- అర్జునుడు పలికెను: ఓ కేశవా! ప్రకృతిని, పురుషుని, క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుని, జ్ఞానాన్ని, మరియు జ్ఞానము యొక్క లక్ష్యాన్ని నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. (13.1)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ కౌంతేయ! ఈ శరీరమును ‘క్షేత్రము’ అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎఱింగిన వానిని ‘క్షేత్రజ్ఞుడు’ అని తత్త్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. (13.2)
- ఓ అర్జునా! అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారసహిత (త్రిగుణాత్మకమైన) ప్రకృతి మరియు నిర్వికారపురుషులు తత్త్వములనుగూర్చి తెలుసుకోనుటయే ‘జ్ఞానము’ అని నా అభిప్రాయము. (13.3)
- క్షేత్రమనగానేమి? అది యెట్లుండును? దాని వికారములు (భావములు) ఏవి? ఆ వికారములు దేనినుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటిని సంక్షిప్తముగా తెలిపెదను వినుము. (13.4)
- క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములనుగూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధవేదమంత్రములను వేర్వేరుగా తెల్పినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములుగూడ నిశ్చయాత్మకముగ సహేతుకముగా తేటతెల్లము గావించినవి. (13.5)
- పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూలప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియగ్రాహ్యవిషయములు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు). ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చైతన్యము ధృతి అను వికారములతో గూడిన ‘క్షేత్రస్వరూపము’ సంక్షిప్తముగా పేర్కొనబడినది. (13.6-7)
- తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. ఇంద్రియార్థములయందు వైరాగ్యము (ఇహపరలోక భోగములన్నింటియందును ఆసక్తి లేకుండుట), అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, జరా (ముసలితనము) రోగాదులయందు దుఃఖదోషములను పదేపదే దర్శించుట. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడును సమభావముతోనుండుట. పరమేశ్వరుడనైన నాయందు అనన్యయోగముద్వారా అవ్యభిచారిణీభక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్రప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులయెడ ఆసక్తిలేకుండుట. ఆధ్యాత్మికజ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని యెఱుంగుట – ఇవియన్నియును (అమానిత్వము మొదలుకొని తత్త్వజ్ఞానార్థదర్శనము వఱకుగల ఇవియన్నియును) జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. (13.8-12)
- అనాదియైన (సనాతనుడైన) పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుటవలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు(సత్ + అసత్ లకు) అతీతుడు. ఆ పరమాత్మనుగూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. (13.13)
- ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై యున్నవి. అతడు సర్వమును ఆవరించియున్నాడు. (13.14)
- అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటిని ఎఱిగినవాడు. కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్తజగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును (గుణాతీతుడయ్యును) ప్రకృతి సంబంధమువలన గుణానుభవములను కలిగియుండువాడు. చరాచరభూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ (పరమాణు) రూపుడైనందున తెలిసికొనశక్యముకానివాడు, అతిదూరముగాను, అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. పరమాత్మ ఆకాశమువలె విభజించుటకు వీలులేని ఒకేరూపమున పరిపూర్ణుడైయున్నను, సమస్తచరాచరప్రాణులరూపమలలో వేరువేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. ఆ పరబ్రహ్మ అన్నిజ్యోతులకును జ్యోతి (పరంజ్యోతి) మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్త్వజ్ఞానముద్వారా ప్రాప్యుడను అతడే. సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. (13.15-18)
- ఇంతవఱకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును (తెలిసికొనదగిన పరమాత్మ స్వరూపమును) గుఱించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా తెలుసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. (13.19)
- ప్రకృతి, పురుషుడు – అను ఈ రెండును అనాదియైన (సనాతనమైన) వనియు, రాగద్వేషాదివికారములును, త్రిగుణాత్మకములైన పదార్థములన్నియును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎఱుంగుము. (13.20)
- కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. (13.21)
- పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణసాంగత్యమే జీవాత్మయొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. (13.22)
- ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షీభూతుడగుటవలన ‘ఉపద్రష్ట’ యనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన ‘అనుమంత’ అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన ‘భర్త’ అనియు, జీవరూపములో ‘భోక్త’ అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన ‘మహేశ్వరుడు’ అనియు, శుద్ధసచ్చిదానందఘనస్వరూపుడగుట వలన ‘పరమాత్మ’ అనియు పిలవబడుచున్నాడు. (13.23)
- ఈ విధముగా పురుషుని తత్త్వమును, గుణసహితమైన ప్రకృతి తత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికిని పునర్జన్మను పొందడు. (13.24)
- కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమ హృదయముల యందు చూతురు. మఱికొందరు (జ్ఞాన) యోగముద్వారాను, మఱికొందఱు కర్మయోగముద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. (13.25)
- కానీ ఈ సాధనమార్గములనుగూర్చి ఎఱుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యురూపసంసార సాగరమునుండి నిస్సందేహముగా బయటపడుదురు. (13.26)
- ఓ అర్జునా! ఈ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర – క్షేత్రజ్ఞ సంయోగము వలనే ఉత్పన్నమగునని ఎఱుంగుము. (13.27)
- నశ్వరములైన చరాచర భూతముల (ప్రాణుల) యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. (13.28)
- సమస్తప్రాణులయందును సమభావముతోనుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడుకాడు – అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. (13.29)
- సకలకర్మలు అన్నివిధములుగా ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎఱింగినవాడు వాస్తవముగ చూచువాడు. (13.30)
- వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా, ఎఱింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానందఘనపరబ్రహ్మను చేరును. (13.31)
- ఓ అర్జునా! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికిని అనాది (సనాతనుడు) అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలతనిని ఏమాత్రమును అంటవు. (13.32)
- సర్వత్ర (ఇతరమహాభూతములయందు) వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మ మగుటవలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థిరమైయున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికంటవు. (13.33)
- అర్జునా! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమొనర్చున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణుల యందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప (చైతన్యవంతములుగా) జేయుచున్నది. (13.34)
- ఈ విధముగా క్షేత్ర – క్షేత్రజ్ఞులమధ్యగలఅంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎఱింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. (13.35)