Part One
Chapter I
1.1.1 పూర్వం ఒకప్పుడు వాజశ్రవసుడనే వ్యక్తి ఫలాల పట్ల కోర్కె గలవాడై తన వద్ద ఉన్న సమస్త వస్తువులను దానంగా ఇచ్చివేశాడు. ఆతడికి నచికేతుడనే కుమారుడు ఉన్నాడు.
1.1.2-3 దక్షిణలు తీసుకురావడం బాలుడైన నచికేతుడు చూశాడు. అప్పుడు శ్రద్ధ అతణ్ణి ఆవేశించింది. అతడు ఆలోచించసాగాడు. నీళ్లు త్రాగడానికీ, గడ్డిమేయడానికీ, పాలు ఇవ్వడానికీ(వట్టిపోయిన), ఇక ఈనడానికీ శక్తి కోల్పోయిన ఆవులను దానం చేసే వ్యక్తి ఆనంద రహితమైన లోకాలను పొందుతాడు.
1.1.4 నచికేతుడు తండ్రి వద్దకు వెళ్లి, “తండ్రీ! నన్ను ఎవరికి ఇవ్వ బోతున్నారు?” అని అడిగాడు. రెండవసారి, మూడవసారి కూడా అడిగాడు. అందుకు తండ్రి, “నిన్ను యముడికి ఇవ్వబోతున్నాను” అని జవాబిచ్చాడు.
1.1.5 “అనేక విషయాలలో నేను మొదటి స్థానంలో ఉన్నాను. పలు విషయాలలో మధ్యమునిగా ఉన్నాను. నన్ను యముని వద్దకు పంపడం మూలంగా తండ్రి ఏం సాధించబోతున్నాడు?” అని నచికేతుడు యోచించసాగాడు.
1.1.6 “పూర్వీకులు ఎలా జీవించారో ఎంచి చూడండి. ఇప్పుడున్న వారు ఎలా జీవిస్తున్నారో యోచించి చూడండి. చెట్టు చేమలమల్లే మనిషి జనన మరణాలు పొందుతున్నాడు” అని తండ్రితో చెప్పాడు నచికేతుడు.
1.1.7 “బ్రాహ్మణు డొకడు అతిథిగా వచ్చినప్పుడు అగ్నిలాగానే ప్రవేశిస్తాడు. సజ్జనులు, నీళ్లు మొదలైనవి ఇచ్చి, ఉపచరించి అతణ్ణి శాంతింపచేస్తారు. యమధర్మరాజా! నువ్వు ఆ బాలునికి నీరు మొదలైనవి ఇవ్వు” అని మంత్రులు యమధర్మరాజుతో చెప్పారు.
1.1.8 ఎవరి ఇంట్లో ఒక పవిత్రుడు (బ్రాహ్మణుడు) నిరాహారిగా ఉండడం తటస్థిస్తుందో, అల్పబుద్ధిగల అతడి ఆశలూ, ఆకాంక్షలూ నశిస్తాయి. తాను చేసిన పుణ్యఫలమూ, మధుర భాషణ వలన కలిగిన ఫలమూ, యాగాలు, ఆరాధన వంటి వాటి ఫలమూ, సత్కర్మల ఫలమూ అన్నింటినీ అతడు కోల్పోతాడు. ఆతడి పుత్రులూ, పశుసంపదా అంతా కూడా నశించిపోతుంది.
1.1.9 ఆరాధనీయుడా! అతిథీ, నమస్కరింపదగ్గ నువ్వు నిరాహారిగా నా ఇంట్లో మూడు రాత్రుళ్లు గడిపావు. పవిత్రుడైన ఓ బాలుడా! ఆ దోషం నాకు వాటిల్లకుండా నాకు శుభం కలుగుగాక. నీకు నమస్కారం. నువ్వు మూడు రాత్రుళ్లు గడిపినందున నా నుంచీ మూడు వరాలు స్వీకరించు.
1.1.10 యమధర్మరాజా! నీ వద్ద నుంచి తిరిగి వెళుతున్న నన్ను, నా తండ్రియైన గౌతముడు అపార్థం చేసుకోకూడదు. నన్ను ఆదరించి, మనోవ్యాకులత లేనివాడై, సంతోషం నిండిన మనస్కుడై, కోపరహితుడై నాతో మాట్లాడాలి. మూడు వరాలలో దీనిన్ మొదటి వరంగా కోరుకుంటున్నాను.
1.1.11 ‘అరుణుని కుమారుడూ, నీ తండ్రీ అయిన ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపు మాదిరే నీ పట్ల ప్రవర్తిస్తాడు. నా అనుగ్రహం వలన రాత్రులందు దిగులులేక నిద్రిస్తాడు. నా నుంచి తిరిగి వెళుతున్న నిన్ను చూసి కోపగించుకోడు’ అని చెప్పి మొదటి వరాన్ని యమధర్మరాజు నచికేతునికి ప్రసాదించాడు.
1.1.12-13 స్వర్గంలో కించిత్తుకూడా భయం ఉండదు. మృత్యుదేవతవైన నువ్వుకూడా అక్కడ లేవు. అక్కడ ఎవరూ వృద్ధాప్యం వల్ల భయపడరు. వారికి ఆకలిదప్పులు రెండూ ఉండవు. వారు శోకరహితులై ఆనందంలో మునిగి ఉంటారు. యమధర్మరాజా! స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంత రించుకుంటారు. అక్కడకు తీసుకుపోగల యాగం గురించి నీకు తెలుసు. శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియజేయి. దీనిని నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను.
1.1.14 ఓ నచికేతా! స్వర్గానికి తీసుకువెళ్లే యాగం గురించి అడిగావు. అది నాకు తెలుసు. దానిని నీకు చెబుతాను, సావధానంగా విను. స్వర్గాన్ని అందించేదీ, ప్రపంచానికి ఆధారమైనదీ అయిన ఆ అగ్ని హృదయగుహలో ఉన్నది.
1.1.15 ఆదిలో ఉద్భవించిన ఆ యాగం గురించి యమధర్మరాజు నచికేతునికి చెప్పాడు. ఆ యాగానికి ఎటువంటి ఇటుకలు కావాలో, ఎన్ని కావాలో, ఏ విధంగా యాగ కుండాన్ని అమర్చాలో అంతా విపులంగా ఉపదేశించాడు. యమధర్మరాజు చెప్పిన విషయాలు నచికేతుడు అట్లే తిరిగి ఒప్పజెప్పాడు. నచికేతుడు వాటిని అర్థం చేసుకోవడం చూసి సంతోషించిన యమధర్మరాజు మళ్లీ ఇలా చెప్పాడు.
1.1.16 నచికేతుని జవాబుతో ప్రీతిచెందినవాడూ మహాత్ముడూ అయిన యమధర్మరాజు ఆతడితో, ‘నీకు ఇంకో వరం ఇస్తాను: ఈ యాగం ఇకపై నీ పేరిట ప్రసిద్ధమవుతుంది. ఇంకా, ఎన్నో రంగులు గల మాలనుకూడా తీసుకో’ అని చెప్పాడు.
1.1.17 నచికేత యాగాన్ని మూడుసార్లు చేసినవాడు, ముగ్గురిని ఆశ్రయించి మూడు విధులను నిర్వర్తించినప్పుడు జనన మరణాలను అతిక్రమిస్తాడు. బ్రహ్మం నుంచి ఉద్భవించినవాడూ, ఆరాధనీయుడూ అయిన భగవంతుని తెలుసుకుని అనుభూతి చెందిన అతడు పరమశాంతిని పొందుతాడు.
1.1.18 జంగత మంత్రంలో చెప్పిన మూడింటినీ తెలుసుకుని ఎవరు నచికేత యాగాన్ని నిర్వర్తిస్తాడో, అతడు శరీరం పతనం కాక మునుపే మృత్యువును జయించి, శోకాలకు అతీతుడై స్వర్గలోకంలో ఆనందిస్తాడు.
1.1.19 నచికేతా! స్వర్గానికి తీసుకు వెళ్లే ఏ యాగాన్ని గురించి అడిగావో దానిని నీకు తెలిపాను. ఈ యాగాన్ని జనులు ఇకపై నీ పేరిటనే పేర్కొంటారు.ఇక మూడవ వరాన్ని కోరుకో.
1.1.20 మరణానంతరం మనిషి జీవిస్తున్నాడు అని కొందరు, లేదు అని కొందరు అంటున్నారు. ఈ సందేహాన్ని నిన్ను అడిగి నివృత్తి చేసుకోగోరుతున్నాను. నేను కోరుకోబోతున్న మూడవ వరం ఇదే.
1.1.21 నచికేతా! ఈ విషయంలో దేవతలకు సైతం సందేహం ఉంది. ఈ విషయం ఎంతో సూక్ష్మమైనది; సులభంగా తెలుసుకోగలిగింది కాదు. కనుక వేరే వరం కోరుకో. నన్ను బలవంతం చేయవద్దు, వదలిపెట్టు.
1.1.22 ఈ విషయంలో దేవతలకు కూడా సందేహం ఉన్నదా? యమధర్మ రాజా! దీనిని సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని నువ్వు చెబుతున్నావు. కాని దీనిని ఉపదేశించడానికి నీవంటి వేరొకరు లభించరు. వేరే ఏ వరమూ దీనికి సమానం కాదు.
1.1.23 నూరేళ్లు ఆయుస్సు గల కొడుకులనూ మనుమలనూ కోరుకో. పుష్కలంగా పశువులనూ ఏనుగులనూ బంగారాన్నీ గుర్రాల వంటి వాటిని కోరుకో. భూమ్మీద విశాలమైన సామ్రాజ్యాన్ని కోరుకో. నుమ్వా ఇష్టమైనంత కాలం జీవించు.
1.1.24 నచికేతా! దీనికి సమానమైన వరం ఏదైనా నీకు తోస్తే దాన్ని కోరుకో. సంపద, దీర్ఘాయువు, భూమండలంలో విశాల సామ్రాజ్యాధిపత్యం వంటి దేనినైనా కోరుకో. నిన్ను సమస్త కోరికలూ అనుభవించే వాడిగా చేస్తాను.
1.1.25 నచికేతా! మానవ లోకంలో తీర్చుకోవడానికి దుర్లభమైన ఏఏ కోరికలు ఉన్నవో వాటన్నింటినీ నీ ఇష్టప్రకారం కోరుకో. సారథులతో కూడుకున్న రథాలను ప్రసాదిస్తాను. సంగీత వాద్యాలలో నిష్ణాతులైన కళాకారులను ఇస్తాను. పురుషులను మోహంలో ముంచెత్తే ఈ దేవలోక స్త్రీలను అనుగ్రహిస్తాను. ఇటువంటి స్త్రీలు మానవులకు లభించరు! నేను ప్రసాదించే ఈ దేవలోక స్త్రీల చేత నువ్వు కావలసిన పరిచర్యలను పొందు. కాని మరణం గురించి మాత్రం అడగవద్దు.
1.1.26 మృత్యుదేవా! నువ్వు చెబుతున్న సుఖాలన్నీ అశాశ్వతాలు. అవి మనిషి ఇంద్రియాలన్నింటి శక్తినీ వృథా చేసేవే. జీవితమే స్వల్పమైనది. కనుక నువ్వు చెప్పిన గుర్రాలూ, ఆటలూ, పాటలూ అన్నింటినీ నువ్వే ఉంచుకో.
1.1.27 మనిషి ధనంతో తృప్తి చెందేవాడు కాడు. నిన్ను దర్శిస్తే కావలసిన సంపద లభించడం తథ్యం. నువ్వు పాలించే వరకు నా ఆయుస్సుకు కొరత లేదు. కనుక ఆయుస్సో సంపదో ఏదీ నాకు వద్దు. నేను కోరదగ్గ వరం అదొక్కటే.
1.1.28 వార్ధక్యం లేనివారూ, అమరులూ అయిన మిమ్మల్ని పొంది నిజాన్ని తెలుసుకున్నాను. నేనో వృద్ధాప్యమూ, మరణమూ ఉన్న అధోలోకవాసిని; పాటలు, శారీరక సుఖాలు మొదలైన వాటిలో కలిగే సుఖం ఏమిటన్నది చింతనచేసి [పర్యాలోచించి] గ్రహించాను: కనుక ఏ జీవితం దీర్ఘాయుస్సు ఇచ్చినప్పటికీ ఆ జీవితాన్ని నేను ఆశిస్తానా?
1.1.29 యమధర్మరాజా! ఏ విషయంలో ఈ సందేహం నెలకొని ఉందో, పరలోక విషయం గురించిన దేనిని తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో, ఏ నిజం అతిగోప్యంగా దాచబడి ఉందో దానిని నేను తెలుసుకోవాలి. మరే వరమూ నాకు అక్కర్లేదు.
Chapter II
1.2.1 శ్రేయస్కరమైనది వేరు, సుఖకరమైనది వేరు. అవి రెండూ విభిన్న ఫలాలను ఇచ్చి వాటి ద్వారా మనిషిని బంధిస్తాయి. శ్రేయస్కరమైనది స్వీకరించిన వానికి శ్రేయస్సు ఒనగూరుతుంది. సుఖకరమైన (ప్రియమైన) దానిని కోరుకున్న వాడు లక్ష్యం నుంచి పతనం చెందుతాడు.
1.2.2 శ్రేయస్కరమైనది, సుఖకరమైనది రెండూ మనిషిని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి, ఆ రెంటినీ వివేచన చేస్తాడు; సుఖకరమైన దానిని వదలిపెట్టి, శ్రేయస్కరమైన దానిని ఎన్నుకుంటాడు. బుద్ధిహీనుడు శారీరక వృద్ధి, రక్షణ మొదలైనవి ఎంచి సుఖకరమైన దానిని కోరుకుంటాడు.
1.2.3 నచికేతా! నువ్వే చక్కగా ఆలోచించి, సంపదలను అందమైన స్త్రీలను త్రోసిరాజన్నావు. ఏ మార్గంలో ఎందరో మనుష్యులు మునిగిపోతారో అది సంపదను లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు.
1.2.4 భగవన్మార్గం, ప్రాపంచికత రెండూ విభిన్నమైనవి, పరస్పరవిరుద్ధమైనవి, వేర్వేరు మార్గాలను అనుసరించేవి. ఏ కోరికా నిన్ను ప్రలోభపెట్టి శ్రేయోమార్గంనుంచి వైదొలగించలేదు. కనుక నువ్వు భగవన్మార్గంలో ఆసక్తిగలవాడివని నేను భావిస్తున్నాను.
1.2.5 ప్రాపంచికత నడుమ జీవించే మూర్ఖులు తమను బుద్ధిశాలురుగా, విద్వాంసులుగా భావించి అడ్డదారిని అనుసరిస్తారు. గుడ్డివాడిచే దారిచూపబడే గుడ్డివారివలె వీరు మళ్లీ మళ్లీ జనన సుడిగుండంలో పరిభ్రమిస్తూ ఉంటారు.
1.2.6 అడ్డదారిలో వెళ్ళే, ధనాశచే తెలివి కోల్పోయిన, మనోపక్వతలేని వారికి పరలోక నిజాలు అర్థం కావు. ‘ఈ లోకమే సమస్తం, వేరే ఏదీ లేదు’ అని భావించే వారు మళ్ళీ మళ్ళీ నా వశం అవుతూ ఉంటారు.
1.2.7 దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో, విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరో, ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు, వినేవాడూ అరుదు. అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.
1.2.8 ప్రాపంచికతతో నిండిన మనుష్యులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము; ఎందుకంటే వారు అనేక విధాలుగా చెబుతుంటారు. అనుభూతి పొందిన వ్యక్తి ఉపదేశాలను పాటిస్తే గందరగోళం ఉండదు. ఈ ఆత్మ అణువుకన్నా సూక్ష్మమైనది. కనుక తర్కానికి అతీతమైనది.
1.2.9 ప్రియతముడా! నువ్వు పొందిన ఈ జ్ఞానం తర్కం వలన లభించేది కాదు. సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఉపదేశించి దానిని పాటించినప్పుడు అది శ్రేష్ఠమైన జ్ఞాన స్థితికి తోడ్కొనిపోతుంది. నచికేతా! సత్యనిష్ఠలో నువ్వు దృఢంగా నెలకొని ఉన్నావు. నీ వంటి విద్యార్థులు మాకు లభించాలిగాక!
1.2.10 కర్మఫలాలు అశాశ్వతమైనవని నాకు తెలుసు. అశాశ్వతమైన వాటిచే ఆత్మను పొందలేము. అందుచేతనే అశాశ్వత వస్తువులచే నచికేత యాగాన్ని నిర్వర్తించి నేను యమధర్మరాజు పదవిని పొందాను.
1.2.11 నచికేతా! స్వర్గలోకం కోర్కెలు తీర్చుకునే చోటు, లోకం యొక్క ఆధారం, యాగాల ఫలంగా లభించే చెప్ప సాధ్యంకానన్ని సుఖాలకు ఆలవాలం, భయరాహిత్యానికి పుట్టినిల్లు, ఆరాధనీయమైనది, మహత్వం గలది, సుదీర్ఘకాలం నెలకొని ఉండేది, శ్రేయస్కరమైనది. బుద్ధిశాలివైన నీవు [ఈ సత్యాలను గ్రహించి, అది అశాశ్వతమైనది కాబట్టి] దానిని దృఢనిశ్చయంతో తిరస్కరించావు.
1.2.12 నువ్వు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో పొందదగినది, గోప్యమైన చోట నెలకొని ఉన్నది, హృద్గుహలో ప్రకాశించేది, చీకటి ప్రాంతంలో ఉన్నది.
1.2.13 ఈ సత్యాన్ని అర్హు డైన గురువు నుంచి విని, విచారణ చేసి తెలుసుకోవాలి. ఆ తరువాత శరీరం నుంచి దానిని విడదీసి గ్రహించాలి. అణువు వంటిది, ఆనందం నిండినదీ అయిన ఆత్మను ఈ విధంగా విడదీసి [వివేచించి] తెలుసుకునే వాడు ఆనందం పొందుతాడు. నచికేతా! నీకు ఆ మార్గం తెరవబడినట్లు భావిస్తున్నాను.
1.2.14 ధర్మం, అధర్మం, కార్యం, కారణం, భూతకాలం, భవిష్యత్ కాలం మొదలైన వాటి నుంచి భిన్నమైనదిగా నువ్వు చూస్తున్న దానిని గురించి నాకు చెప్పు.
1.2.15 అన్ని వేదాలూ ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో, ఎందుకోసం అన్ని తపస్సులూ అనుష్ఠింపబడుతున్నాయో, ఏది కోరి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా నీకు చెబుతున్నాను. అది ఓం.
1.2.16 ఓం అనే ఈ మంత్రం భగవంతుడు. ఈ మంత్రం సర్వోత్తమమైనది. ఈ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి ఏం కోరుకుంటే అది అతనికి లభిస్తుంది.
1.2.17 ఈ మార్గం ఉత్తమమైనది. ఈ మార్గం సర్వోత్కృష్టమైనది. ఈ మార్గాన్ని తెలుసుకుని దాని ద్వారా వెళ్ళేవాడు బ్రహ్మ లోకంలో మహత్వాన్ని పొందుతాడు.
1.2.18 ఆత్మ జన్మించడం లేదు, మరణించడమూ లేదు. ఇది దేనినుంచీ రూపొందినది కాదు, ఏదీ దీనినుంచి రూపొందడం లేదు. ఇది జన్మ రహితమైనది, ఎన్నటికీ ఉండేది. శాశ్వతమైనది, సనాతనమైనది; శరీరం నశించినా నశించనిది.
1.2.19 తాను చంపుతున్నట్లు భావించే వాడు, తాను చంపబడినట్లు భావించే వాడు ఇద్దరూ సత్యాన్ని తెలుసుకోలేని వారే. ఆత్మ చావదూ, చంపబడదూ కూడా.
1.2.20 అణువుకన్నా అణువైనదీ, అత్యంత పెద్దదాని కన్నా పెద్దదీ అయిన ఈ ఆత్మ ప్రాణుల హృద్గుహలో కొలువై ఉన్నది. కామనారహితుడు దానిని దర్శించగలడు. మానసిక స్పష్టతచే ఆత్మ మహత్వాన్ని గ్రహించిన అతడు శోకాలకు అతీతుడవుతాడు.
1.2.21 ఆ ఆత్మ కూర్చునే చాలాదూరం వెళుతుంది. పడుకునే అన్ని చోట్లకూ పోగలుగుతుంది. అది ఆనందమయమైనది. దుఃఖమయమైనదికూడా అదే. అది జ్యోతిర్మయమైనది. నాకు తప్ప మరెవరికి దానిని తెలుసుకోవడానికి అర్హత ఉంది?
1.2.22 ఆత్మ శరీరాలలో శరీరరహితమైనది; అశాశ్వత వస్తువులలో శాశ్వతమైనది; పెద్దది. సర్వత్రా నెలకొని ఉన్నది. బుద్ధి వికాసం చెందిన వాడు దానిని తెలుసుకుని శోకం నుంచి విముక్తుడవుతాడు.
1.2.23 ప్రసంగాల వలనో, పాండిత్యం వలనో, అనేక విషయాలు ఆలకించడం వలనో ఈ ఆత్మను పొందలేం. ఎవరు దానిని పొందడానికి వ్యాకులత చెందుతాడో అతడు మాత్రమే దానిని పొందుతాడు. ఆ ఆత్మ ఆతడికి తన స్వకీయ నైజాన్ని వెల్లడిస్తుంది.
1.2.24 దుష్ప్రవర్తన నుంచీ వైదొలగని వాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, మనస్సు ఏకాగ్రం చేసుకోలేని వాడు, మనస్సులోని ఉద్రిక్తత ఉపశమించనివాడు – ఇటువంటి వారు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ ఆత్మను పొందలేరు.
1.2.25 జ్ఞానం, భుజబలం రెండూ ఎవరికి ఆహారంగా ఉన్నవో, మరణం ఎవరికి ఊరగాయ మాత్రంగా ఉన్నదో అది ఎటువంటిదని ఎవరు తెలుసుకోగలరు?
Chapter III
1.3.1 కర్మల ఫలాలను అనుభవిస్తున్న ఇద్దరు ఈ శరీరంలో ఉన్నారు. వారు నీడ, ఎండ మాదిరి పరస్పర విరుద్ధమైన వారు; ఈ శరీరంలో ఉన్న సూక్ష్మమైన హృద్గుహలో ప్రవేశించినవారు. మహాత్ములూ, అయిదు అగ్నులు ఉపాసించినవారూ, మూడుసార్లు నచికేత యాగం నిర్వర్తించిన వారూ ఈ విధంగా చెబుతారు.
1.3.2 అనుసరించే వారికి ఏ విద్య వారధిగా ఏర్పడుతుందో ఆ నచికేత యాగాన్ని నిర్వర్తించడానికి సమర్థులం అవుతాము. అభయాన్ని ప్రసాదించే తీరాన్ని చేరుకోగోరిన వారికి అవినాశియైన ఏ భగవంతుడు శరణాగతుడో ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సమర్థులం అవుతాము.
1.3.3 ఆత్మ రథికుడు శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం.
1.3.4 ఇంద్రియాలు గుర్రాలు; విషయ వస్తువులు ఆ గుర్రాలు పరుగుతీసి వెళ్ళే మార్గాలు; శరీరం, ఇంద్రియాలు, మనస్సు – వీటితో కూడిన జీవుడు జీవితాన్ని అనుభవించే వాడని మహాత్ములు చెబుతారు.
1.3.5 ఎవడు జాగృతి చెందని వాడో, అదుపు తప్పిన మనస్సు గలవాడో, ఆతడి ఇంద్రియాలు సారథికి అదుపులోలేని గుర్రాల వలె, వశం తప్పిపోతాయి.
1.3.6 ఎవడు జాగృతి చెందిన వాడో, నిగ్రహవంతమైన మనస్సు గలవాడో, ఆతడి ఇంద్రియాలు సారథికి అదుపులో ఉన్న గుర్రాలవలె, వశంలో ఉంటాయి.
1.3.7 ఎవడు జాగృతం చెందని వాడో, అదుపులేని మనస్సు గలవాడో, పావనరహితుడుగా ఉంటున్నాడో, ఆతడు భగవత్ స్థితిని(పరమపదాన్ని) పొందడు; ప్రాపంచికతలో నశించిపోతాడు.
1.3.8 ఎవడు జాగృతి చెందిన వాడో, అదుపులో ఉన్న మనస్సు గలవాడో, ఎప్పుడూ పావనుడుగా ఉంటున్నాడో అతడు, ఎక్కడకు పోతే మళ్ళీ జన్మ ఉండదో ఆ భగవత్ స్థితిని పొందుతాడు.
1.3.9 ఎవడు జాగృతి చెందిన సారథితోను, కళ్ళెమైన మనస్సును చక్కగా పట్టుకున్న వాడుగాను ఉంటున్నాడో ఆతడే బా (ప్రయాణపు) గమ్యాన్ని చేరుకుంటాడు. అది భగవంతుని పరమ పదం.
1.3.10-11 ఇంద్రియాలకన్నా విషయ వస్తువులు శక్తిమంతమైనవి. విషయ వస్తువుల కన్నా మనస్సు శక్తిమంతమైనది. మనస్సు కన్నా బుద్ధి శక్తిమంతమైనది. మహత్వం సంతరించుకొన్నదైన ఆత్మ బుద్ధికన్నా శక్తిమంతమైనది. మహత్వం గలదైన ఆత్మకన్నా అవ్యక్తం శక్తిమంతమైనది. అవ్యక్తం కన్నా భగవంతుడు శక్తిమంతుడు. భగవంతుని కన్నా శక్తిమంతమైనది ఏదీ లేదు. ఆయనే పరమ వస్తువు. ఆయనే చరమ గమ్యం.
1.3.12 ఈ ఆత్మ సమస్త జీవులలోను దాగి ఉన్నది. ప్రకటితం కాదు. కాని ఏకాగ్రం చెందిన, సూక్ష్మమైన బుద్ధి ద్వారా మహాత్ములు ఈ ఆత్మను దర్శించగలుగుతున్నారు.
1.3.13 ఆంతరికమైన ఆకాంక్ష గల వ్యక్తి వాక్కును మనస్సులో లీనం గావించాలి. మనస్సును జాగృతి చెందిన బుద్ధిలో లయింపజేయాలి. బుద్ధిని మహత్వంగల ఆత్మలో లీనం చేయాలి. ఆత్మను శాంతికి ఆలవాలమైన భగవంతునిలో లీనం గావించాలి.
1.3.14 లేవండి, మేల్కొనండి, అర్హుడైన గురువును ఆశ్రయించి అనుభూతి పొందండి. పదునైన కత్తి అంచు మీద నడవడం వలె భగవన్మార్గం కఠినమైనదని ప్రాజ్ఞులు చెబుతారు.
1.3.15 ఇంద్రియాలు గ్రహించగల శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నిటికీ అతీతమైన, అవినాశియైన నిత్యమైన, ఆద్యంతరహితమైన, బుద్ధికన్నా శ్రేష్ఠమైన, సుస్థిరమైన భగవంతుణ్ణి అనుభూతిలో గ్రహించి మరణ పిడికిలి నుంచి విడివడతాడు మానవుడు.
1.3.16 నచికేతుడికి యమధర్మరాజు చెప్పిన ఈ ప్రాచీనమైన విషయాన్ని జాగృతి చెందిన వ్యక్తి చెప్పడమూ వినడమూ చేస్తే అతడు ఉన్నత లోకాలలో ప్రశంసలు పొందుతాడు.
1.3.17 అత్యంత గోప్యమైన ఈ ఉపనిషత్తును ప్రాజ్ఞుల సభలోనో, శ్రాద్ధ సమయంలోనో పావనుడైన వ్యక్తి పఠిస్తే అది అనంతమైన ఫలాన్ని కలుగజేస్తుంది.
Part Two
Chapter I
2.1.1 ఇంద్రియాలను బాహ్యపరమైన ఉద్దేశంతో భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందుచేత అవి వెలుపలి విషయాలను మాత్రమే చూడ గలుగుతున్నాయి; అంతరంలో ఉన్న ఆత్మను చూడడం లేదు. అమరత్వం కోరే ఎవరో ఒక ప్రాజ్ఞుడు అంతర్ముఖుడై ఆత్మను చూడగలుగుతాడు.
2.1.2 మనోపక్వత లేనివారు బాహ్యంలో ఉన్న భోగ వస్తువులను కాంక్షిస్తారు. సర్వత్రా నెలకొని ఉన్న మృత్యు వలలో వారు పడిపోతారు. కాని, అనిత్య ప్రపంచంలో అమరమైన శాశ్వతమైన ఒకటి ఉండడం ప్రాజ్ఞులు తెలుసుకుంటారు. కనుక వారు భోగ వస్తువులను ఆకాంక్షించరు.
2.1.3 రూపం, రుచి, వాసన, శబ్దం, స్పర్శ, సంభోగం మొదలైన వాటిని దేనితో మనిషి గ్రహిస్తున్నాడో, ఈ అనుభవాలలో ఏం మిగిలి ఉంటుంది అన్నదానిని దేనితో తెలుసుకుంటున్నాడో అదే నువ్వు అడిగిన వస్తువు.
2.1.4 స్వప్న, జాగ్రద్ అనే రెండు స్థితులలోనూ దేనిచే ఒకడు అన్ని విషయాలను గ్రహిస్తున్నాడో అదే ఆత్మ. అది మహత్తరమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నది. దానిని అనుభూతిలో గ్రహిస్తున్న ప్రాజ్ఞుడు శోకం నుంచి విడివడతాడు.
2.1.5 కర్మఫలాలను అనుభవించే, ప్రాణానికి ఆధారమైన ఈ ఆత్మను దగ్గరలో ఉన్నట్లూ, అదే సమయంలో భూత భవిష్యత్తు కాలాలకు నేతగానూ తెలుసుకునేవాడు ఎవరినీ ద్వేషించడు. అదే నువ్వు అడిగిన వస్తువు.
2.1.6 ఎవరు నీరు మొదలైన పంచభూతాలకన్నా ముందు తపస్సుచే ఉద్భవించారో, ఎవరు ప్రాణుల హృద్గుహలో నెలకొన్నారో ఆయనే సమస్తాన్నీ దర్శిస్తాడు. అదే నువ్వు అడిగిన వస్తువు.
2.1.7 ప్రాణ రూపమైనదీ, సమస్త దేవతల రూపమైనదీ, పంచభూతాలతో ఉద్భవించినదీ అయిన ఏ దేవి ప్రాణుల హృద్గుహలో ప్రవేశించి వసిస్తున్నదో ఆ దేవి రూపంలోనిదే నువ్వు అడిగిన వస్తువు.
2.1.8 గర్భవతులైన స్త్రీలు గర్భాన్ని జాగ్రత్తగా పరిరక్షించేటట్లు అరణి కట్టెలలో అగ్ని పదిలంగా కాపాడబడుతుంది. జాగృతి చెందిన యోగులు ఆత్మాగ్నిని అదేవిధంగా జాగ్రత్తగా అనునిత్యం ఆరాధిస్తుంటారు. ఆ ఆత్మాగ్నే నువ్వు అడిగిన వస్తువు.
2.1.9 ఎవరినుంచీ సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎక్కడ అస్తమిస్తున్నాడో, ఆ భగవంతుని సమస్త దేవతలూ స్తుతిస్తున్నారు. ఆయనను మీరి ఎవరూ వ్యవహరించలేరు. నువ్వు అడిగిన వస్తువు ఆ భగవంతుడే.
2.1.10 ఇక్కడ ఏది ఉన్నదో అదే అక్కడ ఉన్నది. అక్కడ ఏది ఉన్నదో అదే ఇక్కడా ఉన్నది. ఈ లోకంలో భిన్నత్వం ఉన్నట్లుగా ఎవరు చూస్తారో అతడు మరణం నుంచి మరణాన్ని పొందుతాడు.
2.1.11 ఈ సత్యం మనస్సుచే గ్రహింపబడుతుంది. ఈ లోకంలో వైవిధ్యం ఏదీ లేదు. ఇక్కడ వైవిధ్యం ఉన్నట్లుగా ఎవడు చూస్తాడో అతడు మృత్యువునుంచి మృత్యువుకు పోతాడు.
2.1.12 సర్వత్రా వ్యాపించిన వాడూ, భూత భవిష్యత్ కాలాలకు ప్రభుమా అయిన భగవంతుడు శరీరం మధ్య హృద్గుహలో బొటనవ్రేలు ప్రమాణంలో కొలువై ఉన్నాడు. ఆయనను తెలుసుకుంటే ఇక ఎవరినీ ద్వేషించం. నువ్వు అడిగిన వస్తువు ఆయనే.
2.1.13 సర్వత్రా వెలసి ఉన్నవాడూ, భూత భవిష్యత్ కాలాలకు ప్రభుమా అయిన భగవంతుడు పొగలేని కాంతిపుంజంలా బొటనవ్రేలు ప్రమాణంలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నది ఆయనే, ఎన్నటికీ శాశ్వతంగా ఉండేదీ ఆయనే. నువ్వు అడిగిన వస్తువు ఆయనే.
2.1.14 పర్వత శిఖరాల మీద కురిసిన వాన నీరు ఏ విధంగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తుందో, అదే విధంగా జీవజాలాన్ని వివిధాలుగా చూసే వాడు మళ్ళీ మళ్ళీ వాటిగానే జన్మిస్తాడు.
2.1.15 నచికేతా! పరిశుభ్రమైన నీటిలో విడిచిన పరిశుభ్రమైన నీరు ఏ విధంగా అటువంటిదే అవుతుందో అట్లే సత్యాన్ని గ్రహించిన మహాత్ముడు ఆత్మ రూపంగానే అయిపోతాడు.
Chapter II
2.2.1 పదకొండు ద్వారాలు గల దేహం, జన్మరహితమైన, అకుంఠిత ప్రజ్ఞగల ఆత్మయొక్క గర్భం. ఈ విధంగా ధ్యానించిన వ్యక్తి దుఃఖం నుంచి విడివడతాడు; స్వతంత్రుడై జన్మలనుంచి విముక్తుడవుతాడు. నువ్వు అడిగినది ఈ ఆత్మను గురించే.
2.2.2 ఆ ఆత్మ సర్వత్రా వెళ్ళగలదు, నిర్మలమైన ఆకాశంలో సూర్యుడిగా ఉన్నది, సమస్తానికీ ఆధారమైనది, అంతరిక్షంలో వాయువుగా ఉన్నది, అగ్నిగా భూమిలో ఉన్నది, అతిథిగా ఇంట్లో ఉన్నది, మనిషిలో వాసంచేస్తుంది, దేవునిలో వసిస్తుంది, సత్యంలో నెలకొని ఉంటుంది, ఆకాశంలో వసిస్తుంది, నీటిలో ఉద్భవించినది, భూమిలో ఉద్భవించినది, యాగంలో ఉద్భవించినది, పర్వతంలో ఉద్భవించినది, ప్రపంచ నియతిగా విరాజిల్లుతుంది, అతి పెద్దది.
2.2.3 ప్రాణాన్ని పైకి పంపడమూ, అపానాన్ని క్రిందికి త్రోయడమూ చేస్తున్న జీవుడు దేహం మధ్యలో ఉన్నాడు. అన్ని ఇంద్రియాలూ అందుకు సంబంధించినవిగా ఉన్నాయి.
2.2.4 శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణం శరీరం నుంచీ విడివడి బయటకుపోయినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? అదే నువ్వు అడిగిన వస్తువు.
2.2.5 ఏ మనిషీ ప్రాణం చేతగాని అపానం చేతగాని జీవించడు. దేనిని ఆధారంగా చేసుకుని ఈ ప్రాణమూ అపానమూ పనిచేస్తున్నవో, దానిని ఆధారం చేసుకునే సమస్తమూ జీవిస్తాయి.
2.2.6 నచికేతా! మంచిది. మరణానంతరం ప్రాణం ఏమవుతుందన్న విషయం గురించీ, రహస్యమైనదీ అవినాశియైనదీ అయిన ఆత్మ గురించీ నీకు ఇప్పుడు చెబుతాను.
2.2.7 మరణానంతరం కొందరు జీవులు మానవ దేహాన్ని పొందుతారు; కొందరు జీవులు స్థావరాల వంటి అచరాలను ఆశ్రయిస్తారు. కర్మ ఫలాలు, పొందిన అనుభవాలు ఎటువంటివో అట్లే తదనంతర జన్మ ప్రాప్తిస్తుంది.
2.2.8 ఇంద్రియాలు నిద్రిస్తున్నప్పుడు తనకు ఇష్టమైన వాటిని రూపొందించి ఏది మేల్కొని ఉంటుందో అదే పవిత్రమైన, అమరమైన ఆత్మ అని పేర్కొనబడుతుంది. అన్ని లోకాలూ దానికే చెందినవి. దానిని అతిక్రమించినవారు ఎవరూ లేరు.
2.2.9 ఒకే అగ్ని ప్రపంచంలోకి వచ్చి ఏ విధంగా పలు రకాలైన వస్తువులలో ఆయా ఆకృతులలో విరాజిల్లుతుందో ఆ రీతిలో సమస్త జీవులలోను ఉన్న ఆత్మ ఒకటైనప్పటికీ పలు రకాలైన ప్రాణులలో ఆయా ఆకృతులలో విరాజిల్లుతుంది. అదే సమయంలో, ఆ ఆకృతులకు వెలుపలా విరాజిల్లు తుంది.
2.2.10 ఒకే వాయువు ప్రపంచంలోకి వచ్చి ఏ విధంగా పలు రకాలైన వస్తువులలో ఆయా ఆకృతులలో విరాజిల్లుతుందో ఆ విధంగానే సకల జీవరాసులలోను ఉన్న ఆత్మ ఒకటే అయినప్పటికీ పలు రకాల ప్రాణులలో ఆయా ఆకృతులలో విరాజిల్లుతుంది. అదే సమయంలో ఆ ఆకృతులకు వెలుపల కూడా విరాజిల్లుతుంది.
2.2.11 అందరి దృశ్యవీక్షణకు ఆధారంగా ఉన్నవాడు సూర్యుడు. కాని చూపు దోషాలో, బాహ్యమైన లోటుపాట్లో సూర్యుణ్ణి బాధించవు. అదే విధంగా ఒకటే అయిన ఆత్మ అందరిలోనూ కొలువై ఉన్నప్పటికీ ప్రపంచపు దుఃఖాల చేత బాధింపబడదు. ఎందుకంటే అది అన్నింటికీ అతీతమైనది కనుక.
2.2.12 ఒక్కటే అయినదీ, సమస్తాన్నీ పాలించేదీ, అందరిలోనూ కొలువై ఉన్నదీ; హృదయంలో వసించేదీ, ఒక్కటే అయినప్పటికీ అనేకంగా కనిపించేదీ అయిన ఆత్మను అనుభూతిలో గ్రహించిన ప్రాజ్ఞులకే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది; తక్కిన వారికి లభించదు.
2.2.13 అనిత్యమైన వాటిలో నిత్యమైన వాడూ, ప్రాణులలో చైతన్యంగా విరాజిల్లేవాడూ, అనేకంలో ఏకత్వం ఉన్నవాడూ, కోర్కెలను నెరవేర్చేవాడూ అయిన భగవంతుని ఏ ప్రాజ్ఞులు హృదయంలో ఆత్మగా వసిస్తున్న వాడిగా అనుభూతిలో గ్రహిస్తారో, వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది; ఇతరులకు లభ్యం కాదు.
2.2.14 గుర్తించి చెప్పడానికి అశక్యమైనదీ, ఉత్కృష్టమైనదీ అయిన ఆ అనుభూతి ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఆ అనుభవం స్వయంగా ప్రకాశిస్తుందా లేక మరొకదానిచే ప్రకాశింపబడుతోందా? దీనిని గురించి తెలుసుకోగోరుతున్నాను.
2.2.15 అక్కడ సూర్యుడు ప్రకాశించడు; చంద్రుడూ నక్షత్రాలూ ప్రకాశించవు; మెరుపులు మెరవవు. ఈ అగ్ని ఎలా ప్రకాశిస్తుంది? ప్రకాశించే ఆత్మను అనుసరించే తక్కిన సమస్తమూ ప్రకాశిస్తాయి. సమస్తం దాని ప్రకాశంచేతనే ప్రకాశిస్తున్నాయి.
Chapter III
2.3.1 ఈ అశ్వత్థ వృక్షం పురాతనమైనది, పైకి వ్రేళ్లూనినది, క్రిందికి వ్యాపించిన కొమ్మలు గలది. అదే పావనమైనది. అదే భగవంతుడు. అది అవినాశి. సమస్త లోకాలూ దాని యందే ఉన్నాయి. దానిని ఎవరూ అతిక్రమించలేరు. నువ్వు అడిగిన సత్యం అదే.
2.3.2 ఈ లోకాలు అన్నీ ప్రాణంనుంచీ అభివ్యక్తమవుతున్నాయి; ప్రాణంచే పనిచేస్తున్నాయి. వజ్రాయుధాన్ని ఎత్తిపట్టుకున్నట్లు భగవంతుడు ఉన్నాడనే గొప్ప భయం కారణంగానే ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని తెలుసుకున్నవారు అమరులు అవుతారు.
2.3.3 భగవంతుని పట్ల గల భయంతో అగ్ని మండుతోంది; సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడూ, వాయుదేవుడూ తమ తమ పనులను నిర్వర్తిస్తున్నారు. అయిదవవాడైన మృత్యుదేవత ఆ భయం వల్లనే తన నిర్వహణలో పరుగులు పెడుతున్నాడు.
2.3.4 ఇక్కడ శరీర పతనానికి మునుపే ఈ సత్యాలను గ్రహించగలిగితే ఆంతరిక సాక్షాత్కారం లభిస్తుంది. గ్రహించలేకపోతే లోకంలో మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుంది.
2.3.5 బుద్ధిలో అద్దంలో మాదిరిగా, పితృలోకంలో కలలోలాగా, గంధర్వలోకంలో నీటిలోలాగా అస్పష్టంగా, బ్రహ్మలోకంలో నీడ ఎండలాగా స్పష్టంగాను ఆంతరిక సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
2.3.6 ఇంద్రియాల విభిన్న స్వభావాలనూ, వాటి ఉదయాస్తమయాలను, వాటి విభిన్న ఉత్పత్తి వంటి వాటిని తెలుసుకున్న ప్రాజ్ఞుడు దుఃఖం నుంచి విడివడతాడు.
2.3.7 ఇంద్రియాలకన్నా మనస్సు బలోపేతమైనది. మనస్సుకన్నా బుద్ధి బలోపేతమైనది. బుద్ధికన్నా ఆత్మ అమిత శ్రేష్ఠమైనది. శ్రేష్ఠమైన ఆత్మకన్నా అవ్యక్తం శ్రేష్ఠమైనది.
2.3.8 అవ్యక్తానికన్నా భగవంతుడు శ్రేష్ఠుడు. ఆయన సర్వవ్యాపి, [ఈయనే అని చూపించడానికి] ఏ ఆనవాలూ లేనివాడు. ఆయనను అనుభూతిలో గ్రహించడం వలన మనిషి [బంధాలనుంచీ] విడివడతాడు; అమరత్వాన్ని పొందుతాడు.
2.3.9 భగవంతుని రూపం బాహ్యంగా దర్శించలేనటు వంటిది. ఎవరూ ఆయ నను కన్నులతో చూడలేరు. హృద్గుహలో ఉన్న ఆత్మచేత, జాగృతం చెందిన బుద్ధితో, మనస్సు యొక్క ఎడతెగని ప్రయత్నాలతో ఆయన గ్రహింప బడతాడు. ఆయనను తెలుసుకున్న వారు అమరులవుతారు.
2.3.10 ఎప్పుడు పంచేంద్రియాలూ మనస్సూ విశ్రాంతి స్థితిలో ఉంటాయో, బుద్ధి ప్రయత్నరహితమై ఉంటుందో ఆ స్థితిని పరమ పదమని పేర్కొంటారు.
2.3.11 ఇంద్రియాలు నియంత్రించబడి, స్థిరంగా ఉన్న ఆ స్థితి యోగం అని పరిగణింపబడుతుంది. ఆ స్థితిని పొందిన వాడు ఆత్మజాగృతి పొందిన వాడుగా అవుతాడు. కాని యోగ స్థితి వృద్ధిక్షయాలకు లోబడింది.
2.3.12 మాటల ద్వారానో, మనస్సు చేతనో, కళ్ళ మూలంగానో ఆ పరమ చైతన్యాన్ని పొంద సాధ్యం కాదు. ‘ఉన్నది’ అని చెప్పే వ్యక్తి తప్ప దానిని మరెవరు పొందగలరు?
2.3.13 ఈ సత్యం ‘ఉన్నది’ అని మొదట తెలుసుకోవాలి. తరువాత దానిని సత్యస్థితిలో గ్రహించాలి. ‘ఉన్నది’ అన్న స్థితిలో లోతుగా గ్రహించినప్పుడు, దాన్నుంచి సత్య స్థితి అనుభూతి, సహజంగానే ప్రాప్తిస్తుంది.
2.3.14 మనస్సులో ఉత్పన్నమయ్యే సమస్త కోరికలూ తొలగిపోయినప్పుడు మనిషి అమరుడు అవుతాడు. ఇక్కడే భగవత్ స్థితిని [బ్రహ్మప్రాప్తిని] పొందుతాడు.
2.3.15 మనస్సు యొక్క అన్ని ముడులూ విడిపోయినప్పుడు మనిషి అమరుడవుతాడు. ఉపదేశం ఇంతే.
2.3.16 హృదయంలో నూటొక్క నాడులున్నాయి. వాటిలో ఒకటి మూర్ధాన్ని (నడి నెత్తిని) చొచ్చుకొని పోతుంది. దాని ద్వారా పైకి వెళ్లేవాడు అమరత్వాన్ని పొందుతాడు. తక్కిన నాడుల ద్వారా బయటకు వెళ్లేవాడు వివిధ అధోలోకాలలో తిరుగుతూ ఉంటాడు.
2.3.17 శరీరంలో వసిస్తున్న ఆత్మ బొటన వ్రేలు పరిమాణంలో ఉంటుంది; అది జనుల హృదయంలో ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది. ముంజె గడ్డినుంచీ ఈనెలను వేరుచేసే తీరులో దానిని (ఆత్మను) సొంత శరీరం నుంచి ఓర్పుతో వేరుచేయాలి. ఆ ఆత్మ పావనమైనది, అమరమైనది అని తెలుసుకో.
2.3.18 యమధర్మరాజు చెప్పిన ఈ విద్యను, అన్ని యోగ విధులను స్వీకరించిన నచికేతుడు పావనుడై మృత్యురహితుడయ్యాడు. తరువాత భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నాడు. ఇతరులు కూడా ఈ విద్యను తెలుసుకుని ఆచరణలో పాటించినప్పుడు భగవత్ స్థితిని పొందుతారు.