- శ్రీ భగవానుడు పలికెను – నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞానప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్వికదానము, ఇంద్రియనిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రములపఠన, పాఠనములు మఱియు భగవంతుని నామగుణకీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము (ఆర్జవము). అహింస (మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్గింపకుండుట), సత్యము (యథార్థమైన, ప్రియమైన భాషణము), అక్రోధము (తనకు అపకారము చేయువారిపైనకూడ కోపము లేకుండుట), త్యాగము (కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట), శాంతి (చిత్తచాంచల్యము లేకుండుట), అపైశునము (ఎవరినీ నిందింపకుండుట), దయ (అన్ని ప్రాణులయెడ నిర్హేతుక కృప), అలోలుప్త్యము (ఇంద్రియవిషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట), మార్దవము (కోమలత్వము), శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట (సిగ్గుపడుట), అచాపలము (వ్యర్ధచేష్టలు చేయకుండుట). ఓ అర్జునా! తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము (బాహ్యశుద్ధి), అద్రోహము (ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట), అమానిత్వము (తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట) మొదలగునవి యన్నియును దైవీసంపదగలవాని లక్షణములు. (16.1-3)
- ఓ పార్థా! దంభము (కపటము), దర్పము (మొండితనము), అభిమానము, క్రోధము, పారుష్యము, (మాటలయందును, చేష్టలయందును కఠినత్వము), అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావముగలవాని లక్షణములు. (16.4)
- ఓ అర్జునా! దైవీసంపద ముక్తిదాయకము. ఆసురీసంపద బంధహేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపకుము. (16.5)
- ఓ అర్జునా! ఈ లోకముననున్న మానవులు రెండువిధములుగా ఉందురు. దైవలక్షణములు గలవారు కొందఱు. ఆసురలక్షణములు గలవారు మఱికొందఱు. దైవ లక్షణములు విస్తృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసురలక్షణములుగలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. (16.6)
- ఆసురస్వభావముగలవారు ప్రవృత్తినివృత్తులను (కర్తవ్యాకర్తవ్యములను) ఎఱుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వముగాని, శ్రేష్ఠమైన ప్రవర్తనగాని, సత్యభాషణముగాని ఉండనే ఉండవు. (16.7)
- ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీపురుషులసంయోగ కారణముగ జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసురలక్షణములు గలవారు భావింతురు. (16.8)
- అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదముచేయుభౌతికవాదులు ఆత్మనుగూర్చి తలంపరు. (ఆత్మయొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధులు. వారు అందఱికిని అపకారముచేయుక్రూరులు. వారి శక్తిసామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (16.9)
- దంభము, దురభిమానము, మదములతోగూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమవాంఛలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యాసిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. (16.10)
- మరణించువఱకును వారు అంతులేనిచింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. వారు ఆశాపాశపరంపరలచే ఎల్లప్పుడును బంధింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై, అన్యాయ మార్గములద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. (16.11-12)
- “నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్టవస్తువును పొందితిని. ఇంకను నా మనోరథము లన్నింటిని సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతోధనమును సంపాదింపగలను” అని వారు తలంచుచుందురు. నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులనుగూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడను, సుఖిని. “నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడులేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్ఛముగా వినోదింపగలను.” – అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై…చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని, ఆసురలక్షణములు గలవారు విషయభోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు. (16.13-16)
- వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబరప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమ శరీరములయందును, ఇతరుల శరీరముల యందును, అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. (16.17-18)
- అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును. (16.19)
- ఓ అర్జునా! ఈ ఆసురీప్రకృతిగల మూఢులు, నన్ను పొందకయే, ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైనగతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకములయందు పడెదరు. (16.20)
- కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతిపాలుచేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. (16.21)
- ఓ అర్జునా! ఈ మూడునరకద్వారములనుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (16.22)
- శాస్త్రవిధిని త్యజించి, యథేచ్ఛగా (విశృంఖలముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోకసుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తింపదు. (16.23)
- కావున కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము. (16.24)