Chapter I
1.1 ప్రేరేపితమైన మనస్సు ఎవరి కోర్కె వలన చరిస్తోంది? ముఖ్య ప్రాణాన్ని నియమించే దెవరు ? ఎవరి సంకల్పం చేత వాక్కు మాట్లాడుతుంది, కళ్ళు, చెవులు పని చేయటానికి ఎవరు కారణం?
1.2 చెవికి చెవిగా, మనస్సుకు మనస్సుగా, వాక్కుకు వాక్కుగా, ప్రాణానికి ప్రాణంగా, కన్నుకు కన్నుగా నెలకొని ఉన్నది ఆత్మ. చైతన్యం జాగృతమైన వ్యక్తి ఈ సత్యాన్ని గ్రహించి, ఇంద్రియపరమైన ప్రపంచంనుండి విడివడి అమరత్వ స్థితికి చేరుకొంటాడు.
1.3 అక్కడకు కళ్ళు పోజాలవు. వాక్కూ, మనస్సూ సైతం పోజాలవు. అందువలన అది ఎలాంటిదో మాకు తెలియదు. దానిని ఎలా ఇతరులకు అర్థమయ్యేలా తెలియపరచాలో కూడా నాకు తెలియదు.
1.4 ఆ ఆత్మ తెలిసిన వాటి నుండి భిన్నంగా ఉంది, తెలియని వాటి కన్నా ఉన్నతమైనది. దానిని మాకు వివరించిన పూర్వీకుల నుండి మేం ఇలా విన్నాం.
1.5 ఏదైతే వాక్కు ద్వారా వివరింపబడజాలదో, దేని ద్వారా వాక్కు వివరింపబడుతుందో అదే ఆత్మ. ఇక్కడ ఆరాధింపబడేది ఆత్మ కాదు అని గ్రహించు.
1.6 దేనిని మనస్సు ద్వారా గ్రహించడం సాధ్యపడదో, దేనివలన మనస్సు గ్రహింపబడుతుందో అదే ఆత్మ అని ఋషులు వచించారు. ఇక్కడ ఆరాధింపబడుతున్నది ఆత్మ కాదని తెలుసుకో.
1.7 ఏది కళ్ళ ద్వారా చూడబడదో, దేని మూలంగా కళ్ళు చూస్తాయో అదే ఆత్మ. ఇక్కడ ఆరాధింపబడేది ఆత్మ కాదని తెలుసుకో.
1.8 ఏది చెవుల ద్వారా వినబడజాలదో, దేని వలన చెవులు వినగలుగుతున్నాయో అదే ఆత్మ. ఇక్కడ ఆరాధింపబడుతున్నది ఆత్మ కాదని గ్రహించు.
1.9 ఏది శ్వాస చేత ఆఘ్రాణింపబడదో, దేనివలన శ్వాస ఆఘ్రాణించ గలుగుతున్నదో అదే ఆత్మ. ఇక్కడ ఆరాధింపబడుతున్నది ఆత్మ కాదని తెలుసుకో.
Chapter II
2.1 గురువు: ‘నేను ఆత్మను చక్కగా తెలుసుకొన్నాను’ అనుకొంటే నువ్వు గ్రహించింది నిశ్చయంగా అతి స్వల్పమే. అందువల్ల దేవుళ్లలో దానిని ఇంకా ఇంకా తెలుసుకోవాలి.
2.2 ఆత్మ నాకు బాగా తెలుసని భావించడం లేదు; తెలియదనీ భావించడం లేదు. ఎందుకంటే నన్ను గురించి నాకు తెలుసు. ‘ఆత్మను గురించి తెలియదు. అదే సమయంలో తెలియదని చెప్పడమూ సాధ్యంకాదు, అని మనలో ఎవరు అనుకొంటారో అతడే ఆత్మను గ్రహించిన వాడు.
2.3 ఎవరికి తెలియదో అతనికి తెలుసు. ఎవరికి తెలుసో అతనికి తెలియదు. బాగా తెలిసినవారు తెలుసుకోలేదు. బాగా తెలియనివారు తెలుసు కొంటున్నారు.
2.4 ప్రతి చైతన్య స్థితిలోను ఆత్మను గ్రహించిన వ్యక్తి నిజానికి తెలిసినవాడు అన్నదే భావం. అలా తెలిసినవాడు నిశ్చయంగా అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మనుంచి శక్తి లభిస్తుంది. జ్ఞానంతో అమరత్వం ప్రాప్తిస్తుంది.
2.5 ఇక్కడే ఆత్మను సాక్షాత్కరించుకొంటే జీవితంలో యథార్థమైన సంతృప్తి కలుగుతుంది. లేకపోతే గొప్పనష్టం వాటిల్లుతుంది. చైతన్యం జాగృతం పొందిన వారు సకల ప్రాణులనూ ఆత్మగానే దర్శిస్తారు. అలాంటి వారు ఈ లోకం నుండి విడివడి అమరులవుతారు.
Chapter III
3.1 దేవతల కోసం నిజంగా విజయం సాధించింది భగవంతుడు. కాని ఆ విజయంతో దేవతలు ఉప్పొంగిపోయారు. ఈ విజయం మాదే, ఈ ఘనత మాదే అని వారు భావించారు.
3.2 దేవతల ఆ పొరపాటు ఆలోచనను తెలుసుకొన్న భగవంతుడు వారి ఎదుట ఒక యక్షుని రూపంలో సాక్షాత్కరించాడు. ఆ యక్షుడు ఎవరని తెలుసుకోలేక దేవతలు గందరగోళంలో పడ్డారు.
3.3, 3.4, 3.5 & 3.6 దేవతలు అగ్నిదేవుణ్ణి పిలిచి, “ఓ అగ్నిదేవా ! ఈ యక్షుడు ఎవరన్నది తెలుసుకొని రా” అన్నారు. ఆతడు, “అలాగే” అని చెప్పి బయలుదేరాడు. దేవతలు చెప్పింది విని అగ్నిదేవుడు వెంటనే యక్షుని వద్దకు వెళ్లాడు. ఆ యక్షుడు అగ్నిదేవుని, “నువ్వు ఎవరవు ?” అని అడిగాడు. “నేను అగ్నిని లేదా జాతవేదుడను (సర్వజ్ఞుడు)” అని అగ్నిదేవుడు జవాబిచ్చాడు. “నీలో ఏం శక్తి ఉంది?” అని యక్షుడు అడిగాడు. అందుకు అగ్నిదేవుడు, “ఈ భూమండలం మీద ఉన్న అన్నింటినీ నేను దహించివేయగలను” అని బదులు చెప్పాడు. ఆ యక్షుడు అగ్నిదేవుని ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి, “దీనిని దహించు” అన్నాడు. అగ్నిదేవుడు అమిత వేగంగా ఆ గడ్డిపోచను సమిపించాడు. కాని అతనికి దానిని దహింప శక్యం కాలేదు. కనుక తిరుగుముఖం పట్టాడు. తరువాత దేవతల వద్దకెళ్లి, “ఆ యక్షుడు ఎవరన్నది నేను తెలుసుకోలేకపోయాను” అని తెలియజేశాడు.
3.7, 3.8, 3.9 & 3.10 తరువాత దేవతలు వాయుదేవుని సమీపించి,” ఓ వాయుదేవా ! ఈ యక్షుడు ఎవరన్నది తెలుసుకొని రా” అని చెప్పారు. వాయుదేవుడు, “అలాగే” అంటూ బయలుదేరాడు. దేవతలు చెప్పింది విని వాయుదేవుడు యక్షుని వద్దకు వేగంగా వెళ్లాడు. ఆ యక్షుడు వాయుదేవునితో, “నువ్వు ఎవరవు?” అని అడిగాడు. “నేను వాయువును లేక మాతరిశ్వుడను (ఆకాశంలో సంచరించేవాడను) అని వాయుదేవుడు జవాబిచ్చాడు. “నీలో ఏం శక్తి ఉంది ?” అని యక్షుడు అడిగాడు. అందుకు వాయుదేవుడు, “ఈ భూమండలం మీద ఉన్న దేనినైనా ఎత్తి వేయగలను” అని బదులు పలికాడు. ఆ యక్షుడు వాయుదేవుని ముందు ఒక గడ్డపోచను ఉంచి, “దీనిని కదిలించు” అన్నాడు. వాయుదేవుడు అమితవేగంతో ఆ గడ్డిపోచను సమీపించాడు. కాని అతనికి దానిని ఎత్తివేయడం సాధ్యం కాలేదు. కనుక తిరుగుముఖం పట్టాడు. తరువాత దేవతల వద్దకు వెళ్లి, “ఆ యక్షుడు ఎవరన్నది నేను తెలుసుకోలేకపోయాను” అని తెలియజేశాడు.
3.11 & 3.12 తరువాత దేవతలు ఇంద్రుణ్ణి సమీపించి, “ఓ ఇంద్రా! ఈ యక్షుడు ఎవరన్నది తెలుసుకొని రా” అని చెప్పారు. ఇంద్రుడు, “అలాగే” అని చెప్పి యక్షుని వైపు వేగంగా వెళ్లాడు. కాని అంతలో ఆ యక్షుడు అక్కడనుండి అదృశ్యమైపోయాడు. బంగారు ఆభరణాలు ధరించి అద్భుత సౌందర్యంతో ప్రకాశిస్తూ ప్రత్యక్షమైన ఉమాదేవిని ఆ ఆకాశంలోనే ఇంద్రుడు చూశాడు. అతడు ఆమెను, “ఈ యక్షుడు ఎవరు?” అని అడిగాడు.
Chapter IV
4.1 “ఆతను భగవంతుడు. నిశ్చయంగా ఆయన విజయాన్నే మీరు మీ విజయంగా భావించి ఉప్పొంగిపోయారు” అని దేవి పలికింది. యక్షునిగా సాక్షాత్కరించినది భగవంతుడే అన్న విషయం ఆ తరువాతే ఇంద్రుడు తెలుసుకొన్నాడు.
4.2 అగ్ని, వాయు, ఇంద్రుడు – ఈ దేవతలు తక్కిన దేవతలకన్నా శ్రేష్ఠులు. ఎందుకంటే వీరు భగవంతుని సన్నిహితంగా స్పృశించి ఉన్నారు; ప్రప్రథమంగా ఆయనను తెలుసుకొన్నది వారే.
4.3 కనుక ఇంద్రుడు తక్కిన దేవతలకన్నా శ్రేష్టుడు. ఎందుకంటే అతడు భగవంతుని సన్నిహితంగా స్పృశించి ఉన్నాడు; మొట్టమొదటగా ఆయనను తెలుసుకొన్నాడు.
4.4 భగవంతుని దర్శించిన వివరణ ఇది. ఆహా ! మెరుపు మెరిసేది ఆయనవల్లే ! రెప్పలు ఆర్చడం ఆయనవల్లే, ఆహా ! ఇది ఆయన దివ్యశక్తి.
4.5 ఇక ఆత్మ గురించి పరికిద్దాం. ఆత్మ కారణంగానే మనస్సు బాహ్యప్రపంచాన్ని ఆకాంక్షించి వెళుతున్నట్లుగా ఉంటుంది. వస్తువులను అనుకోవడానికీ, ఊహించడానికీ ఆత్మే కారణం.
4.6 ఆత్మ సకల ప్రాణికోటిలోను నిండి ఉంది. ఆ విధంగానే తెలుసుకోబడుతోంది. సకల జీవరాసులలో నిండి ఉన్నదిగా దానిని ధ్యానించాలి. ఆత్మ సకల జీవరాసులోను నిండి ఉన్నట్లు ఎవరు గ్రహిస్తారో వారిని సకల జీవరాసులు ప్రేమిస్తాయి.
4.7 శిష్యుడు: గురువర్యా ! గుప్త జ్ఞానాన్ని నాకు ఉపదేశించండి. గురువు: ఇంతవరకు గుప్త జ్ఞానాన్నే నీకు చెప్పాను, ఆత్మను ఎలా ధ్యానించాలో నీకు వివరించాను.
4.8 ఆ గుప్త జ్ఞానానికి తపస్సు, ఇంద్రియ నిగ్రహం లాంటి సాధనలు మౌలికంగా ఉన్నవి. వేదాలు దాని అంగాలుగా ఉన్నవి. సత్యమే దాని నివాసస్థానమై ఉంది.
4.9 ఎవరు దీనిని ఈ విధంగా రూఢిగా తెలుసుకొంటాడో అతని పాపాలు పటాపంచలవుతాయి. అంతంలేని మహోన్నతమైన ఆత్మ చైతన్యంలో అతడు నెలకొని ఉంటాడు.