కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోఽభిభవత్యుత ॥ 40
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ॥ 41
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥ 42
కులక్షయే, ప్రణశ్యంతి, కులధర్మాః, సనాతనాః,
ధర్మే, నష్టే, కులమ్, కృత్స్నమ్, అధర్మః, అభిభవతి, ఉత.
అధర్మాభిభవాత్, కృష్ణ, ప్రదుష్యంతి, కులస్త్రియః,
స్త్రీషు, దుష్టాసు, వార్ష్ణేయ, జాయతే, వర్ణసంకరః.
సంకరః, నరకాయ, ఏవ, కులఘ్నానామ్, కులస్య, చ,
పతంతి, పితరః, హి, ఏషామ్, లుప్త పిండ ఉదక క్రియాః.
కులక్షయే = కులనాశనం వల్ల; సనాతనాః = శాశ్వతములైన; కుల ధర్మాః = కుల ధర్మాలు; ప్రణశ్యంతి = నశిస్తాయి; ఉత = మరియు; ధర్మే = ధర్మము; నష్టే = నశించగా; అధర్మః = అధర్మం; కులమ్ = వంశం; కృత్స్నమ్ = అంతటిని; అభిభవతి = వశ మొనర్చుకొనును. కృష్ణ = కృష్ణా; అధర్మ అభిభవాత్ =అధర్మాక్రమణం వల్ల; కులస్త్రియః = కుల స్త్రీలు; ప్రదుష్యంతి = చెడిపోవుదురు; స్త్రీషు = ఆడవారు; దుష్టాసు = చెడిపోవ; వార్ష్ణేయ = కృష్ణా; వర్ణసంకరః = వర్ణ సంకరం; జాయతే = కలుగుతుంది. సంకరః = సంకరం; కులఘ్నానాం = కుల ఘాతకులకు; కులస్యచ = కులమంతటికి; నరకాయ ఏవ = నరకకారణమే అగును; హి = ఏలనగా; ఏషాం చ = వీరి; పితరః = పితృపురుషులు కూడా; లుప్త పిండ ఉదక క్రియాః = పిండదాన, తర్పణక్రియలు లేనివారై; పతంతి = నరకంలో పడతారు.
తా ॥ కులనాశనం వల్ల సనాతనమైన కులధర్మాలు వినష్టమవుతాయి; ధర్మం నశిస్తే, కులమంతా అనాచార మయమయ్యే అధర్మంతో కప్పబడిపోతుంది.
తా ॥ కృష్ణా! అధర్మాక్రమణం వల్ల కులస్త్రీలు వినష్టలవుతారు; ఓ వృష్ణికుల సంభవా! కులస్త్రీలు చెడిపోతే వర్ణసంకరం* అవుతుంది.
తా ॥ వర్ణసంకరమైతే కులఘాతకులు, కుల జనులంతా కూడా నరకంలో పడవేయబడుతున్నారు; శ్రాద్ధతర్పణ క్రియలు (పిండదానమొనర్చే అధికారులు లేక పోవడం చేత) లోపించడం వల్ల వారి పితృపురుషులు కూడా నరకంలో పడుతున్నారు.