ఒక రోజు మాతృదేవి ఛాయాచిత్రం (15 x 12) ఒకటి తెచ్చారు. అది ఎలా ఉందని తెలుసుకోవడానికి మాతృదేవికి ఇచ్చారు. రెండు చేతులూ చాపి మాతృదేవి దానిని తీసుకుని భయభక్తులతో తమ తల మీద ఉంచుకున్నారు, ఈ దృశ్యం చూసి అందరూ నవ్వారు. ఛాయాచిత్రాన్ని తిరిగి ఇచ్చాక ఒక భక్తురాలు మాతృదేవిని ఇలా అడిగింది:
భక్తురాలు: అమ్మా! అది ఎవరి ఛాయాచిత్రం?
మాతృదేవి: ఏమిటి? నాదే!
ఈ జవాబు విని ఆ భక్తురాలు మళ్లీ నవ్వసాగింది.
మాతృదేవి: ఎందుకు నవ్వుతున్నావు?
భక్తురాలు: అది మీ ఛాయాచిత్రమయినప్పుడు ఎందుకు తల మీద ఉంచు కొన్నారు?
ఆ ప్రశ్న విని మాతృదేవి కూడా నవ్వి, “ఎందుకా? ఇందులోనూ గురుదేవులే కదా ఉంటున్నారు” అన్నారు.
* * *
గురుదేవుల పూజ ముగించుకొని మాతృదేవి అంతర్ముఖులై కూర్చొనివున్నారు. ఒక కొత్త బ్రహ్మచారి ఆమె పక్కన ఉన్నాడు. ఆయనతో మాతృదేవి మాట్లాడసాగారు:
మాతృదేవి: నువ్వు గురుదేవులను శ్యాంపుకూరులో చూశావు కదా!
బ్రహ్మచారి: అవును. అప్పుడు నాకు ఐదేళ్లు. పొరుగింటి స్త్రీలందరూ గురుదేవులను దర్శించడానికి వెళ్లారు. మా అమ్మ కూడా నన్ను చంక నెత్తుకొని వెళ్లింది. అది సరే, ఈ విషయం మీ కెలా తెలుసు?
మాతృదేవి: ఉట్టి నుండి లడ్డూ తీసి నీకు ఇవ్వమని గురుదేవులు సైగ చేశారు కదా! అప్పుడు నీకు లడ్డు ఇచ్చింది ఎవరో జ్ఞాపకముందా?
బ్రహ్మచారి: అవును, ఒక ఆవిడ తీసుకువచ్చి ఇచ్చారు.
మాతృదేవి: ఆవిడను నేనే!
బ్రహ్మచారి: మీరా!
బ్రహ్మచారి ఆశ్చర్యపోయాడు.
మాతృదేవి: మరొకసారి కూడా నువ్వు ఆయనను దర్శించావు. అవునా?
బ్రహ్మచారి: అవును! అది గురుదేవుల మహాసమాధికి చాలా రోజుల తరువాత పూరీ దేవాలయంలో!
మాతృదేవి: నువ్వు చేతులు చాపి ఆయనను పిలిచావు.
బ్రహ్మచారి: ఆయన నన్ను పిలిచారు, నేనూ ఆయనను పిలిచాను.
మాతృదేవి: పిల్లవాడికి దైవదర్శనం కలిగిందని దేవాలయంలో పెద్ద కోలా హలం చెలరేగింది.
బ్రహ్మచారి: ఇవన్నీ మీకు ఎలా తెలుసు?
మాతృదేవి: అక్కడా నేను ఉన్నాను.
బ్రహ్మచారి అయోమయ స్థితిలో మాతృదేవి పాదపద్మాలపై పడిపోవనున్నప్పుడు మాతృదేవి అతణ్ణి ఊరడించి మంత్రదీక్ష ప్రసాదించారు. చుబుకాన్ని స్పృశించి ఆశీర్వదించారు.
* * *
చైతన్య లీల అనే నాటకాన్ని చూడడానికి వెళ్లారు మాతృదేవి. దాని గురించి మర్నాడు ఇలా అన్నారు:
“ఆ స్త్రీ ఎంత సహజంగా నటించింది. గొప్ప భక్తురాలై ఉండివుండాలి. లేకపోతే ఇలా నటించలేదు. అలాగే ఆమె చైతన్యునిగా మారిపోయిందనే చెప్పాలి. ఒక స్త్రీ పురుషునిగా నటించినట్లు చెప్పగలమా?”
తరువాత ఆ నాటకంలో నటించిన జగాయ్, మధాయ్లను గూర్చి ఇలా అన్నారు: “వారిలాంటి భక్తులు ఎవరున్నారు? రావణుని లాంటి భక్తుడెవడున్నాడు? హిరణ్యకశిపుని లాంటి భక్తుడెవడున్నాడు? గిరీష్బాబు గురుదేవులను ఎంతగా తూలనాడేవాడు! అయినా ఆయన లాంటి భక్తుడు ఎవరున్నారు? వారు జన్మతః భక్తులు. భక్తుడిగా ఉండడం సామాన్యమైన విషయమా ఏమిటి? భక్తి ఊరకే వచ్చే స్తుందా? (లక్ష్మి వైపు తిరిగి) లక్ష్మీ! అదేం పాట – నేను ముక్తి నిచ్చినా ఇస్తాను….?”
లక్ష్ష్మి ఆ పాటను రాగయుక్తంగా పాడింది:
నేను ముక్తి ఇవ్వడానికి వెనుకాడను
కానీ భక్తి నివ్వడానికి వెనుకాడతాను.
* * *
పొరుగు ఇంట్లోని ఒక స్త్రీ రోజూ మాతృదేవి వద్దకు వచ్చేది. మధ్య వయస్కురాలైన ఆమె ఒక వితంతువు. ఒక రోజు మధ్యాహ్నం వచ్చి మాతృదేవితో తనకుటుంబ సమస్యల నన్నిటినీ ఏకరువుపెట్టింది. “ఏం చేయనమ్మా! కుటుంబం వదలిపెట్టి వెళ్లగలనా ఏమిటి? మీ విషయమే తీసుకోండి. మీరు రాధూను వదలుకోగలరా? వదలి మీరు జీవించగలరా!”
మాతృదేవి ముఖారవిందాన చిరునవ్వు తళుక్కుమంది. ఆమె నవ్వుతూనే, “నావిషయం వదిలిపెట్టు” అన్నారు. మాతృదేవి చిరునమ్వా, ఆమె జవాబు అక్కడ ఉన్నవారిలో ఒక కొత్త బాధను కలిగించింది. ఆ సమయంలో ఎవరూ ఏమీ ప్రస్తావించలేదు. రాత్రి భోజనానంతరం ఈ విషయం ప్రస్తావించినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“వారికి ఏం అర్థమవుతుంది? రాధూను నేను వదలుకోలేనని చెబుతున్నది.పుట్టినింటిని చూచుకోవాలి కదా! అందుకే తల్లితండ్రులు, సోదరీ సోదరులు, భార్య అంటూ ప్రత్యేకించి ప్రతి ఒక్కటీ చేయవలసివుంది! ఎవరికీ ఋణపడకూడదు!లేకపోతే ఈ రాధూ, ఈమె, ఆమె వీళ్లందరూ నా కెవరు? స్వయంగా గురుదేవులే తమ తల్లికి సేవ చేయలేదా! రాంలాల్కు కాళికాలయంలో పని ఇప్పించ లేదా?” (BG 3.19)
ఒక భక్తురాలు: అలా అయితే నిజంగా మీరు ఎవరిని మీ సొంతంగా భావిస్తారు?
మాతృదేవి: కథామృతంలో “అంతరంగ భక్తులు” అని నువ్వు చదవలేదా? గురుదేవులకు గాని, నాకు గాని నిజమైన సొంతం – భక్తులూ, భక్తురాండ్రే!
భక్తురాలు: అదెలాగమ్మా?
మాతృదేవి: ఏం? అర్థంకాలేదా? (భక్తురాలి హృదయం చూపిస్తూ) ఇక్కడ ఉంటున్నది ఎవరు?
భక్తురాలు: మీరు.
మాతృదేవి: (తమ హృదయం చూపిస్తూ) ఇక్కడ ఉంటున్నది మీరు. ఇదొకరకమైన ఆకర్షణ. కానీ దీన్లో మాయ లేదు. ఈ ఆకర్షణ వల్లనే పదేపదే వచ్చి పోవాల్సి వుంది. అర్థమయిందా?’ (BG 9.29)
భక్తురాలు: అవునమ్మా.
మాతృదేవి: ఇక వెళ్లు! వెళ్లి నిద్రపో! వ్రాసివుంచుకుంటావు కదా!
భక్తురాలు: ఇదిగో! వెళ్లగానే వ్రాసుకుంటాను.
మాతృదేవి: ప్రపంచంలో వేరెవరూ నీకు సొంతమయిన వారు లేరని ఒక రోజు నీకు తెలిసివస్తుంది. నిజానికి ఈ ఆకర్షణ ఏమిటో అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది.
* * *
కుటుంబ గొడవలు కూడా మాతృదేవి దృష్టికి వచ్చేవి. ఆమె కూడా ఎంతో ఓర్పుతో మాట్లాడి రాజీచేసేవారు. ఒకసారి గురుదేవుల శిష్యుడు ఒకాయన, ఆతడి భార్యా ఇలా వచ్చారు. వారు వృద్ధ దంపతులు. వారు చెప్పిందంతా విని మాతృదేవి ఆ భక్తునితో ఇలా అన్నారు:
‘ఈ వయస్సులో ఇవన్నీ బాగున్నాయా ఏమిటి? కుమారుడు కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ రోజో రేపో పెళ్లిచేసుకునే వయస్సు వచ్చేసింది. కోడలు ఇంటికి వచ్చి ఇదంతా చూసిన తరువాత మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటారా ఏమిటి? ఇకపై ఇలా జరగకూడదు – నేను చెబుతున్నాను, అర్థమయిదా?”
“సరేనమ్మా! ఇకపై ఇలా జరుగదు” అన్నాడు ఆ భక్తుడు. మాతృదేవి మళ్లీ అన్నారు:
“భార్య ఇంటి మహాలక్ష్మి. ఆమె మనస్సు ఏ విధంగాను నొచ్చుకోని విధంగా ప్రవర్తించాలి. ఆమె తన స్వార్థం కోసమా అన్నీ చేస్తుంది? నీ భార్య కాస్త ఉదార గుణం గలది. అంతే! అందువలన ముప్పేం వచ్చిపడింది? అంతా భక్తుల కుటుంబమే కదా! ఆమెను బాగా చూసుకోండి.”
భార్యాభర్తలు వెళ్లిపోయారు. ఆ తరువాత వారి ఇంట్లో ఎలాంటి గొడవా తలెత్తలేదు.
* * *
లలిత ఛటోపాధ్యాయ అనే వ్యక్తిని గురించి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి అనుగ్రహం పొంది కూడా అతడు తాగుడు అలవాటు మానుకోలేకపోయాడు. కానీ మాతృదేవి పట్ల ఆతడు ఎంతో భక్తిప్రపత్తులు కలిగివుండేవాడు. అతణ్ణి గూర్చి మాట్లాడుతున్నప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“రాట్నంలో పలు రంగుల నూలుపోగులను చుట్టివుంచుతాము. మొదట ఎరుపురంగు, తర్వాత నీలం, ఇలా వరుసగా గుండ్రంగా తిరగేలా అనుకుందాము. వాటిని మళ్లీ బయటికి విప్పినప్పుడు అదే వరుసక్రమంలో బయటికి వస్తాయి. కానీ రెండింటికీ వ్యత్యాసం వుంది. మొదట చుట్టేప్పుడు అల్లుకుపోతాయి. రెండవ సారి చుట్టేటప్పుడు ఆ అల్లిక నుండి విడిపోతాయి. కానీ చూడడానికి ఒకేలా ఉంటుంది.”
* * *
భక్తురాలు: అమ్మా! నేను ప్రప్రథమంగా గురుదేవులను దర్శించినప్పుడు ఆయన శరీరం దివ్యకాంతులను వెదజల్లడం కనిపించింది. ఒక అద్దం మీద సూర్యకిరణాలు పడితే ఎలా కాంతిపుంజాలు వెలువడతాయో అలాంటి కాంతి అది!
మాతృదేవి: నిజమే అమ్మాయీ! నువ్వు చూసింది నిజమే. ఆయన శరీరానికి నూనె రాసినప్పుడు కొన్ని సమయాల్లో నేను కూడా అలాంటి కాంతిని చూశాను.
* * *
మంత్రదీక్ష పుచ్చుకొన్న భక్తుడొకడు మఠంలోని ఒక సాధువుతో వాదన చేస్తున్నాడు. అది విన్న మాతృదేవి ఇలా అన్నారు:
“ప్రతి వ్యక్తి మూడు విషయాలలో జాగ్రత్త వహించాలి. 1. నదీతీరంలో వుంటున్న ఇల్లు: ఏ సమయంలో నైనా వరదలు వచ్చి కొట్టుకుపోవచ్చు. 2. పాము: పామును చూడగానే జాగ్రత్తపడాలి. అదేమి చేస్తుందో, ఎవరిని కాటువేస్తుందో తెలియదు. 3. సాధువు: సాధువు అనే ఒక్క మాట, అంతెందుకు చేసే ఒక్క ఆలోచన కూడా మీకు హాని కలిగించవచ్చు. ఇది మీకు అర్థం కాదు. వారిని చూసిన వెంటనే ప్రణమిల్లాలి. మాటలతో వారిని అవమానించరాదు.”
* * *
కాశీలో ఒక రోజు మాతృదేవి జన్మదినోత్సవం జరుపుకోబడింది. ఆ రోజు కేశవానంద స్వామి తల్లి వచ్చారు. ఎవరో దగ్గరి బంధువు మరణాన్ని తలచుకొని ఆమె విలపిస్తున్నారు. అది చూసిన మాతృదేవి, “ఛీ! ఈ రోజు ఎవరైనా ఏడుస్తారా? ఈ రోజు ఆనందమైన పండుగ రోజు కదా!” అన్నారు.
* * *
ఒక రోజు ఒక స్త్రీ, మాతృదేవిని సమీపించి, “అమ్మా! మాకు మార్గాంతర మేది?” అని అడిగింది. ఈ ప్రశ్న మాతృదేవికి విసుగు పుట్టించింది. కాస్త కటువుగా, “మీకేం మార్గం? ప్రతి ఏడాదీ తప్పకుండా పిల్లలను కంటూవుంటారు. కించిత్తు నిగ్రహం కూడా లేదు. నా వద్దకు వచ్చి, “మార్గమేమిటి?’ అని అడిగితే మాత్రం సరిపోతుందా ఏమిటి?” అని అడిగారు.
* * *
ఒకసారి రాధూకు ఆరోగ్యం బాగా లేదు. ఆమెకు ఒక తాయెత్తు కట్టడంతో పాటు ఏదో ఒక దైవానికి మొక్కుకొని కొంత డబ్బు కూడా కేటాయించారు. అది ఎంతో ఆశ్చర్యం కలుగజేయడంతో ఒక భక్తురాలు మాతృదేవిని, “అమ్మా! ఇదేమిటి! మీరెందుకు ఇలా చేయాలి? మీ సంకల్పం మేరకే కదా అన్నీ జరుగుతున్నాయి?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “వ్యాధులు వచ్చినప్పుడు ఇలా దైవాలను మొక్కు కోవడం వలన పెద్ద ఆపదలు నివారింపబడతాయి. అంతేగాక, చెందిన దానిని చెందిన వారికి ఇచ్చి తీరాలి కదా?” అన్నారు.
* * *
మాణిక్ తలా అనే చోట ఒక భక్తుని ఇంట గౌరీమాకు ఒకసారి అమ్మ వారు సోకి పడకబెట్టింది. అది అంటువ్యాధి అని తెలిసి కూడా ఖాతరుచేయక ఆ భక్తుని తల్లీ, ఇతరులూ ఆమెకు చాలా సేవలు చేశారు. ఆ విషయం విన్న మాతృదేవి, “ఆ తల్లి ఈ జన్మలోనే ముక్తిని పొందుతుంది. గౌరీ వ్యాధి సమయంలో, ఆమె కోసం ఒక దీపాన్ని వెలిగించిన వారు కూడా ముక్తిని పొందుతారు” అన్నారు.
* * *
బాగా మనస్సు నొచ్చుకొన్న ఒక సాధువు వ్రాసిన ఉత్తరం చూసి మాతృదేవి ఇలా స్పందించారు:
“ఇవేం మాటలు నాయనా! గురుదేవుల దివ్యనామం సామాన్యమైనదా? అదెలా వ్యర్థమవుతుంది? ప్రతిఫలం ప్రసాదించకపోదు. గురుదేవులను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చే వారందరికీ భగవత్సాక్షాత్కారం తప్పక లభిస్తుంది; మరణ సమయంలో నైనా తప్పక లభిస్తుంది.”
* * *
ఒక భక్తుడు తన మానసిక సమస్యలతో అతలాకుతలమయ్యాడు. గురుదేవులూ మాతృదేవీ ఉండి కూడా తనకు ఏమీ చేయలేదనుకొన్నాడు. అందువలన ఇకపై మాతృదేవి వద్దకు వెళ్లరాదని నిశ్చయించుకున్నాడు. కానీ స్నేహితుల ప్రేరణతో ఒక రోజు ఉద్బోధన్కు వెళ్లాడు. ఆతడు వెళ్లినప్పుడు అనేకమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. ఒకొక్కరుగా వెళ్లి ప్రణమిల్లారు. మాతృదేవి ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ భక్తుడు ప్రణమిల్లిన వెంటనే, “ఏం నాయనా! ఎలావున్నావు?” అని ఆప్యాయంగా పలకరించారు. మాతృప్రేమతో పులకరించిపోయిన భక్తుడు. “బాగున్నానమ్మా” అని జవాబిచ్చాడు. మాతృదేవి మృదువుగా నవ్వుకుంటూ, “అది ఎలా నాయనా? మనస్సు స్వభావమే అంతకదా! అలాగని ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా?” అని అడిగారు.
ఆ భక్తుడు న్యాయశాస్త్రం చదువుతున్నాడు. ఒక రోజు మాతృదేవికి ప్రణమిల్లి “అమ్మా! నా మనస్సు ఇలాంటి స్థితిలో వుంది. అందుకు తోడు వకీలు పనికి వెళుతున్నాను. నా తలవ్రాత ఏమవుతుందో తెలియరావడం లేదు” అన్నాడు. అందుకు మాతృదేవి, “ఎందుకు భయపడాలి? నాయనా! అది ఒక వృత్తి, అంతేకదా!” అన్నారు.
* * *
మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకున్న కొద్ది రోజులలోనే లాల్మోహన్ (స్వామి కపిలేశ్వరానంద) మనస్సులో ఒక సంశయం తలెత్తింది. ‘ఎంత పనిచేశాను! ఒక స్త్రీ వద్ద మంత్రదీక్ష పుచ్చుకొన్నాను కదా!’ అన్న భావన ఆయనను బాధపెట్ట సాగింది. అది క్రమంగా ఒక ఘర్షణగా మారిపోయింది. చివరకు ‘ఇంకా ఒక్క రోజు వేచి చూస్తాను. గురుదేవులు దారి చూపకపోతే ఈ మంత్రాన్ని జపించడం మానేస్తాను’ అని గట్టిగా తీర్మానించుకున్నాడు.
మరుసటి రోజు ఉద్బోధన్లో పాలు ఇచ్చి రావడానికి ప్రేమానందస్వామి లాల్మోహన్ను పంపారు. పాలను అంతజేసి మాతృదేవికి ప్రణమిల్లాడు లాల్ మోహన్. ప్రణమిల్లి లేవగానే ఆతనితో, “ఇదిగో చూడు! నీకు మంత్రం ప్రసాదించింది నేను కాదు, గురుదేవులే నీకు మంత్రం ప్రసాదించారు” అన్నారు మాతృదేవి.
కొన్ని రోజులు అంతా సవ్యంగానే గడిచినట్లు అనిపించింది, కానీ మళ్లీ అదే ఘర్షణ తలెత్తింది. మళ్లీ లాల్ మోహన్ ఇలా, తనలో తాను తీర్మానించు కొన్నాడు: “హరేన్ బాబు నా వద్దకు వచ్చి, ‘మాతృదేవి నుండి నాకు శక్తి లభించింది’ అని చెప్పాడంటే మాతృదేవి నాకు చెప్పిన దానిని అంగీకరిస్తాను.” కొన్ని రోజులలో శ్రీరామకృష్ణుల జయంతి ఉత్సవం జరిగింది. అప్పుడు హరేన్ అతడి వద్దకు వచ్చి అతను అనుకున్నట్లే చెప్పాడు. లాల్మోహన్ సంశయం తీరిపోయింది.
* * *
ఏదో కారణంగా ఉద్బోధన్లోని ఒక వంట మనిషిని పని నుండి తొల గించాల్సి వచ్చింది. వెంటనే ఆతణ్ణి తొలగిస్తే మాతృదేవి సేవకు భంగం కలుగు తుందని ఎంచి, అతణ్ణి నిలిపివేయడానికి అక్కడి ప్రధాన స్వామి తటపటాయించారు. ఈ విషయం మాతృదేవికి తెలిసినప్పుడు ఆమె ఇలా అన్నారు:
“మీరందరూ సాధువులు కదా! అన్నిటినీ వదలుకోవడమే మీ లక్ష్యం. ఇప్పుడు ఒక వంట మనిషిని వదలుకోలేరా?”
* * *
బేలూరు మఠంలోని సాధువు ఒకరు ఒక పనిమనిషిని కొట్టాడు. ఆ సంఘటన గురించి విన్న మాతృదేవి ఇలా వ్యాఖ్యానించారు:
“వారందరూ సాధువులు. న్యాయంగా చూస్తే వారందరూ చెట్ల క్రింద నివ సించాలి. కానీ ఇప్పుడో పెద్ద పెద్ద మఠాలూ, భవనాలూ, పనిమనుషులూ అన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు పనిమనిషిని కొట్టేదాకా కూడా వెళ్లిపోయారు.”
* * *
హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోగోరిన ఒక సాధువు మాతృదేవిని అనుమతి కోసం ప్రాథేయపడ్డప్పుడు ఆమె ఇలా అన్నారు: “ఇది ఆశ్వయుజ మాసం. యమధర్మరాజు తన నాలుగు తలుపులనూ తెరచి ఉంచేకాలం. ఇప్పుడు నువ్వు యాత్ర చేయడానికి నీ తల్లినైన నన్ను ఎలా అనుమతించమంటావు?”
* * *
ఒక సాధువు తల్లి, మాతృదేవికి ప్రణమిల్లి. తన కుమారుడు ఇంటికి తిరిగి వెళ్లిపోయేలా అతనికి నచ్చచెప్పమని కోరింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“ఒక సాధువును కడుపులో మోయడం గొప్ప భాగ్యం. ఒక ఇత్తడి చెంబు పట్లగల మోహాన్ని కూడా లోకులు వదలుకోలేరు. ఇక ఈ ప్రపంచాన్నే త్యాగం చేయడమన్నది సామాన్యమైన విషయమా ఏమిటి? మీరు అతడి తల్లి, మీరెందుకు కలత చెందుతారు? ఆతడు సాధువుగా ఉన్నప్పటికీ మీకు కావాల్సిందంతా చేసి పెడతాడు.”
* * *
గురుదేవులను గురించి మాతృదేవి ఇలా అన్నారు:
“నిజంగా ఆయన భగవంతుడే, ప్రాణులు పడుతున్న అగచాట్లు చూసి పరమ కారుణ్యంతో దిగి వచ్చారు – మహారాజు మారువేషంలో నగర సంచారం చేస్తాడు కదా! అలాగన్నమాట. ఏదో కొంత వ్యక్తం కాగానే కనుమరుగయ్యారు.”
* * *
సాధనలను గురించి ఒక సాధువుతో మాతృదేవి ఇలా అన్నారు:
“ఉదయమూ, సాయంత్రమూ తప్పకుండా కూర్చోవాలి, జపధ్యానాదులు అనుష్ఠించేటప్పుడు మెదడు చల్లగా వుండాలి, ధ్యానం చేయడం కంటే నేలను దున్నడం ఎంతో సులభం. (గురుదేవుల ఛాయాచిత్రాన్ని చూసి) ఆయన కృపాకటాక్షం లేకపోతే ఏమీ జరగదు.
సాధువు: కొన్ని సమయాల్లో పనుల ఒత్తిడి వలన జపధ్యానాలకు ఆటంకం కలుగుతోంది.
మాతృదేవి: పనులా? ఎవరి పనులవి? అవన్నీ ఆయన పనులే కదా! కాల క్రమంలో నీ మనస్సే గురువుగా మార్గదర్శి అవుతుంది.
* * *
ఒక అందమైన యువతితో మాతృదేవి ఇలా అన్నారు: “ఇదుగో చూడమ్మా! శరీరం మరుగుపరుస్తూ దుస్తులు ధరించాలి. బయటికి వెళ్లేటప్పుడు సదా దుస్తులతో శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి.”
* * *
ఒకరోజు ఒక భక్తురాలు తన బంధువులు కొందరితో మాతృదేవి దర్శనార్థం వెళ్లింది. మధ్యాహ్నం మాతృదేవితోపాటు కూర్చుని ప్రసాదం కూడా తీసుకున్నారు. స్త్రీలందరూ మాతృదేవితో కలిసి ఒక గదిలోనూ, పురుషులందరూ మరో గదిలోనూ భోజనం చేశారు. భోజనానంతరం ఆ భక్తురాలి ఇంటికి ఒక పాత్రలో కొద్దిగా ప్రసాదం పంపించమని ఒక వ్యక్తికి మాతృదేవి పురమాయించారు. ఆమె రావడానికి కాస్త ఆలస్యమయ్యేసరికి మాతృదేవి తామే లేచారు. వెంటనే యోగిన్ మా, “అమ్మా! మీ రెందుకు లేస్తున్నారు? పాత్ర కోసం వెతికి, కడిగి తీసుకురావాలి కదా! అందుకే ఆలస్యమవుతోంది!” అన్నది. తర్వాత కొద్దిగా నవ్వి, “పుట్టింటి నుండి కట్నంగా బండ్లకొద్దీ పాత్రలు వచ్చాయి కదా! అందువలననే అందరికీ పాత్రల్లో ప్రసాదం పంపాలని అనుకుంటున్నారేమో!” అన్నారు. అప్పుడు మాతృదేవి కూడా నవ్వి, “ఇంట్లోని పిల్లలు కూడా ప్రసాదం తీసుకోవాలి కదా! అందుకోసమే!” అన్నారు. “మీ గురించి మాకు తెలియదా! సాధ్యమయితే ప్రపంచంలోని అందరినీ కూర్చోబెట్టి భోజనం పెడతారు. మీరు కూర్చోండి. నేను వెళ్లి చూసివస్తాను” అంటూ లేచివెళ్లారు యోగీన్ మా. ఒక పాత్రలో ప్రసాదం తీసుకువచ్చి ఆ భక్తురా లికి అందివ్వగానే మాతృదేవి ముఖంలో ఏం ఆనందమూ, తృప్తీ ద్యోతకమయ్యాయో!
* * *
ఒక వితంతువుకు దీక్షను ప్రసాదించి మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదిగో చూడమ్మా! సామాన్యంగా యువ వితంతువులకు నేను మంత్రదీక్ష ఇవ్వను. కానీ నువ్వు మంచిదానవనిపించి నీకిచ్చాను. నేను కలత చెందేటట్లుగా ఏదీ చేయకు. శిష్యురాలి పాపం గురువును చుట్టుకుంటుంది. గడియారంలోని ముల్లు నిలవకుండా నడుస్తూవున్నట్లు నిరంతరం జపం చేస్తూవుండు.”
* * *
అత్తగారింటికి వెళ్లనున్న ఒక భక్తురాలికి మాతృదేవి ఇలా చెప్పారు:
“ఎవరితోనూ చనువుగా మెలగవద్దు. ఎవరి సమస్యలలోనూ తలదూర్చకు. ‘మరొక ఇంటికోసం వ్యర్థంగా ఎందుకు వెదకుతావు? ఎలాంటి మార్పూ లేకుండా నీ ఇంట్లోనే ఉండు మనసా’ అనే పాటను నువ్వు వినలేదా! గురుదేవులకు కొబ్బరి లడ్డూలు చాలా ఇష్టం. ఊరికి వెళ్లాక వాటిని తయారుచేసి ఆయనకు నివేదనం చేయి. జపధ్యానాలు ఎక్కువ చేయి. గురుదేవుల గురించిన పుస్తకాలన్నిటినీ చదువు.”
మాతృదేవి ఒక వితంతువుతో ఇలా అన్నారు:
“ఇదిగో చూడమ్మా! పురుషులను ఎన్నడూ నమ్మవద్దు, సొంత తండ్రి, సోదరుడైనా సరే నమ్మవద్దు; ఇక ఇతర పురుషులను గురించి ప్రత్యేకంగా చెప్పాలా! అంతెందుకు? సాక్షాత్తూ భగవంతుడే నీ ముందు పురుష రూపంలో ప్రత్యక్షమయినా ఆయనను కూడా విశ్వసించకు!”
* * *
సాధువులు నివసిస్తున్న మఠానికి స్త్రీలు ఎక్కువగా వెళ్లరాదనేవారు మాతృదేవి. “ఇదిగో చూడండి! మీరు మంచి మనస్సుతో, భక్తి భావంతోనే వెళతారు. కానీ మీరువెళ్లడం వలన బహుశా ఆ సాధువు పవిత్రతకు భంగం కలుగవచ్చు. అలా జరిగితే అది మీకు పాపంగా పరిణమిస్తుంది.”
* * *
ఏసమయంలోనైనా, ఎలాంటి వారితోనైనా తీర్థయాత్రకు వెళ్లడాన్ని మాతృదేవి ఆమోదించరు. ఆమె ఇలా అన్నారు: “చేతిలో నాలుగు పైసలుంటే పది ఇరవై మంది బీదవారికి భోజనంపెట్టు. (ప్రక్కనున్న ఒక భక్తురాలిని చూపిస్తూ) ఈమెను చూడు!తీర్థయాత్రకు వెళ్లి, మోసపోయి తిరిగివచ్చింది.
తీర్థయాత్ర దుఃఖయాత్ర
మనస్సుకూడా చంచలపడుతుంది
మనస్సు మాత్రం నీ వశంలోవుంటే
తీర్థస్థలంకంటే నీ ఇంట్లో
అధికపుణ్యం పొందవచ్చు.
అనే పాట నువ్వు వినలేదా!”
* * *
ఒక రోజు నలుగురైదుగురు స్త్రీలు ఒక ఫలానా స్త్రీని గురించి విమర్శిస్తున్నారు. అది విన్న మాతృదేవి ఒక భక్తురాలితో, “వారందరూ ఏమన్నా మాట్లాడుకోనీ. కాని నువ్వు ఆమెపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, ఆమె మూలంగానే కదా నువ్వు ఇక్కడికి రాగలిగావు” అని చెప్పారు.
* * *
మాతృదేవి వద్ద ఒక వ్యక్తి మంత్రదీక్ష తీసుకున్నప్పుడు కులగురువు ఆ భక్తుణ్ణి శపించాడు. ఈ విషయం మాతృదేవికి తెలియజేశాడు ఆ భక్తుడు. “నువ్వు భయపడ వద్దు. గురుదేవులను శరణుజొచ్చిన వారిని ఏ శాపమూ ఏమీ చేయదు? అంటూ జవాబు వ్రాశారు మాతృదేవి.
* * *
వృద్ధురాలైన ఒక భక్తురాలు ఒకసారి, “ప్రస్తుతం మఠం (బేలూరు మఠం) అంతా కేవలం నామమాత్రమే. లోపల ఏమీలేదు” అని అంది. ఈ విషయం మాతృ దేవికి తెలియజేసినప్పుడు ఆమె విస్తుపోయారు. “ధర్మమూ, ఆధ్యాత్మికతా అంటూ ఏదైనా ఉంటే, అది ఇక్కడే మఠంలోనే ఉంది” అన్నారు మాతృదేవి.
* * *
విద్యార్థి* : అమ్మా! ఎన్నిసార్లు జపం చేయాలి? – వేయి, పదివేలు, లేకపోతే అంతకన్నా ఎక్కువగానా?
మాతృదేవి: మీరందరూ విద్యార్థులు. ఎన్నో పాఠాలు చదువుకోవాలి, పరీక్షలు వ్రాయాలి. అందువలన మీరు ఎక్కువగా జపం చేయలేరు. ఆ తరువాత సమయం దొరికినప్పుడు అంచెలంచెలుగా జప సంఖ్యను పెంచవచ్చు. ‘రామకృష్ణ నామాన్ని పదిసార్లు జపిస్తేనే చాలు. అదే గొప్ప విషయం!’ అంటూ గురుదేవులే నాతో అన్నారు. లోక శ్రేయస్సుకోసం గురుదేవులు స్వయంగా కఠోరతపస్సుచేసి లోకంలో చైతన్యాన్ని జాగృతి చేశారు. ఆంతరిక భావన, వ్యాకులత, నూతనోత్సాహం, ప్రగాఢ ప్రేమలతో సాధనలు చేస్తే, ప్రస్తుతం స్వల్ప ప్రయత్నంతోనే విజయం ప్రాప్తిస్తుంది.
* * *
జయరాంబాటిలో ఎక్కువమంది భక్తులు ఉండరు. అందువలన మాతృదేవిని దర్శించుకోవడం సులభమని నేనూ* నా స్నేహితుడూ అక్కడికి వెళ్లాం. మేమిద్దరం బ్రహ్మానందస్వామి వద్ద మంత్రదీక్ష తీసుకొన్నాం. మేము అక్కడికి వెళ్లే విషయం ముందుగానే తెలుపాలని ఎందుకో అనిపించలేదు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అది అవసరం లేదని తెలుసుకున్నాం. మాతృదేవికి ఈ విషయం తెలుసు. మేము రావటానికి మునుపే అక్కడున్న వారితో, “ఈ రోజు రాఖాల్ శిష్యులు ఇద్దరు వస్తారు. వారు బసచేయడానికి తగిన ఏర్పాట్లు చేయండి” అని చెప్పారు. మేం అక్కడికి వెళ్లేసరికి భోజనాల సమయం దాటిపోయినప్పటికీ, మా కోసం విడిగా భోజనం తీసిపెట్టారు. మాకు భోజనం వడ్డించి, మేం తినేదాకా మా పక్కనే కూర్చున్నారు మాతృదేవి. మేము కూడా అన్నం తింటూ ఆమెతో మాట్లాడసాగాం.
భోజనం చేసిన తర్వాత విస్తరాకులను తీసివేయబోయాను.
మాతృదేవి: ఓహ్! ఏం చేస్తున్నారు?
నేను: విస్తరాకులను తీసేస్తున్నాం. ఇక్కడే ఉంచలేం కదా!
మాతృదేవి: ఇంట్లో అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు?
ఏం చేయాలో మాకు తెలిసిపోయింది. అందువలన లేచి వెళ్లిపోయాం. మాతృదేవి తామే ఆ విస్తళ్లను తీసి, ఆ చోటును శుభ్రం చేశారు.
* * *
భక్తుడు: అమ్మా! భగవదనుభూతి ఎలా సిద్ధిస్తుంది? పూజ, జపం, ధ్యానం వీటివల్ల సకలమూ సిద్ధిస్తుందా?
మాతృదేవి: సిద్ధించదు. దేనివల్లా సిద్ధించదు.
భక్తుడు: దేనివల్లా సిద్ధించదా?
మాతృదేవి: దేనివల్లా సిద్ధించదు.
భక్తుడు: దేనివల్లా సిద్ధించదా?
మాతృదేవి: దేనివల్లా సిద్ధించదు.
భక్తుడు: అలా అయితే ఎలా సిద్ధిస్తుంది?
మాతృదేవి: భగవంతుని కృపాకటాక్షం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. కానీ జపధ్యానాలు చేయాలి. ఈ సాధనల ద్వారా మనస్సు పావన మవుతుంది. పూజ, జపం, ధ్యానం లాంటి సాధనలను చేయాలి. పువ్వులను చేతుల్లో ఉంచుకొంటే సుగంధం వెదజల్లుతుంది. చందనం రాయిపై అరగదీస్తూంటే పరిమళం వెదజల్లు తుంది. అదేలా దివ్యత్వంతో కూడిన విషయాలను గురించి ఆలోచిస్తూవుంటే ఆత్మ చైతన్యం కలుగుతుంది. కోర్కెలన్నీ సమసిపోయిన తక్షణమే భగవదనుభూతి సిద్ధిస్తుంది.
* * *
మాతృదేవి పూజగదిలో కూర్చొనివున్నారు. పూజ పూర్తి అయింది. సాధువు ఒకరు మాతృదేవితో, “అమ్మా! గురుదేవులను మీరు ఎలా చూస్తున్నారు?” అని అడిగాడు. మాతృదేవి కాసేపు మౌనంగా ఉండి తరువాత గంభీరంగా, “చిన్న బిడ్డగా చూస్తున్నాను” అన్నారు.
* * *
మాతృదేవి నిత్య పూజ కోసం నేను ప్రతిరోజూ పుష్పాలు, బిల్వదళాలు, తులసి పత్రాలు మొదలైనవి సేకరించి తీసుకువెళ్లేవాణ్ణి. ఒక రోజు తులసి పత్రాలు తీసుకెళ్లడం మరచిపోయాను. మాతృదేవి ఎంతో కలతచెంది, “తులసీ దళాలు తీసుకురాలేదా! తులసీ దళాలు ఎంత పవిత్రమైనవో నీకు తెలుసా? తులసీ దళాలను దేనిలో ఉంచితే అది పవిత్ర మయిపోతుంది” అన్నారు. ఎంతో బాధపడి వెళ్లి తులసీ దళాలు తీసుకువచ్చాను. ప్రతి రోజూ పూజ పూర్తయిన తరువాత మాతృదేవి తలను నేలకు తాకించి గురుదేవులకు ప్రణామం చేసిన పిదప తీర్థప్రసాదం తీసుకుంటారు. ఒకటి రెండు తులసీ దళాలు, బిల్వ దళాలు నోట్లో వేసుకుంటారు.
* * *
ఆధ్యాత్మిక జీవితాన్ని కారణంగా చూపిస్తూ గృహస్థులు తమ కర్తవ్యాలను ఉదాసీన వైఖరితో నిర్వర్తించడం మాతృదేవికి నచ్చదు. “కుటుంబం భగవంతునికి చెందినది. మనలను ఎక్కడ ఏ పనిలో ఆయన ఉంచారో, ఆ పనిని ఆయనపట్ల విశ్వాసంతో చేతనైనంత చక్కగా చేయడానికి ప్రయత్నించాలి” అంటారు మాతృదేవి. తమ కర్తవ్యాలను సరిగా పాటించనివారు తమ వద్దకు వచ్చినప్పుడు, “భగవంతుడా, భగవంతుడా! కట్టుకున్న బట్టను సరిగ్గా పెట్టుకోవడం తెలియదు. ఆతనికి నా గురించి ఎంత ఆవేదన!” అనేవారు మాతృదేవి.
* * *
తపాలాలో భక్తులు మాతృదేవికి డబ్బు పంపేవారు. తపాలా మనిషి తీసు కొస్తాడు. మాతృదేవి బొటనవ్రేలి ముద్ర వేస్తారు. అందులో ఒకతను, “శ్రీ శారదాదేవి బొటనవ్రేలి ముద్ర” అంటూ వ్రాస్తాడు. డబ్బు లెక్కపెట్టి తపాలా మనిషి ఇస్తాడు. మాతృదేవి ఆ డబ్బును తీసుకుని అలాగే గదిలో ఉంచేసి తపాలా మనిషికి ప్రసాదం ఇచ్చి, ఆతడితో ఆప్యాయంగా మాట్లాడి పంపించేవారు. ఎవరు డబ్బు పంపారు, ఎంత పంపారు అనే వివరాలు ఇతరులెవరికీ తెలియదు. ఆ తరువాత సమయం దొరికినప్పుడు మాతృదేవి డబ్బు పంపిన వారికి ఉత్తరాలు వ్రాస్తారు. ఆశీస్సులను తెలియజేస్తారు. కొన్ని సమయాల్లో సేవకులు ఎవరైనా ఆ డబ్బును తీసుకోవడం జరుగుతుంది. వారు డబ్బు తీసుకొని దానిని నలుగురూ చూసేటట్లు లెక్కిస్తే మాతృదేవి, “నాయనా! డబ్బు లెక్కించేటప్పుడు వచ్చే గలగల చప్పుడు వింటేనే చాలు, బీదవారి మనస్సులో కోర్కెలు జనిస్తాయి. ఇక చూస్తే చాలు, చెక్కబొమ్మ కూడా ‘ఆ’ అంటూ నోరు తెరుస్తుంది. డబ్బు అలాంటిది” అనేవారు. లోపలికి తీసుకెళ్లి లెక్కపెట్టమనేవారు.
* * *
మాతృదేవి బంధువయిన బంకిం అనే యువకుడు చిన్నతనంలోనే సర్వసంగ పరిత్యాగంచేసి ఇల్లు వదలి వెళ్లిపోయాడు. అది విని మాతృదేవి ఇలా అన్నారు:
“సన్న్యాసి అయ్యాడు, మంచిపని చేశాడు. ఎముకలు, మాంసంతో కూడిన ఈ ఒరలో ఏమున్నది? నా విషయమే తీసుకో – వాతం నొప్పులతో ప్రాణాలు పోతున్నాయి. ఈ శరీరంలో ఏముంది? ఎందుకోసం ఇలాంటి మాయలో దొర్లాలి? అన్నీ రెండు రోజులకే కదా! తర్వాత అంతా ముగింపునకు వస్తుంది. శరీ రాన్ని దహనం చేశాక మిగిలేది ఒక పిడికెడు బూడిద మాత్రమే! ఈ శరీరం ఒక పిడికెడు బూడిద కాకుండా మరేమిటి? బంకిం సాధువయ్యాడు, భగవంతుని బాటలో పయనిస్తున్నాడు. మంచిపనే చేశాడు. మంచిపనే చేశాడు.”
* * *
ఒకసారి మాతృదేవి జయరాంబాటిలో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడి కోలుకుంటూవున్నారు. అప్పుడు కపిల మహరాజ్ మాతృదేవిని కలకత్తాకు వెళ్లమని పదేపదే ప్రాథేయపడ్డారు. మాతృదేవి ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు. ఆయన వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న వారితో ఇలా అన్నారు:
“ఆతనికేం చెప్పేశాడు! వాళ్లు ఏదీ లేని సాధువులు. లే అంటే లేవవచ్చు, కూర్చో అంటే కూర్చోవచ్చు. ఎలాంటి చీకూచింతాలేదు. ఒక తుండును భుజాల మీద వేసుకుంటే చాలు, బయలుదేరవచ్చు. నాకు అలా కుదురుతుందా? ఎన్ని విషయా లను ఆలోచించి నిర్ణయించాల్సి వస్తోంది! ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా పనులు చేయాల్సివుంటుంది!”
* * *
ఒక భక్తురాలు మాతృదేవికి సేవ చేయగోరింది. తన ఉత్సుకతను మాతృదేవికి తెలిపినప్పుడు ఆమె ఇలా అన్నారు:
“వద్దమ్మా! ఇది గురుదేవుల పూజ జరుగుతున్న చోటు. అందువలన నువ్వు ఇక్కడ సేవ చేయరాదు. నేను సజ్జనుడికీ తల్లినే, దుర్జనుడికీ తల్లినే. సజ్జనురాలికీ తల్లినే, దుర్జనురాలికీ తల్లినే. కానీ గురుదేవుల సేవకు అది సరిపడదు. పరిపూర్ణమైన పవిత్రులైన స్త్రీలు ఎంతమంది? వేళ్లతో లెక్కించవచ్చు.”
* * *
జయరాంబాటి. ఆ రోజు మాతృదేవి పుట్టిన రోజు. మాతృదేవి ఆరోగ్యం బాగాలేదు. అందువలన ఆ రోజు స్నానం చేయకూడదనుకొన్నారు. కానీ ఆరోగ్యం గురించి భక్తులకు తెలిస్తే వారు బాధపడతారని స్నానం చేశారు. దాంతో ఆమెకు సాయంత్రం జ్వరం ఎక్కువయింది. నేను ఆమె దర్శనానికి వెళ్లినప్పుడు నాతో, “చూడు నాయనా! మనస్సులో జనించే సూచనలను ఉదాసీనం చేయకు. మనస్సే ప్రప్రథమ గురువు. ఇదిగో చూడు! ఈ రోజు ఉదయం నేను మేలుకోగానే ఆరోగ్యం బాగాలేదు. ఈ రోజు స్నానం చేయకూడదనే ఆలోచన వచ్చింది. కానీ అనేక కారణాలను ఆలోచించి స్నానం చేసేశాను. ఇప్పుడు ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాను” అన్నారు.
* * *
‘వేడిగా ఉన్న ఆహారం తినాలి. మృదువైన పరుపుమీద శయనించాలి’ అని గురుదేవు లన్నట్లు మాతృదేవి సూచించేవారు.
* * *
డబ్బు డబ్బు అంటూ అంగలార్చే బంధువులతో ఒకసారి మాతృదేవి ఇలా అన్నారు:
“మీరు ఒక రిద్దరు పిల్లలను కని ఇంతగా విసిగిపోయారు. వారిని మనుష్యుల లాగా తీర్చిదిద్దడానికి మీకు చేతకావడం లేదు. నేనో, కనకుండానే ఎందరికో తల్లినైనాను. వేలాది బిడ్డలను మానవులుగా తీర్చిదిద్దాలి – కొందరు మంచివారు, కొందరు దుష్టులు. కొందరు మనశ్శాంతి కోల్పోయి నా వద్దకు వచ్చి, ‘అమ్మా! నన్ను కాపాడండి!’ అంటారు. ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతాయి? వారికి మరో గతి లేదు. మీకు తెలిసిందంతా డబ్బు, ఆస్తి, ఇల్లు, వాకిలి – ఇవి మాత్రమే! మీరు ఎలా వచ్చారో అలాగే పోతారు. మానవజన్మ లభించడం మహద్భాగ్యమంటారు. అలాంటి మానవజన్మ పొంది మీరు ఏం సాధించారు?”
* * *
‘వంగ భాషలో అన్ని ఉచ్చారణలకూ ఒక్కొక్క అక్షరం మాత్రమే ఉంది. కొన్ని సమయాల్లో రెండు అక్షరాలు ఉండవచ్చు. కాని ‘స’ మాత్రం మూడు – శ, ష, స – అంటే సహనాన్ని పాటించు, సహనాన్ని పాటించు; సహనాన్ని పాటించు’ అని గురుదేవులు చెప్పేవారు. మాతృదేవి ఉదాహరణ చూపుతూ దీనిని వివరించేవారు: “భూమికున్న సహనం అవసరం. భూమికి ఎంత బాధ కలిగిస్తారు! కానీ భూమి అన్నిటినీ పక్షపాతరహితంగా సహిస్తుంది. అలాంటి సహనం మనిషికి అవసరమూ, ఆవశ్యకమూ.’
* * *
భక్తుడు: అమ్మా! మీ ఆరోగ్యం బాగాలేదు. నిరవధికంగా కష్టపడుతూనేవున్నారు. మీ వంట మనిషిని గురించి మీకు అంతా తెలుసు. దయతో మీరు సమ్మతిస్తే ఆ వ్యక్తిని పంపించేస్తాం.’
నా మాటలను విని మాతృదేవి గాంభీర్యం వహించారు. తరువాత ఇలా అన్నారు:
“మీరు పంపించేయాలని అనుకుంటే అలాగే చేయాలి. కానీ నేను పంపించేస్తే వాడికి గత్యంతరం లేదు.”
* * *
భక్తుడు: రైలుబండి, పడవ లాంటి వాటిల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా జపం చేయాలి?
మాతృదేవి: మానసికంగా చేసుకో నాయనా! అంచెలంచెలుగా చేయి, పెదవులు అవన్నీ పనిచేయడం ఆగిపోతాయి; అంతా మనస్సులోనే జరుగుతుంది. తుదకు మనస్సే గురువుగా పరిణమిస్తుంది.
* * *
భక్తుడు: అమ్మా! మనస్సు ఎంతో చంచలమవుతున్నది. ఎంత ప్రయత్నిం చినా దానిని అదుపులో పెట్టలేకపోతున్నాను.
మాతృదేవి: తుపాను గాలులు వీచినప్పుడు మేఘాలన్నీ చెల్లాచెదరై కను మరుగైపోతాయి. అదేవిధంగా నామజపం వలన ప్రాపంచికత అనే మేఘాలను తరిమివేయవచ్చు.
* * *
భక్తురాలు: అమ్మా! అనేకులు శివపూజ చేస్తున్నారు. నేను కూడా చేయవచ్చా?
మాతృదేవి: దుర్గాపూజ, కాళీపూజ అంటూ పూజల నన్నింటినీ నేనిచ్చిన మంత్రపూర్వకంగా చేయవచ్చు. ఎవరైనా కోరుకుంటే ఆ పూజల నన్నిటినీ నేర్చుకొని చేయవచ్చు. కానీ మీకు వాటి అవసరం లేదు. వాటినన్నిటినీ ఆచరించేటప్పుడు బాధ్య తలు పెరుగుతాయి.
* * *
భక్తురాలు: గురుదేవులకు నైవేద్యం సమర్పించే మంత్రమూ, పద్ధతీ నాకు తెలియదు. ఏం చేయాలి?
మాతృదేవి: పూజా విధానాలనన్నిటినీ తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు. ఇష్టమంత్రాన్ని ఉచ్చరిస్తూనే దానిని చేయవచ్చు.
* * *
భక్తుడు: అమ్మా! నేను అతి బీదవాణ్ణి. మిమ్మల్ని దర్శించడానికి అప్పుడప్పుడు రావాలని ఎంతో కోర్కెగా వుంది. కానీ ఏమీ కానుక చెల్లిం చెల్లించలేని అశక్తత కారణంగా రావడం లేదు.
మాతృదేవి: నాయనా! నీకు అనిపించినప్పుడల్లా స్వేచ్చగా రా! ఒక ఉసిరికాయ మాత్రం తీసుకురా! అంతే చాలు.
* * *
“అమ్మాయీ! ఒక్క క్షణమైనా ఊరకే ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తూ ఉండు. ఏదో ఒక పని కల్పించుకొని దాన్లో నిమగ్నమవు. సోమరితనం మనస్సులో రకరకాల ఆలోచనలను రేకెత్తించి బెంబేలెత్తిస్తుంది.”
* * *
స్త్రీలకు లజ్జయే ఆభరణం. ఆత్మగౌరవంలేని స్త్రీని స్త్రీగా పరిగణించలేం.
* * *
జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో గురుదేవులను స్మరించు. అప్పుడు ఎలాంటి కష్టమూ దుర్భర కష్టంగా అనిపించదు. ఎవరి జీవితంలో దుఃఖమూ కష్టమూ లేవు? అవి ఉండే తీరతాయి. ఆయన పవిత్రనామాన్ని జపించు. ఆయనను శరణుజొచ్చి జీవితం సాగించు. అప్పుడు ఆయన నీకు శక్తిని ప్రసాదిస్తారు. కష్టాలూ, సమస్యలూ ఏమీ అప్పుడు నిన్ను కలత చెందనీయవు.
* * *
కామాన్ని పూర్తిగా ఎవరైనా వదలించుకోగలుగుతారా? శరీరం అంటూ ఒకటి ఉన్నంతదాకా అది కూడా ఉండే తీరుతుంది. కానీ ఒక్కమాట: మంత్రానికి కట్టుబడి నాగుపాములు కూడా వశమయ్యేవిధంగా కామాన్ని కూడా తలెత్తనీయ కుండా చేయవచ్చు.”
* * *
సాధువు: అమ్మా! గురుదేవులు పరలోకానికి మాత్రమేనా?
మాతృదేవి: కాదు. ఆయన ఇహపరాలకు చెందినవారు.
* * *
సాధువు: అమ్మా! కుటుంబం, తల్లితండ్రులు, బంధుగణం అన్నిటినీ త్యాగం చేసి ఆశ్రమవాసం ప్రారంభించాను. కానీ ఇక్కడ కూడా కుటుంబంలో లాగే బాధ్యతలూ, కర్తవ్యాలూ, గొడవలూ లాంటి వన్నీ ఉంటున్నాయే!’
మాతృదేవి: నాయనా! ఆశ్రమ జీవితం కూడా రెండవ కుటుంబ జీవితమే. కానీ ఈ గొడవల నడుమ కూడా భగవత్సాన్నిధ్యాన్ని అధికంగా అనుభూతి చేసుకో గలం.
* * *
భక్తుడు: అమ్మా! కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలు. అది చాలదన్నట్లు ఆఫీసు పనులు. ఈ అగచాట్ల మధ్య జపధ్యానాలు ఏమీ సాగడం లేదు. ఎలాంటి పురోగమ నమూ లేదు.
మాతృదేవి: ఏమన్నా జరగనీ! అంతిమ క్షణాల్లో గురుదేవులు వచ్చేతీరాలి. ఈ విషయం ఆయనే స్వయంగా సెలవిచ్చారు. ఆయన మాటలు వ్యర్థమవుతాయా ఏమిటి? శక్తిమేరకు చేస్తూ జీవితం గడుపు.
భక్తుడు: అమ్మా! మీ వద్ద మంత్రదీక్ష పొందినవారు మళ్లీ జన్మించాలా?
మాతృదేవి: అక్కర్లేదు. మీ వెనుక ఒకరు ఉన్నారనే సత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపక ముంచుకోండి.
భక్తుడు: మీ అనుగ్రహం పొందాం. ఇదే మాకు కొండంత విశ్వాసం.
మాతృదేవి: ఎందుకు చింత? నాయనా! మీ అందరూ నాకు సదా జ్ఞాపకంలో ఉంటారు.
* * *
భక్తుడు: అమ్మా! సాధన లేవీ చేయలేకున్నాను.
మాతృదేవి: నువ్వేమీ చేయాల్సింది లేదు. నీ కోసం నేనే చేస్తాను.
భక్తుడు: నేనేమీ చేయవద్దా?
మాతృదేవి: వద్దు!
భక్తుడు: అలా అయితే ఇప్పటి నుండి నా భవిష్యత్తు నా ప్రారబ్ధం మీద ఆధార పడి లేదు. అంతేకదా!
మాతృదేవి: అవును! నువ్వు గొప్పగా ఏమంత సాధించగలుగుతావు? చేయ వలసిందేదో నేనే చేస్తాను.
భక్తుడు: మీ బిడ్డలందరికీ కూడా మీరే చేయాలా?
మాతృదేవి: అవును. అందరి కోసమూ నేనే చేయాలి.
భక్తుడు: మీ కెంతోమంది బిడ్డలు. అందరూ మీకు జ్ఞాపకమేనా?
మాతృదేవి: లేదు.
భక్తుడు: అలా అయితే అందరి కోసం చేస్తున్నట్లు చెప్పారే!
మాతృదేవి: ఎవరి పేర్లు జ్ఞాపకానికొస్తాయో వారందరి కోసం జపం చేస్తాను. జ్ఞాపకం రాని వారి కోసం గురుదేవులతో ‘భగవంతుడా! నాకు ఎందరో బిడ్డలు. ఎక్క డెక్కడో ఉంటున్నారు. నాకు జ్ఞాపకం రాని వారినందరినీ మీరే కాపాడాలి. వారికి శ్రేయస్సు ఒసగాలి’ అంటూ ప్రార్థిస్తాను.
* * *
మాతృదేవి: జపధ్యానాల కంటూ ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించడం ఎంతో అవసరం. సరైన సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో చెప్పలేం. ఎవరూ ఎదురు చూడని వేళలో ఆ తరుణం హఠాత్తుగా వస్తుంది. డబ్బు ద్వారానూ, మానవ ప్రయత్నం వలననూ సాధింపలేని అనేకమైనవి కాల మహిమ సాధింపగలుగుతుంది. అందువలన సమస్యల ఒత్తిడి ఎంతగా ఉన్నప్పటికీ కొన్ని నియమాలను అంటి పెట్టుకుని ఉండడం ఎంతో అవసరం.
భక్తుడు: పనులు ఒకవైపు, వ్యాధుల లాంటివి మరోవైపు, ఇలా అనేక కార ణాల వలన దేనినీ సరిగ్గా ఆచరించలేకపోతున్నాం.
మాతృదేవి: అవును. వ్యాధులు మనిషి కట్టడిలోనివి కావు. ఇక, నిజంగానే పనుల ఒత్తిడి నిన్ను కృంగదీసేదిగావుంటే ఇష్టదైవాన్ని మనస్సులో తలచుకుని నమస్కరించు. మరేం చేయగలం?
భక్తుడు: సాధనలకు తగిన సమయమేది?
మాతృదేవి: సంధ్యాసమయాలు. ఆ సమయాలలో భగవంతుని స్మరించడం చాలా మంచిది. రాత్రి గడిచి పగలు రాబోయే సమయాన్ని, పగలు గడిచి రాత్రి ఏతెంచే సమయాన్ని సంధ్యాసమయమంటారు. ఆ సమయంలో సహజంగానే మనస్సు పావనతను సంతరించుకొని ఉంటుంది.
మనోబలహీనతలను గురించి మాతృదేవితో చెప్పుకున్నప్పుడు ఆమె ఇలా అన్నారు:
“నాయనా! అమావాస్య, పౌర్ణమి రావడం ఎలా ప్రకృతి సహజమో, అదే విధంగా మనస్సులోని బలహీనత కూడా. కొన్ని సమయాల్లో ప్రశాంతంగానూ, కొన్ని సమయాల్లో అపవిత్రంగానూ, చంచలంగానూ ఉండడం మనస్సు స్వభావం.
భక్తుడు: అమ్మా! ఈ ప్రపంచంలో సమగ్రంగా దేనినీ సాధించలేము.
మాతృదేవి: నాయనా! ఈ ప్రపంచం ఒక పెద్ద బురద గుంట. దాన్లో పడితే బయటపడడం చాలా కష్టం. బ్రహ్మా విష్ణువులు కూడా అందులోపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు పాపం ఇక మనిషిని గూర్చి చెప్పడానికి ఏముంది? భగవం తుని పవిత్ర నామాన్ని ఉచ్చరించు. నామజపం చేస్తూవుంటే ఆయనే ఒక రోజు నిన్ను లౌకిక బంధాల నుండి విడిపిస్తారు. నాయనా! ఆయనే స్వయంగా విడిపించక పోతే ఎవరైనా ముక్తి పొందడం సాధ్యమా? ఆయన పట్ల అచంచల విశ్వాసం పెంపొందించుకో. బిడ్డలకు ఏ రకంగా తల్లితండ్రులు ఆశ్రయమో, అలాగే నువ్వు గురుదేవులను భావించు.
విశ్వాసం గురించి ప్రస్తావన వచ్చింది.
మాతృదేవి: నాయనా! పుస్తకాలు చదవడం వలన అలాంటి విశ్వాసం అలవడుతుందని భావిస్తున్నావా? ఎక్కువగా చదివితే గందరగోళమే ఎక్కువవుతుంది. “ఈ ప్రపంచం అనిత్యమైంది. భగవంతుడు మాత్రమే నిత్యం. శాస్త్రాలు చదివి గ్రహించవలసింది ఇంత మాత్రమే” అనేవారు గురుదేవులు. ఫలానా వస్తువులు తీసుకురా అని నీకు నేను ఒక ఉత్తరం రాశాననుకో! నీకు ఆ ఉత్తరం ఎంతవరకు అవసరం? అందులో వ్రాసివున్నదేమిటో తెలుసుకునే వరకే కదా! తెలుసుకున్న తరువాత దానితో పనేమిటి? ఉత్తరంలో సూచించిన వస్తువులు కొనాలి, తీసుకొచ్చి నా కివ్వాలి. అంతే కదా! అది చేయకుండా రాత్రింబవళ్లు కూర్చొని ఆ ఉత్తరాన్ని చదువుకుంటూవుంటే ప్రయోజనమేమిటి?’
* * *
ఒక రోజు భక్తుడొకడు విసుగుచెంది మాతృదేవిని సమీపించి, “అమ్మా! మీ వద్దకు తరచూ వచ్చిపోతున్నాను. కానీ ఆధ్యాత్మికంగా ఎలాంటి పురోగతీ నాకు కలగలేదే! ఇంతకుముందు ఉన్నట్లే ఉన్నాననిపిస్తోంది” అని వాపోయాడు. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“నాయనా! నువ్వు ఒక మంచం మీద నిద్రపోతున్నావని అనుకుందాం. అప్పుడు ఒక వ్యక్తి నిన్ను మంచంతోపాటు ఎత్తుకుని వెళ్లి మరొక చోటికి తరలించా డనుకో! నువ్వు మరొక చోటికి వచ్చావనే విషయం మేల్కోగానే నీకు తెలిసివస్తుందా? తెలియదు. నిద్రమత్తు బాగా వదలిన తరువాత ఆ విషయం నీకు స్ఫురిస్తుంది.”
“నాయనా! నేను మీకు ఏది ఇవ్వాలో, ఏది చేయాలో దానిని మంత్రదీక్షా సమయంలోనే చేసేస్తాను. తక్షణమే దాని ఫలితాన్ని మీరు పొందగోరితే, తక్షణమే ప్రశాంతత పొందాలంటే తపస్సులోనూ, సాధనలలోనూ తీవ్రంగా నిమగ్నులవాలి. లేకపోతే అంతా జీవితాంతంలోనే లభిస్తుంది.”
* * *
భక్తుడు: అమ్మా! తమ వద్దకు వచ్చేవారికి ఇదే చివరి జన్మ అని గురుదేవులు చెప్పారు. మీ వద్దకు వచ్చేవారి పరిస్థితి ఎలాంటిది?
మాతృదేవి: మరేమిటి? ఇక్కడా అదే జరుగుతుంది.
భక్తుడు: అమ్మా! మీ నుండి మంత్రదీక్ష తీసుకున్నవారు ఎలాంటి సాధనలూ చేయకపోతే ఏం జరుగుతుంది?
మాతృదేవి: ఏం జరుగుతుంది? అవును! నువ్వెందుకు దీనిని గురించి అంతగా ఆందోళన చెందుతున్నావు? మనస్సులో మెదలే కోర్కెలన్నిటినీ ఈడేర్చుకో. తరువాత రామకృష్ణ లోకానికి వెళ్లి శాశ్వత ప్రశాంతతను పొందవచ్చు. గురుదేవులు మీ అందరి కోసం ఒక నూతన లోకాన్నే సృష్టించారు.
* * *
ఒక భక్తుడు చేతి వ్రేళ్లతో లెక్కించి మంత్రజపం చేసే విధానాన్ని మరచి పోయాడు. ఆ విధానాన్ని వివరించమని ఉత్తరం వ్రాసి దానిని నా కిచ్చాడు. ఈ విషయం తెలియజేసినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“ఇందులో ఏముంది? ఎలాగైనా ఒక పద్ధతిని అనుసరించి జపం చేస్తే చాలు. పద్ధతులూ, విధులూ అవన్నీ మనస్సును అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే.”
* * *
బహిష్టు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, మాతృదేవి ఇలా అన్నారు: “చూడు నాయనా! గురుదేవుల జీర్ణశక్తి ఎంతో సున్నితమైనది. నేను నహబత్తులో ఉంటూ ఆయన కోసం వంట చేస్తున్న రోజులవి. బహిష్టు రోజులలో నేను వంట చేయను. ఆ రోజులలో ఆయన కాళికాలయం ప్రసాదాన్నే తినేవారు. కానీ అది ఆయనకు పడేది కాదు; కడుపు నొప్పితో బాధపడేవారు. ఒకసారి నాతో, ‘ఇదిగో చూడు; బహిష్టు రోజులలో వంట చేయరాదని ఎవరన్నారు? నువ్వు నా కోసం వంట చేయి! దాన్లో దోషం లేదు. ఒక్క విషయం – ఈ బహిష్టు, శరీరపు ఏ భాగానికి చెందినది – చర్మమా, మాంసమా, ఎముకలా, మజ్జా? బహిష్టు మొదలైనవన్నీ మనస్సులోనే ఉన్నాయి. బాహ్యంలో అవేమీ లేవు’ అన్నారు. ఆ తరువాత నేను అన్ని రోజులలోనూ వంట చేయడం ప్రారంభించాను.
* * *
ఒకసారి కోల్పారాలో ఉన్నప్పుడు మాతృదేవికి ఆరోగ్యం బాగాలేదు. ఒక శిష్యుడు ఆమె కోసం షర్బత్ తయారుచేసి ఇవ్వడం రివాజు. అలా ఇవ్వడానికి ముందుగా అందులో అన్నీ సరిగ్గా చేర్చబడివున్నాయో అని పరీక్షించడానికి తానే రుచి చూసి తరువాత ఇచ్చేవాడు. ఈ సంగతి మాతృదేవికి తెలియదు. ఒకటి రెండు రోజుల తర్వాత మాతృదేవి తామే ఆతడితో, “చూడు నాయనా! ప్రేమకు అర్హులైన వారికి ఏదైనా ఇచ్చేటప్పుడు, కొద్దిగా రుచి చూసి ఇవ్వడం మంచిది” అన్నారు. అందుకు శిష్యుడు, “అమ్మా! నేను అలాగే మీకు ఇస్తున్నాను!” అన్నాడు. వెంటనే మాతృదేవి, “మంచిపని చేశావు నాయనా! ప్రేమించేవారికి అలానే ఇవ్వాలి! గోపబాలురు తాము రుచి చూచిన తర్వాతనే కృష్ణునికి పండ్లూ మొదలైనవన్నీ ఇచ్చారని నువ్వు వినలేదా?” అన్నారు.
* * *
భక్తుడు: అమ్మా! కొన్ని సమయాల్లో రహదారిపై పోతున్నప్పుడు కొందరిని చూస్తాం. వారిని మొట్టమొదటిసారిగా చూసినా వారు చిరకాల పరిచితులైనట్లు అనిపిస్తుంది. తరువాత వాకబు చేస్తే వాళ్లు గురుదేవుల భక్తులుగానో, మీ భక్తులుగానో తేలేవారు. ఇది ఎలా?
మాతృదేవి: ఆకుపచ్చ పాచిని గురించి గురుదేవులు చెప్పడం నీకు జ్ఞాపకం లేదా? అది అంతటా వ్యాపించివుంటుంది. ఒక పోగును లాగితే పూర్తిగా చెట్టంతా ఒకటిగా వచ్చేస్తుంది. అవన్నీ ఒకటితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి.
* * *
తప్పు చేసిన ఒక వ్యక్తికి తగిన శిక్ష ఇవ్వవలసిందిగా మాతృదేవిని అభ్యర్థించి నప్పుడు మాతృదేవి, “నేను అతడి తల్లిని. దండన ఎలా ఇవ్వగలను?” అని ప్రశ్నించారు.
* * *
పక్కదారులు పడుతున్న ఒక భక్తుణ్ణి గురించి యోగీన్ మా, మాతృదేవితో చెబుతూ, “అమ్మా! ఆ భక్తుణ్ణి కాస్త మందలించండి. లేకపోతే ఆతడి పరిస్థితి ఇంకా విషమిస్తుంది” అన్నారు. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“యోగీన్! ఆ పని నేను చేయలేననిపిస్తుంది. నేను చెప్పినా, అందుకు తగ్గట్లు అతను జీవితం గడపలేడు. నేను ఆతని గురువును, నా మాటలను పెడచెవిన పెడితే అది అతడికి అశుభాన్ని కలుగజేస్తుంది.”
* * *
మాతృదేవి శిష్యుడైన ఒక యువకుడు దుష్ప్రవర్తనుడయ్యాడు. వృద్ధుడైన భక్తుడొకడు మాతృదేవితో ఈ విషయం చెప్పి ఇక ఆ యువకుణ్ణి రానివ్వకూడదని విన్నవించుకున్నాడు. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“నా దగ్గరికి రాకపోతే మరెక్కడికి వెళ్లగలడు? నేను మంచి వారికి మాత్రమే తల్లినా? దుర్జనులకు కూడా తల్లినే కదా!”
* * *
ప్రఖ్యాత నటీమణులైన తిన్కడి, తారా సుందరి అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవారు. కానీ వారు పూజగది లోపలికి వెళ్లడమో, మాతృదేవిని స్పృశించి ప్రణమిల్లడమో చేయరు. పూజగదికి బయట నిలబడి అతి వినమ్రంగా మాతృదేవికి ప్రణమిల్లుతారు. మాతృదేవి కూడా ప్రసాదం తీసుకుని వెళ్లమనేవారు. ప్రసాదం తిన్న తరువాత మాతృదేవి వారికి తమలపాకు చిలకలు అందించేవారు. మాతృదేవిని తాకకుండా జాగ్రత్త వహించి వారు వాటిని తీసుకునేవారు. ఒక రోజు వారిద్దరూ వెళ్లిపోయిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు:
“నిజమైన భక్తి అంటే వీరిదే! భగవంతుణ్ణి గురించి కించిత్తు చింతనచేసినా, మనఃస్ఫూర్తిగా, ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి స్మరిస్తున్నారు.”
* * *
నేను: జపం చేయడం ఎలా?
మాతృదేవి: ఎలాంటి చింతనతో జపం చేస్తున్నావో ఆ చింతనయే నీ మనస్సును ఆక్రమించి ఉంటుంది. “గురుదేవులు నాకు చెందినవారు” అని ఎల్లప్పుడూ తలంచుకుంటూ ఉండు!
* * *
మనిషి అన్నాక తప్పులు చేయనే చేస్తాడు. వాటిని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. ఇతరుల తప్పులు చూడడం వలన తనకు తానే హాని చేసుకొంటాడు. తప్పులు కనిపెట్టి కనిపెట్టి చివరకు అదే అతడి స్వభావంగా మారిపోతుంది.
“ఎవరి తప్పులనూ చూడకు. ఇతరులలోని తప్పులను చూడడం మొదలు పెడితే చివరకు అదే నీ స్వభావంగా మారిపోతుంది.”
* * *
ఒక భక్తురాలు తనకూ తన స్నేహితురాలికీ నడుమ ఏర్పడిన మనస్తాపం గురించి మాతృదేవికి చెప్పింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదుగో చూడమ్మా! మనుషులను ప్రేమిస్తే దుఃఖమూ కష్టమూ అనుభవించే తీరాలి. భగవంతుణ్ణి ప్రేమింపగలిగిన వ్యక్తే భాగ్యవంతుడు. ఆతడికి కష్టమో, దుఃఖమో ఉండదు.”
* * *
ఒక భక్తుడు: అమ్మా! నేను ఎంతగానో జపతపాలు అనుష్ఠిస్తున్నాను. అయినా ఏమీ లభించడం లేదు.
మాతృదేవి: లభించడానికో, మూల్యం చెల్లించి కొనడానికో భగవంతుడు చేపలో, కాయగూరలో కాదు కదా!
* * *
ఒక భక్తుడు: అమ్మా! మనస్సులో దురాలోచనలు ఎందుకు వస్తాయి?
మాతృదేవి: మామూలు మనస్సు స్వభావం నిమ్న దిశగా వెళ్లడమే. మనస్సును బలవంతంగా పట్టుకుని అడ్డుకట్ట కట్టి ఉంచుతాడు మనిషి. కానీ అది అప్పుడప్పుడు దానిని తెంచుకుని బయటికి వచ్చేస్తుంది. కానీ నిరంతర ప్రయత్నం చేయాలి. సత్పురుషుల సాంగత్యం వలనా, మంచి విషయాలను ఆలోచించడం వలనా మనస్సు ఉన్నతమైన స్థితిని ఆకాంక్షించడం తథ్యం. అతి నిమ్న స్థితిలో ఉంటున్న వారి మనస్సు కూడా సాధువుల కృపాకటాక్షంతో తన ధోరణిని మార్చుకుంటుంది. బృందావనంలోని ఆ సాధువు విషయం నీకు తెలిసిందే కదా! ఆయన బంగారం కోసం గాలించాడు. ఒక మహాత్ముని కృప వలన ఆతనికి జ్ఞానోదయమయింది. ఆ తర్వాత ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల పరుసవేది లభించినా దానిని పారేశాడు కదా!*
ఒక వేటగాడు సాధువుగా వేషం ధరించి పక్షులను పట్టుకోవడానికి వెళ్లాడు. వెళ్లిన చోట పక్షుల సాత్విక స్వభావమూ, నిర్భయత్వమూ చూశాడు. అలా చూసినప్పుడు ఆతడిలో వైరాగ్యం జనించింది. వేటాడే వృత్తిని మానుకొన్నాడు.
అందువల్లనే సత్సంగం అవసరమన్నారు. సమయం దొరికినపుడల్లా సత్పురు షుల సాంగత్యం పొందు. అలాంటిది దొరకకపోతే మంచి పుస్తకాలు చదువు. మహాత్ముల జీవితాలను ఆలోచించే కొద్దీ మనస్సు పవిత్రమవుతుంది. నీరు ఎప్పుడూ పల్లం వైపే ప్రవహిస్తుంది. కానీ సూర్యకిరణాల సంపర్కం కలిగితే ఆ నీరే ఆవిరిగా ఆకాశం వైపు లేస్తుంది. కొండ శిఖరాలలో మంచుగా నిలుస్తుంది; వర్షం, నది, సెలయేరు అంటూ వచ్చి ప్రాణులకు ఎంతో మేలు చేస్తుంది.
* * *
భక్తుడు: గురుదేవులు గొప్పవారా? మాతృదేవి గొప్పవారా?
మాతృదేవి: ఛీ! ఏమిటా మాటలు? (కాసేపయ్యాక) నీకు ఎలా అనిపిస్తుంది?
భక్తుడు: పరమేశ్వరుని మీద నిలబడివుంది కదా కాళి!
మాతృదేవి (మెల్లగా నవ్వుతూ) : నువ్వు అలాగే భావించవచ్చు.
* * *
భక్తుడు: అమ్మా! భక్తులు మిమ్మల్ని భగవతి అంటున్నారే!
మాతృదేవి: భక్తులు చెప్పడ మెందుకు? నేనే చెబుతున్నాను.
* * *
భక్తుడు: అనేకులు గురుదేవులను భగవాన్ అంటున్నారు, మీరెవరు?
మాతృదేవి: ఆయన భగవాన్ అయితే ఇక నేనేమవుతాను? నేను భగవతి!
భక్తుడు: అమ్మా! అనేక అవతారాలలో అవతార పురుషులు తమ శక్తి, అంటే సహధర్మచారిణి నిర్యాణానికి తదుపరే తమ దేహాలను చాలించారు. కానీ ఈసారి ఎందుకు గురుదేవులు మీకంటే ముందుగానే వెళ్లిపోయారు?
మాతృదేవి: నాయనా! గురుదేవులు ప్రపంచాన్నే మాతృదేవి స్వరూపంగా చూశారు. మాతృత్వాన్ని లోకంలో చాటిచెప్పడానికి నన్ను వదలివెళ్లారు.