Chapter 1
- ధృతరాష్ట్రుడు పలికెను – ఓ సంజయా! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండు పుత్రులును ఏమి చేసిరి? (1.1)
- సంజయుడు పల్కెను – ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను. (1.2)
- ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. (1.3)
- ఈ సేనలో ధనుర్ధారులైన గొప్పయోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథియైన ద్రుపదమహారాజు భీమార్జునసమానులు. (1.4)
- ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు (భీమార్జునసమానులు). (1.5)
- పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును కలరు. వీరందరును మహారథులు. (శౌర్యమున భీమార్జునసమానులు). (1.6)
- ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుడు. మీ యెఱుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. (1.7)
- మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. (1.8)
- ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానాశస్త్రాస్త్రధారులు. నాకొరకు తమ ప్రాణముల నొడ్డియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. (1.9)
- భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగానున్న మనసైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. (1.10)
- కనుక మీరందరును మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపులనుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు. (1.11)
- కురువృద్ధుడును, ప్రతాపశాలియును ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని సంతోషపఱచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను. (1.12)
- మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. (1.13)
- తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి. (1.14)
- శ్రీకృష్ణుడు ‘పాంచజన్యము’ ను, అర్జునుడు ‘దేవదత్త(శంఖ)ము’ ను పూరించిరి. అరివీరభయంకరుడైన భీముడు “పౌండ్రము” అను మహాశంఖమును పూరించెను. (1.15)
- కుంతీపుత్రుడును, రాజును ఐన యుధిష్ఠిరుడు ‘అనంతవిజయము’ అను శంఖమును, నకులసహదేవులు ‘సుఘోష’ ‘మణిపుష్పకము’లను శంఖములను పూరించిరి. (1.16)
- ఓ రాజా! మహాధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన “శిఖండి”యు, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన ‘సాత్యకి’యు, (తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి.) (1.17)
- ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. (1.18)
- పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను. (1.19)
- (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి (శ్రీకృష్ణునితో ఈ క్రిందివిధముగాననెను). (1.20)
- ఓ ధృతరాష్ట్రా! అర్జునుడు శ్రీకృష్ణునితో“ఓ అచ్యుత! నా రథమును ఉభయసేనలమధ్య నిలుపుము.” అని పలికెను. (1.21)
- రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరిని బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. (1.22)
- “దుర్బుద్ధియైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని ఒకపరి పరికించెదను.” (1.23)
- సంజయుడు పలికెను – ఓ ధృతరాష్ట్రా! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ఉభయసేనల మధ్య నిలిపెను. (1.24)
- భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా (ఉభయసేనల మధ్య రథమును నిలిపి ) శ్రీకృష్ణుడు అర్జునునితో “పార్థా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము” అని నుడివెను. (1.25)
- పిమ్మట పార్థుడు (అక్కడ ఉభయసేనలయందును) చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను (చూచెను). (1.26)
- (తరువాత)పిల్లనిచ్చిన మామలను (మరియు) ఉభయసేనలయందును ఉన్న ఆత్మీయులను చూచెను. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు (పలికెను). (1.27)
- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచి యున్న ఈ స్వజన సమూహమును జూచి (పలికెను) (1.28)
- (అర్జునుడు ఇట్లు పలికెను) నా అవయవములు శిథిలములగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. (1.29)
- గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. మనస్సు భ్రమకు గురియైనట్లు అనిపించుచున్నది. కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. (1.30)
- ఓ కేశవా! పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. (1.31)
- ఓ కృష్ణా! నాకు విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని అక్కరయే లేదు. గోవిందా! ఈ రాజ్యము వలనగాని, ఈ భోగములవలన గాని, ఈ జీవితమువలన గాని ప్రయోజనమేమి? (1.32)
- మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదలుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చియున్నారు. (1.33)
- గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు మనుమలు, మేనమామలు, మామలు, బావమఱదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరియున్నారు. (1.34)
- ఓ మధుసూదనా! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వారిని చంపనే చంపను. (1.35)
- ఓ జనార్దనా! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి? (మనము మూట కట్టుకొనునది యేమి?) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును. (1.36)
- కనుక ఓ మాధవా! మనబంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? (1.37)
- లోభకారణముగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహమువలన సంభవించు పాపములను (చూడలేక పోచుంటిరి). (1.38)
- ఓ జనార్దనా! కులనాశనమువలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు? (1.39)
- కులక్షయమువలన సనాతనములైన కులధర్మము లన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. (1.40)
- ఓ కృష్ణా! అధర్మము (పాపము) పెచ్చుపెరిగి పోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలగుదురు. ఓ వార్ష్ణేయా! స్త్రీలు దూషితలు ఐనచో వర్ణసాంకర్యము ఏర్పడును. (1.41)
- వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు (శ్రాద్ధతర్పణములు) లోపించినందువలన వారి పితరులును అధోగతి పాలయ్యెదరు. (1.42)
- వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును. (1.43)
- ఓ జనార్దనా! కులధర్మములు నశించినవారికి నిరవధికముగా (కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. (1.44)
- అయ్యో! మనము బుద్ధిమంతులమై యుండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము – ఇది యెంత దారుణము? (1.45)
- శస్త్రరహితుడనై, ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను, అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. (1.46)
- సంజయుడు పలికెను – అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్న మానసుడై, యుద్ధభూమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికిలబడెను. (1.47)
Chapter 2
- సంజయుడు పలికెను – ఈవిధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను. (2.1)
- శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను – ఓ అర్జునా ! తగని సమయములో ఈ వెూహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు, కీర్తిని కలిగించునదియు కాదు. (2.2)
- కావున ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయదౌర్భల్యమును వీడి, యుద్ధమునకై నడుము బిగింపుము. (2.3)
- అర్జునుడు పలికెను – ఓ మధుసూదనా! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదనా ! ఈ ఇరువురును నాకు పూజ్యులు. (2.4)
- మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనియైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను, రక్తసిక్తములైన రాజ్యసంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండును కదా! (2.5)
- ఈ యుద్ధముచేయుట శ్రేష్ఠమా? లేక చేయకుండుట శ్రేష్ఠమా? అనునది ఎఱుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా? లేక మనలను వారు జయింతురా? అను విషయమునుగూడ ఎఱుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించు(పోరాడుటకు) నిలిచి యున్నారు.వారిని చంపి, జీవించుటకును మనము ఇష్టపడము. (2.6)
- కార్పణ్యదోషము(పిరికితనము)నకులోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మములవిచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించు కొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను. శరణాగతుడను, ఉపదేశింపుము. (2.7)
- ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది. సిరిసంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారునుపాయమును గాంచలేకున్నాను. (2.8)
- సంజయుడు పలికెను – ఓ రాజా! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణనితో గుడాకేశుడైన అర్జునుడు, “ నేను యుద్ధము చేయనే చేయను” అని స్పష్టముగా నుడివి, మౌనము వహించెను. (2.9)
- ఓ ధృతరాష్ట్రా ! ఉభయసేనల మధ్య శోకసంతప్తుడైన అర్జునుని జూచి, శ్రీకృష్టడు మందహాసముతో ఇట్లు పలికెను. (2.10)
- శ్రీభగవానుడు పలికెను – ఓ అర్జునా! శోకింపదగని వారికొఱకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని(జ్ఞాని) వలె మాట్లాడుచున్నావు. పండితులైనవారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, ప్రాణములుపోని వారిని గుఱించిగాని శోకింపరు. (2.11)
- నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడ మనము ఉండము అనుమాటయే లేదు. ( అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలములయందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు. ) (2.12)
- జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మఱియెుక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున వెూహితుడు కాడు. (2.13)
- ఓ కౌంతేయా! విషయేంద్రియసంయోగము వలన శీతోష్ణములు సుఖదుఃఖములు కలుగుచున్నవి.అవి ఉత్పత్తి వినాశశీలములు. అనిత్యములు. కనుక భారతా! వాటిని సహింపుము.( పట్టించుకొనకుము) (2.14)
- ఏలనన ఓ పురుషశ్రేష్ఠా! ధీరుడైనవాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే వెూక్షమును పొందుటకు అర్హుడు. (2.15)
- అసత్తు అనుదానికి ( అనిత్యమైనదానికి) ఉనికియే లేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగ ఈ రెండింటియెుక్క వాస్తవస్వరూపములను తత్త్వజ్ఞానియైనవాడే ఎఱుంగును. (2.16)
- నాశరహితమైన ఆ సత్యము( పరమాత్మ తత్త్వము) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు. (2.17)
- ఈ శరీరములు అన్నియును నశించునవియే. కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము( అనిర్వచనీయుము).నిత్యము. కనుక ( ఈ విషయమును ఎఱింగి) ఓ భరతవంశీ! అర్జునా! నీవు యుద్ధము చేయుము. (2.18)
- ఆత్మ ఇతురులను చంపునని భావించువాడును, అది (ఆత్మ) ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దఱును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతను చంపబడదు. (2.19)
- ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది( ఉత్పత్తి, అస్తిత్వము,వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆఱును భావవికారములు) ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. (2.20)
- ఓ పార్థా ! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జననమరణములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును? (2.21)
- మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును. (2.22)
- ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. (2.23)
- ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము. సర్వవ్యాపి, చలింపనిది(అచలము) స్థాణువు( స్థిరమైనది) సనాతనము. (శాశ్వతము). (2.24)
- ఈ ఆత్మ అవ్యక్తమైనది. ( ఇంద్రియగోచరముగానిది) అచింత్యము (మనస్సునకును అందనిది.) వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము. కనుక ఓ అర్జునా! నీవు దేనికై శోకింపదగదు. (2.25)
- ఓ అర్జునా! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు. (2.26)
- ఏలనన పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు. (2.27)
- ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియ గోచరములు గావు- ( అవ్యక్తములు) మరణానంతరము గూడా అవి అవ్యక్తములే- ఈ జననమరణముల మధ్యకాలము నందు మాత్రమే అవి ప్రకటితములు ( ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. (2.28)
- ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని (ఈ ఆత్మను ) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్త్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేఱొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడ కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు. (2.29)
- ఓ అర్జునా! ప్రతిదేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు. (2.30)
- అంతేగాక స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునుకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మఱియొకటి ఏదియును లేదు. (2.31)
- ఓ పార్థా! యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱచిన ద్వారము వంటిది. (2.32)
- ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మమునుండి పాఱిపోయినవాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసినవాడవగుదువు. (2.33)
- లోకులెల్లరును బహుకాలమువఱకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటెను బాధాకరమైనది. (2.34)
- ఈ మహారథులదృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధమునుండి పారిపోయినట్లు వీరు భావింతురు. (2.35)
- నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటె విచారకరమైన విషయమేముండును? (2.36)
- ఓ అర్జునా! రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. (2.37)
- జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా భావించి, యుద్ధసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. (2.38)
- ఓ పార్థా! ఈ (సమత్వ) బుద్ధిని ఇంతవఱకును జ్ఞానయోగ దృష్టితో తెల్పితిని. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, వినుము దానిని ఆకళింపుచేసికుని, ఆచరించినచో కర్మబంధములనుండి నీవుముక్తుడవయ్యెదవు. (2.39)
- ఈ (నిష్కామ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధనచేసినను అది జన్మమృత్యురూప మహాభాయమునుండి కాపాడును. (2.40)
- ఓ అర్జునా! ఈ (నిష్కామ) కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగానుండును. (2.41)
- ఓ అర్జునా! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేద వాక్యములయొక్క బాహ్యార్థములయందే ప్రీతివహింతురు. వాటి అంతరార్థములజోలికేపోరు. (2.42)
- స్వర్గమునకు మించిదినదేదియును లేదనియు, అదియే పరమప్రాప్యమనియు వారు (వివేకహీనులు) భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిద సకామ కర్మలను ప్రోత్సహించుచు , ప్రీతిని గూర్చు ఇచ్చకపుపల్కులు పలికెదరు. (2.43)
- ఆ ఇచ్చకపుమాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులబుద్ధులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్థిరముగా ఉండవు. (2.44)
- ఓ అర్జునా! వేదములు సత్త్వరజస్తమోగుణములకార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనలయందును ఆసక్తిని త్యజింపుము. హర్షశో కాదిద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆ ఆరాటపదవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. (2.45)
- అన్నివైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము. (2.46)
- ర్తవ్యకర్మమునాచరించుటయందే నీకు అధికారముగలదు. ఎన్నటికినీ దాని ఫలములయందులేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము. (2.47)
- ఓ ధనంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ది-అసిద్దుల యెడ సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. (2.48)
- ఈ సమత్వబుద్ధియోగముకంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయా! నీవు సమత్వబుద్ధియోగమునే ఆశ్రయింపుము – ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, కృపణులు. (2.49)
- సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పుణ్య పాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగాకర్మబంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. (2.50)
- ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందుదురు. (2.51)
- మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. (2.52)
- నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన ( అయోమయమునకు గురియైన) నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య ( శాశ్వత) సంయోగము ఏర్పడును. (2.53)
- అర్జునుడు పలికెను – ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడుచును? (2.54)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మ యందు సంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు. (2.55)
- దుఃఖములకు క్రుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి మనన శీలుడు(ముని) స్థితప్రజ్ఞుడన బడును. (2.56)
- దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితు లయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోను గాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. (2.57)
- తాబేలు తనఅంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను ఇంద్రియార్థముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. (2.58)
- ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహంపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని వాటి పై ఆసక్తి మిగిలిముండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును. (2.59)
- ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవఱకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును. (2.60)
- కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని, సమాహిత చిత్తుడై ( చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై) మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశము నందుంచుకొనువాని బుద్ధి స్థిరముగానుండును. (2.61)
- విషయచింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆవిషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. (2.62)
- అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును. (2.63)
- అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. (2.64)
- మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతనిదుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగియొక్క బుద్ధి అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. (2.65)
- ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చియాత్మకబుద్ధి ఉండదు. అట్టి అయుక్తమనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్మాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును? (2.66)
- నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రయములలో, మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను, ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజునిబుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించి వేయును. (2.67)
- కనుక ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్నివిధిములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషునియొక్క బుద్ధి స్థిరముగానుండును. (2.68)
- నిత్యజ్ఞానస్వరూప పరమానందప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కోని యుండును. అది పరమాత్మతత్త్వమునెఱిగిన మునికి ( మననశీలునకు) రాత్రితో సమానము. (2.69)
- సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. (2.70)
- కోరికలన్నింటిని త్యజించి, మమతా- అహంకార, స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. (2.71)
- ఓ అర్జునా! బ్రాహ్మీస్థితి యనగా ఇదియే. (ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషునిస్థితి.) ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితియందు స్థిరముగానున్ననాడు బ్రహ్మానందమును పొందును. (2.72)
Chapter 3
- అర్జునుడు పలికెను – ఓ జనార్దనా! కేశవా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ? (3.1)
- కలగాపులగమువంటి నీ మాటలతో నా బుద్ది భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము. (3.2)
- శ్రీభగవానుడు పలికెను- ఓ అనఘా! అర్జునా! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. (3.3)
- మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు. (3.4)
- ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఏలనన మనుష్యులందఱును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును. (3.5)
- బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు. (3.6)
- కాని, అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపఱచుకొని, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. (3.7)
- నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన, కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణముగూడ సాధ్యము గాదు. (3.8)
- ఓ అర్జునా! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము. (3.9)
- కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, “మీరు ఈ యజ్ఞములద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెల్ల తీర్చును” అని పల్కెను. (3.10)
- ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్స్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱుచుకొనుచు పొందగలరు. అని పల్కెను. (3.11)
- యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు (మానవులకు) అయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆదేవతలకు నివేదనచేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. (3.12)
- యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపములనుండి ముక్తులయ్యెదరు. తమ శరీరపోషణ కొఱకే ఆహారమును సిద్ధపఱచు (వండు) కొను పాపులు పాపమునే భుజింతురు. (3.13)
- ప్రాణులన్నియు అన్నము (ఆహారము) నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షములవలన ఏర్పడును. యజ్ఞములవలన వర్షములు కురియును. విహితకర్మలు యజ్ఞములకు మూలములు. (3.14)
- వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వవ్యాపియు, అవ్యయుడును ఐన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై యున్నాడు. (3.15)
- ఓ అర్జునా! ఇట్లు పరంపరాగతముగా కొనసాగు చున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివానియొక్క జీవితము వ్యర్థము. (3.16)
- సచ్చిదానందఘనపరమాత్మప్రాప్తినందిన జ్ఞానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు. కనుక ఆత్మయందే తృప్తినొందును. అతడు ఆత్మయందే నిత్యసంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. (3.17)
- అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను, చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏవిధముగను ఏమాత్రము ఉండదు. (3.18)
- అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన, ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. (3.19)
- జనకుడు మొదలగు జ్ఞానులుగూడ ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. (3.20)
- శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే (ప్రవర్తననే) ఇతరులును అనుసరింతురు. అతడు నిల్పిన (ప్రతిష్ఠించిన) ప్రమాణములనే లోకులందఱును పాటించెదరు. (3.21)
- ఓ అర్జునా! ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. (3.22)
- (ఏలనన) ఓ పార్థా! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందఱును అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. (3.23)
- నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు లోకములందు అల్లకల్లోలములు (సాంకర్యములు) చెలరేగును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను. (3.24)
- ఓ భారతా! (అర్జునా!) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. (3.25)
- పరమాత్మస్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను. (3.26)
- వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతిగుణములద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతఃకరణముగల అజ్ఞాని) ‘ఈ కర్మలకు నేనే కర్తను’ అని భావించును. (3.27)
- కాని, ఓ మహాబాహూ! (అర్జునా!) గుణవిభాగ తత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తుడు కాడు. (3.28)
- ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడిజ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు (ఊగిసలాటకు) గురి చేయరాదు. (3.29)
- అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, ఆశా మమతా సంతాపములను వీడి, యుద్ధము చేయుము. (3.30)
- దోషదృష్టి లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. (3.31)
- కాని నాయందు దోషారోపణ చేయుచు, నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్తజ్ఞాన విషయముల యందును మోహితులై (విపరీత జ్ఞానోపహతులై) భ్రష్టులై, కష్టనష్టముల పాలయ్యదరని ఎఱుంగుము. (3.32)
- సమస్త ప్రాణులును తమ తమ ప్రకృతులను అనుసరించి (స్వభావములకు లోబడి) కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని (స్వభావమును) అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? (3.33)
- ప్రతిఇంద్రియార్థమునందును (ప్రతిఇంద్రియ విషయమునందును) రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. (3.34)
- పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. (3.35)
- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయు చుండును? (3.36)
- శ్రీభగవానుడు పలికెను – రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాపకర్మా చరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎఱుంగుము. (3.37)
- పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే ఆవృతమై యుండును. (3.38)
- ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. (అగ్నివంటిది) అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. (3.39)
- ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. ఇది (ఈకామము) మనోబుద్దీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవత్మను మోహితునిగా చేయును. (3.40)
- కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపఱచుకొనుము. పిదప జ్ఞానవిజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులనొడ్డి రూపుమాపుము. (3.41)
- స్థూలశరీరముకంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్ఠములు అని పేర్కొందురు. ఇంద్రియములకంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్ఠమైనవి. ఆ బుద్ధికంటెను అత్యంతశ్రేష్ఠమైనది, సూక్ష్మమైనది ఆత్మ. (3.42)
- ఈ విధముగా బుద్ధికంటెను ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్ఠము ఐనదని తెలిసికొని, ఓ మహాబాహూ! బుద్ధిద్వారా మనస్సును వశపఱచుకొని, దుర్జయశత్రువైన కామమును నిర్మూలింపుము. (3.43)
Chapter 4
- శ్రీ భగవానుడు ఇట్లు పలికెను – నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. (4.1)
- ఓ పరంతపా ! (అర్జునా ! )ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎఱింగిరి. కాని, అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకము నందు లుప్తప్రాయమయ్యెను. (4.2)
- ఈ యోగము ఉత్తమమైనది. రహస్యంగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు. ప్రియసఖుడవు. కనుక, మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచున్నాను. (4.3)
- అర్జునుడు పలికెను – కృష్ణా ! నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక, నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట యెట్లు ? (4.4)
- శ్రీ భగవానుడు తెలిపెను – ఓ పరంతపా ! ఓ అర్జునా ! నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కాని, వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును. నీ వెఱుగవు. (4.5)
- నేను జన్మ రహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయిననూ, నా ప్రకృతిని అధీనములోనుంచుకుని, నా యోగమాయచే అవతరించుచుందును. (4.6)
- ఓ భారతా! (అర్జునా!) ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును, నన్ను నేను సృజించుకొందును. అనగా, సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. (4.7)
- సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును , నేను ప్రతి యుగము నందును అవతరించుచుందును. (4.8)
- ఓ అర్జునా ! నా జన్మ(అవతారము)లు , కర్మములు, దివ్యములు. అనగా, నిర్మలములు. అలౌకికములు. ఈ తత్త్వ రహస్యమును తెలిసికొనినవాడు తనువును చాలించిన పిమ్మట మఱల జన్మింపడు సరికదా ! నన్నే చేరును. (4.9)
- ఇదివరలో గూడ సర్వదా రాగ, భయ, క్రోధ రహితులైనవారు, దృఢమైన భక్తి, తాత్పర్యములతో స్థిర బుద్ధి గలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై, పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. (4.10)
- పార్థా ! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు (4.11)
- ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. (4.12)
- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను, పరమేశ్వరుడైన నన్ను వాస్తవముగా ‘అకర్తను’ గా తెలుసికొనుము. (4.13)
- నాకు కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్త్వవమును తెలిసినవారు కర్మబద్ధులు కారు. (4.14)
- ఓ అర్జునా ! ప్రాచీనులైన ముముక్షువులు (మోక్షము పొందకోరిన వారు) ఈ విధముగా (నా తత్త్వ రహస్యమును ) దెలిసికొని కర్మలనాచరించిరి. కావున, నీవును ఆ పూర్వులవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము. (4.15)
- కర్మ అనగా ఏమి ? అకర్మ యనగానేమి ? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. (తికమక పడుతున్నారు) కావున, కర్మతత్త్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. (4.16)
- కర్మ’ తత్త్వమును తెలిసికొనవలెను, అట్లే ”అకర్మ” స్వరూపమును గూడ ఎరుగవలెను, ‘వికర్మ ‘ లక్షణములను కూడా తెలిసికొనుట చాలా అవసరము. ఏలనన, కర్మ తత్త్వము అతి నిగూఢమైనది. (4.17)
- కర్మ యందు ‘అకర్మ’ ను, అకర్మ యందు ‘కర్మ’ ను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మఱియు సమస్త కర్మలు చేయువాడు. (4.18)
- ఎవని కర్మలన్నియును, శాస్త్ర సమ్మతములై, కామ సంకల్ప వర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి మహా పురుషుని జ్ఞానులు పండితుడని అందురు. (4.19)
- సమస్త కర్మల యందును, వాటి ఫలితముల యందును సర్వథా ఆసక్తిని వీడి, సంసార – ఆశ్రయ రహితుడై, పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని, వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు. (4.20)
- అంతఃకరణమును, శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరిక కర్మలను ఆచరించుచున్ననూ, పాపములను పొందడు. (4.21)
- తాను కోరకుండగనే లభించిన పదార్థములతో (అప్రయత్నయముగా అమరిన లాభాలతో) సంతుష్టుడైన వాడు, అసూయలేని వాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధి యందును, అసిధ్ది యందును కూడా సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మ యోగి కర్మలనాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. (4.22)
- ఏలనగా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమూ లేని వాడును, పరమాత్మ జ్ఞానము నందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించు వాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నియును పూర్తిగా విలీనములగును అనగా మిగిలియుండవు. (4.23)
- యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు స్రువాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ విధముగా బ్రహ్మ కర్మ యందు స్థితుడై యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూడ బ్రహ్మమే. (4.24)
- కొందఱు యోగులు దైవపూజారూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మఱి కొందఱు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మపరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా (అనగా పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పించటం) ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. (4.25)
- కొందరు యోగులు శ్రోత్రాది – ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొంతమంది యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమూత్రము ఉండదు. (4.26)
- మరికొందఱు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలను, అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమయోగరూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులైయుందురు. అపుడు ప్రాణ ఇంద్రియముల స్వభావము వారిపై ఏ మాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచి యుండును. (4.27)
- కొందఱు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మఱికొందఱు తపోరూప యజ్ఞములను, కొందఱు యోగరూప యజ్ఞములను చేయుదురు. మఱికొందఱు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి, యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞానయజ్ఞములను ఆచరింతురు. (4.28)
- కొందఱు యోగులు అపాన వాయువు నందు ప్రాణ వాయువును, మరి కొందరు ప్రాణ వాయువు నందు అపాన వాయువును హవనము చేయుదురు (4.29)
- కొందరు యోగులు నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులై ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిదులైన ఈ సాధకులు అందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. (4.30)
- ఓ కురుసత్తమా! (అర్జునా) యజ్ఞపూతశేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్య లోకమే సుఖప్రదము కాదు. ఇంక, ఆ పరలోక విషయము చెప్పనేల? (4.31)
- ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతంగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటిని త్రికరణ శుద్ధిగా (మనో వాక్కాయములచే) ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్త్వమును తెలిసికొని, అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక (కర్మ) బంధముల నుండి సర్వథా విముక్తుడవయ్యెదవు. (4.32)
- ఓ పరంతపా! అర్జునా! ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శేష్ఠమైనది. కర్మలన్నియును జ్ఞానము నందే పరిసమాప్తమగును. (4.33)
- నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి,ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామము లాచరించుట వలనను , సేవలొనర్చుటవలనను, కపటము లేకుండ భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను, పరమాత్మ తత్త్వమును చక్కగానెఱింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మ తత్త్వజ్ఞానమును ఉపదేశించెదరు. (4.34)
- ఓ అర్జునా ! ఈ తత్త్వ జ్ఞానమునెఱింగినచో మఱల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచ్చిదానందఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. (4.35)
- ఒకవేళ పాపాత్ములందఱి కంటెను నీవు ఒక మహాపాపివి అయినచో, జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా, పూర్తిగా బయట పడగలవు. (4.36)
- ఓ అర్జునా ! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు, జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటిని భస్మమొనరించును. (4.37)
- ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది మరియొకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణముగల సాధకుడు బహుకాలము వరకు, కర్మయోగాచరణము చేసి, ఆత్మ యందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు (4.38)
- జితేంద్రియుడు, (ఇంద్రియములను నియంత్రణ చేసేవాడు), సాధనపరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్త్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే (ఏ మాత్రము విలంబము లేకుండ) అతడు భగవత్తత్త్వ రూపమైన పరమశాంతిని పొందును. (4.39)
- అవివేకియు, శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని, ఎట్టి సుఖమూ ఉండదు. (4.40)
- ఓ ధనంజయా! (ఓ అర్జునా!) విధి పూర్వకముగ కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములనన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును వశము నందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. (4.41)
- కావున, ఓ భారతా! (ఓ అర్జునా!) నీ హృదయము నందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును, వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి, సమత్వ రూప కర్మ యోగము నందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. (4.42)
Chapter 5
- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! ఒక్కసారి కర్మ సన్న్యాసమును, మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. (5.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను – కర్మసన్న్యాసము, కర్మయోగము అను ఈ రెండును పరమకళ్యాణదాయకములే. కాని, ఈ రెండింటిలోను కర్మసన్న్యాసముకంటెను కర్మ యోగము సాధన యందు సుగమమగుటవలన శ్రేష్ఠమైనది. (5.2)
- మహాబాహో! (అర్జునా!) ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎఱుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వందములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. (5.3)
- సాంఖ్య, కర్మ యోగములు వేర్వేఱు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా (విధివిధానముగా) ఆచరించినవాడు ఆ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. (5.4)
- జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మ యోగులు కూడా పొందుదురు. జ్ఞాన యోగ ఫలమును, కర్మ యోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును. (5.5)
- కానీ, ఓ అర్జునా! కర్మ యోగమును అనుష్ఠింపక, సన్న్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటియందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననము చేయు కర్మ యోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. (5.6)
- మనస్సును వశము నందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మ యోగి, కర్మలను ఆచరించుచున్నను, ఆ కర్మలు వానిని అంటవు. (5.7)
- తత్వజ్ఞునుడైన సాంఖ్య యోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు (తినుచు), నడచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడపుచు ఉన్ననూ, నేను (ఏ కొంచెమూ) ఏమియు చేయట లేదు అని భావించును. (5.8)
- అంతేకాదు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరచుచు, మూయుచు ఉన్ననూ ఇంద్రియములు తమ తమ విషయముల యందు ప్రవర్తించుచున్నవనియు (తానేమియు చేయుటలేదనియు)భావించును. (5.9)
- కర్మలనన్నింటిని భగవదర్పణము గావించి, ఆసక్తి రహితముగ కర్మలనాచరించు వానిని, పాపములు తామరాకు పై నీటి బిందువువలే అంటవు. (5.10)
- కర్మ యోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. (5.11)
- నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి, భగవత్ప్రాప్తిరూపమైన శాంతినిపొందును. కర్మ ఫలాసక్తుడైనవాడు, ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. (5.12)
- అంతఃకరణమును అదుపులోనుంచుకుని, సాంఖ్య యోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింపజేయకయే, నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి, సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించును. (5.13)
- పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కాని, వారి కర్మలను కాని, కర్మ ఫల సంయోగమును కాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును. (5.14)
- సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులతగుచుందురు. (5.15)
- కాని, వారి (ప్రాణుల) అజ్ఞానము ఆ పరమాత్మ తత్త్వ జ్ఞానప్రాప్తిద్వారా తొలగిపోవును. అప్పుడు, ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె (సూర్య ప్రభవలె) దర్శింపజేయును. (5.16)
- తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై , సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావంతో స్థితులై, తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాప రహితులై, పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. (తద్రూపము అంటే – ఆ పరమాత్మయే ఆనందమయము అనీ, దానికంటే భిన్నమైనది మరొక వస్తువు లేదనీ ఎల్లప్పుడూ మననము చేస్తూ, ఆ పరమాత్మ యందే మనస్సు అభిన్న భావముతో నిశ్చలముగా ఉండటమే మనస్సు తద్రూపము పొందుట అగును) (5.17)
- జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి యుందురు. (5.18)
- సర్వత్ర సమభావ స్థిత మనస్కులు ఈ జన్మ యందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోష రహితుడు, సముడు. సమభావ స్థిత మనస్కులయిన జ్ఞానులు ఆ పరమాత్మ యందు స్థితులు. కనుక, వారు త్రిగుణాతీతులు. జీవన్ముక్తులు. (5.19)
- ప్రియలాభములకు పొంగిపోని వాడును, అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగిపోని వాడును, స్థిరమైన బుధ్ధి గలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మ వేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితి యందుండును. (5.20)
- ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మ స్థిత ధ్యానజనితమైన సాతత్త్వికాత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగము నందు అభిన్న భావ స్థితుడై అక్షయానందమును అనుభవించును. (5.21)
- విషయ – ఇంద్రియ సుఖముల సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగ లాలసులకు సుఖములుగా భాసించినను, అవి నిస్సందేహముగా దుఃఖ హేతువులే. అట్టి భోగములు ఆది అంత్యములు గలవి. అనగా, అనిత్యములు. కావున, ఓ అర్జునా! వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. (5.22)
- ఈ శరీరమును విడువక ముందే అనగా, జీవించియుండగానే కామ క్రోధాదుల ఉద్వేగములను అదుపులోనుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి, యోగి. (5.23)
- (సమిష్టి) అంతరాత్మ యందే సుఖించువాడును, ఆత్మ యందే రమించు వాడును, ఆత్మజ్ఞానియైనవాడును అగు సాంఖ్యయోగి, సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై, బ్రహ్మనిర్వాణమును పొందును. (5.24)
- పాపరహితులును, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృతిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసినవారును అగు బ్రహ్మ వేత్తలు బ్రహ్మనిర్వాణమును పొందుదురు. (5.25)
- కామక్రోధ రహితులును, చిత్త వృత్తులనుజయించిన వారును అయి , పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. (5.26)
- బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. (5.27)
- 27వ శ్లోకములో చెప్పిన ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోకి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్ష పరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధ రహితుడై సదా ముక్తుడగును. (5.28)
- భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్త లోకములకును, లోకేశ్వరులకును అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అనగా అవ్యాజ దయాళువు. పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్త్వమును ఎఱిగిన భక్తునకు పరమ శాంతి లభించును. (5.29)
Chapter 6
- శ్రీ భగవానుడు పలికెను – కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్న్యాసియుకాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియుకాడు. (6.1)
- ఓ అర్జునా ! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. ఏలనన సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు. (6.2)
- యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. (6.3)
- ఇంద్రియ భోగములయందును, కర్మలయందును ఆసక్తుడు గాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. (6.4)
- మనుజులు ఈ సంసారసాగరమునుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతిపాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు. తమకు తామే శత్రువులు. (6.5)
- మనస్సును ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకుతానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తిసిద్ధికై మిత్రునివలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువులవలె ప్రవర్తించి లక్ష్యసాధనకు అవరోధకములుగా నిలుచును. (6.6)
- శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానందఘనపరమాత్మ చక్కగా స్థితుడై యుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. (6.7)
- పరమాత్మ ప్రాప్తినందిన యోగియొక్క అంతఃకరణమునందు జ్ఞానవిజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపఱచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. (6.8)
- సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగినవారియందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. (6.9)
- శరీరేంద్రియమనస్సులను స్వాధీనపఱచుకొనిన వాడు, ఆశారహితుడు, భోగసామగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి ఒంటరిగా, నిర్జన (ఏకాంత) ప్రదేశమున కూర్చొని, ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. (6.10)
- పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా ధర్భాసనమును, జింకచర్మమును, వస్త్రమును, ఒకదానిపై ఒకటి పఱచి, అంత ఎక్కువగాకాని, తక్కువగాకాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పఱచుకొనవలెను. (6.11)
- ఆ అసనము పై కూర్చొని, చిత్తేంద్రియ వ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణశుద్ధికై ధ్యానాయోగమును సాధన చేయవలెను. (6.12)
- శరీరమును, మెడను, శిరస్సును నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను. (6.13)
- ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై యుండవలెను. (6.14)
- మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. (6.15)
- అర్జునా ! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడును (ఏమాత్రము నిద్రింపక) మేల్కొనియుండువానికిని ఈ యోగసిద్ధి కలుగదు. (6.16)
- ఆహార విహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్స్వప్నాదులయందును యథాయోగ్యముగ ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. (6.17)
- చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. (6.18)
- వాయుప్రసారము లేనిచోట నిశ్చలముగానుండు దీపమువలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. (6.19)
- ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింపజేసికొని, యోగి ఆ సచ్చిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. (6.20)
- బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే. గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మస్వరూపమునుండి ఏ మాత్రమూ విచలితుడు కానేకాడు. (6.21)
- పరమాత్మప్రాప్తిరూపలాభమును పొందినవాడు (అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు. (6.22)
- దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కార రూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ (విసుగులేని) చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. (6.23)
- సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. (6.24)
- క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మఱి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతన చేయరాదు. (6.25)
- సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మఱల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. (6.26)
- ప్రశాంతమైనమనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. (6.27)
- పాపరహితుడైన ఆ యోగి పుర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మప్రాప్తిరూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. (6.28)
- సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితిరూప యోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను, ప్రాణులన్నింటిని ఆత్మయందు కల్పితములుగను భావించును (చూచును). (6.29)
- సకల ప్రాణులయందును ఆత్మ రూపముననున్న నన్ను (వాసుదేవుని) చూచు పురుషునకు, అట్లే ప్రాణులన్నింటికి నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు అదృశ్యుడు కాడు. (6.30)
- భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మ రూపముననున్న సచ్చిదానందఘన వాసుదేవుడనైయున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. (6.31)
- ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలె (తనతో) సమానముగా చూచువాడును, సుఖమును గాని, దుఃఖమును గాని సమముగా (సమానముగ) చూచువాడును (ఇతరుల సుఖదుఃఖములులను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్ఠుడు. (6.32)
- అర్జునుడు పలికెను – ఓ మధుసూదనా! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసికొన లేకున్నాను. (6.33)
- ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ప్రమథనశీలమైనది (బాగుగా మథించు స్వభావము గలది). దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలె మిక్కిలి దుష్కరమని భావింతును. (6.34)
- శ్రీ భగవానుడు పలికెను – హే మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపఱచుకొనుట మిక్కిలి కష్టము. కాని కౌంతేయ ! అభ్యాసవైరాగ్యములద్వారా దానిని వశపఱచుకొనుట సాధ్యమే. (6.35)
- మనస్సును వశపఱచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభప్రాయము. (6.36)
- అర్జునుడు పలికెను – హే కృష్ణా! యోగమునందు శ్రద్ధాదరములతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి, యోగసిద్ధిని (భగవత్సాక్షాత్కారమును) పొందకయే మరణించిన సాధకుని గతియేమగును ? (6.37)
- హే మహాబాహో! అతడు (యోగభ్రష్టుడు) భగవత్ప్రాప్తి మార్గమునుండి జారినవాడై, ఆశ్రయరహితుడై (ఆలంబనము లేనివాడై), ఉభయభ్రష్టుడై, ఛిన్నాభిన్నమైన మేఘమువలె అధోగతి పాలు కాడు గదా! (6.38)
- ఓ కృష్ణ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తిచేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరఱెవ్వరికిని శక్యము కాదు. (6.39)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పార్థా! అట్టి (ఆ) పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుగాడు. ఏలనన, నాయనా! ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతిపాలుగాడు. (6.40)
- యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి, పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. (6.41)
- అథవా విరాగియైన పురుషుడు ఆ పుణ్య (ఊర్ధ్వ) లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. (6.42)
- అచట (యోగి కుటుంబమున పుట్టిన పిదప) పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందన! ఆ బుద్ధిసంయోగ ప్రభావమున అతడు మఱల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటికంటెను అధికముగా సాధన చేయును. (6.43)
- శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పుర్వసాధన ప్రభావమున నిస్సందేహముగ భగవంతుని వైపు ఆకర్షితుడగును. మరియు సమబుద్ధిరూప యోగజిజ్ఞాసువు గూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అధిగమించును. (6.44)
- కాని, ప్రయత్నపూర్వకముగ యోగసాధన చేయు యోగి అనేక జన్మల సంస్కార ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తత్ క్షణమే పరమపదమును పొందును. (6.45)
- యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు. శాస్త్ర జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు. సకామకర్మలను ఆచరించువారి కంటెను శ్రేష్ఠుడని భావించబడును. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము. (6.46)
- యోగులందఱిలోను శ్రద్ధాళువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్యభావముతో నా యందే స్థిరమైయున్న మనోబుద్ధిరూప – అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమ శ్రేష్ఠుడు – అని నానిశ్చితాభిప్రాయము. (6.47)
Chapter 7
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పార్థా! అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై, యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణవిభూతిబల – ఐశ్వర్యాదిగుణయుక్తుడను, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను ఐన నన్ను సమగ్రముగా తెలిసికొను విధమును వినుము. (7.1)
- నేను నీకు విజ్ఞానసహితముగా తత్త్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎఱిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియు మిగులదు. జ్ఞానము – అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభావ మహాత్మ్య రహస్యములతో గూడిన యథార్థతత్త్వజ్ఞానము. విజ్ఞానము – అనగా సగుణ నిరాకార దివ్య సాకార తత్త్వముయొక్క లీలారహస్యగుణమహత్త్వ ప్రభావసహితమైన యథార్థజ్ఞానము. (7.2)
- వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్నుగూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలోగూడ ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్త్వమును అనగా నా యథార్థస్వరూపమును ఎఱుంగును. (7.3)
- ఓ మహాబాహూ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అని నా ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు. (7.4)
- ఓ అర్జున ! ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ’ ప్రకృతి అనియందరు. ఇదిగాక ఈ సంపూర్ణజగత్తును ధరించునట్టి మఱియొక ‘ప్రకృతి’ కలదు. అదియే నా జీవరూప ‘పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకొనుము. (7.5)
- ఓ అర్జునా! సమస్తప్రాణులును ఈ రెండువిధములైన ప్రకృతులనుండియే ఉత్పన్నములగుచున్నవి, ఈ జగత్తుయొక్క ప్రభావమూ (పుట్టుకయూ) ప్రలయమూ (లీనమగుటయూ) నావలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూలకారణము. (7.6)
- ఓ ధనంజయా! నాకంటెను పరమకారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్రమణులవలె నాయందే కూర్చబడియున్నవి. (7.7)
- ఓ అర్జునా! జలములో రసతన్మాత్రను నేనే. సూర్యచంద్రులలో కాంతిని నేనే. వేదములన్నింటిలోను ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. (7.8)
- పృథ్వియందు పవిత్రగంధతన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని (చైతన్యమును) తాపసులలో తపస్సును నేనే. (7.9)
- ఓ పార్థా! సమస్త భూతములకును నన్ను సనాతన (శాశ్వత) మైన బీజముగా ఎఱుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. (7.10)
- ఓ భరతశ్రేష్ఠా! బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, భూతములన్నింటియందును (సమస్తప్రాణులయందును) ధర్మమునకు విరుద్ధముగాని (శాస్త్రసమ్మతమైన) కామమును నేనే. (7.11)
- సాత్త్విక, రాజస, తామస భావములన్నియును నా నుండియే కలుగుచున్నవని తెలిసికొనుము. కాని, యథార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. (7.12)
- ఈ జగత్తు అనగా ప్రాణిసముదాయము అంతయును గుణములయొక్క కార్యరూపములైన సాత్త్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను, శాశ్వతుడను ఐన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. (7.13)
- నా మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని, కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి, సంసారసముద్రము నుండి బయటపడగలరు. (7.14)
- మాయలో చిక్కుపడుటవలన విపరీత జ్ఞానమునకు లోనైనవారును, ఆసుర ప్రవృత్తిగలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. (7.15)
- ఓ భరతశ్రేష్ఠా! అర్జునా! శుభకర్మలను ఆచరించుచు సుఖసంపదలను కోరుకొనువారు (అర్థార్థులు), శారీరిక మానసిక సంతాపములకు గురియైన ఆర్తులు, ఐహికవిషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్త్వజ్ఞానమును పొందుటకు ఇచ్ఛగలవారు (జిజ్ఞాసువులు), పరమాత్మప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. (7.16)
- ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగ నన్ను (నాతత్వమును) తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. (7.17)
- ఈ చతుర్విధభక్తులందఱును ఉదారులే. (అనగా భగవంతునియందు విశ్వాసమునుంచి, ఎల్లప్పుడును అతనినే సేవించుచు ఉండువారు.) కాని, జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తనమనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును. ఈవిధముగా అతడు నాయందే స్థితుడు. (7.18)
- అనేకజన్మలపిదప జ్ఞానియైనవాడు (భగవత్తత్త్వమును ఎఱిగినవాడు) సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. (7.19)
- నానావిధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయినవారిజ్ఞానము హరింపబడును. వారు తమతమస్వభావములకు అనుగుణముగా వారివారి (ఆయా) నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. (7.20)
- సకామభక్తుడు ఏయేదేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయాదేవతలయందే భక్తిశ్రద్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదును. (7.21)
- అట్టి సకామభక్తుడు తగిన భక్తిశ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్పలితముగ నా అనుగ్రహము వలననే ఆ దేవతద్వారా తను కోరుకొనిన భోగములను అతడు తప్పక పొందగలడు. (7.22)
- కాని ఈ సకామభక్తులు (అల్పబుద్ధులు) పొందెడి ఫలములు గూడ నశ్వరములు. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. కాని, భక్తులు ఏ విధముగా ఆరాధించినను (వారి వాంఛలనేగాక) చివరకు నన్నే పొందుదురు. (7.23)
- నేను శాశ్వతుడను. సర్వోత్తముడను, ఇంద్రియములకును, మనస్సునకును గోచరింపనివాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక, ఇట్టి సచ్చిదానందఘనపరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జననమరణచక్రములోబడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. (7.24)
- నా యోగమాయచే ఆవరింపబడియున్నందున నేను అందరికిని గోచరింపను. కనుక, అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలిసికొనలేరు. (అనగా నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు). (7.25)
- ఓ అర్జునా! గతకాలమునకు చెందినట్టివియు, వర్తమాన (ప్రస్తుత) కాలము నందున్నట్టివియు ఐన చరాచర ప్రాణులన్నింటిని నేను ఎఱుగుదును. అంతేకాదు రాబోవుకాలమున ప్రభవించు (జన్మించు) ప్రాణులనుగూర్చియు నేను ఎఱుగుదును. కాని, నాయందు భక్తిశ్రద్ధలుగలవారుతప్ప వేరెవ్వరును నన్ను ఎఱుగజాలరు. (7.26)
- భరతవంశీ! ఓ అర్జునా! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషములవలన కలిగిన సుఖ దుఃఖాదిద్వంద్వములప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. (7.27)
- కాని, నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషులపాపములు రూపుమాసిపోవును (నశించును). అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాదిద్వంద్వ రూపమోహములనుండి విముక్తులయ్యెదరు. దృఢనిశ్చయముగల్గిన అట్టి భక్తులే అన్నివిధముల నన్ను భజింతురు. (7.28)
- నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త-అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు. (7.29)
- అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతోపాటు అందరికినీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు. (7.30)
Chapter 8
- అర్జునుడు పలికెను – ఓ పురుషోత్తమా! బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగానేమి? అధిభూతము అని దేనికి పేరు? అధిదైవము అని దేనిని అందురు? (8.1)
- ఓ మధుసూదనా! ‘అధియజ్ఞము’ అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నముచేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు? (8.2)
- శ్రీ భగవానుడు పలికెను – బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి – అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మయందురు. (8.3)
- ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! ఈశరీరములో అంతర్యామిగా ఉన్న నేనే- వాసుదేవుడనే అధియజ్ఞమును. (8.4)
- అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే (నాస్వరూపమునే) పొందును. ఇందేమాత్రము గూడ సందేహము లేదు. (8.5)
- కౌంతేయా! మనుష్యుడు అవసానదశయందు ఏఏభావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. (8.6)
- కావున ఓ అర్జునా! నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును (కర్తవ్యకర్మను) కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిల్పియున్నచో నిజముగా (నిస్సందేహముగా) నన్నే పొందెదవు. (8.7)
- మనస్సును ఎటూ పోనీయక (వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండ) నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. (8.8)
- సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును, అణువుకంటెను సూక్ష్మమైనవాడును, అందరిని ధరించి పోషించువాడును, అచింత్యరూపుడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును ఐన సచ్చిదానంద ఘనపరమేశ్వరుని స్మరించువాడగు. (8.9)
- అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటీ మధ్యమున ప్రాణములను స్థిరముగా నిల్పి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును, పరమపురుషుడును ఐన పరమాత్మనే చేరును. (8.10)
- వేదవిదులైన విద్వాంసులు ఆ సచ్చిదానందఘనపరమాత్మను శాశ్వతుడు (అక్షరుడు) అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్న్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమునుగూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. (8.11)
- సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు (సహస్రారమునందు) స్థిరమొనర్చి, పరమాత్మధ్యానమునందే నిమగ్నుడై (ఉన్నవాడు),…..(8.12)
- ….. అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను, నిర్గుణబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగ మొనర్చువాడు పరమగతిని (మోక్షమును) పొందును. (8.13)
- పార్థా! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్ను స్మరించుచు, సతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజముగానే నేను లభింతును. (8.14)
- పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. (8.15)
- అర్జునా! బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్తలోకములును పునరావృత్తములు. కౌంతేయా! (ఈలోకములన్నియును కాలమునకు పరిమితమైనవి. కాని నేను కాలాతీతుడను) కనుక నన్ను చేరినవారికి పునర్జన్మ యుండదు. (8.16)
- వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక ‘పగలు’ అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రియనియు తెలిసిన యోగులు కాలతత్త్వమును నిజముగా ఎఱిగినవారు. (8.17)
- చరాచరప్రాణులన్నియును బ్రహ్మయొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తమునుండి అనగా బ్రహ్మయొక్క సూక్ష్మశరీరమునుండి ఉత్పన్నములగును. (ప్రకటితములగును). మఱల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభసమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. (8.18)
- పార్థా! ఈభూత(ప్రాణి) సముదాయమే ప్రకృతివశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. (8.19)
- ఆ అవ్యక్తముకంటెను పరమైన విలక్షణమైన సనాతన (శాశ్వత) మైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు (నిత్యుడే). (8.20)
- ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన – అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మఱల తిరిగిరారు. (8.21)
- ఓ పార్థా! సమస్త భూతములు (ప్రాణులు) ఆపరమాత్మయందే అంతర్గతములై యున్నవి. ఆ సచ్చిదానంద ఘనపరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై (పూర్ణమై) ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. (8.22)
- ఓ భరతశ్రేష్ఠా! ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మఱియు ఏకాలమునందు దేహత్యాగము చేసినవారు తిరిగివచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను, అనగా రెండు మార్గములను తెలిపెదను. (8.23)
- బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయమార్గముద్వారా బ్రహ్మపదప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన(పగలు)శుక్లపక్ష ఉత్తరాయణ – అభిమాన దేవతలు కొనిపోయి, పరమపదమును చేర్చుదురు. (8.24)
- అట్లే సకామకర్మయోగులు ధూమ్రమార్గముద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామకర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన -అభిమానదేవతలు కొనిపోయి, స్వర్గాదిలోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమసజ్యోతిని పొంది, అనగా తమశుభకర్మ ఫలములను అనుభవించి, తిరిగి భూలోకమును చేరుదురు. (8.25)
- ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణమార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహారప్రసిద్ధి గలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్లువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయానమార్గమున వెళ్లువారు తిరిగివచ్చి జననమరణచక్రములో పడుదురు. (8.26)
- ఓ పార్థా! ఈ విధముగా ఈ రెండు మార్గములతత్త్వములను తెలిసికొన్నయోగి మోహితుడు కాడు. కావున అన్నికాలముల యందును సమత్వబుద్ధిరూపయోగ యుక్తుడవు కమ్ము. అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. (8.27)
- ఈ తత్త్వరహస్యమును ఎఱిగిన యోగి వేదపఠనమువలనను, యజ్ఞదాన తపశ్చర్యాదులవలనను కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతనపరమపదమును చేరును. (8.28)
Chapter 9
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మఱల విశిదముగ చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారమునుండి ముక్తుడవు కాగలవు. (9.1)
- ఈ విజ్ఞానసహితజ్ఞానము (నిర్గుణ సగుణ పరమాత్మతత్త్వజ్ఞానము) అన్ని విద్యలకును తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము, అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. (9.2)
- ఓ పరంతపా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించుచుందురు. (9.3)
- నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమైయున్నది. ప్రాణులన్నియును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములైయున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడనుకాను. (9.4)
- ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై యుండదు. (9.5)
- ఆకాశమునుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే స్థితమై యుండును అని ఎఱుంగుము. (9.6)
- ఓ కౌంతేయా! కల్పాంతమునందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మఱల వాటిని సృజించుచుందును. (9.7)
- తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూతసముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. (9.8)
- ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై, ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. (9.9)
- ఓ అర్జునా! అధిష్ఠాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టించుచున్నది. ఈ కారణమువలననే సంసారచక్రము పరిభ్రమించుచున్నది. (9.10)
- నా పరమభావమును ఎఱుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యమానవునిగా భావించి, తక్కువగా ఊహింతురు. (9.11)
- వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులుగల అజ్ఞానులు రాక్షసీ-ఆసురీ – మోహినీ స్వభావములను ఆశ్రయింతురు. (9.12)
- కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజింతురు. (9.13)
- ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. (9.14)
- మఱికొందరు జ్ఞానయోగులు నిర్గుణనిరాకారబ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞనముద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మఱికొందరు అనంతరూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. (9.15)
- నేనే క్రతువును. నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. (9.16)
- ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామయజుర్వేదములను నేనే. (9.17)
- పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందఱికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను, అందఱి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వతకారణమును నేనే. (9.18)
- ఓ అర్జునా! సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రములనుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మఱల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే. (9.19)
- ఋగ్యజుస్సామవెవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాప రహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చట దేవతల దివ్యభోగములను అనుభవింతురు. (9.20)
- ఆ విశాలస్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మఱల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. (9.21)
- పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (అప్రాప్త వస్తుప్రాప్తిని ‘యోగము’ అనియందురు. ప్రాప్తించిన వస్తురక్షణమును ‘క్షేమము’ అని యందురు.) (9.22)
- ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి. (9.23)
- ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు. (9.24)
- దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. (9.25)
- నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును. (9.26)
- ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. (9.27)
- ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై. అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు. (9.28)
- నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును. (9.29)
- మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. (9.30)
- కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. ‘నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు’ అను విషయమును నిశ్చయముగా ఎఱుంగుము. (9.31)
- ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్ను శరణుపొంది పరమగతినే పొందుదురు. (9.32)
- ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును, భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమునుచేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది – నిరంతరము నన్నే భజింపుము. (9.33)
- నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. (9.34)
Chapter 10
- శ్రీ భగవానుడు పలికెను – హే మహాబాహో! నీవు నా మీద ప్రేమ గలవాడవు. కావున నీ మేలుగోరి నేను మఱల చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు. మహిమాన్వితములు. (10.1)
- నా ఉత్పత్తిని అనగా నా లీలావతారవిశేషములను దేవతలుగాని, మహర్షులుగాని తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్నివిధములుగా ఆ దేవతలకును, ఈ మహర్షులకును మూలకారణమైనవాడను. (10.2)
- నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానినిగను, సకలలోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపములనుండియు విముక్తుడగును. (10.3)
- నిశ్చయాత్మకశక్తి, యథార్థజ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము (ఇంద్రియనిగ్రహము), శమము (మనోనిగ్రహము), సుఖదుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, ….(10.4)
- …..అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, అనునవి ప్రాణులవివిధభావములు. ఇవి యన్నియును నావలననే కలుగున. (10.5)
- సప్తమహర్షులను, వారికంటెను పూర్వులైన సనకాదిమహామునులు నలుగురును, స్వాయంభువాది చతుర్ధశ మనువులును మొదలగు వీరందఱును నా భక్తులే. అందరూ నాయెడ సద్భావముగలవారే. వీరు నా సంకల్పమువలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులును వీరిప్రజలే. (10.6)
- ఈ నా పరమైశ్వర్యరూపవిభూతిని, యోగశక్తియొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చలభక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రమూ సందేహమే లేదు. (10.7)
- ఈ సమస్తజగత్తుయొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూలకారణము. నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎఱింగిన జ్ఞానులైన భక్తులు భక్తిశ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. (10.8)
- నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పరచర్చలద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పికొనుచు, నిరంతరము సంతుష్టులగుచుందురు. మఱియు వారు సతతము నాయందే రమించుచుందురు. (10.9)
- అట్లు నిరంతరము ధ్యానాదులద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్త్వజ్ఞానరూపయోగమును ప్రసాదించెదను. దానిద్వారా వారు నన్నే పొందుదురు. (10.10)
- ఓ అర్జునా! వారి యంతఃకరణములయందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. (10.11)
- అర్జునుడు పలికెను – నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమపవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్యపురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. (10.12)
- దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు, (నిన్నే) నుతింతురు. నీవును నాకు ఆ విధముగనే తెలుపుచున్నావు. (10.13)
- ఓ కేశవా! నీవు చెప్పునది అంతయును సత్యమే. హే భగవాన్! నీ లీలామయస్వరూపమును దేవతలుగాని, దానవులుగాని తెలిసికొనజాలరు. (10.14)
- ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేశా! ఓ దేవాదిదేవా! ఓ జగన్నాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎఱుంగుదువు. (10.15)
- సమస్తలోకములయందును నీ దివ్యవిభూతులద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నావు. మహామహితములైన ఆ దివ్యవిభూతులను సంపూర్ణముగా తెల్పుటకు నీవే సమర్థుడవు. (10.16)
- ఓ యోగీశ్వరా! నిరంతరము చింతనచేయుచూ నేను నిన్ను ఏవిధముగా తెలిసికొనగలను? హే భగవన్! ఏయే భావములతో నాద్వారా చింతన చేయదగినవాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? (10.17)
- ఓ జనార్దనా! నీ యోగశక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గఱించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయవచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. (10.18)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నా దివ్యవిభూతుల విస్తృతికి (వ్యాప్తికి) అంతమే లేదు. వాటిలో ప్రధానమైనవాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. (10.19)
- ఓ అర్జునా! సమస్తప్రాణులహృదయములయందున్న ఆత్మను నేనే. సకల భూతముల (ప్రాణుల) ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. (ప్రాణులయొక్క సృష్టిస్థితిలయములకు కారణము నేనే). (10.20)
- అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని ‘తేజము’ను నేను.నక్షత్రాధిపతియైన చంద్రుడను నేను. (10.21)
- వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును (ప్రాణశక్తిని) నేను. (10.22)
- ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. యక్ష రాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడనునేను. అష్ట వసువులలో అగ్నిని నేను. పర్వతములలో ‘సుమేరు’ పర్వతమునునేను. (10.23)
- పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను. (10.24)
- మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. (10.25)
- వృక్షములలో నేను అశ్వత్థమును (రావిచెట్టును). దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలమునిని. (10.26)
- అశ్వములలో పాలసముద్రమునుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను. (10.27)
- ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడిఆవులలో కామధేనువును నేను. శాస్త్రవిహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములలో వాసుకిని నేను. (10.28)
- నాగజాతివారిలో ఆదిశేషుడ(అనంతుడ)ను నేను. జలచరములకు అధిపతియైన వరుణుడను నేను. పితరులలో అర్యముడను (పితృగణప్రభువును) నేను. శాసకులలో యమధర్మరాజును నేను. (10.29)
- దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులలో) నేను కాలమును. మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే. (10.30)
- పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. (10.31)
- ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను. (సృష్టి స్థితిలయ కారకుడను నేనే). విద్యలలో అధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మవిద్యను నేను. పరస్పరవాదవివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు ‘వాదము’ను నేను. (10.32)
- అక్షరములలో “అ” కారమును నేను. సమాసములలో ‘ద్వంద్వ’ సమాసమును నేను. అక్షయకాలము అనగా మహాకాలమును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను. (10.33)
- అన్నిప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్తప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందఱును నేనే. (10.34)
- గానముచేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామమును నేను. ఛందస్సులలో ‘గాయత్రీఛందస్సు’ను నేను. మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును నేనే. (10.35)
- వంచకులలో జూదమును నేనే. ప్రభావశాలురలోని ప్రభావమును నేను. విజేతలలో విజయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్త్విక పురుషులలో సాత్త్వికభావమును నేనే. (10.36)
- వృష్ణివంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే. (10.37)
- శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్ఛకలవారినీతిని నేనే. గోప్యవిషయరక్షణమున ‘మౌనము’ను నేను. జ్ఞానులయొక్క తత్త్వజ్ఞానమును నేనే. (10.38)
- ఓ అర్జునా! సర్వప్రాణులఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేనులేని చరాచరప్రాణియేదియును లేదు. (10.39)
- ఓ పరంతపా! నా దివ్యవిభూతులకు అంతమే లేదు. నా విభూతులవిస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. (10.40)
- విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సుయొక్క అంశమునుండియే కలిగినదిగా తెలిసికొనుము. (10.41)
- ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణజగత్తును కేవలము నా యోగశక్తియొక్క ఒక్క అంశతోడనే ధరించు చున్నాను. (10.42)
Chapter 11
- అర్జునుడు పలికెను- ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము (మోహము) తొలగిపోయినది. (11.1)
- ఓ కమలాక్షా! ఓ కృష్ణా! సమస్తప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. (11.2)
- ఓ పరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావులేదు. కాని, ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. (11.3)
- ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో, శాశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపింపుము. (11.4)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! అసంఖ్యాకములైన, బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా అలౌకికరూపములను చూడుము. (11.5)
- ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గగణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి యెరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. (11.6)
- ఓ అర్జునా! నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమైయున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక, ఇంకను నీవు చూడదలచుకొనిన వాటినన్నింటినీ చూడుము. (11.7)
- కాని, ఈ ప్రాకృత (చర్మ) చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా (నిస్సందేహముగా) చూడజాలవు. కనుక, నీకు దివ్య (అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ (దివ్య) యోగశక్తిని చూడుము. (11.8)
- సంజయుడు పలికెను- ఓ రాజా! మహాయోగేశ్వరుడును, పాపములను హరించువాడును ఐన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపెను. (11.9)
- అనేకములైన ముఖములతో, నేత్రములతో, పెక్కు అద్భుత దృశ్యములను కలిగిన, అనేకములగు దివ్యాభరణములను ధరించిన, అనేకములైన దివ్యాయుధములను చేపట్టినటువంటి (ఆ దేవదేవుని విరాడ్రూపమును అర్జునుడు దర్శించెను). (11.10)
- దివ్యములైన మాలలను వస్త్రములను ధరించిన, దివ్యములైన చందన పరిమళములను దశ దిశల గుబాళింప చేయుచున్న, సర్వాశ్చర్యకరమైన, అనంతమైన, సర్వత్ర ముఖ శోభలను విరిజిమ్ముచున్న ఆ దేవదేవుని విరాడ్రూపమును (అర్జునుడు దర్శించెను). (11.11)
- ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో, వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ – రూపతేజస్సులకు సాటిరావు. (11.12)
- ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమైయున్నట్లు చూచెను. (11.13)
- అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్) రూపమునకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. (11.14)
- అర్జునుడు పలికెను – ఓ దేవాదిదేవా! నీ విరాట్ – రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్యసర్పములను చూచుచున్నాను. (11.15)
- ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను. (11.16)
- హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది. (11.17)
- పరమ – అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతనపురుషుడవు, అని నా విశ్వాసము. (11.18)
- నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. (11.19)
- ఓ మహాత్మా! దివినుండి భువివఱకుగల అంతరిక్షమునందంతటను, అన్ని దిశలలోను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకరరూపమును చూచి, ముల్లోకములును గడగడలాడుచున్నవి. (11.20)
- ఇదిగో, ఆ దేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. (11.21)
- ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్ధసముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. (11.22)
- హే మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు(తొడ)లను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడా భయముతో వణకిపోవుచున్నాను. (11.23)
- ఏలనన, హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన, నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది. (11.24)
- ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో (భయంకరములైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము. (11.25)
- ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును(నీలో చేరుతున్నారు) (11.26)
- (11.26 లో వర్ణించిన యోధులందఱును) భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. (11.27)
- అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. (11.28)
- మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు. (11.29)
- హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళించుచు, అన్నివైపులనుండి మాటిమాటికిని ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. (11.30)
- ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు – ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను. (11.31)
- శ్రీ భగవానుడు పలికెను – నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు. (మిగిలియుండరు). (11.32)
- కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తి గాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవుకమ్ము. (11.33)
- ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ), కర్ణాది యుద్ధ వీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. (11.34)
- సంజయుడు పలికెను – ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను, మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. (11.35)
- అర్జునుడు పలికెను – ఓ అంతర్యామీ! కేశవా! నీనామగుణప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు. (11.36)
- ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు – కనుక వారు (సిద్ధాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్ – అసత్ లు నీవే. వాటికంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. (11.37)
- ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. పరంధాముడవు, ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది. (11.38)
- నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకువేలకొలది నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు. (11.39)
- అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే. (11.40)
- నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరపాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని. (11.41)
- ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను. (11.42)
- ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును? (11.43)
- కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. (11.44)
- మునుపు ఎన్నడునుచూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక దేవేశా! చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము. (11.45)
- కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము. (11.46)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ – రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మఱి యెవ్వరును చూచియుండలేదు. (11.47)
- ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని తదితర పుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపము నీకుదప్ప మఱియెవ్వరికిని చూడశక్యము గాదు. (11.48)
- ఈ విధమైన నా ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును, మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము. (11.49)
- సంజయుడు పలికెను – వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమును దర్శనమిచ్చెను. అనంతరము శ్రీ కృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి, భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. (11.50)
- అర్జునుడు పలికెను – ఓ జనార్దనా! మీ అతి సౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందర రూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటబడినది నేను నా స్వాభావిక (సహజ) స్థితిని పొందితిని. (11.51)
- శ్రీ భగవానుడు పలికెను – నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరు చుందురు. (11.52)
- నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేద పఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మల చేగాని శక్యము కాదు. (11.53)
- కాని ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్త్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్యభక్తిద్వారా మాత్రమే సాధ్యమగును. (11.54)
- అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. (11.55)
Chapter 12
- అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విదులెవరు? (12.1)
- శ్రీ భగవానుడు ఇట్లనెను – పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణరూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు – అని నా అభిప్రాయము. (12.2)
- కాని ఏ పురుషులు అనిర్వచనీయమైన స్వరూపముగలవాడును, నిరాకారుడును , సర్వవ్యాపియైనవాడును, మనస్సుకు బుద్ధికి గోచరము గానివాడును, సర్వదా ఒకే స్థితిలో ఉండువాడును, నిశ్చలుడును, నిత్యుడును, శాశ్వతుడైన సచ్చిదానందఘనబ్రహ్మను ఏకీభావముతో ఉపాసింతురో…(12.3)
- (ఏ పురుషులు) ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపఱచుకొని, అన్నిటియందును సమభావముగలవారై, సకల ప్రాణులకును హితముచేయగోరువారుగా ఉంటారో, వారు (యోగులు) నన్నే పొందుదురు. (12.4)
- కాని సచ్చిదానందఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తచిత్తులైనవారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతోగూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. (12.5)
- కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటిని నాయందే అర్పించి, సగుణపరమేశ్వరరూపమునే అనన్యభక్తియోగముతో సతతము చింతన చేయుచు భజించుచుందురో……… (12.6)
- ఓ అర్జునా నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరము నుండి ఉద్ధరించెదను. (12.7)
- నాయందే మనస్సు నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు. (12.8)
- మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (12.9)
- అభ్యాసముచేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుటద్వారాకూడ నన్నే పొందెదవు. (12.10)
- మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలములను త్యజింపుము. (12.11)
- తత్త్వము నెఱుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానముకంటెను (శాస్త్ర పాండిత్యముకంటెను) పరమేశ్వరస్వరూపధ్యానము శ్రేష్ఠము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి లభించును. (12.12)
- ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును (అపరాధికిని అభయమును ఇచ్చువాడును)…(12.13)
- …సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడైయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్దులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. (12.14)
- లోకమున ఎవరికిని ఉద్వేగము (క్షోభ) కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేజితుడు కానివాడును (ఉద్వేగమునకు గురికానివాడును), హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. (12.15)
- ఏమాత్రమూ కాంక్షలేనివాడు, శరీరేంద్రియమనస్సులయందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్తకర్మల యందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. (12.16)
- ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ ఆసింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించినవాడును, ఐన భక్తుడు నాకు ప్రియుడు. (12.17)
- శత్రువులయెడను, మిత్రులయెడను సమభావముతో మెలగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును….(12.18)
- నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాసస్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. (12.19)
- ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు (పైనపేర్కొనభడిన ఉత్తమ గుణములను కలిగియుండి), నిష్కామభక్తిశ్రద్దలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు. (12.20)
Chapter 13
- ……
- శ్రీ భగవానుడు పలికెను – ఓ కౌంతేయ! ఈ శరీరమును ‘క్షేత్రము’ అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎఱింగిన వానిని ‘క్షేత్రజ్ఞుడు’ అని తత్త్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. (13.2)
- ఓ అర్జునా! అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారసహిత (త్రిగుణాత్మకమైన) ప్రకృతి మరియు నిర్వికారపురుషులు తత్త్వములనుగూర్చి తెలుసుకోనుటయే ‘జ్ఞానము’ అని నా అభిప్రాయము. (13.3)
- క్షేత్రమనగానేమి? అది యెట్లుండును? దాని వికారములు (భావములు) ఏవి? ఆ వికారములు దేనినుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటిని సంక్షిప్తముగా తెలిపెదను వినుము. (13.4)
- క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములనుగూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధవేదమంత్రములను వేర్వేరుగా తెల్పినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములుగూడ నిశ్చయాత్మకముగ సహేతుకముగా తేటతెల్లము గావించినవి. (13.5)
- పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూలప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియగ్రాహ్యవిషయములు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు). (13.6)
- ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చైతన్యము ధృతి అను వికారములతో గూడిన ‘క్షేత్రస్వరూపము’ సంక్షిప్తముగా పేర్కొనబడినది. (13.7)
- తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. (13.8)
- ఇంద్రియార్థములయందు వైరాగ్యము (ఇహపరలోక భోగములన్నింటియందును ఆసక్తి లేకుండుట), అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, జరా (ముసలితనము) రోగాదులయందు దుఃఖదోషములను పదేపదే దర్శించుట. (13.9)
- భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడును సమభావముతోనుండుట. (13.10)
- పరమేశ్వరుడనైన నాయందు అనన్యయోగముద్వారా అవ్యభిచారిణీభక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్రప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులయెడ ఆసక్తిలేకుండుట. (13.11)
- ఆధ్యాత్మికజ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని యెఱుంగుట – ఇవియన్నియును (అమానిత్వము మొదలుకొని తత్త్వజ్ఞానార్థదర్శనము వఱకుగల ఇవియన్నియును) జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. (13.12)
- అనాదియైన (సనాతనుడైన) పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుటవలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు(సత్ + అసత్ లకు) అతీతుడు. ఆ పరమాత్మనుగూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. (13.13)
- ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై యున్నవి. అతడు సర్వమును ఆవరించియున్నాడు. (13.14)
- అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటిని ఎఱిగినవాడు. కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్తజగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును (గుణాతీతుడయ్యును) ప్రకృతి సంబంధమువలన గుణానుభవములను కలిగియుండువాడు. (13.15)
- చరాచరభూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ (పరమాణు) రూపుడైనందున తెలిసికొనశక్యముకానివాడు, అతిదూరముగాను, అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. (13.16)
- పరమాత్మ ఆకాశమువలె విభజించుటకు వీలులేని ఒకేరూపమున పరిపూర్ణుడైయున్నను, సమస్తచరాచరప్రాణులరూపమలలో వేరువేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. (13.17)
- ఆ పరబ్రహ్మ అన్నిజ్యోతులకును జ్యోతి (పరంజ్యోతి) మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్త్వజ్ఞానముద్వారా ప్రాప్యుడను అతడే. సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. (13.18)
- ఇంతవఱకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును (తెలిసికొనదగిన పరమాత్మ స్వరూపమును) గుఱించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా తెలుసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. (13.19)
- ప్రకృతి, పురుషుడు – అను ఈ రెండును అనాదియైన (సనాతనమైన) వనియు, రాగద్వేషాదివికారములును, త్రిగుణాత్మకములైన పదార్థములన్నియును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎఱుంగుము. (13.20)
- కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. (13.21)
- పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణసాంగత్యమే జీవాత్మయొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. (13.22)
- ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షీభూతుడగుటవలన ‘ఉపద్రష్ట’ యనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన ‘అనుమంత’ అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన ‘భర్త’ అనియు, జీవరూపములో ‘భోక్త’ అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన ‘మహేశ్వరుడు’ అనియు, శుద్ధసచ్చిదానందఘనస్వరూపుడగుట వలన ‘పరమాత్మ’ అనియు పిలవబడుచున్నాడు. (13.23)
- ఈ విధముగా పురుషుని తత్త్వమును, గుణసహితమైన ప్రకృతి తత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికిని పునర్జన్మను పొందడు. (13.24)
- కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమ హృదయముల యందు చూతురు. మఱికొందరు (జ్ఞాన) యోగముద్వారాను, మఱికొందఱు కర్మయోగముద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. (13.25)
- కానీ ఈ సాధనమార్గములనుగూర్చి ఎఱుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యురూపసంసార సాగరమునుండి నిస్సందేహముగా బయటపడుదురు. (13.26)
- ఓ అర్జునా! ఈ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర – క్షేత్రజ్ఞ సంయోగము వలనే ఉత్పన్నమగునని ఎఱుంగుము. (13.27)
- నశ్వరములైన చరాచర భూతముల (ప్రాణుల) యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. (13.28)
- సమస్తప్రాణులయందును సమభావముతోనుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడుకాడు – అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. (13.29)
- సకలకర్మలు అన్నివిధములుగా ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎఱింగినవాడు వాస్తవముగ చూచువాడు. (13.30)
- వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా, ఎఱింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానందఘనపరబ్రహ్మను చేరును. (13.31)
- ఓ అర్జునా! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికిని అనాది (సనాతనుడు) అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలతనిని ఏమాత్రమును అంటవు. (13.32)
- సర్వత్ర (ఇతరమహాభూతములయందు) వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మ మగుటవలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థిరమైయున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికంటవు. (13.33)
- అర్జునా! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమొనర్చున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణుల యందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప (చైతన్యవంతములుగా) జేయుచున్నది. (13.34)
- ఈ విధముగా క్షేత్ర – క్షేత్రజ్ఞులమధ్యగలఅంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎఱింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. (13.35)
Chapter 14
- శ్రీ భగవానుడు పలికెను – జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెల్పబోవుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధములనుండి విముక్తులై పరమ సిద్ధిని పొందిరి. (14.1)
- ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నాస్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులుసృష్ట్యాదియందు మఱల జన్మింపరు, ప్రళయకాలమున వ్యథనొందరు. (14.2)
- ఓ అర్జునా! నామహద్బ్రహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతనసముదాయరూపమైన బీజమును ఉంచెదను(స్థాపన చేసెదను). ఆ జడచేతనసంయోగమువలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. (14.3)
- ఓ అర్జునా! నానాయోనులయందు జన్మించు ప్రాణులను తనగర్భమున ధరించు మూలప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపనచేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి. నేనే జనకుడను. (14.4)
- ఓ అర్జునా! ప్రకృతినుండి ఉత్పన్నములైన సత్త్వరజస్తమోగుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. (14.5)
- ఓ పాపరహితుడా! ఈమూడింటిలో సత్త్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశకమైనది. వికారరహితమైనది. కాని అది సుఖసాంగత్యమువలనజ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. (14.6)
- ఓ అర్జునా! రజోగుణము రాగాత్మకము. అదికామము, ఆసక్తులనుండిఉత్పన్నమగునని యెఱుంగుము. అది జీవాత్మను కర్మలయెుక్కయు, కర్మఫలములయెుక్కయు సాంగత్యముతో బంధించును. (14.7)
- అర్జునా! తమోగుణం సకలదేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానమువలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్యనిద్రాదులతో బంధించును. (14.8)
- ఓ అర్జునా! సత్త్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణం జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. (14.9)
- ఓ అర్జునా! రజస్తమోగుణములనణచి సత్త్వగుణము వృద్ధిచెందును. సత్త్వతమోగుణములనణచి రజోగుణము వృద్ధిచెందును. అట్లే సత్త్వరజోగుణములనణచి తమోగుణము వృద్ధియగును. (14.10)
- శరీరేంద్రియములయందును, అంతఃకరణము నందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధిచెందినదని తలంపవలెను. (14.11)
- ఓ అర్జునా! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. (14.12)
- ఓ అర్జునా! తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును, ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థచేష్టలు, నిద్రాదివృత్తులు మెుదలగునవి ఉత్పన్నములగుచుండును. (14.13)
- సత్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో, అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. (14.14)
- రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచుండును. (14.15)
- శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు ఫలము అజ్ఞానము. (14.16)
- సత్త్వగుణమువలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమోగుణము వలన ప్రమాద మోహాదులూ, అజ్ఞానమూ, తప్పక ఉత్పన్నము లగుచుండును. (14.17)
- సత్త్వగుణస్థితులు స్వర్గాది – ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన (రాజస)పురుషులు మధ్య (మానవ) లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రాప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనులను, నరకములను పొందుదురు. (14.18)
- ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపుడనైన నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. (14.19)
- దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా(వార్ధక్య), దుఃఖములనుండి విముక్తుడై, పరమానందమును పొందును. (14.20)
- అర్జునుడు పలికెను – ఓ ప్రభూ! ఈ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? (14.21)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పాండవా! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు – అనగా వాటిని గూర్చివిచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు అనగా ఎల్లప్పుడును ఒకే స్థితిలోనుండును. (14.22)
- త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, ఉదాసీనుని వలె(సాక్షివలె) ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించు చున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు. (14.23)
- త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకుగాని, నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. (14.24)
- మానావమానములయందును, మిత్రులయందును, శత్రువులయందును సమభావముతో ప్రవర్తించు వాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతు డనబడును. (14.25)
- అనన్య (నిర్మలమైన) భక్తియోగముద్వారా నన్నే నిరంతరము భజించువాడును,ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానందఘనపరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. (14.26)
- ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతత్వ మునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆధారము. (14.27)
Chapter 15
- శ్రీ భగవానుడు పలికెను – ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా(కాండముగా), వేదములే పర్ణములు(ఆకులు)గా గల ఈ సంసారరూప-అశ్వత్థవృక్షము నాశరహితమైనది(శాశ్వతమైనది). ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగిన వాడు. (15.1)
- ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడిజలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించుప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మాను సారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (15.2)
- ఈ సంసారవృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణంపబడిన రీతిగా లభ్యముగాదు. ఏలనన ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమకారవాసనారూపములైన ధృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప అశ్వత్థవృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి. (15.3)
- అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరునినుండియే ఈ పురాతన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైననారాయణునే శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధిధ్యాసాదులు చేయవలెను. (15.4)
- దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలనుండి పూర్తిగా మఱలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైనవారును, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. (15.5)
- స్వయంప్రకాశస్వరూపమైన నాపరంధామమును సూర్యుడుగాని, చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింప జేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మఱల ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు. (15.6)
- ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను, శబ్దాదివిషయములద్వారా తనవైపు ఆకర్షించును. (15.7)
- వాయువు వాసనలను ఒకచోటినుండి మఱియొక చోటికి తీసికొని పోయినట్లుగా దేహాదులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సు ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మఱొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును. (15.8)
- ఈ జీవాత్మ త్వక్ఛక్షుశ్ర్శోత్రజిహ్వాఘ్రాణములు అనెడి పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాదివిషయములను అనుభవించును. (15.9)
- జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమజ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొన గల్గుదురు. (15.10) (See BG 9.11, BG 4.9)
- అంతఃకరణశుద్ధిగల యోగులు తమహృదయముల యందున్న ఈ ఆత్మతత్త్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కాని, అంతఃకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొన జాలరు. (15.11)
- సమస్తజగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్సేయని యెఱుంగుము. (15.12)
- పృథ్వియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై – అనగా అమృతమయముడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. (15.13)
- నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి నాలుగువిధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. (15.14)
- సమస్తప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నానుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము (సందేహమును తొలగించుట) కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే. (15.15)
- ఈ జగత్తునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని పురుషులు రెండు విధములుగా గలరు. సకలప్రాణులశరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. (15.16)
- పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందఱిని భరించి పోషించుచున్నాడు. (15.17)
- ఏలనన, నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈజగత్తునందును, వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కితిని. (15.18)
- ఓ అర్జునా! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎఱుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. (15.19)
- ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు. (15.20)
Chapter 16
- శ్రీ భగవానుడు పలికెను – నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞానప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్వికదానము, ఇంద్రియనిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రములపఠన, పాఠనములు మఱియు భగవంతుని నామగుణకీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము (ఆర్జవము). (16.1)
- అహింస (మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్గింపకుండుట), సత్యము (యథార్థమైన, ప్రియమైన భాషణము), అక్రోధము (తనకు అపకారము చేయువారిపైనకూడ కోపము లేకుండుట), త్యాగము (కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట), శాంతి (చిత్తచాంచల్యము లేకుండుట), అపైశునము (ఎవరినీ నిందింపకుండుట), దయ (అన్ని ప్రాణులయెడ నిర్హేతుక కృప), అలోలుప్త్యము (ఇంద్రియవిషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట), మార్దవము (కోమలత్వము), శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట (సిగ్గుపడుట), అచాపలము (వ్యర్ధచేష్టలు చేయకుండుట). (16.2)
- ఓ అర్జునా! తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము (బాహ్యశుద్ధి), అద్రోహము (ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట), అమానిత్వము (తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట) మొదలగునవి యన్నియును దైవీసంపదగలవాని లక్షణములు. (16.3)
- ఓ పార్థా! దంభము (కపటము), దర్పము (మొండితనము), అభిమానము, క్రోధము, పారుష్యము, (మాటలయందును, చేష్టలయందును కఠినత్వము), అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావముగలవాని లక్షణములు. (16.4)
- ఓ అర్జునా! దైవీసంపద ముక్తిదాయకము. ఆసురీసంపద బంధహేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపకుము. (16.5)
- ఓ అర్జునా! ఈ లోకముననున్న మానవులు రెండువిధములుగా ఉందురు. దైవలక్షణములు గలవారు కొందఱు. ఆసురలక్షణములు గలవారు మఱికొందఱు. దైవ లక్షణములు విస్తృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసురలక్షణములుగలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. (16.6)
- ఆసురస్వభావముగలవారు ప్రవృత్తినివృత్తులను (కర్తవ్యాకర్తవ్యములను) ఎఱుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వముగాని, శ్రేష్ఠమైన ప్రవర్తనగాని, సత్యభాషణముగాని ఉండనే ఉండవు. (16.7)
- ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీపురుషులసంయోగ కారణముగ జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసురలక్షణములు గలవారు భావింతురు. (16.8)
- అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదముచేయుభౌతికవాదులు ఆత్మనుగూర్చి తలంపరు. (ఆత్మయొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధులు. వారు అందఱికిని అపకారముచేయుక్రూరులు. వారి శక్తిసామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (16.9)
- దంభము, దురభిమానము, మదములతోగూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమవాంఛలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యాసిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. (16.10)
- మరణించువఱకును వారు అంతులేనిచింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. (16.11)
- వారు ఆశాపాశపరంపరలచే ఎల్లప్పుడును బంధింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై, అన్యాయ మార్గములద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. (16.12)
- “నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్టవస్తువును పొందితిని. ఇంకను నా మనోరథము లన్నింటిని సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతోధనమును సంపాదింపగలను” అని వారు తలంచుచుందురు. (16.13)
- నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులనుగూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడను, సుఖిని. (16.14)
- “నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడులేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్ఛముగా వినోదింపగలను.” – అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై…(16.15)
- చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని, ఆసురలక్షణములు గలవారు విషయభోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు. (16.16)
- వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబరప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు. (16.17)
- అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమ శరీరములయందును, ఇతరుల శరీరముల యందును, అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. (16.18)
- అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును. (16.19)
- ఓ అర్జునా! ఈ ఆసురీప్రకృతిగల మూఢులు, నన్ను పొందకయే, ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైనగతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకములయందు పడెదరు. (16.20)
- కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతిపాలుచేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. (16.21)
- ఓ అర్జునా! ఈ మూడునరకద్వారములనుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (16.22)
- శాస్త్రవిధిని త్యజించి, యథేచ్ఛగా (విశృంఖలముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోకసుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తింపదు. (16.23)
- కావున కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము. (16.24)
Chapter 17
- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! శాస్త్రవిధిని త్యజించి, భక్తిశ్రద్ధలతో యజ్ఞములను గాని, దైవపూజలనుగాని కొందఱు చేయుచుందురు. వారినిష్ఠ (వారి విధానము) సాత్త్వికమా? రాజసమా? తామసమా? (17.1)
- శ్రీ భగవానుడు పలికెను – శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను. వినుము. (17.2)
- ఓ అర్జునా! మనుష్యులందఱి శ్రద్ధయు వారి అంతః కరణరీతులకు తగినట్లు ఉండును. ప్రతివ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానినిబట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలిసికొనవచ్చును. (17.3)
- వారిలో సాత్త్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు. (17.4)
- దంభము, అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్ధముగా మనఃకల్పితమైన ఘోరతపస్సులను ఆచరించుచు (ఉందురు). (17.5)
- శరీరములయందున్న జీవులను, మరియుఅంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృశింప జేయువారు అజ్ఞానులైన ఆసురస్వభావము గలవారని యెఱుంగుము. (17.6)
- మనుష్యుల స్వభావములను అనుసరించి, వారికి ఇష్టములైన ఆహారములు గూడ మూడు విధములుగా ఉండును. అట్లే ఆయామనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములుగూడా మూడేసి విధములుగానే ఉండును. వాటినిగూర్చి వేర్వేఱుగా విశదపరచెదను వినుము. (17.7)
- ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగువానిని అభివృద్ధి పఱచునవియు, పాలు, చక్కెర మొదలగు రసపదార్థములును, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధపదార్థములును, ఓజస్సును అభివృద్ధి పఱచు స్థిరపదార్థములును, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములును సాత్త్వికులకు ఇష్టమైనవి. (17.8)
- చేదు, పులుపు, ఉప్పు, కారము, రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కల్గించునవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజసస్వభావము గలవారికి ఇష్టములగును. (17.9)
- అర్ధపక్వములైన పదార్థములు (సరిగా ఉడకనివి, పండనివి) రసహీనములు, దుర్గంధయుక్తములు (చెడువాసన గలవి) పాసిపోయినపదార్థములు, ఎంగిలివస్తువులు, అపవిత్రపదార్థములు మొదలగునవి తామసస్వభావము గలవారికి ఇష్టమైనవి. (17.10)
- శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొన బడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండ చేయబడునదియు ఐన యజ్ఞము ‘సాత్త్వికయజ్ఞము’ అనబడును. (17.11)
- కాని, ఓ అర్జునా! సరియైన నిష్టలేకుండ ఆడంబరము కొఱకు ఆచరింపబడునదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అగు యజ్ఞము ‘రాజసయజ్ఞము’ అని ఎఱుంగుము. (17.12)
- శాస్త్రవిధిననుసరింపనిదియు, అన్నదాన రహిత మైనదియు, మంత్ర హీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము ‘తామసయజ్ఞము’ అనబడును. (17.13)
- దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత(శౌచము) నిరాడంబరత్వము, అహింస అనునవి శారీరక తపస్సులు. (17.14)
- ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చునదియు, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్రపఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి యన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. (17.15)
- మనఃప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి మొదలగునవి యన్నియును మానసికతపస్సులు. (17.16)
- పూర్వోక్తములైన (శారీరిక, వాచిక, మానసిక) తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని ‘సాత్త్విక తపస్సులు’ అని యందురు. (17.17)
- ఇతరులనుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొఱకును, స్వాభావికముగాగాని, కల్పితముగా గాని చేయబడునవియు, అనిశ్చితఫలములను గాని, క్షణికఫలములనుగాని ఇచ్చునవియు ఐన తపస్సులను ‘రాజసతపస్సులు’ అని యందురు. (17.18)
- మొండిపట్టుదలతో మనోవాక్కాయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను ‘తామసతపస్సులు’ అనియందురు. (17.19)
- ‘దానము చేయుటయే కర్తవ్యము’ అనుభావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాదికాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యముగలవారు, రోగులు మొదలగువారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైనవారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము ‘సాత్త్వికదానము’అనబడును. (17.20)
- కాని ప్రత్యుపకారమును ఆశించిగాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును ‘రాజసదానము’ అనియందురు. (17.21)
- సద్భావము లేకుండా, దానము పుచ్చుకొనువారి యెడల గౌరవాదరములను చూపక, తృణీకార భావములతో ఛీకొట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును చేయబడు దానమూ, దేశకాలో చితము కాని దానమూ, ‘తామసదానము’ అని యనబడును. (17.22)
- ఓమ్, తత్, సత్ అని మూడు విధములగు పేర్లు సచ్చిదానందఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మనుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. (17.23)
- కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ‘ఓమ్’ అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. (17.24)
- మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదానతపశ్చర్యలను ‘ఇదియంతయును పరమాత్మదే’ అను భావముతో ‘తత్’ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. (17.25)
- ఓ పార్థా! ‘సత్’ అను పరమాత్మనామము సత్యభావమునందును, శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమకర్మాచరణము నందును ‘సత్’ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. (17.26)
- యజ్ఞదానతపఃక్రియలయందలి నిష్ఠ, ఆస్తిక, భావమును ‘సత్’ అనియందురు. పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మలనుగూడ ‘సత్’ అని యందురు. (17.27)
- ఓ అర్జునా! శ్రద్ధ (విశ్వాసము) లేకుండ చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మ లన్నియును, ‘అసత్’ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పిదపగాని ఎట్టి ప్రయోజనమూ కలుగదు. (17.28)
Chapter 18
- అర్జునుడు పలికెను – ఓ మహాబాహూ!అంతర్యామీ! వాసుదేవా! సన్న్యాసతత్త్వమును, త్యాగతత్త్వమును వేర్వేరుగా తెలిసికొనగోరెదను. (18.1)
- శ్రీ భగవానుడు పలికెను – కామ్యకర్మల త్యాగమునే సన్న్యాసమని కొందరు పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. (18.2)
- కొందరు విద్వాంసులు కర్మలన్నియును దోషయుక్తములేగావున వాటిని త్యజింపవలెనని యందురు. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. (18.3)
- ఓ పురుషశ్రేష్ఠా! అర్జునా! సన్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమునుగూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడువిధములుగా చెప్పబడినది. (18.4)
- యజ్ఞదానతపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదానతపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. (18.5)
- కావున ఓ పార్థా! ” ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్యకర్మలను అన్నింటిని ఫలాసక్తులను త్యజించి, అవశ్యమాచరింపవలెను” అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. (18.6)
- (నిషిద్ధ కర్మల, కామ్యకర్మలఆచరణను త్యాగముచేయుట సముచితమే.) కాని శాస్త్ర విహిత కార్మాచరణమును త్యజించుట ఉచితముగాదు. కావున మోహవశమున దానిని త్యజించుట ‘తామస త్యాగము’ అనబడును. (18.7)
- కర్మలన్నియును దుఃఖకారకములే యని భావించి, శారీరికక్లేశమునకు భయపడి, కర్తవ్యకర్మలను త్యజించుటను రాజసత్యాగము అని యందురు. అట్టి త్యాగమువలన ఎట్టి ఫలమూ లభింపదు. (18.8)
- ఓ అర్జునా! శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటియందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్త్వికత్యాగము అని భావింపబడును. (18.9)
- అకుశలకర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్యకర్మలను ద్వేషింపనివాడు, కుశలకర్మలయందు (నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలయందు) ఆసక్తి కలిగియుండనివాడు, శుద్ధసత్త్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు ఐనవాడు నిజమైన త్యాగి. (18.10)
- ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. (18.11)
- కర్మ ఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రము అని మూడు విధములగు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కాని కర్మఫలత్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను, ఏ విధముగను అనుభవింపవలసిన పనియుండదు. (18.12)
- ఓ మహాబాహూ! సర్వ కర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతముచేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నానుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. (18.13)
- కర్మల సిద్ధియందు అధిష్ఠానము, కర్త, వివిధములైన కరణములు( సాధనములు) నానావిధ చేష్టలు, దైవము అను ఐదును హేతువులు. (18.14)
- మానవుడు శరీరము, వాక్కు, మనస్సులతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన యేకర్మలైనను ఈ యైదు హేతువులతో ఒప్పుచుండును. (18.15)
- అట్లైనప్పటికిని (సర్వ కర్మలకును ఐదు హేతువులే మూలమైనప్పటికిని) విపరీతబుద్ధికారణమున ఏ మనుష్యుడు కేవలుడు (నిరంజనుడు), శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్తకర్మలకు కర్తగా భావించునో, అట్టి మలినబుద్ధిగల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. (18.16)
- అంతఃకరణమునందు కర్తృత్వభావము లేనివానిబుద్ధి ప్రాపంచికపదార్థములయందును, కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములును అంటవు. (18.17)
- జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మసంగ్రహములు మూడు విధములు. (18.18)
- గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినది. వానిని గూర్చి విశదపరచెదను, వినుము. (18.19)
- వేర్వేరుగా కన్పించు సమస్తప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభవాముతో స్థితుడైయునట్లు జ్ఞానియైన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్త్విక జ్ఞానముగా తెలుసికొనుము. (18.20)
- సమస్తప్రాణులయందును నానావిధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించువారి జ్ఞానమును రాజసము అని యెరుంగుము. (18.21)
- ప్రకృతి కార్యమైనా శరీరమునే (శరీరమునకు సంబంధించిన భౌతికవస్తువులనే) సమస్తముగా భావించి, దానియందే ఆసక్తిని కల్గించునట్టిదియు, తాత్త్వికముగా అర్థరహితమైనదియు, హేతబద్ధము కానిదియు, తుచ్ఛమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అనియందురు. (18.22)
- కర్తృత్వాభిమానము గాని, ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్వికకర్మయని యందురు. (18.23)
- భోగలాలసుడైన పురుషునిచేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజసకర్మ అనియందురు. (18.24)
- పరిణామము (మంచిచెడ్డలు) హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము మూర్ఖత్వముచే (అజ్ఞానముచే )ఆరంభింపబడు కర్మలను తామసకర్మలు అనియందురు. (18.25)
- ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును సిద్ధి – అసిద్ధులయెడ హర్షశోకాదివికారములకు లోనుకానివాడును అగు పురుషుడు సాత్వికకర్త యనబడును. (18.26)
- ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. (18.27)
- జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు (మొండివాడు), ధూర్తుడు, అకారణముగ ఇతరులవృత్తులకు విఘాతము కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతోకాలము గడుపుచుండువాడు (దీర్ఘ సూత్రి) – ఇట్టి లక్షణములు గలవానిని తామసకర్త అని యందురు. (18.28)
- ఓ ధనంజయా! ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను గూడ గుణ భేదములననుసరించి మూడు విధములుగా, విభాగ పూర్వకముగా సంపూర్ణముగా నానుండి వినుము. (18.29)
- ప్రవృత్తిమార్గమును, నివృత్తిమార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలిసికొనుబుద్ధిని సాత్వికమైన బుద్ధియందురు. (18.30)
- ఓ పార్థా! ధర్మాధర్మములయొక్కయు, కార్యాకార్యములయొక్కయు (కర్తవ్యా కర్తవ్యముల యొక్కయు), యదార్థ తత్త్వములను తెలియజాలని బుద్ధిని “రాజస బుద్ధి ” అనియందురు. (18.31)
- ఓ అర్జునా! తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మ ముగును, అట్లే ఇతర పదార్థములను( విషయములను) తద్విపరీతముగను భావించు బుద్ధిని ‘తామస బుద్ధి’ అనియందురు. (18.32)
- ఓ పార్థా! ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగముద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణచేయు శక్తిని ‘సాత్త్వికధృతి’ యందురు. (18.33)
- కాని, ఓ పార్థా! అర్జునా! కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామ విషయములను ధారణచేయు శక్తిని ‘రాజసధృతి’ అనియందురు. (18.34)
- పార్థా! నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక, దుర్మతియైన మనుష్యుడు వాటినే సతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని, ‘తామసధృతి’ అనియందురు. (18.35)
- ఓ భరతశ్రేష్ఠా! మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజనధ్యానసేవాదుల నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో …..(18.36)
- …ప్రారంభమునందు విషతుల్యముగా (దుఃఖకరముగా) గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును ‘సాత్త్వికసుఖము’ అనియందురు. (18.37)
- విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మెుదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగ అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును ‘రాజససుఖము’ అందురు. (18.38)
- నిద్ర, సోమరితనము, ప్రమాదము( వెూహము)ల వలన ఉత్పన్నమగు సుఖమును తామససుఖము అనియందురు. ఇట్టి సుఖము భోగసమయమునందును, పరిణామమునందును ఆత్మను వెూహింపజేయుచుండును. (18.39)
- పృథివియందు గాని, ఆకాశమునందుగాని, దేవతలయందుగాని, మఱేయితర లోకములయందుగాని, ప్రకృతినుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండ ఏ ప్రాణియు ఉండదు. (18.40)
- ఓ పరంతపా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలనూ, అట్లే శూద్రుల కర్మలునూ వారివారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడియున్నవి. (18.41)
- అంత:కరణనిగ్రహము( శమము ), ఇంద్రియములను వశమునందుంచుకొనుట (దమము), ధర్మ ములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరులఅపరాధములను క్షమించుట, ఋజుమార్గ జీవనము, ( మనశ్శరీరేంద్రియముల సరళత్వము) వేద శాస్త్రముల యందును ఈశ్వరునియందును పరలోకాదులయందును, విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రములఅధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వాసుభవము – ఇవి యన్నియును బ్రాహ్మణులస్వాభావిక కర్మలు. (18.42)
- శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మ పరాయణులనుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి యన్నియును క్షత్రియులస్వాభావికకర్మలు. (18.43)
- వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయరూప సత్యవ్యవహారము ఇవి యన్నియును వైశ్యులస్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణములవారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. (18.44)
- తమతమ స్వాభావికకర్మల యందు తత్పరులైనవారు భగవత్ప్రాప్తిరూప పరమసిద్ధిని నిస్సందేహమగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. (18.45)
- సమస్త ప్రాణులప్రాదుర్భావము పరమేశ్వరునినుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావికకర్మాలద్వారా పూజించి, మానవుడు పరమసిద్ధిని పొందును. (18.46)
- బాగుగా ఆచరింపబడిన పరధర్మముకంటెను గణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి ( స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ) కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములును ఏ మాత్రము అంటనే అంటవు. (18.47)
- ఓ కౌంతేయా! (అర్జునా! ) దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన! అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నియను ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. (18.48)
- ఓ అర్జునా! ప్రాపంచికవిషయములన్నింటియందు ఆసక్తి లేని వాడును, స్ప్రుహారహితుడును, అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్య యోగము ద్వారా పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును. (18.49)
- ఓ కౌంతేయా! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహాముగా తెల్పెదను వినుము. (18.50)
- విశుద్ధమైన బుద్ధిగలవాడై, శబ్దాదివిషయములను త్యజించి, సాత్త్వికధారణాశక్తిద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి (యువ్నవాడు)…(18.51)
- తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, (శబ్దాదివిషయములను త్యజించి) పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, (రాగద్వేషములను సర్వథా త్యజించి )దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు …..(18.52)
- అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదలిపెట్టి, నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతా రహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు అభిన్నభావముతో స్థితుడగుటకు పాత్రుడగును. (18.53)
- సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమస్కుడైన యోగి దేనికిని శోకింపడు. దేనినీ కాంక్షింపడు. సమస్తప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. (18.54)
- బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటివాడనో? యథాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. (18.55)
- సమస్తకర్మలయందును కర్తృత్వ భావమును వీడి, ఆయాకర్మల ఫలరూపమైన సమస్తభోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదాచేయుచును నాయనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. (18.56)
- సర్వకర్మలను నిండుమనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధి రుపయోగమును అవలంబించి, మత్పరాయణుడవై సతతము చిత్తమును నాయందే నిల్పుము. (18.57)
- పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో, నా యనుగ్రహమువలన సమస్తసంకటముల నుండియు అనాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో నష్టముల పాలగుదువు. అనగా పరమార్థ పథమునుండి భ్రష్టుడవగుదువు. (18.58)
- అహంకారవశమున “నేను ఈ యుద్ధమును చేయను” అని నీవు నిశ్చయించు కొనుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధముచేయుటకు నిన్ను పురికొల్పును. (18.59)
- ఓ కౌంతేయా! మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పురాకృత స్వాభావిక కర్మలచే (సంస్కారములచే) బంధింపబడి, త తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. (18.60)
- అర్జునా! శరీరరూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి, వారిని భ్రమింపజేయుచున్నాడు. (18.61)
- ఓ భారతా! (అర్జునా!) అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. (18.62)
- ఈ విధముగా అత్యంతరహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. (18.63)
- సమస్తగోప్యవిషయములయందును పరమగోప్యమైన నావచనములను మఱొక్కసారి వినుము. నీవు నాకు అత్యంతప్రియుడవు అగుటవలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మఱల చెప్పుచున్నాను. (18.64)
- ఓ అర్జునా! నీవు నాయందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్టు చేయుటవలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞా పూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. (18.65)
- సర్వ ధర్మములను అనగా సమస్తకర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వ శక్తిమంతుడను, సర్వధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము. (18.66)
- తపస్సంపన్నుడు కానివానికిని, భక్తిరహితునకును, వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూపపరహస్యోపదేశమును ఎన్నడును తెల్పరాదు. అట్టే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలపరాదు. (18.67)
- నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపఱచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. (18.68)
- నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మల నాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించిగాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియెుకడెవ్వడును భవిష్యత్తులోను ఉండబోడు. (18.69)
- ధర్మయుక్తమైన మనసంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞముద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. (18.70)
- శ్రద్ధాదరములుగలవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుటవలనగూడ పాపవిముక్తుడై, పుణ్యకర్మలను ఆచరించువారుపొందు ఉత్తమలోకములను పొందును. (18.71)
- ఓపార్థా! ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ఓ ధనంజయా! అజ్ఞానజనితమైన నీ వెూహము పూర్తిగా నశించినదా? (18.72)
- అర్జునుడు పలికెను – ఓ అచ్యుతా! నీ కృపచే నా వెూహము పూర్తిగా తొలిగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయ రహితుడైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. (18.73)
- సంజయుడు పలికెను – ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటివి. అది అద్భుతమైనది. తనువును పులకింపజేయునది. (18.74)
- వేదవ్యాసునికృపవలన దివ్యదృష్టిని పొందినవాడనై, పరమగోప్యమైన ఈ యోగమును ( గీతను) యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడు( స్వయముగ)అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. (18.75)
- ఓ రాజా! (ధృతరాష్ట్రా!) శ్రీ కృష్ణభగవానునకును అర్జునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదేపదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. (18.76)
- ఓ రాజా! అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వమైన ఐన ఆ శ్రీహరిరూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మఱలమఱల హర్షోల్లాసములతో పులకితగాత్రుడనగుచున్నాను. (18.77)
- ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడును, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండుచోట సంపదలును, సర్వ విజయములును, సకలైశ్వర్యములును, సుస్థిరమైన నీతియు. (18.78)