- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా (కోరకుండా), ఏది తన కర్తవ్యమో (చేయవలసిన పని) అట్టి కర్మను ఎవడైతే చేస్తాడో.. అతడే సంన్యాసి మరియు అతడే యోగి. కేవలం యజ్ఞాగ్నిని వదిలేసినవాడు (నిరగ్నిః) కానీ, పనులు మానేసినవాడు (అక్రియః) కానీ సంన్యాసి/యోగి కాలేడు. (6.1)
- దేనిని ‘సంన్యాసం’ అని పిలుస్తారో, దానినే ‘యోగం’ అని కూడా తెలుసుకో ఓ పాండవా! ఎందుకంటే, లౌకిక కోరికలను వదులుకోనివాడు ఎవడూ యోగి కాలేడు. (6.2)
- యోగ స్థితిని అధిరోహించాలనుకునే మునికి నిష్కామ కర్మ సాధనంగా చెప్పబడింది. అదే యోగ స్థితిని పొందిన వానికి ప్రశాంతత సాధనంగా చెప్పబడింది. (6.3)
- ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల యందు మరియు కర్మల యందు ఆసక్తిని కలిగి ఉండడో.. అట్టి అన్ని సంకల్పాలను వదిలేసినవాడిని ‘యోగారూఢుడు’ అని అంటారు. (6.4)
- తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మనమే మిత్రుడము మరియు మనకు మనమే శత్రువులము. (6.5)
- మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. (6.6)
- మనస్సుని జయించిన యోగులు – శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు – ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. (6.7)
- జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు. (6.8)
- మేలుకోరేవారు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యస్థులు, ద్వేషించదగినవారు, బంధువులు, సాధువులు మరియు పాపాత్ముల పట్ల సమానమైన బుద్ధిని కలిగి ఉండేవాడే అందరిలోనూ శ్రేష్ఠుడు. (6.9)
- యోగి ఎల్లప్పుడూ ఒంటరిగా, ఏకాంత ప్రదేశంలో ఉంటూ.. మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని, ఎటువంటి ఆశలు లేనివాడై, ఏ వస్తువుల మీద మమకారం లేకుండా తన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. (6.10)
- పరిశుభ్రమైన ప్రదేశంలో, తనకు అనుకూలమైన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరుచుకోవాలి. అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. దానిపై క్రమంగా కుశలు, జింక చర్మము, వస్త్రము ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ఆ ఆసనంపై కూర్చుని, మనస్సును ఏకాగ్రం చేసి, చిత్తమును మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని.. తన ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చేయాలి. (6.11-12)
- శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి. (6.13-14)
- ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నా యందు ఉన్నట్టి మోక్షమే అంతిమంగా గల పరమ శాంతిని పొందుతాడు. (6.15)
- ఓ అర్జునా! అతిగా తినేవాడికి, అస్సలు తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి మరియు అస్సలు నిద్రపోకుండా ఎప్పుడూ మేల్కొని ఉండేవారికి యోగము సిద్ధించదు. (6.16)
- కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. (6.17)
- నిగ్రహించబడిన మనస్సు ఆత్మయందే స్థిరంగా ఉంచి, సమస్త కోరికల యందు నిరాశక్తుడై ఉండే వారినే యోగస్థితిలో ఉన్నారని అంటారు. (6.18)
- గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు, ఆత్మ ధ్యానంలో స్థిరముగా ఉండును. (6.19)
- యోగ సాధన ద్వారా నిరోధించబడిన చిత్తము ఎక్కడైతే ప్రశాంతతను పొందుతుందో, ఎక్కడైతే తన శుద్ధమైన బుద్ధి చేత ఆత్మను దర్శిస్తూ తనలోనే తాను తృప్తిని పొందుతాడో…ఇంద్రియాలకు అందక కేవలం పరిశుద్ధమైన బుద్ధికే అందే అనంతమైన సుఖాన్ని ఎక్కడైతే పొందుతాడో, అట్టి స్థితిలో స్థిరంగా ఉన్న యోగి పరమ సత్యం నుండి ఎన్నటికీ చలించడు. ఏ స్థితిని పొందిన తర్వాత అంతకంటే గొప్ప లాభం మరొకటి లేదని భావిస్తాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు గొప్పదైన దుఃఖం కూడా అతడిని చలింపజేయదో…దుఃఖంతో కూడిన సంసార సంబంధం నుండి విడదీయబడిన దానినే ‘యోగం’ అని తెలుసుకో. అట్టి యోగాన్ని విసుగు చెందని మనస్సుతో, నిశ్చయమైన పట్టుదలతో సాధించాలి. (6.20-23)
- సంకల్పాల వల్ల పుట్టిన కోరికలన్నింటినీ పూర్తిగా వదిలివేసి, మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుండి నియంత్రించాలి. ధైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా ఉపశాంతిని పొందాలి. మనస్సును ఆత్మయందే నిలిపి, ఆ సమయంలో వేరే దేనినీ ఆలోచించకూడదు. (6.24-25)
- చంచలమైనది, అస్థిరమైనది అయిన మనస్సు ఎక్కడికెక్కడికి పారిపోతుందో , అక్కడి నుండి తిరిగి తెచ్చి నిరంతరం ఆత్మ మీదనే కేంద్రీకరించాలి. (6.26)
- ప్రశాంతమైన మనస్సు కలవాడు, రజోగుణం అణిగిపోయినవాడు, పాప రహితుడు మరియు బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఉత్తమమైన సుఖం లభిస్తుంది. (6.27)
- ఈ విధంగా ఎల్లప్పుడూ తనను తాను పరమాత్మతో అనుసంధానం చేసే పాపరహితుడైన యోగి, బ్రహ్మానుభూతి చేత కలిగే అనంతమైన సుఖాన్ని సులభంగా పొందుతాడు. (6.28)
- యోగముతో కూడిన మనస్సు కలవాడు, అంతటా సమదృష్టి కలవాడు… తనను అన్ని ప్రాణులలోనూ, అన్ని ప్రాణులను తనలోనూ చూస్తాడు. (6.29)
- ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. (6.30)
- అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అభేద భావంతో ఎవరు భజిస్తారో, అట్టి యోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా యందే ఉంటాడు. (6.31)
- సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, మరియు ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. (6.32)
- అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. (6.33)
- ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, ఇంద్రియాలను కలచివేసేది, బలమైనది, మరియు మొండిది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. (6.34)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ మహాబాహో! మనస్సును అదుపు చేయడం కష్టమే అన్నది నిస్సందేహం. కానీ, ఓ కౌంతేయా! అభ్యాసము మరియు వైరాగ్యము చేత అది నిగ్రహించబడుతుంది. (6.35)
- మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు అని నా అభిప్రాయము. (6.36)
- అర్జునుడు పలికెను: ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి? (6.37)
- ఓ మహాబాహో! యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటినీ కోల్పోయి, విడిపోయి చెదిరిన మేఘం వలె నశించిపోతాడా? (6.38)
- ఓ కృష్ణా! నా ఈ సందేహాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవాడు నీకంటే వేరొకడు ఎవరూ లేరు. (6.39)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవానికి ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వినాశనం లేదు. మంచిని చేసేవాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు. (6.40)
- యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొంది, అక్కడ చాలా ఏళ్ళ పాటు సుఖంగా ఉండి.. ఆ తర్వాత పవిత్రమైన ఆలోచనలు గల, ఐశ్వర్యవంతులైన వారి ఇంట్లో జన్మిస్తాడు. (6.41)
- లేదా బుద్ధిమంతులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. లోకంలో ఇటువంటి జన్మ లభించడం అత్యంత దుర్లభమైనది. (6.42)
- ఓ కురునందనా! ఇటువంటి జన్మ పొందిన తరువాత, వారు తమ పూర్వ జన్మకు సంబంధించిన బుద్ధి సంస్కారాలను తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు. (6.43)
- వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా, పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్శించబడుతారు. ఇటువంటి సాధకులు సహజంగానే, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. (6.44)
- ప్రయత్నంతో సాధన చేసే యోగి, పాపాలను కడిగివేసుకుని, అనేక జన్మల తర్వాత సిద్ధిని పొంది, చివరకు పరమ గతిని పొందుతాడు. (6.45)
- యోగ సాధకుడు తపస్సు చేసేవారికంటే, శాస్త్ర జ్ఞానం కలవారికంటే మరియు ఫలాపేక్షతో కర్మలు చేసేవారికంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జునా! నీవు యోగివి కావాలి. (6.46)
- అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. (6.47)