- శ్రీ భగవానుడు పలికెను – ఓ పార్థా! అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై, యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణవిభూతిబల – ఐశ్వర్యాదిగుణయుక్తుడను, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను ఐన నన్ను సమగ్రముగా తెలిసికొను విధమును వినుము. (7.1)
- నేను నీకు విజ్ఞానసహితముగా తత్త్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎఱిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియు మిగులదు. జ్ఞానము – అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభావ మహాత్మ్య రహస్యములతో గూడిన యథార్థతత్త్వజ్ఞానము. విజ్ఞానము – అనగా సగుణ నిరాకార దివ్య సాకార తత్త్వముయొక్క లీలారహస్యగుణమహత్త్వ ప్రభావసహితమైన యథార్థజ్ఞానము. (7.2)
- వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్నుగూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలోగూడ ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్త్వమును అనగా నా యథార్థస్వరూపమును ఎఱుంగును. (7.3)
- ఓ మహాబాహూ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అని నా ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు. (7.4)
- ఓ అర్జున ! ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ’ ప్రకృతి అనియందరు. ఇదిగాక ఈ సంపూర్ణజగత్తును ధరించునట్టి మఱియొక ‘ప్రకృతి’ కలదు. అదియే నా జీవరూప ‘పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకొనుము. (7.5)
- ఓ అర్జునా! సమస్తప్రాణులును ఈ రెండువిధములైన ప్రకృతులనుండియే ఉత్పన్నములగుచున్నవి, ఈ జగత్తుయొక్క ప్రభావమూ (పుట్టుకయూ) ప్రలయమూ (లీనమగుటయూ) నావలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూలకారణము. (7.6)
- ఓ ధనంజయా! నాకంటెను పరమకారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్రమణులవలె నాయందే కూర్చబడియున్నవి. (7.7)
- ఓ అర్జునా! జలములో రసతన్మాత్రను నేనే. సూర్యచంద్రులలో కాంతిని నేనే. వేదములన్నింటిలోను ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. (7.8)
- పృథ్వియందు పవిత్రగంధతన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని (చైతన్యమును) తాపసులలో తపస్సును నేనే. (7.9)
- ఓ పార్థా! సమస్త భూతములకును నన్ను సనాతన (శాశ్వత) మైన బీజముగా ఎఱుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. (7.10)
- ఓ భరతశ్రేష్ఠా! బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, భూతములన్నింటియందును (సమస్తప్రాణులయందును) ధర్మమునకు విరుద్ధముగాని (శాస్త్రసమ్మతమైన) కామమును నేనే. (7.11)
- సాత్త్విక, రాజస, తామస భావములన్నియును నా నుండియే కలుగుచున్నవని తెలిసికొనుము. కాని, యథార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. (7.12)
- ఈ జగత్తు అనగా ప్రాణిసముదాయము అంతయును గుణములయొక్క కార్యరూపములైన సాత్త్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను, శాశ్వతుడను ఐన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. (7.13)
- నా మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని, కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి, సంసారసముద్రము నుండి బయటపడగలరు. (7.14)
- మాయలో చిక్కుపడుటవలన విపరీత జ్ఞానమునకు లోనైనవారును, ఆసుర ప్రవృత్తిగలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. (7.15)
- ఓ భరతశ్రేష్ఠా! అర్జునా! శుభకర్మలను ఆచరించుచు సుఖసంపదలను కోరుకొనువారు (అర్థార్థులు), శారీరిక మానసిక సంతాపములకు గురియైన ఆర్తులు, ఐహికవిషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్త్వజ్ఞానమును పొందుటకు ఇచ్ఛగలవారు (జిజ్ఞాసువులు), పరమాత్మప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. (7.16)
- ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగ నన్ను (నాతత్వమును) తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. (7.17)
- ఈ చతుర్విధభక్తులందఱును ఉదారులే. (అనగా భగవంతునియందు విశ్వాసమునుంచి, ఎల్లప్పుడును అతనినే సేవించుచు ఉండువారు.) కాని, జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తనమనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును. ఈవిధముగా అతడు నాయందే స్థితుడు. (7.18)
- అనేకజన్మలపిదప జ్ఞానియైనవాడు (భగవత్తత్త్వమును ఎఱిగినవాడు) సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. (7.19)
- నానావిధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయినవారిజ్ఞానము హరింపబడును. వారు తమతమస్వభావములకు అనుగుణముగా వారివారి (ఆయా) నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. (7.20)
- సకామభక్తుడు ఏయేదేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయాదేవతలయందే భక్తిశ్రద్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదును. (7.21)
- అట్టి సకామభక్తుడు తగిన భక్తిశ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్పలితముగ నా అనుగ్రహము వలననే ఆ దేవతద్వారా తను కోరుకొనిన భోగములను అతడు తప్పక పొందగలడు. (7.22)
- కాని ఈ సకామభక్తులు (అల్పబుద్ధులు) పొందెడి ఫలములు గూడ నశ్వరములు. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. కాని, భక్తులు ఏ విధముగా ఆరాధించినను (వారి వాంఛలనేగాక) చివరకు నన్నే పొందుదురు. (7.23)
- నేను శాశ్వతుడను. సర్వోత్తముడను, ఇంద్రియములకును, మనస్సునకును గోచరింపనివాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక, ఇట్టి సచ్చిదానందఘనపరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జననమరణచక్రములోబడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. (7.24)
- నా యోగమాయచే ఆవరింపబడియున్నందున నేను అందరికిని గోచరింపను. కనుక, అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలిసికొనలేరు. (అనగా నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు). (7.25)
- ఓ అర్జునా! గతకాలమునకు చెందినట్టివియు, వర్తమాన (ప్రస్తుత) కాలము నందున్నట్టివియు ఐన చరాచర ప్రాణులన్నింటిని నేను ఎఱుగుదును. అంతేకాదు రాబోవుకాలమున ప్రభవించు (జన్మించు) ప్రాణులనుగూర్చియు నేను ఎఱుగుదును. కాని, నాయందు భక్తిశ్రద్ధలుగలవారుతప్ప వేరెవ్వరును నన్ను ఎఱుగజాలరు. (7.26)
- భరతవంశీ! ఓ అర్జునా! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషములవలన కలిగిన సుఖ దుఃఖాదిద్వంద్వములప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. (7.27)
- కాని, నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషులపాపములు రూపుమాసిపోవును (నశించును). అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాదిద్వంద్వ రూపమోహములనుండి విముక్తులయ్యెదరు. దృఢనిశ్చయముగల్గిన అట్టి భక్తులే అన్నివిధముల నన్ను భజింతురు. (7.28)
- నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త-అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు. (7.29)
- అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతోపాటు అందరికినీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు. (7.30)