17.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో శ్రీరామకృష్ణులు
మంగళవారం, డిసెంబర్ 18, 1883
దక్షిణేశ్వర కాళికాలయం, ఉదయకాలం. శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమంలో ఉన్న వసారాలో కూర్చుని ఉన్నారు. ఆయన సదా సమాధిస్థితిలోనే మునిగి ఉన్నారు. రాఖాలాది యువకులలో ఆధ్యాత్మిక చైతన్యం జనింపచేయటంలో అమిత శ్రద్ధ వహించి ఉన్నారు.
దేవేంద్రనాథ్ టాగూర్ భక్తి వైరాగ్యాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు ఆయనను ప్రశంసించి రాఖాలాది యువకులను చూస్తూ ఇలా అన్నారు: “దేవేంద్రనాథ్ సజ్జనుడు. కాని శుకమహర్షిలా సంసారంలో చిక్కుకోకుండా, బాల్యం నుండే అహర్నిశలు భగవచ్చింతనలో గడిపే కౌమార వైరాగ్య పురుషులు నిజానికి ధన్యులు!
“సంసారులకు ఒకటి కాకుంటే మరొకటి – ఏదో ఒక కోరిక లేక వాసన ఉండనే ఉంటుంది. మరో ప్రక్క భక్తిని కూడా చక్కగా ప్రదర్శిస్తారు. ఒక సందర్భంలో మథుర్బాబు ఒక వ్యాజ్యెంలో చిక్కుకున్నాడు. అప్పుడు ఒక రోజు కాళి కాలయానికి వచ్చి, జగజ్జననికి సమీపంలో నిలబడి, ‘బాబా! ఈ అర్ఘ్యాన్ని జగజ్జననికి సమర్పించు’ అన్నాడు. నేనూ నిస్సంకోచంగా సమర్పించాను అతడికి ఎంత విశ్వాసం! నేను సమర్పిస్తే కార్యం సిద్ధిస్తుందని ఎంతటి దృఢవిశ్వాసం!
“రతి తల్లికి ఎంత భక్తి! అప్పుడప్పుడు వచ్చి ఎంతో సేవ చేసేది. ఆమె వైష్ణవ భక్తురాలు. ఒక రోజు నేను కాళీమాత ప్రసాదం ఆరగించటం చూసింది. ఆ తరువాత ఇక్కడకు రావటమే మానుకుంది. పూర్తిగా ఏకపక్ష పోకడ. అటువంటి వారిని చూడగానే అర్థం చేసుకోలేం.”
శ్రీరామకృష్ణులు తమ గదికి తూర్పు వైపున ఉన్న గది తలుపు వద్ద కూర్చుని ఉన్నారు. శీతకాలం కావటంతో మోలిస్కిన్ శాలువ ఒకటి కప్పుకుని ఉన్నారు.
హఠాత్తుగా సూర్యుణ్ణి చూశారు, అట్లే సమాధిస్థితులైపోయారు. నిమేష రహితులై బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇది గాయత్రీ మంత్ర ప్రభావమా? – ‘తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి.’
చాలాసేపటికి సమాధి స్థితి నుండి బాహ్యచైతన్యంలోకి వచ్చారు. రాఖాల్, హాజ్రా, ‘మ’ ప్రభృతులు ప్రక్కన ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): సమాధి స్థితి కలిగేది పారవశ్య ప్రేమ స్ఫూర్తితోనే. ఒకసారి శ్యాంబజార్లోని నటవర్ గోస్వామి ఇంట్లో సంకీర్తన జరిగింది; అక్కడ శ్రీకృష్ణుణ్ణి, గోపికలను దర్శించి సమాధిస్థితుడనైనాను. నా సూక్ష్మశరీరం శ్రీకృష్ణుని పాదపద్మాల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగా తోచింది.
“జోరాసాంకోలో ఒక హరిసభలో ఇదే విధంగా సంకీర్తన జరుగుతూ ఉంది. అప్పుడూ సమాధి స్థితిని పొంది బాహ్యచైతన్యం కోల్పోయాను. ఆనాడు దేహత్యాగం చేస్తానేమోనని వారు భయపడ్డారు.”
శ్రీరామకృష్ణులు స్నానార్థం వెళ్లారు. స్నానం చేసి వచ్చాక గోపికల ప్రేమ గురించి ప్రస్తావించారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ ప్రభృతులతో): గోపికల ప్రేమలోని ఆకర్షణను మాత్రమే మనం స్వీకరించాలి. ఇటువంటి పాటను పాడండి:
సఖీ నాకు చెప్పవే ఇక నెంత దూరమే
నా వంశీమోహనుడు నర్తించు ఆ వనము॥ స ॥
ఇచ్చోటికి గూడ వచ్చి చేరుచునుండె
ఆ మోహనుని మేను సౌగంధ సౌరభము॥ స ॥
కాని నే పూర్తిగా గాసిల్లి పోయితిని
ఇక సాగదే కాలు ఇక నెంత మాత్రము॥ స ॥
17.2 ద్వితీయ పరిచ్ఛేదం రాఖాల్ నిమిత్తం సిద్ధేశ్వరీ దేవికి మొక్కుబడి – యదుమల్లిక్, భజనపరులు
శ్రీరామకృష్ణులు రాఖాల్ కోసం కొబ్బరిబొండాం, చక్కెర సిద్ధేశ్వరీ దేవికి సమర్పిస్తానని మొక్కుకున్నారు. ‘మ’ తో, “కొబ్బరి బొండాం, చక్కెరకు అయ్యే ఖర్చును నువ్వు భరించు” అన్నారు.
సాయంత్రం ఆయన రాఖాల్, ‘మ’ ప్రభృతులతో కలకత్తాలోని ఠన్ఠన్లో సిద్ధేశ్వరీ ఆలయానికి బండిలో బయలుదేరారు. దారిలో సిమూలియా బజారులో కొబ్బరిబొండాం, చక్కెర కొన్నారు.
ఆలయం చేరుకున్నాక కొబ్బరి బొండాలను కొట్టి దాన్లో చక్కెరను వేసి దేవికి సమర్పించమని చెప్పారు.
శ్రీరామకృష్ణులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అర్చకులు దేవికి సమీపంలో కూర్చుని మిత్రులతో పేకాడుతూ ఉండటం చూశారు. వెంటనే భక్తులతో, “చూశారా? ఇటువంటి చోట్ల పేక ఆడుతున్నారు. ఇక్కడ భగవత్ చింతన చేయాలి!” అన్నారు విచారం వ్యక్తపరుస్తూ.
శ్రీరామకృష్ణులు అక్కడ నుండి యదుమల్లిక్ ఇంటికి వెళ్లారు. యదుమల్లిక్ చుట్టూ పలువురు పెద్దమనుషులు కూర్చుని ఉన్నారు. “దయచేయండి, దయచేయండి” అంటూ యదుమల్లిక్ ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరూ యోగక్షేమాలు విచారించుకున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు ఇంతమంది విదూషకులను, భట్రాజులను నీతో ఉంచుకొన్నావు?
యదుమల్లిక్ (నవ్వుతూ): మీరు ఉద్ధరిస్తారేమోనని. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: సంపన్నులు ధనం వెదజల్లుతారని భట్రాజులు ఆశిస్తూంటారు. కాని ధనికుని వద్ద నుండి ధనం రాబట్టడం అంత సులభం కాదు. నక్క ఒకటి ఒక ఎద్దును చూసింది. విడవకుండా సదా ఆ ఎద్దుతోటే కలిసి తిరుగుతూ ఉండేది. ఎద్దు గడ్డి మేయటానికి వెళితే నక్క కూడా దాని కూడానే వెళ్లేది. ఎందుకో తెలుసా? ఎద్దు వృషణాలు వ్రేలాడుతూ ఉండటం అది చూసింది. ‘ఏదో ఒక రోజు అవి క్రిందపడతాయి. అప్పుడు నేను వాటిని భక్షిస్తాను’ అనుకునేది. ఎద్దు పడుకుని నిద్రిస్తే నక్క కూడా ప్రక్కనే పడుకుని నిద్రించేది. ఎద్దు లేచి అటూ ఇటూ తిరుగుతే నక్క కూడా దానితో కలిసే తిరిగేది. ఈ విధంగా ఎన్నో రోజులు గడిచిపోయాయి. కాని ఎద్దు వృషణాలు మాత్రం క్రింద పడనేలేదు. చివరకు నక్క నిరాశ చెంది అక్కడ నుండి వెళ్లిపోయింది. (అందరూ నవ్వారు) భట్రాజుల పరిస్థితీ ఇటువంటిదే.
యదుమల్లిక్, ఆతడి తల్లి శ్రీరామకృష్ణులకు, భక్తులకు ఉపాహారం సమర్పించారు.
17.3 తృతీయ పరిచ్ఛేదం పంచవటీ బిల్వవృక్షం వద్ద శ్రీరామకృష్ణులు, ‘మ’
బుధవారం, డిసెంబర్ 19, 1883
అప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అయివుంటుంది. బిల్వవృక్షం వద్ద నిలబడి శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడుతున్నారు. ఆ బిల్వవృక్షం క్రిందనే శ్రీరామకృష్ణులు సాధనలు చేశారు. అది నిర్జన ప్రదేశం. దానికి ఉత్తరాన ప్రహారీ గోడ ఉంది, దానికి ఆవల తుపాకీ మందు కార్ఖానా. పశ్చిమాన సరుగుడు తోపు; ఆ చెట్లు గాలికి కదలినప్పుడల్లా ఝంఝమ్మని సవ్వడి వినవస్తోంది. ఆవల గలగలా ప్రవహించే గంగానది. దక్షిణాన పంచవటి. నాలుగు వైపులా చెట్టుచేమలు క్రమ్ముకొని ఆలయమే కానరాకున్నది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): కాని కామినీ కాంచనాలను పరిత్యజించకుంటే యోగం సిద్ధించదు.
‘మ’ : ఎందుకు సిద్ధించదు? వసిష్ఠుడు రాముడితో, ‘సంసారం భగవంతుని నుండి వేరై ఉండే పక్షంలో నువ్వు దాన్ని పరిత్యజించవచ్చు!’ అని చెప్పలేదా?
శ్రీరామకృష్ణులు (చిరుదరహాసంతో): రాముడు రావణుని వధించవలసి ఉన్నది! అందుచేతనే సంసార జీవితం గడిపాడు; వివాహం చేసుకున్నాడు.
‘మ’ అవాక్కై కొయ్యలా నిలబడిపోయాడు. శ్రీరామకృష్ణులు తమ గదికి వెళ్లటానికై పంచవటి కేసి నడిచారు. ‘మ’ కూడా ఆయనతో వెళ్లాడు. అప్పుడు సమయం పది గంటలు అయింది. పంచవటిలో మళ్లీ సంభాషణ కొనసాగింది.
‘మ’ (శ్రీరామకృష్ణులతో): జ్ఞానం, భక్తి రెంటినీ పొందలేమా?
శ్రీరామకృష్ణులు: అత్యున్నత స్థితిలో పొందవచ్చు. చైతన్యుల వంటి ఈశ్వరకోటులకు అది సాధ్యం అవుతుంది. సామాన్య జీవుల విషయం వేరు.
“జ్యోతి దర్శనం అయిదు విధాలైన ప్రకాశంలా కానవస్తుంది – దీపపు వెలుగు, రకరకాల అగ్నుల వెలుగు, చంద్రుని వెలుగు, సూర్యుని వెలుగు, చివరగా సూర్యచంద్రుల కలయిక వెలుగు. భక్తి చంద్రుడు, జ్ఞానం సూర్యుడు.
“కొన్ని సందర్భాలలో ఆకాశంలో సూర్యుడు క్రమంగా అస్తమిస్తూ ఉన్నప్పుడే చంద్రుడు ఉదయించడం కానవస్తుంది. అవతార పురుషులలో భక్తియైన చంద్రుణ్ణి, జ్ఞానమైన సూర్యుణ్ణి ఒకే సమయంలో చూడవచ్చు.
“తలంచిన మాత్రానే వెంటనే ఎల్లరకూ భక్తి, జ్ఞానం రెండూ సిద్ధిస్తాయా ఏమిటి? అందుకు విశేషమైన ఆధారం కావాలి. కొన్ని వెదురు గడలలో డొల్ల భాగం ఎక్కువగా ఉంటుంది, కొన్నిటిలో చాలా తక్కువగా ఉంటుంది. భగవంతుణ్ణి తెలుసుకోవటం ఎల్లరకూ సాధ్యమయ్యే పనేనా? ఒక సేరు పాత్రలో రెండు సేర్ల పాలు ఉంచ సాధ్యమా?”
‘మ’ : ఎందుకు, భగవత్ కృపతో సాధ్యం కానిది ఏముంది? ఆయన కృప ఉంటే సూదిబెజ్జం గుండా ఒంటె కూడా వెళ్లగలదు.
శ్రీరామకృష్ణులు: కాని భగవత్కృప ఊరకే లభిస్తుందా? బిచ్చగాడు ఒక పైసా అడిగితే ఇవ్వవచ్చు, ఏకంగా అతడు రైలు ప్రయాణ రుసుం అడిగితేనో?
‘మ’ మౌనంగా నిలబడిపోయాడు. శ్రీరామకృష్ణులూ మౌనం వహించారు. తరువాత హఠాత్తుగా, “అవును, నిజమే. కొందరికి భగవంతుని కృప లభించినప్పుడు తప్పక సాధ్యపడుతుంది; రెండూ లభిస్తాయి” అన్నారు.
17.3.1 విషయబుద్ధి ఉంటే నిరాకార సాధన సాధ్యపడదు
‘మ’ : మహాశయా! నిరాకార సాధన సాధ్యం కాదా?
శ్రీరామకృష్ణులు: ఎందుకు సాధ్యం కాదు? కాని ఆ మార్గం చాలా కఠినమైనది. బ్రహ్మం ఎటువంటిదో ప్రాచీన ఋషులు కఠోర తపస్సాధనల ద్వారా అనుభూతం చెందారు. వారు ఎంత పాటుపడ్డారో కదా! తమ పర్ణశాల నుండి ప్రాతఃకాలంలో బయలుదేరేవారు. రోజంతా తపస్సులోనే గడిపేవారు. సంధ్యాకాలం తరువాత పర్ణశాలకు తిరిగివచ్చేవారు. తరువాత ఏవో కాసిని ఫలాలు, కందమూలాలు తినేవారు.
“విషయబుద్ధి లేశమాత్రం ఉన్నప్పటికీ ఈ సాధన సాధ్యపడదు. శబ్ద స్పర్శరూపరసగంధాది విషయాల నీడ కూడా మనస్సుపై పడరాదు. అప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. శుద్ధ మానసం ఏదో అదే శుద్ధ ఆత్మ కూడా. మనస్సులో కామినీ కాంచనాలు జాడమాత్రంగానైనా ఉండకూడదు. అప్పుడు మరో స్థితి ఏర్పడుతుంది – ‘అన్నిటికీ భగవంతుడే కర్త, నేను కాదు’ అనే అనుభూతి కలుగుతుంది; సుఖంలో కాని, దుఃఖంలో కాని నేను లేకుంటే ఏదీ జరుగదు అన్న భావం తొలగిపోతుంది.
“ఒక మఠం సాధువుని దుష్టుడు ఒకడు కొట్టాడు. సాధువు స్పృహతప్పి పడిపోయాడు. స్పృహ తెప్పించాక, ‘స్వామీ, ఇప్పుడు మీతో పాలు త్రాగిస్తున్న దెవరు?’ అని అడిగినప్పుడు ఆ సాధువు, ‘ఎవరు కొట్టాడో ఆతడే ఇప్పుడు పాలు త్రాగిస్తున్నాడు’ అన్నాడు.
‘మ’ : అవునండీ. ఆ కథ నాకు తెలుసు.
17.3.2 స్థిత సమాధి – ఉన్మనా సమాధి
శ్రీరామకృష్ణులు: కేవలం తెలిస్తే చాలదు. మనస్సులో చక్కగా పదిలపరచుకోవాలి. విషయ చింతనలు మనస్సును సమాధిస్థితిని పొందనివ్వవు. విషయబుద్ధిని అడుగంటా త్యజించినప్పుడే స్థిత సమాధి కలుగుతుంది. స్థిత సమాధిలో నేను దేహత్యాగం చేయగలను. కాని భక్తిని ఆశ్రయించి భక్తులతో కలిసి జీవించాలనే ఇచ్ఛ కాస్త ఉంది. అందుచేతనే మనస్సు ఒకింత దేహం మీదా నిలచి ఉంది.
“ఉన్మనా సమాధి అని ఒకటి ఉంది. చెల్లాచెదరైన మనస్సును హఠాత్తుగా ఏకాగ్రం చేయటం. ఇది నీకు అర్థం అవుతోందా?”
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: చెల్లాచెదరైన మనస్సును హఠాత్తుగా ఏకాగ్రం చేయటం. ఈ సమాధిస్థితి ఎక్కువసేపు నిలువదు. విషయ చింతనలు ప్రవేశించి సమాధి స్థితికి విఘ్నం కలిగిస్తాయి. యోగులు యోగం నుండి భ్రష్టులవుతారు.
“గోడ కన్నంలో ముంగిసలు వసించటం కామార్పుకూర్లో నేను చూశాను. కన్నంలో ఉన్నప్పుడు అవి సుఖంగా ఉండేవి. కొందరు వాటి తోకలకు ఇటుక రాళ్లు కట్టేవారు. ఇటుకరాయి భారంతో ముంగిస కన్నం నుండి బయటకు వచ్చి పడేది. గోడ కన్నంలో సుఖంగా ఉండటానికై ఎన్నిసార్లు ప్రయత్నిస్తుందో అన్నిసార్లూ ఇటుకరాయి భారంతోక్రిందికి లాగబడి బయటకు వచ్చివేసేది. విషయ చింతనలు కూడా ఇటువంటివే, యోగులను యోగభ్రష్టులను చేస్తాయి.
“విషయలోలురకు కూడా ఎప్పుడైనా సమాధి స్థితి కలుగవచ్చు. సూర్యోదయం కాగానే తామర వికసిస్తుంది. కాని మేఘంచే సూర్యుడు మరుగైనప్పుడు తామరలు ముకుళించుకుపోతాయి. విషయబుద్ధే మేఘం.”
‘మ’ : సాధనలు చేస్తే భక్తి జ్ఞానాలు రెండూ లభించవా?
శ్రీరామకృష్ణులు: భక్తి ద్వారా రెండూ లభిస్తాయి. అవసరమైతే భగవంతుడే బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సాధకుడు అత్యున్నత స్థాయికి చెందినవాడైతే, ఒకే వ్యక్తిలో భక్తిజ్ఞానాలు రెండూ ఉండగలవు.
‘మ’ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి బిల్వవృక్షం క్రిందికి వెళ్లాడు.
మధ్యాహ్నం దాటిపోతూ ఉన్నా ‘మ’ రాలేదు. కాబట్టి అతణ్ణి చూడదలచి శ్రీరామకృష్ణులు బిల్వవృక్షం వైపు నడిచారు. అప్పుడు ‘మ’ శతరంజి, ఆసనం, కమండలం మొదలైన వాటితో ఎదురు వచ్చాడు. శ్రీరామకృష్ణులను చూడగానే సాష్టాంగప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నిన్ను వెదుక్కుంటూనే వస్తున్నాను. ఇంతసేపు అయిపోయింది, ఒకవేళ నువ్వు ప్రహారీ గోడ దూకి పారిపోయావేమో అనుకున్నాను! నీ కళ్లు చూసినప్పటి నుండి ఎక్కడ నుమ్వా నారాయణశాస్త్రిలా పారిపోతావేమో అనుకున్నాను. తరువాత, ‘ఇతడు అలా చెయ్యడు. ఇతడు ఏ పని చేసినా దీర్ఘంగా యోచించి చేసేవాడు’ అని తోచింది.
17.4 చతుర్థ పరిచ్ఛేదం ‘మ’, రాఖాల్, హరీశ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
రాత్రివేళ, శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడుతున్నారు. రాఖాల్, లాటు, హరీశ్ మొదలైనవారూ అక్కడ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): కొందరు శ్రీకృష్ణ లీలలకు తాత్త్విక వ్యాఖ్యానం ఇస్తున్నారు. నువ్వేమంటావు?
‘మ’ : పలురకాల అభిప్రాయాలు ఉన్నాయి, అయితే ఏం? భీష్ముడు అంపశయ్యపై పరుండి దేహత్యాగం చేసే సమయంలో విలపిస్తూ ఉండటానికైన కారణం గురించి మీరు, ‘భీష్ముడు ఎందుకు విలపించాడు? గాయాల బాధ వలన కాదు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే అర్జునుడి రథసారథిగా ఉన్నప్పటికీ, పాండవుల కష్టాలకు అంతు అంటూ లేకపోయిందే! భగవల్లీలను కించిత్తూ అర్థం చేసుకోలేకపోయానని తలచి విలపించాడు’ అని చెప్పేవారు కదా!
“హనుమంతుని గురించీ చెప్పి ఉన్నారు. ‘తిథి వార నక్షత్రాలు ఏవీ ఎరుగను. కేవలం నేను రామచింతన మాత్రం చేస్తాను’ అనేవాడట హనుమంతుడు.
“బ్రహ్మం, శక్తి ఈ రెండూ తప్ప వేరే ఏదీ లేదు’ అనీ చెప్పి ఉన్నారు. బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు ఆ రెండూ ఒక్కటే అన్న బోధ కలుగుతుంది. రెండవదంటూ లేని ఏకైక వస్తువు అది.”
శ్రీరామకృష్ణులు: అవును. నిజమే. గమ్యం చేరటమే ఉద్దేశం; అందుకు ముళ్లతో కూడిన అడవి గుండాను వెళ్లవచ్చు, చక్కని బాట గుండాను వెళ్లవచ్చు.
“పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి, నిజమే. దీని కారణంగా ఒకచోట సాధుసేవ జరుగకుండా పోయిందని నాంగ్టా చెప్పాడు. ఒక చోట విందు భోజనం ఏర్పాటు చేయబడింది. పలు సంప్రదాయాలకు చెందిన సాధువులు వచ్చి ఉన్నారు. అందరూ ‘మా సంప్రదాయ సాధువులకు ముందుగా వడ్డించండి, తరువాతనే తక్కిన వారికి’ అన్నారు. ఏ నిర్ణయానికీ రాలేకపోవటంతో చివరకు అందరూ భోజనం చేయకుండానే వెళ్లిపోయారు. తదనంతరం ఆ ఆహారం వేశ్యలకు ఇచ్చివేయటం జరిగింది.”
‘మ’ : నాంగ్టా మహానుభావుడు.
శ్రీరామకృష్ణులు: ఆయన సాధారణ వ్యక్తే అంటాడు హాజ్రా. ఈ విషయాలు చర్చించటం నిష్ప్రయోజనం. తమ గడియారమే సరైన సమయం చూపుతుంది అనే కదా అందరూ వాదిస్తూ ఉంటారు.
“నారాయణ శాస్త్రికి తీవ్రవైరాగ్యం జనించింది. ఎంత గొప్ప పండితుడు! స్త్రీ త్యాగం చేసి ఎక్కడకో వెళ్లిపోయాడు. మనస్సులో నుండి కామినీకాంచనాలు అడుగంటా త్యజించినప్పుడే యోగం సిద్ధిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు అగుపడతాయి.
“నీకు షడ్చక్రాల గురించి కాస్త చెప్పాలి. యోగులు షడ్చక్రాలను భేదించి భగవంతుని కృపతో ఆయన దర్శనాన్ని పొందుతారు. షడ్చక్రాలను గురించి విని ఉన్నావా?”
‘మ’ : వేదాంతంలో సప్త భూముల గురించి పేర్కోబడి ఉంది.
శ్రీరామకృష్ణులు: వేదాంతంలో కాదు, వేదాలలో. ఈ షడ్చక్రాలు ఎటువంటివో తెలుసా? అవి సూక్ష్మశరీరంలో ఉన్న పద్మాలు. యోగులు వీటిని దర్శించగలరు. అవి మైనపు చెట్ల ఫలాలు, ఆకులవలె ఉంటాయి.
‘మ’ : అవునండీ. యోగులు వాటిని దర్శించగలరు. ఒక రకమైన అద్దం గురించి నేను చదివాను. దాని గుండా చూస్తే అతి చిన్నవస్తువులు కూడా చాలా పెద్దవిగా కనబడతాయని నేనొక పుస్తకంలో చదివాను. అదే విధంగా యోగం ద్వారా ఈ సూక్ష్మపద్మాలను కాంచవచ్చును.”
17.4.1 ఒంటరిగా ‘మ’ గానం – శ్రీరామకృష్ణుల అశ్రుధారలు
శ్రీరామకృష్ణులు పంచవటి ప్రక్కనున్న గదిలో ‘మ’ ను బస చేయమన్నారు. ఆయన చెప్పినట్లు ‘మ’ ఆ గదిలోనే ఆ రాత్రి బసచేశాడు. వేకువజామున ఒంటరిగా గానం చేయసాగాడు:
నా సాధన నా ప్రార్థన
యే అధమ ఫల మీయక
బాధాకర శోధన
గా నిలచెను ఓ దేవా!
నీచాతినీచుడను
నీ పావన స్పర్శచేత
పూతాత్ముని గావింపగ
ప్రార్థింతు నిను ఓ దేవా!
ఈ రోజు ఆ రోజు మరు
రోజని రోజు రోజు
నీ పాదముల కాంక్షించుచు
గడిపితి కాలము దేవా!
నీ పాదము గనలేదు
నీ దర్శన మవలేదు
అకటకటా నిను గానక
నే పోతిని ఓ దేవా!
హఠాత్తుగా ‘మ’ కిటికీ గుండా తొంగి చూసేసరికి శ్రీరామకృష్ణులు అక్కడ నిలబడి ఉండటం చూశాడు.
“నీచాతి నీచుడను
నీ పావన స్పర్శచేత
పూతాత్ముని గావింప
ప్రార్థింతు నిను ఓ దేవా!”
అంటూ ‘మ’ పాడటం వినగానే శ్రీరామకృష్ణుల కళ్ల వెంట అశ్రుధారలు స్రవించాయి. ‘మ’ మళ్లీ పాడాడు:
యోగి వేషమున ఏగుచుండెదను
దేశదేశములు దేవు వెదకుచు॥ యో ॥
కావి వస్త్రముల గట్టి మేనునకు
శంఖుపూసలను చెవుల ధరించుచు॥ యో ॥
క్రూరుడైన నా హరిని జూచెడు
వరకు విడువక తిరుగుచుండెదను॥ యో ॥
శ్రీరామకృష్ణుల వెంట రాఖాల్ వెళుతున్నాడు.
శుక్రవారం, డిసెంబర్ 21, 1883
ప్రాతఃకాలం. శ్రీరామకృష్ణులు ఏకాంతంగా బిల్వవృక్షం క్రింద ‘మ’ తో మాట్లాడుతూ ఉన్నారు. సాధనలకు సంబంధించిన పలు గోప్యమైన విషయాలు, కామినీకాంచన పరిత్యాగం, ఒక్కోసారి మనస్సే గురువు అవుతుందనే విషయం – ఇత్యాదులు వారి మాటల్లో చోటుచేసుకున్నాయి.
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు మనోహరమైన పీతాంబరం ధరించి పంచవటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు ముగ్గురు వైష్ణవ సన్న్యాసులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకడు బావుల్ శాఖకు చెందినవాడు.
మధ్యాహ్నం నానక్ సంప్రదాయానికి చెందిన సాధువు ఒకరు వచ్చారు. హరీశ్, రాఖాల్ మొదలైనవారు అక్కడ ఉన్నారు. ఆ సాధువు నిరాకారవాది; సాకార చింతన కూడా చేయమని శ్రీరామకృష్ణులు ఆ సాధువుకు బోధించారు.
“లోతుగా మునుగు. పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. భగవంతుడు నిరాకారుడూ, సాకారుడూ కూడా. సాకార చింతన చేస్తే సత్వరం భక్తి జనిస్తుంది. తరువాత నిరాకార చింతన కూడా చేయవచ్చు. లేఖను చదివి పూర్తిచేశాక దాన్ని దూరంగా పారేయవచ్చు కదా! ఆ తరువాత ఆ లేఖలోని సూచనల మేరకు పనిలో దిగవచ్చు.”
17.5 పంచమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో బలరామ్ తండ్రి ప్రభృతులతో
శనివారం, డిసెంబర్ 22, 1883
దక్షిణేశ్వర కాళికాలయం. అప్పుడు సమయం ఉదయం దాదాపు తొమ్మిది గంటలు అయివుంటుంది. శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయ వైపున ఉన్న వసారాలో భక్తులతో కూర్చుని ఉన్నారు. బలరాం తండ్రి వచ్చి ఉన్నాడు. రాఖాల్, హరీశ్, ‘మ’, లాటు ప్రభృతులు దక్షిణేశ్వరంలోనే బసచేసి ఉన్నారు. శ్యాంపుకూర్‌కు చెందిన దేవేంద్రఘోష్ కూడా వచ్చి ఉన్నాడు.
ఒక భక్తుడు: భక్తి ఎలా కుదురుతుంది?
శ్రీరామకృష్ణులు (బలరామ్ తండ్రి, ప్రభృతులతో): ముందుకు సాగిపోండి. ఏడు ద్వారాలకు ఆవల రాజు ఉన్నాడు. ఆ ద్వారాలన్నిటిని దాటినప్పుడే రాజును దర్శించవచ్చు.
“చానక్లో ఉన్న అన్నపూర్ణ ఆలయ ప్రతిష్ఠ సందర్భంలో (1874 – 75) నేను ద్వారికాబాబుతో ఇలా అన్నాను: ‘పెద్ద చెరువులలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఎర వెయ్యి. ఆ వాసన వలన ఆ చేపలు ఉపరితలానికి వస్తాయి. కొన్ని సందర్భాలలో అలలు కొట్టే రీతిలో అవి పెద్దగా శబ్దం చేస్తూ, దూకుతూ వస్తాయి. ప్రేమ భక్తి అనేది ఎర.’
17.5.1 శ్రీరామకృష్ణులు – అవతార తత్త్వం
“భగవంతుడు మానవరూపంలో లీలను ప్రదర్శిస్తాడు. కృష్ణుడు, రాముడు, చైతన్యుల వలె ఆయన మానవరూపంలో అవతరిస్తాడు.
“ఒకసారి కేశవ్‌తో ఇలా చెప్పాను: ‘భగవంతుడు మనిషిలో అధికంగా ప్రకాశిస్తున్నాడు. పొలం గట్ల వెంట చిన్న కలుగులు ఉంటాయి. వర్షాకాలంలో ఈ కలుగులలో చేపలు, పీతలు మొదలైనవి చేరుకొంటాయి. పీతలు, చేపలు కావాలంటే ఈ కలుగులలో వెదకవలసి ఉంటుంది. అదే విధంగా భగవంతుణ్ణి వెదకాలంటే, అవతార పురుషులలో వెదకాలి.’
“మూడున్నర మూరల మనిషి ద్వారా జగజ్జనని తన్ను తాను అభివ్యక్తం చేసుకుంటోంది. ఒక పాటలో ఇలా ఉంది:
ఏమిటే ఈ కీలుబొమ్మ! ఓ యమ్మ
ఎటువంటి దానిని ఏర్పరచినావు
ఏడు జానల బొమ్మ! ఎగిరెగిరిపడు బొమ్మ
బొమ్మతో ఆటలు నీ వెన్ని ఆడెదవు…
“కాని భగవంతుణ్ణి తెలుసుకోగోరితే, అవతార పురుషులను గుర్తింపదలిస్తే సాధన అవసరం. చెరువులో పెద్దపెద్ద చేపలు ఉంటాయి, వాటిని చూడాలంటే ఎరను వేయవలసి ఉంటుంది. పాలలో వెన్న ఉంది, దాన్ని తీయాలంటే చిలకాలి. ఆవాలలో నూనె ఉంది, నూనె కావాలంటె గానుగ ఆడించాలి. గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి ఎర్రబడుతుంది, అందుకై గోరింటాకు నూరాలి.”
17.5.2 నిరాకార సాధన – శ్రీరామకృష్ణులు
భక్తుడు: భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా?
శ్రీరామకృష్ణులు: ఆగు, ఆగు. మొదట కలకత్తాకు వెళ్లు. అప్పుడే గఢ్ మైదానం ఎక్కడ ఉందో, ఏసియాటిక్ సొసైటీ ఎక్కడ ఉందో, బెంగాల్ బ్యాంక్ ఎక్కడ ఉందో తెలియవస్తుంది. ఖర్దాలోని బ్రాహ్మణ ప్రాంతానికి వెళ్లాలనుకుంటే మొదట ఖర్దాకు వెళ్లవలసి ఉంటుంది.
“నిరాకార సాధన ఎందుకు సాధ్యం కాదు? కాని అది ఎంతో కఠినం. కామినీ కాంచనాలు త్యజించకుండా వీలుపడదు. బాహ్యత్యాగం, ఆంతరిక త్యాగం – రెండూ ఉండాలి. విషయబుద్ధి కించిత్తు ఉన్నా ఈ మార్గం వీలుపడదు.
“సాకార సాధన సులభం; అలా అని అంత సులభమనీ చెప్పలేం. నిరాకార సాధన, జ్ఞానయోగ సాధన గురించి భక్తులకు చెప్పకూడదు. ఎంతో శ్రమకోర్చాక అతడికి ఏదో కాస్త భక్తి కలుగుతుంది; సకలం స్వప్నతుల్యమే అని చెప్పటం ఆతడి భక్తికి హాని వాటిల్లజేస్తుంది.
“కబీర్ నిరాకారవాది; అతడు శివుడు, కాళీ, కృష్ణుడు – వీరిని అంగీకరించేవాడు కాదు. ‘బియ్యం, అరటిపళ్లు తింటుంది కాళి; మరి కృష్ణుడో, గోపికల చప్పట్లకు కోతి గెంతులు వేస్తాడు’ అంటాడతడు. (అందరూ నవ్వారు)
“నిరాకార సాధకుడు ప్రారంభంలో బహుశా దశభుజమూర్తిని దర్శిస్తాడు, తరువాత చతుర్భుజమూర్తి దర్శనం, ఆ తరువాత రెండు చేతులున్న గోపాలుడి దర్శనం, చివరగా అఖండ జ్యోతిని దర్శించి దాన్లోనే లీనమైపోతాడు.
“దత్తాత్రేయుడు, జడభరతుడు బ్రహ్మదర్శనానంతరం (లీలా స్థాయికి) తిరిగి రాలేదని వ్రాయబడి ఉంది. శుకదేవుడు బ్రహ్మసాగరపు బిందువు నొకదాన్ని మాత్రమే ఆస్వాదించాడు; సాగర అలలను, హోరును చూశాడు, విన్నాడు; కాని సాగరంలో మునక వేయలేదని కొందరు అంటారు.
“ ‘కేదార్ ఆవలకు వెళితే శరీరం నిలువదు’ అని ఒక బ్రహ్మచారి చెప్పాడు. అదే విధంగా బ్రహ్మజ్ఞానానంతరం శరీరం నిలవదు; ఇరవై ఒక్క రోజులలో మరణం సంభవిస్తుంది.
“ఒక పెద్ద గోడ ఉంది. దానికి ఆవల పెద్ద మైదానం ఉంది. నలుగురు మిత్రులు గోడకు ఆవల ఏముందో తెలుసుకో యత్నించారు. ఒక్కొక్కరుగా గోడను ఎక్కసాగారు; ఆ మైదానాన్ని దర్శించి ‘హా! హా!’ అంటూ నవ్వుతూ ఆవలి వైపుకు దూకేశారు. ఆవలి వైపు ఏముందో ముగ్గురు ఏమీ చెప్పలేదు. ఒక్కడు మాత్రం సమాచారం చెప్పాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన పిదప కూడా, లోకులకు బోధించే నిమిత్తం ఆతడి దేహం నిలిచి ఉంది. అవతార పురుషులు ఈ కోవకు చెందుతారు.
“హిమవంతుని ఇంట పార్వతి కుమార్తెగా జన్మించింది. తండ్రికి తన పలు రూపాలను ఆమె చూపింది. తండ్రి కుమార్తెతో, ‘అమ్మా! నీ సమస్త రూపాలను దర్శించాను. కాని నీ బ్రహ్మస్వరూపం ఒక్కటి మిగిలిపోయింది. దాన్ని కూడా ఒక్కమారు దర్శింపచేయి’ అన్నాడు. అందుకు పార్వతి, ‘తండ్రీ! నువ్వు బ్రహ్మజ్ఞానం పొందగోరితే సంసారం త్యజించి సాధుసాంగత్యం చేయవలసి ఉంటుంది’ అన్నది. కాని హిమవంతుడు వదలిపెట్టలేదు. అప్పుడు పార్వతి ఒకమారు బ్రహ్మస్వరూపాన్ని చూపింది. చూడగానే హిమవంతుడు ఒక్కసారిగా మూర్ఛిల్లిపోయాడు.
17.5.3 శ్రీరామకృష్ణులు – భక్తియోగం
“నేను ఇప్పుడు చెప్పినవన్నీ విచారణకు సంబంధించిన విషయాలు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సర్వమూ స్వప్నం లాంటిది – ఇదే విచారణ! ఇది అతి కఠినమైన మార్గం. ఈ మార్గంలో, భగవల్లీల స్వప్నంలా మిథ్య అయిపోతుంది. ‘నేను’ అనే భావన కూడా ఎగిరిపోతుంది. ఈ మార్గగాములు అవతారవాదాన్ని అంగీకరించరు. ఇది ఎంతో కఠినమైన మార్గం. విచారణకు సంబంధించిన ఇటువంటి మాటలు భక్తులు ఎక్కువగా వినరాదు.
“అందుచేతనే భగవంతుడు అవతరించి భక్తిని గురించి ఉపదేశిస్తాడు; శరణాగతి పొందమంటాడు. భక్తి ఉన్నట్లయితే, భగవత్కృపతో సకలం సిద్ధిస్తుంది; జ్ఞానం, విజ్ఞానం అన్నీ లభిస్తాయి. ఆయన లీలను ప్రదర్శిస్తున్నాడు; ఆయన భక్తపరాధీనుడు. ‘అమ్మా శ్యామ, నువ్వు భక్తుని ప్రేమ రజ్జువుతో బంధింపబడి ఉన్నావు!’
“కొన్ని సమయాల్లో భగవంతుడు అయస్కాంతమవుతాడు, భక్తుడు సూది అవుతాడు. మరికొన్ని సమయాల్లో భక్తుడు అయస్కాంతం అవుతాడు, భగవంతుడు సూదిగా మారిపోతాడు. భక్తుడు భగవంతుణ్ణి ఆకర్షించివేస్తాడు. భగవంతుడు భక్తవత్సలుడు, భక్తపరాధీనుడు.
“ఒక సంప్రదాయానుసారం యశోదాది గోపికలు పూర్వజన్మలో నిరాకారవాదులుగా ఉండేవారు. దాన్లో వారికి తృప్తి కలుగలేదు. అందుచేతనే బృందావనంలో శ్రీకృష్ణుని సాంగత్యంలో ఆటపాటలతో పరమానందం పొందారు. ఒక రోజు కృష్ణుడు వారితో, ‘మీకు నిత్యధామాన్ని చూపిస్తాను. రండి, యమునలో స్నానం చేద్దాం’ అన్నాడు. యమునలో మునక వేయగానే వారికి గోలోక దర్శనం కలిగింది; తరువాత అఖండ జ్యోతిని దర్శించారు. అప్పుడు యశోద ఇలా అన్నది: ‘ఓ కృష్ణా! ఇకమీదట వీటిని ఏవీ నేను చూడగోరను. ఇప్పుడు ఆ నీ మానవరూపాన్నే చూడగోరతాను. నిన్ను ఒడిలోకి తీసుకోవాలి, గోరుముద్దలు తినిపించాలి.’
“ఈ రీతిలో భగవంతుడు అవతార పురుషులలో అధికంగా వ్యక్తం అవుతాడు. అందుచేతనే అవతార పురుషులు దేహధారణ చేసి ఉన్నప్పుడే భక్తులు వారిని పూజించి సేవించాలి. ‘అరే తమ్ముడూ, ఆ ఇంట్లో ఒక గది ఉన్నది. తెల్లవారగానే ఆయన అందులో దాక్కొంటాడు.’
“అవతార పురుషులను ఎల్లరూ గుర్తించలేరు. దేహం ధరిస్తే రోగశోకాలు, ఆకలి దప్పులు అన్నీ ఉంటాయి. వారూ మనలాంటి వారేనని అనిపిస్తుంది. సీతావియోగం భరించలేక రాముడు విలపించాడు – ‘పంచభూతాల బంధనంలో చిక్కువడి బ్రహ్మం కూడా విలపిస్తోంది.’
“పురాణాలలో ఒక కథ ఉంది. వరాహావతారంలో మహావిష్ణువు హిరణ్యాక్షుని వధించాడు. తరువాత తన పిల్లా పాపలకు పాలు పట్టడంలోనూ, వాటిని పోషించటంలోనూ కాలం గడపసాగాడు. (అందరూ నవ్వారు) వైకుంఠానికి వెళ్లాలన్న ఆలోచనే రాలేదు. చివరకు శివుడు వచ్చి తన త్రిశూలంతో ఆ వరాహకాయాన్ని చీల్చి, చంపివేశాడు. అప్పుడు విష్ణువు ‘హి హి’ అంటూ నవ్వుతూ తన ధామానికి వెళ్లిపోయాడు.”
17.6 షష్ఠ పరిచ్ఛేదం భవనాథ్, రాఖాల్, ‘మ’, లాటు ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
మధ్యాహ్న సమయం. శ్రీరామకృష్ణుల గదిలో రాఖాల్, ‘మ’, హరీశ్, ప్రభృతులు ఉన్నారు. భవనాథ్ వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (భవనాథ్తో): అవతార పురుషుల పట్ల ప్రేమ కలిగితేనే చాలు. ఆహా! గోపికలకు ఎటువంటి ప్రేమ ఉండేది.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు గోపికా భావంలో పాడారు:
- ఓ కృష్ణా! నా ప్రాణానికి ప్రాణం నీవు.
- ఓ సఖీ, నేను ఇంటికి పోవటం లేదు. అక్కడ కృష్ణనామం జపించడం కష్టమైపోతోంది.
- ఓ సఖీ, ఆనాడు నువ్వు వనానికి వెళ్తున్నప్పుడు నేను మా ఇంటి తలుపు వద్ద నిలబడి ఉన్నాను.
సంభాషణ కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “రాసక్రీడలో శ్రీకృష్ణుడు అంతర్ధానమైనప్పుడు గోపికలు పిచ్చివాళ్లే అయిపోయారు. వృక్షాన్ని చూసి, ‘నువ్వు ఒక తపస్వివే అయివుంటావు. నువ్వు తప్పక కృష్ణుని చూసి ఉంటావు! లేకుంటే ఇలా నిశ్చలంగా సమాధి స్థితిలో ఉండటం నీకెలా సాధ్యం?’ అన్నారు. పచ్చికబయలును చూసి, ‘ఓ పృథ్వీ! నువ్వు ఖచ్చితంగా కృష్ణుని దర్శించి ఉంటావు. అలాకాకుంటే ఇలా రోమాంచితవై ఉండటానికి హేతువు ఏమిటి? నిశ్చయంగా నువ్వు ఆతడి స్పర్శ పొంది ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు’ అన్నారు. మాధవీలతను గాంచి, ‘ఓ మాధవీ! మా మాధవుణ్ణి తిరిగి ఇచ్చివేయి’ అని ప్రార్థించారు. గోపికలు ప్రేమోన్మాదంలో మునిగి ఉండేవారు! అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణ బలరాములను తోడ్కొని మథురకు వెళ్లటానికై రథం ఎక్కాడు. గోపికలు రథ చక్రాలను పట్టుకుని, దాన్ని కదలనివ్వలేదు.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
వదలండి వదలండి ఓ వెర్రులార
రథ చక్రముల నేల లాగిపట్టెదరు
చలియింప చేయునవి చక్రంబులా – దాని
ఎవ్వాని తలపుచే ఎల్ల భువనములు
కదలుచున్నవి వాని గతి తప్పకుండ
ఆ కృష్ణుడే వాని నడిపించువాడు.
శ్రీరామకృష్ణులు: చలియింప చేయునవి చక్రంబులా? – ఆహా ఈ పలుకులు నా మనస్సును ఆకట్టుకుంటున్నాయి. ఎవని తలపుచే ఎల్ల భువనములు కదలుచున్నవో వాని గతి తప్పకుండ రథికుని ఆజ్ఞ మేరకు సారథి రథం నడుపుతాడు.
17.7 సప్తమ పరిచ్ఛేదం బ్రహ్మమే జీవజగత్తులుగా శ్రీరామకృష్ణుల దర్శనం – శ్రీరామకృష్ణుల పరమహంస స్థితి
ఆదివారం, డిసెంబర్ 23, 1883
ఉదయం తొమ్మిది గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదికి నైఋతి దిశలో ఉన్న మొగశాలలో రాఖాల్, లాటు, ‘మ’, హరీశ్ తదితర భక్తులతో కూర్చుని ఉన్నారు. ‘మ’ దక్షిణేశ్వరంలో బస చేసిన పదవ రోజు అది. ఉదయం కొన్నగర్ నుండి మనోమోహన్ వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణులను దర్శించి, కాసేపు విశ్రమించి, తరువాత కలకత్తాకు వెళ్లాలనుకున్నాడు. హాజ్రా కూడా శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని ఉన్నాడు. నీలకంఠుడి పాటలను కొన్ని ఒక వైష్ణవుడు శ్రీరామకృష్ణులకు పాడి వినిపించాడు.
వాటిలో మానసపూజకు సంబంధించిన పాట నొకదానిని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు హాజ్రాతో ఇలా అన్నారు: “ఈ పాట నాకు నచ్చనే లేదు.”
హాజ్రా: ఇది సాధకుని పాట కాదు. జ్ఞానదీపం! జ్ఞానరూపం!
17.7.1 తోతాపురి, పద్మలోచన్ విలపించిన సంఘటనలు
శ్రీరామకృష్ణులు: నాకు ఏమేమో అనిపిస్తోంది. పాత పాటలే సరియైనవి. పంచవటిలో నాంగ్టా వద్ద పలుపాటలు పాడేవాణ్ణి –
‘జీవుడా! యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము,
యోధుడి వేషంలో యముడు నీ ఇంట ప్రవేశించాడు’
‘ఎవరిని తప్పెంచగలను
నేనె త్రవ్విన నూతి లోపల మునుగంగ’
“నాంగ్టా ఎంత గొప్ప జ్ఞాని! పాటల భావం అర్థం చేసుకోలేకున్నప్పటికీ విలపించేవాడు. ఇటువంటి పాటలలోని విషయం ఎంత గొప్పగా ఉన్నది! ‘ఓ జీవుడా, నువ్వు లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించు. అప్పుడు నువ్వు అత్యంత భయంకరుడైన యమధర్మరాజు నుండి కూడా భీతిరహితుడవై పోగలవు.’
“పద్మలోచన్ ఎంత గొప్ప పండితుడు! రామప్రసాద్ పాటలు నేను పాడగా విని విలపించాడు.”
17.7.2 బ్రహ్మమే జీవజగత్తులు – శ్రీరామకృష్ణుల దర్శనం
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. నహబత్ నుంచి వినవచ్చే సన్నాయి నాదం వింటూ శ్రీరామకృష్ణులు ఆనందపరవశులైనారు. ఆ తరువాత, బ్రహ్మమే జీవజగత్తులుగా విరాజిల్లుతూ ఉండటం గురించి ‘మ’ కు బోధించసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఒక ఫలానా చోటును సూచించి అక్కడ ఎవరూ భగవన్నామ స్మరణ చేయటం లేదని నాతో ఒకరు చెప్పారు. ఇది అతడు చెప్పగానే భగవంతుడొక్కడే సమస్త జీవజగత్తులుగా విరాజిల్లుతున్నట్లు దర్శించాను. నీళ్లలో అసంఖ్యాక బుడగలలాగా, నీటిలో కానవచ్చే ప్రతిబింబాలలాగా గాంచాను! పైగా అసంఖ్యాక గుళికలుగా ఉండినట్లూ చూశాను.
“ఒకసారి నేను కామార్పుకూర్ నుండి బర్డ్వాన్కు పోతూ ఉన్నాను. దారిలో ఒక మైదానం ప్రక్కన ఒక విశాలమైన పచ్చికబయలు కంటబడింది. దాన్లో జీవజాలం ఆహారం ఎలా తింటుందో, ఎలా జీవిస్తూ ఉందో చూడగోరాను. ఒకే పరుగున వెళ్లాను. అక్కడ చీమలు బారులు బారులుగా ప్రాకుతున్నాయి. అన్ని చోట్లూ చైతన్యమయంగా గాంచాను.”
హాజ్రా వచ్చి నేల మీద కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు: పొరలుగా అమరిన రేకులు గల పలురకాల పువ్వుల వలె గాంచాను. చిన్నా పెద్ద నీటి బుడగల్లాగాను చూశాను.
ఈ రీతిలో దైవీ దర్శనాల గురించి వివరిస్తూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. ఆ స్థితిలో, ‘నేను అయ్యాను! నేను వచ్చాను’ అని అన్నారు. ఇలా అంటూ సమాధిస్థితిలో మునిగిపోయారు. ఆయన దేహం నిశ్చలమైపోయింది. చాలాసేపు ఆ స్థితిలో ఉన్న తరువాత బాహ్యచైతన్యం కలిగింది.
17.7.3 మఱ్ఱిచెట్టు క్రింద పరమహంస దర్శనం – వాసనా క్షయంతోనే పరమహంస స్థితి
శ్రీరామకృష్ణులు బాలునివలె నవ్వుతూ గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. ఒక అద్భుత దృశ్యం చూశాక కళ్లలో ఆనందజ్యోతి నెలకొని ఉన్నట్లు ఆయన కన్నులలో దివ్యప్రకాశం విరాజిల్లుతోంది. నగుమోముతో అలరారుతున్న వదనం!
పచార్లు చేస్తూనే శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు:
“మర్రిచెట్టు క్రింద ఒక పరమహంసను చూశాను. ఆయన ఇలాగే నవ్వుతూ పచార్లు చేస్తూ ఉన్నాడు. నాకు కూడా అదే స్థితి కలిగిందా?”
కాసేపు పచార్లు చేశాక శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని జగజ్జననితో మాట్లాడసాగారు:
“ఆగు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. అమ్మా, నీ పాదపద్మాల పట్ల నాకు శుద్ధభక్తి మాత్రం ఉండనివ్వు. (‘మ’ తో) క్షోభ, వాసనలు నశించిన పిదపే ఈ స్థితి కలుగుతుంది.
(జగజ్జననితో) “అమ్మా! పూజలు తొలగించావు. అన్ని కోర్కెలూ తొలగిపోకుండా చూడు. అమ్మా! పరమహంస బాలుడి వంటివాడు కదా! బాలుడికి తల్లి అక్కర్లేదా ఏమిటి? అందుకే నువ్వు తల్లివి, నేను నీ బిడ్డను. తల్లి లేకుండా బిడ్డ ఎలా జీవించగలడు?”
మృదుమధురంగా, పాషాణాలను కూడా కరిగించేటట్లు శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతున్నారు: “అమ్మా! కేవలం అద్వైత జ్ఞానమా? యాక్, థూ! ఈ ‘నేను’ ఉన్నంత కాలం ‘నువ్వు’ ఉన్నావు. పరమహంస ఒక బిడ్డ వంటివాడు. బిడ్డకు తల్లి అక్కర్లేదా ఏమిటి?”
దేవతలకు సైతం దుర్లభమైన ఆ అద్భుత స్థితిని ‘మ’ విభ్రమంతో చూస్తూ ఉన్నాడు. అతడు ఇలా తలపోయసాగాడు: ‘శ్రీరామకృష్ణులు అహేతుక కృపా సింధువు! గురురూపంలోని శ్రీరామకృష్ణులు, తమ పట్ల మేం విశ్వాసం కలిగి ఉండటానికి, మా మనస్సుల్లో చైతన్యం జాగృతం అవటానికి, జీవులకు ప్రబోధించటానికి, ఈ పరమహంస స్థితిలో ఉన్నారు.’
‘మ’ చింతన కొనసాగింది: ‘అద్వైతం – చైతన్యం – నిత్యానందం అంటూ ఉంటారు శ్రీరామకృష్ణులు. అద్వైత జ్ఞానం కలిగితే చైతన్యం జాగృతమవుతుంది, అప్పుడు మాత్రమే నిత్యానందం ఏర్పడుతుంది. శ్రీరామకృష్ణులది కేవలం అద్వైత జ్ఞానం మాత్రమే కాదు; ఆయన నిత్యానంద స్థితిలో నెలకొని ఉంటారు. జగన్మాత ప్రేమానందంలో సదా ఓలలాడుతూ ఉంటారు. ఉన్మత్తులై ఉంటారు.’
శ్రీరామకృష్ణుల ఈ స్థితిని హఠాత్తుగా చూసిన హాజ్రా చేతులు జోడించి మధ్య మధ్యలో, “ధన్యుడివి, ధన్యుడివి” అంటూ పలుకసాగాడు.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): నీకు విశ్వాసం ఎక్కడిది? జటిల కుటిలల వలె లీలను రక్తి కట్టించటానికే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు.
సాయంకాలం అయింది. ‘మ’ ఒంటరిగా ఆలయంలో తిరుగుతున్నాడు. కాసేపటి క్రిందటి శ్రీరామకృష్ణుల అత్యద్భుత స్థితిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ‘చిత్తక్షోభ, తృష్ణ నశించితేనే ఈ స్థితి కలుగుతుంది’ అంటూ ఎందుకు శ్రీరామకృష్ణులు పలికారు. గురువు రూపంలో వెలసిన ఈ మహానుభావుడు ఎవరు? మనలను ఉద్ధరించే నిమిత్తం సాక్షాత్తూ భగవంతుడే ఇలా మానవ రూపం ధరించి వచ్చాడా? అవతార పురుషులు, ఈశ్వర కోటులు తప్ప మరెవరూ ఇటువంటి జడ సమాధి (నిర్వికల్ప సమాధి) స్థితి నుండి క్రిందికి దిగి రాలేరు అని శ్రీరామకృష్ణులే వచించి ఉన్నారు కదా!’
17.8 అష్టమ పరిచ్ఛేదం బ్రహ్మజ్ఞానం గురించి ‘మ’ తో
ఆహుస్త్వామృషయస్సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ (గీత 10 :13)
సోమవారం, డిసెంబర్ 24, 1883
ఉదయం ఎనిమిది గంటల వేళ. శ్రీరామకృష్ణులు, ‘మ’ సరుగుడు తోపులో నిలబడి మాట్లాడుకుంటున్నారు. శ్రీరామకృష్ణుల దివ్యసాన్నిధ్యంలో నేటికి ‘మ’ పదకొండు రోజులుగా గడుపుతూ ఉన్నాడు.
శీతకాలం. సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. పోటు ప్రారంభం కావటంతో గంగానది ఉత్తర దిశగా ప్రవహించసాగింది. ఆలయ ప్రాంగణంలో నలువైపుల చెట్టు చేమలు, లతలు పెరిగి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు సాధనలు చేసిన బిల్వవృక్షం క్రింది ప్రదేశం సమీపంలో కానవస్తోంది. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖులై మాట్లాడుతున్నారు. ‘మ’ ఉత్తరాభిముఖుడై ఆయన మాటలు వినమ్రుడై వింటున్నాడు. ఆయన కుడివైపున పంచవటి, హంసపుకూర్ ఉన్నాయి. భానూదయం గాంచి జగత్తు ఆనందమయమై ఉన్నట్లు అనిపిస్తోంది. శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు.
17.8.1 శ్రీరామకృష్ణులకు నాంగ్టా బ్రహ్మజ్ఞానోపదేశం
శ్రీరామకృష్ణులు: నిరాకారమూ సత్యమే, సాకారమూ సత్యమే. సచ్చిదానంద బ్రహ్మం ఎటువంటిదో నాంగ్టా ఉపదేశించేవాడు. అనంత సాగరం వలె – పైన, క్రింద, కుడి ఎడమలు – సర్వమూ జలమయం. అన్నిటికి ఆది కారణమైన నీరు అది; అది నిశ్చలం. అది క్రియాజనితమైనప్పుడు నీరు అలలుగా ఉవ్వెత్తున లేస్తుంది. సృష్టి స్థితి లయాలే ఈ క్రియ.
“నాంగ్టా ఇంకా ఇలా అనేవాడు: ‘విచారణ ఎక్కడ దాకా వెళ్లి ఆగిపోతుందో అదే బ్రహ్మం. కర్పూరాన్ని వెలిగించినప్పుడు అంతా కాలిపోతుంది, బూడిద కూడా మిగలదు.’ ఆ విధంగా, బ్రహ్మం మనోవాక్కులకు అతీతమైనది. ఉప్పుబొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవడానికి వెళ్లింది. తిరిగివచ్చి ఏ సమాచారమూ అందివ్వలేదు; సముద్రంలోనే అది కరిగిపోయింది.
“ఒక సందర్భంలో ఋషులు శ్రీరాముడితో ఇలా అన్నారు: ‘ఓ రామా! భరద్వాజాదులు నిన్ను అవతారపురుషుడిగా పేర్కొనవచ్చు. కాని మేం అలా పలుకం. ఎందుకంటే మేము శబ్దబ్రహ్మాన్ని ఉపాసించేవారం. మేము మానవ రూపాన్ని ఇచ్ఛగించం.’ శ్రీరాముడు వారి పూజను స్వీకరించి చిరుదరహసంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.
17.8.2 నిత్యం, లీల రెండూ సత్యమే
“కాని నిత్యం ఎవరికి చెందినదో, ఆయనదే లీల కూడా; డాబా, మెట్లవలె అని చెబుతానే ఆ విధంగా. ఈశ్వర లీల, దేవలీల, నరలీల, జగల్లీల అని పలులీలలు ఉన్నాయి. నరలీలలో అవతారం ఉద్భవిస్తుంది. నరలీల అంటే ఏమిటో తెలుసా? విశాలమైన డాబా నుండి గొట్టం ద్వారా నీరు గలగలా క్రిందికి పడే విధంగా అదే సచ్చిదానందం, దాని శక్తియే ఒక మాధ్యమం ద్వారా వ్యక్తం అవుతుంది. భరద్వాజాది పన్నెండు మంది ఋషులు మాత్రమే రాముని అవతార పురుషునిగా తెలుసుకుని ఉన్నారు. అవతార పురుషులను ఎల్లరూ తెలుసుకోజాలరు.
17.8.3 గయలో క్షుదీరామ్ స్వప్న వృత్తాంతం – హృదయ్ తల్లి శ్రీరామకృష్ణుల పూజ -మథుర్ దర్శనం
(‘మ’ తో) “భగవంతుడు అవతరించి జ్ఞానం, భక్తి ఉపదేశిస్తాడు. అదిసరే, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?
“ఒకసారి నా తండ్రి గయకు వెళ్ళారు. అక్కడ రఘువీరుడు ఆయనకు కలలో కనిపించి, ‘నేను నీ కుమారుడిగా జన్మిస్తాను’ అన్నాడు. అందుకు నా తండ్రి, ‘ప్రభూ! నేనో పేద బ్రాహ్మణుణ్ణి, నిన్ను ఎలా సేవించగలను?’ అని అన్నారు. ‘అది జరిగిపోతుందిలే’ అని రఘువీరుడు బదులు చెప్పాడు.
“నా అక్కగారు, అంటే హృదయ్ తల్లి – చందన పుష్పాదులతో నాకు పాదపూజ చేసేది. ఒక రోజు నేను ఆమె తల మీద పాదం మోపి, ‘నువ్వు కాశీలో మరణిస్తావు’ అన్నాను.
“ఒకసారి మథుర్ నాతో, ‘బాబా! నీలో భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ లేదు. దేహం కేవలం ఒక తొడుగు మాత్రమే; బయటకు గుమ్మడికాయ ఆకారం, కాని లోపల కండ, విత్తనాలు ఏవీ లేవు. ఎవరో ముసుగు వేసుకొని పోతూ ఉన్నట్లు నిన్ను ఒక రోజు చూశాను’ అని అన్నాడు.
“అంతా ముందుగానే నాకు కనిపిస్తూ ఉంది. ఒకసారి పంచవటిలో చైతన్యుల సంకీర్తన బృందాన్ని చూశాను. దాన్లో బలరామ్‌ను చూసినట్లు గుర్తు, నిన్నూ చూసినట్లు అనిపిస్తోంది.
“చైతన్యుల పారవశ్య స్థితిని గురించి తెలుసుకోగోరాను. కామార్పుకూర్ ప్రక్కనున్న శ్యామ్బజారులో నాకు ఆ అనుభవం కలిగింది. చెట్ల మీదా గోడల మీదా జనం! అహర్నిశలూ నేను ఎక్కడకు వెళితే అక్కడల్లా జనం! ఏడు రోజులు బయలుకు పోవటానికి కూడా నాకు ఏకాంతం దొరకలేదు, ఆ పిదప జగజ్జననితో, ‘అమ్మా! చాలు, చాలు’ అన్నాను. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను.
“నేను మరోసారి రావలసి ఉంది. అందుకే నాతో వచ్చిన వారికి నేను పూర్తి జ్ఞానం అందివ్వడం లేదు. (నవ్వుతూ) మీకు పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తే ఆ తరువాత అంత సులభంగా నా వద్దకు వస్తారా ఏమిటి?
“నువ్వు చైతన్య భాగవతం చదువుతూ ఉండగా విన్నప్పుడు నిన్ను తెలుసుకొన్నాను – నువ్వు నా వాడివి, ఒక్కటే సత్తా, తండ్రీ కుమారుల వలె. ఎల్లరూ ఇక్కడకు వస్తున్నారు – కల్మీ తీగలా; ఒక మూల లాగితే అన్నీ కలిసి ముందుకు వస్తాయి. అన్నదమ్ముల్లా అందరూ ఆత్మీయులు. రాఖాల్, హరీష్ పూరీకి వెళ్లి ఉన్నారు, నుమ్వా వెళ్ళావనుకో మరి అక్కడ విడి విడిగా బసచేస్తారా ఏమిటి?
“ఇక్కడకు రావటానికి మునుపు నువ్వు ఎవరో మరచిపోయి ఉన్నావు. ఇకమీదట నిన్ను నీవు తెలుసుకోగలవు. భగవంతుడే గురువుగా ఏతెంచి తెలుసుకునేట్లు చేస్తాడు.
17.8.4 పులి-మేకల మంద కథ – గురువు రూపంలో ఉన్న భగవంతుడు స్వస్వరూపాన్ని తెలియజేస్తాడు
“పులి–మేకల మంద కథను నాంగ్టా నాకు చెప్పి ఉన్నాడు. ఒక ఆడపులి మేకల మందపై దాడిచేసింది. దూరం నుంచి దాన్ని చూసిన వేటగాడు, ఆ పులిని గురిపెట్టి బాణంతో చంపివేశాడు. అప్పుడు ఆ ఆడపులి నిండు చూలాలు. పిల్లను ఈని అది చచ్చిపోయింది. ఆ పులిపిల్ల మేకలతో పాటు పెరిగింది. మేకపాలనే త్రాగింది. కాస్త పెరిగాక గడ్డి తినటం మొదలుపెట్టింది; మేకల్లా ‘మే, మే’ అంటూ అరిచేది. కాలక్రమాన అది పెద్దపులిగా ఎదిగిపోయింది. అప్పుడూ గడ్డినే మేస్తూ ఉంది, ‘మే, మే’ అంటూనే అరిచేది. ఏదైనా మృగం దాడిచేయ వస్తే మేకలా భయపడి పారిపోయేది.
“ఒక రోజు భయంకరమైన పులి ఒకటి ఈ మేకల మందపై దాడిచేసింది. అక్కడ మేక–పులి గడ్డి మేస్తూ ఉంది, మేకలతోబాటు భయపడి పారిపోతోంది. ఈ దృశ్యం చూసి ఆ పులి విస్తుపోయింది. అది తక్కిన మేకలను పట్టించుకోక తిన్నగా గడ్డిమేసే ఈ మేక–పులిని పట్టుకుంది. అది ‘మే, మే’ అంటూ అరవసాగింది. పారిపోవ యత్నించింది. కాని ఆ పులి దాన్ని వదలకుండా ఒక నీటిగుంట వద్దకు లాక్కొని వెళ్లింది. పిదప దానితో, ‘ఇదుగో, ఈ నీటిలో నీ ముఖాన్ని చూసుకో, నా ముఖాన్నీ చూడు; నీకూ నాలాగనే కుండలాటి ముఖమే ఉంది’ అన్నది. ఆ తరువాత దాని నోట్లో ఒక మాంస ఖండాన్ని క్రుక్కింది. మొదట ఆ మేక–పులి ఎంతో తిరస్కరించింది. కాని కాస్త రుచి మరిగాక తినసాగింది. అప్పుడు ఆ భయంకరమైన పులి, ‘నువ్వు మేకల మధ్య పెరిగావు! వాటి వలె గడ్డి మేశావు! ఎంత శోచనీయం!’ అని చెప్పింది. ఆ మాటలు విన్న మేక–పులి సిగ్గుపడిపోయింది.
“గడ్డి మేయటం అంటే కామినీ కాంచనాలలో జీవించటం అని అర్థం. మేకలా ‘మే, మే’ అని అరవటం భీతితో పరుగు పెట్టటం, అంటే సామాన్య జీవుడిలా ప్రవర్తించటం అని అర్థం. భయంకరమైన పులితో వెళ్లటం అంటే చైతన్యం జాగృతం చేసే గురువును శరణుజొచ్చటం, ఆయన మన సొంతం అని అవగాహన చేసుకోవటం. తన రూపాన్ని నీటిలో చూసుకోవటం అంటే తన స్వస్వరూపాన్ని ఎరుగటమే అవుతుంది.”
17.8.5 పంచవటిలో మర్రి చెట్టుకు శ్రీరామకృష్ణుల ప్రణామం
శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. నలుదిశలా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. సరుగుడు చెట్ల కదలికతో, ఏర్పడే ‘సౌ, సౌ’ శబ్దమూ, ప్రవహించే గంగానది మర్మర ధ్వనీ మాత్రం వినవస్తూ ఉన్నాయి. శ్రీరామకృష్ణులు కంచె దాటి, పంచవటి మీదుగా ‘మ’ తో మాట్లాడుతూ నడుస్తున్నారు. ‘మ’ మంత్రముగ్ధుడై ఆయన వెంట వెళ్లసాగాడు. పంచవటిని సమీపించగానే పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడిన మర్రిచెట్టు నీడన శ్రీరామకృష్ణులు తూర్పు ముఖంగా నిలబడి అరుగుపై శిరస్సును ఉంచి మ్రొక్కారు. ఇది ఆయన సాధన భూమి! ఇక్కడ ఆయన తీవ్ర వ్యాకులతతో విలపించారు! లెక్కలేనన్ని దివ్యదర్శనాలను గాంచి ఉన్నారు! అందుచేతనే ఆయన ఇక్కడకు వచ్చినప్పుడల్లా ప్రణామం చేస్తుంటారు.
మర్రిచెట్టు
బిల్వవృక్షం
పొగడ చెట్లను దాటి ఇద్దరూ నహబత్ సమీపానికి వచ్చినప్పుడు హాజ్రా ఎదురుపడ్డాడు. శ్రీరామకృష్ణులు హాజ్రాతో, “మితిమీరి తినవద్దు; ‘మడి –మైల’ అంటూ వాటిని పట్టుకొని వ్రేలాడవద్దు. అలా వ్రేలాడే వాళ్లకి జ్ఞానం కలుగదు. అవసరమైనంత వరకు ఆచారాలు పాటిస్తే చాలు, మితిమీరి తల పగుల కొట్టుకోవద్దు” అని చెప్పి తమ గదిలోకి వెళ్లి కూర్చున్నారు.
17.9 నవమ పరిచ్ఛేదం రాఖాల్, రామ్, సురేంద్ర, లాటు ప్రభృత భక్తులతో
భోజనానంతరం శ్రీరామకృష్ణులు విశ్రమించారు. అప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట అయివుంటుంది. క్రిస్మస్ సెలవులు మొదలయ్యాయి. సురేంద్రుడు, రామ్ మొదలైన భక్తులు కలకత్తా నుంచి ఒకరివెంట ఒకరు రాసాగారు. ‘మ’ సరుగుడు తోపు సమీపంలో ఒంటరిగా పచార్లు చేస్తూ ఉన్నాడు. అప్పుడు హరీశ్ కంచె ప్రక్కకు వచ్చి, “మహాశయులు మిమ్మల్ని పిలుస్తున్నారు. శివ సంహిత పఠించనున్నారు” అంటూ బిగ్గరగా చెప్పాడు.
శివసంహితలో యోగం గురించీ, షడ్చక్రాల గురించీ పేర్కోబడి ఉంది.
‘మ’, శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నాడు. ఆయన మంచం మీద, భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. శివసంహిత పఠనం జరుగలేదు, శ్రీరామకృష్ణులే మాట్లాడసాగారు.
17.9.1 ప్రేమభక్తి, బృందావన లీల – అవతారం, నరలీల
శ్రీరామకృష్ణులు: గోపికలు శ్రీకృష్ణుని పట్ల ప్రేమభక్తిని కలిగి ఉండేవారు. ప్రేమభక్తిలో రెండు అంశాలు ఉన్నాయి: అవి అహంకారం, మమకారం. ‘కృష్ణునికి నేను సేవలు చేయకుంటే ఆతడి ఆరోగ్యం పాడైపోతుంద’ నే భావన. ఇది అహంకార – ప్రేమ భక్తి. దీన్లో కృష్ణుడు భగవంతుడనే ఎరుక ఉండదు.
“మరొకటి, మమకార – ప్రేమ భక్తి; ‘కృష్ణుడు నా వాడు, నా వాడు’ అనే భావన. గోపికలకు శ్రీకృష్ణుడి పట్ల ఎంతటి మమకారం ఉండేదంటే, ఆతడి పాదాలకు గాయమవుతుందని వెరచి గోపికలు తమ సూక్ష్మశరీరాలను సర్వదా ఆతడి పాదాల క్రింద ఉంచి ఉండేవారు. యశోద ‘మీ చింతామణి కృష్ణుడెవరో నాకు తెలియదు. నా బాలగోపాలుడే నాకు తెలుసు’ అనేది. గోపికలూ, ‘మా ప్రాణవల్లభుడేడీ? మా హృదయ నాయకుడెక్కడా?’ అనే అడిగారు. ఇక్కడ కృష్ణుడు భగవంతుడనే స్పృహే వారికి లేదు. చిన్న పిల్లలు, ‘మా నాన్న’ అనటం వంటిది ఇది. ఎవరైనా ఆ పిల్లవాడి వద్ద, ‘ఈయన మీ నాన్న కాదు’ అని చెబితే, ‘ఊహూ, ఈయన మా నాన్నే’ అంటాడు దృఢంగా.
“నరలీలలో అవతార పురుషుడు అచ్చం మనిషిలాగానే వర్తించవలసి ఉంటుంది. అందుకే ఆయనను తెలుసుకోవటం చాలా కష్టం. మానవరూపంలో ఏతెంచినప్పుడు ఆయన నిజంగా మనిషిలాగానే ఉంటాడు. అవే ఆకలిదప్పులు, రోగం, శోకం, కొన్ని సమయాల్లో భయం – ఇలా అన్నిట్లోనూ నిజమైన మనిషిలా వర్తిస్తాడు. రాముడు సీతావియోగంతో శోకించాడు. కృష్ణుడు నందుని పాదరక్షలను తల మీద పెట్టుకున్నాడు; కూర్చోటానికి పీటను మోసుకువెళ్ళాడు.
“థియేటర్లో సాధువు వేషం ధరించేవాడు సాధువులాగానే ప్రవర్తిస్తాడు, రాజులా ప్రవర్తించడు. ఏ వేషం ధరిస్తూ ఉన్నాడో ఆ వేషానికి తగినట్లు నటిస్తాడు.
“ఒక వ్యక్తి ఒక నాటకంలో సన్న్యాసిగా నటించాడు. అతడి వేషం రక్తికట్టటం చూసి ధనికుడొకడు అతడికి ఒక రూపాయి కానుక ఇవ్వబోయాడు. కాని ఆ నటుడు దాన్ని స్వీకరించలేదు, ‘ఊహూ’ అంటూ తిరస్కరించి వెళ్ళి పోయాడు. వేషం తీసివేసి, ముఖం, కాళ్లూ చేతులూ కడుగుకొని తిరిగి వచ్చాడు. ఆ తరువాత ధనికుడి వద్ద కెళ్లి, ‘డబ్బు ఇవ్వండి’ అని అడిగాడు. ‘ఇదేమిటి? కొన్ని క్షణాల క్రితమే డబ్బు వద్దన్నావు. ఇప్పుడు అడుగుతున్నావు’ అని ఆ ధనికుడు ఆశ్చర్యపోతూ అడిగాడు. అందుకు ఆ నటుడు, ‘అప్పుడు నేను సన్న్యాసి వేషం ధరించి ఉన్నాను, కనుక డబ్బు పుచ్చుకోకూడదు’ అన్నాడు. అదే విధంగా భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు అచ్చం మనిషిలాగానే జీవిస్తాడు. బృందావనానికి వెళితే కృష్ణుడు లీలలు చేసిన చోట్లు అనేకం చూడవచ్చు.”
17.9.2 సాధు, భక్తులకు దానం; సత్యసంధత – సురేంద్రునికి ఉపదేశం
సురేంద్రుడు: మేం సెలవుల్లో బృందావనానికి వెళ్ళి ఉన్నాం. అక్కడ, ‘డబ్బులివ్వండి’ అంటూ ఒక్కటే వేధించటం. దేవాలయ పండాలు, ‘ఇవ్వండి, ఇవ్వండి’ అన్న అదే పల్లవి. ‘కలకత్తాకు రేపు పోతున్నాం’ అని వారితో చెప్పి, ఆ రోజే అక్కడ నుండి పారిపోయాం.
శ్రీరామకృష్ణులు: ఛీ! ఛీ! అదేమిటి! రేపు వెళతామని చెప్పి ఆ రోజే పారిపోయి రావటమా?ఛీ!
సురేంద్రుడు (సిగ్గుపడి): అడవులలో అక్కడక్కడా బాబాజీలను చూశాం. ఏకాంతంలో కూర్చుని సాధనానుష్ఠానాలు చేస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: బాబాజీలకు ఏమైనా ఇచ్చావా?
సురేంద్రుడు: లేదండీ.
శ్రీరామకృష్ణులు: ఇది సరికాదు. సాధువులకు, భక్తులకు ఏదైనా సమర్పించాలి. డబ్బున్న వాళ్ళు ఇటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు వారికి ఏదైనా ఇవ్వాలి.
17.9.3 మథుర్‌తో శ్రీరామకృష్ణుల బృందావన యాత్ర (1868) సంఘటనలు
“నేను మథుర్బాబుతో బృందావనం వెళ్లి ఉన్నాను. మథురలో ధ్రువఘట్టం* చూసీ చూడగానే, వసుదేవుడు కృష్ణుణ్ణి తన ఒడిలో ఎత్తుకుని యమునా నదిని దాటుతూ ఉన్నట్లు హఠాత్తుగా దర్శనం కలిగింది.
“సాయంకాలం వేళలలో యమునా తీరాన నడుస్తూ ఉండేవాణ్ణి. అక్కడి సైకత స్థలాలలో చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, పెద్ద రేగుచెట్లు బారులుతీరి ఉన్నాయి. గోధూళి వేళలో ఆలమందలు పచ్చిక బయళ్లలో మేసి తిరిగివస్తూ ఉన్నాయి. అవి యమునా నదిని దాటుకుని వెళుతున్నాయి. గోపబాలురు ఆ గోవులను తోలుకుని వెళుతున్నారు. ఈ దృశ్యాలను చూడగానే, ‘కృష్ణా! నువ్వు ఎక్కడున్నావు?’ అని కేకపెడుతూ బాహ్యస్మృతిని కోల్పోయాను.
“శ్యామకుండం, రాధాకుండాలను దర్శించగోరాను. మథుర్బాబు నన్ను పల్లకీలో పంపించాడు. చాలాదూరం పోవలసి ఉంది; అందుకే పూరీ, జిలేబీ మొదలైన భక్ష్యాలను పల్లకీలో ఉంచారు. పల్లకీ పోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా, ‘ఓ కృష్ణా! ఇదుగో నువ్వు ఆవులను కాచిన అదే పచ్చిక బయలు. ఆ స్థలాలన్నీ యథాతథంగానే ఉన్నాయి. నువ్వు మాత్రం లేవే’ అంటూ వెక్కివెక్కి ఏడ్చాను.
“హృదయ్ పల్లకీ వెనుక వస్తూన్నాడు. నా కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. బోయీలను ఆపమని చెప్పలేకపోయాను.
“శ్యామకుండం, రాధాకుండాలకు వెళ్లాను. సాధువులు చిన్నచిన్న గుడిసెలు కట్టుకుని వసిస్తూ ఉన్నారు. దారిన పోతూవున్న వారిని చూడకూడదనే ఉద్దేశంతో వెనుకకు తిరిగి కూర్చుని వాళ్లు సాధనానుష్ఠానాలు చేస్తున్నారు. అక్కడి ద్వాదశ వనాలు చూసి తీరవలసినవే.
“బంకువిహారిని* దర్శించటంతోనే నాకు భావపారవశ్య స్థితి కలిగింది. ఆయనను ఆలింగనం చేసుకోవటానికి పరుగెత్తాను. గోవిందజీను రెండవసారి దర్శింప ఇచ్ఛ కలుగలేదు. మథురలో బసచేసినప్పుడు కృష్ణుణ్ణి గోపబాలునిగా కలలో గాంచాను. హృదయ్, మథుర్బాబు కూడా అదే విధంగా కలలో గాంచారు.
17.9.4 సురేంద్రుడు దేవీ భక్తుడు – యోగం, భోగం
(సురేంద్రునితో) “నీకు యోగం, భోగం రెండూ ఉన్నాయి. బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి అని ఋషులు మూడు కోవలకు చెందుతారు. శుకదేవుడు బ్రహ్మర్షికి ఉదాహరణం – ఒక్క పుస్తకం కూడ అతడి వద్ద ఉండదు. నారదుని వంటి వారు దేవర్షులు. జనకుడు రాజర్షి. రాజర్షులు నిష్కామకర్మలు నిర్వర్తిస్తారు.
“దేవీభక్తులు ధర్మం, మోక్షం రెండినీ ప్రాప్తించుకుంటారు; అర్థకామాలనూ అనుభవిస్తారు. ఒకసారి నేను నిన్ను దేవీపుత్రునిగా గాంచాను. నీలో యోగం, భోగం రెండూ ఉన్నాయి. లేకుంటే నీ ముఖం పాలిపోయి ఉండేది.
17.9.5 స్నానఘట్టం వద్ద దేవీభక్తుడు – నవీన్ నియోగి
“సర్వస్వాన్ని త్యజించిన వ్యక్తి ముఖం పాలిపోయి ఉంటుంది. ఒక దేవీ భక్తుణ్ణి స్నానఘట్టం వద్ద చూశాను. అతడు ఒక వంక తింటూనే ఉన్నాడు, మరోవంక పూజనూ నిర్వర్తిస్తున్నాడు. అతడు తాను దేవికి బిడ్డననే భావంలో ఉన్నాడు!
“అయితే అధికంగా ధనం ఉండటం మంచిది కాదు. యదుమల్లిక్ సంసారంలో మునిగిపోయి ఉన్నాడు. పుష్కలంగా ధనం ఉంది కదా! నవీన్ నియోగి వద్దా యోగం, భోగం రెండూ ఉన్నాయి. దుర్గాపూజ సందర్భంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ దేవికి వింజామరలు వీచటం చూశాను.”
సురేంద్రుడు: మహాశయా, ధ్యానం కుదరటం లేదే, ఎందుకు?
శ్రీరామకృష్ణులు: స్మరణ మననాలు చేస్తున్నావు కదా?
సురేంద్రుడు: అవునండీ. ‘అమ్మా, అమ్మా’ అని స్మరిస్తూనే నిద్రకు ఉపక్రమిస్తాను.
శ్రీరామకృష్ణులు: చాలా మంచిది. స్మరణ మననాలు ఉంటేనే చాలు.
శ్రీరామకృష్ణులు సురేంద్రుని భారాన్ని స్వీకరించారు. ఇక అతడికి చింత ఏముంది?
17.10 దశమ పరిచ్ఛేదం శివసంహిత, యోగశిక్షణ
సాయంత్రం అయింది. శ్రీరామకృష్ణులు ‘మ’ మొదలైన భక్తులతో నేల మీద కూర్చుని ఉన్నారు. యోగం, షడ్చక్రాలను గురించి మాట్లాడుతున్నారు. శివ సంహితలో ఈ విషయాలు ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు: ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు. సుషుమ్నానాడిలో పద్మాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చిన్మయాలు, మైనంతో చేసిన చెట్టు వంటివి – కొమ్మలు, రెమ్మలు, పళ్లు అన్నీ మైనంతో చేసినవే. మూలాధార పద్మంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఇది చతుర్దళ పద్మం. ఆద్యాశక్తియే అందరి దేహాలలో కుండలినీ శక్తి రూపంలో ఉంటుంది; చుట్టచుట్టుకుని నిద్రిస్తున్న పాము రీతిలో ఉంటుంది. అది ‘ప్రసుప్త భుజగాకారా ఆధార పద్మవాసినీ.’
(‘మ’ తో) “భక్తియోగం ద్వారా కుండలినీ సత్వరం జాగృతమవుతుంది. ఇది జాగృతం కాకుంటే భగవద్దర్శనం కలుగదు. ఏకాంతంలో ఉన్నప్పుడు గోప్యంగా చిత్తశుద్ధితో ఈ పాట గానం చేయి:
అమ్మా! లెమ్మా! కులకుండలినీ
నిత్యానంద స్వరూపిణి నీవు
ప్రసుప్త భుజగాకారవు నీవు
మూలాధార పద్మనివాసిని.
“పాటలతోనే రాంప్రసాద్ సిద్ధుడయ్యాడు. వ్యాకుల చిత్తంతో గానం చేస్తే భగవద్దర్శనం కలుగుతుంది.”
‘మ’ : అవునండీ. వీటినన్నిటిని ఒకసారి అయినా చేయగలిగితే మనోవ్యధ పూర్తిగా తొలగిపోతుంది.
17.10.1 గురువే అంతా చేస్తాడు – శ్రీరామకృష్ణులు, ఆయన స్వజనం
శ్రీరామకృష్ణులు: ఆహా, మనోవ్యధ తప్పక తొలగిపోతుంది. యోగం గురించిన కొన్ని విషయాలు నీకు చెప్పవలసి ఉంది. విషయం ఏమిటో తెలుసా? గ్రుడ్డులో పిల్ల పెరుగనంత వరకు తల్లిపక్షి గ్రుడ్డును పొడిచి పగులగొట్టదు, నిర్ణీత సమయం రాగానే పగులగొడుతుంది.
“అయితే కొంచెం సాధనలు చేయటం అవసరం. గురువే అంతా చేస్తాడు, అయినప్పటికీ చివరగా శిష్యుడి చేత కొంత సాధన చేయిస్తాడు. పెద్దవృక్షాన్ని నరుకుతున్నప్పుడు, దాదాపు మొత్తంగా నరికిన తరువాత కాస్త దూరంగా జరిగి నిలబడాలి; అప్పుడు వృక్షం ఫెళఫెళమనే శబ్దం చేస్తూ దానంతట అదే విరిగి పడిపోతుంది.
“నీరు పారించటానికై రైతు కాలువ తవ్వుతాడు. ఇక కాస్త తవ్వితే కాలువ ఏరుతో కలిసిపోతుందన్నప్పుడు, అతడు ప్రక్కకు తప్పుకొంటాడు. అప్పుడు ఏటి నీరు ప్రవహిస్తుంది, త్రవ్వక వదలివేసిన కాస్త భాగం కరిగిపోయి పడిపోతుంది. వెంటనే ఏటి నీరు గలగలా కాలువలోకి ప్రవహిస్తుంది.
“అహంకారం, ఉపాధి – వీటన్నింటిని త్యజించినప్పుడే భగవంతుణ్ణి దర్శించగలం. ‘నేను పండితుణ్ణి’, ‘నేను ఫలానావారి కుమారుణ్ణి’, ‘నేను ధనికుడను’, ‘నేను సుప్రసిద్ధుడను’ – ఇటువంటి ఉపాధులను వదలినప్పుడే భగవంతుని దర్శనం.
“భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యాలు, సంసారం అనిత్యం – ఇటువంటి చింతనయే వివేకం. వివేకం లేకుంటే ఉపదేశాలను గ్రహించ సాధ్యం కాదు.
“సాధనలు చేసి చేసి భగవత్కృపతో సిద్ధుడు కావచ్చు. కొద్దిగా శ్రమించాలి. ఆ తరువాత దర్శనం అవుతుంది, ఆనందం కలుగుతుంది.
“ఫలానా చోట లంకె బిందెలు పాతిపెట్టబడి ఉన్నవని వింటే వెంటనే అక్కడికి జనం పరుగులు పెడతారు; అక్కడ త్రవ్వటం ప్రారంభిస్తారు. చెమట ధారలు కట్టగా ఒకడు త్రవ్వుతూ ఉంటాడు. చాలాసేపు అవుతుంది. అప్పుడు గడ్డపార ఎక్కడో పడి ‘ఠన్’ అనే శబ్దం వినవస్తుంది. వెంటనే గడ్డపారను పారవేసి లంకెబిందె కోసం ఆతురతతో చూస్తాడు. లంకెబిందెను చూడగానే ఆనందంతో నాట్యం చేస్తాడు. లంకెబిందెను వెలుపలికి తీసి, బంగారు నాణేలను క్రింద క్రుమ్మరిస్తాడు; చేతుల్లోకి తీసుకొంటాడు; లెక్కించ మొదలుపెడతాడు. పరమానందభరితుడవుతాడు. దర్శనం, స్పర్శనం, అనుభవించటం. ఏమంటావు?”
‘మ’ : అవునండీ.
కాసేపు శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ కొనసాగించారు: “ఎవరు నా స్వజనమో, వారిని నేను చీవాట్లుపెట్టినా వారు మళ్లీ వస్తారు. ఆహా, నరేంద్రునిది ఎటువంటి స్వభావం! మునుపు కాళీమాతను గురించి నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేవాడు. ఒక రోజు నేను విసిగి వేసారిపోయాను. ‘ధూర్తుడా, ఇకపై ఇక్కడకు రావద్దు’ అని తిట్టాను. అతడు మెల్లగా బయటకు వెళ్లి హుక్కా సిద్ధం చేసుకోసాగాడు. స్వజనాన్ని ఉపేక్షించినా వాళ్లు కోపగించుకోరు. ఏమంటావు?”
‘మ’ : నిజమేనండీ.
శ్రీరామకృష్ణులు: నరేంద్రుడు స్వతః సిద్ధుడు, నిరాకారంలో నిష్ఠ ఉన్నవాడు.
‘మ’ (నవ్వుతూ): అతడు ఇక్కడకు వచ్చినప్పుడల్లా పెద్ద సంచలనాన్నే తోడ్కొని వస్తాడు.
శ్రీరామకృష్ణులు (ఆహ్లాదంగా నవ్వుతూ): అవునవును. సరిగ్గా చెప్పావు, ‘సంచలనమే’.
మంగళవారం, డిసెంబర్ 25, 1883
17.10.2 ఏకాదశి పాటించడం మంచిది
నేడు కృష్ణపక్ష ఏకాదశి. అప్పుడు సమయం పదకొండు గంటలు అయివుంటుంది. శ్రీరామకృష్ణులు ఇంకా భోజనం చేయలేదు. ‘మ’, రాఖాల్ మొదలైన భక్తులు గదిలో కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఏకాదశి పాటించటం మంచిది. అందువల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతుని పట్ల భక్తీ జనిస్తుంది. ఏమంటావు?
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: కాని పాలు, పేలాలు తిను, ఏమంటావ్?