First Mundaka
Chapter I
1.1.1 ఓం. దేవతలలో బ్రహ్మాదేవుడు మొట్టమొదట ఉద్భవించాడు. జగత్తు సృష్టికర్తా, రక్షకుడూ ఆయనే. సమస్త జ్ఞానాలకూ ఆధారభూతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన తన పెద్దకుమారుడైన అథర్వునకు ఉపదేశించాడు.
1.1.2 బ్రహ్మదేవుని నుండి పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అథర్వుడు అంగిరునకు బోధించాడు. అంగిరుడు భరద్వాజగోత్రుడైన సత్యవహునికి దానిని బోధించాడు. అతడు అంగిరసునకు బోధించాడు. ఈ విధంగా ఆ జ్ఞానం గురువునుంచి శిష్యునికి పరంపరగా అందచేయబడింది.
1.1.3 ఉత్తమ గృహస్థుడైన శౌనకుడు, అంగిరసుని శాస్త్రోక్తరీతిగా సమీపించి, “దైవసమానుడా! దేనిని తెలుసుకో గలిగితే ఈ సమస్తమూ తెలుసుకో బడుతుంది?” అని అడిగాడు.
1.1.4 అంగిరసుడు శౌనకునితో ఇలా అన్నాడు: “ఉత్కృష్టమూ మరియు సామాన్యమూ అని జ్ఞానం రెండు రకాలు. రెండింటినీ తెలుసుకోవాలని భగవదనుభూతి పొందిన మహాత్ములు చెబుతారు.”
1.1.5 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, శబ్దశాస్త్రం, వ్యాకరణం, నిఘంటువు, ఛందస్సు, ఖగోళశాస్త్రం, జ్యోతిషం వంటివి సామాన్యమైన జ్ఞానానికి చెందినవి. అవినాశియైన భగవంతుడు ఏ జ్ఞానంచే పొందబడుతున్నాడో అది అత్యున్నతమైన జ్ఞానం.
1.1.6 ఆ భగవంతుని దర్శింప సాధ్యంకాదు, అర్థంచేసుకోవడానికి సాధ్యంకాదు, ఆయనకు ఉత్పత్తి లేదు. ఆయన రంగు లేనివాడు. ఆయనకు కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు లేవు. ఆయన శాశ్వతమైనవాడు. అసంఖ్యాక రూపాలు సంతరించుకొన్నవాడు, సర్వత్రా వ్యాపించినవాడు, అత్యంత సూక్ష్మమైనవాడు, అవినాశి, సృష్టికి మూలకారణమైనవాడు. జాగృత చైతన్యులు ఆయనను సర్వత్రా చూడగలరు.
1.1.7 సాలెపురుగు ఏ విధంగా తనలోనుండి సాలెగూడు దారాలను వెలికితీయడమూ, తిరిగి తనలోనికే తీసుకోవడమూ చేస్తుందో, ఏ విధంగా భూమిలోనుండి చెట్టుచేమలు ఉద్భవిస్తున్నవో, సజీవుడైన మనిషినుండి ఏ విధంగా వెంట్రుకలు పెరుగుతున్నాయో, ఆ విధంగానే అవినాశియైన భగవంతుని నుండి ఈ జగత్తు ఉద్భవిస్తుంది.
1.1.8 భగవంతుడు తపస్సుచే పెరుగుతాడు. మొదట ఆయనలో నుండి మూల ప్రకృతి వెలువడింది. అందులో నుండి ప్రాణం, తరువాత మనస్సు, పంచ భూతాలు, లోకాలు, కర్మలు, ప్రారబ్ధ కర్మలు అన్నీ ఉద్భవించాయి.
1.1.9 భగవంతుడు సర్వమూ తెలిసినవాడు, సర్వులనూ ఎరిగినవాడు. ఆయన తపస్సు జ్ఞానమయమైనది. ఆయన నుండి బ్రహ్మదేవుడూ, పేర్లూ, రూపాలూ, ఆహారమూ ఉద్భవించాయి.
Chapter II
1.2.1 మంత్రాలలో ఋషులు దర్శించిన కర్మలన్నీకూడా సత్యమే. అవి మూడు వేదాలలో ఎంతో ప్రశంసించబడ్డాయి. సత్యప్రియులైనవారు వాటిని ఎల్లప్పుడూ ఆచరించాలి. ఈ లోకంలో ప్రశస్తంగా జీవించడానికి మార్గం ఇదే.
1.2.2 జ్వలిస్తూ ఉన్న అగ్ని జ్వాలలు లేస్తూ ఉన్నప్పుడు రెండు ప్రక్కలకు మధ్య ఆహుతులను సమర్పించాలి.
1.2.3 దర్శమ్, పూర్ణమాసం, చాతుర్మాస్యం, అగ్రాయణం, వైశ్వ దేవ కర్మ మొదలైన కర్మలు లేకుండా, అతిథులను ఆహ్వానించకుండా, సముచిత రీతిలో కాకుండా ఒక వ్యక్తి అగ్నిహోత్రం చేస్తే అతడికి ఏడు లోకాలలోనూ నాశనమే మిగులుతుంది.
1.2.4 కాలి, కరాలి, మనోజవా, సులోహితా, సుధూమ్రవర్ణా, స్ఫులింగినీ, విశ్వరుచీ అనే ఏడూ పైకెగసి ప్రకాశంతో మండే అగ్నియొక్క ఏడు నాలుకలు అవుతాయి. అగ్నికి ఏడు నాలుకలున్నాయి. ఇవి నిజానికి అగ్నియొక్క ఏడు గుణాలు. కాలి = నలుపు; కరాలి = భయంకరం; మనోజవా = మనోవేగం గలది; సులోహిత = ఎరుపు; సుధూమ్రవర్ణా = పొగతో కూడినది; స్ఫులింగినీ = నిప్పురవ్వలతో కూడినది; విశ్వరుచీ దేవీ = అందంతో సర్వత్రా వ్యాపించేది.
1.2.5 దేదీప్యమానమైన ఈ అగ్ని నాలుకలలో తగిన సమయంలో ఆహుతులను సమర్పించి ఎవరు కర్మలు చేస్తాడో, అతణ్ణి ఆ ఆహుతులు, సూర్యుని కిరణాలమల్లే ఒక్కడే అయిన దేవతల ప్రభువు నివసించే స్థానానికి తీసుకువెళతాయి.
1.2.6 ప్రకాశించే ఆ ఆహుతులు “రండి, రండి” అని అతణ్ణి ఆహ్వానించి, ఉపాసించి, “ఈ స్వర్గం మీరు చేసిన సత్కర్మల ఫలితంగా లభించింది” అని మధురంగా మాట్లాడి సూర్యుని కిరణాల ద్వారా అతణ్ణి తీసుకుపోతాయి.
1.2.7 పద్దెనిమిది పేర్లతో నిర్వర్తించబడే ఈ యాగాలు దృఢంకాని తెప్పలను పోలినవి. ఎందుకంటే ఇవి సాధారణమైన కర్మలను ప్రాతిపదికగా తీసుకొన్నవి కనుక వీటిని శ్రేష్ఠమైనవిగా ఎంచి ఆనందించే మూఢులు పదే పదే వార్ధక్యానికీ, మృత్యువుకీ లోనవుతున్నారు.
1.2.8 ప్రాపంచికత మధ్యలో జీవించే మూర్ఖులు తమను తెలివిగలవారమనీ, పండితులమనీ ఎంచి, వార్ధక్యం మరణం వంటి వాటికి లోనై కొట్టు మిట్టాడుతారు. గుడ్డివానిచే దారిచూపించబడే గుడ్డివారి మల్లే వీరు పదే పదే జనన మరణ సుడిగుండంలో చిక్కుకొని ఉంటారు.
1.2.9 పరిపక్వత చెందని వారు ప్రాపంచికతలో అనేక విధాలుగా మునిగి ఉంటున్నారు. తాము లక్ష్యాన్ని సాధించినట్లుగా భావించే వారు నిజాన్ని తెలుసుకోలేరు. వారు అనురక్తితో కర్మలు చేసేవారు. కనుక దుఃఖంపొంది, పుణ్యం తీరిపోగానే స్వర్గం నుండి క్రిందికి పడిపోతున్నారు.
1.2.10 ఈ పరమ మూర్ఖులు యాగాలు, సత్కర్మలే సమస్తం అని భావిస్తారు. అంతకు మించినది దేనినీ వారు తెలుసుకోలేరు. స్వర్గలోకాలలో పుణ్యఫలాన్ని అనుభవించిన తరువాత వారు ఈ భూమి లేక అంతకంటే హీనమైన లోకాలను పొందుతారు.
1.2.11 ఇంద్రియ నిగ్రహం గల, తెలివితేటలు సంతరించుకొన్న విద్వాంసులు, భిక్షాటన వ్రతులు, అరణ్యంలో శ్రద్ధతో కూడిన తపోమయ జీవితం గడుపుతారు. వారు ప్రారబ్ధ కర్మలను అధిగమిస్తారు. అలాంటివారు ఉత్తరాయన మార్గం గుండా మరణరహితమైన, అవినాశియైన భగవంతుని పొందుతున్నారు.
1.2.12 మహాత్ములు తాము కర్మల ఫలంగా పొందిన లోకానుభవాలను మొదట విచారించి చూడాలి. తత్ఫలితంగా, “కర్మలచేత భగవంతుని పొందలేము, వైరాగ్యం చేతమాత్రమే అది సాధ్యం” అని గ్రహించి వైరాగ్యం సంతరించుకోవాలి. తరువాత భగవంతుని తెలుసుకోవడానికి వేదవిదుడు, భగవంతునిలో నెలకొన్నవాడు అయిన గురువును చేత సమిధలు పుచ్చుకొని ఆశ్రయించాలి.
1.2.13 చక్కగా ప్రశాంతత పొందిన మనస్సుగల, ఇంద్రియనిగ్రహం గల విద్యార్థి గురువును సమీపించినప్పుడు, అవినాశియైన సత్యరూపుడైన భగవంతుని తెలుసుకోవడానికి మార్గాన్ని అతడు అవగాహన చేసుకొనే రీతిలో గురువు ఉపదేశించాలి.
Second Mundaka
Chapter I
2.1.1 సౌమ్యుడా! ఇది నిజం. జ్వాలలు లేస్తున్న మంటనుండి అదే స్వభావం గల వేలాది నిప్పురవ్వలు ఏ విధంగా ఉద్భవిస్తాయో, ఆ విధంగానే అవినాశియైన భగవంతుని నుండి అనేక రకాలైన ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. ఆయనలోనే లయమూ అవుతున్నాయి.
2.1.2 భగవంతుడు జ్యోతిర్మయమైనవాడు, నిరాకారుడు, హృదయంలో నెలకొన్నవాడు, లోపలా వెలుపలా నిండిన వాడు, జననం లేనివాడు, ప్రాణం లేనివాడు, మనస్సు లేనివాడు, పునీతుడు, ఉన్నతుడు, ప్రకృతికంటే శ్రేష్ఠమైనవాడు.
2.1.3 ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, సమస్తాన్ని భరిస్తున్న భూమి అన్నీ ఆ భగవంతుని నుండే ఉద్భవించాయి.
2.1.4 ఆ భగవంతునికి స్వర్గమే శిరస్సుగా విరాజిల్లింది. సూర్యచంద్రులు కళ్లు; దిశలు చెవులు; వెలువడ్డ వాక్కు వేదాలు; గాలి, ప్రాణం; జగత్తు మనస్సు; భూమి కాళ్లు; ఆ భగవంతుడే సకల జీవరాసులలోను కొలువుదీరి ఉంటున్నాడు.
2.1.5 ఆ భగవంతుని నుండి దేవలోకం ఉద్భవించింది. సూర్యుడు ఆ దేవలోకాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. చంద్రుని నుండి మేఘాలు ఆవిర్భవించాయి. భూమ్మీద పెరిగే చెట్టుచేమలు మేఘాల కారణంగా పుట్టుకొచ్చాయి. పురుషుడు స్త్రీ యందు రేతస్సు విడవడం ద్వారా జీవులు ఉద్భవించాయి. ఈ విధంగా ఆ భగవంతుని నుండే అనేక రకాలైన జీవులు ఉద్భవిస్తున్నాయి.
2.1.6 వేదాలు, సామగానాలు, మంత్రాలు, సంస్కార విధులు, యజ్ఞాలు, అనేక రకాల కర్మలు, దక్షిణలు, కాలం, యజ్ఞకర్తలు, చంద్రుడు వృద్ధిపొందించే సూర్యుడు దహించే లోకాలన్నీ, ఆ భగవంతుని నుండే ఉద్భవించాయి.
2.1.7 అనేక రకాలైన దేవతలు, సాధ్యులు, మానవులు, జంతువులు, పక్షులు, ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలు, వరిధాన్యం, యవధాన్యం, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం, కర్తవ్యాలు అన్నీ ఆ భగవంతునిలో నుండి ఆవిర్భవించాయి.
2.1.8 ఆ భగవంతుని నుండే ఏడు ఇంద్రియాలు, ఏడు జ్వాలలు, ఏడు ఇంధనాలు, ఏడు ఆహుతులు అన్నీ ఉద్భవించాయి. హృద్గుహలో ప్రాణం, క్రియాశీలత్వం వహించే జీవులు, జీవించే ఏడు లోకాలు ఆయన నుండే ఉద్భవించాయి. అన్నింటినీ ఏడేడుగా ఆయనే సృష్టించారు.
2.1.9 ఆ భగవంతుని నుండే సముద్రాలు, పర్వతాలు అన్నీ ఉద్భవించాయి. అనేక నదులూ ఆయన నుండే ఉద్భవించి ప్రవహిస్తున్నాయి. చెట్టుచేమలు అన్నీ ఆయన నుండే ఆవిర్భవించాయి. ఈ విధంగా సమస్త ప్రకృతి చేత ఆవరించబడి ఉన్నది ఆత్మ.
2.1.10 సౌమ్యుడా! భగవంతుడే ఈ సమస్తంగా విరాజిల్లుతున్నాడు. కర్మలు, తపస్సు వంటివి మాత్రమే కాదు, సర్వశ్రేష్ఠమూ, అమృత స్వరూపమూ ఐన బ్రహ్మంగా ఉంటున్నదీ ఆయనే. హృద్గుహలో నెలకొని ఉన్న ఆయనను తెలుసుకొన్నవాడు అజ్ఞాన బంధాల నుండి ఈ జన్మలోనే విడివడు తున్నాడు.
Chapter II
2.2.1 ఆ ఆత్మ ప్రకాశమానమైనది, అత్యంత సమీపంలో ఉన్నది! హృద్గుహలో నెలకొన్నది. జీవితంలో ఉత్కృష్ట లక్ష్యం ఆ ఆత్మే. కదిలేవి, శ్వాసించేవి, రెప్పలల్లార్చేవి అన్ని జీవరాసులు ఆ ఆత్మలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. స్థూలమైనది సూక్ష్మమైనది అదే. పరమోతృష్ట జ్ఞానానికి అతీతమైనది అది. (అనుభవం ద్వారా తెలుసుకో దగ్గది కాబట్టి) ఉత్కృష్టమైన ఆ ఆత్మనే తెలుసుకోవాలి.
2.2.2 సౌమ్యుడా! ఆ ఆత్మ తేజోమయమైనది, అణువుల్లో కల్లా అణువైనది (సూక్ష్మాతి సూక్ష్మమైనది). లోకాలు జీవరాసులు దాన్లోనే నెలకొని ఉన్నాయి. ఆ ఆత్మ అవినాశి. ఆ ఆత్మే భగవంతుడు. ప్రాణం, వాక్కు, మనస్సు సర్వమునూ. అది సద్వస్తువు, అమరమైనది. తెలుకోదగినది తెలుసుకో.
2.2.3 సౌమ్యుడా! ఉపనిషత్తులు అనే మహాస్త్రమైన ధనుస్సును పుచ్చుకొని, వాటిపై ధ్యానం అనే పదునెక్కిన బాణాన్ని సంధించి, భగవత్ చింతనలతో నిండిన మనస్సనే వింటినారిని లాగి లక్ష్యాన్ని భేదించాలి. ఆ లక్ష్యమే భగవంతుడు. ఆయనను తెలుసుకో.
2.2.4 ఓంకార మంత్రం విల్లు, ఆత్మ బాణం, భగవంతుడే లక్ష్యం అని చెప్పబడుతోంది. బాణాన్ని ఎక్కుపెట్టేవాడు ఏమరుపాటు లేని మనస్సుచే లక్ష్యాన్ని ఛేదించాలి; బాణం లక్ష్యాన్ని ఛేదించి లక్ష్యంతో ఒకటైపోయేట్లు భగవంతుడితో మమేక మవ్వాలి.
2.2.5 దేవలోకం, భూమి, అంతరిక్షం మరియు మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు అన్నీ ఎవరిలో నెలకొని ఉన్నవో ఆ ఏకైక ఆత్మను తెలుసుకోండి. తక్కిన మాటలు కట్టిపెట్టండి. అమరత్వానికి సంసార సాగరాన్ని దాటటానికి వారధి ఇదే.
2.2.6 రథచక్రంలోని ఇరుసులో ఆకులన్నీ చేరి ఉన్నట్లు ఎక్కడ నాడులు కలసి ఉన్నాయో అక్కడ ఆత్మ ఉన్నది. ఆ హృదయంలో ఆత్మ అనేక రీతుల్లో పనిచేస్తోంది. ఓం అనే మంత్రం మూలంగా ఆత్మను ధ్యానం చేయండి. అంధకారాన్ని దాటి ఆవలి గట్టుకు వెళ్లాలనుకునే మీకు శుభమగుగాక!
2.2.7 భగవంతుడు సర్వమూ తెలిసినవాడు, సమస్త జ్ఞాన రూపమైనవాడు, ఆనంద రూపుడు, అవినాశి. ఈ జగత్తు ఎవరి మహిమో ఆ భగవంతుడు జ్యోతిర్మయమైన హృదయంలో లోపల బయట ఆత్మగా విరాజిల్లుతున్నారు. మనస్సుగా అమరి ప్రాణానికి శరీరానికి మార్గదర్శకత్వం వహిస్తారు. హృదయంలో నెలకొని ఉండి శరీరం యావత్తు వ్యాపించి ఉన్నారు. వివేక వైరాగ్యాలు కలిగినవారు తమ కుశాగ్ర బుద్ధితో ఆయనను తెలుసుకొంటున్నారు.
2.2.8 ఉన్నతమైనది, నిమ్నమైనది అంటూ సమస్తంగా విరాజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు తొలగిపోతాయి; అన్ని సందేహాలూ సమసిపోతాయి. ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి.
2.2.9 బంగారు రంగులో ప్రకాశిస్తున్న శ్రేష్ఠమైన కోశంలో భగవంతుడు ఉన్నాడు. ఆయన నిర్మలుడు, నిర్మవయవి (అంగ వర్జితుడు) పావనుడు, వెలుగులన్నింటికీ వెలుగైనవాడు. ఆత్మజ్ఞానులు ఆయనను తెలుసుకొంటారు.
2.2.10 అక్కడ సూర్యుడు ప్రకాశించడం లేదు; చంద్రుడూ నక్షత్రాలూ ప్రకాశించడంలేదు; మెరుపులు కూడా మెఱవవు. అలాంటప్పుడు ఈ అగ్ని మాత్రం ఎలా ప్రజ్వలించ గలదు? ప్రకాశించే ఆత్మను అనుసరించే సమస్తమూ ప్రకాశిస్తున్నది. సమస్తమూ ఆత్మ తేజస్సుచే ఉద్భాసిస్తున్నది.
2.2.11 ముందు, వెనుక, కుడిప్రక్క, ఎడమప్రక్క, క్రింద, పైన అంటూ జగత్తు అంతటా సర్వోత్కృష్టుడైన, అమరుడైన భగవంతుడే నెలకొని ఉన్నాడు.
Third Mundaka
Chapter I
3.1.1 ఎన్నడూ విడిపోని, ఒకే విధమైన రెండు పక్షులు ఒకే చెట్టు మీద కూర్చుని ఉన్నవి. వాటిలో ఒకటి పండును ఆస్వాదిస్తూ తింటున్నది. మరొకటి తినకుండా చూస్తూ ఉన్నది.
3.1.2 జీవుడు, ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు. జీవుడు, అంటే మనిషి అజ్ఞానంలో మునిగిపోయి, భ్రాంతిచెంది దుఃఖీస్తున్నాడు. ఆరాధనీయమైన తన ఆత్మనూ దాని మహిమనూ అతడు ఎప్పుడు చూస్తాడో అప్పుడు దుఃఖాలనుండి విడివడుతున్నాడు.
3.1.3 బంగారు వన్నెతో ప్రకాశించేవాడు, సర్వకర్తా, ప్రభువు బ్రహ్మకు ఆదియునూ అయి విరాజిల్లే ఆత్మను ఎప్పుడు ఒకడు చూస్తాడో అప్పుడు ఆ మహనీయుడు పుణ్యపాపాలను విదిలించివేసి దుఃఖరహిత సర్వోత్కృష్టమైన సమస్థితి పొందుతాడు.
3.1.4 సకల జీవరాసులకు ఆధారంగా ఉండి భాసిస్తున్నది ఆత్మయే అన్న విషయం గ్రహించిన వ్యక్తి వాక్కును నిగ్రహించి, ఆత్మలో తృప్తిపడే వాడుగా, ఆత్మలో ఆనందించే వాడుగా ఉంటూ కార్యాలను (విహిత కర్మలను) నిర్వర్తిస్తాడు. ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడు అతడే!
3.1.5 ఇంద్రియ నిగ్రహం కలవారూ తమలోని పాపకర్మఫాలన్ని తొలగించు కుని పునీతులైనవారూ జ్యోతిర్మయమూ, నిర్మలమూ ఐన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు. సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం నిరంతరాయంగా ఆచరిస్తూ జ్ఞానాన్ని పొందిన వారు ఆత్మను దర్శిస్తారు.
3.1.6 సత్యమే జయిస్తుంది; అసత్యం కాదు, సత్యమే ఆధ్యాత్మిక జీవితానికి ఉత్తమ గతులకు మార్గం. కోరికలు నెరవేరిన ఋషులు సత్య మార్గాననే వెళుతూ ఉంటారు; పరమసత్యం యొక్క పరమ పదాన్ని చేరుకుంటారు.
3.1.7 అపరిమితం, తేజోమయం, ఉహాతతమై ఒప్పారుతుంది ఈ ఆత్మ సూక్ష్మమైన వాటిలోకల్లా సూక్ష్మమైనది. అది దూరమైన వాటిలో కల్లా అమిత దూరమైనది, అదే సమయంలో ఇక్కడ అతి సమీపంలో ఉంది. హృద్గుహలో ప్రకాశిస్తున్న ఆత్మను మహనీయులు ఈ జన్మలోనే దర్శిస్తారు.
3.1.8 ఆ ఆత్మ కళ్లతోనో, వాక్కుతోనో, ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకో బడదు; తపస్సు వలనో, కర్మల చేతనో లభించదు. జ్ఞానానికి ఆలవాలమై వెలసే సూక్ష్మబుద్ధితో పావనత, పరిశుద్ధతను సంతరించుకొన్న మనస్సుచే దానిని ధ్యానించే వ్యక్తి నిరవయవమైన ఆ ఆత్మను చూడగలుగుతాడు.
3.1.9 సూక్ష్మమైన ఈ ఆత్మను మనస్సు చేతనే తెలుసుకోవాలి. శరీరంలో ప్రాణం అయిదు విధాలుగా పనిచేస్తున్నది. ఇంద్రియాలచేత మనస్సు (జ్ఞానం) అవరింపబడి ఉన్నది. ఆ మనస్సు నిర్మలమైనప్పుడు ఆత్మ అందులో భాసిస్తుంది.
3.1.10 పావనతనూ పరిశుద్ధతనూ సంతరించుకొన్న మనస్సుతో ఒకడు ఏ ఏ లోకాలను అనుకొంటాడో ఆయా లోకాలను పొందుతాడు; ఏ ఏ వస్తువులను కోరుకొంటాడో ఆ వస్తువులను పొందుతాడు. అందువలన ఐశ్వరాన్ని కోరేవాడు ఆత్మజ్ఞానిని పూజించాలి.
Chapter II
3.2.1 సకల జగత్తుకు, శ్రేష్ఠమైన ఆవాసమైనవాడు, పావన కాంతిచే ప్రకాశించేవాడూ అయిన ఆ భగవంతుణ్ణి ఆత్మజ్ఞానులు తెలుసు కొంటున్నారు. నిష్కాములూ, ప్రాజ్ఞులూ ఆయనను ఆరాధించి, జన్మ రహితమైన స్థితిని పొందుతున్నారు.
3.2.2 ఇంద్రియ భోగాలను పదేపదే మననం చేస్తూ వాటికోసం పరితపించేవాళ్ళు ఆ కోరికలు తీరడానికిగాను అనుగుణమైన జన్మలను పొందుతారు. కోర్కెలు నెరవేరిన ఆత్మజ్ఞానికి అన్ని కోర్కెలూ ఇక్కడే సమసిపోతాయి.
3.2.3 ప్రసంగాల వలననో, మేధాశక్తి వలననో, ఎన్నిటినో వినడం వలననో ఈ ఆత్మను పొంద సాధ్యం కాదు. ఎవరు దానిని పొందడానికి మనోవ్యాకులత చెందుతాడో అతడు మాత్రమే దానిని పొందుతాడు. ఆ ఆత్మ తన స్వభావాన్ని అతడికి వెల్లడిచేస్తుంది.
3.2.4 ఈ ఆత్మను బలహీనులైన వారు పొందలేరు; అజాగ్రత్తతోనో, చిహ్నాలులేని తపస్సుల చేతనో ఈ ఆత్మ పొందబడదు. ఏ మహానీయుడు (మనోవ్యాకులతతోనూ, శారీరక మనోబలాలచే జనించిన స్థైర్యంతో) ప్రయత్నిస్తాడో ఆతడు భగవంతుని ఆవాసమైన ఈ ఆత్మను పొందుతాడు.
3.2.5 ఈ ఆత్మజ్ఞానాన్ని సంతరించుకొన్న ఋషులు ఆత్మజ్ఞానంలో తృప్తిచెందిన వారుగా, ఆత్మలో నెలకొన్నవారుగా నిస్సంగులుగా, ప్రశాంతతలో నెలకొన్నవారుగా అవుతున్నారు. జాగృతి చెందిన, ధ్యానంలో నెలకొన్నవారు సర్వవ్యాపియైన, సమస్తమూ అయిన భగవంతుని పొంది, ఆయనలోనే నెలకొంటున్నారు.
3.2.6 వేదాంతపు సత్యపదార్థాన్ని చక్కగా గ్రహించిన, సన్న్యాస జీవితం ద్వారా మానసిక పావనతను సంతరించుకొన్న, ఇంద్రియ నిగ్రహం సాధించిన సర్వులూ అమరులు అవుతారు. దేహం పతనం చెందిన తరువాత పూర్తిగా విముక్తులై బ్రహ్మ లీనులవుతారు.
3.2.7 పదిహేను కళలూ వాటి స్థావరాలకు చేరుకొంటాయి. అధిష్ఠాన దేవతలు తమ దేవతలలో లీనమవుతారు. కర్మలూ, చైతన్య రూపమైన ఆత్మ పరమైన అక్షయతత్త్వంలో లీనమవుతాయి.
3.2.8 పొంగి ప్రవహించే నదులు తమ పేర్లను ఆకారాలను కోల్పోయి సముద్రంలో కలిసిపోతాయి. సత్యాన్ని గ్రహించిన వ్యక్తి, అదేవిధంగా తన పేరు మరియు ఆకృతినుంచి విడివడి, సర్వోత్కృష్టమైన జ్యోతిర్మయమైన పరబ్రహ్మతత్త్వాన్ని సంతరించుకొంటాడు.
3.2.9 సర్వోత్కృష్ట పరతత్త్వాన్ని గ్రహించిన వాడు ఆ పరతత్త్వంగానే అయిపోతాడు. బ్రహ్మజ్ఞాని కాని వారెవరూ అతడి వంశంలో జన్మించరు. అతడు దుః ఖరహితుడూ పాపరహితుడూ అవుతాడు. హృదయ గ్రంథులనుండి విడివడుతాడు.
3.2.10 వేదమంత్రాలలో ఈ విధంగా చెప్పబడి ఉంది: సాధనలు అనుష్ఠించే వాడు, వేదపారంగతుడు, భగవంతునిలో నెలకొన్నవాడు, శ్రద్ధావంతుడు, తననే ఆహుతిగా అర్పించి జీవించే వాడు, శాస్త్రరీత్యా శిరోవ్రతాన్ని ఆచరించే వాడు – ఇటువంటి వారికి మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించాలి.
3.2.11 పూర్వం ఈ సత్యాన్ని అంగీరసుడనే ముని ఉపదేశించాడు. సాధనలు అనుష్ఠించనివాడు ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయకూడదు. ఈ ఉపనిషత్ సత్యాలను అందించిన మహామునులకు నమస్సులు, మహామునులకు నమస్సులు.
Related Articles: