,
ప్రవృత్తే, శస్త్రసంపాతే, ధనుః, ఉద్యమ్య, పాండవః.
హృషీకేశమ్, తదా, వాక్యమ్, ఇదమ్, ఆహ, మహీపతే,
మహీపతే = ఓ రాజా; అథ = అనంతరము; కపిధ్వజః = కపిధ్వజుడైన; పాండవః = అర్జునుడు; వ్యవస్థితాన్ = యుద్ధసంసిద్ధులైయున్న; ధార్తరాష్ట్రాన్ = దుర్యోధనాదులను; దృష్ట్వా = చూసి; శస్త్రసమ్పాతే = బాణప్రయోగసమయము; ప్రవృత్తే = రాగా; ధనుః = విల్లును; ఉద్యమ్య = లేవనెత్తి; తదా = అప్పుడు; హృషీకేశం = శ్రీకృష్ణునితో; ఇదం = ఈ; వాక్యమ్ = వాక్యమును; ఆహ = పలికాడు. (21– వ శ్లోక ప్రథమార్థం ఈ శ్లోకంతో అన్వయించబడింది)
తా ॥ ఓ రాజా! ఆ సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుని కుమారులను చూసి, కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును పైకెత్తి, యుద్ధం ప్రారంభం కావడానికి ముందే శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు.
వ్యాఖ్య:-
“కపిధ్వజుడు” (అర్జునుడు): అర్జునుడి రథం జెండాపై హనుమంతుడు (కపి) ఉంటాడు, అందుకే అర్జునుడికి ‘కపిధ్వజుడు’ అని పేరు వచ్చింది. మహాభారతంలోని అరణ్యపర్వం (151వ అధ్యాయం) ప్రకారం—యుద్ధంలో పాండవులకు విజయం కలగడం కోసం, అర్జునుడి జెండాపై తాను ఉంటానని భీముడి కోరిక మేరకు ఆంజనేయుడు వరమిచ్చాడు .