Question I
1.1 ఓం, పరమాత్మకు నమస్సులు. హరి ఓం.భరద్వాజ పుత్రుడైన సుకేశుడు, శిబి తనయుడైన సత్యకాముడు, సూర్యుని మనుమడైన గార్గ్యుడు, అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు, విదర్భ దేశీయుడైన భార్గవుడు, కత్య తనయుడైన కబన్ధీ అనే వారు భగవంతుని కోరేవారు; భగవత్ చైతన్యంలో నెలకొన్నవారు. వారు భగవంతుని అన్వేషించారు. దేవర్షియైన పిప్పలాదుడు భగవంతుని గురించి పూర్తిగా వివరించగల వ్యక్తి అని తెలుసుకోగానే చేతిలో సమిధలు తీసుకుని ఆయనను సమీపించారు.
1.2 పిప్పలాద మహర్షి వారితో, “తగిన రీతిలో, ఇక్కడ ఇంకా ఒక సంవత్సరం గడపండి. ప్రత్యేకించి తపస్సుతో, బ్రహ్మచర్యంతో జీవితం గడపండి. ఆ తరువాత మీ ఇష్టప్రకారం ప్రశ్నలు అడగండి. మాకు తెలిసినట్లయితే తప్పక అంతా మీకు చెబుతాము” అని చెప్పాడు.
1.3 ఒక సంవత్సరం తపోమయ జీవితం గడిపిన తరువాత కబంధి, పిప్పలాద మహర్షిని సమీపించి, “దేవర్షీ! ఈ ప్రాణికోటులన్నీ ఎక్కడనుంచి ఉద్భవిస్తున్నాయి?” అని అడిగాడు.
1.4 కబంధితో పిప్పలాద మహర్షి ఇలా చెప్పాడు: ప్రాణులను సృష్టింపగోరిన సృష్టికర్త తపస్సు ఆచరించాడు. ఆ తరువాత ఆకాశాన్నీ ప్రాణాన్నీ సృష్టించాడు. ఈ రెండు కలసి అనేక రకాల ప్రాణులను నా కోసం ఉత్పన్నం చేస్తాయి అని ఆయన భావించాడు.
1.5 సూర్యుడు శక్తి. చంద్రుడు జడపదార్థమే. స్థూల వస్తువులూ సూక్ష్మ వస్తువులూ ఈ లోకంలో ఉన్న సమస్తమూ జడపదార్థాలే. కనుక వస్తువు అంటే అది జడపదార్థమే.
1.6 సూర్యుడు ఉదయించి, ప్రకాశం తూర్పు దిశలో వ్యాపించినప్పుడు, అతడు తన కిరణాలచే తూర్పున ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఆ విధంగానే దక్షిణ, పశ్చిమ, ఉత్తర, అథో ఊర్ధ్వ మరియు అంతర్భాగాలు అంటూ సమస్త భాగాలలోనూ ప్రకాశాన్ని వ్యాపిస్తున్నప్పుడు, ఆయా భాగాలకు, తన కిరణాలచే ప్రాణాన్ని అందిస్తున్నాడు.
1.7-8 వైశ్వానరుడూ విశ్వరూపుడూ ప్రాణశక్తీ అయిన సూర్యుడు ఈ విధంగా ఒక అగ్నిగోళంలా ఉదయిస్తాడు. ఋగ్వేద మంత్రం లోనూ ఈ విధంగా చెప్పబడి ఉంది. విశ్వరూపుడు, కిరణాలతో కూడిన వాడు, సర్వజ్ఞుడు, సర్వాధారుడు, ఏకైక జ్యోతిర్మయుడు, ఉష్ణతను ఇచ్చేవాడు, ప్రాణుల ప్రాణమైన సూర్యుడు, ఇదుగో వేయి కిరణాలతో ఉదయిస్తున్నాడు; నూరు విధాలుగా పనిచేస్తున్నాడు.
1.9 సంవత్సరమే ప్రజాపతి. ఆయనకు దక్షిణాయనం, ఉత్తరాయనం అనే రెండు మార్గాలు ఉన్నవి. యాగాలూ సత్కార్యాలూ శ్రేష్ఠ మైనవని ఎంచి వాటిని చేసే వారు చంద్రలోకాన్ని పొందుతున్నారు. వారు మళ్ళీ జన్మిస్తున్నారు. కనుక సంతానాన్ని ఆకాంక్షించే ఋషులు దక్షిణాయన మార్గంలో వెళుతున్నారు.
1.10 ఆత్మను అన్వేషించే వారు తపస్సు, బ్రహ్మచర్యం, నమ్మకంతో కూడుకున్న పనులు (శ్రద్ధ) ధ్యానం మొదలైన వాటిని పాటిస్తున్నారు. వారు సూర్య మార్గాన్ని పొందుతున్నారు. ఈ మార్గం శక్తుల నిలయం, అమరమైనది, భయరహితమైనది. ఈ మార్గమే లక్ష్యం. ఈ మార్గం ద్వారా వెళ్ళేవారు మళ్ళీ జన్మించరు. ఆత్మను అన్వేషించనివారు ఈ మార్గాన్ని పొందరు. దీనిని గురించి ఈ క్రింది శ్లోకం ఉన్నది.
1.11 సూర్యుడు ఐదు పాదాలు గలవాడు. తండ్రి, పన్నెండు రూపాలు ధరించేవాడు, పై భాగం నుండి వర్షం కురిపించే వాడని కొందరు చెబుతున్నారు. అతడు సర్వజ్ఞుడు, ఏడు చక్రాలున్న ఆరు ఆకులుగల రథంలో ఉన్నవాడని మరికొందరు చెబుతున్నారు.
1.12 మాసమే ప్రజాపతి. ఆయన కృష్ణపక్షకాలం జడపదార్థం; శుక్లపక్షం ప్రాణం. కనుక ఋషులు యాగాలను శుక్లపక్షంలో నిర్వర్తిస్తారు; తక్కిన వారు కృష్ణపక్షంలో చేస్తారు.
1.13 రేయింబవళ్ళు ప్రజాపతి. దీనిలో పగలే ప్రాణం. రాత్రి జడం. ఎవరు పగటి సమయంలో సంభోగక్రియలో పాల్గొంటారో వారు ప్రాణాన్ని వ్యర్థం చేసుకుంటారు. రాత్రి సమయంలో సంభోగం బ్రహ్మచర్యమే.
1.14 ఆహారమే ప్రజాపతి. ఆహారం నుంచే రేతస్సు రూపొందుతుంది. దానినుంచే ప్రాణులు ఉద్భవిస్తాయి.
1.15 ప్రజాపతి రూపొందించిన నియమాన్ని ఎవరు పాటిస్తారో వారు జంటను రూపొందిస్తున్నారు. ఎవరిలో తపస్సూ బ్రహ్మచర్యమూ ఉన్నవో, ఎవరిలో సత్యం సుస్థిరంగా నెలకొని ఉంటుందో వారికి మాత్రమే స్వర్గం ప్రాప్తిస్తుంది.
1.16 సత్ప్రవర్తనామయమైన జీవితం గడిపే వారికే పునీతమైన ఆ భగవల్లోకం ప్రాప్తిస్తుంది. వంచన, అసత్యం, కాపట్యం ఇవి సంతరించుకున్న వారికి ఆ లోకం ప్రాప్తించదు.
Question II
2.1 ఆ తరువాత విదర్భ రాజ్యానికి చెందిన భార్గవుడు పిప్పలాద మహర్షిని ఇలా అడిగాడు: “దేవర్షీ! ఒకణ్ణి ఎందరు దేవతలు భరిస్తున్నారు? వారిలో ఎవరెవరు వీటిని పనిచేయిస్తున్నారు? వీరిలో ఎవరు శ్రేష్ఠుడు?”
2.2 పిప్పలాద మహర్షి, భార్గవునితో ఇలా చెప్పాడు : “ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, వాక్కు, మనస్సు, చూపు, వినే స్వభావం అనేవే ఆ దేవతలు. వారే మనిషిని నడిపిస్తున్నారు. ఒకసారి ఈ దైవశక్తులు, ‘మేమే ఈ శరీరాన్ని దాల్చి భరిస్తున్నాం’ అని చెప్పాయి.”
2.3 దేవశక్తులు చెప్పింది విని శ్రేష్ఠమైన ప్రాణం వాటితో, “భ్రమలో పడకండి. నన్ను ఐదుగా విభజించి, ఈ శరీరాన్ని సమైక్యపరచి పనిచేయించేది నేనే” అని చెప్పింది. కాని ప్రాణం చెప్పిన మాటలు ఆ దైవశక్తులు నమ్మలేదు.
2.4 ప్రాణం తన ఘనతను చాటడానికి నిష్క్రమిస్తున్నట్లుగా అభినయించింది. అది నిష్క్రమించగానే తక్కిన ఇంద్రియాలన్నీ నిష్క్రిమయ్యాయి. అది స్థిరపడగానే అన్నీ పనిచేయ నారభిం చాయి. తేనెటీగల రాణి నిష్క్రమించగానే తక్కిన తేనెటీగలన్నీ ఎలా దాని వెంట నిష్క్రమిస్తాయో, అది కూర్చుంటే ఎలా అన్నీ కూర్చుంటాయో ఆ విధంగా ఇది జరిగింది. వెంటనే వాక్కు, మనస్సు, కళ్ళు, చెవులు వంటి తక్కిన ఇంద్రియాలు సంతోషంతో ప్రాణాన్ని స్తుతించాయి.
2.5 ప్రాణమే అగ్నిగా దహిస్తాడు. సూర్యుడు, మేఘం, ఇంద్రుడు, వాయువు, భూమి, జడపదార్థాలు వంటి యావత్తుగా విరాజిల్లేది ప్రాణమే. ఆ దైవశక్తియే స్థూల పదార్థాలుగానూ, సూక్ష్మ పదార్థాలుగానూ, అమృతంగానూ భాసిల్లుతోంది.
2.6 రథ చక్రపు ఇరుసులో ఆకులు కూడివున్నట్లు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, యజ్ఞం, జ్ఞానం వంటివి యావత్తు ప్రాణంలో నెలకొని ఉన్నవి.
2.7 ప్రాణమా! పిండంలో జీవంగా వ్యవహరించేది నువ్వే. తల్లితండ్రుల ప్రతిబింబంగా బిడ్డ రూపంలో జన్మించేదీ నువ్వే. జీవులు (ఇంద్రియాల ద్వారా) నీకు ఆహుతులను తీసుకువస్తాయి. ఇంద్రియాలలో నెలకొని ఉన్నదీ నువ్వే.
2.8 ప్రాణమా! దేవతలకు శ్రేష్ఠతమమైన దూతగానూ, పితరులకు (పితృదేవతలకు) మొదటి ఆహారంగానూ, ఋషులైన అథర్వాంగిరసులలో నిజమైన ప్రయత్నంగానూ నువ్వే ఉన్నావు.
2.9 ఓ ప్రాణమా! నువ్వు ఇంద్రుడవు. తేజస్సుచే నువ్వు రుద్రుడవై ఉన్నావు. అన్ని దిశలను రక్షించే వాడివిగా ఉన్నది నువ్వే. ఆకాశంలో సూర్యునిగా నువ్వు సంచరిస్తున్నావు. జ్యోతులకు ప్రభువ్వు నువ్వే.
2.10 ఓ ప్రాణమా! నువ్వు వర్షంగా కురిసినప్పుడు, ‘ఇక కోరినంత మేరకు, ఆహారం లభిస్తుంది’ అని జీవులు ఆనంద భరితు లవుతారు.
2.11 ఓ ప్రాణమా! నీవు వ్రాత్యుడవు (పరిశుద్ధపరచబడనివాడవు). ఏకర్షి యాగంగా ఉంటూ, ఆహుతులను ఆరగించే వాడవు (భోక్తవు) నువ్వు. విశ్వంలోని సమస్తానికీ నువ్వు నేతవు. ఆహుతులను ఆరగించే నీకు వాటిని ఇచ్చేవారం మేము. వాయువుకు తండ్రిగా ఉన్నదీ నువ్వే.
2.12 ఓ ప్రాణమా! మాట్లాడడంలో వినడంలో చూడడంలో నీ ఏ అంశలు ఉన్నవో, మనస్సులో నీ ఏ అంశం వ్యాపించి ఉన్నదో వాటిని ప్రశాంతంగా ఉండనివ్వు. వెళ్ళిపోనివ్వ వద్దు.
2.13 మూడు లోకాల్లో ఏవేవి ఉన్నవో అవి అన్నీ ప్రాణం వశంలోనే ఉన్నవి. ఓ ప్రాణమా! ఒక తల్లి బిడ్డలను రక్షించేలా మమ్మల్ని రక్షించు. సంపదనూ, స్పష్టమైన బుద్ధినీ మాకు ప్రసాదించు.
Question III
3.1 తదుపరి అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు పిప్పలాద మహర్షిని ఇలా ప్రశ్నించాడు : “ఓ దైవసమానుడా! ఈ ప్రాణం ఎక్కడ నుండి జన్మించింది? ఎలా ఈ శరీరంలోకి వస్తున్నది? తనను విభజించుకొని ఎలా శరీరంలో నెలకొని ఉంటున్నది? ఎందుచేత నిష్క్రమిస్తున్నది? ఎలా బాహ్య ప్రపంచాన్ని భరిస్తున్నది? ఎలా ఆంతరిక జగత్తును భరిస్తున్నది?”
3.2 “కఠినమైన ప్రశ్నలను అడుగుతున్నావు. అయినప్పటికీ నువ్వు భగవదభిలాష గలవాడివిగా ఉన్నందున నేను నీకు జవాబు లిస్తాను” అని కౌసల్యునితో పిప్పలాద మహర్షి చెప్పాడు.
3.3 ప్రాణం ఆత్మనుండి ఉద్భవిస్తుంది. మనిషి, అతడి నీడలా ఆత్మలో ప్రాణం విస్తరించి ఉన్నది. మనస్సు చేష్టల వలన అది ఈ శరీరంలోకి వస్తుంది.
3.4 ఎలా ఒక చక్రవర్తి అధికారులను నియమించి, ‘ఈ ఈ గ్రామాలను పాలించండి’ అని చెబుతాడో, అట్లే ప్రాణం తక్కిన ప్రాణాలను విడివిడిగా నియామకం చేస్తుంది.
3.5 ప్రాణం, విసర్జన జననేంద్రియాలలో అపానాన్ని నియమిస్తుంది. కన్ను, చెవి, నోరు, ముక్కు – ఈ ఇంద్రియాలలో ప్రాణం స్వయంగా తానే నెలకొని ఉంటుంది. శరీరం మధ్య భాగంలో సమానం పనిచేస్తుంది; అర్పించబడిన ఆహారాన్ని అదే తక్కిన చోట్లకు సరిసమానంగా తీసుకుని వెళుతుంది. ప్రాణం నుంచి ఏడు జ్వాలలు ఉత్పన్నమవుతున్నాయి.
3.6 ఆత్మ హృదయంలో కొలువై ఉంది. హృదయం నుంచీ 101 నాడులు బయలుదేరుతున్నాయి. వాటిలో ఒక్కొక్కటికీ నూరేసి శాఖానాడులు ఉన్నాయి. ఒక్కొక శాఖా నాడికీ డబ్భై రెండు వేల ఉపశాఖనాడులు ఉన్నాయి. ఈ నాడులన్నింటి గుండా వ్యానం సంచరిస్తుంది.
3.7 ఆ నాడులలో, పైకి వెళ్ళే ఒకదాని ద్వారా ఉదానం మనిషిని తీసుకుపోతుంది. పుణ్యం చేసిన వారిని పుణ్య లోకానికీ, పాపం చేసిన వారిని పాప లోకానికీ, రెంటినీ చేసిన వారిని మానవ లోకానికీ తీసుకువెళ్ళేది అదే.
3.8 సూర్యుడే బాహ్య ప్రాణం. అతడే అనుగ్రహించి కళ్ళలో ప్రాణంగా నెలకొంటాడు. భూమియందు ఉన్న దేవత మనిషిలోని అపానాన్ని నియంత్రిస్తుంది. భూ స్వర్గ లోకాలకు మధ్యనున్న ఆకాశమే సమానం. వాయువే వ్యానం.
3.9 నిజానికి అగ్నే ఉదానం. ఎవని యందు అగ్ని సమసిపోతుందో అతడి ఇంద్రియాలు మనస్సులో లీనమైపోతాయి. అతడు మళ్లీ జన్మిస్తాడు.
3.10 మరణ సమయంలో మనస్సులో మెదలిన ఆలోచనతో మనిషి ప్రాణాన్ని పొందుతాడు. ప్రాణం ఉదానం తోడ్పాటుతో అతణ్ణి అతడు కోరిన లోకానికి తీసుకుపోతుంది.
3.11 ప్రాణాన్ని ఈ విధంగా చక్కగా ఆకళింపు చేసుకున్న వాని సంతతి పరంపర ఎన్నటికీ నశించదు; నశించక నెలకొని ఉంటుంది. దానిని గురించి క్రింద వచ్చే శ్లోకమూ ఉన్నది.
3.12 ‘ప్రాణం యొక్క ఉత్పత్తినీ, రాకనూ, స్థానాన్నీ, ఐదు విధాలైన ప్రధాన కార్యకలాపాలు, స్థూల అభివ్యక్తీకరణలను గ్రహించిన వాడు అమరత్వాన్ని పొందుతాడు’ అని చెప్పబడింది.
Question IV
4.1 తరువాత సూర్యుని మనుమడైన గార్గ్యుడు, పిప్పలాద మహర్షిని ఇలా అడిగాడు: ‘దేవర్షీ ! మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి? ఏవి మేల్కొని ఉంటున్నాయి? కలలు కనే దేవుడు ఎవరు? సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు? అన్నీ దేన్లో లయమవుతున్నాయి?’
4.2 గార్గ్యునితో, పిప్పలాదుడు ఇలా చెప్పాడు : గార్గ్యా! సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అన్ని కిరణాలూ జ్యోతిర్మండలంలో ఐక్యం అవుతాయి; ఉదయిస్తున్నప్పుడు సమస్త కిరణాలూ మళ్ళీ వెలుపలకు వ్యాపిస్తాయి. అదే విధంగానే, ఒకడు నిద్రిస్తున్నప్పుడు అతడి ఇంద్రియాలన్నీ ప్రధాన ఇంద్రియమైన మనస్సులో లీనమౌతాయి. అప్పుడు అతడు వినలేడు, చూడలేడు, వాసన చూడలేడు, రుచి చూడలేడు, తాకలేడు, మాట్లాడలేడు, ఆనందించలేడు, విసర్జించలేడు, కదలలేడు. అప్పుడు ‘అతడు నిద్రిస్తున్నాడు’ అని చెబుతారు.
4.3 నిద్రిస్తున్నప్పుడు, ఈ శరీరమైన నగరంలో ప్రాణశక్తులైన అగ్నులు మాత్రమే మేల్కొని ఉంటాయి. అపానమే గార్హపత్యాగ్ని. వ్యానమే అన్వాహార్యపచనాగ్ని. గార్హపత్యాగ్ని నుండి రూపొందినది ఆహవనీయాగ్ని. కనుక ప్రాణమే ఆహవనీయాగ్ని.
4.4 ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలనే రెండు ఆహుతులనూ సమానంగా జరిపించడం వల్ల ఆ ప్రాణశక్తి సమానం అనబడుతున్నది. మనస్సే యజమాని. యాగం ద్వారా కోరిన ఫలమే ఉదానం. ఎందుకంటే ఉదానమే ఈ యజమానిని నిత్యమూ భగవంతుని వద్దకు చేరుస్తుంది కనుక.
4.5 ఈ దైవం స్వప్నావస్థలో తన మహత్వాన్నే చవిచూస్తాడు. జాగ్రదావస్థలో చూసినవాటిని మళ్ళీ చూస్తాడు; విన్న వాటిని మళ్లీ వింటాడు; వివిధ స్థలాలలో దిశలలో అనుభవించినవన్నీ మళ్ళీ అనుభవిస్తాడు. జాగ్రదావస్థలో చూసినవీ, చూడనివీ, విన్నవీ, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, నిజమైనవీ, నిజం కానివీ అన్నీ తానే అయి స్వప్నావస్థలో అన్నింటినీ అనుభవిస్తాడు.
4.6 తేజస్సుచేత ఆక్రమించబడినప్పుడు ఆ దేవత కలలు కనడు. అప్పుడు శరీరం ఈ సుఖాన్ని అనుభవిస్తుంది.
4.7-8 సొమ్యుడా! పక్షులు తాము నివాసం ఏర్పరచుకున్న వృక్షాన్ని చేరుకున్నట్లే అవి అన్నీ శ్రేష్ఠమైన ఆత్మలో లయించిపోతాయి. భూమీ, భూమి తన్మాత్ర; నీరూ నీటి తన్మాత్ర; కాంతీ కాంతి తన్మాత్ర; వాయుమా వాయు తన్మాత్ర; ఆకాశమూ ఆకాశ తన్మాత్ర; కన్నూ, చూడబడేది; చెవి, వినబడేది; ముక్కు, వాసన చూడబడేది; రుచి, రుచి చూడబడేది; స్పర్శ, స్పర్శించబడేది; మాట, మాట్లాడబడేది; చేతులు, తీసుకోబడేది; జననేంద్రియం, ఆనందాన్ని అనుభవించేది; విసర్జనేంద్రియం, విసర్జించబడేది; పాదాలు, నడిచేది; మనస్సు, ఆలోచించబడేది; బుద్ధి, తెలుసుకో బడేది; నేను–స్ఫురణ, నేను అని ఎరుగబడేది; చిత్తం, జ్ఞాపకం ఉంచుకోబడేది; కాంతి, కాంతిచే ప్రకాశింపబడేది; ప్రాణం, దానితో ముడివడి ఉన్నవి అన్నీ ఆత్మలోనే లయిస్తున్నాయి.
4.9 చూసేది, స్పర్శ స్ఫురణను పొందేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, ఆలోచించేది, గ్రహించేది [perceiver], కర్తయైనది– వీటి అన్నింటికీ నేను–స్ఫురణే ఆధారం. నిద్రావస్థను అనుభవిస్తున్న ఆ నేను స్ఫురణే శ్రేష్ఠమైన, అమరమైన ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంది.
4.10 స్నేహప్రదుడా! శ్రేష్ఠమైన, వినాశరహితమైన, నీడలేని, శరీరంలేని, రంగులేని, స్వచ్ఛమైన ఆ ఆత్మను ఎవరు అనుభూతిలో గ్రహిస్తాడో అతడు మాత్రమే ఆత్మను పొందుతాడు. అతడు సర్వజ్ఞుడుగా, సమస్తంగా అవుతాడు. దీనిని గురించి క్రింది మంత్రం ఉన్నది.
4.11 నేను–స్ఫురణ, ఇంద్రియాలు, ప్రాణాలు, పంచభూతాలు అన్నీ ఎక్కడ విలీనం చెంది ఉన్నాయో ఆ అమరమైన ఆత్మను అనుభూతిలో గ్రహించిన వాడు సర్వజ్ఞుడు అవుతాడు; సమస్తంలోను వ్యాపిస్తాడు.
Question V
5.1 తరువాత శిబి తనయుడైన సత్యకాముడు, పిప్పలాద మహర్షిని ఇలా అడిగాడు : “దేవర్షీ! జీవిత పర్యంతమూ ఓంకార మంత్రాన్ని ప్రగాఢంగా ధ్యానించే వాడు, ఏ లోకాలను పొందుతాడు?”
5.2 సత్యకాముడితో, పిప్పలాద మహర్షి ఇలా చెప్పాడు : “సత్యకామా! ఉన్నత స్థితి, సాధారణ స్థితి అని భగవంతుని రెండు స్థితులుగా ఉన్నది ఈ ఓంకార మంత్రం. కనుక దానిని ధ్యానించే మహాత్ముడు, అందుకు తగ్గట్లు, ఈ రెండు స్థితులలో ఒకదానిని పొందుతాడు.”
5.3 ఓంకారం యొక్క మొదటి మాత్రను ప్రగాఢంగా ధ్యానం చేసేవాడు జ్ఞానోదయం పొందుతాడు; సత్వరమే ఈ లోకానికి తిరిగి వస్తాడు. ఋగ్వేద దేవతలు అతణ్ణి మానవలోకానికి తీసుకుని వస్తారు. అతడు ఇక్కడ తపస్సు, బ్రహ్మచర్యం, ప్రగాఢ విశ్వాసం వంటి మొదలైన వాటిని సంతరించుకుని మహత్వాన్ని అనుభవిస్తాడు.
5.4 ఓంకార మంత్రపు రెండు మాత్రలను ప్రగాఢంగా ధ్యానం చేసిన వాడు మనస్సుతో తాదాత్మ్యం చెందుతాడు. మరణానంతరం, యజుర్వేద దేవతలు అతణ్ణి చంద్రలోకానికి తీసుకుపోతారు. అక్కడ సుఖాలను అనుభవించిన తరువాత మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు.
5.5 ఓంకార మంత్రం యొక్క మూడు మాత్రలను ప్రగాఢంగా ధ్యానించడంతో పాటు, సర్వోత్కృష్టుడైన భగవంతుణ్ణీ ప్రగాఢంగా ధ్యానించే వాడు తేజోవంతుడైన సూర్యునితో ఏకమవుతాడు. పాము ఎలా కుబుసం నుండి విడివడుతుందో, అట్లే అతడు పాపాల నుండి విడివడతాడు. మరణానంతరం సామవేద దేవతలు అతణ్ణి బ్రహ్మలోకానికి తీసుకుపోతారు. సకల జీవజాలానికీ నాయకుడూ, సర్వోత్కృష్టుడూ, శరీరాలలో కొలువుదీరి ఉండేవాడూ అయిన భగవంతుణ్ణి అక్కడ అతడు దర్శిస్తాడు. దీనిని గురించి, క్రింద వచ్చే రెండు శ్లోకాలూ ఉన్నాయి.
5.6 ఓంకారం యొక్క మూడు మాత్రల పర్యవసానాలు మరణానికి లోబడినవే. కాని వాటిని విడదీయకుండా, ఒకదానితో ఒకటి కలిపి, బాహ్య అంతర మధ్యంతర స్థితులలో పనిచేసే విధంగా ధ్యానంలో పాల్గొనేటట్లు చేయగల జ్ఞాని చలించడు (విచలితుడు కాడు).
5.7 ఋగ్వేద మార్గంచేత ఈ లోకమూ, యజుర్వేద మార్గంచేత ఆకాశమూ, సామవేద మార్గం చేత బహ్మలోకమూ లభిస్తాయని మహాత్ములు తెలుసుకున్నారు. ప్రశాంతి మయమైన, వార్ధక్యంలేని, మరణంలేని, భయాలకు అతీతమైన ఉత్కృష్టమైన భగవంతుని వారు ఓంకార మార్గం చేతనే పొందుతున్నారు.
Question VI
6.1 తరువాత భరద్వాజుని కుమారుడైన సుకేశుడు, పిప్పలాద మహర్షిని ఇలా అడిగాడు: “దేవర్షీ! కోసల దేశ యువరాజైన హిరణ్యనాభుడు నన్ను, ‘భరద్వాజుని కుమారుడా! పదహారు అంగాలు గల పురుషుడు నీకు తెలుసా?’ అని ప్రశ్నించాడు. అందుకు నేను అతడితో, ‘తెలియదు. తెలిసి ఉంటే మీతో ఎలా చెప్పకుండా ఉంటాను? అబద్ధం చెప్పే వాడు సమూలంగా నశించిపోతాడు! కనుక అబద్ధం చెప్పడానికి నాకు సామర్థ్యం లేదు’ అని చెప్పాను. ఇది వినగానే అతడు మౌనంగా రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ‘ఆ పురుషుడు ఎక్కడ ఉన్నాడు?’ అన్న ఆ ప్రశ్నను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను.”
6.2 సుకేశునితో, పిప్పలాద మహర్షి ఇలా చెప్పాడు : “ప్రియమైన వాడా! ఆ పురుషుడు ఆత్మ, ఆత్మ ఇక్కడ శరీరం లోపలే ఉన్నది. దాని నుంచే పదహారు అంగాలు ఉద్భవమైనాయి.
6.3 “ఎవరు వెలుపలకు పోవడం చేత నేను వెలుపలకు పోయిన వాడిగా అవుతాను; ఎవరు నెలకొని ఉండడం చేత నేను నెలకొని ఉంటాను?” అని ఆత్మ చింతన చేసింది.
6.4 ఆత్మ ప్రాణాన్ని సృష్టించింది. ప్రాణం నుండి బుద్ధి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం మొదలైనవి ఉద్భవించాయి. ఆహారం నుండి శక్తి, తపస్సు, మంత్రాలు, క్రియలు, లోకాలు అన్నీ ఉద్భవించాయి. లోకాలలో పేర్లు సృష్టించబడ్డాయి.
6.5 నదులు సముద్రం వైపుగా ప్రవహిస్తాయి. సముద్రాన్ని చేరి దాన్లో కలసి తమ ఉనికిని కోల్పోతాయి. వాటి నామరూపాలు మాయమైపోగా, అందరూ దానిని సముద్రం అని మాత్రమే వ్యవహరిస్తారు. ఆ విధంగానే (ఆత్మానుభూతి తదనంతరం) ప్రాణం మొదలైన పదహారు అంగాలూ ఆత్మను కాంక్షించి, ఆత్మను చేరి దాన్లో లయించిపోతున్నాయి. వాటి నామరూపాలు నశిస్తున్నాయి. యావత్తు ఆత్మగానే పేర్కొనబడుతున్నది. అంగాలు గలదిగా, అమరమైనదిగా ఆత్మ విరాజిల్లుతుంది. క్రింది మంత్రం దానిని గురించి చెబుతుంది.
6.6 రథ చక్రపు ఇరుసులో ఆకులలాగా, ఎవరిలో పదహారు అంగాలు నెలకొని ఉన్నవో, తెలుసుకోదగిన ఆ ఆత్మను తెలుసుకోండి. తద్ద్వారా మరణం మిమ్మల్ని బాధించకుండా చూసుకోండి.
6.7 చివరగా పిప్పలాద మహర్షి ఆ శిష్యులతో, “సర్వోత్కృష్టమైన ఆత్మను గురించి నాకు తెలిసింది ఇంతే. దీనికి మించి ఇక ఏదీ లేదు” అని చెప్పాడు.
6.8 ఆ శిష్యులు ఆరుగురూ పిప్పలాద మహర్షిని పూజించి ఇలా అన్నారు : “మీరే మాకు తండ్రి. అజ్ఞాన సాగరపు ఆవలి తీరానికి మమ్మల్ని చేర్చినది మీరే. మీకూ, మీవంటి దేవర్షులకూ మా నమస్సులు. దేవర్షులకు మా నమస్సులు.”
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥