- శ్రీ భగవానుడు ఇట్లు పలికెను – నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. (4.1)
- ఓ పరంతపా ! (అర్జునా ! )ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎఱింగిరి. కాని, అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకము నందు లుప్తప్రాయమయ్యెను. (4.2)
- ఈ యోగము ఉత్తమమైనది. రహస్యంగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు. ప్రియసఖుడవు. కనుక, మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచున్నాను. (4.3)
- అర్జునుడు పలికెను – కృష్ణా ! నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక, నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట యెట్లు ? (4.4)
- శ్రీ భగవానుడు తెలిపెను – ఓ పరంతపా ! ఓ అర్జునా ! నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కాని, వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును. నీ వెఱుగవు. (4.5)
- నేను జన్మ రహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయిననూ, నా ప్రకృతిని అధీనములోనుంచుకుని, నా యోగమాయచే అవతరించుచుందును. (4.6)
- ఓ భారతా! (అర్జునా!) ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును, నన్ను నేను సృజించుకొందును. అనగా, సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. (4.7)
- సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును , నేను ప్రతి యుగము నందును అవతరించుచుందును. (4.8)
- ఓ అర్జునా ! నా జన్మ(అవతారము)లు , కర్మములు, దివ్యములు. అనగా, నిర్మలములు. అలౌకికములు. ఈ తత్త్వ రహస్యమును తెలిసికొనినవాడు తనువును చాలించిన పిమ్మట మఱల జన్మింపడు సరికదా ! నన్నే చేరును. (4.9)
- ఇదివరలో గూడ సర్వదా రాగ, భయ, క్రోధ రహితులైనవారు, దృఢమైన భక్తి, తాత్పర్యములతో స్థిర బుద్ధి గలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై, పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. (4.10)
- పార్థా ! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు (4.11)
- ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. (4.12)
- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను, పరమేశ్వరుడైన నన్ను వాస్తవముగా ‘అకర్తను’ గా తెలుసికొనుము. (4.13)
- నాకు కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్త్వవమును తెలిసినవారు కర్మబద్ధులు కారు. (4.14)
- ఓ అర్జునా ! ప్రాచీనులైన ముముక్షువులు (మోక్షము పొందకోరిన వారు) ఈ విధముగా (నా తత్త్వ రహస్యమును ) దెలిసికొని కర్మలనాచరించిరి. కావున, నీవును ఆ పూర్వులవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము. (4.15)
- కర్మ అనగా ఏమి ? అకర్మ యనగానేమి ? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. (తికమక పడుతున్నారు) కావున, కర్మతత్త్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. (4.16)
- కర్మ’ తత్త్వమును తెలిసికొనవలెను, అట్లే ”అకర్మ” స్వరూపమును గూడ ఎరుగవలెను, ‘వికర్మ ‘ లక్షణములను కూడా తెలిసికొనుట చాలా అవసరము. ఏలనన, కర్మ తత్త్వము అతి నిగూఢమైనది. (4.17)
- కర్మ యందు ‘అకర్మ’ ను, అకర్మ యందు ‘కర్మ’ ను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మఱియు సమస్త కర్మలు చేయువాడు. (4.18)
- ఎవని కర్మలన్నియును, శాస్త్ర సమ్మతములై, కామ సంకల్ప వర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి మహా పురుషుని జ్ఞానులు పండితుడని అందురు. (4.19)
- సమస్త కర్మల యందును, వాటి ఫలితముల యందును సర్వథా ఆసక్తిని వీడి, సంసార – ఆశ్రయ రహితుడై, పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని, వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు. (4.20)
- అంతఃకరణమును, శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరిక కర్మలను ఆచరించుచున్ననూ, పాపములను పొందడు. (4.21)
- తాను కోరకుండగనే లభించిన పదార్థములతో (అప్రయత్నయముగా అమరిన లాభాలతో) సంతుష్టుడైన వాడు, అసూయలేని వాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధి యందును, అసిధ్ది యందును కూడా సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మ యోగి కర్మలనాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. (4.22)
- ఏలనగా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమూ లేని వాడును, పరమాత్మ జ్ఞానము నందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించు వాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నియును పూర్తిగా విలీనములగును అనగా మిగిలియుండవు. (4.23)
- యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు స్రువాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ విధముగా బ్రహ్మ కర్మ యందు స్థితుడై యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూడ బ్రహ్మమే. (4.24)
- కొందఱు యోగులు దైవపూజారూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మఱి కొందఱు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మపరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా (అనగా పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పించటం) ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. (4.25)
- కొందరు యోగులు శ్రోత్రాది – ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొంతమంది యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమూత్రము ఉండదు. (4.26)
- మరికొందఱు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలను, అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమయోగరూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులైయుందురు. అపుడు ప్రాణ ఇంద్రియముల స్వభావము వారిపై ఏ మాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచి యుండును. (4.27)
- కొందఱు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మఱికొందఱు తపోరూప యజ్ఞములను, కొందఱు యోగరూప యజ్ఞములను చేయుదురు. మఱికొందఱు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి, యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞానయజ్ఞములను ఆచరింతురు. (4.28)
- కొందఱు యోగులు అపాన వాయువు నందు ప్రాణ వాయువును, మరి కొందరు ప్రాణ వాయువు నందు అపాన వాయువును హవనము చేయుదురు (4.29)
- కొందరు యోగులు నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులై ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిదులైన ఈ సాధకులు అందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. (4.30)
- ఓ కురుసత్తమా! (అర్జునా) యజ్ఞపూతశేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్య లోకమే సుఖప్రదము కాదు. ఇంక, ఆ పరలోక విషయము చెప్పనేల? (4.31)
- ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతంగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటిని త్రికరణ శుద్ధిగా (మనో వాక్కాయములచే) ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్త్వమును తెలిసికొని, అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక (కర్మ) బంధముల నుండి సర్వథా విముక్తుడవయ్యెదవు. (4.32)
- ఓ పరంతపా! అర్జునా! ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శేష్ఠమైనది. కర్మలన్నియును జ్ఞానము నందే పరిసమాప్తమగును. (4.33)
- నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి,ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామము లాచరించుట వలనను , సేవలొనర్చుటవలనను, కపటము లేకుండ భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను, పరమాత్మ తత్త్వమును చక్కగానెఱింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మ తత్త్వజ్ఞానమును ఉపదేశించెదరు. (4.34)
- ఓ అర్జునా ! ఈ తత్త్వ జ్ఞానమునెఱింగినచో మఱల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచ్చిదానందఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. (4.35)
- ఒకవేళ పాపాత్ములందఱి కంటెను నీవు ఒక మహాపాపివి అయినచో, జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా, పూర్తిగా బయట పడగలవు. (4.36)
- ఓ అర్జునా ! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు, జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటిని భస్మమొనరించును. (4.37)
- ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది మరియొకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణముగల సాధకుడు బహుకాలము వరకు, కర్మయోగాచరణము చేసి, ఆత్మ యందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు (4.38)
- జితేంద్రియుడు, (ఇంద్రియములను నియంత్రణ చేసేవాడు), సాధనపరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్త్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే (ఏ మాత్రము విలంబము లేకుండ) అతడు భగవత్తత్త్వ రూపమైన పరమశాంతిని పొందును. (4.39)
- అవివేకియు, శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని, ఎట్టి సుఖమూ ఉండదు. (4.40)
- ఓ ధనంజయా! (ఓ అర్జునా!) విధి పూర్వకముగ కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములనన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును వశము నందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. (4.41)
- కావున, ఓ భారతా! (ఓ అర్జునా!) నీ హృదయము నందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును, వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి, సమత్వ రూప కర్మ యోగము నందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. (4.42)