ప్రస్తావన
భగవదనుగ్రహంతో ‘శ్రీరామకృష్ణ పరమహంస’ మొదటి భాగం ఇప్పుడు వెలువడింది. దీనిలో శ్రీరామకృష్ణుల బాల్యజీవితం, ఆయన ఆవిర్భావ ఉద్దేశ వివరాలు పొందుపరచబడ్డాయి. ఆయన బాల్యజీవితానికి సంబంధించిన అనేక సంఘటనలను పలువురి నుండి విని మా మనస్సులో రూపొందిన చిత్రాన్ని పాఠకులకు అందించడానికి చేసిన ప్రయత్నమే ఇది. కొన్ని సంఘటనల కాల నిరూపణ విషయంలో హృదయరాం ముఖోపాధ్యాయ (శ్రీరామకృష్ణుల మేనల్లుడు), రాంలాల్ ఛటోపాధ్యాయ (శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడు) తదితరులు సాధ్యమైనంత మేరకు సహాయం అందించారు; అయినా కొన్నిచోట్ల ఆ అంశాలపైన సంశయం తీరలేదు. వారు మాకు శ్రీరామకృష్ణుల తండ్రి, పెద్దన్నగారు, సమీప బంధువుల జాతకాలను అందించలేకపోయారు; కాని అందుకు మారుగా శ్రీరామకృష్ణుల జీవితంతో ముడివడిన కొన్ని సంఘటనల ఉజ్జాయింపు తేదీల వివరాలు మాకు అందచేశారు. ఉదాహరణకు: “శ్రీరామకృష్ణులు జన్మించినప్పుడు ఆయన తండ్రి (క్షుదిరామ్) గారి వయస్సు అరవై ఒకటి లేక అరవై రెండు ఏళ్ళు ఉండవచ్చు.” “పెద్దన్నగారైన రామకుమార్, శ్రీరామకృష్ణుల కంటే ముప్ఫైఒకటి లేక ముప్ఫై రెండేళ్లు పెద్దవాడై ఉంటాడు.” మొదలైనవి.
అయినప్పటికీ ఈ పుస్తకంలోని ‘యుగపురుషుని ఆవిర్భావం’ అన్న ఐదవ అధ్యాయం చదివినప్పుడు దాన్లో పొందుపరచిన శ్రీరామకృష్ణులు జన్మించిన తేదీ గురించి పాఠకులకు ఎలాంటి సంశయమూ కలుగదు. ఈ విషయంలోనే కాక ఈ పుస్తకంలో ఉల్లేఖీంచిన అనేక సంఘటనలను స్వయంగా శ్రీరామకృష్ణుల పలుకులే పునర్నిర్ధారించాయి; కొన్నిటిని శ్రీరామకృష్ణుల ముఖతః స్వయంగా ఈ రచయితే వినడం జరిగింది. అటువంటి సమాచారం అందించిన శ్రీరామకృష్ణులకు నిజానికి మనం కృతజ్ఞులమై ఉండాలి.
శ్రీరామకృష్ణుల జీవితంలోని కొన్ని కాలఘట్టాలను వర్ణింప పూనుకొన్నప్పుడు ఆయన బాల్య, యౌవన జీవిత సంఘటనలను విపులంగా, సంబద్ధయుతంగా పొందుపరచగలగడం అసాధ్యంగా తోచింది. అయినా ఎవరి కృప మూగవాణ్ణి వాచాలునిగా చేస్తుందో, కుంటివాణ్ణి పర్వతాలను సైతం అధిరోహింపచేస్తుందో ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఇది సంభవమైంది. కనుక ఆయనకు మా శతకోటి ప్రణామాలు.
చివరగా ఒక్క మాట. పాఠకమహాశయులు పుస్తకంలోని ఈ భాగం చదివాక ‘సాధక భావం’, ‘గురు భావం’ అనే భాగాలు కూడ చదివితే శ్రీరామకృష్ణుల జనన తేదీ నుండి 1881* వ సం ॥ వరకు ఆయన జీవిత చరిత్ర పూర్వా పరంగా (Chronologically) నమోదు కాబడి ఉండటం గ్రహించగలరు.
–-రచయిత్