ప్రియమైన అమ్మా,
ఈ రోజు ఉదయం (శ్రీమతి) సారా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించ డానికి నేను చర్చ్‌కు వెళ్లాను. అక్కడ సమావేశమై ఉన్నవారు ఏసు తల్లి మేరీని స్మరిస్తూన్నారు. హఠాత్తుగా నాకు మీ జ్ఞాపకం వచ్చింది. ప్రేమ ఉట్టిపడే మీ ముఖారవిందం, ఆప్యాయత తొణికిసలాడే చూపులు, పావనమైన తెల్లటి దుస్తులు, రెండు చేతులకు ధరించిన బంగారు గాజులు – ఈ దృశ్యం అలాగే నా మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది. మీ సాన్నిధ్యం మాత్రమే సారా మనస్సుకు ప్రశాంతిని, ఆప్యాయతను ప్రసాదించగలవని అప్పుడు నాకు స్ఫురించింది. మీకొక విషయం తెలుసా? శ్రీరామకృష్ణులకు సంధ్యా ఆరాత్రికం నిర్వహిస్తున్నప్పుడు నేను మీ గదిలో కళ్లు మూసుకొని ధ్యానం చేస్తూవుండేదాన్ని. అదెంత మూర్ఖత్వమో ఇప్పుడు తెలుస్తున్నది. మీ పాదారవిందాల వద్ద ఒక పసిపాపగా ఉంటే అదే చాలునని అప్పుడు నాకెందుకు అవగతం కాలేదు? అమ్మా, మీరు ప్రేమమయమూర్తులు. మీది కట్టలు తెంచుకొనే నదీ వెల్లువలాంటి లౌకిక ప్రేమ కాదు; మృదువుగా పరి వ్యాపించే గంభీర ప్రశాంతత వంటిది అది. అందరికి శ్రేయస్సును ఒసగుతుంది అది; వైరమే ఎరుగని, ఎవరికీ హాని కలిగించని, మృదుమాధుర్యంతో కూడిన కాంతిపుంజం అది.
ఆ ఆదివారం! ఆహా, ఎంతటి మహిమాన్వితమైన రోజు! కొన్ని నెలలకు మునుపు గంగానదిలో ప్రయాణానికి ముందుగా, మీ వద్దకు పరుగెత్తుకొంటూ వచ్చానే, అదే రోజు! ఆ రోజు మీరు నన్ను సాదరంగా ఆహ్వానించిన క్షణంలో, నాకు అనుగ్రహించిన ఆశీస్సులతో పొందిన అద్భుత ముక్తి అనుభవాన్ని ఎలా వర్ణించగలను? ప్రియమైన అమ్మా, మీకు అద్భుతమైన గీతాన్నో, కవితనో రచించి పంపాలని ఉంది. కాని మీ సాన్నిధ్యంలో అదొక చిరు సవ్వడిలా, వట్టి కేకలా ఉంటుందేమోనని భావిస్తున్నాను. నిజానికి మీరు భగవంతుని అపురూప సృష్టి! ప్రపంచంపట్ల గల కరుణతో శ్రీరామకృష్ణులు తమ అనుంగు బిడ్డలకై విడిచిపెట్టి వెళ్లిన ప్రేమమయ పాత్ర మీరు. కొన్ని సందర్భాలలో మీతో సొంత బిడ్డలా ఆడుకున్నా, మీ దివ్యసమక్షంలో నిశ్చింతగా, ప్రశాంతంగా కూర్చుని ఉండవలసిన వారమే మేము. ‘భగవంతుని అద్భుతా’ లన్నీ నిజానికి ప్రశాంతంగానే ఉంటాయి. అవి మన ఎరుక లేకుండానే మన జీవితాల్లో చొరబడతాయి. గాలి, సూర్యుని వెలుగు, అందమైన పచ్చిక బయళ్లు, గంగానది – మీలా మూర్తీభవించిన ప్రశాంతతలే కదా!
మీ ప్రశాంత ఆచ్ఛాదనను సారాకు ప్రసాదించండి. రాగద్వేషాలకు అతీతమైన, అత్యంత ఉన్నతమైన ప్రశాంతతకు మారురూపుగా భాసించేదే కదా మీ స్మరణ! తామరాకు మీది నీటి బిందువులా, లోకాన్ని స్పృశించకుండా భగవంతునిలో ధ్వనించే మధురమైన భాష కదా అది!
నా ప్రాణానికి ప్రాణమైన అమ్మా,
సదా మీ తుంటరి బిడ్డ,
నివేదిత.