- అర్జునుడు పలికెను- ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము (మోహము) తొలగిపోయినది. (11.1)
- ఓ కమలాక్షా! ఓ కృష్ణా! సమస్తప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. (11.2)
- ఓ పరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావులేదు. కాని, ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. (11.3)
- ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో, శాశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపింపుము. (11.4)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! అసంఖ్యాకములైన, బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా అలౌకికరూపములను చూడుము. (11.5)
- ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గగణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి యెరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. (11.6)
- ఓ అర్జునా! నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమైయున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక, ఇంకను నీవు చూడదలచుకొనిన వాటినన్నింటినీ చూడుము. (11.7)
- కాని, ఈ ప్రాకృత (చర్మ) చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా (నిస్సందేహముగా) చూడజాలవు. కనుక, నీకు దివ్య (అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ (దివ్య) యోగశక్తిని చూడుము. (11.8)
- సంజయుడు పలికెను- ఓ రాజా! మహాయోగేశ్వరుడును, పాపములను హరించువాడును ఐన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపెను. (11.9)
- అనేకములైన ముఖములతో, నేత్రములతో, పెక్కు అద్భుత దృశ్యములను కలిగిన, అనేకములగు దివ్యాభరణములను ధరించిన, అనేకములైన దివ్యాయుధములను చేపట్టినటువంటి (ఆ దేవదేవుని విరాడ్రూపమును అర్జునుడు దర్శించెను). దివ్యములైన మాలలను వస్త్రములను ధరించిన, దివ్యములైన చందన పరిమళములను దశ దిశల గుబాళింప చేయుచున్న, సర్వాశ్చర్యకరమైన, అనంతమైన, సర్వత్ర ముఖ శోభలను విరిజిమ్ముచున్న ఆ దేవదేవుని విరాడ్రూపమును (అర్జునుడు దర్శించెను). (11.10-11.11)
- ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో, వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ – రూపతేజస్సులకు సాటిరావు. (11.12)
- ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమైయున్నట్లు చూచెను. (11.13)
- అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్) రూపమునకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. (11.14)
- అర్జునుడు పలికెను – ఓ దేవాదిదేవా! నీ విరాట్ – రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్యసర్పములను చూచుచున్నాను. (11.15)
- ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను. (11.16)
- హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది. (11.17)
- పరమ – అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతనపురుషుడవు, అని నా విశ్వాసము. (11.18)
- నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. (11.19)
- ఓ మహాత్మా! దివినుండి భువివఱకుగల అంతరిక్షమునందంతటను, అన్ని దిశలలోను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకరరూపమును చూచి, ముల్లోకములును గడగడలాడుచున్నవి. (11.20)
- ఇదిగో, ఆ దేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. (11.21)
- ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్ధసముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. (11.22)
- హే మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు(తొడ)లను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడా భయముతో వణకిపోవుచున్నాను. (11.23)
- ఏలనన, హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన, నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది. (11.24)
- ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో (భయంకరములైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము. (11.25)
- ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. (11.26-27)
- అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. (11.28)
- మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు. (11.29)
- హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళించుచు, అన్నివైపులనుండి మాటిమాటికిని ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. (11.30)
- ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు – ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను. (11.31)
- శ్రీ భగవానుడు పలికెను – నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు. (మిగిలియుండరు). (11.32)
- కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తి గాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవుకమ్ము. (11.33)
- ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ), కర్ణాది యుద్ధ వీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. (11.34)
- సంజయుడు పలికెను – ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను, మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. (11.35)
- అర్జునుడు పలికెను – ఓ అంతర్యామీ! కేశవా! నీనామగుణప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు. (11.36)
- ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు – కనుక వారు (సిద్ధాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్ – అసత్ లు నీవే. వాటికంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. (11.37)
- ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. పరంధాముడవు, ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది. (11.38)
- నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకువేలకొలది నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు. (11.39)
- అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే. (11.40)
- నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరపాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను. (11.41-11.42)
- ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును? (11.43)
- కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. (11.44)
- మునుపు ఎన్నడునుచూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక దేవేశా! చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము. (11.45)
- కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము. (11.46)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ – రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మఱి యెవ్వరును చూచియుండలేదు. (11.47)
- ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని తదితర పుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపము నీకుదప్ప మఱియెవ్వరికిని చూడశక్యము గాదు. (11.48)
- ఈ విధమైన నా ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును, మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము. (11.49)
- సంజయుడు పలికెను – వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమును దర్శనమిచ్చెను. అనంతరము శ్రీ కృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి, భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. (11.50)
- అర్జునుడు పలికెను – ఓ జనార్దనా! మీ అతి సౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందర రూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటబడినది నేను నా స్వాభావిక (సహజ) స్థితిని పొందితిని. (11.51)
- శ్రీ భగవానుడు పలికెను – నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరు చుందురు. (11.52)
- నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేద పఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మల చేగాని శక్యము కాదు. (11.53)
- కాని ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్త్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్యభక్తిద్వారా మాత్రమే సాధ్యమగును. (11.54)
- అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. (11.55)