- అర్జునుడు పలికెను – ఓ పురుషోత్తమా! బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగానేమి? అధిభూతము అని దేనికి పేరు? అధిదైవము అని దేనిని అందురు? ఓ మధుసూదనా! ‘అధియజ్ఞము’ అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నముచేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు? (8.1-8.2)
- శ్రీ భగవానుడు పలికెను – బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి – అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మయందురు. (8.3)
- ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! ఈశరీరములో అంతర్యామిగా ఉన్న నేనే- వాసుదేవుడనే అధియజ్ఞమును. (8.4)
- అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే (నాస్వరూపమునే) పొందును. ఇందేమాత్రము గూడ సందేహము లేదు. (8.5)
- కౌంతేయా! మనుష్యుడు అవసానదశయందు ఏఏభావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. (8.6)
- కావున ఓ అర్జునా! నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును (కర్తవ్యకర్మను) కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిల్పియున్నచో నిజముగా (నిస్సందేహముగా) నన్నే పొందెదవు. (8.7)
- మనస్సును ఎటూ పోనీయక (వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండ) నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. (8.8)
- సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును, అణువుకంటెను సూక్ష్మమైనవాడును, అందరిని ధరించి పోషించువాడును, అచింత్యరూపుడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును ఐన సచ్చిదానంద ఘనపరమేశ్వరుని స్మరించువాడగు…అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటీ మధ్యమున ప్రాణములను స్థిరముగా నిల్పి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును, పరమపురుషుడును ఐన పరమాత్మనే చేరును. (8.9-8.10)
- వేదవిదులైన విద్వాంసులు ఆ సచ్చిదానందఘనపరమాత్మను శాశ్వతుడు (అక్షరుడు) అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్న్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమునుగూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. (8.11)
- సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు (సహస్రారమునందు) స్థిరమొనర్చి, పరమాత్మధ్యానమునందే నిమగ్నుడై (ఉన్నవాడు),…..అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను, నిర్గుణబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగ మొనర్చువాడు పరమగతిని (మోక్షమును) పొందును.(8.12-8.13)
- పార్థా! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్ను స్మరించుచు, సతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజముగానే నేను లభింతును. (8.14)
- పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. (8.15)
- అర్జునా! బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్తలోకములును పునరావృత్తములు. కౌంతేయా! (ఈలోకములన్నియును కాలమునకు పరిమితమైనవి. కాని నేను కాలాతీతుడను) కనుక నన్ను చేరినవారికి పునర్జన్మ యుండదు. (8.16)
- వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక ‘పగలు’ అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రియనియు తెలిసిన యోగులు కాలతత్త్వమును నిజముగా ఎఱిగినవారు. (8.17)
- చరాచరప్రాణులన్నియును బ్రహ్మయొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తమునుండి అనగా బ్రహ్మయొక్క సూక్ష్మశరీరమునుండి ఉత్పన్నములగును. (ప్రకటితములగును). మఱల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభసమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. (8.18)
- పార్థా! ఈభూత(ప్రాణి) సముదాయమే ప్రకృతివశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. (8.19)
- ఆ అవ్యక్తముకంటెను పరమైన విలక్షణమైన సనాతన (శాశ్వత) మైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు (నిత్యుడే). (8.20)
- ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన – అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మఱల తిరిగిరారు. (8.21)
- ఓ పార్థా! సమస్త భూతములు (ప్రాణులు) ఆపరమాత్మయందే అంతర్గతములై యున్నవి. ఆ సచ్చిదానంద ఘనపరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై (పూర్ణమై) ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. (8.22)
- ఓ భరతశ్రేష్ఠా! ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మఱియు ఏకాలమునందు దేహత్యాగము చేసినవారు తిరిగివచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను, అనగా రెండు మార్గములను తెలిపెదను. (8.23)
- బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయమార్గముద్వారా బ్రహ్మపదప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన(పగలు)శుక్లపక్ష ఉత్తరాయణ – అభిమాన దేవతలు కొనిపోయి, పరమపదమును చేర్చుదురు. (8.24)
- అట్లే సకామకర్మయోగులు ధూమ్రమార్గముద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామకర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన -అభిమానదేవతలు కొనిపోయి, స్వర్గాదిలోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమసజ్యోతిని పొంది, అనగా తమశుభకర్మ ఫలములను అనుభవించి, తిరిగి భూలోకమును చేరుదురు. (8.25)
- ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణమార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహారప్రసిద్ధి గలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్లువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయానమార్గమున వెళ్లువారు తిరిగివచ్చి జననమరణచక్రములో పడుదురు. (8.26)
- ఓ పార్థా! ఈ విధముగా ఈ రెండు మార్గములతత్త్వములను తెలిసికొన్నయోగి మోహితుడు కాడు. కావున అన్నికాలముల యందును సమత్వబుద్ధిరూపయోగ యుక్తుడవు కమ్ము. అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. (8.27)
- ఈ తత్త్వరహస్యమును ఎఱిగిన యోగి వేదపఠనమువలనను, యజ్ఞదాన తపశ్చర్యాదులవలనను కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతనపరమపదమును చేరును. (8.28)