32.1 ప్రథమ పరిచ్ఛేదం విజయ్‌కృష్ణ గోస్వామి ప్రభృతులకు ఉపదేశం
ఆదివారం, అక్టోబర్ 19, 1884
నేడు శ్రీరామకృష్ణులు సింథీ బ్రహ్మసమాజానికి విచ్చేయనున్నారు. వేణీ మాధవపాల్ సుందర ఉద్యాన గృహంలో శరత్కాల బ్రహ్మసమాజ ఉత్సవం జరుగుతోంది. ప్రాతఃకాల ప్రార్థన మొదలైనవి ముగిశాయి. శ్రీరామకృష్ణులు సాయంత్రం దాదాపు నాలుగున్నర గంటలకు అక్కడకు అరుదెంచారు. ఆయన బండి తోట మధ్యకు వచ్చి ఆగింది. భక్తులు గుంపుగా ఆయన్ను చుట్టుకున్నారు. ప్రాంగణంలో ఉపాసనా వేదిక అమర్చబడి ఉంది. ఎదురుగా వసారా. అక్కడ శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి కూర్చున్నారు. విజయ్, త్రైలోక్యుడు మొదలైన బ్రహ్మసమాజ భక్తులూ అక్కడ ఉన్నారు. సమాజానికి చెందిన ఒక ఉపన్యాయమూర్తి కూడా ఉన్నాడు.
ఉత్సవ కారణంగా సమాజపు హాలు ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. అక్కడక్కడ పలు రంగుల జెండాలు కట్టబడి ఉన్నాయి. ఇంటి మేడ మీద, కిటికీలలో కట్టబడి ఉన్న ఆకుపచ్చని తోరణాలు, అక్కడ నిజంగానే మొక్కలు మొలచి ఉన్నట్లుగా భ్రమింప చేస్తున్నాయి. ఎదురుగా ఉన్న కొలనులోని నీటిలో శరత్కాల వినిర్మల నీలిగగనం ప్రతిబింబిస్తోంది. తోటలోని పలు రంగుల బాటలకు ఇరువైపుల బారులు తీరి నిలబడ్డ చెట్ల పువ్వులు, ఫలాలు కనువిందు చేస్తున్నాయి. నాడు భక్తులకు శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడే వేదవాక్కులు ఆలకించే భాగ్యం మళ్ళీ లభించింది. ఏ వాక్కులు ప్రాచీనకాలపు ఋషుల ముఖతా వేదరూపంలో వెలువడినవో, ఏ వచనాలు ఏసుక్రీస్తు అనుగ్రహభాషణలుగా విద్యాగంధమే లేని పన్నెండు మంది గొర్రెల కాపరులైన శిష్యులకు బోధింపబడ్డాయో, ఏ ఉపదేశాలు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పూర్ణబ్రహ్మమైన శ్రీకృష్ణుని అమరవాక్కులుగా భగవద్గీతా రూపంలో ప్రబోధింపబడ్డాయో, ఏ నాదం అర్జునునకు సారథిగా మానవరూపంలో అవతరించిన సచ్చిదానంద గురువు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరం నుంచి వెలువడినదో, వినమ్రంగా, ఆతురతతో ప్రణమిల్లి నిలబడిన అర్జునునిచే ఆలకించబడిందో, అదే దైవీనాదాన్ని మళ్ళీ ఒకసారి మానవరూపంలో అవతరించిన సర్వసంగ పరిత్యాగియైన మునిపుంగవుడూ, పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెందిన మహామనీషి, జగత్తులో జీవుల దుఃఖాలను గాంచి హృదయం ద్రవించిపోయిన కరుణామయుడూ, భక్తవత్సలుడూ, భక్తియే అవతారంగా ఉద్భవించిన మహానుభావుడూ, భగవత్ ప్రేమలో సమస్తం మరచిపోయిన వాడూ అయిన పరమహంస శ్రీరామకృష్ణుల ముఖతా ఆలకించే భాగ్యం వారికి నేడు లభించింది.
శ్రీరామకృష్ణులు ఆసనంలో కూర్చున్నారు. చక్కగా అలంకరించబడిన ఉపాసనా వేదికకు తల వంచి ప్రణామం చేశారు. ఆధ్యాత్మిక ప్రసంగం అక్కడ జరుగనున్నందున ఆ వేదికను ఒక పుణ్యస్థలంగా గాంచారు కాబోలు! అన్ని పుణ్యస్థలాలు అక్కడ సంగమం చెంది ఉండటాన్ని ఆయన చూసి ఉండవచ్చు. న్యాయస్థానాన్ని చూడగానే వ్యాజ్యెమూ, న్యాయమూర్తీ జ్ఞాపకానికి వచ్చేట్లుగా, భగవత్ప్రసంగాలు జరుగనున్న చోటును చూడగానే ఆయనకు భగవదుద్దీపన జనించింది.
త్రైలోక్యుడు పాడసాగాడు.
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యునితో): నాయనా! అద్భుతమైన నీ ఆ పాట – ‘వెర్రి వానిని చేయవే నీ ప్రేమలోన…’ అనే పాటను పాడు.
త్రైలోక్యుడు పాడాడు:
వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే ననుగన్న తల్లి…..
పాటను వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. అట్లే సమాధి మగ్నులైనారు. మహాతత్త్వాన్ని గమించి, ఇరవై నాలుగు తత్త్వాలను గమించి, అన్ని తత్త్వాలకూ ఆవలగల తత్త్వాన్ని తమలో తాము గాంచే స్థితిలో ఓలలాడుతున్నారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ తొలగిపోయాయి. దేహం మాత్రం చిత్తరువులా నిశ్చలంగా ఉండి పోయింది. ఇటువంటి సమాధిని గూర్చి కనీ వినీ ఎరుగని వారెవరైనా ఆ వ్యక్తి మరణించాడనే భావిస్తారు. మునుపు ఒకసారి పాండవుల నాథుడైన శ్రీకృష్ణుని ఇటువంటి స్థితిని చూసిన పాండవులు ఆయన నిర్యాణం పొందాడని భావించి విలపించసాగారు. ఐక్యం అయిపోయినట్లుగా విలపించారు. ఆర్యకులానికే వన్నె తెచ్చిన భీష్మపితామహుడు తమ అంత్యకాలంలో అంపశయ్యపై పరుండి భగవద్ధ్యానంలో మునిగిపోయి ఉండడమే శ్రీకృష్ణుని ఈ నిశ్చల స్థితికి కారణం. శ్రీకృష్ణుని సమాధిస్థితికి కారణం తెలుసుకోలేని పాండవులు విలపించారు. ఆయన దేహత్యాగం చేశాడనుకుని కలతచెందారు.
32.2 ద్వితీయ పరిచ్ఛేదం బ్రహ్మసమాజ నిరాకారవాదం గురించి శ్రీరామకృష్ణులు
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులకు ఒకింత బాహ్య స్పృహ వచ్చింది. పారవశ్యంలోనే బ్రహ్మసమాజ సభ్యులతో మాట్లాడసాగారు. పిదప భావావస్థ నుంచి మెల్లగా దిగివస్తూ సాధారణ స్థితికి వచ్చారు.
32.2.1 సిద్ధి, సిద్ధుడు – భగవత్ప్రాప్తి అంటే?
శ్రీరామకృష్ణులు (భావావస్థలో): అమ్మా, నాకు కారణానందం వద్దు. నేను దాన్ని కోరటం లేదు. సిద్ధిని పుచ్చుకుంటాను. సిద్ధి అంటే, నేను చెబుతున్నది సద్వస్తువు ప్రాప్తి. అష్టసిద్ధుల గురించి (అణిమ, మహిమ మొదలైనవి) కాదు. సిద్ధుల గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో, ‘మిత్రమా, ఎవరికైనా అష్టసిద్ధులలో ఏ ఒక్కటి లభించినా సరే, ఆతడు నన్ను పొందలేడని తెలుసుకో’ అన్నాడు. ఎందుకంటే సిద్ధులుంటే అహంకారం ఉంటుంది, అహంకారం కించిత్తు ఉన్నా భగవంతుని పొందలేవు.
“ఒక ఫలానా సంప్రదాయం ప్రకారం ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు అని నాలుగు రకాల భక్తులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే భగవదారాధానను ప్రారంభించిన వ్యక్తి ప్రవర్తకుడు. అతడు నుదుట చిహ్నాలు ధరిస్తాడు; తిలకం, మాలవంటి వాటిని ధరిస్తాడు; బాహ్యాచారాలు అనేకం అనుసరిస్తాడు. సాధకుడు ఇంకొంచెం పురోగమించినవాడు. ఇతడిలో బాహ్యాడంబరాలు తగ్గి ఉంటాయి. భగవంతుణ్ణి పొందటానికై మనోవ్యాకులత చెందుతాడు, హృదయపూర్వకంగా ఆయన్ను పిలుస్తాడు, నామజపం చేస్తాడు, నిష్కాపట్య హృదయంతో ప్రార్థిస్తాడు. సిద్ధుడెవడు? భగవంతుడు ఉన్నాడు, ఆయనే అన్నిటికీ కర్త అని రూఢిగా తెలిసిన వాడు, భగవంతుని దర్శించినవాడు. సిద్ధసిద్ధు డెవరు? భగవద్దర్శనం పొందినవాడు మాత్రమే కాడు, ఆయనతో మాట్లాడి ఆనందించేవాడు. వారిలో కొందరు పితృ భావనలోను, కొందరు వాత్సల్య భావంలోను మరికొందరు సఖ్యభావంలోను ఆయనతో మాట్లాడుతూ ఉంటారు.
“వంట చెరకులో నిశ్చయంగా అగ్ని ఉందని విశ్వసించటం; వంట చెరకు నుండి అగ్నిని రగిలించి, అన్నం వండి భుజించి ఆకలి తీర్చుకొని సంతృప్తి నొందటం – ఇవి రెండూ వేర్వేరైనవి.
“దైవీ స్థితి ఇదే అని పరిమితి చేసి చెప్పలేం. ఒక స్థితి పెద్దదైతే, దానికంటే పెద్దదీ, దానికంటే మరింత పెద్దదీ అయిన స్థితులు ఎన్నో ఉన్నాయి.
32.2.2 ఒకదాన్లో దృఢంగా నెలకొని ఉండాలి – విషయాసక్తుని భగవంతుడు
(భావావస్థలోనే, బ్రహ్మసమాజ భక్తులను ప్రస్తావిస్తూ) “వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, నిరాకారవాదులు. అది మంచిది. (బ్రహ్మ సమాజ భక్తులతో) సాకారంలోనో, నిరాకారంలోనో దేన్లోనో ఒకదాన్లో దృఢంగా నెలకొని ఉండాలి. అప్పుడే భగవల్లబ్ధి కలుగుతుంది, లేకుంటే లేదు. దృఢంగా నెలకొని ఉంటే సాకారవాది కూడా భగవద్దర్శనం పొందుతాడు, నిరాకారవాది కూడా పొందుతాడు. అప్పాన్ని తిన్నగా పుచ్చుకుని తిన్నా సరే, వంకరగా పుచ్చుకుని తిన్నాసరే, అది తియ్యగానే ఉంటుంది. (అందరూ నవ్వారు) కాని దృఢంగా నెలకొని ఉండాలి. మనోవ్యాకులతతో ఆయన్ను ప్రార్థించాలి.
“విషయాసక్తుని భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? అది పిన్ని, పెద్దమ్మ పోట్లాడుకోవటం చూసి పిల్లలు ఆడుకోనేటప్పుడు ‘దేవుడి సాక్షిగా’ అని చెప్పటం లాంటిది. లేక తమలపాకులు నములుతూ, చేతి కర్ర త్రిప్పుతూ తోటలో పచార్లు చేస్తూన్న ధనికుడు దారిలో ఒక పువ్వును కోసి మిత్రుడికి చూపి, ‘ఆహా! భగవంతుడు ఎంత బ్యూటిఫుల్ (అందమైన) పువ్వును సృష్టించాడు’ అని చెప్పటం లాంటిది. కానీ విషయాసక్తుల మనోస్థితి క్షణమాత్రమే; ఎర్రగా కాలిన ఇనుముపై నీటి బిందువు లాంటిదది.
“దేన్లోనో ఒకదాన్లో దృఢంగా నెలకొని ఉండాలి. లోతుగా మునిగిపో! లేకుంటే సాగర గర్భంలోని రత్నాలను పొందలేవు, కేవలం పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు.”
ఇలా అంటూ, ఏ పాటతో కేశవ్సేన్ మొదలైన భక్తుల మనస్సును పరవశింప చేశారో, ఆ పాటను తమ మధుర కంఠంతో శ్రీరామకృష్ణులు పాడసాగారు. భక్తులకు తాము స్వర్గంలోనో, వైకుంఠంలోనో ఉన్నట్లుగా తోచింది.
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబునందు……
32.3 తృతీయ పరిచ్ఛేదం బ్రహ్మసమాజస్థులు – భగవదైశ్వర్య వర్ణన
శ్రీరామకృష్ణులు (బ్రహ్మసమాజ భక్తులతో): లోతుగా మునిగిపో! భగవంతుని ప్రేమించటం నేర్చుకో. ఆయన ప్రేమలో లోతుగా మునిగిపో. మీరు ఎలా ప్రార్థిస్తారో నేను విని ఉన్నాను. మీ రెందుకు మీ సమాజంలో భగవదైశ్వర్యాలను అంత ఎక్కువగా వర్ణిస్తున్నారు? ‘ఓ భగవంతుడా, నువ్వు ఆకాశాన్ని సృష్టించావు; మహాసముద్రాలను రూపొందించావు; చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం అన్నిటినీ సృజించావు’ – ఇలా చెబుతూ ఉండటంలో మనకు ప్రయోజనం ఏమిటి? అందరూ ధనవంతుని తోటను చూసి ఆశ్చర్యపోతారు – ‘ఆహా ఎటువంటి చెట్లు! ఎటువంటి పువ్వులు! కొలనులు! అతిథుల గదులు! గోడలకు ఎంతటి అందమైన చిత్తరువులు!’ అనుకొంటూ అబ్బురపోతారు. తోట యజమానియైన ధనవంతుని కోసం ఎంతమంది వెదకుతారు? ఎవరో ఒకరిద్దరు మాత్రమే. మనోవ్యాకులతతో భగవంతుని వెదకితే ఆయన దర్శనం కలుగుతుంది, నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లే ఆయనతో మాట్లాడవచ్చు, ముచ్చటించవచ్చు. నిజంగా చెబుతున్నాను, ఆయన్ను దర్శించవచ్చు! ఇవన్నీ ఎవరికి చెప్పగలను? ఎవరు నమ్ముతారు?
32.3.1 శాస్త్రాలు, గ్రంథాలు – శుష్కపాండిత్యం
“శాస్త్రాల ద్వారా భగవంతుని గాంచగలమా? మహా అయితే, వాటిని చదవటం వల్ల భగవంతుడు అస్తి, అంటే ఉన్నాడనే ఎరుక కలుగవచ్చు, అంతే. కాని లోతుగా మునుగనిదే ఆయన దర్శనం ఇవ్వడు. మునిగిన పిదప ఆయనే స్వయంగా తన స్వరూపాన్ని విశదపరచినప్పుడే సంశయాలన్నీ తీరుతాయి. నువ్వు వేయి పుస్తకాలు చదువవచ్చు గాక, వేలాది శ్లోకాలు వల్లింప వచ్చుగాక – కాని మనోవ్యాకులతతో ఆయనలో మునిగిపోనట్లయితే ఆయన్ను అందుకోలేవు. శుష్క పాండిత్యంతో లోకులను మైమరపించవచ్చును కానీ భగవంతుని మైమరపించలేవు.
“శాస్త్రాలు, గ్రంథాలు – వీటితో ఏం సాధించవచ్చు? ఆయన కృప లేకుండా ఏదీ సాధ్యం కాదు. వ్యాకులతతో ఆయన కోసం పాటుపడండి. కృప కలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. ఆయన మీతో మాట్లాడతాడు.”
32.3.2 భగవంతుడు పక్షపాతా? – విభురూపంలో భగవంతుడు
ఉపన్యాయమూర్తి: స్వామీ! ఆయన కృప ఒకరికి ఎక్కువగాను, మరొకరికి తక్కువగాను కలుగుతుందా? అలా ఐతే ఆయన పక్షపాతి అనే నిందకు గురికాడా?
శ్రీరామకృష్ణులు: అదేం మాట? వెలుగును ఇస్తున్నాయన్న కారణంగా చంద్రుడు, మిణుగురు పురుగు రెండూ ఒక్కటైపోతాయా ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నే విద్యాసాగర్ కూడా ఒకసారి నన్ను – ‘మహాశయా! భగవంతుడు కొందరికి అధిక శక్తినీ, కొందరికి తక్కువ శక్తినీ ప్రసాదించి ఉన్నాడా?’ అని అడిగాడు. అందుకు నేను ఇలా అన్నాను: ‘భగవంతుడు విభురూపంలో అందరిలోనూ నెలకొని ఉన్నాడు. నాలో ఎలా ఉన్నాడో చీమలో కూడా అలాగే ఉన్నాడు. కాని శక్తి అభివ్యక్తీకరణలో వ్యత్యాసం ఉంది. అందరూ సమానులే అయిన పక్షంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే పేరు విని మేమెందుకు మిమ్మల్ని చూడగోరి వచ్చాం? మీ కేమిటి రెండు కొమ్ములు మొలిచాయా? కాదు కదా, మీరు దయాళువు, పండితులు. ఇటువంటి సద్గుణాలు ఇతరులలో కంటే మీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు ఇంత ఖ్యాతి. మీరు చూసే ఉంటారు – ఒంటరిగా నిలబడి నూరుమందిని ఓడించేవాడూ ఉన్నాడు, కేవలం ఒక వ్యక్తిని చూసినంత మాత్రానే భయపడి పారిపోయేవాడూఉన్నాడు.’
“శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యం లేకుంటే లోకులు కేశవ్‌ను ఇంతగా ఎందుకు గౌరవిస్తారు?
“పాండిత్యంలోగాని, సంగీతంలోకాని, లెక్చర్లోగాని, లేక మరిదేన్లోగాని ఎవరినైనా పలువురు గౌరవిస్తూ ఉంటే ఆతడిలో భగవంతుని విశేష శక్తి ఉందని నిశ్చయంగా తెలుసుకో అని గీత తెలుపుతోంది.” (BG 10.41)
బ్రహ్మసమాజ భక్తుడు (ఉపన్యాయమూర్తితో): ఆయన చెబుతూ ఉన్నదాన్ని ఒప్పుకోండి!
శ్రీరామకృష్ణులు (భక్తుని చూసి): ఏం మనిషివయ్యా నువ్వు! చెబుతూ ఉన్న దాన్లో విశ్వాసం కలుగకుండా దాన్ని అట్లే ఆమోదించాలా? అది కాపట్యం! నువ్వొక దొంగ నాణెమని తెలుస్తోంది.
బ్రహ్మసమాజ భక్తుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.
32.4 చతుర్థ పరిచ్ఛేదం బ్రహ్మసమాజస్థులతో శ్రీరామకృష్ణులు – ఏకాంతవాసం, నిర్లిప్త సంసారం
ఉపన్యాయమూర్తి: మహాశయా! సంసారాన్ని త్యజించాలా?
శ్రీరామకృష్ణులు: అక్కర్లేదు. ఎందుకు త్యజించాలి? సంసారంలో ఉంటూనే సాధించవచ్చు. కాని ఆరంభంలో కొన్ని రోజులు ఏకాంతవాసం చేయాలి. ఏకాంతంలో ఉంటూ, ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. భోజనానికి మాత్రం ఇంటికి ఒకసారి వెళ్ళివచ్చేలా ఇంటికి సమీపంలో ఒక గదిని ఏర్పాటు చేసుకోవాలి.
32.4.1 ఏకాంత సాధనపై శ్రీరామకృష్ణులు
“కేశవ్సేన్, ప్రతాప్ మొదలైనవారు, ‘స్వామీ, మేం జనక మహారాజు మార్గాన్ని అనుసరించే వాళ్ళం’ అని చెప్పారు. అందుకు నేను ఇలా అన్నాను: ‘నోటితో జనక మహారాజు అని చెప్పేస్తే జనకమహారాజు కాలేవు. జనకుడు, తల క్రిందులుగా నిలబడి ఏకాంతంలో ఎంతో తపస్సు చేసి ఉన్నాడు! మీరు కాస్తయినా చేయండి. అప్పుడు జనక మహారాజు కావచ్చు.’ ఒకడు చకచకా ఆంగ్లం వ్రాయగలుగుతున్నాడనుకోండి. దాన్ని అతడు ఒకే రోజులోనే నేర్చుకోగలిగాడా? అతడు పేదవాడు; ఒకరి ఇంట్లో బసచేసి వంటపని చేసేవాడు, ఒకటి రెండు కబళాలు తిని, అనేక శ్రమలకోర్చి చదవనూ వ్రాయనూ నేర్చి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు చకచకా వ్రాయగలుగుతున్నాడు.
“కేశవ్సేన్తో ఇంకా ఇలా అన్నాను: ‘ఏకాంతవాసం చేయకుంటే దీర్ఘకాలిక వ్యాధి ఎలా నయమవుతుంది? వ్యాధి ఏమో తీవ్ర జ్వరమాయె! ఆ రోగి గదిలో ఊరగాయ, చింతపండు, నీటి కూజాలు ఉంచితే రోగం ఎలా నయమవుతుంది? ఊరగాయ, చింతపండు పేర్లు చెబుతూ ఉంటేనే నా నోరు ఊరుతోంది చూడండి! (అందరూ నవ్వారు) ఎదురుగా ఉంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. పురుషులకు స్త్రీలే ఈ ఊరగాయ, చింతపండూను. భోగాసక్తతే నీటి కూజా. విషయతృష్ణలకు అంతమే లేదు. దానికి తోడు, ఆ వస్తువులన్నీ రోగి గదిలోనే ఉంచడమా! ఈ విధంగా చేయడం వల్ల తీవ్ర జ్వరం నయం అవుతుందా? కొన్ని రోజులు ఊరగాయ, చింతపండు, నీటి కూజా లేని గదిలో వసించాలి. పిదప, జ్వరం తగ్గాక మళ్ళీ పాత గదికి వచ్చినప్పటికీ భయం లేదు. భగవల్లబ్ధి పొందాక సంసార జీవితంలో పాల్గొన్నప్పటికీ కామినీ కాంచనాలు ఏ హానీ కలిగించవు. అప్పుడు జనక మహారాజులా అనాసక్తతతో జీవించవచ్చు.
“కాని ప్రారంభంలో అప్రమత్తంగా మసలుకోవాలి. ఏకాంతవాసం చేస్తూ సాధనలు చేయాలి. రావిచెట్టు మొక్కగా ఉన్నప్పుడు దాని చుట్టూ కంచె కడతాము. లేకుంటే గొడ్లు మేసివేస్తాయి. కాని చెట్టుబోదె గట్టిపడి లావయ్యాక కంచె అవసరం ఉండదు. అప్పుడు ఏనుగును కట్టివేసినా చెట్టుకు ఏ ప్రమాదమూ ఉండదు. ఏకాంతంలో సాధనలు అనుష్ఠించి, భగవంతుని పాదపద్మాల పట్ల భక్తిని పొంది, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని ఇంటికి తిరిగి వెళ్ళు, సంసార జీవితం గడుపు. అప్పుడు కామినీకాంచనాలు నిన్ను ఏమీ చేయలేవు.
“పాలను తోడుపెట్టి, కదపకుండా ఉంచాలి; పెరుగు తోడుకున్నాక వెన్నను తీయాలి. భక్తి జ్ఞానాలనే వెన్నను మనస్సు అనే పాల నుంచి ఒకసారి తీస్తే, పిదప సంసారమనే నీళ్ళలో దాన్ని వేసినా అది కలిసిపోక తేలుతూ ఉంటుంది. కాని అదే మనస్సును అపరిపక్వ దశలో, అంటే పాలుగా ఉన్న దశలో సంసారమనే నీళ్ళలో ఉంచితే పాలు నీళ్ళతో కలిసిపోతాయి. ఆ స్థితిలో మనస్సు అనాసక్తతతో తేలియాడలేదు.
“సంసారంలో ఉంటూనే భగవల్లాభం పొందగోరితే, ఒక చేత్తో భగవంతుని పాదపద్మాలను పుచ్చుకో, రెండవ చేత్తో నీ కర్తవ్యాలను నిర్వర్తించు. కర్తవ్యాల నుంచి తీరిక దొరికినప్పుడు రెండు చేతులతోను భగవంతుని పాదపద్మాలను అంటిపెట్టుకొని ఉండవచ్చు. అప్పుడు ఏకాంతవాసం చేస్తూ, పూర్తిగా భగవచ్చింతనలో, సేవలో కాలం గడపవచ్చు.”
ఉపన్యాయమూర్తి (ఆనందంతో): మహాశయా! పరమాద్భుత వచనాలు. ఏకాంతంలో సాధనలు చేయవలసిందే, సందేహం లేదు! కానీ దీనిని మేం మరచి పోతున్నాం. ఒకేసారిగా జనకమహారాజులా అయిపోయినట్లుగా భావిస్తున్నాం. (శ్రీరామకృష్ణులు, తక్కినవారు నవ్వారు) సంసారం త్యజించ నక్కరలేదు, ఇంట్లో ఉంటూనే భగవంతుని పొందవచ్చు – ఈ మాట వింటూ ఉన్నప్పుడే మాకు శాంతి, సంతోషాలు కలుగుతున్నాయి.
శ్రీరామకృష్ణులు: మీ రెందుకు త్యజించాలి? యుద్ధం చేసే తీరాలన్నప్పుడు కోటలో ఉంటూనే యుద్ధం చేయటం మంచిది. ఇంద్రియాలతో పోరాడాలి, ఆకలి దప్పులతో పోరాడాలి. ఈ పోరాటాలను సంసారంలో ఉంటూనే చేయటం మంచిది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఆహారం దొరకనప్పుడు దేవుడు గీవుడు అన్నీ ఎగిరిపోతాయి. ఒకడు తన భార్యతో, ‘నేను సంసారాన్ని త్యజించి పోబోతున్నాను’ అన్నాడు. అతడి భార్య కాస్త తెలివైనది. అతడితో, ‘మీ రెందుకు తిరుగాడాలి? పొట్టకోసం పది గడపలు ఎక్కి దిగ నవసరం లేదనుకొంటే వెళ్ళండి. అలా తిరుగాడే పరిస్థితి ఎదురైతే, దాని కంటే ఇక్కడ ఒకే ఇంట్లో ఉండటం మంచిది’ అన్నది.
“మీ రెందుకు సంసారం త్యజించాలి? ఇంట్లో ఉండటం ఎంతో అనుకూలం కూడా. భోజనానికై కలత చెందనవసరం లేదు. భార్యతో జీవించవచ్చు, అది దోషం కాదు. శరీరానికి ఎప్పుడెప్పుడు ఏవేవి కావాలో అవన్నీ సమీపంలోనే లభిస్తాయి. రోగం వస్తే సేవ చేయటానికి ప్రక్కన మనుష్యులూ ఉంటారు.
“జనకుడు, వ్యాసుడు, వసిష్ఠుడు మొదలైన వారందరూ జ్ఞానం పొందాక సంసారంలో జీవించారు. వీరు రెండు కత్తులతోనూ సాము చేశారు. ఒక కత్తి జ్ఞానం, మరొకటి కర్మ.
ఉపన్యాయమూర్తి: మహాశయా! జ్ఞానం కలిగిందని ఎలా తెలుసుకోగలం?
శ్రీరామకృష్ణులు: జ్ఞానం కలిగితే భగవంతుణ్ణి దూరంగా ఉన్నట్లు గాంచరు. ఆ తరువాత ఆయన ‘ఆయన’ కాదు, ‘ఈయన’ అయిపోతాడు; హృదయమధ్యంలో ఆయన్ను చూడగలం. ఆయన అందరిలోనూ ఉన్నాడు, ఎవరు వెదకితే వాళ్ళు పొందుతారు.
ఉపన్యాయమూర్తి: మహాశయా! నేను పాపిని. భగవంతుడు నాలో ఉన్నాడని ఎలా చెప్పగలను?
32.4.2 బ్రహ్మసమాజం, క్రైస్తవం – పాపం
శ్రీరామకృష్ణులు: పాపం, పాపం అంటూ ప్రేలాపించటం మీకు అలవాటు అయిపోయింది. ఇది క్రైస్తవ మతమా! ఒకడు నా కొక పుస్తకం (బైబిల్) ఇచ్చాడు. దాన్ని కాస్త చదివించుకుని విన్నాను; ఆ పుస్తకం నిండా ఒక్క విషయమే ఉంది – పాపం, పాపం! ‘నేను భగవన్నామాన్ని స్మరించాను. రాముడు అనో లేక హరి అనో పలికాను. ఇక నా కేమిటి, పాపం ఏమిటి!’ – అటువంటి విశ్వాసం ఉండాలి. భగవన్నామ మాహాత్మ్యంలో విశ్వాసం ఉండాలి.
ఉపన్యాయమూర్తి: స్వామీ, ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది?
శ్రీరామకృష్ణులు: భగవంతుని పట్ల అనురాగం కలిగి ఉండండి. ‘ప్రభో, అనురాగం లేకుండా యజ్ఞయాగాదులు చేసి నిన్ను పొందనగునా?’ అని మీ (బ్రహ్మసమాజం) పాటలోనే ఉంది కదా! ఈ అనురాగం, భగవంతుని పట్ల ప్రేమ దేనిచే కలుగుతుందో దాన్ని పొందగోరి ఏకాంతంలో మనోవ్యాకులతతో ప్రార్థించండి, విలపించండి. భార్యకు జబ్బు చేస్తేనో, ధన నష్టం వాటిల్లితేనో, ఉద్యోగం కోసమో లోకులు కడవల పర్యంతం కన్నీరు కారుస్తారు. భగవంతునికై ఎవరు విలపిస్తారు? చెప్పండి చూద్దాం.
32.5 పంచమ పరిచ్ఛేదం ముఖ్తార్నామా – గృహస్థుల బాధ్యత ఎంత వరకు?
త్రైలోక్యుడు: స్వామీ! వీటికంతా తీరిక ఎక్కడిది? ఆంగ్లేయులకు సేవ చేయటంలోనే కాలం సరిపోతోంది.
శ్రీరామకృష్ణులు (ఉపన్యాయమూర్తితో): అలాగైతే భగవంతునికి ముఖ్తార్నామా ఇచ్చివెయ్యి. ఒక మంచి వ్యక్తికి బాధ్యత అప్పగిస్తే అతడు అపకారం తలపెడతాడా? భగవంతునిపై హృదయ పూర్వకంగా భారమంతా మోపి మీరు నిశ్చింతగా ఉండండి. భగవంతుడు మీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండండి.
“పిల్లికూనకు లెక్కలు కట్టే బుద్ధి లేదు. అది ‘మ్యావ్ మ్యావ్’ అని మాత్రమే అరుస్తుంది. తల్లి పిల్లి కూనను పొయ్యిలో తీసుకువెళ్ళి పెట్టినా అది అక్కడే పడివుంటుంది; మ్యావ్, మ్యావ్ అని మాత్రమే పిలువగలుగుతుంది. తల్లిపిల్లి దాన్ని యజమాని పరుపుపై ఉంచినా కథ అదే, మ్యావ్ మ్యావ్ మాత్రమే.
ఉపన్యాయమూర్తి: మేం గృహస్థులం. ఈ లౌకిక బాధ్యతలను ఎంతకాలం నిర్వహించాలి?
శ్రీరామకృష్ణులు: మీకు బాధ్యతలు ఉన్నాయన్న మాట నిజమే. పిల్లలను పెంచి పెద్దచేయాలి, అన్నవస్త్రాలు ఇచ్చి భార్యను పోషించాలి. మీ జీవితకాలం పిదప కూడా ఆమె పోషణకు ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయకుంటే మీరు నిర్దయులు. శుకదేవాదులు దయామయులు. దయ లేనివాడు మనిషే కాడు!
ఉపన్యాయమూర్తి: బిడ్డలను ఎంతకాలం పోషించాలి?
శ్రీరామకృష్ణులు: యుక్త వయస్కులు అయ్యేవరకు. కోడిపిల్ల పెద్దది కాగానే, తానే స్వయంగా ఆహారం వెదుక్కోగలిగే సామర్థ్యం కలుగగానే, తల్లికోడి దాన్ని ముక్కుతో పొడిచి తరిమివేస్తుంది, ప్రక్కకు రానివ్వదు. (అందరూ నవ్వారు)
ఉపన్యాయమూర్తి: భార్య పట్ల కర్తవ్యం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: నువ్వు బ్రతికి ఉన్నంతవరకు ఆమెకు సద్బోధ గావించు, ఆమెను పోషించు. ఆమె శీలవతి అయితే నీ మరణానంతరమూ ఆమె పోషణకు ఏర్పాటు చేసి ఉంచు.
“కాని జ్ఞానోన్మత్తుడైన తరువాత కర్తవ్యాలు ఏవీ ఉండవు. అప్పుడు, నీ రేపటి అవసరాల గురించి నువ్వు ఆలోచించకపోయినా, భగవంతుడే స్వయంగా ఆలోచిస్తాడు. చిన్నబిడ్డను వదలిపెట్టి జమీందారు మరణిస్తే, న్యాయస్థానం నియమించే సంరక్షకుడు ఆ బిడ్డ బాధ్యతను స్వీకరిస్తాడు. చట్టం గురించిన ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా?
ఉపన్యాయమూర్తి: అవునండీ.
విజయ్: ఆహా! ఆహా! అమూల్య వాక్కులు! అనన్య చిత్తంతో భగవంతుణ్ణే చింతన చేస్తూ ఆయన ప్రేమలో పిచ్చివాడైన వ్యక్తి బాధ్యతను భగవంతుడే వహిస్తాడు! తల్లితండ్రులను కోల్పోయిన చిన్నపిల్లల బాధ్యతను స్వీకరింప న్యాయస్థానం నియమించిన సంరక్షకుడు వచ్చి స్వీకరించేటట్లు! ఆహా! నాకు ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది? అటువంటి స్థితి కలిగినవారు ఎంతటి భాగ్యశాలురు!
త్రైలోక్యుడు: స్వామీ, సంసార జీవితం గడుపుతున్న వారికి జ్ఞానం నిజంగా లభిస్తుందా? భగవత్ప్రాప్తి కలుగుతుందా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏమయ్యా, ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు బెల్లంలోనూ ఉన్నావు, పాకంలోనూ ఉన్నావు కదా! (అందరూ నవ్వారు) భగవంతునిపై మనస్సును నిలిపే కదా సంసారం చేస్తున్నావు. సంసారంలో ఉన్న వ్యక్తికి భగవత్ ప్రాప్తి ఎందుకు లభించదు? నిశ్చయంగా లభిస్తుంది!
32.5.1 సంసారంలోని జ్ఞాని లక్షణాలు – జీవన్ముక్తి
త్రైలోక్యుడు: సంసారంలో ఉన్న వ్యక్తికి జ్ఞానం సిద్ధించిందనడానికి ఏమిటి చిహ్నాలు?
శ్రీరామకృష్ణులు: భగవన్నామాన్ని ఉచ్చరించగానే ఆతడికి కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తాయి, ఒళ్ళు పులకరిస్తుంది. భగవంతుని మధుర నామాన్ని వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి, కళ్ళవెంట అశ్రువులు ధారకడతాయి.
“సంసారంలో ఉన్నంత వరకు, కామినీ కాంచన ఆసక్తి ఉన్నంతవరకు దేహబుద్ధి నశించదు. విషయాసక్తత తగ్గినంత మేరకు ఆత్మజ్ఞానం కేసి పురోగమించవచ్చు; దేహబుద్ధీ తగ్గుతుంది. విషయాసక్తి అడుగంటా నశిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆత్మ వేరు, దేహం వేరు అని బోధపడుతుంది. కొబ్బరికాయలో నీరు ఇంకిపోనంత వరకు దాన్లోని కొబ్బరిని, చిప్పను కత్తితో కూడా వేరు చేయటం కష్టం. నీరు ఇంకిపోతే లోపల ఎండుకొబ్బరి దబదబలాడుతుంది, చిప్ప నుంచి కొబ్బరి వేరైపోతుంది. దీనినే ఎండుకొబ్బరి అంటాం.
“భగవదనుభూతి పొందిన వ్యక్తి లక్షణం ఇదే – అతడు ఎండు కొబ్బరి మాదిరి అయిపోతాడు; దేహమే ఆత్మ అనే బుద్ధి పోతుంది. దేహం యొక్క సుఖదుఃఖాలు తన సుఖదుఃఖాలుగా అతడికి తోచదు. అతడు దేహ సుఖాలను ఆకాంక్షించడు, జీవన్ముక్తునిగా తిరుగాడుతూ ఉంటాడు. ‘కాళీభక్తుడు జీవన్ముక్తుడు, సర్వదా ఆనందంతో నిండి ఉంటాడు.’
“భగవన్నామాన్ని ఉచ్చరించగానే కన్నీరు స్రవించటం, రోమాంచితం కావటం జరిగితే అతడిలో కామినీకాంచన ఆసక్తి పోయిందనీ, అతడికి భగవదనుభూతి కలిగిందనీ తెలుసుకో. అగ్గిపుల్ల ఎండి ఉన్నప్పుడు ఒక్కసారి గీయగానే గప్మని మండుతుంది. కాని అది చెమ్మగిల్లి ఉన్నప్పుడు యాభైసార్లు గీచినా కూడా మండదు, పుల్లలే వ్యర్థం అవుతాయి. విషయాసక్తి అనే రసంలో మునిగి ఉంటే, కామినీ కాంచన మనే పానకంలో మనస్సు నాని ఉంటే భగవంతుని గురించిన చైతన్యం జాగృతం కాదు. వేయిసార్లు ప్రయత్నించి చూడు, అన్నీ వ్యర్థ ప్రయత్నాలే. విషయాసక్తి అనే రసం ఎండిపోతే తత్క్షణమే చైతన్యం జాగృత మవుతుంది. (BG 15.11)
32.5.2 ‘ఆమె నా సొంత తల్లి’ – వ్యాకులతే మార్గం
త్రైలోక్యుడు: విషయాసక్తి అనే రసం ఎండిపోడానికి మార్గం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: వ్యాకుల మనస్కుడవై అమ్మను ప్రార్థించు. ఆమె దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది; కామినీకాంచనాల పట్ల ఉన్న అనురక్తి యావత్తు తొలగిపోతుంది. ‘ఆమె నా సొంత తల్లి’ అన్న భావన ఉంటే ఈ క్షణమే సాధ్యం అవుతుంది. ఆమె సవతి తల్లి కాదు, ఆమె సొంత తల్లి. మనోవ్యాకులతతో ఆమె వద్ద మొరాయించుకొని కూర్చో. గాలిపటం కొనటానికి పిల్లవాడు తల్లి చీరచెంగు పట్టుకొని డబ్బు అడుగుతాడు. ఆ సమయంలో బహుశా ఆమె పొరుగు స్త్రీలతో మాట్లాడుతూ ఉండవచ్చు. మొదట ఆమె డబ్బు ఇవ్వడానికి సుతరామూ ఒప్పుకోదు. ‘లేదు, ఇవ్వవద్దని మీ నాన్న చెప్పారు. ఆయన వచ్చినప్పుడు అడుగుతాను. ఇప్పుడు గాలిపటం ఎగురవేసి లేనిపోని గొడవలు తెస్తావు’ అంటుంది. పిల్లవాడు ఏడుపు లంకించుకుంటాడు, మొండిపట్టు పడతాడు. వెంటనే ఆమె పొరుగు స్త్రీలతో, ‘కాస్త ఉండండి, వీణ్ణి సముదాయించి ఇప్పుడే వచ్చేస్తాను’ అని చెప్పి, తాళం చెవి తీసుకొని, పెట్టెను తెరచి పిల్లవాడికి డబ్బు ఇస్తుంది. మీరు కూడా అమ్మ వద్ద మొండికెత్తండి, ఆమె దర్శనం ఇచ్చి తీరుతుంది.
“నేను సిక్కులతో ఈ ముక్కే చెప్పాను. వాళ్ళు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు మేమందరం కాళికాలయం ఎదుట కూర్చొని మాట్లాడుకొంటూ ఉన్నాం. వాళ్ళు ‘భగవంతుడు దయామయుడు’ అన్నారు. ‘అదెలా?’ అని నేను అడిగాను. ‘ఎందుకు స్వామీ, ఆయన సర్వదా మనలను కాపాడుతున్నాడు, మనకు మంచిదారి చూపుతున్నాడు, ధనం ఇస్తున్నాడు, ఆహారం సమకూర్చుతున్నాడు’ అన్నారు. అందుకు నేను, ‘ఎవరికైనా పిల్లాజల్లా ఉంటే వారి బాధ్యత, తిండితిప్పలన్నీ తండ్రి వహిస్తాడా, లేక ఊరివాళ్ళు వచ్చి చేస్తారా?’ అని అడిగాను.
ఉపన్యాయమూర్తి: స్వామీ, అలా అయితే ఆయన దయామయుడు కాడా?
శ్రీరామకృష్ణులు: ఎందుకు అలా అంటున్నారు? నేను చెప్పేది భగవంతుడు మన సొంత మనిషి, ఆయన్ను బలవంతం చేసే హక్కు మనకు ఉంది అనే. మనకు బాగా కావలసిన ఒకణ్ణి, ‘ఒరేయ్, ఇవ్వవా?’ అని కూడా అడగవచ్చు. (BG 2.59, Brihadaranyaka Upanishad 2.4.5)
32.6 షష్ఠ పరిచ్ఛేదం అహంకారం – త్రిగుణాలు – వివిధ జీవులు
శ్రీరామకృష్ణులు: అది సరే, గర్వం, అహంకారం అనేది జ్ఞానంచే కలుగుతాయా లేక అజ్ఞానం చేతనా? అహంకారం తమోగుణం, అది అజ్ఞాన జనితం. అహంకారమనే ఈ తెర ఉన్నందుననే భగవంతుని గాంచలేకున్నాం. ‘నేను’ అనేది మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం. ఈ దేహం, ఈ ఐశ్వర్యం ఏదీ శాశ్వతం కాదు. ఒక తాగుబోతు దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ప్రతిమకు చేసిన అలంకారాలను చూసి అతడు, ‘అమ్మా, నువ్వు ఎంతగా అలంకరించుకున్నా, రెండు మూడు రోజులు తరువాత నిన్ను లాక్కెళ్ళి గంగలో పారవేస్తారు’ అన్నాడు. (అందరూ నవ్వారు) అందుకే అందరికీ చెబుతున్నాను. జడ్జిగా ఉన్నా సరే, మరెవరిగా ఉన్నాసరే, అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. కాబట్టి గర్వం, అహంకారం వదలిపెట్టి వేయాలి. (BG 3.27)
సత్వరజస్తమో గుణాలు వేర్వేరు స్వభావాలు గలవి. అహంకారం, నిద్ర, మితిమీరి తినటం, కామం, క్రోధం మొదలైనవి తమోగుణ స్వభావుల లక్షణాలు. రజోగుణ స్వభావులు అనేక కార్యకలాపాలలో పాల్గొంటారు; వారి దుస్తులు మెరుస్తూ, ఆడంబరంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా, పటాటోపంగా ఉంటుంది. ముంగిటి గదిలో క్వీన్ చిత్తరువు వ్రేలాడుతూ ఉంటుంది. పూజా సమయంలో పట్టుపీతాంబరాలు ధరిస్తారు. మెళ్ళో రుద్రాక్షమాల ఉంటుంది. ఆ మాల మధ్యమధ్య బంగారు రుద్రాక్ష మణులు గ్రుచ్చబడి ఉంటాయి. ఎవరైనా పూజాగృహాన్ని చూడవస్తే, తామే పిలుచుకుపోయి అన్నీ చూపిస్తారు; ‘ఇదుగో, ఈ వైపు రండి, ఇంకా ఉంది. తెల్ల చలువరాతితో చేసిన, పాలరాతితో చేసిన గచ్చు ఉంది, మనోరంజకంగా మలచబడిన మండపం ఉంది’ అంటూ వివరిస్తారు. పలువురు చూసేట్లు దానధర్మాలు చేస్తారు.
“సత్త్వగుణ స్వభావులు శాంతంగా ఉంటారు. దొరికిన వస్త్రాన్ని ధరిస్తారు. కడుపుకు సరిపడేటంత మేరకే సంపాదిస్తారు. పరులను ముఖస్తుతి చేసి ధనం గడించాలనుకోరు. ఇంటిని మరమ్మత్తు చేసుకోరు, పిల్లల దుస్తుల గురించి కలత చెందరు. పేరు ప్రతిష్ఠలను అపేక్షించరు. భగవత్ చింతన, దానం, ధ్యానం అన్నీ గుప్తంగానే జరిగిపోతాయి. ఎవరికీ ఏదీ తెలిసిరాదు. దోమతెరలో ధ్యానం చేస్తారు; ‘రాత్రి ఇతడు నిద్రపోలేదు కాబోలు! అందుకే ఉదయం ఇంతసేపటిదాకా నిద్రిస్తున్నాడు’ అని ఇతరులు అనుకుంటారు. సత్త్వగుణం అనేది మెట్లలో చివరి మెట్టు లాంటిది, తరువాతిది డాబాయే. సత్త్వగుణం గడించాక ఇక భగవద్దర్శనానికి జాప్యం ఉండదు. మరి కాస్త పురోగమిస్తే ఆయన్ను పొందవచ్చు. అందరూ సమానులే అని చెప్పారే! చూడండి ఎన్ని రకాల మనుష్యులు ఉన్నారో! (BG 14.9)
“ఇంకా ఎన్నో తరగతులకు చెందినవారు ఉన్నారు. నిత్యజీవులు, ముక్తజీవులు, ముముక్షు జీవులు, బద్ధ జీవులు – ఇలా పలురకాల మనుష్యులు ఉన్నారు. నారదుడు, శుకదేవుడు మొదలైనవారు నిత్యజీవులు. వీరు స్టీమర్ లాంటి వారు. తాము తీరం చేరటమే కాక, ఏనుగు వంటి పెద్ద జంతువులను కూడా వాళ్ళు తీసుకు వెళ్ళగలరు. నిత్యజీవులు తహసిల్దారు వంటివారు. ఒక తాలూకాలో చెలరేగిన అల్లర్లను అణచివేసి, మరో తాలూకాకు వెళతారు. వారి తరువాత ముముక్షు జీవులు. వీళ్లు విషయాసక్తి అనే వల నుండి విడివడడానికి ప్రాణాలొడ్డి పాటుపడతారు. వీళ్ళలో ఒకరిద్దరు ఈ వల నుండి తప్పించుకుంటారు, వాళ్ళు ముక్తజీవులు. నిత్యజీవులు తెలివైన చేపలవంటివారు. వీళ్ళు వలలో ఎన్నడూ చిక్కుకోరు.
“బద్ధజీవులు విషయాసక్తతలో చిక్కువడిన వారు, స్ఫురణ లేనివారు. వీళ్ళు వలలో చిక్కుకుని ఉన్నారు, కాని వలలో చిక్కుకున్నాం అనే భావనే ఉండదు. వారి ముందు ఆధ్యాత్మిక ప్రస్తావన తెస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ‘అంత్యకాలంలో చూసుకోవచ్చు. భగవంతుని గురించి ఇప్పుడు ఎందుకు?’ అంటారు. మరణశయ్యపై ఉన్నప్పుడు భార్యాబిడ్డలను చూసి, ‘దీపంలో ఎందుకు ఇన్ని వత్తులు! ఒక వత్తి చాలు, లేకుంటే నూనె తీరిపోతుంది!’ అంటారు. భార్యాబిడ్డలను తలచుకుని, ‘అయ్యో, నేను మరణించాక వీరి గతి ఏమిటి?’ అంటూ విలపిస్తారు. వీళ్ళు దేని కారణంగానైతే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో, దాన్ని పదేపదే చేస్తూంటారు. ఒంటె ముళ్ళకంపలు తింటూ ఉన్నప్పుడు నోటి నుండి రక్తం ధారగా కారుతుంది, కాని వదలిపెట్టదు. జనులు, బిడ్డ చనిపోయిందని దుఃఖం ముంచుకురాగా విలపిస్తారు, కాని ప్రతి ఏటా బిడ్డలను కంటూనే ఉంటారు. కుమార్తె వివాహంలో అంతా ఖాళీ అయిపోయివుంటుంది, కాని ప్రతి ఏటా ఆడపిల్లను కంటూనే ఉంటారు; ‘ఏం చెయ్యటం, నా తలరాత’ అంటారు. తీర్థయాత్రకు వెళితే భగవంతుని గురించి చింతన చేయటానికి వీరికి తీరికే దొరకదు. భార్యాబిడ్డల మూటముల్లెలను మోయటంలోనే వాళ్ల ప్రాణం పోతుంది. ఇక, ఆలయానికి పోతే బిడ్డకు తీర్థప్రసాదాలు ఇవ్వటం, బిడ్డను అంగ ప్రదక్షిణం చేయించటంలోనే ఆరాటపడతారు. తన పొట్టను, భార్యాబిడ్డల పొట్టలను నింపటానికై చేతులు కట్టుకుని సేవలు చేస్తారు. అసత్యం, వంచన, ముఖస్తుతి లాంటి అన్ని మార్గాల ద్వారా ధనం సంపాదిస్తారు. భగవత్ చింతన చేసేవారిని, భగవద్ధ్యానం చేసేవారిని పిచ్చివారని హేళన చేస్తారు. (ఉపన్యాయమూర్తితో) మనుష్యులలో ఎన్ని రకాలో, చూశారా? అందరూ సమానమే అంటున్నారే? ఎన్ని రకాల స్వభావాలు! కొందరిలో ఎక్కువ శక్తి, కొందరిలో తక్కువ శక్తి!
32.6.1 మరణ సమయంలో భగవత్ స్మృతి – బద్ధజీవుడు
“బద్ధజీవులు మరణ సమయంలోనూ సంసారం గురించే పలవరిస్తారు. బాహ్యంగా జపమాలను త్రిప్పటం వలనా, గంగలో మునగటం వలనా, తీర్థయాత్రలు చేయటం వలనా ప్రయోజనం ఏమిటి? అంతరంగాన సంసారం పట్ల అనురక్తి ఉండే పక్షంలో మరణ సమయంలో అదే ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏదేదో అసందర్భ ప్రేలాపన చేస్తాడు! సంధి కొట్టిన వ్యక్తి, ‘పసుపు, ఆవాలు, లవంగం’ అంటూ ప్రేలాపిస్తాడు. చిలుక సామాన్యంగా ‘రాధాకృష్ణా’ అని పలుకుతుంది. కాని పిల్లి పట్టుకోవటానికి వచ్చినప్పుడు దాని స్వతసిద్ధమైన ‘కీచ్, కీచ్’ కంఠస్వరమే వెలువడుతుంది. మరణించేటప్పుడు దేన్ని గురించి యోచిస్తూ ఉంటావో దాన్నే మరుజన్మలో పొందుతావని గీత (BG 8.6) పేర్కొంటోంది. భరత మహారాజు ‘జింక, జింక’ అంటూ ప్రాణం వదిలాడు, మరుజన్మలో జింకగా జన్మించాడు. భగవత్ చింతన చేస్తూ ప్రాణం వదలితే భగవల్లాభం కలుగుతుంది, తదనంతరం ఈ లోకానికి తిరిగి రానక్కరలేదు.”
బ్రహ్మసమాజ భక్తుడు: స్వామీ, ఒక వ్యక్తి ఇతర సమయాలలో భగవత్ చింతన చేస్తూ ఉంటాడు, మరణ సమయంలో చింతన చేయలేదు. అతడు సుఖదుఃఖమయమైన ఈ సంసారంలోకి తిరిగి రావటం సంభవిస్తుందా? అతడు మునుపు భగవత్ చింతన చేసి ఉన్నాడే?
శ్రీరామకృష్ణులు: జీవుడు భగవంతుని గురించి చింతన చేస్తాడు కాని ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడు. అందుచేత మళ్ళీ మళ్ళీ మరచిపోతాడు. ఏనుగుకు ఇప్పుడు స్నానం చేయిస్తాం, మరుక్షణమే అది మట్టి, బురదలను పూసుకుంటుంది. మనస్సు ఒక మదించిన ఏనుగు! కాని ఏనుగుకు స్నానం చేయించగానే ఏనుగుశాలలో కట్టివేస్తే అది మట్టినో, బురదనో పులుముకోలేదు. మనిషి మరణించే సమయంలో భగవంతుని తలచుకుంటే మనస్సు శుద్ధమై పోతుంది. మళ్ళీ కామినీ కాంచనాల పట్ల ఆసక్తి చెందటానికి ఆ మనస్సుకు అవకాశం ఉండదు.
“జీవునికి భగవంతుని పట్ల విశ్వాసం లేదు, అందుచేతనే ఇన్ని కష్టాలు అనుభవిస్తాడు. ‘గంగలో స్నానం చేస్తున్నప్పుడు, పాపాలు నిన్ను వీడి గంగా తీరంలోని చెట్లపై కూర్చుంటాయి. నువ్వు ఒడ్డుకు రాగానే మళ్ళీ నీ భుజాలపై కెక్కుతాయి’ అని చెబుతాను. (అందరూ నవ్వారు) ప్రాణం పోయేటప్పుడు భగవంతుని తలంపు ఉండాలంటే అందుకైన మార్గం ముందుగానే చేసుకుని ఉండాలి. ఆ మార్గమే అభ్యాసయోగం. భగవంతుణ్ణి నిరంతరం తలచుకోవటం అభ్యాసం చేసుకుంటె చివరి క్షణంలోనూ ఆయన స్మరణకు వస్తాడు. (BG 8.7)
బ్రహ్మసమాజ భక్తుడు: అమోఘ వాక్కులు! అద్భుతమైన వచనాలు!
శ్రీరామకృష్ణులు: ఏదో వ్యర్థ ప్రసంగం. నా స్థితి ఏమిటో తెలుసా? నేను యంత్రాన్ని, ఆమె నడిపించేది. నేను ఇల్లు, ఆమె ఇంటి యజమానురాలు. నేను బండిని, ఆమె చోదకురాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను.
32.7 సప్తమ పరిచ్ఛేదం భజనానందంలో శ్రీరామకృష్ణులు
త్రైలోక్యుడు మళ్ళీ పాడసాగాడు. మృదంగ తాళాలు జత కలిశాయి. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తతలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూ ఉండగానే పలుమార్లు సమాధిస్థితి పొందారు. సమాధి స్థితిలోనే నిలబడి ఉన్నారు. దేహం నిశ్చలమైంది! స్థిరదృష్టి! దరహాస వదనం! ప్రియతముడైన ఒక భక్తుని భుజం మీద చేయివేసుకొని నిలబడి ఉన్నారు. మళ్ళీ పారవశ్య స్థితి! ఒకింత బాహ్యజ్ఞానం రాగానే మదపుటేనుగులా నృత్యం చేశారు. బాహ్యచైతన్యం పొందగానే పాటకు కొన్ని చరణాలు జత కలిపారు–
సేయవె నృత్యము ఓ నా జననీ
భక్తుల కొరకై నృత్యము సేయవె
నృత్యము వారల సేయింపగదే ॥ సే ॥
నటన మొనర్పవె నా హృదయములో
నటన మొనర్పవే హృదయ కమలమున ॥ సే ॥
ఓ నా జననీ నాట్యమొనర్పవె
నిత్యానందా బ్రహ్మమయీ ॥ సే ॥
విశ్వమనోహరమగు నీ సుందర
రూపరాసితో సేయవె నృత్యము ॥ సే ॥
సేయవె జననీ సేయవె నృత్యము
సేయవె జననీ ॥ సే ॥
వర్ణనాతీతమైన దృశ్యం! జగజ్జననిలో తాదాత్మ్యం చెందిన, ప్రేమోన్మత్తతలో మునిగిపోయిన ఆ దైవబాలుని దివ్యనృత్యం! ఇనుమును అయస్కాంతం ఆకర్షించే రీతిలో బ్రహ్మసమాజ భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. అందరూ పిచ్చిపట్టిన వారిలా బ్రహ్మనామాన్ని ఉచ్చరించారు. మళ్ళీ అదే సుమధుర బ్రహ్మనామాన్ని, జగజ్జనని నామాన్ని ఉచ్చరించారు. పిల్లల వలె, “అమ్మా! అమ్మా!” అంటూ పలువురు బిగ్గరగా విలపించారు.
పాటలు పూర్తి అయ్యాక అందరూ కూర్చున్నారు. సమాజపు సాయంత్రపు ఉపాసన ఇంకా పూర్తికాలేదు. హఠాత్తుగా ఉత్పన్నమైన ఈ కీర్తనానందంలో విధివిహితాలన్నీ ఎక్కడికో పోయాయి. రాత్రి విజయ్‌కృష్ణ గోస్వామి వేదికపై కూర్చుని ఉపాసన జరిపింప ఏర్పాట్లు చేశారు. అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు కాబోతోంది.
అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు కూడా కూర్చున్నారు. ఎదురుగా విజయ్ ఉన్నాడు. అతని అత్తగారు, తక్కిన భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను చూడగోరి, ఆయనతో మాట్లాడగోరి ఉన్నారన్న సమాచారం వచ్చింది. ఆయన ఒక గదిలోకి వెళ్ళి వాళ్ళను కలుసుకున్నారు.
కాసేపయ్యాక తిరిగి వచ్చి విజయ్‌తో ఇలా అన్నారు: “మీ అత్తగారికి ఎంత భక్తి! ఆమె నాతో, ‘సంసార విషయాలను గురించి చెప్పకండి. ఒక అల పడిపోగానే మరో అల లేస్తుంది’ అన్నది. అందుకు నేను, ‘అలా అయితే మీ కేమిటి? మీకు జ్ఞానం వచ్చేసిందిగా’ అన్నాను. అందుకు ఆమె, ‘నాకా, జ్ఞానం రావటమా! ఇంతవరకు విద్యామాయను, అవిద్యామాయను అతిక్రమించి ఎరగను. అవిద్యామాయను మాత్రం అతిక్రమిస్తే చాలదే, విద్యామాయనూ అతిక్రమించాలే? అప్పుడే కదా జ్ఞానం కలుగుతుంది? మీరే కదా ఇలా చెబుతున్నారు?’ అన్నది.”
శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వేణీపాల్ వచ్చాడు.
వేణిపాల్ (విజయ్‌తో): మహాశయా, రండి. చాలా ఆలస్యమైంది. ఉపాసన ప్రారంభించండి.
విజయ్: అయ్యా, ఇక ఉపాసన అవసరం ఏముంది! ఇక్కడ మొదట పాయసానికి ఏర్పాటు చేశారు; పిదప పప్పు, చారు వగైరాలు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): భక్తులు తమ ప్రవృత్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. సత్త్వగుణ భక్తుడు పాయసం నివేదిస్తాడు. రజోగుణ భక్తుడు యాభై రకాల వంటకాలతో నివేదన చేస్తాడు. తమోగుణ భక్తుడు మేకలవంటి జంతువులను బలి ఇస్తాడు.
ఉపాసనా వేదికపై కూర్చోవటానికి విజయ్ సంకోచించాడు.
32.8 అష్టమ పరిచ్ఛేదం విజయ్‌కి ఉపదేశం
విజయ్ (శ్రీరామకృష్ణులతో): మీరు ఆశీర్వదించండి. అప్పుడే వేదికపై కూర్చుని ఉపాసన నిర్వర్తిస్తాను.
శ్రీరామకృష్ణులు: అహంకారం తొలగిపోతేనే చాలు. ‘నేను లెక్చర్ ఇస్తున్నాను, మీరు వినండి’ అనే అహంకారం లేకుంటే చాలు. అహంకారం జ్ఞానం వలన కలుగుతుందా, అజ్ఞానం వలన వస్తుందా? అహంకార శూన్యునిలోనే జ్ఞానం ఉంటుంది. పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి జారిపోతుంది.
“అహంకారం ఉన్నంత వరకు జ్ఞానమూ కలుగదు, ముక్తీ కలుగదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చే తీరాలి. దూడ, ‘హంబా, హంబా’ (నేను, నేను) అంటూ అరుస్తుంది. అందుచేత దానికి ఎంత దుఃఖం! కసాయివాడు తెగనరుకుతాడు; తోలును చెప్పులుగా కుట్టుతారు, డోలు తయారుచేస్తారు. ఆ డోలును ఎంతగా వాయిస్తారు! దాని దుఃఖానికి అంతమే లేదు! చివరగా దాని ప్రేగులను దూది ఏకేవాడి వింటికి నారిగా ఉపయోగిస్తారు. దూది ఏకే సమయంలో అది ‘తుహూ! తుహూ!’ (నువ్వు, నువ్వు) అంటుంది. అప్పుడే దానికి శాంతి చేకూరేది. ఆ తరువాత అది ‘హంబా! హంబా!’ అని అరవదు, ‘తుహు, తుహు’ అనే అంటుంది. అంటే: ఓ భగవాన్, నువ్వే కర్తవు, నేను అకర్తను; నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు, నేను యంత్రాన్ని; సర్వం నువ్వే.’ (BG 3.27)
“గురు, బాబా (తండ్రి), కర్త – ఈ మూడు మాటలు వినేటప్పుడు నా ఒంట్లో ముల్లు గుచ్చుకొన్నట్లుగా ఉంటుంది. నేను ఆయన కుమారుణ్ణి, సదా ఆయన కుమారుడనే. అలాటప్పుడు నేను ‘బాబా’ నవటమా! భగవంతుడే కర్త, నేను కాదు; ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని.
“ఎవరైనా నన్ను గురువని సంబోధిస్తే, ‘ఛీ మూర్ఖుడా, గురు వెవరు?’ అంటాను. సచ్చిదానందుడు తప్ప వేరే గురువు లేరు. ఆయన తప్ప మరో మార్గమే లేదు. ఆయన ఒక్కడే భవసాగరంలో మనలను తరింపచేసే సరంగు.
(విజయ్‌తో) “ ‘ఆచార్యత్వం’ వహించటం ఎంతో కష్టతరం. ఇందుచేత ఆ వ్యక్తి తనకు తానే కీడు వాటిల్ల చేసుకుంటాడు. పదిమంది గౌరవించటం చూసి కాలుపై కాలు వేసుకుని, ‘నేను బోధిస్తాను, మీరు వినండి’ అంటాడు. ఇది శోచనీయమైన ధోరణి, దాని లబ్ధి ఏదో కొంత ప్రశంస! అంతే. కొందరు, ‘ఆహా! విజయ్‌బాబు ఎంత బాగా ప్రసంగించాడు, ఆయన మహాజ్ఞాని’ అంటే అనవచ్చు. ‘నేను బోధిస్తున్నాను’ అని భావించవద్దు. నేను అమ్మతో, ‘అమ్మా! నువ్వు నడిపేదానవు, నేను యంత్రాన్ని; నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను. ఎలా పలికిస్తే అలా పలుకుతాను’ అంటూ ఉంటాను.
విజయ్ (వినమ్రంగా): మీరు అనుజ్ఞ ఇస్తే నేను వేదికపై కూర్చుంటాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేను ఏం చెప్పను? చందమామ అందరికీ మామే. నువ్వే ఆయన్ను ప్రార్థించు. హృదయంలో నిజమైన తపన ఉంటే ఏ భయమూ ఉండదు.
విజయ్ మళ్ళీ వినమ్రంగా అడగ్గా శ్రీరామకృష్ణులు, “మంచిది. నియమానుసారం చెయ్యి. భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి ఉంటే చాలు” అన్నారు.
విజయ్ వేదికపై కూర్చుని బ్రహ్మసమాజ పద్ధతి ప్రకారం ఉపాసన నిర్వర్తించాడు. ఉపాసనా సమయంలో అతడు ‘అమ్మా, అమ్మా’ అంటూ ప్రార్థించటం చూసి అందరి మనస్సులూ ద్రవించాయి.
ఉపాసన పూర్తికాగానే భక్తుల భోజనాలకైన ఏర్పాట్లు జరిగాయి. జంపఖానా మొదలైనవి తీసివేసి ఆకులు వేశారు. భక్తులు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులకు పీట వేశారు. వేణీపాల్ సమర్పించిన పూరీలు, పలురకాల మిఠాయి, పెరుగు మొదలైన వాటిని భగవంతునికి నివేదించిన పిదప శ్రీరామకృష్ణులు సంతోషంగా భుజించారు.
32.9 నవమ పరిచ్ఛేదం కాళీయే బ్రహ్మం – పూర్ణ జ్ఞానానంతరం అభేదదృష్టి
భోజనానంతరం అందరూ తాంబూలం సేవించి ఇళ్ళకు తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. బయలుదేరే ముందు శ్రీరామకృష్ణులు విజయ్‌తో ఏకాంతంగా మాట్లాడసాగారు. ప్రక్కన ‘మ’ కూడా ఉన్నాడు.
32.9.1 ‘అమ్మ’ అనే భావం చాలా మంచిది
శ్రీరామకృష్ణులు: ఇందాక నువ్వు భగవంతుని ‘అమ్మా! అమ్మా!’ అంటూ ప్రార్థించావే – అది చాలా మంచిది. తండ్రి కంటే తల్లి బంధం దృఢమైనదని చెబుతారు. అమ్మ వద్ద మొండిపట్టు పట్టవచ్చు, తండ్రి వద్ద అది చెల్లదు. త్రైలోక్యుని* తల్లి జమీను నుంచి బండ్ల కొద్దీ ధనం వచ్చింది. దానికి కాపలాగా చేత దుడ్డు కర్రలతో, తలపై ఎరుపు టోపీలు ధరించి పలువురు కాపలావారు వచ్చారు. త్రైలోక్యుడు దారిలో తన మనుష్యులతో కాచుకొని ఉండి బలవంతంగా ధనం యావత్తు గుంజుకున్నాడు. తల్లి ఆస్తి కోసం మొండిపట్టు పట్టవచ్చు. కుమారుడిపై తల్లి వ్యాజ్యెం తెస్తే అది చెల్లదని కూడా చెబుతుంటారు కదా!
విజయ్: బ్రహ్మమే తల్లియైనప్పుడు అది సాకారమా? నిరాకారమా?
శ్రీరామకృష్ణులు: ఎవరైతే బ్రహ్మంగా ఉన్నారో ఆయనే కాళి (ఆద్యాశక్తి). నిష్క్రియంగా ఉన్నప్పుడు బ్రహ్మమని పేర్కొంటాం. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు శక్తి అని పేర్కొంటాం. స్థిరంగా ఉన్న నీరు బ్రహ్మానికి ఉదాహరణ. అలలతో కదలాడే నీరు శక్తి లేక కాళికి ఉదాహరణ. కాళి! ఆమె మహాకాళునితో (బ్రహ్మంతో) కూడి ఆనందిస్తుంది. కాళి సాకారి, నిరాకారి కూడా.
“ఆమె నిరాకారి అని మీరు విశ్వసిస్తే కాళిని ఆ రీతిలోనే ధ్యానం చేయండి. ఒక దాన్ని దృఢం చేసుకుని దాని ప్రకారం ఆమెను ధ్యానం చేస్తే, తాను ఎవరనేది ఆమే వెల్లడిస్తుంది. శ్యామ్‌పుకూర్ చేరుకుంటే పరిసర ప్రాంతాలను కూడా తెలుసుకోగలరు. అప్పుడు ఆమె కేవలం అస్తి (ఉన్నది) అని మాత్రమే కాదు, నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లు ఆమె మీ వద్దకు వచ్చి మాట్లాడుతుందని కూడా తెలుసుకుంటారు. విశ్వాసం కలిగి ఉండండి, సమస్తం లభిస్తుంది.
“మరో సంగతి – ‘ఒకవేళ మీకు నిరాకారంలో విశ్వాసం ఉంటె, దృఢంగా దానినే విశ్వసించండి. కాని, ‘నేను పట్టుకున్నదే సరైనది’ అన్న హఠవాదం చేయవద్దు. భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉండడని ఆయన్ను గురించి ఉద్ఘాటించి చెప్పలేం. ‘ఆయన నిరాకారి అని నేను విశ్వసిస్తున్నాను. తాను ఎలా ఎలా ఉండగలడో ఆయనకే ఎరుక, నాకు తెలియదు. నేను అర్థం చేసుకో లేకున్నాను’ అనండి. మనిషి తన పావు శేరు బుద్ధితో భగవంతుని స్వరూప స్వభావాలను తెలుసుకోగలడా? ఒక శేరు పాత్రలో నాలుగు శేర్ల పాలు పడతాయా? ఆయనే అనుగ్రహించి ఎప్పుడన్నా మనకు దర్శనం ఇస్తే, తనను తెలుసుకునేట్లు చేస్తే, అప్పుడే తెలుసుకోగలం, లేకుంటే సాధ్యం కాదు.
“ఎవరు బ్రహ్మమై ఉన్నారో ఆయనే శక్తి, ఆయనే తల్లి.
పలుకుచుండు రాంప్రసాదు
‘బ్రహ్మ’ యనుచు పిలచువాని
దరికి నేను చేరుకొంటి
‘అమ్మ’ యనుచు పిలచుచుండి
అతి నిగూఢమైన దాని
సంతలోన చెప్పవలెనె
ఊహచేయు మతని
సూచించిన సూచనముల.
“అంటున్నాడు రాంప్రసాదు. నేను ఎవరిని తల్లి అంటున్నానో అంటె, ఆ బ్రహ్మాన్నే తల్లి అంటున్నాను. దీనినే రాంప్రసాదు –
ప్రసాదు పలుకును ‘నేను భక్తిముక్తులు
రెంటినీ శిరమున ధరియింతును
నేను కాళీ, బ్రహ్మముల మర్మమును గ్రహించి
ధర్మాధర్మముల నన్నిటినీ వదలివేచితిని.’
“అధర్మం అంటే అనుచిత క్రియలు. ధర్మం అంటే వైదిక కర్మలు – ఇంత దానం చేయాలి, ఇంతమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి – ఇవన్నీ ధర్మం క్రిందికి వస్తాయి.”
విజయ్: ధర్మం, అధర్మం రెంటిని వదిలిపెడితే మిగిలి ఉండేది ఏమిటి?
శ్రీరామకృష్ణులు: శుద్ధభక్తి. నేను అమ్మను, ‘అమ్మా! ఇదుగో, నీ ధర్మాన్ని తీసుకో, ఇదుగో నీ అధర్మాన్ని తీసుకో; నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదుగో నీ పుణ్యాన్ని తీసుకో, ఇదుగో నీ పాపాన్ని తీసుకో; నాకు శుద్ధభక్తిని అనుగ్రహించు. ఇదుగో నీ జ్ఞానాన్ని తీసుకో, ఇదుగో నీ అజ్ఞానాన్ని తీసుకో; నాకు శుద్ధభక్తిని ఇవ్వు’ అని ప్రార్థించాను. చూశావా, జ్ఞానాన్ని కూడా నేను కోరలేదు, కీర్తిని కూడా ఆకాంక్షించలేదు. ధర్మాధర్మాలను విడిచిపెడితే శుద్ధభక్తి అంటే మచ్చలేని, నిష్కామ, అహేతుక భక్తి మాత్రమే మిగిలి ఉంటుంది.
32.9.2 బ్రహ్మం – ఆద్యాశక్తి
బ్రహ్మసమాజ భక్తుడు: భగవంతుడు, ఆయన శక్తీ వేర్వేరా?
శ్రీరామకృష్ణులు: పూర్ణజ్ఞానం కలిగిన పిదప అవి అభిన్నాలు. ‘మాణిక్యం, దాని ప్రకాశం మధ్య విభేదం లేదు. మాణిక్యపు ప్రకాశాన్ని తలచినప్పుడు మాణిక్యాన్ని కూడా తలచుకుంటాం. పాలు, దాని తెల్లదనం వేర్వేరు కావు. ఆ విధంగా ఒకదాన్ని తలచినప్పుడు మరోదాన్ని కూడా తలంపవలసి ఉంది. కాని పరిపూర్ణ జ్ఞానం కలుగకుండా ఈ భేదరహితమైన ఎరుక కలుగదు. పరిపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సమాధిస్థితి ఏర్పడుతుంది, ఇరవై నాలుగు తత్త్వాలకు అతీతంగా పోవటం జరుగుతుంది. అందుకే ఆ స్థితిలో ‘నేను’ అనే భావన ఉండదు. సమాధిస్థితిలో ఎలాటి అనుభవం కలుగుతుందో వాక్కులతో చెప్పటం సాధ్యం కాదు. ఒకింత దిగి వచ్చి, చూచాయగా ఏదో చెప్పగలం. సమాధిస్థితి నుండి బాహ్యచైతన్యానికి వస్తూ, నేను ‘ఓం, ఓం’ అని పలుకుతున్నప్పుడు నూరు మూరలు క్రిందికి దిగివచ్చేస్తాను. వేద విహితాలకు అతీతమైనది బ్రహ్మం. దానిని వర్ణింప సాధ్యం కాదు. అక్కడ ‘నేను’, ‘నువ్వు’ ఉండవు.
“ ‘నేను’, ‘నువ్వు’ ఉన్నంత వరకు, ‘నేను ఆరాధిస్తున్నాను, ధ్యానిస్తున్నాను’ అనే భావన ఉన్నంతవరకు భగవంతుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు అనే ఎరుకా ఉంటుంది; భగవంతుడు ఒక వ్యక్తి అనే ఎరుక ఉంటుంది. ‘నువ్వు యజమానివి, నేను దాసుడను; నువ్వు పూర్ణుడవు, నేను అంశను. నువ్వు తల్లివి, నేను బిడ్డను’ అనే భావన ఉంటుంది; ‘నేను వేరు, నువ్వు వేరు’ అన్న భేదభావమూ ఉంటుంది. ఈ భేదభావాన్నీ ఆయనే కల్పిస్తాడు. అందుకే స్త్రీ – పురుషుడు, వెలుగు – చీకటి మొదలైన వాటి బోధ ఉంటుంది. ఈ భేదభావం ఉన్నంత వరకు శక్తిని (సగుణదైవం) ఒప్పుకునే తీరాలి. భగవంతుడే మనలో ‘నేను’ అన్న ఎరుకను ఉంచాడు. వేయిసార్లు విచారణ చేసినప్పటికీ ‘నేను’ అదృశ్యం కాదు. అది ఉన్నంతవరకు భగవంతుడు ఒక వ్యక్తిమాత్రునిగానే దర్శనం ఇస్తాడు.
“ఎంతవరకు ‘నేను’ నెలకొని ఉంటుందో, ఎంతవరకు భేదభావం ఉంటుందో అంతవరకు బ్రహ్మం నిర్గుణమైనదని చెప్పడానికి మనం అర్హులం కాము. అంతవరకు సగుణబ్రహ్మాన్ని అంగీకరించి తీరాలి. ఈ సగుణబ్రహ్మాన్ని వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ కాళీ అనీ, ఆద్యాశక్తి అనీ పేర్కొంటున్నాయి.”
విజయ్: ఈ ఆద్యాశక్తి దర్శనం, బ్రహ్మజ్ఞానం ఏ విధంగా లభిస్తాయి?
శ్రీరామకృష్ణులు: పరితప్త హృదయుడవై భగవంతుణ్ణి ప్రార్థించు, విలపించు. దీనిమూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది. స్వచ్ఛమైన నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూడగలం. అదే విధంగా ‘భక్తుని నేను’ అన్న దర్పణంలో భక్తుడు సగుణబ్రహ్మమైన ఆద్యాశక్తిని దర్శించగలడు. మొదట దర్పణాన్ని బాగా తుడవాలి, మరకలు ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు.
“ ‘నేను’ అనేది ఉన్నంత వరకు, ‘నేను’ అన్న నీటిలోని సూర్యుణ్ణే చూడవలసి వస్తుంది. సూర్యుని దర్శింప వేరే మార్గం ఉండదు. ప్రతిబింబ సూర్యుని తప్ప యథార్థమైన సూర్యుని దర్శించే మార్గం లేనంత వరకు ప్రతిబింబ సూర్యుడే నూటికి నూరుపాళ్ళు నిజం. ఎంతవరకు ‘నేను’ యథార్థమో, అంత వరకు ప్రతిబింబ సూర్యుడూ యథార్థమే; నూటికి నూరుపాళ్ళు యథార్థం. ఈ ప్రతిబింబ సూర్యుడే ఆద్యాశక్తి.
“బ్రహ్మజ్ఞానం పొందగోరితే, ఆ ప్రతిబింబాన్నే పట్టుకుని యథార్థ సూర్యుని కేసి వెళ్ళు. ఆ సగుణ బ్రహ్మాన్ని, అంటే ఎవరు మన ప్రార్థనలను ఆలకిస్తారో ఆయన్నే కోరితే ఆయనే బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎందుకంటె ఎవరు సగుణ బ్రహ్మమో ఆయనే నిర్గుణ బ్రహ్మమూను. ఎవరు శక్తో ఆయనే బ్రహ్మం. పరిపూర్ణ జ్ఞానం సంతరించుకున్నాక భేదభావం ఉండదు.
“జగజ్జనని బ్రహ్మజ్ఞానం కూడా అనుగ్రహిస్తుంది. కాని శుద్ధభక్తుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు.
“మరో మార్గం జ్ఞానయోగం. ఇది ఎంతో కఠినమైన మార్గం. బ్రహ్మసమాజస్థులైన మీరు జ్ఞానులు కారు, మీరు భక్తులు. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జగత్తు స్వప్నం వంటిది, నేను నువ్వు అన్నీ మిథ్య అనే జ్ఞానుల విశ్వాసం.
32.9.3 అన్ని మతాల వారిని ప్రేమించు!
“భగవంతుడు అంతర్యామి. సరళ హృదయంతో, శుద్ధ మనస్సుతో ఆయన్ని ప్రార్థించు. ఆయన సమస్తం విశదపరుస్తాడు. అహంకారం వీడి ఆయనను శరణు పొందితే, సమస్తం పొందగలవు.
ఉండు మనసా నీలో నుండవే
ఏ వేళనైన
చేరవద్దు పరుల పంచ
చేరి నీలో చూచుకొనిన
కోరి వెదకుచున్నవెల్ల
దొరకు నీకు దానియందు……
“బయటి ప్రపంచంలో పలువురితో మెలగుతూ ఉన్నప్పుడు అందరినీ ప్రేమించు. కలసిమెలసిపోయే రీతిలో వారితో మెలగు. ద్వేషభావం పూనకు. ‘అతడు సాకారవాది, నిరాకారాన్ని అంగీకరించడు. ఇతడు నిరాకారి, సాకారాన్ని అంగీకరించడు! అతడు హైందవుడు, ఇతడు మహమ్మదీయుడు, అతడు క్రైస్తవుడు’ అంటూ మొహం త్రిప్పుకుంటూ ఎవరినీ ద్వేషించవద్దు. భగవంతుడు ఎవరికి ఎలా బోధిస్తూ ఉన్నాడో అందుకు తగ్గట్టుగా మానవులు విభిన్న స్వభావులని తెలుసుకో. తెలుసుకుని వీలున్నంత వరకు వారితో కలసిమెలసి ఉండు; వారిని ప్రేమించు. ఆ పిదప నీ అంతరంగంలో ప్రవేశించి శాంత్యానందాలు అనుభవించు. ‘గదిలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమయి ముఖాన్ని గాంచు’ అంతరంగంలో స్వస్వరూపాన్ని చూడగలవు.
“గోపబాలుడు ఆవులను మేపడానికి తోలుకువెళతాడు, ఆవులు పచ్చికబయలును చేరుకోగానే అక్కడ ఉన్న మిగిలిన ఆవులతో కలసిపోతాయి; అవి ఒకే మందకు చెందినవిలా కనిపిస్తాయి. మునిమాపువేళ ఇంటికి తిరిగి వస్తూవున్నప్పుడు మళ్ళీ విడిపోతాయి. నీ అంతరంగాన ‘నీలోనువ్వు’ గా ఉండిపో.”
32.9.4 సన్న్యాసులు సంచయనం కూడదు – భగవత్సేవతో గృహస్థు ధనం సద్వినియోగం
దక్షిణేశ్వర కాళికాలయానికి తిరిగి వెళ్ళటానికి రాత్రి పది గంటల తరువాత శ్రీరామకృష్ణులు బండి ఎక్కారు. ఆయనతో బాటు ఒకరిద్దరు సేవక భక్తులు ఉన్నారు. చిమ్మచీకటిలో ఒక చెట్టు క్రింద బండి నిలబడింది. నివేదించిన పూరీలు, మిఠాయిలు రామ్‌లాల్ కోసం పంపాలనుకున్నాడు వేణీపాల్.
వేణీపాల్: స్వామీ, రాంలాల్ రాలేకపోయాడు. వీరితో ఆతడికి కొంత ప్రసాదం ఇచ్చి పంపుతున్నాను, మీరు అనుమతి ఒసగండి.
శ్రీరామకృష్ణులు (గాభరాపడుతూ): ఓ, వేణీపాల్ బాబు, నువ్వు దయ చేసి వాటిని నాతో పంపవద్దు. నాకు కష్టం వేస్తుంది. దేన్నీ సేకరించి తీసుకు పోవటం నాకు చేతకాదు. నువ్వు మరోలా భావించవద్దు.
వేణీపాల్: అలాగేనండీ, నన్ను ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు: నేడు ఎంతో ఆనందం కలిగింది. ఇలా చూడు! ఎవరు ధనాన్ని బానిసగా చేసుకుని ఉన్నాడో అతడే మనిషి, ధనం యొక్క సద్వినియోగం తెలియనివారు మనుష్యులుగా ఉన్నప్పటికీ మనుష్యులు కారు. అలాంటి వ్యక్తి చూడటానికి మాత్రమే మనిషి, కాని పశులక్షణాలు. నువ్వు ధన్యుడవు, ఎంతో మంది భక్తులకు నేడు ఆనందం కలిగించావు.
32.10 దశమ పరిచ్ఛేదం బడే బజార్ మార్వాడీ భక్తులతో శ్రీరామకృష్ణులు
సోమవారం, అక్టోబర్ 20, 1884
కలకత్తాలోని బడే బజార్ ప్రాంతపు మల్లిక్ వీథిలో 12 వ నెంబరు ఇంట్లో మార్వాడీ భక్తులు అన్నమేరు* ఉత్సవం జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవానికి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. కాళీపూజ ముగిసి రెండు రోజులయింది. నాడు శ్రీరామకృష్ణులు భక్తులతో దక్షిణేశ్వరంలో ఆనందంగా గడిపారు. మరునాడు సింథీ బ్రహ్మసమాజ వేడుకల్లో పాల్గొన్నారు. నేడు బడేబజార్ ప్రాంతస్థులు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు.
మధ్యాహ్నం దాదాపు మూడు గంటలకు ‘మ’, చిన్నగోపాల్‌తో బడేబజార్కు వచ్చాడు. శ్రీరామకృష్ణులు రెండు పంచెలు కొని తెమ్మన్నారు, వాటిని ‘మ’ కొని తెచ్చాడు. వాటిని కాగితంలో చుట్టి ఒక చేతిలో పట్టుకున్నాడు. ఇద్దరూ మల్లిక్ వీథిని చేరుకున్నప్పుడు, అక్కడ ఇసుకవేస్తే రాలనంత జనం – ఎడ్లబళ్లు, గుర్రబ్బళ్ళు అన్నీ క్రిక్కిరిసి నిలబడి ఉన్నాయి. 12 వ నెంబరు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ శ్రీరామకృష్ణులు ఒక బండిలో కూర్చుని ఉండటం, బండి ముందుకు పోలేక ఆగివుండటం చూశారు. బండిలో బాబూరామ్, రామ్ఛటర్జీ ఉన్నారు. గోపాల్‌ను, ‘మ’ ను చూడగానే శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వారు.
శ్రీరామకృష్ణులు బండి నుండి క్రిందికి దిగారు. ఆయనతో బాబూరామ్ కూడా దిగాడు. ‘మ’ దారి చూపుతూ ముందుకు నడిచాడు. మార్వాడీల ఇంటిని చేరుకున్నారు. ఇంటివసారా గుడ్డల బేలులతో నిండి ఉంది. వాటిని ఎడ్లబళ్లలో ఎక్కిస్తున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో కలసి మేడ మీదకు వెళ్ళారు.
మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణులకు స్వాగతం పలికి ఆయన్ను మూడవ అంతస్తులోని గదిలోకి తీసుకొని వెళ్ళారు. ఆ గది గోడకు కాళీ పటం తగిలించి ఉంది. శ్రీరామకృష్ణులు కాళీమాతకు ప్రణమిల్లారు. పిదప నవ్వుతూ కూర్చుని భక్తులతో మాట్లాడసాగారు.
మార్వాడీ భక్తు డొకరు అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణులకు కాళ్ళు ఒత్తబోయినప్పుడు మొదట ఆయన వద్దని వారించారు. తరువాత ఓ క్షణం యోచించి, “సరేలే, కాసేపు ఒత్తు” అన్నారు. ఆయన ప్రతిపలుకులోను కరుణ రసం తొణికిసలాడింది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): స్కూలు సంగతి ఏమిటి?
‘మ’ : నేడు సెలవండీ.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): రేపు మళ్ళీ అధర్ ఇంట్లో దేవీ మహాత్మ్య సంకీర్తనం జరుగనుంది.
32.10.1 పండితునితో శ్రీరామకృష్ణుల సంభాషణ – కోరిక, భక్తి, భావం, ప్రేమ
ఇంటి యజమానియైన మార్వాడీ భక్తుడు ఒక పండితుణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వచ్చాడు. పండితుడు శ్రీరామకృష్ణులకు నమస్కరించి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. భగవదవతారాల గురించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు: అవతారం భక్తుడి కోసమే, జ్ఞాని కోసం కాదు.
పండితుడు: ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం’ – అవతారం యొక్క ముఖ్యోద్దేశం భక్తుని ఆనందింప చేయటం, తరువాత దుష్టులను శిక్షించటం. కాని జ్ఞాని కామనాశూన్యుడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాని నేను కోర్కెలన్నిటినీ విడువలేక పోతున్నాను. నాకు భక్తి మీద కోర్కె ఉంది.
ఆ సమయంలో పండితుని కుమారుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, సమీపంలో కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు: పండిట్జీ! దేన్ని భావమంటారు? దేన్ని భక్తి అంటారు.
పండితుడు: భగవత్ చింతన చేస్తూపోతే మనోవృత్తులు కోమలమై పోతాయి. దీనినే భావం అంటారు. సూర్యుడు ఉదయించగానే మంచు కరగిపోయేట్లు.
శ్రీరామకృష్ణులు: సరే, దేన్ని ప్రేమ అంటారు?
పండితుడు చక్కని హిందీలో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా అతడితో తేట హిందీలోనే మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు ప్రేమను గురించి అడిగిన ప్రశ్నకు పండితుడు ఏదో సమాధానం చెప్పి సరిపెట్టాడు.
శ్రీరామకృష్ణులు (పండితునితో): కాదు, ప్రేమ అంటే అది కాదు. ఈ ప్రపంచాన్ని మరచిపోయేలా, మనకు అత్యంత ప్రియమైన సొంత దేహాన్ని కూడా విస్మరించేలా భగవంతుని మీద కలిగివుండే అనురాగమే ప్రేమ. చైతన్యులకు ఈ ప్రేమే జనించింది.
పండితుడు: అవునండీ. త్రాగుబోతులా ప్రవర్తిస్తాడు.
శ్రీరామకృష్ణులు: మంచిది. కొందరికి భక్తి కలుగుతుంది, కొందరికి కలుగదు. దీని అర్థం ఏమిటి?
పండితుడు: భగవంతునికి పక్షపాతం లేదు. ఆయన కల్పవృక్షం. ఎవరు ఏం కోరుకొంటారో దాన్నే పొందుతారు. కాని కల్పతరువు వద్దకెళ్ళి కోరుకోవాలి సుమా!
పండితుడు ఇదంతా హిందీలో చెప్పాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ కేసి తిరిగి వాటిని అతడికి వంగ భాషలో వివరించి చెప్పారు.
32.10.2 సమాధి తత్త్వం
శ్రీరామకృష్ణులు: మంచిది, సమాధి గురించి కాస్త వివరించండి.
పండితుడు: సమాధి రెండు రకాలు – సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో మనస్సులో ఎటువంటి వికల్పాలు ఉండవు.
శ్రీరామకృష్ణులు: అవును. ‘తదాకారకారిత’ – ధ్యాతాధ్యేయ భేదాలు ఉండవు. ఇంకా రెండు రకాల సమాధులు – చేతన సమాధి, జడసమాధి ఉన్నవి. నారదునికి, శుకదేవునికి కలిగింది చేతన సమాధి. అంతే కదా!
పండితుడు: అవునండీ!
శ్రీరామకృష్ణులు: ఇంకా ఉన్మనా సమాధి, స్థిత సమాధి అని ఉన్నాయి కాదా?
పండితుడు మారుపలుకక మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు: జపతపాలు ఆచరిస్తే గంగాజలాలపై నడిచిపోగల సిద్ధులు లభిస్తాయి కాదా?
పండితుడు: అవును. కాని భక్తుడు వాటిని కాంక్షించడు.
కాసేపు సంభాషించిన పిదప పండితుడు శ్రీరామకృష్ణులతో తాను ఏకాదశినాడు దక్షిణేశ్వరానికి ఆయన్ను దర్శింప వస్తానన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఓ, రావచ్చే! మీ కుమారుడు సజ్జనుడు.
పండితుడు: స్వామీ, ఏం చెప్పను? నదిలో ఒక అల పడుతూ ఉంటుంది, మరొకటి లేస్తూ ఉంటుంది. అంతా అనిత్యం.
శ్రీరామకృష్ణులు: నిజమే. మీలో సారం ఉంది.
కాసేపయ్యాక పండితుడు, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి పూజకు వేళ అయిందని చెప్పి, సెలవు పుచ్చుకోడానికి లేచాడు.
శ్రీరామకృష్ణులు: కూర్చోండి, కూర్చోండి.
పండితుడు మళ్ళీ కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు హఠయోగ ప్రస్తావన తెచ్చారు. పండితుడు హిందీలో మాట్లాడాడు.
శ్రీరామకృష్ణులు: అవును, అదీ ఒక రకంగా తపస్సే. హఠయోగికి దేహాభిమానం ఎక్కువ. అతడి మనస్సు దేహం మీదే నిలిచి ఉంటుంది.
పండితుడు, శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు పండితుని కుమారునితో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: కొంత న్యాయ, వేదాంతాది దర్శన శాస్త్రాలు అధ్యయనం చేస్తే భాగవతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు కదా, ఏమంటావు?
పండితుని కుమారుడు: అవునండీ. సాంఖ్య దర్శనం అధ్యయనం చేయటం ఎంతో ఆవశ్యకం.
ఇలా సంభాషణ సాగుతోంది. శ్రీరామకృష్ణులు దిండు మీద వాలి కూర్చున్నారు. పండితుని కుమారుడు, భక్తులు కొందరు నేల మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు అలా పడుకునే పాడసాగారు.
పాటభావం: సోదరా! భగవంతునిపై మనస్సు లగ్నం చేయి. ఏదో ఒక రోజు తప్పక భగవంతుని పొందుతావు. ఆయన – అంకా బంకాలనే కాక, కసాయి వాడిని కూడా తరింప చేశాడు. వేశ్య కూడా తరించింది. మీరాబాయి తరించింది.
32.11 ఏకాదశ పరిచ్ఛేదం అవతారం ఇప్పుడు లేదా?
ఇంటి యజమాని వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడొక మార్వాడీ. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తిప్రపత్తులు గలవాడు. పండితుని కుమారుడూ అక్కడే ఉన్నాడు.
“ఇక్కడ పాఠశాలల్లో పాణిని వ్యాకరణం బోధిస్తూ ఉన్నారా?” అని శ్రీరామకృష్ణులు అడిగారు.
మార్వాడీ: ఏమిటి, పాణిని వ్యాకరణమా?
శ్రీరామకృష్ణులు: అవును. న్యాయం, వేదాంత శాస్త్రాలు బోధిస్తున్నారా?
మార్వాడీ భక్తుడు ఆ మాటలు పట్టించుకోకుండా శ్రీరామకృష్ణులను, “స్వామీ, మార్గాంతరం ఏమిటి?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: భగవన్నామ గుణకీర్తనలు, సాధు సాంగత్యం, మనోవ్యాకులతతో భగవంతుని ప్రార్థించటం.
మార్వాడీ: స్వామీ! సంసారంపై నా మనస్సులో అనురక్తి తగ్గిపోయేట్లు ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నీలో ఆసక్తి ఎంత ఉంది? ఎనిమిది అణాలే (అంటే, సగమే) కదా? (నవ్వులు)
మార్వాడీ: స్వామీ, అది మీకే ఎరుక. మహాత్ముల కృప లేనిదే ఏదీ జరుగదు.
శ్రీరామకృష్ణులు: భగవంతుని సంతోషపరిస్తే అందరికీ సంతోషం కలుగుతుంది. మహాత్ముల హృదయాల్లో భగవంతుడే విరాజిల్లుతున్నాడు.
మార్వాడీ: ఆయన్ను పొందితే సమస్యే ఉండదు. భగవంతుని పొందిన వ్యక్తి తక్కిన అన్నిటినీ త్యజించి వేస్తాడు. రూపాయ లభిస్తే పైసా పట్ల సంతోషం ఉండదు.
శ్రీరామకృష్ణులు: కొంత సాధనలు చేయటం అవసరం. సాధనలు చేయగా చేయగా క్రమంగా ఆనందం కలుగుతుంది. నేలలో ఎంతో లోతున లంకెబిందెలు పాతిపెట్టబడి ఉన్నాయి. వాటిని పొందగోరిన వ్యక్తి శ్రమపడి భూమిని తవ్వవలసి ఉంటుంది; చెమటలు కారిపోతాయి, అయినప్పటికీ వదలకుండా చాలసేపు తవ్వితే పారకు బిందెలు తగిలి ‘ఠంగ్’ అని శబ్దం వస్తుంది. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఠంగ్ ఠంగ్ అనే శబ్దం అధికంగా వినవచ్చేకొద్దీ ఆనందం అధికరిస్తుంది! రాముని ప్రార్థించండి, ఆయన్ను ధ్యానించండి. మీ కోసం సమస్తం ఆయనే నెరవేరుస్తాడు.
మార్వాడీ: స్వామీ, మీరే శ్రీరామచంద్రులు.
శ్రీరామకృష్ణులు: అదేమిటి అలా అంటున్నావు? అలలు నదికి చెందినవి కాని నది అలలకు చెందుతుందా?
మార్వాడీ: మహాత్ములలోనే రాముడు వసిస్తాడు. రాముని మేం చూడలేం! ఇప్పుడు అవతారం కూడా లేదే?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవతారం లేదని నీ కెలా తెలుసు?
మార్వాడీ భక్తుడు మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు: అవతారపురుషుని ఎల్లరూ గుర్తించలేరు. నారదుడు రాముని దర్శింప వెళ్లినప్పుడు, రాముడు లేచి నారదునికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘మేం సంసారులం. మీ లాంటి సాధుపుంగవులు ఇక్కడకు రాకుండాపోతే మేం పరిశుద్ధుల మవటం ఎలా?’ అని అడిగాడు. పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసానికి వెళ్ళాడు. తాను వనవాసం చేయబోతున్నాననే వార్త వినినప్పటి నుండి అరణ్యంలోని మునులు ఉపవాసం చేస్తూ ఉండటం అతడు అక్కడ చూశాడు. రాముడు సాక్షాత్తూ పరబ్రహ్మమే అని వారిలో అనేకులు గ్రహించలేదు.
మార్వాడీ: మీరే ఆ శ్రీరామచంద్రుడు.
శ్రీరామకృష్ణులు: రామ! రామ! అటువంటి మాట అనవద్దు.
శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతూ మార్వాడికి చేతులు జోడించి నమస్కారం చేశారు. పిదప్ ఇలా అన్నారు: “ఆ రాముడే అందరిలోనూ విరాజిల్లు తున్నాడు. జగత్తులో సర్వత్రా ఆయనే నెలకొని వున్నాడు. నేను నీ దాసుణ్ణి. ఆ రాముడే ఈ సమస్త మానవులు, జీవజంతువులు అయివున్నాడు.”
మార్వాడీ: మహరాజ్! ఆ విషయం మాకు తెలియదు.
శ్రీరామకృష్ణులు: నీకు తెలిసినా సరే, లేకున్నా సరే. నువ్వు ఆ రాముడివే.
మార్వాడీ: మీకు రాగద్వేషాలన్నవి లేవు.
శ్రీరామకృష్ణులు: ఎందుకు? కలకత్తా రావడానికి నేను ఒక బండివాడిని కుదుర్చుకున్నాను; ముందుగానే అతడికి మూడు అణాల రొక్కం కూడా ఇచ్చాను. అయితే అతడు రాలేదు. నాకు అతడి మీద పట్టరాని కోపం వచ్చింది. అతడు దుష్టస్వభావం కలవాడు. నాకు ఎంతో ఇబ్బంది కలిగించాడు.
32.12 ద్వాదశ పరిచ్ఛేదం, అన్నమేరు ఉత్సవంలో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్వాడీ భక్తులు డాబాపైన భజనలు చేస్తూ శ్రీకృష్ణ మహోత్సవాన్ని జరుపు కుంటున్నారు. పూజా నైవేద్యాలకు ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతిమను దర్శించడానికై వారు శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్ళారు. శ్రీకృష్ణుని దర్శించి ఆయన ప్రణమిల్లారు.
ప్రతిమను దర్శించి శ్రీరామకృష్ణులు భావమగ్నులైపోయారు. చేతులు జోడించి ఇలా అన్నారు: “ఓ గోవిందా! హే ప్రాణవల్లభా గోవింద మమజీవన! జయ గోవింద! గోవింద! వాసుదేవ సచ్చిదానంద విగ్రహ! ఓ కృష్ణా, హే కృష్ణా జ్ఞాన కృష్ణా, మనః కృష్ణా, ప్రాణ కృష్ణా, ఆత్మ కృష్ణా, దేహ కృష్ణా, జాతి కృష్ణా, కుల కృష్ణా! ఓ గోవిందా! హే ప్రాణవల్లభా గోవింద మమజీవన!” ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. అలాగే నిలబడి ఉన్నారు. రామ్ఛటర్జీ ఆసరాగా ఆయన్ను పట్టుకుని ఉన్నాడు.
చాలాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహలోకి వచ్చారు. మార్వాడీ భక్తులు శ్రీకృష్ణుని ప్రతిమను గది బయటకు తీసుకు వెళ్ళి నైవేద్యాలు అక్కడే సమర్పించనున్నారు. శ్రీరామకృష్ణులు కూడా ఆ ఉత్సవంలో పాలుపంచుకున్నారు. శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించబడింది. హారతి, సంగీతాల మధ్య శ్రీరామకృష్ణులు కృష్ణుడికి చామరం వీచారు.
తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేశారు. వారందరూ డాబాపైన కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, భక్తులు కూడా ప్రసాదం పుచ్చుకున్నారు.
తరువాత ఆయన బయలుదేరారు. అది సంధ్యాసమయం. దారి అంతా మనుష్యులతోనూ, వాహనాలతోను రద్దీగా ఉంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “రండి, మనం బండి దిగి వెళ్దాం. బండి, చుట్టు తిరిగివస్తుంది.” కాలినడకన వెళుతూండగా దారి ప్రక్కన ఉన్న ఒక చిన్న ఇంటి ముందు కిళ్ళీ దుకాణం ఒకదానిని ఆయన చూశారు. అది ఎంతో ఇరుగ్గా ఒక గుహలా ఉంది. తలవంచకుండా ఆ దుకాణంలోకి ప్రవేశించలేము. అది చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఆ కొద్దిపాటి చోటులో అలా బంధింపబడి ఉండటం ఎంతటి యాతనో చూడండి. ప్రాపంచిక వ్యక్తుల స్వభావం అలాగే ఉంటుంది. అందులోనే వారు ఆనందపడుతుంటారు.”
బండి, చుట్టు తిరిగి వచ్చింది. బాబూరామ్, రామ్ఛటర్జీలతో కలసి శ్రీరామకృష్ణులు బండిలోకి ఎక్కి కూర్చున్నారు. చిన్నగోపాల్ బండి కప్పుపైన కూర్చున్నారు.
భిక్షగత్తె ఒకతె తన ఒడిలో ఒక పసిపాపను పట్టుకుని బండికి ఎదురుగా నిలబడి భిక్ష అడిగింది. శ్రీరామకృష్ణులు ‘మ’ తో “ఏమయ్యా! ఏమైనా పైసలు ఉన్నాయా?” అని అడిగారు. గోపాల్ ఆమెకు పైసలిచ్చాడు.
బండి బడేబజారు గుండా సాగిపోతోంది. అంతటా దీపావళి ఉత్సవ వేడుకలు కానవస్తున్నాయి. అది చీకటి రాత్రే అయినప్పటికీ పరిసరాలన్నీ వేలాది దీపకాంతులతో ప్రకాశిస్తున్నాయి. బండి బడేబజారు వీథి నుండి చిత్పూరు రోడ్డు మీదకు వచ్చింది. ఆ ప్రాంతం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా రంగురంగులతో అలంకరింపబడ్డ దుకాణాలను జనులు అమిత ఆసక్తి, ఉత్సాహాలతో చూస్తున్నారు. కొన్ని చోట్ల మిఠాయి దుకాణాలు ఉన్నాయి, మరికొన్ని చోట్ల అత్తరు దుకాణాలు ఉన్నాయి. దుకాణాల లోపల సుందరమైన చిత్రపటాలు గోడలకు శోభస్కరంగా అమర్చబడి ఉన్నాయి. నూతన వస్త్రాలు ధరించి ఉన్న దుకాణాదారులు, దుకాణంలోకి వస్తున్న సందర్శకుల పైన పన్నీరు చల్లుతున్నారు. బండి ఒక అత్తరు దుకాణం ముందు ఆగింది. చిత్రపటాలు, కాంతి దీపాలను చూసి శ్రీరామకృష్ణులు ఐదేళ్ళ బాలుడివలె సంబరపడిపోతున్నారు. నలువైపులా కోలాహలంగా ఉంది.
32.12.1 “ముందుకు సాగిపో!” – సంచయనంపై శ్రీరామకృష్ణుల అనాసక్తి
శ్రీరామకృష్ణులు ఉచ్చస్వరంలో “ముందుకు పో, ఇంకా ముందుకు పో” అన్నారు. ఇలా అంటూ ఆయన నవ్వుతున్నారు. బిగ్గరగా నవ్వుతూ బాబూరామ్‌తో ఇలా అన్నారు: “అరే, నువ్వేం చేస్తున్నావ్? ముందుకు సాగిపో.” భక్తులు కూడా నవ్వసాగారు. ప్రస్తుత స్థితితోనే సంతృప్తి నొందకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపొమ్మని ఆయన ఉద్బోధిస్తున్నట్లు వారు అర్థం చేసుకున్నారు. కట్టెలు కొట్టేవాడితో బ్రహ్మచారి ‘ఇంకా ముందుకు సాగిపో’ అని అన్నాడు కదా! కట్టెలు కొట్టేవాడు ముందుకు వెళ్ళి చూసేకొద్ది అతడికి క్రమక్రమంగా చందన వృక్షాలు, బంగారు గనులు, వజ్రావైడూర్యాలు కనిపించాయి. అందుకే శ్రీరామకృష్ణులు పదేపదే “ముందుకు సాగిపో, ముందుకు సాగిపో” అంటూంటారు.
బండి సాగిపోతోంది. ‘మ’ రెండు పంచెలు ఖరీదు చేసి ఉండడం శ్రీరామకృష్ణులు గమనించారు. ‘మ’ వద్ద రెండు చలువ చేయని ముతక పంచెలు, మరో రెండు చలువ చేసిన పంచెలు ఉన్నాయి. అయితే శ్రీరామకృష్ణులు ‘మ’ ను చలువచేయని పంచెలు అడిగి ఉన్నారు. ఆయన ‘మ’ తో ఇలా అన్నారు: “నాకు ఆ చలువ చేయని వస్త్రాలనే ఇవ్వు. తక్కినవి నువ్వే ఉంచుకో. సరే, కావాలంటే ఒకటి ఇవ్వు.”
‘మ’ : మరయితే ఒకటి నా వద్దే ఉంచుకోమంటారా?
శ్రీరామకృష్ణులు: రెండూ నువ్వే ఉంచుకో.
‘మ’ : చిత్తమండీ.
శ్రీరామకృష్ణులు: మళ్ళీ నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వాటిని తీసుకురా. నిన్న రాంలాల్ కోసం తీసుకు వెళ్ళమని వేణీలాల్ బండిలో ఆహారం పెట్టబోయాడు. ‘అది నావల్ల కాని పని’ అని నేను అతడితో ఖరాఖండిగా చెప్పివేశాను. సంచయం చేయడం నాకు సాధ్యం కానిపని.
‘మ’ : అలాగేనండీ. ఈ రెండు చలువ చేసిన వస్త్రాలను నేను వెనక్కి తీసుకుపోతాను.
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా): ఇలా చూడు. నా మనసులో ఎలాంటి కోరిక తలెత్తినా అది మీ మంచి కోసమే. మీరందరూ నా వారు. ఏదైనా అవసరం పడినప్పుడు చెబుతానులే.
‘మ’ (వినయపూర్వకంగా): అలాగేనండీ.
బండి ఒక దుకాణం ముందు నుంచి వెళ్తోంది. అక్కడ పొగాకు విక్రయిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు రామ్ఛటర్జీతో “రాం! ఒక పైసా పొగాకు కొని తీసుకురా” అన్నారు.
ఒక భక్తుని గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: “అతడితో ‘రేపు బడే బజారుకు వెళుతున్నాను, నువ్వు అక్కడికి వస్తావా?’ అని అడిగాను. అందుకు అతడు ఏమన్నాడో తెలుసా? ‘అయ్యా! ట్రామ్ బాడుగ ఒక అణా, ఎక్కడ వచ్చేదండి?’ అన్నాడు. అతగాడు నిన్న వేణీపాల్ ఉద్యాన వనానికి వచ్చి ఉన్నాడు, అక్కడ పూజారి పని కూడా చేశాడు. అలా చేయమని ఎవరూ అతనితో చెప్పలేదు. ‘బ్రహ్మ సమాజ భక్తులలో ఒకణ్ణి’ అని జనులందరికీ తెలిసేలా అతడు డాబు ప్రదర్శించాడు. (‘మ’ తో) ఏమయ్యా ‘ట్రామ్‌లో వెళ్ళాలంటే ఒక అణా ఖర్చు అవుతుంది’ అని చెప్పటంలో అతని ఉద్దేశం ఏమిటో నువ్వు చెప్పగలవా?”
ప్రస్తుతం సంభాషణ మార్వాడీ భక్తుల అన్నమేరు ఉత్సవం వైపు మళ్ళింది.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఇక్కడ మీరు ఏదైతే చూశారో బృందావనంలో కూడా అలాగే ఉంటుంది. రాఖాల్ అక్కడ బృందావనంలో చూస్తోంది కూడా అదే. అయితే అక్కడ అన్నమేరు మరింత ఎత్తులో ఉంటుంది. జనులు కూడా అధిక సంఖ్యలో గుమిగూడతాడు. అక్కడ గోవర్ధన పర్వతం కూడా ఉంది – అదొక్కటే తేడా.
32.12.2 హిందూ ధర్మమే సనాతన ధర్మం
“ఆ మార్వాడీ భక్తుల భక్తి ఎలాంటిదో మీరు గమనించారు కదా! అది నిజమైన హైందవ ఆదర్శం. అదే సనాతన ధర్మం. ప్రతిమను తీసుకువెళ్ళేటప్పుడు వారు ఎంతగా మహదానంద పడిపోయారో మీరు చూశారు కదూ! భగవంతుడి సింహాసనాన్ని తమ భుజాల మీదుగా మోసుకుంటూ వెళుతున్నామన్న తలంపుతో వారు సంబరపడిపోయారు.
“హిందూధర్మమే సనాతన ధర్మం. ప్రస్తుత కాలంలో మీరు చూస్తున్న పలురకాల సంప్రదాయాలన్నీ భగవంతుని సంకల్పంతో వచ్చినవి, తిరిగి వెళ్ళిపోతాయి కూడా. అవి నిలువజాలవు. అందుకే నేను ‘ఆధునిక కాలానికి చెందిన భక్తుల పాదాలకు కూడా నమస్కరిస్తున్నాను’ అని చెప్పటం. హిందూ ధర్మం సర్వదా ఉంటూ వచ్చింది, సర్వదా ఉండబోతోంది కూడా.”
‘మ’ ఇంటికి వెళ్ళనున్నాడు. శ్రీరామకృష్ణుల పాదాలకు నమస్కరించి శోభాబజారు వద్ద బండి దిగాడు. ఆనందమయులైన పరమహంస శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయారు.