అర్జున ఉవాచ :
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ॥ 28
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥ 29
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥ 30
దృష్ట్వా, ఇమం, స్వజనం, కృష్ణ, యుయుత్సుం, సముపస్థితం
సీదంతి, మమ, గాత్రాణి, ముఖమ్, చ, పరిశుష్యతి
వేపథుః, చ, శరీరే, మే, రోమహర్షః, చ, జాయతే,
గాండీవమ్, స్రంసతే, హస్తాత్, త్వక్, చ, ఏవ, పరిదహ్యతే
న, చ, శక్నోమి, అవస్థాతుమ్, భ్రమతి, ఇవ, చ, మే, మనః
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; కృష్ణ = శ్రీకృష్ణా; సముపస్థితం = చేరి ఉన్న; యుయుత్సుం = యుద్ధాభిలాషులైన; ఇమం = ఈ; స్వజనం = బంధువులను; దృష్ట్వా = చూసి; మమ = నా; గాత్రాణి = సర్వాంగాలు; సీదంతి = పట్టు తప్పిపోతున్నాయి; ముఖం చ = నోరు కూడా; పరిశుష్యతి = ఎండిపోతున్నది; మే శరీరే = నా దేహంలో; వేపథుః చ = కంపమును; రోమహర్షః చ = గుగుర్పాటును; జాయతే =కలుగుతున్నాయి; హస్తాత్ = చేతి నుండి; గాండీవః = గాండీవ ధనువు; స్రంసతే = జారిపోతున్నది; త్వక్ చ = చర్మం కూడా; పరిదహ్య తే ఏవ = మండుతున్నది. అవస్థాతుమ్ = స్థిరంగా ఉండడానికి; న శక్నోమి = సమర్థుడను కాకున్నాను; మే = నా; మనః చ = మనస్సూ; భ్రమతి ఇవ = భ్రమకులోనవుతోంది;
తా ॥ అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! యుద్ధార్థమై అరుదెంచిన బంధువులను చూసి, నా అవయవాలన్నీ పట్టు తప్పిపోతున్నాయి, నోరు ఎండుతోంది. నా శరీరం వణకుతోంది, రోమాలు నిక్కపొడుచుకున్నాయి, చేతి నుండి గాండీవం జారిపోతున్నది, చర్మం వేడెక్కుతుంది. నిలబడటానికి కూడా నాకు శక్తి లేదు; మనసు గిర్రున తిరుగుతూ ఉంది.
వ్యాఖ్య:-
అర్జునుడి భయం – కారణాలు:
ఈ శ్లోకాల్లో అర్జునుడికి ఆ సమయంలో కలిగిన శారీరక, మానసిక ఇబ్బందుల గురించి వివరించారు. ఇవన్నీ భయానికి, అధైర్యానికి, నిరుత్సాహానికి గుర్తులు. యుద్ధమంటే లెక్కచేయని అర్జునుడు, ఎన్నో యుద్ధాల్లో గెలిచిన వీరుడు, ఇప్పుడు ఎందుకు ఇలా డీలా పడిపోయాడు? అతనికి శారీరక బలం తక్కువై కాదు. కానీ మానసికంగా పెద్ద దెబ్బ తగిలింది. దేనివల్ల?
మమకారం అనే రోగం:
“వీళ్ళందరూ నా వాళ్ళు (స్వజనం)… నా వాళ్ళను నేను ఎలా చంపగలను?” అనే ఆలోచన అతడిలో బలంగా నాటుకుపోయింది. దీన్నే ‘మమకారం’ అంటారు. ఈ మమకారం అర్జునుడిని పట్టి పీడిస్తోంది కాబట్టే, “నా వాళ్ళను చూసి… నా వాళ్ళను చంపి… నా వాళ్ళను ఎలా చంపాలి…” అంటూ పదే పదే కలవరించడం మొదలుపెట్టాడు. అర్జునుడికి పట్టిన అసలు రోగం ఈ మమకారమే. దానికి సరైన మందు ‘ఆత్మజ్ఞానం’ మాత్రమే. శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇవ్వబోతున్నది ఆ మందే.