- అర్జునుడు పలికెను – ఓ జనార్దనా! కేశవా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ? (3.1)
- కలగాపులగమువంటి నీ మాటలతో నా బుద్ది భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము. (3.2)
- శ్రీభగవానుడు పలికెను- ఓ అనఘా! అర్జునా! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. (3.3)
- మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు. (3.4)
- ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఏలనన మనుష్యులందఱును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును. (3.5)
- బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు. (3.6)
- కాని, అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపఱచుకొని, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. (3.7)
- నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన, కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణముగూడ సాధ్యము గాదు. (3.8)
- ఓ అర్జునా! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము. (3.9)
- కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, “మీరు ఈ యజ్ఞములద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెల్ల తీర్చును” అని పల్కెను. (3.10)
- ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్స్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱుచుకొనుచు పొందగలరు. అని పల్కెను. (3.11)
- యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు (మానవులకు) అయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆదేవతలకు నివేదనచేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. (3.12)
- యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపములనుండి ముక్తులయ్యెదరు. తమ శరీరపోషణ కొఱకే ఆహారమును సిద్ధపఱచు (వండు) కొను పాపులు పాపమునే భుజింతురు. (3.13)
- ప్రాణులన్నియు అన్నము (ఆహారము) నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షములవలన ఏర్పడును. యజ్ఞములవలన వర్షములు కురియును. విహితకర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వవ్యాపియు, అవ్యయుడును ఐన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై యున్నాడు. (3.14-15)
- ఓ అర్జునా! ఇట్లు పరంపరాగతముగా కొనసాగు చున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివానియొక్క జీవితము వ్యర్థము. (3.16)
- సచ్చిదానందఘనపరమాత్మప్రాప్తినందిన జ్ఞానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు. కనుక ఆత్మయందే తృప్తినొందును. అతడు ఆత్మయందే నిత్యసంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. (3.17)
- అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను, చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏవిధముగను ఏమాత్రము ఉండదు. (3.18)
- అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన, ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. (3.19)
- జనకుడు మొదలగు జ్ఞానులుగూడ ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. (3.20)
- శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే (ప్రవర్తననే) ఇతరులును అనుసరింతురు. అతడు నిల్పిన (ప్రతిష్ఠించిన) ప్రమాణములనే లోకులందఱును పాటించెదరు. (3.21)
- ఓ అర్జునా! ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. (3.22)
- (ఏలనన) ఓ పార్థా! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందఱును అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. (3.23)
- నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు లోకములందు అల్లకల్లోలములు (సాంకర్యములు) చెలరేగును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను. (3.24)
- ఓ భారతా! (అర్జునా!) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. (3.25)
- పరమాత్మస్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను. (3.26)
- వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతిగుణములద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతఃకరణముగల అజ్ఞాని) ‘ఈ కర్మలకు నేనే కర్తను’ అని భావించును. (3.27)
- కాని, ఓ మహాబాహూ! (అర్జునా!) గుణవిభాగ తత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తుడు కాడు. (3.28)
- ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడిజ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు (ఊగిసలాటకు) గురి చేయరాదు. (3.29)
- అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, ఆశా మమతా సంతాపములను వీడి, యుద్ధము చేయుము. (3.30)
- దోషదృష్టి లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. (3.31)
- కాని నాయందు దోషారోపణ చేయుచు, నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్తజ్ఞాన విషయముల యందును మోహితులై (విపరీత జ్ఞానోపహతులై) భ్రష్టులై, కష్టనష్టముల పాలయ్యదరని ఎఱుంగుము. (3.32)
- సమస్త ప్రాణులును తమ తమ ప్రకృతులను అనుసరించి (స్వభావములకు లోబడి) కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని (స్వభావమును) అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? (3.33)
- ప్రతిఇంద్రియార్థమునందును (ప్రతిఇంద్రియ విషయమునందును) రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. (3.34)
- పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. (3.35)
- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయు చుండును? (3.36)
- శ్రీభగవానుడు పలికెను – రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాపకర్మా చరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎఱుంగుము. (3.37)
- పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే ఆవృతమై యుండును. (3.38)
- ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. (అగ్నివంటిది) అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. (3.39)
- ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. ఇది (ఈకామము) మనోబుద్దీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవత్మను మోహితునిగా చేయును. (3.40)
- కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపఱచుకొనుము. పిదప జ్ఞానవిజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులనొడ్డి రూపుమాపుము. (3.41)
- స్థూలశరీరముకంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్ఠములు అని పేర్కొందురు. ఇంద్రియములకంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్ఠమైనవి. ఆ బుద్ధికంటెను అత్యంతశ్రేష్ఠమైనది, సూక్ష్మమైనది ఆత్మ. (3.42)
- ఈ విధముగా బుద్ధికంటెను ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్ఠము ఐనదని తెలిసికొని, ఓ మహాబాహూ! బుద్ధిద్వారా మనస్సును వశపఱచుకొని, దుర్జయశత్రువైన కామమును నిర్మూలింపుము. (3.43)