- శ్రీ భగవానుడు పలికెను – జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెల్పబోవుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధములనుండి విముక్తులై పరమ సిద్ధిని పొందిరి. (14.1)
- ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నాస్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులుసృష్ట్యాదియందు మఱల జన్మింపరు, ప్రళయకాలమున వ్యథనొందరు. (14.2)
- ఓ అర్జునా! నామహద్బ్రహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతనసముదాయరూపమైన బీజమును ఉంచెదను(స్థాపన చేసెదను). ఆ జడచేతనసంయోగమువలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. (14.3)
- ఓ అర్జునా! నానాయోనులయందు జన్మించు ప్రాణులను తనగర్భమున ధరించు మూలప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపనచేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి. నేనే జనకుడను. (14.4)
- ఓ అర్జునా! ప్రకృతినుండి ఉత్పన్నములైన సత్త్వరజస్తమోగుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. (14.5)
- ఓ పాపరహితుడా! ఈమూడింటిలో సత్త్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశకమైనది. వికారరహితమైనది. కాని అది సుఖసాంగత్యమువలనజ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. (14.6)
- ఓ అర్జునా! రజోగుణము రాగాత్మకము. అదికామము, ఆసక్తులనుండిఉత్పన్నమగునని యెఱుంగుము. అది జీవాత్మను కర్మలయెుక్కయు, కర్మఫలములయెుక్కయు సాంగత్యముతో బంధించును. (14.7)
- అర్జునా! తమోగుణం సకలదేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానమువలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్యనిద్రాదులతో బంధించును. (14.8)
- ఓ అర్జునా! సత్త్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణం జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. (14.9)
- ఓ అర్జునా! రజస్తమోగుణములనణచి సత్త్వగుణము వృద్ధిచెందును. సత్త్వతమోగుణములనణచి రజోగుణము వృద్ధిచెందును. అట్లే సత్త్వరజోగుణములనణచి తమోగుణము వృద్ధియగును. (14.10)
- శరీరేంద్రియములయందును, అంతఃకరణము నందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధిచెందినదని తలంపవలెను. (14.11)
- ఓ అర్జునా! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. (14.12)
- ఓ అర్జునా! తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును, ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థచేష్టలు, నిద్రాదివృత్తులు మెుదలగునవి ఉత్పన్నములగుచుండును. (14.13)
- సత్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో, అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. (14.14)
- రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచుండును. (14.15)
- శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు ఫలము అజ్ఞానము. (14.16)
- సత్త్వగుణమువలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమోగుణము వలన ప్రమాద మోహాదులూ, అజ్ఞానమూ, తప్పక ఉత్పన్నము లగుచుండును. (14.17)
- సత్త్వగుణస్థితులు స్వర్గాది – ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన (రాజస)పురుషులు మధ్య (మానవ) లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రాప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనులను, నరకములను పొందుదురు. (14.18)
- ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపుడనైన నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. (14.19)
- దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా(వార్ధక్య), దుఃఖములనుండి విముక్తుడై, పరమానందమును పొందును. (14.20)
- అర్జునుడు పలికెను – ఓ ప్రభూ! ఈ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? (14.21)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పాండవా! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు – అనగా వాటిని గూర్చివిచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు అనగా ఎల్లప్పుడును ఒకే స్థితిలోనుండును. త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, ఉదాసీనుని వలె(సాక్షివలె) ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించు చున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకుగాని, నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. మానావమానములయందును, మిత్రులయందును, శత్రువులయందును సమభావముతో ప్రవర్తించు వాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతు డనబడును. (14.22-25)
- అనన్య (నిర్మలమైన) భక్తియోగముద్వారా నన్నే నిరంతరము భజించువాడును,ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానందఘనపరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. (14.26)
- ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతత్వ మునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆధారము. (14.27)