ప్రస్తావన
శ్రీరామకృష్ణ దేవుల అలౌకిక సాధనలకు సంబంధించిన వివరాలతో కూడిన ఈ రెండవ భాగం, భగవత్కృపచే పూర్తయింది. దీనిలో ఇంతకు పూర్వం ఎవరికీ తెలియని ఆయన ఒనరించిన సాధనల గురించి, ఆ సాధనల వెనుకనున్న తాత్త్విక చింతనను గూర్చి వివరించడం జరిగింది. అంతేకాదు, పదిహేనేళ్ళనుండి నలభై ఏళ్ళ వయస్సు వరకూ ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను కూడ కాలానుగుణంగా వివరించాం. ఈ భాగాన్ని ‘సాధక భావం’ అని పేర్కొన్నాం. ఎందుకంటే, వారు తమ ఆధ్యాత్మిక సాధనలను మొదలుపెట్టినప్పటి నుండి, వివేకానందాది శిష్యులంతా ఆయన పవిత్రపాదాల చెంతకు చేరేదాకా శ్రీరామకృష్ణ దేవుల సాధక జీవిత చరిత్రను దీనిలో పొందుపరిచాం కనుక!
ఈ భాగాన్ని వ్రాస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల జీవితంలోని ప్రధాన సంఘటనల కాలనిర్ణయాన్ని సరిగా చేయగలమో లేమో అన్న సంశయానికి లోనయ్యాం. ఆయన తాము సాధనలు చేస్తున్నప్పుడు జరిగిన విషయాలను మాలో పలువురికి చెప్పేవారు. కాని వాటి పూర్వాపర్యత వారెవరికీ తెలియజేయలేదు. ఆ కారణంగా సాధనకాలంలో జరిగిన సంఘటనలు భక్తులందరి మనసుల్లో అయోమయంగా ఉండిపోయాయి. అయినా వారి కృపతో మేము ఎంతో పరిశోధించి, ఆ సంఘటనలకు చాలావరకు సరైన కాలనిర్ణయం చేయగలిగాం.
శ్రీ గురుదేవుల ‘జన్మదినం’ గూర్చిన భేదాభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకంటే మొదటిసారి వ్రాసిన వారి జాతకపత్రం విశిష్టమైనదని, రెండవసారి రాసిన జాతకపత్రంలో చాలా తప్పులు దొర్లాయని ఆయనే స్వయంగా మాకు చెప్పారు. అయితే వంద సంవత్సరాల నాటి పాత పంచాంగాల నెన్నింటినో పరిశీలించిన తరువాత ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. దీనితో ఆయన జనన తేదీని నిర్ధారణ చేయడం మాకు సులువైంది. పైగా గురుదేవులు చేసిన షోడశీపూజ గూర్చి ఇంతవరకూ ఎవరికీ అంత ఎక్కువగా తెలియదు. ఈ భాగాన్ని చదివే పాఠకులకు అది చక్కగా అర్థమవుతుంది.
ఈ గ్రంథం శ్రీరామకృష్ణుల అనుగ్రహపాత్రమౌతుందని, ఇది లోకకల్యాణానికి సాధకం కావాలని ప్రార్థిస్తూ గురుదేవుల పాదపద్మాలకు దీన్ని సమర్పించుకుంటున్నాం.
– రచయిత (స్వామి శారదానంద)
(మార్చి 1913)