- ధృతరాష్ట్రుడు పలికెను – ఓ సంజయా! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండు పుత్రులును ఏమి చేసిరి? (1.1)
- సంజయుడు పల్కెను – ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను. (1.2)
- ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. (1.3)
- ఈ సేనలో ధనుర్ధారులైన గొప్పయోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథియైన ద్రుపదమహారాజు భీమార్జునసమానులు. ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు (భీమార్జునసమానులు). పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును కలరు. వీరందరును మహారథులు. (శౌర్యమున భీమార్జునసమానులు). (1.4-6)
- ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుడు. మీ యెఱుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. (1.7)
- మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానాశస్త్రాస్త్రధారులు. నాకొరకు తమ ప్రాణముల నొడ్డియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. (1.8-9)
- భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగానున్న మనసైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. (1.10)
- కనుక మీరందరును మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపులనుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు. (1.11)
- కురువృద్ధుడును, ప్రతాపశాలియును ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని సంతోషపఱచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను. (1.12)
- మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. (1.13)
- తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి. (1.14)
- శ్రీకృష్ణుడు ‘పాంచజన్యము’ ను, అర్జునుడు ‘దేవదత్త(శంఖ)ము’ ను పూరించిరి. అరివీరభయంకరుడైన భీముడు “పౌండ్రము” అను మహాశంఖమును పూరించెను. కుంతీపుత్రుడును, రాజును ఐన యుధిష్ఠిరుడు ‘అనంతవిజయము’ అను శంఖమును, నకులసహదేవులు ‘సుఘోష’ ‘మణిపుష్పకము’లను శంఖములను పూరించిరి. ఓ రాజా! మహాధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన “శిఖండి”యు, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన ‘సాత్యకి’యు, (తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి.) ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. (1.15-18)
- పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను. (1.19)
- (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి (శ్రీకృష్ణునితో ఈ క్రిందివిధముగాననెను). (1.20)
- ఓ ధృతరాష్ట్రా! అర్జునుడు శ్రీకృష్ణునితో“ఓ అచ్యుత! నా రథమును ఉభయసేనలమధ్య నిలుపుము.” అని పలికెను. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరిని బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. (1.21-22)
- “దుర్బుద్ధియైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని ఒకపరి పరికించెదను.” (1.23)
- సంజయుడు పలికెను – ఓ ధృతరాష్ట్రా! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ఉభయసేనల మధ్య నిలిపెను. భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా (ఉభయసేనల మధ్య రథమును నిలిపి ) శ్రీకృష్ణుడు అర్జునునితో “పార్థా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము” అని నుడివెను. (1.24-25)
- పిమ్మట పార్థుడు (అక్కడ ఉభయసేనలయందును) చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను (చూచెను). (1.26)
- (తరువాత)పిల్లనిచ్చిన మామలను (మరియు) ఉభయసేనలయందును ఉన్న ఆత్మీయులను చూచెను. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు (పలికెను). (1.27)
- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచి యున్న ఈ స్వజన సమూహమును జూచి (పలికెను).(అర్జునుడు ఇట్లు పలికెను) నా అవయవములు శిథిలములగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. మనస్సు భ్రమకు గురియైనట్లు అనిపించుచున్నది. కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. (1.28-30)
- ఓ కేశవా! పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. (1.31)
- ఓ కృష్ణా! నాకు విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని అక్కరయే లేదు. గోవిందా! ఈ రాజ్యము వలనగాని, ఈ భోగములవలన గాని, ఈ జీవితమువలన గాని ప్రయోజనమేమి? (1.32)
- మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదలుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చియున్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు మనుమలు, మేనమామలు, మామలు, బావమఱదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరియున్నారు. (1.33-34)
- ఓ మధుసూదనా! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వారిని చంపనే చంపను. (1.35)
- ఓ జనార్దనా! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి? (మనము మూట కట్టుకొనునది యేమి?) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును. (1.36)
- కనుక ఓ మాధవా! మనబంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? (1.37)
- లోభకారణముగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహమువలన సంభవించు పాపములను (చూడలేక పోచుంటిరి). ఓ జనార్దనా! కులనాశనమువలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు? (1.38-39)
- కులక్షయమువలన సనాతనములైన కులధర్మము లన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. ఓ కృష్ణా! అధర్మము (పాపము) పెచ్చుపెరిగి పోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలగుదురు. ఓ వార్ష్ణేయా! స్త్రీలు దూషితలు ఐనచో వర్ణసాంకర్యము ఏర్పడును. వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు (శ్రాద్ధతర్పణములు) లోపించినందువలన వారి పితరులును అధోగతి పాలయ్యెదరు. (1.40-42)
- వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును. ఓ జనార్దనా! కులధర్మములు నశించినవారికి నిరవధికముగా (కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. (1.43-44)
- అయ్యో! మనము బుద్ధిమంతులమై యుండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము – ఇది యెంత దారుణము? (1.45)
- శస్త్రరహితుడనై, ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను, అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. (1.46)
- సంజయుడు పలికెను – అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్న మానసుడై, యుద్ధభూమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికిలబడెను. (1.47)