- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! శాస్త్రవిధిని త్యజించి, భక్తిశ్రద్ధలతో యజ్ఞములను గాని, దైవపూజలనుగాని కొందఱు చేయుచుందురు. వారినిష్ఠ (వారి విధానము) సాత్త్వికమా? రాజసమా? తామసమా? (17.1)
- శ్రీ భగవానుడు పలికెను – శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను. వినుము. (17.2)
- ఓ అర్జునా! మనుష్యులందఱి శ్రద్ధయు వారి అంతః కరణరీతులకు తగినట్లు ఉండును. ప్రతివ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానినిబట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలిసికొనవచ్చును. (17.3)
- వారిలో సాత్త్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు. (17.4)
- దంభము, అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్ధముగా మనఃకల్పితమైన ఘోరతపస్సులను ఆచరించుచు (ఉందురు). (17.5)
- శరీరములయందున్న జీవులను, మరియుఅంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృశింప జేయువారు అజ్ఞానులైన ఆసురస్వభావము గలవారని యెఱుంగుము. (17.6)
- మనుష్యుల స్వభావములను అనుసరించి, వారికి ఇష్టములైన ఆహారములు గూడ మూడు విధములుగా ఉండును. అట్లే ఆయామనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములుగూడా మూడేసి విధములుగానే ఉండును. వాటినిగూర్చి వేర్వేఱుగా విశదపరచెదను వినుము. (17.7)
- ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగువానిని అభివృద్ధి పఱచునవియు, పాలు, చక్కెర మొదలగు రసపదార్థములును, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధపదార్థములును, ఓజస్సును అభివృద్ధి పఱచు స్థిరపదార్థములును, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములును సాత్త్వికులకు ఇష్టమైనవి. (17.8)
- చేదు, పులుపు, ఉప్పు, కారము, రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కల్గించునవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజసస్వభావము గలవారికి ఇష్టములగును. (17.9)
- అర్ధపక్వములైన పదార్థములు (సరిగా ఉడకనివి, పండనివి) రసహీనములు, దుర్గంధయుక్తములు (చెడువాసన గలవి) పాసిపోయినపదార్థములు, ఎంగిలివస్తువులు, అపవిత్రపదార్థములు మొదలగునవి తామసస్వభావము గలవారికి ఇష్టమైనవి. (17.10)
- శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొన బడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండ చేయబడునదియు ఐన యజ్ఞము ‘సాత్త్వికయజ్ఞము’ అనబడును. (17.11)
- కాని, ఓ అర్జునా! సరియైన నిష్టలేకుండ ఆడంబరము కొఱకు ఆచరింపబడునదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అగు యజ్ఞము ‘రాజసయజ్ఞము’ అని ఎఱుంగుము. (17.12)
- శాస్త్రవిధిననుసరింపనిదియు, అన్నదాన రహిత మైనదియు, మంత్ర హీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము ‘తామసయజ్ఞము’ అనబడును. (17.13)
- దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత(శౌచము) నిరాడంబరత్వము, అహింస అనునవి శారీరక తపస్సులు. (17.14)
- ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చునదియు, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్రపఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి యన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. (17.15)
- మనఃప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి మొదలగునవి యన్నియును మానసికతపస్సులు. (17.16)
- పూర్వోక్తములైన (శారీరిక, వాచిక, మానసిక) తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని ‘సాత్త్విక తపస్సులు’ అని యందురు. (17.17)
- ఇతరులనుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొఱకును, స్వాభావికముగాగాని, కల్పితముగా గాని చేయబడునవియు, అనిశ్చితఫలములను గాని, క్షణికఫలములనుగాని ఇచ్చునవియు ఐన తపస్సులను ‘రాజసతపస్సులు’ అని యందురు. (17.18)
- మొండిపట్టుదలతో మనోవాక్కాయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను ‘తామసతపస్సులు’ అనియందురు. (17.19)
- ‘దానము చేయుటయే కర్తవ్యము’ అనుభావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాదికాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యముగలవారు, రోగులు మొదలగువారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైనవారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము ‘సాత్త్వికదానము’అనబడును. (17.20)
- కాని ప్రత్యుపకారమును ఆశించిగాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును ‘రాజసదానము’ అనియందురు. (17.21)
- సద్భావము లేకుండా, దానము పుచ్చుకొనువారి యెడల గౌరవాదరములను చూపక, తృణీకార భావములతో ఛీకొట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును చేయబడు దానమూ, దేశకాలో చితము కాని దానమూ, ‘తామసదానము’ అని యనబడును. (17.22)
- ఓమ్, తత్, సత్ అని మూడు విధములగు పేర్లు సచ్చిదానందఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మనుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. (17.23)
- కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ‘ఓమ్’ అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. (17.24)
- మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదానతపశ్చర్యలను ‘ఇదియంతయును పరమాత్మదే’ అను భావముతో ‘తత్’ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. (17.25)
- ఓ పార్థా! ‘సత్’ అను పరమాత్మనామము సత్యభావమునందును, శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమకర్మాచరణము నందును ‘సత్’ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. (17.26)
- యజ్ఞదానతపఃక్రియలయందలి నిష్ఠ, ఆస్తిక, భావమును ‘సత్’ అనియందురు. పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మలనుగూడ ‘సత్’ అని యందురు. (17.27)
- ఓ అర్జునా! శ్రద్ధ (విశ్వాసము) లేకుండ చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మ లన్నియును, ‘అసత్’ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పిదపగాని ఎట్టి ప్రయోజనమూ కలుగదు. (17.28)