- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా! అసూయ లేనివాడవైన నీకు అత్యంత రహస్యమైన ఈ అనుభవ పూర్వక జ్ఞానాన్ని వివరిస్తాను. దీనిని తెలుసుకుంటే సంసార దుఃఖం అనే అశుభం నుండి నీవు విముక్తి పొందుతావు. (9.1)
- ఇది విద్యలన్నింటిలో శ్రేష్ఠమైనది, రహస్యాలన్నింటిలో గొప్పది, అత్యంత పవిత్రమైనది. ఇది ప్రత్యక్షంగా అనుభవానికి అందేది, ధర్మయుక్తమైనది, ఆచరించడానికి చాలా సులభమైనది మరియు శాశ్వతమైనది. (9.2)
- ఓ పరంతప! ఈ ధర్మంపై శ్రద్ధ లేని మనుష్యులు నన్ను పొందలేరు. వారు మరణంతో కూడిన ఈ సంసార చక్రంలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటారు. (9.3)
- ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులూ నా యందే ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. (9.4)
- నిజానికి ఆ ప్రాణులు నాలో లేవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును చూడు! నేను ప్రాణులను భరించేవాడిని, పుట్టించేవాడిని, కానీ నేను వాటి యందు చిక్కుకుని లేను. (9.5)
- ఆకాశంలో పుట్టి, అంతటా సంచరించే గొప్ప వాయువు ఎల్లప్పుడూ ఆకాశంలోనే ఉన్నట్లు, సమస్త ప్రాణులూ నా యందే ఉన్నాయి. (9.6)
- ఓ కౌంతేయా! కల్పాంతంలో సమస్త ప్రాణులూ నా ప్రకృతిలో లీనమవుతాయి. మళ్ళీ కల్పం ప్రారంభంలో వాటిని నేనే సృష్టిస్తాను. (9.7)
- నా ప్రకృతిని ఆధారంగా చేసుకుని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మళ్ళీ మళ్ళీ సృష్టిస్తూనే ఉంటాను. (9.8)
- ఓ ధనంజయా! ఆ సృష్టి, లయ కర్మలు నన్ను బంధించవు. ఎందుకంటే నేను ఆ కర్మల యందు ఆసక్తి లేనివాడినై, తటస్థుడిలా ఉంటాను. (9.9)
- ఓ కౌంతేయా! నా పర్యవేక్షణలో ప్రకృతి, చర మరియు అచర ప్రాణులతో కూడిన ఈ జగత్తును పుట్టిస్తోంది. ఈ కారణం చేతనే ఈ జగత్తు మాటిమాటికీ మారుతూ ఉంటుంది. (9.10)
- నేను మనుష్య రూపం ధరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా యొక్క పరమ తత్త్వం వారికి తెలియదు. (9.11)
- వివేకం లేని వారు, వృధా కోరికలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన జ్ఞానం కలిగి ఉండి, మోహాన్ని కలిగించే రాక్షస, అసుర స్వభావాలను ఆశ్రయించి ఉంటారు. (9.12)
- కానీ ఓ పార్థా! దైవీ గుణాలను ఆశ్రయించిన మహాత్ములు, నన్ను సర్వభూతాలకు మూలకారణంగా, నాశనం లేనివానిగా తెలుసుకుని, అనన్యమైన మనస్సుతో నన్నే భజిస్తారు. (9.13)
- అట్టి మహాత్ములు ఎల్లప్పుడూ నా నామాలను కీర్తిస్తూ, దృఢమైన సంకల్పముతో ప్రయత్నిస్తూ, నాకు నమస్కరిస్తూ, అత్యంత భక్తితో నిరంతరం నన్నే ఉపాసిస్తారు. (9.14)
- మరికొందరు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను ఆరాధిస్తారు. వారు నన్ను ఏకత్వ భావంతో (నేనే అంతా అని), మరికొందరు పృథక్త్వ భావంతో (నేను వేరు-భగవంతుడు వేరు అని), ఇంకొందరు విశ్వరూపుడనైన నన్ను అనేక రూపాలలో కొలుస్తారు. (9.15)
- వైదిక క్రతువును నేనే, యజ్ఞాన్ని నేనే, పితృదేవతలకు పెట్టే నైవేద్యాన్ని నేనే. రోగాలను నయం చేసే ఔషధాన్ని నేనే, పఠించే మంత్రాన్ని నేనే, హోమంలో వేసే నెయ్యిని నేనే, హోమాగ్నిని నేనే మరియు హోమము చేసే క్రియను కూడా నేనే. (9.16)
- ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని మరియు తాతను నేనే. తెలుసుకోదగిన పరమ పవిత్రమైన వస్తువును, ఓంకారమును మరియు ఋక్, సామ, యజుర్వేదాలను కూడా నేనే. (9.17)
- పరమ గతిని, భరించేవాడిని, ప్రభువును, సాక్షిని, అందరికీ నివాస స్థానమును, శరణు జొచ్చదగిన వాడిని, నిష్కపటమైన మిత్రుడిని నేనే. సృష్టికి మూలము, లయము, ఆధారం, నిధి మరియు నాశనం లేని బీజము కూడా నేనే. (9.18)
- నేనే సూర్యుడినై తపింపజేస్తాను. నేనే వర్షాన్ని ఆపుతాను కురిపిస్తాను. ఓ అర్జునా! అమృతము నేనే, మృత్యువు నేనే. సత్ (ఉన్నది/నిత్యం) మరియు అసత్ (లేనిది/అనిత్యం) అన్నీ నేనే. (9.19)
- మూడు వేదాలను అభ్యసించిన వారు, యజ్ఞ శేషమైన సోమరసాన్ని త్రాగి పాపాలను కడిగివేసుకున్న వారు, నన్ను యజ్ఞాల ద్వారా పూజించి స్వర్గలోక ప్రాప్తిని కోరుకుంటారు. అట్టి వారు తమ పుణ్యఫలంగా ఇంద్రలోకాన్ని చేరుకుని, అక్కడ దేవతలు అనుభవించే దివ్యమైన భోగాలను అనుభవిస్తారు. (9.20)
- వారు ఆ విశాలమైన స్వర్గలోక సుఖాలను అనుభవించి, తమ పుణ్యం క్షీణించగానే, తిరిగి ఈ భూమిపై ప్రవేశిస్తారు. ఈ విధంగా వేదోక్త కర్మలను అనుసరిస్తూ, కోరికలతో ఉండేవారు జనన మరణాలనే రాకపోకలను పొందుతుంటారు. (9.21)
- వేరే చింతన లేకుండా, నన్నే ధ్యానిస్తూ ఏ జనులైతే ఉపాసిస్తారో, అట్టి నా యందే ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారి యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా వహిస్తాను. (9.22)
- ఓ కౌంతేయా! ఇతర దేవతలను శ్రద్ధతో కొలిచే భక్తులు కూడా నిజానికి నన్నే పూజిస్తున్నారు. కానీ ఆ పూజ శాస్త్రోక్తమైన పద్ధతిలో జరగడం లేదు. (9.23)
- సమస్త యజ్ఞాలకు భోక్తను మరియు ప్రభువును నేనే. కానీ వారు నన్ను యదార్థంగా తెలుసుకోలేకపోతున్నారు, అందుకే వారు తిరిగి జన్మమృత్యు చక్రంలో పడిపోతున్నారు. (9.24)
- దేవతలను పూజించేవారు దేవతలను చేరుకుంటారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకానికి వెళ్తారు. భూతప్రేతాలను పూజించేవారు వాటినే చేరుకుంటారు. కానీ నన్ను పూజించే నా భక్తులు నన్నే చేరుకుంటారు. (9.25)
- ఎవరైతే నాకు భక్తితో ఒక ఆకును, ఒక పువ్వును, ఒక పండును లేదా కొంచెం నీటిని అర్పిస్తారో, అట్టి పరిశుద్ధాత్ముడు భక్తితో ఇచ్చిన దానిని నేను ప్రీతితో స్వీకరిస్తాను. (9.26)
- ఓ కౌంతేయా! నీవు ఏ పని చేసినా (యత్ కరోషి), ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఏమి దానం ఇచ్చినా, ఏ తపస్సు చేసినా, వాటన్నింటినీ నాకు సమర్పించినట్టుగా చేయు. (9.27)
- ఈ విధంగా సర్వకర్మలను నాకు అర్పించడం ద్వారా, పుణ్యపాప రూపాలైన కర్మ బంధాల నుండి నీవు విముక్తి పొందుతావు. అట్టి సంన్యాసయోగంతో కూడిన మనస్సు కలవాడవై నన్ను చేరుకుంటావు. (9.28)
- సమస్త ప్రాణుల యందు నేను సమంగా ఉంటాను. నాకు ద్వేషించదగిన వాడు కానీ, అత్యంత ప్రియమైన వాడు కానీ ఎవరూ లేరు. కానీ ఎవరు నన్ను భక్తితో భజిస్తారో.. వారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను. (9.29)
- అత్యంత దుర్మార్గుడైనప్పటికీ ఒకడు వేరే చింతన లేకుండా నన్నే ఆశ్రయిస్తే.. అతడిని సాధువుగానే భావించాలి. ఎందుకంటే అతడు సరైన నిశ్చయంతో నా వైపు అడుగు వేశాడు. (9.30)
- ఓ కౌంతేయా! అట్టివాడు త్వరలోనే ధర్మాత్ముడిగా మారిపోతాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా భక్తుడు ఎన్నటికీ నశించిపోడు అని నీవు గట్టిగా చాటి చెప్పు. (9.31)
- ఓ పార్థా! నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే.. వారు పాపపు పుట్టుక గలవారైనా, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా సరే.. వారందరూ పరమ గతిని (మోక్షాన్ని) పొందుతారు. (9.32)
- ఇక పవిత్రులైన బ్రాహ్మణుల గురించి, భక్తులైన రాజర్షుల గురించి చెప్పేదేముంది? (వారు తప్పక మోక్షం పొందుతారు). కాబట్టి, అనిత్యమైన, సుఖం లేని ఈ లోకాన్ని పొందిన నీవు.. నన్నే నిరంతరం భజించు. (9.33)
- నీ మనస్సును నా యందే నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజించుము. నాకు నమస్కరించుము. ఈ విధంగా నన్నే పరమ గతిగా భావించి, నీ ఆత్మను నా యందే లగ్నం చేస్తే.. నిశ్చయంగా నన్నే చేరుకుంటావు. (9.34)