1. పరమానంద స్వరూపుడూ; వాక్కుకూ, మనస్సుకూ అతీతమైనవాడూ; వేదాంత సిద్ధాంతాలలోని జ్ఞానానికి మాత్రమే గోచరమయ్యేవాడూ; అజ్ఞానాన్ని తొలగించే సద్గురుమా అయిన ‘గోవింద’ నామం కల పరబ్రహ్మానికి నేను నమస్కరిస్తున్నాను.
2. ఈ సృష్టిలోని ప్రాణికోటికి మనుష్యజన్మ లభించడం అరుదు. మనుష్యజన్మ లభించి పురుషశరీరం , బ్రాహ్మణత్వం ప్రాప్తించడం ఇంకా ఎంతో కష్టం. ఇవి లభించినా వేదంలో ప్రతిపాదించబడిన మార్గంలో పయనిస్తూ ధర్మానికే కట్టుబడి జీవించడం దుర్లభం. అటువంటి ధర్మపరాయణత అలవడినా వేదాంతశాస్త్ర జ్ఞానం కలగడం బహుకష్టం. ఆపై వేదాంతశాస్త్రజ్ఞానం కలిగినా నిత్య–అనిత్య వస్తు వివేకం అబ్బడం అతి దుర్లభం. అట్టి వివేకం అబ్బినా ఆత్మానుభవం పొందడం కడు దుర్ఘటం. చివరిగా ఆత్మానుభవం కలిగినా బ్రహ్మైక్యం పొంది, నిరంతరం నిరంతరాయంగా పరమాత్మస్థితుడై సంపూర్ణ జీవన్ముక్త అవస్థలో ఉండడం అత్యంత దుర్లభం. నూరు కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యం పక్వమైనపుడే ఈ రకమైన ముక్తి లభిస్తుంది.
3. మనుష్యజన్మ, మోక్షం కావాలనే కోరిక, మహాపురుషుల ఆశ్రయం అనే ఈ మూడు లభించడం దుర్లభం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి.
4. పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యఫలంగానూ, దైవానుగ్రహం వలననూ లభించిన మనుష్యజన్మలో పురుషశరీరంలో ఉంటూ, వేదవేదాంతాలలో నిష్ణాతుడై తన ముక్తి కోసం ప్రయత్నించక, అనిత్యాలైన ధనపుత్రదారగృహాదుల ఆర్జనలో ఎవరైతే తలమునకలవు తుంటారో అట్టి మూఢులు తమను తామే చంపుకునే ఆత్మఘాతకులు. (Isha Upanishad Verse 3)
5. అత్యంత దుర్లభమైన మనుష్యజన్మ పొంది, వేదాంత శాస్త్ర విచారాదులకు అవసరమైన పురుషత్వం కూడా పొంది, అత్యంతావశ్యక కర్తవ్యమైన మోక్షప్రాప్తిని నిర్లక్ష్యం చేసేవారి కంటే మూఢులు ఎవరుంటారు?
6. మానవుడు వేదాంతశాస్త్రాలను వాఖ్యానాలతో సహా పఠించవచ్చు గాక, యజ్ఞయాగాలు చేసి దేవతలనందరినీ మెప్పించవచ్చు గాక – వీటి వలన ప్రయోజనం శూన్యం. ఆత్మతో మన ఐక్యతను అనుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలను గడిపినా మోక్షప్రాప్తి కలుగదు.
7. వేదాంత వాక్యాల ప్రకారం, సిరిసంపదల వలన మోక్షప్రాప్తి కలుగనే కలుగదు. కాబట్టి సిరిసంపదల కోసం చేసే కర్మలు కూడా మోక్షప్రాప్తికి ఏ మాత్రం సాయపడవు.
8. మోక్షసాధకుడు రస–రూప–గంధ–శబ్దాది బాహ్యవిషయాల ఆకర్షణలను నిగ్రహించి, పరతత్త్వబోధనకు సమర్థుడైన గురువుని శరణువేడి, ఆయన ఉపదేశించిన మహావాక్యాలను శ్రద్ధతో విని, మననం చేస్తూ, బంధవిముక్తి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలి.
9. యోగారూఢుడై (అనగా ఇంద్రియార్థాలకూ, ఇంద్రియకర్మలకూ అతీతుడై) ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనే నిష్ఠ, పట్టుదలలతో జనన మరణ సంసారచక్రం నుండి తనను తానే ఉద్ధరించుకోవలెను.
10. సంసారబంధం నుండి విముక్తి కోరే ముముక్షువు సర్వకర్మలనూ (అనగా ఫలాపేక్షతో చేసే అన్ని పనులనూ) పరిత్యజించి, నిరంతరం భవబంధవిముక్తి కోసం ప్రయత్నించాలి.
11. స్థూలదృష్టితో చూస్తే, ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా అనిపిస్తుంది. శ్రుతులలో చెప్పబడిన కర్మల వలన చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది, కానీ జ్ఞానం వలన మాత్రమే అపరోక్షానుభూతి లభిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే, కర్మలు కూడా విముక్తిని ఇస్తాయి. కాకపోతే అవి నేరుగా కాక చిత్తశుద్ధి ద్వారా జ్ఞానోదయానికి దారితీస్తాయి. జ్ఞానమార్గం నేరుగా బ్రహ్మజ్ఞానప్రాప్తికి చేరుస్తుంది కానీ, ఇది దుష్కరమైనది. కర్మల వలన అనేక బంధాలు ప్రాప్తిస్తాయి. అందువలన దూరదృష్టి గల జ్ఞానులు కర్మలు చేయనక్కరలేని స్థితిని సంపాదిస్తారు.
12. ఒక రజ్జువు (అనగా త్రాడు)ను చూసి పాముగా భ్రమపడ్డ వ్యక్తి భయంతో కంపించిపోతాడు. ఎవరైనా అది పాము కాదనీ, తాడు మాత్రమేననీ తెలియజెప్పిన వెంటనే భయం తొలగిపోతుంది. అదే విధంగా గురూపదేశము వలన జనన మరణ సంసార చక్రము యొక్క స్వభావమును సరియైన విచక్షణతో తెలుసుకొన్నప్పుడు దుఃఖము తొలిగి బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది.
13. గురువు చేసిన హితబోధలవల్ల, సరియైన తత్త్వజ్ఞానవిచారణ వల్ల తప్ప, నదీనదాలలో పుణ్యస్నానాలు ఆచరించడం వలన, దానాల వలన, వందలసార్లు ప్రాణాయామాల్ని చేయడం వలన పరమసత్యం మీద నిశ్చయమైన విశ్వాసం కలుగదు.
14. సాధనసంపత్తి కలవాడు అనగా తీవ్రంగా సాధన చేసేవాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. దేశ కాలాదులు (ఒకే చోట, ఒకే సమయానికి నియమానుసారం చేసే ధ్యానాది సాధనలు) కేవలం సహకారులు మాత్రమే.
15. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలనుకునే జిజ్ఞాసువు; బ్రహ్మవేత్త, దయాసాగరుడు అయిన ఉత్తమ గురువును ఆశ్రయించి, ఆయన ఉపదేశించిన మార్గంలో తత్త్వవిచారణ చేయవలెను.
16. వేదశాస్త్రవాఙ్మయపు అనుకూల, ప్రతికూల భావనలను విచక్షణతో తర్కించగల నిపుణుడు, మేధావి, విద్వాంసుడు అగు సాధకుడు మాత్రమే తత్త్వజ్ఞానపాత్రుడు అనగా తత్త్వజ్ఞానాన్ని పొందే అధికారము గలవాడు.
17. శమదమాది గుణాఢ్యుడు, శాంతచిత్తుడు, నిత్యానిత్య వివేకి, వైరాగ్యసంపన్నుడు అయిన ముముక్షువు మాత్రమే బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకొనుటకు అర్హుడు.
18. బ్రహ్మోపాసనకు నాలుగు సాధనలు చెప్పబడినవి. ఈ సాధనచతుష్టయ సంపన్నుడే బ్రహ్మవిద్యకు అధికారి. అది లేనివానికి బ్రహ్మవిద్య సిద్ధింపదు. ఈ నాలుగు సాధనలు తదుపరి శ్లోకములలో వివరింపబడినవి.
19. సాధనాచతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తువివేకం. రెండవది ఇహపర లోకాలలో ఫలాలు అనుభవించాలనే కోరిక లేకపోవడం. మూడవది షట్సంపత్తి ని పెంపొందించుకోవడం. నాలుగవది ముముక్షుత్వం (మోక్షం కోసం తపన).
20. బ్రహ్మమే సత్యమనీ, కనిపించే జగత్తు మిథ్య అనీ దృఢవిశ్వాసం కలిగివుండడమే నిత్యానిత్య (నిత్య+అనిత్య) వస్తువివేకమని చెప్పబడుతుంది.