- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! ఒక్కసారి కర్మ సన్న్యాసమును, మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. (5.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను – కర్మసన్న్యాసము, కర్మయోగము అను ఈ రెండును పరమకళ్యాణదాయకములే. కాని, ఈ రెండింటిలోను కర్మసన్న్యాసముకంటెను కర్మ యోగము సాధన యందు సుగమమగుటవలన శ్రేష్ఠమైనది. (5.2)
- మహాబాహో! (అర్జునా!) ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎఱుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వందములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. (5.3)
- సాంఖ్య, కర్మ యోగములు వేర్వేఱు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా (విధివిధానముగా) ఆచరించినవాడు ఆ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. (5.4)
- జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మ యోగులు కూడా పొందుదురు. జ్ఞాన యోగ ఫలమును, కర్మ యోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును. (5.5)
- కానీ, ఓ అర్జునా! కర్మ యోగమును అనుష్ఠింపక, సన్న్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటియందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననము చేయు కర్మ యోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. (5.6)
- మనస్సును వశము నందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మ యోగి, కర్మలను ఆచరించుచున్నను, ఆ కర్మలు వానిని అంటవు. (5.7)
- తత్వజ్ఞునుడైన సాంఖ్య యోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు (తినుచు), నడచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడపుచు ఉన్ననూ, నేను (ఏ కొంచెమూ) ఏమియు చేయట లేదు అని భావించును. అంతేకాదు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరచుచు, మూయుచు ఉన్ననూ ఇంద్రియములు తమ తమ విషయముల యందు ప్రవర్తించుచున్నవనియు (తానేమియు చేయుటలేదనియు)భావించును. (5.8-9)
- కర్మలనన్నింటిని భగవదర్పణము గావించి, ఆసక్తి రహితముగ కర్మలనాచరించు వానిని, పాపములు తామరాకు పై నీటి బిందువువలే అంటవు. (5.10)
- కర్మ యోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. (5.11)
- నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి, భగవత్ప్రాప్తిరూపమైన శాంతినిపొందును. కర్మ ఫలాసక్తుడైనవాడు, ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. (5.12)
- అంతఃకరణమును అదుపులోనుంచుకుని, సాంఖ్య యోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింపజేయకయే, నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి, సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించును. (5.13)
- పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కాని, వారి కర్మలను కాని, కర్మ ఫల సంయోగమును కాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును. (5.14)
- సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులతగుచుందురు. (5.15)
- కాని, వారి (ప్రాణుల) అజ్ఞానము ఆ పరమాత్మ తత్త్వ జ్ఞానప్రాప్తిద్వారా తొలగిపోవును. అప్పుడు, ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె (సూర్య ప్రభవలె) దర్శింపజేయును. (5.16)
- తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై , సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావంతో స్థితులై, తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాప రహితులై, పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. (తద్రూపము అంటే – ఆ పరమాత్మయే ఆనందమయము అనీ, దానికంటే భిన్నమైనది మరొక వస్తువు లేదనీ ఎల్లప్పుడూ మననము చేస్తూ, ఆ పరమాత్మ యందే మనస్సు అభిన్న భావముతో నిశ్చలముగా ఉండటమే మనస్సు తద్రూపము పొందుట అగును) (5.17)
- జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి యుందురు. (5.18)
- సర్వత్ర సమభావ స్థిత మనస్కులు ఈ జన్మ యందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోష రహితుడు, సముడు. సమభావ స్థిత మనస్కులయిన జ్ఞానులు ఆ పరమాత్మ యందు స్థితులు. కనుక, వారు త్రిగుణాతీతులు. జీవన్ముక్తులు. (5.19)
- ప్రియలాభములకు పొంగిపోని వాడును, అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగిపోని వాడును, స్థిరమైన బుధ్ధి గలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మ వేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితి యందుండును. (5.20)
- ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మ స్థిత ధ్యానజనితమైన సాతత్త్వికాత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగము నందు అభిన్న భావ స్థితుడై అక్షయానందమును అనుభవించును. (5.21)
- విషయ – ఇంద్రియ సుఖముల సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగ లాలసులకు సుఖములుగా భాసించినను, అవి నిస్సందేహముగా దుఃఖ హేతువులే. అట్టి భోగములు ఆది అంత్యములు గలవి. అనగా, అనిత్యములు. కావున, ఓ అర్జునా! వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. (5.22)
- ఈ శరీరమును విడువక ముందే అనగా, జీవించియుండగానే కామ క్రోధాదుల ఉద్వేగములను అదుపులోనుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి, యోగి. (5.23)
- (సమిష్టి) అంతరాత్మ యందే సుఖించువాడును, ఆత్మ యందే రమించు వాడును, ఆత్మజ్ఞానియైనవాడును అగు సాంఖ్యయోగి, సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై, బ్రహ్మనిర్వాణమును పొందును. (5.24)
- పాపరహితులును, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృతిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసినవారును అగు బ్రహ్మ వేత్తలు బ్రహ్మనిర్వాణమును పొందుదురు. (5.25)
- కామక్రోధ రహితులును, చిత్త వృత్తులనుజయించిన వారును అయి , పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. (5.26)
- బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోకి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్ష పరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధ రహితుడై సదా ముక్తుడగును. (5.27-28)
- భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్త లోకములకును, లోకేశ్వరులకును అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అనగా అవ్యాజ దయాళువు. పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్త్వమును ఎఱిగిన భక్తునకు పరమ శాంతి లభించును. (5.29)