పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥ 44
పూర్వాభ్యాసేన, తేన, ఏవ, హ్రియతే, హి, అవశః, అపి, సః,
జిజ్ఞాసుః, అపి, యోగస్య, శబ్దబ్రహ్మ, అతివర్తతే.
సః = అతడు; అవశః అపి = తన వశం కాకయే, తేన = ఆ; పూర్వాభ్యాసేన ఏవ = పూర్వజన్మలో అభ్యాసంచే, యోగ సాధనచే; హ్రియతే = ఆకర్షించబడతాడు; యోగస్య = యోగస్వరూపాన్ని; జిజ్ఞాసుః అపి = ఎరుగ కోరేవాడు కూడా; శబ్ద బ్రహ్మ = వేదోక్తములైన కర్మలను అనుష్ఠిస్తే కలిగే ఫలాన్ని; అతివర్తతే = అతిక్రమిస్తాడు.
తా ॥ అతడు పూర్వజన్మాభ్యాసం చేత, అప్రయత్నంగానే యోగసాధన వైపుకు ఆకర్షించబడుతున్నాడు. అదీ గాక, యోగస్వరూపాన్ని ఎరుగదలచినవాడు కూడా, వేదోక్తములైన కర్మల ఫలాలను అతిక్రమించి, దానికంటే ఉన్నతమైన (జ్ఞాన) ఫలాన్ని పొంది ముక్తుడవుతున్నాడు. (గీత : 4–33 చూ:)
వ్యాఖ్య: –
పూర్వజన్మలో చేసిన యోగసాధన ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నారు. ఈ జన్మలో మనిషి యోగం గురించి తనకు తానుగా ఏమీ అనుకోకపోయినా, పూర్వజన్మలో చేసుకున్న సంస్కారం (వాసన) బలం వల్ల… యోగం వైపే ఆకర్షితుడవుతాడు, ఆ వైపే లాగబడతాడు. సంస్కారానికి ఎంత బలం ఉందో చూడండి! ఎప్పుడో చేసుకున్న పుణ్యం జీవుడికి ఎలా ఉపయోగపడుతుందో భగవంతుడు ఇక్కడ నిరూపించి చూపించాడు. మనం చేసిన పుణ్యం గానీ, పాపం గానీ తమ పని తాము చేసుకుపోతాయి. పుణ్యం చేస్తే పుణ్యబుద్ధే పుడుతుంది. పాపం చేస్తే పాపపు ఆలోచనలే వస్తాయి. అందుకే కొంతమందికి పుట్టుకతోనే వైరాగ్యం, దేవుడిపై భక్తి, యోగం చేయాలనే ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన కలుగుతుంటాయి. పూర్వజన్మలో గట్టిగా పుణ్యం, యోగాభ్యాసం చేసినవాడు… ఇప్పుడు ఊరికే ఉందామని అనుకున్నా, ఆ పూర్వపు వాసనలు అతన్ని ఊరికే ఉండనివ్వవు. బలవంతంగానైనా సరే అతనితో మంచే చేయిస్తాయి. మళ్ళీ యోగ మార్గంలోకే దించుతాయి. కాబట్టి మంచి కోరుకునే ప్రతి జీవి, తన మనస్సును ఈ జన్మలోనే పుణ్య కార్యాలతో, ఆధ్యాత్మిక సంస్కారంతో, యోగసాధనతో నింపుకోవాలి.
ఈ శ్లోకం రెండో పాదంలో భగవంతుడు యోగం యొక్క గొప్పతనాన్ని నిరూపించారు. యోగం గురించి (జీవుడు, దేవుడు ఒక్కటే అనే తత్త్వం గురించి) తెలుసుకోవాలనే ఆసక్తి మనిషిలో కలిగితే చాలు… అతడు ‘శబ్దబ్రహ్మము’ను అంటే వేదాల్లో చెప్పిన కర్మకాండల ఫలితాన్ని లేదా శాస్త్రాలు చదవడం వల్ల వచ్చే పరోక్ష జ్ఞానాన్ని దాటిపోతాడని చెప్పారు. దీనిని బట్టి ఆత్మధ్యానం అనే యోగానికి ఎంత శక్తి ఉందో అర్థమవుతోంది. అసలు యోగం గురించి తెలుసుకోవాలనే చిన్న ఆలోచనతోనే మనిషి అంత గొప్ప ఫలితాన్ని దాటేస్తున్నప్పుడు… ఇక ఆ యోగాన్ని నిజంగా ఆచరిస్తే ఇంకెంత గొప్ప ఫలితం దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
సమయం రాత్రి తొమ్మిదిన్నర గంటలు అవుతోంది. డాక్టరు ఆరు గంటల నుండి ఇక్కడే కూర్చుని ఉన్నాడు.
గిరీశ్ (డాక్టరుతో): అది సరే కాని, మహాశయా! మీక్కూడా అలా అవుతుంటుందా? ఇక్కడకు రావద్దనుకున్నా సరే ఏదో అదృశ్యశక్తి మిమ్మల్ని లాగుతున్నట్లు అనిపించదా? నాకు మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)