- “ఇంతమంది అన్నం తింటుంటే నీకు ఒక్కడికీ భోజనం లేకుండా లేదు. ఇది ఆస్తి గల సంస్థకాదు. దీనికి చందా ఇవ్వమని ఎవరినీ యాచించింది లేదు. ఎట్లా వస్తుందో ఎట్లా నడుస్తుందో మనకు అనవసరం. ఇది అందరిల్లు, ఇక్కడ ఎవరి ఓపికకు తగినట్లు వారికి పని ఉంటుంది. ఊరికేనే ఎవరూ కూర్చోరు. ఉండడానికి ఆశ్రయమిచ్చేదల్లా ఆశ్రమమే కాని ఇది ఆశ్రమం కాదు; ఇల్లు. అనేక రకాల మనస్తత్త్వాలు ప్రవృత్తులూ కల వ్యక్తులందరూ కలసి వున్న ఇల్లు. అందరితో సర్దుకు పోవటమనేదీ, అందరిలో లోపాలుచూడక మంచినే చూడటం అనేదీ అంత తేలికైన విషయాలుకావు. నువ్వు ఇక్కడ ఉండటానికి నాకు అభ్యంతరం లేదు.”
- ‘మేము ఆ వందమందినే భరించలేకపోతున్నాం. మీరు ఇక్కడ ఇంత మందికీ భోజనం-‘
“అక్కడ మీరు పెడుతున్నారు నాన్నా. ఇక్కడ వాళ్ళ అన్నంవాళ్ళు తిని వెళ్తున్నారు.” - ఈ ఆవరణలోని చిత్రమే అది! ఎవరు లేకపోతే ఆపని జరగదను కుంటామో ఆ వ్యక్తి లేకపోయినా ఆ పనిమాత్రం ఏదో విధంగా జరిగి తీరుతుంది.
- ‘అసలు పూజ అంటే ఏమిటి?’
“తన తల పగలకొట్టటమే.” - “నేను బయల్దేరడానికి చాలా వుండాలి. ఒక గుడిసెలోకి వెళ్తే వాడికి పెట్టటానికి తీసుకెళ్ళాలి. వాడు ఏమీ అమ్మకు పెట్టకపోతినే అనుకోకుండా వాడిచేత పెట్టించుకోవడానికి నేనే తీసుకెళ్ళాలి.”
- అమ్మ తనను రమ్మని కోరిన వారింటికేకాక రమ్మనమని కోరటానికి సందేహించిన వారింటికి కూడా వెళ్ళారు.
- “ఆయనది దూషణ అని మన మనొద్దు. ఆయన వాళ్ళను దూషిస్తుంటే మనం ఇంకొకళ్ళను దూషిస్తున్నాం. ఆయన పబ్లిగ్గా చెబుతున్నాడు. మనం లోపల వుంచుకుంటున్నాం. ఆయన పద్ధతే మంచిది”
- “కోపం, రోషం, కక్ష – యీ మూడింటినీ నువ్వు వదిలిపెట్టు వాళ్ళు నిన్నొదిలి పెట్టేటట్లు నేచేస్తా -”
- పీట వున్నదని అమ్మ కూర్చోబోతే పీట ఎవరో తీసేయడం మూలాన పడిపోయారు. తల గోడకు కొట్టుకుంది. వెల్లకిలా పడడంలో శరీరం ముద్దగా అయింది. ఒక అరగంట వరకూ మాట్లాడలేకపోయారు. పీట తీసినవారు తనది తప్పయిపోయింది అని ఏడుస్తూంటే అమ్మ – “దెబ్బలు తగలవలసిన యోగ్యత ఉన్నప్పుడు ఎవరూ అడ్డురాలేరు. ఏదో రూపంగా తగలక తప్పదు. ఇందులో ఒకరు చేసేదేముంది?”
- “నువ్వు అదలించకుండా బెదరించకుండ పని చేయించుకోవాలి. వాళ్ళతో బోతూ వాళ్ళను మనవైపు తిప్పుకోవాలి-” ‘నాక్కూడాతగుల్తోందమ్మా నీ మాట.’
“ఎవర్ని గురించి అంటున్నా అందరికీ తగుల్తుంది.” - “పూర్తి అస్తికుడయినా నాస్తికుడే: పూర్తి నాస్తికుడయినా అస్తికుడే. వాడికి దైవం తప్ప రెండోది నాస్తి. వీడికి ‘నేను’ తప్ప రెండోది నాస్తి.”
- “అవసరాన్ని బట్టీ సమయాన్నిబట్టీ కోపం ఉన్నట్లు కనిపించాలి. కాని నాకు ఏనాడూ మీమీద(కోపం) రాదు. అది వచ్చిన మర్నాడు నేను అమ్మనూ కానూ; మీరు ఇట్లానూ ఉండరు.”
- “మనం ఉన్నంతలో సరిదిద్దటం నేర్చుకోవాలి. లేనిదానిని గురించి ఆలోచించే కంటే ఉపాయంగా ఉన్నదానిలో పెద్దజీవితం గడపాలి-“
- “ఆయనకు పొయ్యి పెత్తనం. నీకు కఱ్ఱపెత్తనం పనికిరాదు. ఆడదిగాని, మగవాడుగానీ ఎవరి హద్దుల్లో వారుంటే బాగుంటుంది గానీ అతిక్రమించినప్పుడు ఆ సంసారం అభాసుగానే ఉంటుంది.”
- “ఏభాషా కలవంది సంస్కృతమేమో… కానీ సంస్కృతం అన్నిటిలోనూ కలుస్తుంది.”
- “ఒకనాటిమాట మరొకనాటికి బాటవుతుంది.”
- “అనుభవం అన్నది నీది. శాస్త్రం శాస్త్రకర్తది. శాస్త్రం నీ అనుభవంకాదు, ఇంకొక డనుభవించి రాసింది.”
- “తెలుసుకున్నది తెలివి. అనుభవించేదే అనుభవం.”
- “మనం పదిమంది చెప్పింది వినగలం కానీ ఒక్కరు చెప్పినట్లు మాత్రమే చెయ్యగలం.”
- “మీరు కూలి యిచ్చేవాళ్ళను తినటం కాదు; కూలిని తినాలి.”
- ‘రాధ మడమలు పట్టుకుని ఎందుకు పాడేడమ్మా?’
“నాదం రావటానికి కొన్ని మూలస్థలాలు ఉంటయ్ – కొన్ని స్థలాలనుండి కావాలన్నంతగా శక్తి చాలకపోతే సీసా బిరడా తీయటానికి చేతిలో శక్తి సరిపోకపోతే కాళ్ళమధ్య శక్తితోనూ…. అదీ చాలకపోతే పొట్టకు ఆనించీ ఆ శక్తి నుపయోగించి తీసినట్టే ఇదీ.” - ‘ప్రధాని ఎవరయితే బాగుంటుంది?’
“అన్ని దేశాల్ని గురించి ‘మన’ అనుకునే మనస్తత్వం కలవాడయితే బాగుంటుంది.” - “సంస్థ అంటే సమస్తమూ చేరిందేగా? మంచీ చెడూ -అన్నీ.”
- “బాధలు మనం పెట్టటమేమిటి? ఆవతలివాడికి పడే గుణం ఉంటేనే వాడు బాధపడతాడు. సున్నితమైన తత్త్వాలకు ఎంత సుఖపెట్టినా ఎక్కడో ఒక లోటు – బాధ కనిపిస్తూనే ఉంటుంది.”
- “తనను తాను విమర్శించుకోవటం వివేకం.”
“ఇతరులను విమర్శించటం అవివేకం.” - “తనకొరకు చేసేది రాగమూ; ఇతరుల కొరకు చేసేది త్యాగమూ.”
“ప్రేమించటమూ ద్వేషించటమూ తన కొరకే-” - “నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు సలహాకు వస్తాడు.”
- “బానిసకు బాధలెక్కువ. స్వతంత్రుడికి బాధ్యత లెక్కువ.”
- “ఏ ఆధారమూ లేనప్పుడు ధైర్యం దానంతటదే వస్తుంది.”
- “పంచామృతాలనగా ఒకే అమృతం నుండి పంచబడ్డవి.” “పాలూ, పెరుగూ, మీగడా, వెన్నా. నెయ్యి-పంచామృతాలు.’
- “మానవుని నడక నవగ్రహాలమీద ఆధారపడిలేదు. రాగద్వేషాలనే రెండే గ్రహాలమీద. ఆ రెంటికీ ఆధారం ‘నేను’.”
- “మానవుడు తనకు తాను మెప్పించుకున్నప్పుడే ప్రపంచాన్ని మెప్పిస్తున్నాననుకుంటాడు.”
- “తిథులు విధిని మార్చలేవు. విధి అంటే విధానమే.”
- “విధి వర్షంలాంటిది. కొందరికి అనుకూలంగా, కొందరికి ప్రతికూలంగా వ్యవహరిస్తుంది.”
- “తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు కాదు; దైవం తలిస్తేనే తాను తలుస్తాడు.”
- “ప్రశాంతత మనసునుబట్టి కానీ ఊరునుబట్టి కాదుగా?”
“ఈ చోటులో ఏమీ లేదు. ఏ కారణంగా అశాంతి వచ్చిందో ఆ కారణంగానే అశాంతి పోవాలి. చోటుమారితే పోయేదేమీ లేదు.”
“మనస్సు గాయపడ్డది. ఏకారణంతో గాయపడ్డదో ఆ కారణంతోనే మానాలి.” - “కష్టం సుఖం మనస్సునుబట్టి ఉంటుంది. ఈ రెండూ ప్రతీవాడికీ తప్పవు. మనిషీ మనిషి నీడా ఎట్లాగో ఈ రెండూ అట్లాగే తిరుగుతయ్.”
- శ్రుతి నిలవటం లేదమ్మా – “పోనీ – స్మృతి నిలిస్తే చాలు.”
- “మధురస్మృతా? స్మృతే మధురం. అది ఏ స్మృతి అయినా సరే- ఆనందం కానీ దుఃఖం-కాని ఏదైనా కానీ అది గుర్తుకు రావటమే మధురం.”
- “దేవులాడినా దొరకనివాడే దేవుడు. అంతటా వుండేవాడిని ఎక్కడని దేవులాడితే దొరుకుతాడు?”
- “జగన్మాత అంటూ (పూజలు అవీ చేసి) ఆమెను మేల్కోల్పటమంటూ జరిగితే నువ్వే జగన్మాతవు కదూ ?”
- “కమిటీలే కానీ అక్కడ కమిట్మెంట్ లేకపోవటం వలన ఈ గొడవలన్నీ జరుగుతున్నయ్.”
- ‘మావారు ప్రమోషను గురించి అడగమన్నారమ్మా’ “నా కేమీ తెలీదమ్మా-” ‘లోకమాతవు నీకు తెలియనిదేముంది? మమ్మల్ని అన్నివిధాలా రక్షించాలి. అన్నీ మీరేగా – “అంత విశ్వాసముంటే మాటలే అవసరం లేదు.”
- “బాధలు రావటానికి మార్గం ఉన్నప్పుడు పోవటానికీ ఉంటుంది.నీకీ బాధలెవరిచ్చారో- వాళ్ళే ఆ విముక్తీ కల్పిస్తారు. దానికి సమయం రావాలి.”
- “ఏదీ కావాలనేది అక్కరలేకుండా కావాలి.”
- ‘నీ క్కూడా పెళ్ళి ఎందుకమ్మా?’ “పెళ్ళిలో పెద్దపులి వుందనుకునేవారి భయం పోగొట్టటానికి.”
- “నేను దేనికోసమూ, ఏదీ చేసింది లేదు. ఆరాధన కూడా ప్రత్యేకంగా దైవమొకదాంట్లో ఉన్నదనీ ఆరాధించలేదు మీ అందరినీ ఆరాధించటమూ, మీరందరూ దైవమనుకోవటమే -”
- “నాకు సాధన చేయ్యాలనీ లేదు. చేసిందీ లేదు. నేను ఏనాడు పూజచేసి ఎరుగను. దీపారాధన కూడా చేసి ఎరుగను.”
- “బాధనిపిస్తే కదా సహించటమన్నది ఉండటానికి? బాధపడని వాళ్ళనెవ్వరు బాధపెట్టగలరు? అన్నీ నేను కల్పించుకున్నవేగా అనిపిస్తయ్.”
- “నన్ను ఎవరూ తిట్టి ఏడిపించలేరు: కొట్టి ఏడిపించలేరు. వాళ్ళ మంచితనంతో ఏడిపించగలరు.”
- శాస్త్రిగారు అమ్మ మంచం దగ్గర చాప మీద పడుకున్నారు. ఆయన ‘అమ్మా-‘ అన్నప్పుడల్లా అమ్మ ‘ఆఁ’- అంటూనే ఉన్నారు. అమ్మ రాత్రిపూట నిద్రపోతున్నట్లే పడుకుంటారు. కానీ ఎప్పుడు పిలిచినా పలుకుతూనే ఉంటారు.
- ‘మీ సాధన ఏమిటమ్మా?’
“బిడ్డల్ని కనటమే. (పుట్టినవారందర్నీ తన బిడ్డలనుకోవటమే. చెట్లు పుట్టలూ – సర్వమున్నూ.)” - “నాకు నేర్పు గల ఓర్పు అక్కర్లా. సహజమైన ఓర్పు కావాలి.”
- “హృదయం తెలుసుకోటానికి వాక్కుతో పనిలేదు.”
- “నేను ఆహారాన్ని వదల్లేదు. నన్ను ఆహారం వదిలింది.”
- “మీలో నేను దైవత్వం చూస్తాను. నాలో మీరు మానవత్వం చూస్తారు.”
- “ఇక్కడకు వచ్చిన వాళ్ళు ఎందు కేడుస్తారు?” “పుట్టినప్పుడు ఏడుస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏడుస్తారు. అంటే జీవితంలో నూతనత్వం కలిగినందుకు.”
- ‘మీ దయ ఉంటే ఈ ఒడుదుడుకు లుండవు.’
“నా దయ వున్నా ఒడుదుడుకు లుంటయ్. నా దయ ఒడుదుడుకులే నాన్నా-“ - “అంతా నేనే అనుకుంటున్నప్పుడు ప్రత్యేకించి భక్తులు ఎవరూ?”
- “సహజంలో నుంచి విశేషాన్ని విడదీసి, మళ్ళీ దాన్ని సహజం చేసుకోవాలి.”
- ‘అసలు ఈనోములూ, ఇవన్నీ – ఎందుకమ్మా?’ “అనుక్షణం దైవాన్ని మర్చిపోకుండా ఆరాధించటానికి-”
- “గొప్పకార్యం చేసినా కొద్దికార్యం చేసినా ఒకటే. నడిపించేది ఒకటయినప్పుడు నీ గొప్పతనం లేదు.-”
- “విసనకఱ్ఱను చూసినా ఏ తడపను చూసినా అవి దేనిలో నుంచి తయారయినాయో, ఆ చెట్లూ, ఆ భూమీ, వాటికా రూపం సంకల్పించిన వాడూ నాకు గుర్తొస్తారు.”
- ‘నేను మందుబిళ్ళలు తీసుకుంటే నీకు నొప్పి తగ్గుతుందా అమ్మా?’ – అని శేషగిరిరావుగారు. “నీవు బిళ్ళలు వేసుకుంటే నాకు తగ్గదు; నేను వేసుకుంటే నీకు తగ్గుతుంది గానీ-” అన్నారు అమ్మ.
- “ఆలోచన వచ్చిందని వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎక్కడనుంచి వచ్చిందీ తెలియలేదు. కూర్చుందామనిపించింది; కూర్చున్నాను. ఆ అనిపించింది (ఎవరివల్లో) అర్ధంకావటంలేదు. ఆ అనంతమైన శక్తిని పరిమితిగల (శరీర) ఆకారంలో చూద్దామనే గదా ప్రయత్నం?”
- “ఆలోచనలెట్లా వచ్చినై? ఏదోశక్తి, దైవమో, ఏదో ఒకటి ఏర్పరచాలి. ఆ శక్తికి ఆకారం ఉండాలి కదా? (పూర్వ జన్మ కర్మవల్ల అంటారు. అయితే) మొట్టమొదటి జన్మలోని ఆలోచనలు ఎక్కడ(నుంచి) వచ్చినై? పాప పుణ్యాలు ఉన్నయ్యన్నా- అదే కారణం. ఆ శక్తే కారణం.”
- “తరుణం అంటే తప్పించుకుందామన్నా తప్పనిది. ”
- “ప్రేరణను మీరు ఏదైనా అనండి- ప్రారబ్దం అనికానీ భగవంతుడని కానీ మరేదైనా సరే, లేకపోతే వీటన్నిటికి కారణం మనమే అనండి. అంతా నేనే చేస్తున్నానని కానీ, లేదూ అంతా మనది కాదు, ఏదో శక్తి చేయిస్తుంది. అని కాని అనుకోండి- కానీ కొంత నేనూ కొంత ఏదో శక్తి చేయిస్తుంది అనుకోవటం చిక్కే. ఇందులో ఏదో ఒకటి అనుకుంటే ఫర్వాలేదు.”
- సంకల్పం రావటానికి ఆధారమేఁవిటి?’
“ప్రేరణే – సంకల్పం తరువాత చేసేది ప్రయత్నం.”
‘ప్రేరణకాధారమేఁవిటి?’
“ప్రేరణే దైవం.” - “కాళ్ళూ నడుస్తున్నయ్ కనుక మనమే నడుస్తున్నాం అనుకుంటాము. కాని నడిపిస్తున్న శక్తి అర్థంకావటంలేదు. ప్రేరణ అర్ధంకాదు; ప్రయత్నం అర్థమవుతుంది. (అది దైవానిది; అది కనబడదు ఇది మనది అనిపిస్తుంది.)”
- “పదిరూపాయలు చేతిలోకి వచ్చినప్పుడు ‘అమ్మ ఇచ్చింది’ అనుకుంటు న్నప్పుడు ఆ పదిరూపాయలూ తీసేసినది మటుకూ అమ్మ కాదూ?”
- ‘భగవంతుడికి రూపం యొక్క అవసరమేమిటి? తను చెయ్యదలుచు కున్నవి అక్కడే వుండి ఎందుకు చెయ్యకూడదు?’
- “ఒక నాటకం వ్రాశామనుకో దాన్ని ప్రదర్శించి నప్పుడుండే ఆనందం వింటే ఏముందీ? నామరూప రహితుడే కాదు; సహితుడే అని చెప్పటానికి అవకాశం రూపం. అందరికీ అర్థమై ఆనందించటం కోసం రూపం. రూపం ఉన్నందువలన శక్తి పెరిగేదీ లేదు; తరిగేదీలేదు.”
- “పంచభూతాల సమ్మేళనమే గాయత్రి.”
- “రూపం పురుషుడు; లోని శక్తి ప్రకృతి. రెండూ ఒకదాన్ని విడిచి మరొకటి లేదు.”
- “సమిష్టి యొక్క వ్యష్టిత్వమే ప్రపంచం.”
- “వ్యష్టిత్వమే తప్ప మంచి చెడ్డలంటే- ఏవి? మంచిచెడ్డలంటే హెచ్చుతగ్గులే అనుకుంటాను.”
- “పరిణామమే కానీ నాశనం లేదు.” “రూపాంతరమే కానీ రూప నాశనం లేదు.” “నిర్ణయానికి నిర్ణయించినవాడు కూడా బద్ధుడే.”
- ‘మీ అనుగ్రహం కావాలమ్మా -‘
“అది ఎప్పుడూ ఉంది. మీ పనులవటమూ అనుగ్రహమే. అవకపోవటమూ అనుగ్రహమే.” “మీకు దరిద్రం వచ్చిందని బాధపడవద్దు- ఆ దరిద్రం కూడా నేనే.” - ‘మీ ఆశీర్వచనం కావాలమ్మా -‘
“అది ఎప్పుడూ ఉంటుంది. అయినపనీ కానిపనీ- అంతా ఆశీర్వచనమే.” - “సందేహ నివృత్తి చేసేదే సందేశం.”b”తెలియనిదేదో తెలియజెప్పిన వాడే గురువు. నా యందు గురి గల వాడైనా గురువే (ఎవరికైనా).” “గుర్తు చెప్పినవాడే గురువు.” ఉపదేశం అంటే దైవసన్నిధిని చేర్చటం.
- “కాలువ నిండుగా ప్రవహిస్తున్నా- దాహమయితే దిగటానికి రేవు కావాలి.”
- “బ్రహ్మచర్యమంటే కేవలం పెండ్లి చేసుకోకపోవడం కాదు. బ్రహ్మచర్య మంటే లింగభేదమూ, రూపబేధమూ, స్పర్శభేదమూ లేకుండా ఉండటం.”
- “ఆచరించే వాడికి (బైబిలైనా, గీత అయినా, కొరాను అయినా) ఏదయినా ఒకటే. అది లేనివాడికే ఇన్ని మార్గాలూ. ఇన్ని పుస్తకాల అవసరమూ.. “ఏది చదివినా ఆచరించేవాడికి ఏదైనా ఒకటే. ఆచరించలేనివాడే – దానిలో ఏముందీ, దీనిలో ఏముందీ అని వెతుకుతుంటాడు. కాని చివరకు వెతకటంతోనే సరిపోతుంది.”
- ‘ఆత్మను తెలుసుకోవటానికి మార్గమేమిటి?’
“ఏ మార్గమయినా మంచిదే.”
‘ఏదైనా మీ నోటివెంట చెప్తే ఆ మార్గాన పోదామని …..”
“మీ రెట్లా పోదామనుకుంటారో అట్లాగే చెయ్యండి. ఆత్మకు మార్గమే ముందీ? కనపడే దంతా ఆత్మే అయినప్పుడు మార్గ మెక్కడికనీ?” - “ఏది సాధ్యమైతే అదే తరుణోపాయం. మీకు ఏది సాధ్యమయితే అది చెయ్యండి – దీని వల్లా దాని వల్లా వస్తుందని ప్రత్యేకంగా ఏమీ లేదు మోక్షానికి.”
- “అందరికి తెలియటమే తోస్తున్నది గానీ ఎవరు చేస్తున్నదీ తెలియటం లేదు.
చేద్దాము అనుకున్నది ప్రేరణ; చేసింది క్రియ. క్రియ మనదిగా కనిపిస్తున్నది. కర్త ఎవరో తెలియటం లేదు.
కర్త ఎవరో, క్రియ వారిదే ననిపిస్తుంది నాకు.” - “తోచిందేదో చెయ్యి. తోపింపజేసేవాడు వాడేగా?” ‘అవకాశాన్ని గమనించటం సాధన.”
- “శబ్దమే ఆత్మ (యొక్క) శబ్దం అయినప్పుడు ఇంకా ఈ నామం ఆ నామం అనేముంది?”
- “ఏది చేసినా ఒకటే. అన్ని మంత్రాలు ఒకటే. ఎందులోనైనా ఒకే శక్తి ఉన్నది – పేర్లూ అక్షరాలూ మార్పు తప్ప.” “శబ్దమే మంత్రం. ధ్వని వేరు గానీ శబ్దం ఒకటే.”
- “చరమదశలో ప్రతి మంత్రానికి ఒకే అర్ధం వస్తుంది. ప్రతి వస్తువునూ అదే రూపంగా చూడటమే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే పటమ్ముందు కూర్చోవటం కాదు.”
- “అర్థం తెలిసి అశుద్ధానికి పూజచేసినా వాడికే చెందుతుంది.” (పేడ అశుద్ధం కాదూ? పేడతో గౌరిని చేసి పూజచేస్తున్నాం కదా)
- “డబ్బాలో పసుపుకు నమస్కారం పెడతామా? నీళ్ళతో గడిపి ముద్దగా చేస్తే గౌరి అని దానికి పెడతాం. గోడకు రాచి బొట్లు పెట్టి పోలేరమ్మ అంటున్నాం. ఉపయోగించే పసుపు ఒకటే ఇక్కడా, అక్కడా. కాని సర్వత్రా చూడలేం కనుక పరిమితిలో చూడటంలో ఇవన్నీ – “
- “సర్వత్రా ఉన్న దైవాన్ని గుర్తించ లేనప్పుడు గుడి ఆధారమైనట్లు…
- ‘సాధనకు మంత్రం అవసరమా? ఎంతవరకు ఉపయోగపడుతుంది?’
- “అసలు మంత్రమంటే ఏమిటి? ఓపిక లేనివాడు కఱ్ఱపట్టుకున్నట్లు. మనస్సుతో మనస్సును గుర్తించాలి కనుక మనస్సును మాటల్లో పెట్టి మంత్రం చేసి మనస్సు మంత్రమయింది. మంత్రాన్ని తాను చేస్తున్నాను అనుకుంటూ మనస్సుతో మనస్సును గుర్తించింది. ఓపికలేదనుకో ఓపిక లేనివాడికి కఱ్ఱసాయం చేసినట్లే. మళ్ళీ ఆ కఱ్ఱను పట్టుకోవాలిసింది వాడే.”
- “మంత్రమంటే – వాళ్ళు యిచ్చింది మాటే అయినా నీ మననంతో మంత్రమయింది. అది మంత్రం కాదని నువ్వు అనుకున్నప్పుడు అది నీకు ఒక మామూలు మాటతో సమానంగానే ఉంటుంది.”
- “మంత్రమంటే ఏమిటి? మనస్సే కదా! మననం చేత మంత్రం అవుతుంది.”
- “ఇవన్నీ ఏం లేవు నాన్నా అసలు మంత్రమంటే ఏమిటో తెలిస్తే ఈ సమస్యలే ఉండవు. నేను మనస్సే మంత్రమంటాను. మనకు మనస్సు అంటే ఏమిటో తెలియదు గనుక మంత్రం అని అక్షరాలలో పెట్టి దాని ద్వారా మన శక్తిని మనం అర్థం చేసుకుంటున్నాం.
కొన్ని అక్షరాలను కలిపి దానికో పవిత్రత నిచ్చి నువ్వు మననం చేస్తే అది మంత్రమయింది. నువ్వు ‘కాదు’ అనుకుంటే అవి అక్షరాలేగా దీన్ని అంతా (మంత్రంగా) గుర్తిస్తున్న దెవరూ? నీ మనస్సు, (మరి) అప్పుడు నీ మనస్సే మంత్రం కాలేదూ? ఈ మంత్రం చేస్తే నెత్తి అణుస్తుందనీ, ఆ మంత్రం చేస్తే ప్రమాదం అనీ చెప్తుంటారు కదా- అవి కూడా ఏం లేవు. ఏ మంత్రంలోనైనా ఒకే శక్తి ఉన్నప్పుడు ఇంకా నెత్తి అణచటాలూ, ప్రమాదాలూ ఎక్కడనుండి వస్తయ్? ఈనాడు గురువులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ గురువులేనా? మన మనస్సే గురువు. గుర్తే (గుర్తించిన జ్ఞానమే) గురువు …… మీరు ఏ గురువుల దగ్గరకూ వెళ్ళ నక్కరలేదు. మీరు సాధన చెయ్య యత్నించినా చెయ్యనివ్వకుండా ఏదో బలవత్తర శక్తి అడ్డు వస్తుంది కదా- ఆ అడ్డుపడే శక్తే దైవం. అది ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నాం తరుణం వస్తే ఆ శక్తే మీ సాధనను నడిపిస్తుంది.“ - “నీ మనస్సులో ఎక్కడ లక్ష్యముంటుందో అదే మంత్రం. మనస్సే మంత్రం.”
- “గురువు పరబ్రహ్మ స్వరూపం అనుకున్నప్పుడు ఇంకా ఏ మంత్రమైనా ఎందుకూ? ఫలానా మంత్రం చెయ్యవచ్చుననిగానీ, చెయ్యగూడదనిగానీ ఏమీ లేదు.”
- “మంత్రమంటే భగవంతుని రూపమే –“
- “భావం తెలుసుకుని ప్రవర్తించేదే భార్య. బాధ్యత తీసుకుని భరించేవాడే భర్త “
- “కారణ (జన్యమైన) ప్రేమ పరిమితమైంది. అది కేవలం ప్రేమించే వ్యక్తీ, ప్రేమింపబడే వ్యక్తుల వరకే పరిమితమైంది.”
నమ్మకం
- ‘మీ దర్శనం చేసుకుంటే జబ్బు రహిత మవుతుందని…. ఎన్నాళ్ళనుంచో రావాలనుకుంటుంటే- ఇవాల్టికి రాగలిగాం.’
“ఆ నమ్మకం మీ కున్నదా?”
‘ఆ(‘
“అయితే రహితం కావాలి.” (BG 17.3) - ‘మనస్సు నిలవకపోతే ఏం చెయ్యాలమ్మా?’
“ప్రయత్న మంటూ ఒకటి బయలు దేరిందిగా? మనస్సు నిలుపుకుని దీని ద్వారా ఏదో పొందాలనుకునే ఒక భావం కలిగింది మనస్సులో. అది అంతకు ముందు లేనిది; మధ్యలోనో ఎప్పుడో బయలుదేరింది. ఆ బయల్దేరటానికి క్కారణమైనదే ఎప్పుడో ఒకప్పుడు నీకు (తను యిచ్చి ఉన్న దానిని) ఇస్తుంది. దానిని తరుణం అంటాను నేను. లౌకిక విషయాలకు ఏ శక్తి సహాయపడుతుందో అదే ఆధ్యాత్మికాలనే వాటికి సహాయపడుతుంది.” - “మనస్సు అంతటా ఉంది కదా కేవలం గుండె దగ్గరే కాక, ప్రాణం గూడా శరీరం మొత్తంలో ఎక్కడుందీ అంటే- ఏం చెప్తాము. తడి గుడ్డలో తడి ఎక్కడుందీ అన్నట్లు?
- “మనస్సుతో మనస్సును నేరుగా గుర్తించలేడు గనుక వేరొక దానిని ధ్యేయంగా పెట్టుకుని గుర్తించటం మంత్రజపమంటే.”
- “మనస్సు లయమయ్యే చోటు ఆలయం.”
- “ఏమిటో – ఈ మాహాత్మ్యాలలో వచ్చే నమ్మకం ఎంతసేపు? అసలు మాహాత్మ్యమంటే ఏవిఁటీ?- లీలేగా. ఈ ప్రపంచం సృష్టించటమే మాహాత్మ్యమైనప్పుడు అందులో యివన్నీ ఒక లెక్కా? ఇవి మూర్ఖంగా ఉన్నవాళ్ళకు లక్ష్యం చూపించటం వరకూ ఉపయోగపడతాయ్ కానీ, ఇవే ఆధారం అని నమ్మినప్పుడు – ఇవి లేనప్పుడా నమ్మకం కూడా అట్లాగే పోతుందిగా? ఇట్లా కలిగిన నమ్మకాలు ఎంతకాలం నిలుస్తయ్?”
- “ఒక పావలా పెడితే కర్పూరం వస్తుంది. ఈ కర్పూరం దేనికి తియ్యటం? దానివల్ల ‘జనం అహో వచ్చింది’ అని చెప్పుకోవటానికి ఉపయోగపడేదే కానీ ఇది దేనికీ పనికి వచ్చేది? ఇట్లాగే ప్రతీదీని. కాదా? శక్తి అన్నది నువ్వు చెప్పిన పాములో మాత్రమే ఉన్నదా? ఇంకో దానిలో మాత్రం లేదూ? ఇప్పుడు ఆ బుట్టకు ఆ ఆకారం రావాలంటే ప్రాణశక్తి లేకపోతే రాదు? మన చేతులకు చేసే శక్తి, దానికట్లా అయ్యేశక్తీ, రెండింటికీ ఉన్నయ్. (ఏ)శక్తిలేకుండా ఉన్న వస్తువులే దసలు. అగ్గిపుల్లకు వెలిగే శక్తీ, కర్పూరానికి అంటుకునే శక్తీ, నీకు వెలిగించే ఉద్దేశమూ- ఈ మూడూ కలిస్తేనే అది వెలగ్గలిగేది. ఉన్న శక్తి అంతా ఒకటే కదా? అటువంటప్పుడు ఇవన్నీ దేని కసలు?”
- “ఇప్పుడు ఒక నాటక ముందనుకోండి ఆ నాటకం వ్రాసిన వాడూ -పాత్రను ధరించాల్సి వస్తుంది. అందులో దుఃఖపాత్ర వస్తే – అదీ; ఏ పాత్ర వస్తే అదీ – వేయాల్సిందేగా? తనే వ్రాశానని తనకు తెలుసు. అన్నీ తనకు తెలుసు కాని పాత్రధారణ వ్రాసేటప్పుడు కర్టెన్ తానై. ప్రేక్షకులు తానై, నాటకం తానై. చేయించేది తానే అయి, చేసేదీ తానే అయి అన్నీ తానే అయి – వ్రాస్తాడు. కానీ ఏ పాత్రను వేయాల్సి వచ్చినప్పుడు ఆ పాత్ర వేస్తాడు.”
- “మఱపే మరణం.”
“మరణమంటే పరిణామమే.”
“పరిణామానికి చరమదశ బ్రహ్మ స్వరూపం.”
“తెలిసినవాడికి జన్మల్లేవు. తెలియనివాడికి ఏది ఏమౌతుందో తెలియదు. ఒక జన్మకేది కారణమో అన్ని జన్మలకూ అదే కారణం.”
“జన్మక్కారణం అకారణం.” - “వివాహం చేసుకుని గృహస్థుగా ఆధ్యాత్మిక సాధన చేయటం కోటలో ఉండి యుద్ధం చేయటం. సన్యసించటం కోట విడిచి యుద్ధానికి వెళ్ళటం.”
- “ఆ కోరిక లేని స్థితిని సంపాదించుకోవటానికి ప్రయత్నం సన్యాసం.”
- “బుద్ధుడు వెళ్ళాడని వెళ్ళటం కాదు. ఆయన వెళ్ళినట్లుగా వెళ్ళాలి. ఆయనై వెళితే అందరూ బుద్ధులే.”
- “సన్యాసి కావాలెగానీ పుచ్చుకొనటం కాదు.”
- “నీలో దృఢ విశ్వాసమున్నప్పుడు నువ్వునమ్మిన శక్తే మంచికానీ, చెడుకానీ – అన్నీ చేయిస్తుందనుకుంటావు. ఆ నమ్మకం సరిగా లేనప్పుడు మంచి ఆ శక్తీ, చెడు నీ కర్మ చేయిస్తుంది అనుకుంటావు. ఆ కర్మ కూడా ఆ శక్తిదేగా? ఈ సర్వమూ ఒకే శక్తిచే నడిపింపబడుతున్నప్పుడు కర్మవేరూ, శక్తి వేరూ కాదుగా?”
- “నిష్కామ కర్మకు వర్జ్యకాలం ఉత్తమమైనది.”
- “పురుషకారమూ, దైవసహాయమూ రెండూ ఒకదానివే.”
- “మమకారం అందరికీ ఉంటుంది. భగవంతుడి యందుంటే భక్తుడంటారు.”
- “నిగ్రహం కొరకే విగ్రహారాధన.”
“నిగ్రహం ఉంటే ఏ గ్రహాలూ ఏమీ చెయ్యలేవు.”
“తానెప్పుడూ (వాడి పనేనని) తన శక్తి నుపయోగించటమే ఆరాధన”
“ధారణయే ఆరాధన” - “ఏకాగ్రత అంటే ప్రతి ఆలోచనా, కనపడేవన్నీ ఒకటిగా చూడటమే. ఏది చూచినా, ఎందులోనైనా ఒకే వస్తువును చూడటమే ఏకాగ్రత.”
- “శంకరాచార్యులు స్తోత్రం చేయని దేవుడంటూ లేడు. ‘దేవి’ అంటూ ప్రతి ఒక్కరినీ స్తోత్రం చేశాడు: ప్రతీ ఒక్కరినీ వర్ణించాడు. అందరినీ ఒకే అమ్మలో చూశాడు. (ఆ అమ్మను తనలో చూశాడు) అదే అద్వైతమంటే.”
- “అన్నిటిలోను ఒకటినే చూడటం అద్వైతం.”
- . “సర్వ సంకల్పాలూ తానైతే ఇతరుల మనస్సులోనిది తెలుస్తుంది.”
“సర్వమూ సర్వానికే ఆధారం.” - “ఉన్నది లేనట్లు కనపడటమే భ్రాంతి.”
“ఉన్నది ఉన్నట్లు కనపడటమే లో చూపు.”
“భ్రాంతి అంటే మమకారం.”
“భ్రాంతి వదిలితే బ్రహ్మ.” - “అంతా జీవమయం. నాదృష్టిలో జడమే లేదు.”
- “కర్మ, క్రియ కర్తలోవే”
- “కారణానికి అర్థం తెలిస్తే కార్యాలన్నీ తానే అవుతాడు.”
- “మొదట్లో (అంటే తెలియనప్పుడు) మౌనం. చివర (తెలిసినప్పుడు) మౌనం.”
- “తన్ను తాను గుర్తించినవాడు సర్వాన్ని గుర్తిస్తాడు.”
- “అనాత్మ అని బయల్దేరితేగా ఆత్మ అని తెలిసేది?” ఏది అవునూ, ఏది కాదు అనీ తెల్చుకున్నది వివేకం.”
- “ఈ గోడా ఆ గోడా మధ్యనున్న సందు నిర్వికారం. ఇది ఉండటానికి ఆధారం ఆకారమేగా? ఈ రెండూ గుర్తించిన స్థితి వికారం లేని ఆకారం.”
- “అన్ని రూపాలూ ఒకటేననే స్థాయి రావటమే దైవత్వం.”
- “కర్త, కర్మ, క్రియ ఒకటే .”
- ‘జ్ఞానానికీ ప్రేమకూ సంబంధమేమిటి?’ “ప్రత్తికీ దారానికి ఉండే సంబంధమే. రెండూ ఒకే పదార్థమయినా ప్రత్తిని చూస్తే దారం జ్ఞప్తికి రాదు. దారాన్ని చూస్తే ప్రత్తి జ్ఞప్తికి రాదు.”
- “పతనమా? పతన మనేదీ లేదు. ఒక మెట్టు ఎక్కిన తర్వాత అది నిజమయిన జ్ఞానమయితే మళ్ళీ పోదు.”
- “నేను జగత్తు సత్యమంటాను. మిథ్య అంటే లేదని కాదుగా? మార్పు. మార్పు ప్రతి వస్తువుకూ ఉన్నది. మారేది మారని దాన్లోంచి పుట్టింది”
- “అంతా అయినదీ, అర్థ కానిదీ అద్వైతం.”
- “అన్ని రూపాలు ఆయనవే కనుక రూపరహితుడు.”
- “అన్ని గుణాలూ ఆయనవే కనుక గుణ రహితుడు.”
- “అన్ని నామాలు ఆయనవే కనుక నామ రహితుడు.”
- “అన్ని సంకల్పాలు ఆయనవే కనుక సంకల్ప రహితుడు.”
- “ఉత్తమమైనటువంటిది తనైతే అల్పం తానుకాదా?”
- “ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఎందుక్కాదు?”
- “అన్నం పరబ్రహ్మ మయితే అశుద్ధమో …?”
- “అంతా లేదన్నా సరే- పూర్తిగా ఉన్నదన్నా సరే. ఈ రెంటి స్థితీ ఒకటే.”
- . గోవాడ అక్కయ్య “ఏకాగ్రత కలగటానికి కనుబొమ్మలమధ్య దృష్టినిలిపితే ఏర్పడుతుందంటారు కదా, అది సాధ్యమౌతుందా?-‘ అని అడిగింది.
- “సర్వత్రా ఉన్నదానిమీద దృష్టి నిలపలేవు కనుక ఒక గుర్తులో చెప్పటం ఈ ఫోటోలూ, గుళ్ళూ, మంత్రాలూ ఇవన్నీ ఎందుకు అవసరమో ఇదా అందుకే, లక్ష్యానికి హేతువయినది. అంతేకానీ ఆ కనుబమ్మల మధ్యనే శక్తి ఉన్నదని కాదుగా? అదొక గుర్తు.”
- “శ్వాస ఆగి కూడా బ్రతకవచ్చు. ప్రాణమంటే శ్వాసకాదు.”
- “అవయవాలచేత మనస్సు కట్టుబడేది ప్రాణాయామం. మనస్సు చేత అవయవాలు కట్టు బడేది భక్తి.”
- “ఆధారమాధారమయితే అంతా సహస్రారమే.”
- “నన్ను నీవు కలుపుకోమని పైకి వెళ్ళిందే బ్రహ్మ స్వరూపం- ఉచ్ఛ్వాసం. క్రిందికి దిగిందే – మానవరూపం -నిశ్వాసం”
- “సంసార బాధ్యతలే ఆధ్యాతిక సాధన నాయనా ఆధ్యాత్మిక సాధన అంటే వేరే అదేదో కాదు? నువ్వు చేసే ప్రతీ పని భగవత్సేవయనీ భగవదాజ్ఞానుసారమే ననీ అనుకోగలిగితే యీ సంసారం ప్రతిబంధకం కానేరదు.”
- “వేదాంతమంటే చెప్పేవాడికీ, వినేవాడికీ అర్థంకాదు. నాకు వ్యక్త పరచే భాషలేదు. మీకు అనుభవించే శక్తి లేదు.”
- “అనుభవాన్ని మాటల్లో పెట్టేటప్పటికి యదార్థం మరుగున పడుతుంది.”
- “అనుభవం శాస్త్రాన్నిస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్నివ్వదు.”
- ‘అయితే అమ్మా దాన్ని ఎలాగ తెలుసుకోవడం?’
“తనంతతానే తెలియబడేది వుంది. ఒకడు చూశాడనుకో వాడికి చెప్పనవసరం లేదు. లేదనుకో ఎన్ని పోలికలు ఇచ్చినా వాళ్ళు చూసినట్టనిపించదు. అనుభవించిన దాన్ని రూపకల్పన చేసి చెప్పాలి. అది ఎంత అర్థమవుతుందీ అనేది వినేవారి స్థితిని బట్టి వుంటుంది. ఉన్నదాన్ని ఉన్నట్లు ఎవడూ అర్ధం చేసుకోలేడు.” - “సర్వత్రా అనురాగమే విరాగం,”
“ధ్యాసే ధ్యానం.”
“ముముక్షుత్వమే మోక్షం.” - “సర్వత్రా ఉండే మమకారం మాధవత్వాన్ని గుర్తింపజేస్తుంది.”
- “ఏకత్వం గల సంకల్పమే దైవత్వం.”
- “భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం.”
- “అన్నీ తనే అనేటటువంటి మనస్తత్వమే భగవంతుడు.”
- “విచక్షణ లేని వీక్షణే అనుగ్రహం.”
- “ఎదుటివారిలో దైవత్వాన్ని చూస్తున్నంత సేపూ మనలో దైవత్వం కలుగుతుంది.”
- “సర్వత్రా పూజ్యభావాన్ని చూడగలిగినవారే పూజ్యులు.”
- “దైవం గుర్తించేటట్టు ఎప్పుడూ ఉండడు. సర్వసామాన్యంగా ఉంటాడు.”
- “ఆధారం సాధారణమైనప్పుడు గుర్తించలేము.”
- “దేనిని అయినా సరే పొందటానికి చేసే సాధన తపస్సే. దేనిని అయినా గాఢంగా ఆరాధించటం కూడా తపస్సే.”
- “ఎవరు దగ్గర లేరనుకుంటున్నావో, ఎవరు కావాలనుకుంటున్నావో -వార్ని ఆవేదనతో ఆరాధిస్తున్నావు. ఆరాధన అంటే ఆవేదనేనమ్మా-ఏడుపంటే కళ్ళనీళ్ళు కాదుగా? హృదయాన్ని దగ్ధం చేసే అగ్ని ప్రవేశించి దహనం చేస్తున్నది. అది సర్వమమకారాల్నీ, రాగద్వేషాదుల్నీ దహనం చేసే మహాయోగం. అదే అందరూ సర్వ సామాన్యంగా చెప్పుకునే హఠయోగం. అదే భక్తి (యోగం). సర్వకాల సర్వావస్థలయంవదూ ఉన్నప్పుడు అదే జ్ఞానం. అదే నిష్కామ కర్మ; అదే సర్వమూ.”
- “అన్ని శబ్దాలు నీ శబ్దాలు కావటమే నిశ్శబ్దం.”
- “అంతా ఆత్మగా తోచటమే ఆత్మసాక్షాత్కారం.”
- “లోపల ఏదో వెలుపల అదే.”
- “సంపూర్ణ స్థాయి అంటే ఏమీ తెలియని, అంతా తెలిసిన స్థితి.”
- “సర్వకాల సర్వావస్థలయందూ సమానస్థితియే సమాధి.”
- “సర్వకాల సర్వావస్థలయందు సహజమయిన సహనమే సమాధి.”
- “సమత్వమే సమాధి.”
- సమాధిస్థితి అంటే ఒకసారి ఏర్పడి ఒకమారు లేనిది కాదు; సర్వసమాన స్థితి. లేనిది కలిగినప్పుడు కలిగినది పోతుందిగా?”
- “ఈ ద్వంద్వాలు ఆ బ్రహ్మగా గుర్తించినదే బ్రహ్మానందము.”
- “సర్వత్రా భిన్నత్వం లేకపోవటమే పరిపూర్ణత్వం.’ (ఏది చూచినా అక్కడకది పరిపూర్ణము అనే తెలియడం పరిపూర్ణత్వమట)
- “ఇంత శరీరం ఉంటే పాదాలకెందుకూ నమస్కారం అన్న ప్రశ్న. ఆ పాదమూ పాదమ్మీదనే ఆధారపడ్డది కనుక -“
- “ఎక్కడ పుట్టారో అక్కడే కలుస్తారు.”
- ‘దుష్ట సంస్కార మున్నవాళ్ళ తరింపు ఎట్లా అమ్మా?’
“ఆ బాధ్యత తల్లిదేగా? వాడు బురద పూసుకున్నా ఇంకెట్లా ప్రవర్తించినా ఆ బాధ్యత తనది అనుకుంటున్నది కనుక వాడిదేమీ లేదు. ఎవరైనా తరింపజేస్తుంది.” - ‘నా గతి ఏమిటమ్మా?’
“వాడిగతే నీగతి. అందరికీ సుగతే కాస్త ముందు వెనుకల తేడా గానీ-” - ‘నా ఆస్తి మీకు అంకితం చేస్తున్నాను. నాకు ఇక్కడికి వచ్చి ఉండాలని ఉన్న’దన్న సంతమాగులూరు అన్నయ్యతో అమ్మ-
- “ఆస్తి కాదుగా నాయనా అంకితం?- మీరూ. ఆ మీరు ఎప్పుడో అయి ఉన్నారు. నేను తీసుకోవటం కాని నువ్వు కావటం కాదు. అది ఎప్పుడో అయి ఉన్నది. నువ్వు ఇక్కడ ఉండాటానికి ఏ అభ్యంతరము లేదు. పొలం కొనుక్కో. నీ ఇల్లు నువ్వు కట్టుకుని, నీ గంజి నువ్వు కాచుకొని త్రాగొచ్చు. నా అభ్యంతరం లేదు. దానికైనా వాళ్లు ఉన్నారు. వాళ్లను అడుగు. కానీ ఇక్కడ ఉండటం అంటే చాలా కష్టం నాయనా. ఇక్కడ అన్ని రకాల ప్రవృత్తులు కలిగిన వాళ్లూ ఉంటారు. వీళ్లందరి మధ్యా ఉండటం చాలా కష్టం కదూ? అక్కడ ఏది కష్టమనిపించిందో అది ఇక్కడా ఉన్నది. నీ తత్వము అది అయినప్పుడు ప్రదేశం మారినంత మాత్రాన నీకా బాధ ఉండకుండా ఉండదు. అయితే ఒకటే తృప్తి. ఇక్కడ అమ్మ. కనిపిస్తుంది. అందరూ నీలా వచ్చినవారేగా? వాళ్ళ మనస్సులు ఏం మారాయి? బయట ప్రపంచంలో ఎన్ని బాధలున్నాయో అన్నీ ఇక్కడా ఉన్నాయి. నీ అన్నం నువ్వు తింటూ నువ్వు దూరంగా ఉన్నా అవి నీకు తప్పవు. అది తట్టుకో గలిగే ఓర్పు ఉంటే సరే. అన్నీ ఆలోచించుకొని రా”
- అమ్మ చాలా నీరసంగా ఉన్నారు. అయినా స్వయంగాలేచి వచ్చి పనిచేసి వచ్చి పడుకున్న పిల్లలను లేపి, అందరికీ తలా ఒక చెక్కరకేళి పండిచ్చారు. సున్నపు గానుగలు వేసి చేతులు పుండ్లుపడ్డ పిల్లలకు స్వయంగా అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టారు.
- “నిన్నటినుండి నాకు చాలా కోపంగా ఉంది. ఆవరణలోని అందర్నీ నీళ్ళబండి తీసుకు వెళ్ళమన్నాను. నేను పోసుకుంటున్నది నీళ్ళుకావు. ఆ ఎద్దు రక్తం-అన్నాను. దాన్ని పీపాబండికి కట్టకపోతే నాప్రాణం హాయిగా వుంది.”
- “దేవాలయం ప్రతిష్ఠ అప్పుడు నవరత్నాలు పొయ్యాలన్నారు. నవరత్నాలు పుట్టింది యిక్కడే కనుక యిదే వేస్తున్నాను అంటూ మూటు దోసిళ్ళ మట్టి వేశాను.”
- ఆనాడు రాత్రి అమ్మ కాఫీ అడిగారు. ఇంట్లో పంచదార లేదు. అమ్మకి కాఫీ ఇవ్వడానికి లేకపోయిందే అని కించపడుతూ అన్నపూర్ణ ఎప్పుడూ వాడని ఒక డబ్బా తియ్యటం, అందులో పంచదార వుండటం జరిగింది. ఆ పంచదార ఎప్పుడూ ఎవరూ అందులో పోసివుండలేదు?
- జబ్బుచేసిన పెద్దకుక్క దగ్గరికి హఠాత్తుగా వర్షంలో బయలుదేరిన అమ్మను కాత్యాయని అడ్డుపెట్టింది. ఆమెకు సమాధానంగా అమ్మ-“ఈ వర్షం, బురద ఇవన్నీ నాకేం కొత్తకాదమ్మా. వీటికి అలవాటు పడ్డదాన్నే. పాపం పిచ్చిది. దానికి నేనంటే ఎంతోప్రేమ. దానికి ఓపిక ఉన్నన్నాళ్ళు నా దగ్గరికి వచ్చేది. ఇవ్వాళ దాని కోసం నేను వెళ్తాను-” అంటూ ఆ బురదలో నడిచి ఆ కుక్క దగ్గరకి వెళ్ళారు.
- నిర్మాణంలో వున్న నీళ్ళ టాంకీ క్రిందకు వచ్చారు అమ్మ.
నాన్నగారు : గాలి రావటం లేదు. మరీ ఉక్కపోతగా వుంది.
ఎటో ఆలోచిస్తున్నట్లున్న అమ్మ “వస్తుంది” అన్నారు. చూస్తుండగానే గాలి వీచింది. అందరమూ ఆశ్చర్యపోయాము. - అరుణ పెళ్లిలోనే జరిగిన పోతుకూచి రవి మరణాన్ని గూర్చి ఆ అమ్మాయి మేనమామ ఆ అశుభానికి బాధ పడుతూంటే-
అమ్మ : ఇందులో మీరు బాధపడాల్సిన పనిలేదు నాయనా. వాడు ఈ రోజు పోవాలి, పోయాడు ఈ ఆవరణలో రెండూ జరుగుతాయి. శుభం అశుభం రెండూ సమానమే నాకు. - “ఆడవాళ్ళు కూర్చుని మగవాళ్ళు పనిచెయ్యటం నాకు ఇష్టం ఉండదు. కాని ఒకరికొకరు పనులలో సహాయపడటం, కలిసి చేసుకోవటం ఎంత బావుంటుంది? అందరూ అన్ని పనులూ చెయొచ్చు. అడవాళ్ళపనీ మగవ్యాపనీ అని పనులకి భేదం లేదు, చేయలేక మనకు భేదం తప్ప. ముందు ఇక్కడున్న ప్రతివాళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది నేర్చుకోవాలి.”
- “అందరింట్లో ఫలానా పని ఫలానా వాళ్ళవల్ల అవుతుందని చెప్పటానికి వీలు లేదు. ఆ సమయానికి ఎవరో ఒకరు వస్తారు, పని అవుతుంది. మాటలు సాగవు కాని పని సాగుతుంది.”
- “ఆవరణలో ఎవరికీ ‘ఇది నాదీ’ అనే భావం లేదు. ప్రతి ఒక్కరిలో ఆ భావం ఏర్పడాలి. ఎవరయినా క్రొత్త వాళ్ళు వచ్చి ‘బావి ఎక్కడమ్మా?’ అని అడిగితే ‘అటు పో’ అంటారు. చూపించదామని ఎవరికీ ఉండదు.”
- “ఇక్కడకు వచ్చేవాళ్ళు ఇక్కడుండే కుక్కపిల్లనూ, పిల్లిపిల్లనూ కూడా విలువగా చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారో యిక్కడికి వచ్చేవాళ్ళను మీరు అట్లాగే చూడాలి.”
అమ్మ మెలకువ – లోక వ్యవహారాలలో
- ఆ పాపాయి తల కాస్త పొడుగ్గా ఉన్నది. లీల అడిగింది అమ్మని – ‘తల తగ్గుతుందా?’ అని.
అమ్మ : ఇవన్నీ యేం చేస్తాయి? బుద్ధి సొట్టపడకుండా ఉంటే చాలు. అది ఒకటీ బాగుంటే అన్ని వంకరలూ పోతాయి. - తన సమీపంలో నేల మీద పారవేయబడి ఉన్న పురికొసను చేతులు చాచి అందుకుని నాకు యిస్తూ —-
అమ్మ: తోరణాలు కట్టడానికి ఉపయోగిస్తుంది. ఏమిటో నాకన్నీ యిటు వంటివే కనుపడతాయి. - శేషయ్యగారితో అమ్మ —-
“వంటకు ఎట్లా వసతిగా వుంటుందనుకుంటే అట్లా కట్టించుకోండి దగ్గర వుండి – ఏ పనివాళ్ళకు ఆ పనిలో మెలకువ తెలుస్తుంది.” - రవి కోసం అప్పటికప్పుడు వెచ్చని నీళ్ళు కావలనుకున్న జ్యోత్స్నతో —
“నీటిని ఏడుసార్లు గ్లాసులో కొద్ది ఎత్తులో తిరగబోస్తే చాలు ఆ గుణం వస్తుంది. నీటిలో అగ్నితత్వం వున్నదిగా?” - “ఎంతమంది బిడ్డలున్నా తల్లికి ఏ బిడ్డకు ఆ బిడ్డే ఎక్కువనిపిస్తుంది. పెట్టుపోతల్లో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి తేడా ఉండొచ్చు కానీ ప్రేమ మాత్రం సమానంగానే ఉంటుంది. అందులో తరుగు ఉండదు.”
- “కుళ్ళు మీ రనుకున్నంత చెడ్డది కాదమ్మా. మంచితనం నిలవ ఉంటే అంతే. ఎట్లా అంటే – ఒక పండు పక్వానికి వచ్చినప్పుడు ఉపయోగించక నాలుగు రోజులు నిలవ ఉంచితే ఏమౌతుంది? కుళ్ళుతుంది.”
- “దేనికి పనికి వచ్చేవాళ్ళు దానికి పనికి వస్తారు. ఎవరు ఎందుకు ఉపయోగపడాలో అందుకు ఉపయోగపడతారు. వీడు ఇందుకు పనికి వస్తే వాడు మరొక దానికి పనికి వస్తాడు. మన శరీరంలో ఉన్న అవయవాలు ఒకటి చేస్తున్న పని మరొకటి చేస్తుందా? కన్ను వింటుందా? చెవి చూస్తుందా? ముక్కు మాట్లాడుతుందా? అలాగే ఇందులో అన్నీ మన కవసరమే. అనవసర భాగం ఏముందీ?”
- ‘మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించటం లేదమ్మా, కాని సంసారం, భర్త, పిల్లలూ ఉన్నారు. ఎట్లా వదిలి పెట్టటము?’ అని తనని విడిచి వెళ్ళటానికి బాధపడుతున్న ఒక అక్కయ్యతో —
అమ్మ : వదిలిపెట్టాలనుకున్నా వదిలిపెట్టగలవా? సంసార మంటే భర్తా, పిల్లలే కాదు; సంకల్పమే సంసారం. (BG 6.2) - ‘నా హృదయాన్ని కదిలిస్తున్నావమ్మా —‘
“కదిలేది హృదయం. హృదయాన్ని కదిలించటం కాదు. హృదయమంటే చైతన్యం.” - “చిన్న పిల్లలకు చెయ్యాలంటే ముద్దుగా ఉంటుంది. అదే పెద్దవాళ్ళకు చెయ్యాలంటే విసుగ్గా ఉంటుంది.”
- “చిన్న పిల్లలు ఏడిస్తే మారాము అంటారు. పెద్దవాళ్ళు ఏడిస్తే కుళ్ళుమోతు తనం అంటారు. యేమి తెలియని వాళ్ళు చేసేదానికీ, అన్నీ తెలిసిన వాళ్ళు చేసేదానికీ యేడుపు ఒకటయినా తేడా యింతగా ఉంటుంది.” (Chandogya Upanishad 1.1.10)
- “కార్యార్థి లక్షణం తనను గురంచి అనేకం వినబడుతున్నా తలవంచుకొని ప్రశాంతంగా తనపని చేసుకోవటమే.”
- “దృష్టిలో భేదం తప్ప ఉన్నదంతా ఒక్కటే. సైన్సు ‘స్వభావం’ అన్న దానిని మనం ‘దైవం’ అంటున్నాము.”
- “మాట్లాడుకుంటుంటే నిద్ర రాదుగా? నీ శ్వాసను గమనిస్తూ నామం చేస్తూ పడుకుంటే తొందరగా నిద్రపడుతుంది.”
- “పండితులకు – సామాన్యంగా ఏది పొందటానికయితే చదువుకున్నారో అది పొందలేక చదువు మాత్రమే మిగులుతుంది.”
- “నేను ఒక విషయాన్ని రెండుసార్లు రెండురకాలుగా చెప్పవచ్చు. కానీ అభిప్రాయం అదే; మాటలలో తేడా వస్తుంది.”
“ఆధ్మాత్మికానికీ – సైన్సుకూ తేడా ఏముంది? ఉన్నది ఒక్కటే – మాటల భేదమే.” - “ఎవరే దారిన పోతే వారిని ఆ దారిన పోనిచ్చి మెల్లగా ఇటు తిప్పుకు రావాలి.”
- ‘తప్పు అంటే’
“నచ్చక పోవటమే తప్పు” - “భావానికి అందేదంతా రూపమే.”
- “శబ్దం ఒకటే. ధ్వనులు వేరు.”
- “క్రోధం లేకపోతే భయానికి తావు లేదు.”
చమత్కారము
- వాకిట్లో సంజకళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతున్న మా బృందాన్ని రోలు మీద కూర్చుని తిలకిస్తున్న అమ్మను చూసి హరిదాసుగారు అన్నారు-
‘ఆడవాళ్ళు రోటిమీద కూర్చోకూడదు.’
అమ్మ : నేను ఆడదాన్ని ? నేను ఆడదాన్ని కాదు ఈడదాన్నే. - “అత్రి- అనగా త్రికాలములూ త్రి విధావస్థలూ లేనివాడు.”
- “ఈ నాడు డెమోక్రసీ ఎక్కడున్నదీ మాటలో తప్ప? ప్రతివాడూ మనస్సులో కోరేది డిక్టేటర్షిప్.”
- “దారిలో ఉన్నవాడు దారి తప్పినవాడి కాళ్ళు పట్టుకుంటే తప్పినవాడు దారిలోకి వస్తాడు.”
- యేర్లగడ్డ రాఘవయ్యగారు ‘ఏమి స్వప్నాలు. ఏమి స్వప్నాలు-‘
అమ్మ: నేనిదంతా నిత్య మను కుంటున్నాను కదా! నువ్వు అదృష్టవంతుడివి -అంతా స్వప్నమనుకుంటున్నావు. - నాలుగు రోజుల క్రిందట వచ్చి వెళ్ళిన ఒక అన్నయ్య మళ్ళీ ఈ రోజు వచ్చి అమ్మను చూశారు. వారు వెళ్ళాక అమ్మ అన్నారు. – “ఈ రెండు రోజులలోనే బాగా చిక్కిపోయాడే” అని. అంటే సన్నబడ్డాడని.
వెంటనే హైమ నవ్వుతూ అన్నది ‘అవునమ్మా నిజంగానే చిక్కిపోయారూ’ అంటే తన అభిప్రాయం అమ్మకు చిక్కారని.
-అమ్మ కూడా నవ్వుతూ – “అంతేగా. మళ్ళీ చూడాలని అనిపించటం చిక్కిపోవటమేగా” – అన్నారు. - యేర్లగడ్డ రాఘవయ్యగారు : రాధ మొత్తానికి అవధూతే.
అమ్మ : వాడికి కోపం వస్తే మన పాలిట యమదూతలాగా ఉంటాడు. - ‘నాకు మనసు సరిగా ఉండదండీ.’
అమ్మ : ఏమి చేస్తూ ఉంటావు?
అతను : గోల చేస్తూ ఉంటాను.
అమ్మ : గోల అంటే ఏం చేస్తుంటావు?
అతను : ఇంట్లో వాళ్ళను కొడుతుంటాను.
అమ్మ : ఇంట్లో వాళ్ళనేనా, ఇతరులను కూడానా? ఆ తేడా తెలుస్తుందా?
అతను : తెలుస్తుంది.
అమ్మ : నువ్వే నయం. నాకంటే -ఆ తేడా అయినా తెలుసు. - ‘నిద్రపోకుండా పని చేస్తున్నావా అమ్మా?’
“నిద్రపోయింది కనుకనే పనిచేస్తున్నా.” - చిన్నప్పుడు హైమ ‘ఓం’ అని వ్రాసి మాష్టరుగారు దిద్దమంటే హైమ (బ్రహ్మాండం) ‘అక్కడే ఉన్నదిగా’ అనేదట. అమ్మ ‘ఓం’ అనటమంటే ‘నీ దగ్గర ఉన్నదిగా’ అనేదట. ఆ మూడేళ్ళ వయస్సులోనే జపం చేస్తున్నట్లుగా ఎప్పుడూ వ్రేళ్ళు లెక్క పెట్టుకుంటుండేదట. ఈ విషయాలు అమ్మ చెబుతూ అన్నారు –
“అదేమిటో ముగ్గురు పిల్లల్లో అదీ, దాని ప్రవర్తనా మొదటినుండీ ప్రత్యేకంగానే ఉండేది.” - ‘మేము మాట్లాడుకున్నదీ నీ కెలాగ వినపడిందమ్మా?’
“మీరు మాట్లాడుకున్నది మీకు వినపట్టంలేదూ? అట్లాగే అంతా వినపడు తుంటుంది. అన్నీ కనపడుతుంటాయి.” - ‘అన్నయ్యా – దాళువా – పంటంతా పాడయింది’ అని రుక్మిణక్కయ్య చెప్పింది.
రామకృష్ణ అన్నయ్య : ఎందుకమ్మా అట్లా చేశావు?
అమ్మ : నువ్వు డబ్బు వెదజల్లుతున్నప్పుడే చెప్పాను. ఈ సంవత్సరం దాళువా పంటకు అంతగా ఖర్చు పెట్టవద్దు అని – విన్నావా?
రామకృష్ణ అన్నయ్య అమ్మకు నమస్కరించాడు. - “సుబ్రహ్మణ్యం వచ్చాడురా. చూడూ—”
రాధన్నయ్య చూసి “ఎవరూ లేరమ్మా” అన్నాడు.
“కాదురా వచ్చాడురా.”
కాసేపటికల్లా ఆ అన్నయ్య రానే వచ్చాడు. - వేదాంతం దుర్గాంబగారికి ఎఱుపుచీర, ఆమె కోడలు రాజ్యలక్ష్మికి నలుపుచీరె పెట్టారు ఒకసారి అమ్మ. సరిగ్గా ఆ రకం చీరెల కోసం నాలుగు రోజుల క్రిందట వారు చీరాల, రేపల్లే బాపట్లలలో షాపులన్నీ చూశారట. అమ్మ ఆ చీరలను ఇవ్వటం సరే, వాళ్ళ మనస్సునుబట్టి ఇచ్చినందుకు ఆశ్చర్యపోయారు వాళ్ళు.
- ‘మావన్నీ నీకెట్లా తెలుస్తాయమ్మా?’
“నా ప్రవర్తన నాకు తెలియదూ?” - హైదరాబాదునుంచి వచ్చిన ఒక కుర్రవాడిని –
అమ్మ : నా ముఖం చూసి చెప్పు – నువ్వు పెదనాన్నావాళ్ళ జేబులలో డబ్బులు తీయ్యలేదూ?
అబ్బాయి : తీశానమ్మా.
అమ్మ : మాంసం తిన్నావా? లేదా.
అబ్బాయి : ఎప్పుడైనా తిన్నానమ్మా.
అమ్మ : సారాయి?
అబ్బాయి : త్రాగానమ్మా. నెలా పదిహేనురోజులు రోజూ త్రాగిన తరువాత మానేశాను. ఒళ్ళు నొప్పులు చేసినయ్. - ‘మీ నామస్మరణ చేస్తూ మద్రాస్ మవుంటురోడ్డులో నడిచిపోతున్న నా మీద మీ ప్రభావం ఎలా ఉంటుంది?’
“ఏముంది నాన్నా – నాముందు రోడ్డుమీద వెళుతున్నట్టు కనుపిస్తుంటావు.”
అమ్మ తన మాటలలో
- “క్రైస్తవ మతం నా మతం కాకపోతేగా?”
- “బాపట్లలో కేశవుడి యిల్లంటే జిల్లెళ్ళమూడే. కలో గంజో తన కున్నంతలో ఆదరణగా పెడతాడు. అటువంటి ఇల్లు ఏదయినా జిలెళ్ళమూడే.”
- “నా మతం మమతలేని మతం. అందరికీ సమ్మతం.”
- ‘నీ కీ నలుపు ఎందుకు వచ్చిందమ్మా?’
“మిమ్మల్ని గురించి ఆలోచిస్తుంటే.” - “నేను ఎవరు ఏది పెట్టినా తింటాను.”
- “నా ఉద్దేశంలో మీరు కూడా భగవంతుడే.”
- “మీరంతా నా అవయవాలనుకుంటున్నాను. చెయ్యి నొప్పి కాలికి తెలియదు. కాలినొప్పి కంటికి తెలియదు. కానీ అన్నిటి నొప్పి నాకు తెలుస్తుంది.”
- “మీరు మర్చిపోయినా నేను మర్చిపోను.”
- అమ్మ : నాకు మధుమేహం పుట్టింది.
శాయమ్మగారు : నిన్ను తలుచుకుంటూ ఏ మధుమేహం వాళ్ళు బాధపడుతున్నారో ?
అమ్మ : బాధ ఎవరిదయినా అనుభవం నాదే. - “నా శరీరం వాసనాసహితమే.”
- “నేనూ ఏడుస్తాను. నేనూ నవ్వుతాను. మీకు గొంతులో కళ్ళే, చెవులో గుబిలీ, శరీరంలో నెత్తురూ ఉన్నట్లే వాకు అన్నీ ఉన్నాయి. అవన్నీ లేకపోతే నేను మీ మధ్య ఉండాల్సిన అవసరం లేదు. నేను అన్నిటితోనూ వచ్చాను.”
- రాధన్నయ్య : అమ్మా! నీవు వంట బాగా చేసేదానివట. నేను తినలేదమ్మా.
అమ్మ : నీ తిండి తగ్గిపోయినదిగా నాన్నా.
రాధాన్నయ్య : నువ్వు చేసి పెడితే ఇప్పుడేనా నాలుగువేల ఇడ్లీ తింటా.
అమ్మ : అవి అరగకపోతే తరువాత బాధపడేది వేవేగా. - ‘భూకంపం వచ్చినప్పుడు అమ్మ మంచం కూడా కదిలిందా?’
అమ్మ: “ముందు నా మనస్సే కదిలింది.” - “మీ రనేకం ఆలోచిస్తుంటారు. కానీ నా కొకటే ఆలోచన …. మీ గురించే.”
- “నేను దగ్గరకు తియ్యటం తప్ప వాళ్ళు దగ్గరకు రావటం కాదు. ఎవరి విషయమయినా అంతే.”
- “నేను లోకంతో ఆడుకుంటున్నాను కానీ లోకం నాతో ఆడుకోవటంలేదు.”
- భూషణ ప్రక్కన దూషణ ఎప్పుడూ ఉన్నది నాయనా. ఒక రకంగా అదీ పూజే. ఒకడు భూషిస్తూ అనుక్షణం స్మరిస్తే మరొకడు దూషిస్తూ క్షణక్షణం తల్చుకుంటాడు. ఎట్లా అయితేనేమీ? ‘వాడిని’ గుర్తు పెట్టుకుంటే చాలు. దేవుడినే కాదూ నిన్ను కూడా తిడుతున్నాను అమ్మా అని బాధపడుతున్నావు. ఎందుకు బాధ ? నన్ను తిట్టకపోతే ఎవరిని తిడతావు ? నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. నా కేమీ బాధ లేదు. తీపి పదార్థం బాగా తింటుంటే వెగటు పుడుతుంది. మధ్యలో కారం తింటే ఎంతో బాగుంటుంది. నీ తిట్లూ అంతే.”
- “మీ మచ్చలు వెదకటం అంటే అదే నాకు పెద్దమచ్చ.”
- నూతన వ్యాపార మొకటి ఆరంభించపోతూ అ అంగడికి అమ్మచే పేరు సెట్టిస్తే మంచి లాభాలు వస్తాయన్న నమ్మకంతో వచ్చిన ఒక అన్నయ్య ఆ విషయం చెప్పగానే అమ్మ అన్నారు –
“మీ ఇష్టం నాన్నా – మీరు పెట్టమంటే పెడతాను. నా నోటి మీదగా చెప్పనంత మాత్రాన నష్టాలు రావని అనుకోవద్దు. నేను ప్రత్యేకించి ఏ ఒకటీ కాను. కష్టసుఖాలు అమ్మవే అనుకుంటారా, అమ్మ ఇచ్చినవే అనుకుంటారా, లాభనష్టాలు రెండూ అమ్మవే. ఏ పేరైనా సరే మీకు తోచింది పెట్టండి. నాకు ఏ పేరు పెట్టినా ఇష్టమే.” - హైదరాబాదు నుండి చెరుకుమిల్లి హనుమంతరావుగారు ఉత్తరం వ్రాశారు. వాళ్ళబ్బాయి తిరుపతి మొక్కు ఎక్కడ తీయాలి? అనీ, తమకేమో ఇక్కడ తీయించి తిరుపతి వెళ్ళాలని ఉన్నదనీ, అందుకు అమ్మ ఏమంటారూ అనీ. దానికి సమాధానం గోపాల్ను వ్రాయమన్నారు అమ్మ ఈ విధంగా-
“నాకు ఎక్కడైనా ఒకటే. నా ఇంట్లో తీస్తే ఒకటీ, నా కొడుకు ఇంట్లో తీస్తే ఒకటీ అనుకోవటం లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ నమ్మకం పైన ఆధార పడి ఉన్నది. ఎక్కడ తీసినా నాకు ఒకటే.” - అమ్మ : ఈ కట్టే డాబాలన్నీ నా కోసమే అంటావు?
సుబ్బయ్య : తప్పకుండా అంతే నమ్మా.
అమ్మ : అయితే మానేయండి. నాకు ఇవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ వచ్చే జనం ఇందుకోసంగా ఆగరు. నేనే చెట్టు క్రింద ఉన్నా వస్తారు. - “ఇక్కడి వాళ్ళే కాదు. దూరంగా ఉన్నవాళ్ళు కూడా నాకు బిడ్డలే. నేను అందరినీ చూసుకోవలసిందే కదా! పొలం వెళ్ళినవాడికి సమయానికి అన్నం అందించాలా? వాడికి పంపకపోతే ఎలా?”
- “తినగలిగిన వాడు దొరకటం అదృష్టం. నువ్వు పెడతానంటే మాత్రం తినేవాడు దొరకవద్దూ? ఎంత పెట్టినా తింటుంటే బాగుంటింది.”
- “పంచటంలో హెచ్చు తగ్గులుండవచ్చును కానీ పెట్టడం సమానమే.”
- “నేను రఘువరదాసుకు నమస్కారం చేశాను. అమృతానందకు కాళ్ళు కడిగాను, వద్దన్నాడు. నీ వేషానికి కడగటము లేదు. పిల్లవాడు దుమ్ము కొట్టుకు వస్తే కడిగాను – అన్నాను.”
- సుబ్రహ్మణ్యంగారు (నెల్లూరువారు) అమ్మతో –
‘కాళ్ళకు ఆ విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నారు?’
అమ్మ : పిల్లలను దగ్గర పెట్టుకున్నాను.
కుమారి : అట్లా పెట్టుకోకపోతే దగ్గర లేనట్టా?
అమ్మ : వీళ్ళుకూడా మీ సోదరులే అనని చెప్పటం కోసం. - “అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు. ఒడివిడిచి ఎవరూ లేరు.”
- “నా దగ్గరకు ఎంతమంది వచ్చినా ఎవరిస్థానం వారికుంటుంది. అది తరిగేది పెరిగేది కాదు. ఎవరూ వచ్చి ఇంకొకరిది తియ్యలేరు.”
- పోలంరాజు వెంకటేశ్వర్లు (మంగమ్మ భర్త)తో-
“నిన్ను గురించి నాకు తెలిసినంత నీకు తెలియదు.” - “చేయించమని చెప్పవచ్చుకాని చెయ్యమని చెప్పను.”
- “ఇక్కడ కమిట్ కావటమే కాని కమిటీ లేదు.”
- “శాస్త్రం చదివినవాడి ప్రశ్న, కోరికలు ఉన్నవాడి ప్రశ్న, అమ్మ అంటే తెలుసు కుందామనుకునే వాడి ప్రశ్న – ఎంతమంది వచ్చినా ఈ మూడు రకాల వాళ్ళే.”
- ‘వసుంధర పెండ్లిని గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటు న్నారమ్మా’-
“ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళవి. ఎవరి మనస్సుకు అందినంత వాళ్ళకు. దాన్ని మించలేరు కదా!” - “నా కడుపున పుట్టినా, వాళ్ళకి ఇచ్చిన కర్మ వాళ్ళదే. వాళ్ళు ఏమి చెయ్యటానికి ఈ భూమి మీదకు వస్తే అదే చేస్తారు.”
- తన రవికను కుట్టటానికి హరిదాసుగారికి ఆదికి ఇస్తూ-
“ఇవ్వాళ రవిక బిగుతయింది. నిన్న వదులుగా ఉన్నది’ మరి ఎట్లా కుడతావో ఏమో? నా రవిక కుట్టటంలోనీ నేర్పంతా బయట పడుతుంది” అన్నారమ్మ.
‘నీ ఆది తెలియదు’ అన్నారు హరిదాసుగారు.
“నాది అనాది కనుక నా ఆది అందదు” - రామకృష్ణ అన్నయ్యతో
“నా కబురు సరాసరి చేరుతుంది. మీ కబుర్లు పోస్టాఫీసులో ముద్రలు పడితేగాని ఎక్కడికయినా చేరవు.” - “గుణభేదమే నాకుంటే మీలో ఏ ఒక్కరూ నా దగ్గరకి రాగలిగేవారు కాదు.”
- “నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తాను. కానీ నేను చూస్తున్నానేది మీకు ఎప్పుడు అర్థమౌతుందంటే, మీరు చూస్తున్నప్పుడు నేను చూసినట్టు కనుపించినప్పుడే.”
- ‘మీరు నన్ను తాకడము-‘
“ఎప్పుడూ తాకే ఉన్నానుగా”
‘ఎప్పుడూ తాకటమంటేనమ్మా?’
“నేను అనేది అందరిలో ఉన్నది కదా! అందుకే ఎప్పుడూ తాకే ఉన్నాను అన్నాను.” - “నేను ప్రతీదానిలో ఉన్నాను పతనమనే భాగంలో ఉండకుండా లేను. అన్నిట్లోను నేను ఉన్నాను.”
- “నన్ను భూషించినా, దూషించినా ఒకటే. వాడు ఆ రకంగా స్మరిస్తే వీడు ఈ రకంగా స్మరిస్తాడు.”
- “నేను ప్రత్యేకించి ఏ ఒకటీ కాను.”
- ‘మీరెవరమ్మా?’
“నీ కెట్లా కనపడితే అట్లా చూడునాయనా-” - ‘నాకు కొడుకులూ లేరు, మనుమలూ లేరు. అన్నీ నీవేనమ్మా. నువ్వే నన్ను రక్షించాలి. నీలో కలుపుకోమ్మా-‘ అన్నది హనుమాయమ్మ ప్రార్ధనా పూర్వకంగా.
అమ్మ : నీకేమీ ఫరవాలేదు, నేను ఉన్నాను. నీకు చేసేవాళ్ళు లేరు అనుకోకు. నేను చేస్తాను. నాలోనే కలుపుకుంటాను. ఇంక ఎక్కడికీ పోవు. పంపించను. ముందు నీకు ఎవరూలేరన్న దిగులు పోగొట్టుకో నీకు నేను చేస్తాను, అన్నానుగా. - ‘ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉంటావమ్మా?’
“ఉన్నన్నాళ్ళు ఉంటాను. ఉన్నన్నాళ్ళు కనపడతాను. నేనూ, నీవూ అని ఉన్నన్నాళ్ళు కనబడతాను….. ఈ ఊళ్ళో అనే కాదు.” - “గీతలో చెప్పనిది నేను చెబుతున్నది లేదు చెప్పే తీరు వేరు కావచ్చు గానీ.”
- దగ్గరలేని మనిషిని గూర్చి మాట్లాడే అలవాటు నాకు లేదు.
- ‘మీ దృష్టిలో మనుషులూ ఇతర జంతువులూ ఒకటిగానే ఉన్నాయి.’
“అవి యితరమని అనిపించటంలేదు. అన్నీ నేననే అనిపిస్తుంది.” (BG 6.29) - “అవతారమా? మీరంతా అవతారాలే ఈ అవతారం చుట్టూ మీరు మీ కోసం ఈ అవతారం.” (BG 9.11)
- మొన్నీ మధ్య ఈ ఆవరణలో వాళ్ళే అన్నారు. ‘ఇదీవరకటికి ఇప్పటికీ అమ్మలో తేడా ఏముంది అమ్మకు పూజలూ అవీ చేయటానికీ? నాకు చెయ్యబుద్ధి వెయ్యటం లేదని. అవును, నిజమే నాలో మార్పేమీ లేదు. వాళ్ళకు చెయ్యాలని అనిపిస్తున్నది చేస్తున్నారు. వీళ్ళకు అనిపించదూ, మానెయ్యమను – కాదని ఎవరన్నారు? ‘వాళ్ళు చేస్తున్నారు నేను చెయ్యక పోతే బాగుండదని చెయ్యటం దేనికి? నాలో మార్పేముంది? ఆనాడు పేడ త్రొక్కటం అవసరమయింది, త్రొక్కాను. పిడకలు చేశాను. నేలమీద పడుకున్నాను, చాపమీద పడుకున్నాను. కుక్కి మంచంమీద పడుకున్నాను, నవారు మంచం తెచ్చారు. నవారు మంచంమీద పడుకున్నాను. డన్లప్ మంచం మీద పడుకుంటున్నాను. రేపు ఎయిర్కండీషన్ పెట్టవచ్చును. ఎన్ని కండిషన్స్ మారినా మన కండిషన్ ఒకటే…… ఇది మారేదీ కాదు.” అన్నారు తనను తాను చూపుకుంటూ. (BG 5.19, BG 13.28)
- “నన్నడిగితే నాలో చిన్నప్పటికీ ఇప్పటికీ మార్పు ఏమీ లేదు. ఎవరికి తోచింది వారు వ్రాస్తారు.” (BG 5.19, BG 13.28)
- అడవులదీవి అన్నయ్యలు పూజ చేసుకుంటున్నారు. మధ్యలో మాత్రం ఎందుకు పూజచేసుకోకుండా ఉండాలి అంటూ బీజాక్షరాలు చదువుతూ అమ్మ తన పాదాలమీద తానే పూలు వేసుకున్నారు.
- “పాతవారు ఏడుస్తూ నా వెంట బడతారు. క్రొత్తవాళ్ళను నేను వెతుక్కుంటాను. నా కవసరమైన వారిని లాక్కుంటాను.”
- అన్నం కలిపి ముద్దలు పెడుతూ కబుర్లు చెబుతూ నవ్విస్తున్న అమ్మను చూసి అమ్మ అంటే మరో విధంగా ఊహించుకున్న ఒక సోదరుడు ఆశ్చర్యపడుతూ అడిగాడు-
‘పీఠాధిపతులు కానీ మరే స్వాములవారు కానీ ఇట్లా ఇంత దగ్గరగా రానివ్వరమ్మా – మీరేమిటి ఇట్లా ఉన్నారు?’ అని.
అమ్మ నవ్వి అన్నారు-
“వాళ్ళు అట్లా ఉండటం ధర్మం, నేను ఇట్లా ఉండటం ధర్మం. శుచి చెయ్యాల్సిన బాధ్యత నాది. శుచిగా ఉన్నట్లు కనపడిన వాళ్ళనే దగ్గరకు తీసుకునే బాధ్యత వాళ్ళది (పీఠాధిపతులు).” - ‘దురదృష్టంలో అదృష్టం అంటే ఇదేనేమో?’
“దూరదృష్టి కలగటమే అదృష్టం. సామాన్యం కంటే ఏదో విశేషం కనిపించటమే దూరదృష్టి.” - అమ్మ కాలి వ్రేళ్ళకు బంగారు మట్టెలు చూసి ఎవరో ‘కాళ్ళకు బంగారం పెట్టుకోవటమేమిటి’ అని ఆక్షేపణ చేసినప్పుడు అమ్మ అన్నారు –
“బంగారం ఎక్కడనుండి వచ్చింది? భూమిలోనుండేగా? ఆ భూదేవే మనకు సమస్తమూ ఇస్తున్నది. ఆమెనే త్రొక్కగా లేనిది ఇవన్నీ ఏమిటీ? అన్ని లోహాలనూ తానే ఇస్తుంది గదా. బంగారమూ ఒక లోహమే.” - అమ్మ : బియ్యపు పిండితో అట్టు పోసి అరిటాకులో వేసి భగవంతుడికి పెడితే?
అమ్మమ్మ: భగవంతుడనేవాడు ఎక్కడున్నాడు? వాడు కనిపించడు. ఏడీ?
అమ్మ : వాడి కనిపిస్తూనే ఉన్నాడు. నువ్వు గుర్తించటం లేదు. (BG 9.11) - ఒక విషయంలో చికాకు పడుతున్న అమ్మను చూచి శేషగిరిరావు
అన్నయ్యగారు నవ్వుతూ అన్నారు –
‘జగమేలే పరమాత్మ! ఎవరితో మొరలిడుదువు?’
అమ్మ వెంటనే అన్నారు – “నాతో నేనే.” - “నేను మీ గుణగణాలు చూసి ప్రేమించటం లేదు. నా కోసం నేను ప్రేమిస్తున్నాను.” (Brihadaranyaka Upanishad 2.4.5)
- “నాలుగు గోడల లోపల మంచంమీద కనపడుతున్న రూపం పరిమితమూ, బయట అనంతమూ.”
- శ్రీపాద : అంతా ఒకటేననే ఈ విధానం ఇదివరకు లేదమ్మా.
అమ్మ : ఎప్పుడూ ఉన్నదే నాన్నా. తెలియనిది తెలియటానికే నా యీ రాక. (BG 18.73) - వసుంధరక్కయ్య పెళ్ళి సందర్భంలో రుక్మిణి అక్కయ్య అమ్మను అడిగింది.-
‘మా అమ్మాయికి పిల్లలు పుడతారంటావా?’
అమ్మ : ఏం నేను పురుషుడు కానని అనుమానంగా ఉన్నదా?
అక్కయ్య : ఉంటే మా అమ్మాయినెందుకు ఇస్తాము? - “నువ్వు వాళ్ళతో చెప్పలేదూ?- ఇందాకనే అమ్మ అన్నదనీ.”
‘ఈ సంగతి నీకెవరు చెప్పారమ్మా?’
“నాకు యోగయ్య చెప్పాడు.”
‘మేము ముగ్గురము కలిసే వచ్చాము కదమ్మా, నీ కెప్పుడు చెప్పాడు?’
“ముగ్గురితోపాటు నాలుగోదాన్ని నేను లేనా?” - ‘మా వాదనలో -పుట్టుకతోనే అద్వైత సిద్ధిగల | ఆమె- అని నేనంటే,
అవతారమని ఆవిడ అన్నదమ్మా. ఎవరిది రైటు?’
“సహజంగానే అద్వైతమంటే అవతారమనే,” - “అంతటా ఉన్న అమ్మ తెలియడానికే ఈ అమ్మ.” (BG 9.11, BG 18.73)
- ‘అమ్మా – నీవు పరాంబిక వనిపిస్తుంది. కానీ ఆ భావం పూర్తిగా నిలవటం లేదు కదా?’
“ఆ భావం పూర్తిగా నిలిస్తే అనటం ఎక్కడుంటుంది ఇంకా? అనుభవించటమే.” - ‘అమ్మా – చాలా లోతుగా మాట్లాడుతున్నారు.’
“మీరు అడిగినవాటికి సమాధానమేగా, మీరు ఎంత లోతుకు తీసుకువెళితే అంతలోతుకు వచ్చి ఉంటాను.”
‘ఉంటానంటే?
“అక్కడినుంచి పైకి పోనూ, క్రిందకి జారనూ.”
‘మీరు మా చేతుల్లో ఉన్నారా?’
“భక్త పరాధీనుడన్నారుగా?” (BG 9.29) - “హైమను గురించి బాధపడుతున్నాను అంటే అది పోయినదానికంటే -దాని మంచితనము, దాని మాటలు గుర్తుకు వచ్చి.
అన్నంలోకి ఏమీలేదు నాన్నా- అంటే ‘నీళ్ళు పొయ్యమ్మా’ అన్నాడు రవి, వయస్సు చిన్నదైనా పరిస్థితి గ్రహించి. నన్ను తృప్తి పరచాలన్న ఆ మంచితనం నేను ఎట్లా మరచిపోతాను? ఝాన్సీకి తగిలిన దెబ్బకంటే, ఝాన్సీ ఓర్పు మనని ఏడిపించింది. అట్లాగే వెంకన్నలోని నిజాయితీ మూగవాడైనా తనకు తెలిసిన దానిని చెప్పటానికి వాడు పడిన అవస్థ, చేసిన జాతర – ఇవి గుర్తుకు వస్తే బాధగా ఉండదూ? ఇదీ అంతే. హైమ మంచితనమూ ఆ చర్యలూ ఆ మాటలూ ఎందుకు ఏడిపించకుండా ఉంటాయి?”
శాస్త్రం
- “ఆచారం, ఆరోగ్యం, అద్వైతం కలిసి ముడివేసుకుని ఉన్నాయి.”
- “ప్రతిమాటా వేదమే. వేదమంటే శబ్దం.”
- “మిథ్య అంటే లేనిదనీ, నశించేదనీ కాదు. మారేదాన్ని మిథ్య అంటాను.”
- ‘బ్రహ్మచర్యానికి గొప్ప స్థితి ఇస్తారుగా అమ్మా-‘
“ఏ స్థితి అయినా ఇచ్చేదికాదు వచ్చేది.”
‘ఎక్కడనుండి వస్తుందంటారు?’
“మనం ఎక్కడినుండి వచ్చామో అక్కడ నుండే.” - “ఒక వస్తువు దగ్గరపెట్టుకుని మర్చిపోయి వెతికినట్టు మానవుడికీ మాధవుడికీ తేడా. అటువంటి చరిత్ర ఎన్నిసార్లు చదివావు?”
- “ఏ గ్రంథాలూ, ఏ శాస్త్రాలూ నిత్యజీవితం కంటే ఎక్కువ బోధించేదేమీ లేదు.”
- “శాస్త్రం చెప్పింది ఒకటే; అర్థం చేసుకోవటం వేరు.”
- అమ్మదగ్గర వడుగు చేసుకుందామని వచ్చారు. ఆ పిల్లవాడు అమ్మకు పూజచేసుకున్న తరువాత అమ్మ కర్పూరం వెలిగించమన్నారు. కర్పూరం వెలుగుతుండగా అమ్మ ఆ పిల్లవాడిని ముందుకు వంగమని కుడిచెవిలో బ్రహ్మోపదేశం చేసి-
“నీకు యికనుండి ప్రతిశబ్దంలోనూ యిదే వినపడాలి. నడుస్తున్నా. ఏ పని చేస్తున్నా యిదే ఎప్పుడూ గుర్తుండాలి” అన్నారు. - “చేసేదంతా దైవసేవ అనుకుంటే నిష్కామము.”
- “సర్వం తెలుసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు.”
- “త్రిపురసుందరి అంటే బాల్య, యౌవన కౌమార స్థితులు కలిసినటు వంటిది త్రికాలాలూ ఆమె రూపమే. ఆమె అంటే చేతులు, కాళ్ళు, చీరె, రవిక, కలిగిన ‘ఆమె’కాదు, శక్తి – ప్రతిదానిలో గర్భితమైన శక్తి.”
- “శబ్దం అంటే ఓంకారమే కాదు. వినపడే ప్రతీ శబ్దమూ ఓంకారమే. కత్తిపీటను పెట్టి కోసేటప్పుడు వచ్చే శబ్దం కూడా ఓంకారమే.”
- ‘పరం కోసం ఇహాన్ని వదలాలా?’
“రెండులేవు – అనుకుంటున్నా. ఇహం లోనే ఉన్నాను. మీరూ ఇహంలోనే ఉన్నారు – ఇహమే మీరు అనే పరం అనుకుంటున్నాను. పరాన్ని గూర్చి ఆలోచన నాకు లేదు.” - “అహం, ఆకారం దాల్చి అహంకారం అయ్యింది.”
- ‘ప్రణవమే దైవస్వరూపమా?’
- “ప్రణవమే కాదు, అన్నీ అక్షరాలూ దైవస్వరూపమే.”
- “పెద్దగా జేస్తూ తాళాలుంటే భజన.”
- “ఆ నామమే లోపల చేస్తూ ఉంటే జపం.”
- “ఏదీ అనకుండా అక్షరాలను మనస్సులో పెట్టుకుంటే ధ్యానం.”
- “సర్వమూ సత్యస్వరూపంగా తోచటమే నిత్యా నిత్య వస్తు వివేకం.”
- “సాకారాన్ని గుర్తించటానికి నిరాకారం, నిరాకారాన్ని గుర్తించటానికి సాకారం ఆధారం.”
- “నిరంతర స్మృతే ఆరాధన.”
- “మనోలయం, మనోనాశనం అంటారు. లయం ఎప్పుడు చేస్తాడు? మనస్సు నాశనం అయిన తర్వాత చేసేదేమిటి? వాళ్ళు ఒకదానికొకటి చెప్పడంలో వస్తున్నది ఇట్లా. ఆ భావం మార్పునే నాశనం అంటారు.”
- “భూత, భవిష్యత్, వర్తమానాలు అన్నీ ఏకకాలంలో చూడటం తురీయం.”
ఆచారము – మడి
- ముఖద్వారానికి అవతల ఒక అన్నయ్య నిలబడి ఉన్నాడు.
అమ్మ : రా నాయనా లోపలికి.
అన్నయ్య : మైల అమ్మా, అందుకని రాలేదు.
అమ్మ : ఇక్కడ ఆ పట్టింపులేవీ లేవు నాన్నా, రా. - పొన్నూరునుండి వచ్చిన ఒక సోదరుడు అమ్మని అడిగారు –
‘గాయత్రిని ఉపాసిస్తున్నప్పుడు ఆచారంగా ఉండాలంటారు. నేను చేసేది ఉపాధ్యాయ వృత్తి. అందువలన నాకు అది నిష్ఠగా సాగటంలేదు. ఉతికిన బట్టలు పనికి వస్తాయా అందుకు?’
“ఏమీ పర్వాలేదు నాన్నా. చేసుకోవచ్చు. ఇరవైనాలుగు గంటలూ గుర్తు ఉండాలే కానీ అంతకంటే కావాల్సింది ఏముంది? నిష్ఠలూ – ఆచారాలూ పెట్టారు అంటే ఒక నియమం కోసమే. నీకిది గుర్తు ఉండాలి కానీ ఏ స్థితిలో అయినా చేసుకోవచ్చు.”
సందేహమూ – సమాధానమూ
- “నీ వీలునుబట్టి నాన్నా. మంచిరోజు అంటే నాదృష్టిలో అన్నీ మంచిరోజులే. ఇక్కడికి రావటానికి ఎప్పుడు తటస్తపడుతుందో అప్పుడే మంచిరోజు.”
- “ప్రతివాడూ నడవాలని అనుకుంటాడు, కానీ నడవలేడు. కాబట్టి ఏది జరిగినా వాడు చేయిస్తాడనుకోవటమే ధర్మం కానీ మరొకటి కాదు.”
- “ఇష్ట దైవమటమ్మా? ఎన్ని కష్టాలు పెట్టినా ఎవరియందైతే అయిష్టత కలుగదో వారే యిష్ట దైవం.”
- దీపావళీ పండుగ విశిష్ఠత గురించి అడిగిన ఒక సోదరునికి “నరకాసుర సంహారానికి చిహ్నంగా ఈ పండుగ చేసుకుంటామని చెప్పే కథలో నరకాసురుడంటే నరులలో ‘అసుర’ అంటే రాక్షస గుణాలు ఉన్న వాడనేగా? అటు వంటివాడిని సత్యభామ సంహరించింది. సత్యభామ అంటే సత్యం. ఆ అసుర గుణాలని సత్యం సంహరించింది. ఇట్లా సూటిగా చెబితే ఎవరు అర్థం చేసుకోగలరు? అందుకని కథల రూపంగా చెప్పుకుంటారు. ఆ కాలంలో ఇవి జరగలేదా అంటే జరిగి ఉండవచ్చు. కానీ నాకు ఆ భావనకంటే ఈ భావనే బాగుంటుంది.
- ఒక అక్కయ్య – ‘అమ్మా! మేము బాకీలలో ఉన్నాము. రేపు 15వ తారీకున మా స్థలం వేలం వేస్తారట. మాకు ఈ లోపలే అమ్ముకుందామని ఉంది. అమ్ముడు పోతుందా?’ అని అమ్మను అడిగింది.
“నాకేమీ తెలియదమ్మా. నేను దళారినయినా కాదు. నాకు నువ్వెంతో వాడూ అంతే”(పొలం వేలం వెయ్యబోయే వాడూ, అప్పు ఇచ్చినవాడూ). - “నీకేమీ లేదు ప్రపంచంలో చేతబడులూ, పాదులూ చెట్లు త్రొక్కటాలూ లేవు. పోయి తొందరగా ఉద్యోగానికి ఛార్జీ తీసుకో.”
- . ‘నేను ఉండి ఏమి ఉపయోగం?’
“ఉండటమే ఉపయోగం నాన్నా-” అన్నారు అమ్మ. - “అంతా అమ్మే చేయిస్తుంది. అంతా అమ్మ దయే అని మాటగా కాదు నాయనా నీలో ఉండాల్సింది. అంత విశ్వాసమే నీలో ఉన్నప్పుడు ఈ మాటలకు తావు ఉండదు.”
- ‘భగవంతుడుకేమి బెడద ఉంది- ఇదంతా మనకే కానీ?’
“పెండ్లాడటమూ పిల్లలతోనే నీకు ఇంత బెడదగా ఉంటే వాడికి ఎంత ఉండాలి?”
‘అయితే నేనూ వాడూ ఒకటేనన్నమాట’
“అంతే .” - ‘నమ్మకం దేని వల్ల కుదురుతుంది?
“నమ్మకం కలగకపోవటానికి కారణమేదో కలగటానికీ కారణమదే.”
‘నమ్మకం గ్రేస్ కాదా?’
“నమ్మకమే కాదు. లేకపోవటం కూడా.” - “శిక్షణ రక్షణేగా?”
- “దుష్ట శిక్షణ సుగతి కాకపోతే నరకాసురుడు పోతే పండుగ ఎందుకు చేసుకుంటున్నారు?”
- “ఉన్నది ప్రేమే. భగవంతునియందు చూపిస్తే భక్తి అంటున్నాము. పిల్లల యందు చూపిస్తే మమత అంటున్నాము. ఇతరులయందు చూపిస్తే భూతదయ అంటున్నాము.”
- అన్నయ్య : మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
అమ్మ : ఏది జరిగినా ఎవరు ఏది చేసినా మనం కాదు చేసేది-మనను నడిపించే శక్తి మరొకటి ఉన్నదనుకోవటమే. - ‘త్యాగి అన్నా సర్వసంగపరిత్యాగి అన్నా ఒకటేనా అమ్మా?’
“ఏదో ఒకొక్క విషయంలో ఉండి తతిమ్మా వాటిలో లేకపోతే ‘ఆ విషయంలో మంచి త్యాగిలెండి’ అంటారు. ఆ త్యాగమే అన్నింటిలో ఉన్నప్పుడు అంటే త్యాగం యొక్క చరమదశ సర్వసంగపరిత్యాగం.” - ‘ప్రాణం పోతుందంటారే, ఎక్కడికి పోతుందమ్మా?’
“ఎక్కడికి పోతుందీ? అక్కడే ఉంటుంది. ఎక్కడికీ పోదు. టైరు ఉన్నదనుకో అమ్మా- దానిలో గాలిపోతే ఎందులో కలుస్తుంది? గాలిలోనే కలుస్తుంది. ప్రాణమూ అంతే. ఉన్నదంతా అదే కనుక అందులోనే కలిసిపోతుంది.” - ‘చాలామందికి చావంటే భయం-‘ అని భరద్వాజ.
“అదేదో తెలియని వాళ్ళకు-” అని అమ్మ. - ఒకరు : ఏ నామం చేస్తే మంచిందంటారు?
అమ్మ : మీకు ఏ నామం చెయ్యాలని ఉంటే అది చెయ్యండి ఇది చేస్తే మంచిదీ, అది చేస్తే చెడ్డదీ అని ఏమీ లేదు. నామం అంటూ చేస్తే ఏ నామం అయినా ఒకటే. నాకు అన్ని నామాలూ ఒకటే. రామనామం కృష్ణనామం అమ్మనామం చేసినా ఏది చేసినా నామం కాకుండా పోదుగా?
అమ్మ సూక్తులూ – లౌకికాలూ
- “చద్ది అన్నం తిని పొలంలో పనిచేసే వాళ్ళెవరిప్పుడు? కాఫీ త్రాగి వెళితే అట్లాగే ఉంటున్నది పని.”
- “ప్రహ్లాద చరిత్ర ఆనందమే కానీ తన బిడ్డ ప్రహ్లాదుడు అయితే ఏ తండ్రీ సహించడు.”
- “మంచితో బాధించినంతగా చెడుతో బాధించలేరు.”
- “మందు మనకు పనిచేయనంత మాత్రాన వైద్యశాస్త్రం తప్పుకాదు.”
- “హృదయము అంటే గుర్తు అనుకుంటాను.”
- “గుర్తే గురువు.”
- “గ్రహించటానికి వీలైనదంతా రూపమే.”
- “ప్రాణం పోయిన తరువాత కూడా ఆ శరీరంలో చైతన్యముంటుంది. కానీ అది మనకు ఉపయోగపడకపోవచ్చు.”
- “నిద్రంటే మరుపేగా.”
- “శబ్దం బ్రహ్మయితే సైలెన్సూ బ్రహ్మే.”
- “ఏ ఆసనం గొప్పదీ అంటే సుఖాసనం గొప్పది. ఎవరు ఎట్లా కూర్చుంటే హాయిగా ఉంటే అదే సుఖాసనం.”
- “సుఖపడటమే తప్ప ఎవరినీ ఎవరూ సుఖపెట్టలేరు.” & “సుఖపడేవాడే కానీ సుఖపెట్టేవాడు పుట్టలేదు.”
- “నమస్కారం చేస్తున్నారు. నేనెవరో వాళ్ళకు అనవసరం. భగవంతుడనే భావంతో చేసుకుంటున్నారు. వాళ్ళకోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ భావం వాళ్ళకు రావటమే వాళ్ళల్లో భగవంతుడున్నట్లు.”
ఆధ్యాత్మికాలు
- “చింతకు కారణం నా స్వంతం అనుకోవడమే.”
- “ఆత్మ అంటే అర్థమైనవాడికి – ప్రతిబింబం లేదు.”
- “ఒకటి అనుకున్నప్పుడు మరొకటి జరిగితే మనల్ని మించినదేదో ఉన్నదని పిస్తుంది.”
- “నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించావాడు వస్తాడు. ఇక్కడ నవ్వుతూ అనుభవిస్తున్నాము. అక్కడ ఏడుస్తూ అనుభవిస్తున్నారు.”
- “ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర. రచయిత ఒక్కడయినా ఎవరి పాత్ర వారిది.”
- “అనంతం అన్న నాటకంలో పంచభూతాలతో ఆడుకుంటున్నాము.”
- ‘అసలు నిద్ర లేకపోతే జనమంతా ఏమయ్యేవారో?’
“ఏమవుతారూ? నాకు మల్లేనే ఉంటారు.” - “అంతా నేనే అనుకున్నప్పుడు తానే భగవత్స్వరూపం. అంతా ఎవరో అనుకున్నప్పుడు తనను తాను మరచిపోవటం.”
- “భ్రాంతి అంటే మమకారం భ్రమ అంటే ఊహించటం.”
- “నైజం అంటే మారని స్వభావం.”
- “అమ్మ దయ బాధలోనూ ఉంది.”
- “మాయ అంటే చీకటి అని కాదు. తెలియనిది మాయ.” & “అర్థం కానిది మాయ.”
- “ఇన్ని బ్రహ్మలు లేవు. మారుతూ కూడా ఉన్న బ్రహ్మ ఒక్కటే.”
- ‘చెట్టు ముందా? విత్తు ముందా?’
“ఉన్నదే మొల్చింది.”
‘ఇదంతా ఎట్లా వచ్చింది?’
“ఉన్నదే వచ్చింది.”
‘Space అంటే?’
“ఉన్నదే Space.”
జన్మలు
- ‘తొలి జన్మలో పాపంగానీ పుణ్యంగానీ చెయ్యడానికి కారణం ఎవరు?’
“శక్తి, భగవంతుడు, మూలం, దైవం, ప్రేరణ, స్వభావం, సహజం-ఏదయినా అనూ. (అదే కదా? మరి నీ కర్మ అంటూ ఏమున్నదీ?)” - “ఏదీ నువ్వు చెయ్యలేనప్పుడు ఏదో ఒక శక్తి నిన్ను నడుపుతున్నప్పుడు ఇంకా నీకు జన్మల గురించి ఆలోచన దేనికీ?”
- “జన్మ ఇచ్చినవాడు రాహిత్యం చెయ్యడూ? జన్మ ఎవరూ ఇవ్వలేదు.
జన్మకు కారణం మనమే అనుకున్నా మన చేతిలో ఉన్నట్లే లేక ఎవరో భగవంతుడున్నాడు, వాడి వల్లనే మనం భూమిమీదకు వచ్చాము అనుకుంటే ఆ భగవంతుడే కారకుడవుతాడు- జన్మ రాహిత్యానికి కూడా.” - “ఆత్మ ఎప్పుడూ అంతటా ఉన్నది అనుకున్నప్పుడు ఆత్మకు లేని జన్మలు ‘జీవత్వా’నికి ఎక్కడనుండి వస్తాయి?”
- “సముద్రంలో అలలేచి మళ్ళీ కలిసిపోయినట్లే మీ జన్మలూనూ, నా సంకల్పంలో మీరు జన్మ ఎత్తి నాలోనే లయమవుతారు.”
గురువు
- “గురువునకు – ఇష్టదైవానికీ తేడా లేదని నా ఉద్దేశం.”
- “నీకు లక్ష్యం ఎక్కడ ఉంటుందో అదే గురువు.”
సృష్టి
- సుబ్బారావు అన్నయ్య తెచ్చిన వైకుంఠపాళిపటాన్ని చూస్తూ అమ్మ అన్నారు-
“మంచి – చెడూ ఈ ద్వంద్వాలు లేకపోతే ఏముంది? చెడు లేకపోతే మంచీ లేదు. మంచి లేకపోతే చెడూ లేదు. ఈ మంచీ చెడూ నా దృష్టిలో లేవు. నా దృష్టిలో హెచ్చూ తగ్గూ మాత్రమే. ఒకటే అయితే ద్వంద్వాలలోని ఆనందం ఏమి తెలుస్తుంది? ఈ పటంలో ఈ నిచ్చెనలకు ఇంత విలువ ఎందుకంటే ప్రక్కనే పాములు ఉన్నాయి కనుక.” - ‘ఇంతకీ వాడి ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఆ పాడు త్రాగుడేనేమ్మా-‘ అని ఒక అక్కయ్య అన్నది.
“వాడి ఆరోగ్యం చెడటానికి కేవలం త్రాగుడే కారణం అని నేను అనను, ప్రపంచంలో ఏ వస్తువూ చెడ్డది కాదు. అన్నీ అవసరమయ్యే ఏర్పడ్డాయి. అయితే ఆ వస్తువులూ సమయాన్ని బట్టి పరిమితంగా ఉపయోగించే వేళలున్నాయి. విషం ఉన్నదనుకో అమ్మా ప్రాణం పోయే ఒకానొక పరిస్థితిలో ఒక చుక్క అది విషమయినా అమృతంలా పని చేస్తుంది. అదే ఎక్కువయితే విషమే అవుతుంది. ఉప్పు రుచి కోసం ఉపయోగించే దీని మోతాదుకు మించి వేసుకోము కదా. ఏదైనా అంతే. అన్నీ అవసరమైనవే. సృష్టిలో అక్కరలేనివి ఏం లేదు. - “మంచి చెడ్డల వివరణ ఎట్లా? అది కూడా ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉన్నది. ఒకడికి ఇష్టమైనది, ఇంకొకడికి అయిష్టంగా, వాడి మంచి వీడికి చెడుగా కనిపించవచ్చు. అంతేగాదు. ఒకడికే ఆ మంచి చెడ్డలు కూడా పరిస్థితులను బట్టి, కాలాలని బట్టి మారుతూ ఉంటాయి.”
- “రెండూ ఆ దైవమే అయినా రెండయితే గానీ సృష్టి నడవదు.” & “ద్వంద్వాలే సృష్టి కాధారం.”
- “విరామం లేనది రామం.”
‘దేనికి విరామం లేదు?’
“సృష్టికి లేదు. కదలికకు లేదు. విరామం లేకుండా జరుగుతున్న పనెల్లా రాముడే. మనలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విరామం లేకుండా ఉన్నాయి. వ్యష్టిలో గానీ సమిష్టిలో గానీ విరామం లేకుండా ఉండే ప్రతి ఒక్కటీ రామమే.” - “రూపం లేనిది రూపం ధరించటమే సృష్టి.”
- ఒకరు : భగవంతుడు సృష్టి ఎందుకు చేసాడు?
అమ్మ: సృష్టే భగవంతుడు కనుక.
ఒకరు : సృష్టికి నాశనం లేదా?
అమ్మ : నా దృష్టిలో లేదు. సృష్టికి రూపాంతరం తప్ప నాశనం లేదు. - “సూదీ దారం ఉన్నది. దారం ఒక్కటే. ఆ రంధ్రంలో గుచ్చినప్పుడు అది రెండు పోగులుగా కనిపిస్తుంది. చూడటానికి రెండు కానీ పోగు ఒకటే. ఈ అడ్డం ఉంచింది నేనే. రెండుగా కనబడటానికి కారణం నేనే అయిన ప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా అంటాను? మీరు మంచికీ చెడుకీ దేనికీ కర్తలు కారు.”
- “జగత్తు ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవాడు వస్తుంటాడు. పోయేవాడు పోతుంటాడు.”
- “అంతా సమష్టే. వ్యష్టిగా మనకు తట్టుతుంది.”
- “భగవంతుని చేత కల్పించబడిన సృష్టి భగవంతుడే.”
- ఒకరు : సృష్టి ఎందుకు ఏర్పడింది?
అమ్మ : నిప్పు ఎందుకు కాలుతుంది నాన్నా?
ఒకరు : దాని స్వభావం అది.
అమ్మ : ఇదీ అంతే నాన్నా. - ఒకరు : చివరకు ఇదంతా ఏమౌతుందమ్మా?
అమ్మ : దేనికి చివర? ఎక్కడికి చివర? సృష్టికి ఆద్యంతాలు లేవు.
భగవంతుడు
- “కాలువనిండా నీరు ఉన్నా త్రాగటానికి రేవు ఎట్లా అవసరమో…. అట్లాగే సర్వత్రా ఉన్న దేవుడిని తెలుసుకోవటానికి దేవాలయం అవసరమయింది.”
- “ఆత్మ ఎక్కడ ఉందంటే అంతటా నిండి ఉండి శక్తి రూపమై అన్ని రూపాలలోనూ ఉంది. ఎవడికి ఎక్కడ కనపడితే అక్కడ చూస్తాడు.”
- “మహత్యాల వల్ల దైవం అనుకోవటం వేరు. ఏమీ లేనిచోటా సామాన్యంగా ఉన్నచోటా గుర్తించాలి.”
- “జగత్తే తానైనప్పుడు జగత్తులో భాగాలు తనవికాకుండా యెట్లా ఉంటాయ్.”
- “గుణాలకు ఆధారం భగవంతుడయినప్పుడు (భగవంతుడు) గుణము ఎందుకు కాడు?”
- “లౌకిక విషయాలకు ఏశక్తి సహాయపడుతుందో పరమార్థ స్థితిని కూడా అదే ఇస్తుంది.”
- “మిరపకాయకు కారం స్వభావం అంటాడు నాస్తికుడు. మిరపకాయలో కారం పెట్టేదు అంటాడు ఆస్తికుడు.”
- “భగవంతుడు అన్నది నువ్వు పెట్టిన పేరు కానీ ఆ శక్తికి స్త్రీ పురుష భేదం లేదు నాన్నా- దాన్ని భగవంతుడనే కాదు, ఇంకా ఏ పేరైనా పెట్టు, ఉన్నది ఒక్కటే. దాన్నే సైన్సు స్వభావం అంటే ఆధ్యాత్మికం దైవం అంటుంది.”
- “భగవంతుడి సృష్టిలో భగవంతుడికి ఇష్టం కానిది యేముంటై? ఆ సందేహ నివారణకే వినాయకచవితినాడు వినాయకుని అన్నిరకాల పత్రితో పూజించమంటారు. ఆ సందేహం పోవటానికే ఆవుపేడ గౌరీదేవి అయింది.”
- “ప్రేమా భక్తీ రెండూ ఒకటే. అమ్మ బిడ్డలను ప్రేమిస్తే మమకారం అన్నారు. పెద్దలను ప్రేమిస్తే గౌరవమన్నారు. అదే భగవంతుడిని ప్రేమిస్తే భక్తి అన్నారు.”
- “మీరంతా నా అవయవాలని అనుకుంటున్నాను. చెయ్యి నొప్పి కాలికి తెలియదు. కాలినొప్పి కన్నుకు తెలియదు. కానీ అన్నిటి నొప్పీ నాకు తెలుస్తుంది.”
- “పక్షులలో గరుత్మంతుడినీ, పాములలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ నేనే అని చెప్పుకోవటంలో వాడి ఉద్దేశ్యం అన్నింట్లో నేను ఉన్నానని చెప్పుకోవటం కోసమే. సాటి మానవుడినే సమానంగా చూడలేని మనం ఒక దుష్ట జంతువును చూడగలమా? అందుకని అందులో సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని అన్నాడు. అంటే తతిమావి కాదని కాదు. నిగ్రహం కోసం విగ్రహారాధన ఎట్లాంటిదో అలాగ. అన్నింటిలో, సర్వత్రా వాడు ఉన్నాడని తెలుసుకోవటం కోసం.”
- “స్నేహితుడంటే ఒక్కమాటలో మారిపోయేవాడు కాదు.ఒక మాటతో దగ్గర అయ్యేవాడూ, ఇంకోమాటతో దూరం అయ్యేవాడూ కాదు; ఏ పరిస్థితుల్లో నైనా నిన్ను వదలకుండా ఉండేవాడు.”
- “ఏం చేసినా మారనిదీ చెదరనిదీ ఎక్కడుంటే – అదే తల్లి స్వరూపం.”
- “నిర్వికారం మారనిదీ; ఆకారం మారేదీను.”
- ‘అందరమూ అన్నిచోట్ల పుట్టి అందరం ఆ ఒక్కమ్మనే అందరమ్మగా గుర్తించటం విశేషం.’
“విశేషం కాదు పరమపదమంటే అదే.” - . “దుర్మార్గానగాని, భయానగాని ఏవిధంగానైనా ఒకసారి చూచాక వద్దను కున్నా మరపు ఎక్కడైతే రాదో అదే భగవంతుడు.”
- “రెండులేనివాడూ రెండు అయినవాడూ భగవంతుడు.”
- “ఉన్న ఆ ఒక్కటి అర్థం కానంతవరకు రెండుగానే కనపడుతుంది.”
- “అంతా అయినవాడూ అర్థంకానివాడూ భగవంతుడు.”
- “సర్వం తానైనవాడే స్వార్థరహితుడు.”
ఆనందం
- . “ప్రశాంతంగా ఉండటమా? అది వస్తే ఇంకా ఏముంది? (నవ్వి) అది ఏ బజార్లో అమ్ముతున్నారో తెలిస్తే బాగుండును నాన్నా, అందరం వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. అసలు ప్రపంచానికే లేదు ప్రశాంతత. ఒకరి కొకరకంగా ప్రశాంతత లేకపోతే, మరొకరికి ఇంకొకరకంగా లేకపోతుంది.”
- “ఎవరికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ శాంతంగా ఉంటారు. అయిష్టత అయినచోట కోపంగా ఉంటారు. నిజంగా కోపం లేనివాడు ఎక్కడా కోపం లేకుండానే ఉంటాడు.”
- “తృప్తే ముక్తి.”
- “ఇది కావాలని లేకపోవటమే ఆనందం.”
- ‘బ్రహ్మానందం అంటున్నారు ప్రతీదానికీ; మీరేమంటారమ్మా?’
“తనకు నచ్చింది ఆనందం. ఆ ఆనందాన్నే బ్రహ్మానందం అని ప్రతిదానికీ వాడుతున్నాము. అయినా అన్నీ బ్రహ్మానందంలోనుండి వచ్చినవే. కనుక ప్రతీదానికి బ్రహ్మానందం అనే ముక్క తెలియకుండానే పడుతుంది. ఒకడు దొంగతనం చేసి తాను అనుకున్నట్టుగా జరిగితే బ్రహ్మానందంగా ఉందంటాడు. తనకు కష్టమైనవాడిని కొట్టికూడా బ్రహ్మానందాన్ని అనుభవించానంటాడు. తన నోటికి కొంచెం రుచిగల కూర తగిలినా … ‘బ్రహ్మానందంగా ఉంది కూర’ అంటాడు సర్వం బ్రహ్మానందమేగా? సర్వకాలం కూడా బ్రహ్మానందం కావద్దూ? సర్వకాలం బ్రహ్మానందమైనదే బ్రహ్మానందం తాత్కాలికంగా కలిగే ఆనందం దాని ఛాయ.” - ‘ఆనందమంటే ఒక్క బ్రహ్మానందమేనని పెద్దలు చెబుతారు అమ్మా,’
“ఈ ద్వంద్వాలన్నీ ఆ బ్రహ్మలో భాగాలే గదా? ఈ ద్వంద్వాలు ఆ బ్రహ్మగా గుర్తించినది బ్రహ్మానందం.” - ఒకరు : నాకు సందేశం ఏమైనా ఇవ్వమ్మా-
అమ్మ : నా చేత దైవం ఏది చేయిస్తే అది చేస్తున్నాను – అనుకో నాయనా. అంతకంటే సందేశం ఏముంది. – నీకే కాదు ఎవరికైనా. - “సుఖానికి మార్గం ఒకటే- ఏది చేసినా దైవం చేశాడనుకోవటమే.”
- “ఏ మార్గాన నడిచినా వాడే నడిపిస్తున్నాడనుకోవటమే సన్మార్గం.”
అమ్మను గురించి
- ‘స్టడీ సర్కిల్సువల్ల అందరికీ తెలియజేస్తే బాగుంటుంది?’
“తెలపటమేముంది, పొట్టనిండా అన్నం పెట్టడమే, వీడూ వాడూ అనే విచక్షణ లేకుండా.” - భోజనం చేసారా అని అమ్మ అడిగితే, ఆయన లేదన్నాడు.
“చేసిరా, నాన్నా” అంటూ, “చెయ్యనివాడే నా కంటపడతాడు” అన్నారు. - ‘అమ్మగారి సిద్ధవాక్కు వినాలండీ. అడిగేవేమీ లేవు.’
“భోజనం చేశావా?” - “ఇంత సొమ్ము ఈ నగలకు పెట్టేకంటే దీనితో ఎంత మంది తింటారు అనిపిస్తుంది.”
- “పంచి పెట్టని కాడికి ఉండడము దేనికీ?”
- “మునిస్వామికి 106 జ్వరం వచ్చింది. తెల్లవారేసరికి స్ఫోటకం పోసింది. నాన్నగారు భయపడి పిల్లల్నటు పోనివ్వలేదు. అప్పుడే అన్నా – మన పిల్లల కొస్తే ఏం చేస్తామని.”
- “పది ఏళ్ళు పనిచేసింది నాన్నా పెద్దదైంది. తోలుకుపోతావా అంటే 60 రూపాయలిచ్చి ‘అరకేనా దున్నుతుంది’ అన్నాడు. ఆ 60రూ. విసిరికొట్టా. దున్నించుకునే మాటయితే మనమే దున్నించుకోలేమూ?”
- “ఇంటికి వచ్చిన గొడ్డును పంపించలా. ఇంట్లో పుట్టిన బిడ్డకు నాలుగేళ్ళు ఉద్యోగం లేకపోతే ఎక్కడికన్నా పంపిస్తున్నామా?”
- ‘మీకు అందరూ సమానమా?’
“పెట్టులో లోటు ఉన్నా, ప్రేమలో లోటు లేదు. నాకు బిడ్డగా గాక మరో రకంగా కనబడరు.” - ‘నీకు కోపం వస్తుందా?’
“మీకంటే చాలా వస్తుంది. ఎక్కడనుండి రావాలీ? మనలోదే. మన అభిప్రాయాలకు భిన్నంగా వుంటే వస్తుంది. కోపం లేనివారు లేరు. స్థాయిని బట్టి ఉంటుంది. తప్పులు చేయటం మానవ స్వభావం. ఒకడు తొందరగా, మరొకడు ఆలస్యంగా బయట పడతారు. ఇక్కడా తప్పుచేయబోయి అమ్మ సన్నిధానం అని తట్టుకుంటావు ….” - “అందరికీ స్థానం వుంది ఇక్కడ. ‘తప్పు’ చేయని వాడే ఇక్కడకు రావాలని ఉంటే ఎవ్వడూ రాలేడు. అందుకే ఎవరు ఎవరిని విమర్శించినా నేనూరుకోను.”
- “నేను ఆధ్యాత్మికం వేరూ ఇదంతా వేరూ అనుకోను. రెండూ ఒకటే.”
- “నాకు నేనే ఉపమానం.”
- ‘నిన్ను తలుచుకుంటే, నిన్ను చూస్తే ఏడుపు ఎందుకొస్తుంది?’
“మేఘాలు చల్లగాలికి వర్షిస్తాయి.”
అందరిల్లు
- ‘అమ్మా, వంటశాలలో బొగ్గులు కాకుండా కట్టెలైతే?’
“చెయ్యవోయ్, సలహా వద్దు. ఏదైనా అంతే. చెయ్యండి.” - “ఒకణ్ణి ఉండమనను. ఉంటాననే వాణ్ణి వద్దనను.”
“ఇక్కడ అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అనేదేం లేదు.”
పురుష ప్రయత్నం
- “తను చేసే పనులలో ఏదో ఉన్నదనుకోకపోతే బ్రతకలేడు. మానవుడికి మిగిలింది అదొకటే – తాను చెయ్యకపోయినా చేశానని అనుకోవటం.”
- “ఇదంతా చేస్తున్నది తాను కాదనుకున్నప్పుడు తాను నిమిత్త మాత్రుడేగా?”
- “మానవ ప్రయత్నమంటూ లేదు. ప్రయత్నం వెనక ప్రేరణ ఉన్నది. ఆ ప్రేరణ నేనే.”
- “వాడి ఆటలో ఉన్న మనం మనదేదో ఉందని బాధపడుతూ వుంటాము.”
తరుణం
- ‘తరుణమంటే ఏమిటమ్మా?’
“తప్పించుకుందామన్నా తప్పనిది. చేద్దామన్నా చేయనీయనిది. వీటి నన్నింటిని నడిపించేది.” - “కావాలని వుంటే అవుతుంది. అంటే కాదు.”
- తాను ఎంత ప్రయత్నించినా ప్రతిష్ఠ జరగటం లేదని బాధపడుతున్న వృద్ధురాలితో అమ్మ –
“భగవంతుని ప్రతిష్ఠ మనం కాదుగా చెయ్యాల్సింది. మనకేం సాధ్యమౌ తుంది? అక్కడ ఆయనకు ఉండాలని ఉంటే అదే జరుగుతుంది. అంతటా ఉన్న భగవంతుడిని ఒకచోట ‘ఇక్కడ ఉన్నాడని’ ప్రతిష్ఠిస్తున్నా మంటే మన గుర్తు కోసం, మన లక్ష్యం కోసం. దాన్ని రాయి అనుకోవటం లేదుగా, అందులో ఉన్నాడనుకుంటున్నాము. అక్కడ ఆయనకు ఉండాలనిపిస్తే – అదే జరుగుతుంది.” - “ఇక్కడ వుండే యోగ్యత లేనప్పుడు ఏవో కారణాలు కనిపిస్తాయి. ఆ యోగ్యత ఉన్నప్పుడు ఈ కారణాలూ కనిపించవు, ఏదీ ఎవరూ అడ్డం అనిపించరు.”
- “ఒకడు మాటతో, ఇంకొకడు ప్రసాదంతో తృప్తి పడతాడు.’
- “అసలు నివేదన అంటే ఏమిటీ? నువ్విచ్చిన తిండి, నువ్విచ్చిన మనస్సు, నువ్విచ్చింది – అని గుర్తిస్తున్నాము అని. అంతే కానీ నివేదన అంటే పదార్థం కాదు.”
దైవం
- “తెలియంది, అర్థంకానిది మరొకటి ఉంది. స్వభావమన్నా, శక్తి అన్నా, దైవం అన్నా – మనకు అతీతమైనది, నడిపించేది.”
- ‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు.’
“దిక్కులేని వాడికే కాదు. అసలెవరికైనా వాడే దిక్కు.” - “ప్రతి ఒక్కరికీ నమస్కారం చెయ్యకలిగితే, తానే దైవం.”
- “మంచితనం కంటే దైవత్వం ఎక్కడుంది?”
- ‘అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటీ?’
- “అహం కూడా వాడేనని.”
“రాయిలో చైతన్యం చూడగల మనం, మనిషిలో చైతన్యం చూడలేక పోతున్నాం.” - “పరిణామం పొందే ప్రతి వస్తువూ జడం కాదు.”
- “చెట్టు పరమేశ్వరుడే కానీ పరమేశ్వరుడు చెట్టు మాత్రమే కాదుగా?” &
“అంతటా ఉన్నదానిలో ఎవరెవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు చూస్తున్నారు. గజంలో అంగుళాలు ఉన్నై. గాని అంగుళంలో గజాలు లేవు.” (BG 9.4, BG 9.5) - “క్షేత్రంలో ఉన్నాడు. క్షేత్రాన్ని నడిపిస్తున్నాడు. క్షేత్రమై ఉన్నాడు.”
- “ఈ గుడ్డలన్నింటికి మూలం ప్రత్తి గదా? ఈ ప్రత్తికి మూలం భూమి. ఆ భూమికి మూలం ఎవరు? అనుకుంటే దేవుడు అని వస్తుంది. ఇలాగ అన్నిటికి మూలం ఎవరు అని ఆలోచిస్తే ఆ దేవుడే వస్తాడు.” (BG 7.7)
- “కృష్ణుడు కూడా విశ్వరూపం అంటూ ఈ సృష్టినేగా చూపించాడూ?”
- ఏదైతే సర్వత్రా ఉన్నదో అదే అనేక రూపాలు.”
- “నాలుగు చేతులు కాళ్ళతో వేరుగా ఎక్కడో లేడు. అన్నీ అయి ఉన్నాడు. గులాబి పువ్వుగా, తమలపాకుగా, మంచంగా, కిటికీగా … అన్నీ తానే అయి వున్నాడు.”
- “ఒక నిజమే నలుగురికి నాలుగు రకాలుగా కనపడుతోంది.”
- “మీరూ ఈ కనపడేదీ – ఈ సృష్టే భగవంతుడు అనుకుంటాను. మీకంటే భిన్నంగా చూడటం లేదు. చూడాలని అనిపించటం లేదు.”
- “దేవుణ్ణి చూడాలనే ఆసక్తి నాకు లేదు. ఈ కనబడుతున్న దానికన్నా భిన్నంగా దీ నాకు కనపట్టం లేదు.
- “తెలివి సరస్వతి. వస్తురూపం లక్ష్మి. లోని శక్తి పార్వతి. ముగ్గురూ వస్తువుగానే ఉన్నారు. వేరే ఎక్కడనూ లేరు.”
- “రూపం తేడా. అన్నీ దైవమే.”
- “ఇష్టదైవమే అన్ని రూపాలూ.”
- “రాముడంటే మగవాడనీ, అనసూయ అంటే ఆడదనీ కాదు – అనేక పేర్లతో అన్నీ వాడే.”
“దేనిని గూర్చి చెప్పినా ఉన్న దానిని గురించి చెప్పడమే.” - “అన్నీ వాడు పెట్టే చింతలే కనుక మనకు ఏది వచ్చినా చింత అవవసరం.”
- “అంతటా ఉన్నదానిని వెతుక్కోవటమేముందీ? దృఢం అవడమే.”
- “(కనపడే) ఇవన్నీ అణువణువూ అదే. వేరే ఎక్కడో ఉండేది కాదు.”
- “ఇదంతా అదేనన్న భావం ఏర్పట్టానికే ప్రత్యేక ఆరాధన.”
- ‘దైవం సాక్షిమాత్రుడంటారే?’
“అన్నింటిలో తానే, అన్నీ తానే గనుక.” - “వాడెక్కడో ఉన్నాడనీ, యిక్కడ లేడవీ, మీరు కాదనీ, చూడాల ప్రయత్నమూ లేదు. మీకంటే భిన్నంగా (దైవం) ఉన్నాడనుకోవటం లేదు.
- “ఒకే శక్తి అన్ని గుణాలతో, అన్ని రూపాలతో వుంది. ఈ పర్వమూ దైవఁ ప్రత్యేకించి ఒక రూపంతో లేడు, చూడటానికి ఏ రూపంగా చూస్తాము గంగానదీ అదే. మురికి కాలువా అదే.” (Check with Physical Book)
- ‘ఏ దైవశక్తిని ధ్యానించి పూజిస్తున్నామో, ఈ ప్రపంచమూ అదే అయితే
దీనిని చూచి ఎందుకు భయపడుతున్నామూ?’
“భయంకూడా అదే.”
‘నివారణోపాయం’
“భయంతో మనసు లగ్నం అయింది. భయం అభయంగా మారవచ్చు.” - “ఏ దైనా వున్నది అదే, వస్తువు అదే. స్థానాన్నిబట్టి పేర్లు అవసరమైనాయి.”
బాధ
- ‘అన్ని బాధలలోకి ఏ బాధ ఎక్కువ?’
“తాను కావాలనుకున్నది అందకపోతే అది ఎక్కువ బాధ.” - “బాధలు లేనిది జీవితం కాదు. అలలు లేనిది సముద్రమూ కాదు.”
- ‘నాకీ పెళ్లిలేకపోతేనేమమ్మా? ఇన్ని గోలలెందుకు? ఏ అడవులలోకన్నా వెళ్ళి ఉందామనిపిస్తోందమ్మా!’
“ఇప్పుడున్నది అడవి కాకపోతేగా?”
‘అక్కడయితే యిదంతా ఉండదుగా? ఈ జనం ఈ బాధలు వుండవు.’
“అక్కడయితే ఇంకొకరకమైన బాధ వుంటుంది. ఎక్కడికి పోయినా తప్పదు. అక్కడ చెట్లున్నాయి, పక్షులున్నాయి, తేళ్లున్నాయి, పాములున్నాయి మృగాలున్నాయి. అన్నింటికి మనస్సు ఉన్నది. ఒకళ్ళను ఒకళ్ళు స్వజాతి కూడా అర్థం చేసుకోలేకుండా ఉంది. ఇట్లా అర్థం చేసుకోని బాధ యెంత దూరం పోయినా తప్పదు. తప్పించుకోలేని పరిస్థితిలో నుండీ తప్పించు కోవాలనుకోవటమే బాధ.” - “అక్కరలేనిది అనుభవిస్తున్నా బాధే. అవసరమైంది అనుభవించకపోయినా బాధే.
- “బాధకు కారణం భేదమే.”
- “బాధ్యతే బాధ. బాధలేని బాధ్యతలు అందరికీ లభ్యపడవు.”
దానికీ దీనికీ తేడా ఏమిటమ్మా?’
“నేను చేస్తున్నాను, నాది, నాకు అనేది బాధ గల బాధ్యత. అంతకంటే -రెట్టింపు పని చేసినా నేనే చేస్తున్నాను’ అనేది లేకుండా ‘మనం నిమిత్తం’ అనుకుండేది బాధలేని బాధ్యత.” - “ఇతరులను గురించి మనకున్న ద్వేషం మనల్ని దహిస్తుంది.”
- ‘బాధలూ సుఖాలూ సమంగా ఎలాగ కనబడతాయమ్మా?’
“ఏదో ధ్యాస మీద తింటూ వుంటావనుకో. అప్పుడు నీవు ఏమి తిన్నది, ఎంత తిన్నది కూడా తెలుసుకోలేవుగా?”
పాతివ్రత్యం
- “పెళ్ళి అంటే ఆత్మార్పణే. ఆయనా, ఆయన వేసిన ముడీ వేరుగా వుంటేగా? ద్వంద్వంతో ద్వంద్వాన్ని జయించాలి.”
- ‘పాతివ్రత్యమంటే ఏమిటమ్మా?’
“భర్త ఎట్లా నడచినా ఏం చేసినా ఎట్లా చూచినా- ఆయన తప్ప ప్రపంచమే లేకపోవటం.” - “భగవంతుడు భర్త కాదు, భర్తే భగవంతుడు.”
- “ఆమెకేం? విలక్షణమైన మనిషి. చాల తృప్తిగల మనస్సు. ఏమి వున్నా, లేకపోయినా – ఎంత తృప్తిగా వుంటుందో? రెండే చీరలు వుంటయ్. అవే శుభ్రంగా కట్టుకుంటుంది. ముఖాన ఎప్పుడూ బొట్టూ, కాళ్ళకు పసుపూ, తల్లో ఏదో ఒక పువ్వు పెట్టుకుంటుంది. ఆయన ఇంటికి వచ్చేటప్పటికీ మంచి నీళ్ళు ఇస్తుంది. ఎన్నాళ్ళకయినా ఇంటికిరాని, వచ్చిన రోజు నవ్వుతూ పలకరిస్తుంది. ఏదన్నా తెచ్చి పెడితే తృప్తిగా తింటుంది. ఫలానా కావాలని అడగదు.”
విధి
- “పుట్టటమే కర్మ. నువ్వు చెయ్యటం కాదు వాడు చేయించటమే.”
‘మీరు సెలవీయండమ్మా మీ అడుగు జాడలలో నడుస్తాను’
“ఇప్పుడు నడవకపోతేగా రేపు నడవటానికి.” - ‘అంతా ఒకటేననే భావం ఎప్పుడు వస్తుంది?’
“అంతకు ముందు దీనిని గురించిన ఆలోచన లేదు గదా! ఇప్పుడు ఈ విషయం తెలుసుకుందామని కలిగింది. అట్లాగే మనకొచ్చే పరిణామాలు మనకు తెలియకుండానే వస్తుంటాయి.” - “పతన మేముందీ? ఎవరికి ఎంత అవసరమో అంత వరకూ చేయిస్తాడు.”
ప్రేరణ
- “మన చేతిలో ఉందని ప్రారంభిస్తే ఏమీ లేదని తెలుస్తుంది.”
- ‘సర్వమూ వాడి ప్రమేయం వల్ల జరిగినప్పుడు, – కర్మ సిద్ధాంతం? మానవుడికి ఎంతవరకు స్థానం?’
“కర్మ మనం చేయడమంటే వాడు చేయించటమే.” - ‘దేవుడే పెడతాడని కూర్చుంటే వస్తుందా?’
“కూర్చోలేం – కూర్చుంటే పెడతాడు.” - “నేనే చేస్తున్నా నంతా – అనుకొన్నా బాధ లేదు. పూర్తిగా వాడు చేయిస్తున్నా డనుకున్నా బాధ లేదు.”
- ‘దైవకార్యం చేయాలని వుంది. ఎప్పుడు నెరవేరుతుంది?’
“దైవం చేయించుకొన్నప్పుడు.”
సందేశం
- ఆప్టే : మాకేదేనా ఆదేశం…
అమ్మ: మీ కిచ్చింది తృప్తిగా తిని, ఇతరుల కాదరణగా పెట్టడం, సర్వమూ దైవం చేస్తున్నా డనుకోవటమే. - ‘మనసుకు స్తిమితం కలగటానికి మార్గం జెప్పమ్మా?’
“జరిగే ప్రతిదీ దైవం చేయిస్తున్నా డనుకోవటమే.”
మానవత్వం – మాధవత్వం
- “జ్ఞాని పశువులో దైవాన్ని చూస్తాడు.
అజ్ఞాని మానవుడిలో పశువుని చూస్తాడు.” - “జ్ఞాని మానవుడిలో దైవాన్ని చూస్తాడు.
అజ్ఞాని దైవంలో మానవుణ్ణి చూస్తాడు.” - ‘మానవుడే మాధవుడా అమ్మా?’
“భగవంతుడున్నాడని గుర్తించింది మానవులు. పుస్తకాల్ని రాసింది మానవులేగా? మానవుడు లేకపోతే దేవుడే లేడు. మానవత్వం మానవ తత్వాన్ని గుర్తిస్తే మాధవుడే. గుర్తు తేడా తప్ప మాధవత్వం మానవత్వంలో వున్నట్లేగా? ఒక వస్తువు దగ్గర పెట్టుకుని మర్చేపోయి వెతికినట్లు మానవుడికీ మాధవుడికీ తేడా.” - “మాధవుణ్ణి గుర్తించి అన్ని వస్తువుల్లోను మాధవుని చూచిన మానవుడే మాధవుడు.”
శక్తి
- “శక్తిని గుర్తించటానికి రూపమే ఆధారం. చెప్పుకోవటానికే ఆకృతి. అంతటా ఉన్న దైవం శరీరంతో రావటానికి కారణం అదే. తాను రాకుండా చెయ్య లేడా? అంటే – చెయ్యగలడు కాని వాడిని గుర్తించే దెట్లా?”
- ” “రూపాంతర మయ్యే దంతా, ఆత్మ శక్తే.”
- “పరాశక్తి అంటే, మనకు అందుబాటులో లేని శక్తి.”
- ‘అతీతశక్తిని తెలుసుకోవటం ఎట్లా?’
“అతీతశక్తి ఉన్నదని ఆలోచిస్తున్నది ఇదే. ఇక్కడ ఉన్నదే అంతటా ఉన్నది. అనుభవం పొందేదీ ఇదే.”
సందేహమూ – సమాధానము
- ‘నువ్వు వెళ్ళాక – ఈ సంస్థ ఏమవుతుంది?’
“అన్నీ ఏమవుతాయో – ఇదీ అంతే.” - ‘అమ్మా! బ్రహ్మ రాక్షసులున్నారు – అంటారు. అదేమిటి?’
“మన భ్రమే బ్రహ్మరాక్షసి.” - ‘ఈ సంసార గొడవలు బాధగా ఉన్నాయమ్మా. మోక్షం కావాలి-‘
“ఈ సంసారం బాధ అనిపించకపోవడమే మోక్షం.” - ‘సంక్రాంతికి బొమ్మలు పెట్టడమెందుకూ?’
“ఇవన్నీ కూడ అదేనని.” - ‘మాకు సాధన చెప్పమ్మా -‘
“వచ్చిన వాడికి ఆదరణగా పెట్టడం, ఉన్నదానితో తృప్తిగా ఉండటం.” - ‘దేవుడికి ముడుపు లివ్వాలంటా రేమిటీ?’
“ముడుపు లివ్వడ మంటే మనస్సును యివ్వడమే. ఆ మనస్సును యివ్వలేక, వస్తురూపంగా యిచ్చి తృప్తి పడదామని కావచ్చును.” - ‘మేము ఏం చేస్తే సరి అయిన పని?’
“మీరు చేస్తున్నది దైవసేవ అనీ, సక్రమంగా చేస్తున్నామనీ – అనుకుంటే - ‘ఇంకేం అక్కర్లే దనేది ఎప్పుడొస్తుందీ? ఏం చేస్తే వస్తుందీ?’
“ఏం చేసినా రాదు – వాడిస్తే వస్తుంది.” - ‘భక్తి రావడానికి మార్గం?’
“భక్తితోనే.” - ‘భక్తిని జ్ఞానంగా చేసుకోవటం ఎట్లా?’
“జ్ఞానంలో భక్తి ఉంది. భక్తిలో జ్ఞానం ఉంది. రెండూ విడిగా లేవు. భక్తి పూర్తిగా ఉన్నప్పుడు జ్ఞానం అంటున్నాం. సర్వం నేనే అన్నప్పుడు జ్ఞానం. భక్తిలో నీవు తప్ప ఇంకొకటి లేదనిపిస్తుంది.” - ‘భక్తి కంటే జ్ఞానం గొప్పదంటారు?’
“ఉపన్యాసాలు వింటారు నాన్నా. తన మనసులో ఒకటుంటుంది. అవి విన్న తర్వాత ‘అదేనేమో! అయ్యో నే చెయ్యలేక పోతున్నానే’ అనుకుంటాడు.” - ‘ధ్యాసే ధ్యానం అన్నావు కదా? అదే సరిపోతుందా? లేక వేరే ఏదైనా సాధన అవసరమా?’
“అది తప్ప రెండోది లేనప్పుడు అదే ధ్యానం అవుతుంది. అప్పుడు పూజలు, కళ్ళు మూసుకోవటం, జపం చేసుకోవటం అవసరం లేదు.” - ‘భక్తి ఉండటం వల్లనే అనుగ్రహం కలుగుతుందా?’
“ఒకరు చెప్పటం కంటె అది తనకు తెలిస్తే బాగుంటుంది.” - ‘ఆధారం దొరికిందమ్మా. అది సహస్రారానికి లేవాలి.’
“ఆధారమాధారమైతే – అంతా సహస్రారమే.” - ‘ఆధ్యాత్మికంలోకి వెళ్ళటానికి ఒక మార్గం చూపించండమ్మా-”
“ఏది చేసుకుంటున్నావో అదే చేసుకో. ఏ నామం నీకిష్టమైతే అది చేసుకో.” - ‘నేను చెయ్యలేని ఊహ నా కెందుకూ కలిగించడం?’
“నీవు కాకుండా నీ కతీతమైన శక్తి ఒకటుందని తెలియజెప్పడానికి.” - ‘ఇదివరకు అలాగ వచ్చేవాణ్ణి. ఇప్పుడు రాలేకపోతున్నా నెందుకు?’
“ఇది వరకు ఎందుకు రాగలిగేవో ఇప్పుడందుకే రాలేకపోతున్నావు.” - ‘శాంతి ఎప్పుడు వస్తుంది?’
“ఈ ద్వంద్వాలు రెండూ సహజమనిపించిప్పుడు.”
ఆరాధన
- “ఎవరి పూజ వాళ్ళది. మీరు పూలు పెట్టి పూజ చేస్తే డాక్టర్లు ఇన్జక్షన్ మందుల ద్వారా పూజ చేస్తున్నారు.”
- “ఇక్కడ – మాకు తెలుసు అనుకున్న వాళ్ళు గుర్తించ లేకపోవచ్చు. ఏ తెలియదు – అనుకునేవాళ్ళు గుర్తించ వచ్చు.”
- “ఎన్ని బాధలు వచ్చినా మరవకుండా వుండటమే పూజ అంటే.”
- “ప్రతీ వస్తువులో దైవత్వాన్ని చూడటానికే యీ వ్రతాలన్నీ ఏర్పడ్డాయి.”
- ‘మీ దృష్టిలో మంచి ఆరాధన అంటే?’
“చేస్తేనే గదా చెప్పటానికి? మిమ్ములను దగ్గరకు తియ్యటం, మీరు కావాలనుకోవటం. మీరు కాని దైవం లేదు. ఇక్కడకు రావటమూ ఆరాధనే అహర్నిశం స్మరణా ఆరాధనే.” - “చూడకుండా ఉండలేనంత ఆవేదన నీలో వుంటే తప్పక చూస్తావు.”
- “ఇతరులలో లోపం చూడకపోవటమే పవిత్రత.”
- “ఇష్టదైవం తప్ప నేను లేను అనుకున్నది ఉపాసన. తాను లేకుండా పోవటమే ఆత్మార్పణ.” –
- “నాలుగు రోజులు ఆహారం పెట్టకుండా ఉంటే, అన్నంపైన నీ ధ్యాస ఎట్లా ఉంటుందో – అదే ఉపాసన.”
- “తపనేగా తపస్సంటే.”
- “స్వయం ప్రకాశం అంటే తానే సర్వత్రా ప్రకాశించటం. స్వయం ప్రకాశాన్ని చూడటం అంటే తాను అంతటా ప్రకాశించలేడు గనుక తాను ఇష్టదైవ మనుకుండే దాంట్లో చూడటం.”
- “పిల్లలయేది ఎవరైనా అయేది వారికి ఏది చేసినా ‘నా కోసం నేను చేసుకుంటున్నా’నన్నట్లుగా ఉండాలి. అంతేగాని ఎవరినో ఉద్ధరించటానికి కాదు.”
సాధన
- “ప్రజాసేవ చేయటమూ మోక్షమార్గమే.”
- ‘మేము తరించటానికి ఏమి చెయ్యమంటారు.’
“ఏం చెయ్యాలని తోస్తే అది.” - “నాచే యీ పని చేయిస్తున్నాడనుకున్నప్పుడు అదే సాధన, తపస్సు, యోగం అవుతుంది.”
- “నీ జీవితంలో వచ్చే కష్టసుఖాలన్నీ ఎవరో ఒకరు ఇస్తున్నారనుకో. అది దేవుడనూ, అమ్మా అనూ, ఏదో అదృశ్య శక్తి అనూ, ఏదయినా అనూ. అన్నీ అదే చేయిస్తున్నదనుకో. దారినపోతూ ఎవరన్నా ఒక రాయివేసినా ఆ శక్తే చేయించింది అనుకొని పోతూ ఉండు. నువ్వు సాధన చెప్పమన్నావు. కనుక చెప్పడం ఇది.”
- “నీకు తోచేది నేను చెప్పా- ననుకొని చెయ్యి.”
- “పద్ధతులన్నీ చెప్పారుగా నాన్నా. ఏదైనా చేసుకో. ఏది సాధ్యమైతే అది చేసుకో. కుటుంబంలో వుండీ చేసుకోవచ్చు.”
- “ఎవరు ఏ సాధన చేసినా – నేను వద్దనను.
ఒకడికి ధ్యానం బాగుంటుంది.
ఒకడికి నామం బాగుంటుంది.
ఎవరికి ఏది సాధ్యమయితే- అదే బాగుంటుంది.” - ‘ఓమనిషీ! అని పిలిస్తే పలకడు కనుక ఏదో ఒక పేరు. అట్లాగే అన్నీ చేయించే ఆ శక్తికి రాముడో, కృష్ణుడో- అని పేరు పెట్టారు.”
- ‘రామం చేస్తున్నాను. నా దృష్టిలో అమ్మ ఉంది.’
“రామం అమ్మ కాకపోతేగా! అమ్మ రాముడు కాకపోతే గదా! అన్ని రూపాలు చూడలేక, అన్ని నామాలపై లక్ష్యం పెట్టుకోలేక ఒక రూపం, ఒక నామం తీసుకొంటాం.” - “నిన్ను కడతేర్చవలసింది అమ్మ. ఆ బాధ్యత నీది కాదు.”
- “అక్షరలక్షలు జపం చెయ్యమనటం దేనికంటే ఆ తరువాత నువ్వు మర్చిపోదా మనుకున్నా, అది నీ వెంట పడుతుంది.”
- ‘అమ్మా, నామంతో కూడా అద్వైత స్థితి పొందవచ్చునా?
“పూర్తిగా ఏమి చేసినా అద్వైతస్థితే.” - “ఎవరు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు చూస్తున్నారు గదా? గజంలో అంగుళా లున్నాయి గాని అంగుళంలో గజం లేదు. నేను కొలతబద్ద అన్నది అదేగా? ఎవరిబద్ద ఎంతమట్టుకో అంతమటుకు.”
- ‘తరించే మార్గం చెప్పమ్మా.’
“ఇవన్నీ బాధలు కావనుకుంటూ తృప్తిగా అనుభవిస్తే అదే తరించే మార్గం. ఇవన్నీ ఇచ్చిన వాడే బాధలు కలిగిస్తున్నా – డనుకుంటూ తృప్తిగా అనుభవిస్తే అదే తరించే మార్గం.”
మంత్రం
- “రూపాన్ని ధ్యానిస్తే ఏది పొందుతాడో – అక్షరాలను ధ్యానించినా అదే పొందుతాడు.”
- “చెప్పింది మంత్రం కాదు. మననంతో మంత్రమవుతుంది.”
- “తటపటాయించే మనస్సు స్థిమితపడి అన్ని వేళలా ఆ మంత్రాన్నే జపించి అన్ని రూపాల్లో ఆ రూపాన్నే చూచినప్పుడు వాడే దైవం. వాడు దైవాన్ని చూడటం కాదు, ఆ స్థితి కలిగినప్పుడు వాడే దైవమౌతాడు.”
- ‘మంత్రం చెయ్యటమంటే గుర్తు రావటమే.”
- “మరువనివ్వనిది మంత్రం.”
- “నారాయణ అన్నది పేరూ అయింది, మంత్రమూ అయింది. మనస్సుతో మననం చెయ్యటంతో మంత్రం అయింది.”
- “మంత్రం ద్వారా కడతేరటం కాదు, మంత్రమే కడతేరుస్తుంది.”
- “అన్ని మంత్రాలకూ అర్థం ఒకటే.
అన్ని శబ్దాలూ మంత్రాలే. చెవిలో రహస్యంగా చెప్పిన మంత్రం అపాన వాయువులోనూ, కుక్కానక్కా అరుపులలో విన్పించాలి.” - మంత్రమంటే దైవమేగా. దైవాన్ని చేతపట్టుకున్న తర్వాత కడతేరతామా లేదా – అనే ఆలోచనెందుకు?”
- “అనుభవం కానంత వరకూ తాను కాలేడు. ఏ వస్తువు కోసం మంత్రం చేస్తున్నావో, అదే తానయినప్పుడు అన్నీ తానే.”
మనస్సు
- “మన మనస్సును బట్టీ ప్రపంచం కనపడుతుంది.”
- ‘మనస్సుతో మనస్సును గుర్తించటం- అన్నారే! అది ఎలాగ అమ్మా?’
“మనస్సూ భగవంతుడే. మనస్సు చేత ఏర్పడ్డ భక్తీ భగవంతుడే. మనస్సును గుర్తించడానికి భక్తి ఆధారమయింది. భక్తికి మనస్సు ఆధారమయింది. అదే మనస్సుతో మనస్సును గుర్తించటం.” - “బాగు చెయ్యటానికైనా, నాశనం చెయ్యటానికైనా మనస్సును పవర్ ఎంతైనా ఉన్నది.”
- “ఏం పర్వాలేదమ్మా, ఉన్నదానితోనే పూజ చేసుకొనండి. మనస్సు ఉంటే చాలు. . . అశుద్ధానికి పూజ చేసినా వాడికే చెందుతుంది.”
- ‘భగవంతుని ధ్యానం చేసి మనోమాలిన్యాన్ని పోగొట్టుకుందామని ఉంది.
కానీ మనస్సు ఎంత మాత్రం నిలవటం లేదు.’
“మాలిన్యాన్ని పెట్టినవాడే తీసేస్తాడు.” - ‘దైవదృష్టి కలగడానికి ఆశీర్వచన మెట్లా?’
“మంచి మనస్సు ఇవ్వమని దైవాన్ని ప్రార్ధించటమే. మంచి మనస్సు కలిగిన తర్వాత ఏమి వస్తుందనేది అక్కరలేదు. అటువంటి ఆలోచన రావటమే ఆశీర్వచనం ఉన్నట్లు గుర్తింపు.” - ‘మనస్సు నిలవటం లేదమ్మా!’
“నిలపమనే ప్రార్ధించాలి.”
వాక్చమత్కృతి
- ‘గోత్రం గుర్తులేదు.’
“మాతృశ్రీ గోత్రం.” - ‘అమ్మా! ప్రేమా, కరుణా, వాత్సల్యమూ అన్నీ అపరిమితంగా ఉన్నవాళ్ళని ఏమంటారూ?’
“అగోచరం అంటారు.” - ‘జపం చేద్దామంటే కాసేపు కూడా మనస్సు నిలవదు.’
“నాకు మీ మీద ఉన్నంత ధ్యాస వాడి మీద ఉండదు.”
గుర్తు
- ‘నీకిట్లా గుర్తుంటాయమ్మా ప్రతిదీ?’
“నాది అనుకోవటమే గుర్తుకు కారణం. మీరు పిల్లలను మర్చిపోతున్నారా? ఇదీ అట్లాగే. ఇందులో విశేషమేమున్నదీ?”
లౌకికాలు
- “పిల్లలు పుట్టని వాడికి, పుట్టి ఒక రోజన్నా ఉంటే చాలనిపిస్తుంది. పుట్టిన తరువాత పోయిన వాడికి పుట్టకపోయినా బాగుండేదనిపిస్తుంది.”
- ‘నేనింతవరకు సుఖమెరుగను.’
“సుఖమనేది తెలియకపోతే కష్టమెట్లా గుర్తిస్తావు?” - “కారణం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకునేది కరువైపోయింది.”
- “భాగ్యవంతుల దగ్గర తలవంచటం కంటే బీదవాళ్ళ దగ్గర తలవంచటం నయం.”
- “వంకాయ పుచ్చుకాయ అయితే పుచ్చు తీసేసి మంచి భాగం వండు కుంటాం. ప్రతి వ్యక్తిలో తీసుకోవలసింది మంచే కాని చెడు కాదు.”
- “అవతల వాడిని మనం మంచితనంతోనే మార్చాలి.”
- “భావానికి రూపం ఉంది.”
- “ఏ భావమైనా స్థిరంగా నిలవటమే తెలుసుకోవటం.”
- “దానం అన్నది మనసును బట్టి వచ్చేది. ఆస్తిని బట్టి వచ్చేది కాదు.”
- “హృదయం అంటే గుండె అని గాదు. గుర్తించేది అని.”
- మరపుకు కారణమేమిటి?’
“లక్ష్యం లేకపోవటం.” - “ప్రేమ ఎక్కడ వుంటుందో కోపం అక్కడే వుంటుంది. ఇద్దరు పిల్లలు బురద పూసుకొస్తారు. వారిలో తన పిల్లనే కొడుతుంది.”
ఆధ్యాత్మికాలు
- ‘దేశసేవేగానీ దేవుని సేవ ఎఱుగం.’
“దేశసేవ, దేవుని సేవ రెండూ వేరు గాదు.” - “నా భార్యా, నా పిల్లలూ అనేది గుర్తున్నంత కాలమూ సంసారం ఉన్నట్లే.”
- “అందరమూ యిక్కడ ఊరికే తింటున్నాం అంటున్నావు.
ఆ వూళ్ళో తింటే నీ సొంతమనా?” - “అందరినీ మోసే తల్లి భూదేవి. ఉన్నా పోయినా, మోసేది ఆమే.”
- “ఇదికాదు, వేరే ఉంది అంటారు. అది కనపడదు. ఇది కాదంటారు. -ఇది కాకుండా నేను చూడలేదు.”
- “ఏం అడిగామో అమ్మ అది ఇవ్వదు. ఏది అవసరమో అది ఇస్తుంది.”
- “ప్రహ్లాదుడూ ధృవుడూ చరిత్ర వింటాం గానీ మన పిల్లవాడు ధృవుడైతే భరించలేం.”
- “చైతన్యమంటే కదలిక. కదలికకు హేతువయినది స్పందనం. (వైబ్రేషన్) స్పందన అంటే కంటికి కనపడకుండా ఉండే కదలిక. పూవు విచ్చుతున్న ప్పుడు గుర్తించలేము.”
- “వస్తువును గురించి భాషమారింది గాని వస్తువు మారలేదు.”
- “లడ్డు అవటంకంటే తినటం రుచి.”
- ‘విశ్వరూప సందర్శనమంటే ఏమిటి?’
“ఈ కనపడే దానిని చూడడమే.” - “భిన్నత్వమంటే హెచ్చూ తగ్గే.”
వేదాంతం
- “చెట్టూ విత్తనం ఒకటే. అదే చెట్టు, కొమ్మ, ఆకు, కాయ, పువ్వు, పండు -ఇన్నీ అయినట్టు ఒకేశక్తి, రూపాలు వేరని నాకనిపిస్తుంది.”
- “మొదట ‘నేతి’ ‘నేతి’ తర్వాత అంతా అవును.”
- “ఇదంతా అదే. పరిపూర్ణమే.”
- “నేనంటూ లేకుండా అంతా నీవే – అన్నా, మంచిదే, లేదూ -, అంతా నేనే -అన్నా, రెండూ ఒకటే.
- “కనపడుతున్న రూపమేదో – కనపడనిదీ, అదీ అమ్మే.”
- “ఒకరని ఏముందీ?
అందరూ అవతారాలే. తలో పనికి వచ్చాం.” (BG 9.11) - “ప్రపంచమూ – పరమార్గమూ వేరు కాదు.”
అద్వైతం
- (ఉప్పుబొమ్మ ఉదాహరణ గురించి) “తాను వేరుగా వుంటేనే, ఉప్పు సముద్రంలో కలిసిపోవడం చూచేది. అద్వైతాన్ని ద్వైతంగా వుంటేనే చెప్ప గలడు. ఒక వస్తువును గుర్తించాలంటే, వేరుగా వుండి గుర్తించవలసిందే.”
- “ఒకటి రెండుగా అన్పించటమే భ్రమ.”
- “ఒకటిగా వుంటే అద్వైతం. ఇది అదే- అనే విషయం మాటలతో గాక అనుభవాని కొచ్చినప్పుడు అద్వైతం.”
- “నీ చుట్టూ ఉన్నదాన్ని నీలాగా చూచుకోవటం అద్వైతం.” (BG 6.32)
- “అంతా ఆత్మ అనుకున్నప్పుడు జిల్లెళ్ళమూడి ఎంతో – సరిహద్దులు దాటేక ໙໐!”
- “సర్వత్రా ఆ చైతన్యమే చూస్తునప్పుడు ప్రశ్నే లేదు.”
- “నేను మీ కంటే భిన్నంగా లేను.”
- “మిమ్ములను విడిచి నేనూ, నన్ను విడిచి మీరూ లేరు.”
ముక్తి
- “ఉన్నది ఒకటే త్రోవ. ఎటు అడుగేసినా వాడి దగ్గరకే. వేరే చోటు లేదు.”
- “నేనూ, నీవూ, ఏకం కావటం అంటే శరీరం కలుసుకోదు. భావం కావటమే.”
- “నీవంటూ లేకపోయిన తరువాత అంతా నేనే.”
- “అన్నీ తెలిసినా, ఏమీ తెల్సుకోవల్సింది లేకపోయినా – ఒకటే.”
కటాక్షం
- “దుష్ట శిక్షణ అంటే మనుషులను చంపటం కాదు. మనస్సును మార్చటమే అని నేను అన్నాను. అంటే ఆనాటి ఆ విధానం తప్పు అని కాదు. ఆనాటి వ్యవస్థ అది.”
- ‘మీ దయ ఉంచండి తల్లీ మా మీద.’
“అది ఎప్పుడూ ఉన్నది నాన్నా. ఈ కష్టాలూ, సుఖాలూ అన్నీ ఆ దయ ఇచ్చినవే.” - “నా దగ్గర ఉండగలగడం మీ యోగ్యతల వలన కాదు.”
- “మనం దాని నుండి వేరు అనుకోకపోతే భగవంతుడి దయ అనలేము. అన్నీ వాడే అయితే ప్రత్యేకించి దయ ఏముంది? కాని చెప్పక తప్పటం లేదు. అంతా అయినదాన్ని ‘అది, ఇది’ చేసాము. భగవంతుడు అని కాక భగవంతుని శక్తి అని చెప్పుకుంటాము. అసలుకు ‘ఆ, ఈ’లు లేవు. ఆ ప్రపంచం, ఈ ప్రపంచం అని మనం రెండుగా ఉన్నాము కనుక – చెప్పుకోక తప్పదు. అదీ ఇదీ, కూడా అంతే” అని.
- “భగవంతుని కటాక్షమెప్పుడూ వుంది. కాని నువ్వు దానిని అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు గుర్తిస్తావు.”
ఆత్మ
- ‘పరమాత్మ స్థితి ఏమిటి?’
“తాను కాకుండా లేదనే స్థితి.”
‘పరమాత్మ అంటే?’
“తాను కాకుండా లేనివాడు. అంతా తానైనవాడు.” - “ఆత్మ అంటే అంతటా ఆవరించి ఉండి శక్తి మయంగా ఉన్నది.”
‘అది తెలుసుకోవటం ఎట్లా?’
“తెలియటం అంటూ వస్తే శక్తి రూపంగానే తెలుస్తుంది.” - “ఆత్మంటూ తెలిస్తే – అనాత్మ అంటూ లేదసలు.”
- ‘అమ్మా! ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అంటే?’
“నేను మూడుగా అనుకోవటల్లేదు. శరీరం కూడా ఆత్మేననిపిస్తుంది. మారేదీ, మారనదీ కూడా ఆత్మేనని. ఆత్మ అంటే అంతటా ఉంది. సూది మోప సందు లేదంటున్నారు కదా? ఆత్మ కానిదేం వుంది?” - “మీరు సమచిత్తం అన్నారు. రమణ మహర్షి సహజ సమాధి అన్నారు. నేను సహజ సహనం అంటా. సమత్వానికేగా ఇన్ని పేర్లు?”
- “పూసలన్నీ ఒక దారంలో గుచ్చినట్లుగా ఈ జీవులన్నీ ఆత్మ మీదనే ఆధార పడి వుంటయ్. పూసలన్నీ వేరు వేరుగా ఎట్లా ఉంటాయో ఈ జీవులన్నీ అంతే.”
ఆనందం
- “ఈ నేను వేరు, ఆ నేను వేరు అనుకున్నప్పుడు ఆనందం లేదు – ఈ నేనే ఆ నేను అనుకొన్నప్పుడు ఆనందం వుంది.”
- “అన్నీ తెలిసినవాడికీ, దేన్ని గురించీ ఆలోచన లేనివాడికీ – ఏ బాధా లేదు.”
స్థితులు
- “అన్నీ కావాలనేది త్యాగమే. ఏమీ వద్దేనేదీ త్యాగమే.”
- “ప్రతి స్త్రీలోనూ అమ్మను చూచేవాడికి అందనిదంటూ ఏమీ లేదు.”
- “వాడు (పోతుకూచి రవి) అక్కడ (ప్రెస్లో) ఉంటున్నాడు అంటే ఆ మిషన్లూ, అవీ దేవతార్చన అనుకోబట్టే ఉండగలుగుతున్నాడు. చేతిలో నుండి ఏదీ క్రిందపడినా కళ్ళకద్దుకుంటాడు.”
- “ధ్యానంలో నుండీ బయటకు వస్తున్నాడని అంటున్నారు. ఎక్కడకు వెళ్ళుతున్నాడు, ఏమి అనుభవిస్తున్నాడు? అంతటి ఆనందాన్ని అనుభవించిన వాడు తిరిగి ఎందుకు వస్తున్నాడు?”
- “సంకల్ప రహితమంటే కష్టసుఖాలకు అతీతమయిన స్థితి కాదు. సర్వ వస్తువులూ వాడే అనుకోవటమే.”
- “అన్నిటి యందూ ఒకటే చూడగలగడం ఏకాగ్రత.”
- “సర్వ వ్యాపకంగా ఉన్న శక్తిని గుర్తించటానికి అవకాశం లేదు గనుక -ఈ రూపం కావలసి వచ్చింది.”
- ‘నీ సన్నిధిలో ఉన్నా ఈ రోగాలు పట్టుకున్నాయమ్మా. అక్కడ ఉంటే ఎటూ తప్పవు.’
“ఇదేమిటీ? నా సన్నిధి జిల్లెళ్ళమూడి వరకే పరిమితం చేశావా? నా సన్నిధి రోగాల పుట్ట.” - “నేను కని పెంచిన పిల్లలలో లోపం వెదకడమంటే లోపం నాదే.”
- “తల్లి ప్రేమ లోపాలను పరికించదు. దూషించినా తిరస్కరించినా మమతనే కురుపిస్తుంది.”
- ‘బిడ్డకు తగిన అర్హత ఉండొద్దూ?’
“ఎటువంటి వాడైనా బిడ్డడే. బిడ్డ కావటమే అర్హత.” - “అందర్నీ ఒకటిగా ఆదరించటం అంటే తల్లి స్వభావమే.”
- “జనని అంటే- మూల స్థానమనేగా!”
- ‘మాకూ మీకూ తేడా ఏమిటి?’
“రెండూ కనబడటమే.” - ‘లేని వాటిని గురించి ఎందుకమ్మా అడుగుతావు? ఉన్నవి చాలవూ?’
“పది వేల గొర్రెలున్నా ఒకటి పోతే కావలివాడు దాని కోసమే వెతుక్కుంటాడు.” - “ప్రతివ్యక్తి నన్ను గూర్చి ఎట్లా అనుకుంటారూ అన్న ఆలోచన రాదు నాకు తోచినట్టు చేసుకోవటమే. నన్ను పొగడవచ్చు. దూషించవచ్చు ‘పొయ్యేది ఏమిటిలే’ అనుకోవచ్చు రావచ్చు. ఏమైనా అన్నీ సమానమే. అంతా ఒకటే.”
- “మీరంతా అహం చచ్చిపోవాలనుకుంటే, నేను అంతా నేనే అనుకుంటా.”
- ‘మీరు మాలో దైవాన్ని చూస్తారా?’
“మీ ‘లో’ కాదు, మీరుగా.” (BG 9.11)
జ్ఞానం
- ‘జ్ఞానం అంటే ఏమిటి?’
“తెలుసుకున్నది. కనిపించేదంతా దైవం అనుకోవటమే జ్ఞానం.”
‘అది రావటానికి ఏం చెయ్యాలి?’
“చేస్తే వచ్చేది కాదు. ఇస్తే వచ్చేదే. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారో వాళ్ళే ఇస్తారు.” - “శరీరం లేని ప్రాణం కనపడదు.
చైతన్యం లేని వస్తువు ఉండదు.” - ‘జ్ఞానులకూ, అవతారాలకూ తేడా ఏమిటి?’
“పుట్టుకతో జ్ఞానం ఉన్నవాడు అవతారం. వచ్చి సాధన చేసినవాడు జ్ఞాని.” - ‘సమత్వం చూసే చిత్తానికీ, వ్యవహారంలో ఉన్న చిత్తానికీ పేర్లు పెట్ట వచ్చుగా? – జ్ఞానం, అజ్ఞానం అని అనవచ్చుగా?’
“అజ్ఞానం లోంచే జ్ఞానం వచ్చేది. బొగ్గులలోంచే నిప్పులాగా.” - ‘మా గురువుగారు దైవాంశసంభూతులమ్మా!’
“అంశ గలవారే కాని దైవం కారు కదా? ప్రతీవారూ దైవాంశులే. ప్రకృతే దైవాంశ. రెండుగా గుర్తించినప్పుడు దైవాంశ. ఒకటి అయినప్పుడు ప్రకృతి కూడా దైవమే.” (BG 15.7) - “అన్నీ ఒకటిగా గుర్తించేవాడు జ్ఞాని. అన్నీ తానైనవాడు దైవం.”
- ‘అమ్మా – నేను నీకేమి చేయగలనూ?’
“నీవు చేసేదంతా నాకే.” - ‘ప్రతీ వస్తువులో దైవత్వాన్ని గుర్తించటమే విశేషమంటావు?’
“ఆ దైవమే అనేక రూపాలు అయినప్పుడు అన్నింటిలో దైవత్వం ఉండటం విశేషమేముందీ?” - “ప్రాణం ఎప్పుడూ ఉన్నది. అంతా సజీవం అన్నాక ప్రాణం లేనిది ఏమిటి!”
- “ఆధారం ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటుంది.”
- “జీవం ఎక్కడ లేదు? ఒక వస్తువులో మరో వస్తువు కలిసినప్పుడు ఇంకో గుణం పుడుతుంది. గుణం ఉన్నదంటే జీవం ఉన్నదనే. అది అంతటా ఉన్నది.”
- “పంచభూతాలు ఏ శక్తి ద్వారా నడిస్తున్నాయో ఆ శక్తినే దేవుడు అంటున్నాం.”
- “అందర్నీ తానుగా చూచినా, తనలో అందర్నీ చూచినా ఒకటే.”
- “అన్నింటిలో చూడగలిగినవాడికి అన్నీ అదే అనిపిస్తుంది.”
- “ఎఱుకతో ఎఱుకను చూస్తున్నామన్నప్పుడు చూచేదీ ఏమీ లేదు. అంతా గుర్తుగా; నీకు నీవే గుర్తుగా ఉన్నావు – చెప్పేవి చూచేవి వినేవి ఏమీ .”
- “ఒంటరితనమంటూ ఉంటే భయానికి తావు లేదు కదా? రెండోది ఉన్నప్పుడే భయం. తాను తానుగా ఉన్నప్పుడు భయం లేదు. తాను రెండయినప్పుడు భయం. ఆ రెండూ తానేనని గుర్తించినప్పుడు అభయం.”
- “ఆత్మను గురించి రాశారా? అంటే ఆత్మను కలంగా, కాగితంగా, సిరాగా, పాళీగా అక్షరాలుగా పంచారన్న మాట.”
‘పంచబడిందంటారా?’
“అప్పుడు ఆత్మను ఆత్మకు ఆత్మతో బోధ చేశారు.” - ‘ఏమీ మాట్లాడవేం అమ్మా? ఎన్ని అడుగుతున్నా చెప్పవు?’
“నేను చెప్పేదేముంది? అన్నీ నీవే చెపుతున్నావు. అందరిలో ఉన్నది నేననేదేగా. ఆ నేనే బ్రహ్మ. నే చెప్పేది నేను బ్రహ్మ అని కాదు. ప్రతీవారూ సామాన్యంగా ‘నేనే’ అంటారే, అది అహం. ఆ అహం లేకపోతే అహం బ్రహ్మాస్మి కాలేడు. అహం చేతనే అహంకారాన్ని పోగొట్టుకుంటాడు.
‘నేను భగవంతుణ్ణి అయివుండి నేను భగవంతుణ్ణి తెలుసుకోక పోవట మేమిటి’ అన్నదే అహం చేత అహాన్ని తెలుసుకోవటం.
సర్వత్రా ‘తనను’ చూడటం, సర్వమూ తనలో చూడటం.” - “నువ్వూ నేనూ అనేది పోనంతవరకూ అంతా ద్వైతమే.”
- “ఆత్మ తెలిస్తే అనాత్మ అంటూ లేదు.”
- “ఏ భావమైనా స్థిరంగా నిలవటమే తెలుసుకోవటం.”
- “సర్వం బ్రహ్మ మయంగా దర్శించినవాడు బ్రాహ్మణుడు.”
- ‘నిశ్శబ్దం అంటే ఏమిటమ్మా?’
“అన్ని శబ్దాలు నీ శబ్దంగా తోచటమే నిశ్శబ్దం.” - “లడ్డు కావటం అంటుంది అద్వైతం. లడ్డు తినటం అంటుంది ద్వైతం.”
సుగతి
- “ఈనాడు అందరికి సుగతి అంటున్నాను అంటే మీదేం లేదు కనుక. ఎప్పుడూ మీదేం లేదు. మీరు బురద పూసుకున్నా దాన్ని కడిగి శుభ్రపరచ వలసిన బాధ్యత నాది. దానికి మాతృత్వం కావలసివచ్చింది.”
- “మృత్యుంజయుడంటే చనిపోకుండా ఎల్లకాలమూ ఉంటాడని కాదు. చావుని గురించి ఆలోచన లేనివాడూ, భయం లేనివాడూ మృత్యుం జయుడు.”
- ‘ఆకలి లేనివాడు అదృష్టవంతుడు.’
“ఒక ఆకలే కాదు – ఇది ఉన్నది, అది లేదు. అని లేనివాడు అదృష్ట వంతుడు.” - “సుగతి ఎవరికి లేకుండా ఉంది, నీకేం తెలుసు?”
- “ఏది వచ్చినా బాధలేకుండా అనుభవించడమే సుగతి.”
- తమ బ్రతుకు తాము బ్రతకలేని అనేకవిధాల బలహీనులు ఉన్నారు. తమ కాళ్ళమీద నిలబడలేని వారికే గదా కఱ్ఱ ఆసరా: వారికి తోడుపడండి, అయితే అది వారిపై జాలితో చేసే సహాయమని అనుకోక, వారిని భగవత్ స్వరూపులుగా భావించి, వారికి సేవ చేయండి. కనిపించని దేవునిపై మనసు నిలవడంలేదనీ, ఏకాగ్రత కుదరడంలేదని బాధపడక, కనిపంచే ఈ దేవుళ్ళను ప్రేమతో ఆరాధించండి. ఆసేవలో కలిగే తృప్తే ముక్తి.
- సుఖానికి మార్గం ఒకటే – ఏది చేసినా దైవం చేశాడనుకోటమే
- సుఖం ఎక్కడ వుందీ అంటే తృప్తి లో ఉంది.